ప్రేమలోని ఆనందం కూడా తాత్కాలికమే – టాల్‌స్టాయ్ ‘ఫామిలీ హాపినెస్’

1
4

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ఎం[/dropcap]త మంది రచయితలను చదివినా టాల్‌స్టాయ్‌ని చదివినప్పుడు ఉండే ఆనందమే వేరు. మనిషి మనసులోని చీకటి కోణాలను ఎందరో తమ పద్ధతిలో ఆవిష్కరించారు. అందరీ రచనలూ గొప్పవే. కాని టాల్‌స్టాయ్ శైలి ఎలా ఉంటుందంటే అసలు అంత నిష్పక్షపాతంగా పాత్రలను అతను ఎలా ఆవిష్కరించగలడో అర్థం కాదు. ఆ పాత్రల మానసిక సంఘర్షణ, వారిలో జీవితం తెచ్చే మార్పులు దానికి అనుగుణంగా వారు ఏర్పరుచుకునే సంబంధాలు, వారిలో అవసరార్థం బయటపడే స్వార్థం ఇవన్నీ అతను ఎలా చూపిస్తాడంటే అసలు తన పాత్రలతో అంతలా ఎలా అడుకోగలడా అనిపిస్తుంది. ఎక్కడా ఏ కోణాన్ని వదలకుండా వారి మనసు వలువలు ఒలిచి చూపించగలడు. అందుకే అతని కథలన్నా, రచనలన్నా నాకు చాలా ఇష్టం. టాల్‌స్టాయ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి అన్నా కారనీనా, యుద్దమూ- శాంతి. కాని అతని ఇతర రచనల పట్ల ముఖ్యంగా చిన్న నవలల పట్ల చాలా మంది శ్రద్ద పెట్టరు. అద్భుతమైన చిన్న నవలలను, కథలను సృష్టించిన మేధావీ, రచయత అతను. “ఫామిలీ హాపీనెస్” అని ఇంగ్లీషులోకి అనువాదం అయిన ఈ చిన్ని నవల నిడివి కేవలం 95 పేజీలు కాని వివాహబంధం మీద, ప్రేమ వివాహాల మీద ఇంత కన్నా గొప్పగా మరెవ్వరూ రాయలేరు అన్నది వాస్తవం. ఈ  నవలికను చదివి టాల్‌స్టాయ్ లోని మానసిక విశ్లీషకుణ్ణీ, తత్వవేత్తను మేధావిని గౌరవించకుండా ఉండలేం. ఒకో రచయితను ఒకో నవలతో గుర్తిస్తాం. నా వరకు టాల్‌స్టాయ్ గొప్ప రచనలు అంటే రెండు నవలలు చెబుతాను. రిసరక్షణ్, ఫామిలీ హాపీనెస్. ఇవాళ ఫామిలీ హాపినెస్ గురించి చెప్పుకుందాం.

ఈ నవలికను టాల్‌స్టాయ్ 1859లో రచించారు. అప్పట్లో పెద్దగా దీన్ని ఎవరూ గుర్తించలేదు. కాని టాల్‌స్టాయ్ సమగ్ర సాహిత్యం చదివిన వారు ఈ నవలికను అతను సృష్టించిన అద్భుతంగా చెబుతారు. ప్రేమ అన్నది చాలా గొప్ప భావన. ఒక మనిషిని కోరుకోవడం, అతను లేదా ఆమెతో జీవితాన్ని గడపాలని నిత్యం అతని సాన్నిధ్యంలో ఉండిపోవాలని కోరుకోవడం ఒక మధురమైన భావన. ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒక మత్తులో ఆనందంగా తేలిపోతున్నట్లు అనుభూతి చెందుతారు. ఒకసారి ప్రేమలో పడితే ప్రపంచంతో వారు ఎంతో స్నేహాన్ని చూపిస్తారు. పెద్ద పెద్ద గొప్ప పనులు శక్తికి మించినవి అవలీలగా చేసేస్తారు. అసలు జీవితంలో ఇంతకన్నా మరొక గొప్ప స్థితి ఉండదు అనిపిస్తుంది. అందుకే చేయలేని, చేయకూడని పనులు కూడా చేయడానికి ప్రేమికులు వెనుకాడరు. ప్రేమించిన వారు తప్ప మరొకరు వారికి కనిపించరు. ఇది ఎంత మంది కవులు, రచయితలు వర్ణించినా మళ్ళీ మళ్ళీ మనం తలచుకునే స్థితి. జీవితంలో ఒక్క సారన్నా ప్రేమలో పడాలని కోరుకుంటూ ఉంటాం. ఆ ప్రేమ ఇచ్చి ఎనర్జీని ఆస్వాదించడానికి ఎంత కష్టమైన పడతాం.

అయితే ఆ స్థితిలో ఒక జంట ఎంత కాలం ఉండగలదు? స్వభావరీత్యా వారిద్దరూ ఎంత కలిసిపోయినా రెండు భిన్నమైన జీవాలే. ప్రేమ ఇచ్చే తాద్యాత్మక స్థితిలో ఆ జంట ఎంత కాలం ఉండిపోతుంది. అనుభవంతో చూస్తే గొప్ప గొప్ప ప్రేమ కథలన్నీ విషాదంతాలే, సుఖాంతమైన ప్రేమ  కథల ముగింపు ఎప్పుడు పెళ్ళే. ఆ తరువాత వర్ణించడానికి, రసానుభూతి చెందడానికి పెద్దగా సంఘటనలు ఉండవు. అంటే ప్రేమ చచ్చిపోయి ప్రేమికులు శత్రువులు అవుతారని కాదు. ఎటువంటి ప్రేమ అయినా దాని కాలపరిమితి తక్కువ అని ఇక్కడ అర్థం. తరువాత జీవితం రొటీన్ అయిపోతుంది. అందులో ఒకరినొకరు అర్థం చేసుకోవడాలు, చక్కని సంసారాలు, చల్లని సంతానాలు ఉండవచ్చు కాని ప్రేమలోని ఆ తీవ్రత, విరహం ఎదురుచూపు, అందులోని మత్తు క్రమంగా వాడిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆ భావం మళ్ళీ పుట్టదు. జీవితం ఒక క్రమంలో పడిపోతుంది. దాన్ని అర్థం చేసుకుని ఒప్పుకుని జీవించడం ప్రతి జీవికి తప్పని సరయిన అనుభవం. ఇదే జీవితంలోని పచ్చి నిజం. ఆ నిజాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన కథ ఫామిలీ హాపినెస్.

ఒక ధనవంతుని ఇల్లు. తండ్రి మరణించిన కొన్ని రోజులకు తల్లి కూడా మరణిస్తుంది. ఆ ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు వారి మేనత్త మాత్రమే ఉంటారు. తండ్రి స్నేహితుడు, శిష్యుడు అయిన సర్జీ మిఖాయ్లిచ్ ఆ ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. ఆ ఇంటి యజమానురాలి మరణం గురించి విని పిల్లలను పలకరించడానికి వస్తాడు సర్జీ. అతను ఆ పిల్లలకు పరిచితుడే. అంటీ ముట్టనట్టున్న బంధువులను చూసిన తరువాత చాలా ప్రాక్టికల్‌గా అనవసరపు భయాలని, జాలిని చూపకుండా సహజంగా తమను కలుసుకున్న సర్జీని ఇష్టపడతారు పిల్లలు. పెద్ద అమ్మాయి మాషా సర్జీని అమితంగా ఇష్టపడుతుంది. భూమి వ్యవహారాలన్నీ చూస్తూ నెలకొకసారి ఆ ఇంటికి వచ్చే సర్జీ అంటే ముగ్గురికీ అభిమానమే. సర్జీ ముప్పయ్ ఆరు సంవత్సరాల యువకుడు. అప్పటిదాకా వివాహం కాలేదు. అతని పట్ల ఆకర్షితురాలవుతుంది మాషా. సర్జీ ఆ అమ్మాయితో అతి చనువు ప్రదర్శించడు. కాని ఆ అమ్మాయి అంటే అతనిలోకూడా ఇష్టం మొదలవుతుంది. తను ఆడించిన ఆ పసిదాన్ని మరో దృష్టితో చూడలేక, చూడకుండా ఉండలేక బాధపడుతుంటాడు సర్జీ. సర్జీని చూసినప్పుడు మాషాకి కలిగే ఆనందం ముందు మరింకేమీ అవసరం లేదు అనిపిస్తుంది. అతన్ని గుర్తు చేసుకుంటూ రాత్రిళ్ళు గడపడం, అతని కోసం ఎదురు చూడడం, తనను చూసినప్పుడు అతని కళ్ళలో కనిపించే మెరుపును మళ్ళీ మళ్ళీ తలచుకుని ఆనందపడడం మాషాకి స్వర్గాన్ని అందుకున్నంత తృప్తిని ఇస్తాయి. అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతుంది. చుట్టు ప్రతిదీ ఆందంగా తమకోసమే భగవంతుడు సృష్టించాడా అనిపించేంతగా ఆనందపరుస్తాయి. సర్జీ ఇష్టాలు, అభిప్రాయాలు కనిపెట్టి వాటిని తన ఇష్టాలు అభిప్రాయాలుగా మార్చుకోవడంలో గొప్ప ఆనందం అనుభవిస్తుంది మాషా.

సర్జీ కాస్త పాత భావాలు కలవాడు. అతిగా అలంకరించుకున్న అమ్మాయిలన్నా, పురుషుడి ఆకర్షణ కోసం తపించే అమ్మాయిలన్నా అతనికి ఇష్టం ఉండదు. మాషా సర్జీకి నచ్చేవిధంగా తనను తాను మలచుకుంటుంది. అతన్ని సంతృప్తి పరచాలని తపిస్తుంది. ఒక రోజు తన ప్రేమ విషయం చెబుతుంది కూడా. సర్జీ ఆనందపడిపోతాడు. అతని మనసులో కూడా మాషా పట్ల అంతే ప్రేమ ఉంటుంది. కాని తమ మధ్య ఉన్న వయోభేదం అతన్ని ముందుకు రానివ్వదు. సర్జీ మాషాకు ఈ విషయం గుర్తు చెస్తాడు కూడా. జీవితం నీకు ఇప్పుడే మొదలవుతుంది. నాలో ఆ ఉత్సాహం, ఆకర్షణ అణీగిపోయాయి. నాతో ప్రయాణించాలంటే నీ వేగాన్ని తగ్గించుకోవాలి అది నీకు బాధ కాదా అని నచ్చచెబుతాడు. కాని తాను అతన్ని ప్రేమిస్తున్నప్పటి నుండి ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది, ఎంతటి రసానుభూతిని ఆస్వాదిస్తుందో, అది నిలుపుకోవడం తనకి ఎంత అవసరమో మాషా సర్జీతో చెపుకుంటుంది. అప్పటికే మాషాని అంతే గాఢంగా ప్రేమిస్తున్న సర్జీ ఆమెను ఆడంబరాలకు అతీతంగా సాధారణ పద్దతిలో వివాహం చేసుకుంటాడు.

పెళ్ళి తరువాత అత్తిల్లు చేరుతుంది మాషా. సర్జీ తల్లితో ఆ ఇంట్లో ఉంటుంటాడు. ఒక రకంగా వ్యవసాయ కుటుంబం అది. సర్జీ చేతికింద ఎంతో భూమి ఉంది. దాన్ని చూసుకోవడం అతని పని. అతని తల్లి చాలా కష్టపడిన స్త్రీ. కొడుకుపై పిచ్చ ప్రేమ. వారిద్దరికీ అడ్డు రాకుండా వారికి కావలసినవన్నీ సమకూర్చి జీవితాన్ని కలసి ఆస్వాదించే అన్ని అవకాశాలు ఆ జంటకు కల్పిస్తుంది. అయితే ఆ గ్రామీణ వాతావరణం అందులో ఉత్సాహం లేని జీవితం వల్ల మాషా ఒంటరిగా ఫీల్ అవుతుంది.  ముందు తమ ప్రేమ మత్తులో ఆ జంట కొన్ని నెలలు ఒకరిని మరొకరు వదలలేక ప్రపంచాన్ని మరచి గడిపినా తరువాత మాషా ఆ నిశబ్ద వాతావరణంలో ఉండలేక పోతుంది. ఆమె అవస్థ చూసి సర్జీ ఆమెను కొన్ని రోజుల కోసం నగరానికి తీసుకు వస్తాడు. అక్కడ సొసైటీలో తమ కన్నా పై స్థాయి వ్యక్తులతో కలవడం వారి పార్టీలకు వెళ్ళడం అలవాటు అవుతుంది. అందమైన మాషా అక్కడందరినీ ఆకర్షిస్తుంది. ఆమెను రాకుమారిగా చూసుకుంటారు అందరూ. ఆ గుర్తింపు, మర్యాద మత్తులో ఆమె పడిపోతుంది. తన భర్త ఇంటి వాతావరణంలోకి వెళ్ళడం ఆమెకు ఇష్టం ఉండదు. ఇంకా ఏవో ఎన్నో అనుభవాలు కావాలని ఆమె కోరుకుంటూ ఉంటుండి. ఆమె జీవన పద్దతిలో వేగం పెరిగి ఉత్సహంతో ఉరకలు వేస్తూ ఉంటుంది. సర్జీ ఆమెలో మార్పులు గమనిస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్య ఒక దూరం పెరిగిపోతుంది. సర్జీని పట్టీంచుకోకుండా తన అందమైన ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది మాషా. వారిద్దరి మధ్య పెరుగుతున్న దూరం తనకు అర్థమవుతున్నా అదో పెద్ద విషయంలా ఆమెకు అనిపించదు.

ఊరు వెళదాం అని సర్జీ అన్న ప్రతీసారి ఏదో ఒక సాకుతో స్నేహితుల సహాయంతో భర్త ఆ ప్రయత్నం విరమించుకునేలా చెస్తుంది మాషా. కొన్ని రోజులకు వారి సొసైటీలో మరో అందమైన యువతి కొత్తగా చేరుతుంది. మాషాను అభిమానిస్తున్న వారందరూ ఇప్పుడు ఆ కొత్త యువతిపై శ్రద్ద కనపరుస్తూ ఉంటారు. మాషా పాతపడి పోతుంది. తాను స్నేహితులు అనుకున్నవారందరి ప్రేమలు ఎంత తాత్కాలికమో అర్థమై ఆశ్చర్యపోతుంది. భర్తతో తన ఇల్లు చేరుతుంది.

కాని ఆ భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం తగ్గే అవకాశాలు కనిపించవు. సర్జీ ఆమెకు అన్నీ అనుకూలంగా అమరుస్తూ ఉంటాడు. ఆమెకు ఏ విషయంలోనూ లోటు చేయడు. మాషాకు మళ్ళీ తమ మొదటి రోజుల ప్రేమ కావాలనిపిస్తుంది. కాని సర్జీని చూసిన ప్రతి సారి ఏదో దూరం, ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతూ ఉంటుంది. వారికి పిల్లలు పుడతారు. చాలా అందమైన సంసారం కాని ఆ పాత ప్రేమ కనుమరుగవుతుంది. ఒక రోజు భర్తతో తాను ఇంటి నుండి దూరం అవుతున్నప్పుడు ఎందుకు తనని ఆపలేదు అని ప్రశ్నిస్తుంది మాషా. సర్జీ జవాబిస్తాడు “కుటుంబ సంతోషం” కోసం అని. ఆమెకు ఆ పాత రోజులు మళ్ళీ రావని వాటిని తాము పోగొట్టుకున్నామని కాని వారి మధ్య ఒక పరిపక్వత నిండిన బంధం మిగిలి ఉందని దాన్ని ఆస్వాదిస్తూ జీవించడమే ఇప్పుడు తమ కర్తవ్యమని చెబుతాడు సర్జీ. మాషా తన పిల్లలను దగ్గరకు తీసుకుని ఒక భార్యగా ఆ బిడ్డల తల్లిగా జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడుతుంది. అలా ఆమెలో ప్రియురాలు చనిపోయి భార్య మిగులుతుంది.

ఈ  కథలో ఆ పాత్రలలో వచ్చిన మార్పుని రచయిత ప్రెజెంట్ చేసిన విధానం చదువుతడం ఒక అనుభవం. జీవితంలో మనకే తెలీయకుండా జరిగిపోయే మార్పులు, చేతిలో బంధించలేని కొన్ని అనుభవాలు, వాటిని కోల్పోయినాక మిగిలే వేదన గుర్తుకొచ్చి తీరుతుంది. ప్రేమ ఎప్పటికీ మిగిలి ఉంటుందని ఊహించుకునే జంటల ఇమ్మెచ్యూరిటికి నవ్వు వస్తుంది. కొన్ని కోట్ల జంటల కథ ఇది. కుటుంబ సంతోషం అనుభూతులతో మొదలయి అనుభవంతో మిగిలిపోవడం ఒక క్రమం. ఇది అందరూ ఒప్పుకోవలసిన నిజం. ఈ నవలలో రచయిత చెప్పిన ఈ జీవిత సత్యాన్ని ఒప్పుకోవడం కొంచెం బాధ కలిగించినా ఒప్పుకోక తప్పదు. టాల్‌స్టాయ్ రచనా శైలికి, పరిశీలనా శక్తికి ఈ నవలలోని వాక్య నిర్మాణంలోని మార్మికతకి పాఠకులు ప్రభావితులవుతారు. నా వరకు నాకు టాల్‌స్టాయ్‌ని చదివిన తరువాత కొన్ని రోజుల వరకు ఇతర రచయితలెవ్వరూ కనిపించరు. ఈ పుస్తకం చదవక పోతే తప్పకుండా చదవండి. ప్రపంచ సాహిత్యంలో చాలా మంది విస్మరించే ఆణిముత్యం “ఫామిలీ హాపీనెస్”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here