Site icon Sanchika

ఫిల్టర్ కాఫీ ఒక జ్ఞాపకం

[dropcap]చ[/dropcap]క్కటి కాఫీ సువాసన నన్ను ఆకట్టుకుంది ఉదయాన్నే వ్యాయామ నడకకి వెళ్ళినప్పుడు. ఎక్కడినుండబ్బా అని చూశాను అటూ ఇటూ.

అప్పుడు కనిపించింది ఆ చూడ ముచ్చటైన ఆ వృద్ధ జంట. తమిళ వారనుకుంటా. ఇంకా చీకటి తెరలు వీడలేదు, చిరు చలిగా ఉన్న వాతావరణంలో, ఇంటి వరండాలో ట్యూబ్ లైట్ కాంతిలో, కూర్చుని చక్కగా తళతళలాడే ఇత్తడి గ్లాసులో వేడి వేడి పొగలు కక్కే కాఫీని దానికి అనుబంధంగా ఉన్న చిన్న ఇత్తడి కప్పులో పోసుకుని ఆస్వాదిస్తున్నారు.

దూరంగా గుడినుంచి ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగాత్రంలో విష్ణుసహస్రనామం వస్తోంది.

వేగంగా నడుచుకుంటూ వెళుతున్నానే కానీ నా ఆలోచనలు కాఫీ తాలూకు జ్ఞాపకాలతో నిండిపోయాయి.

ఈ జ్ఞాపకాలు ’70 లలో మొదలై ఇటీవలి దాకా ఉన్నాయి.

నాకు తెలిసినంత వరకు కాఫీ తాలూకు మొదటి జ్ఞాపకం అంటే, నేను బాగా చిన్నపిల్లవాడిని అప్పటికి. నాకు నాలుగయిదు ఏళ్ళు ఉంటాయి. డెబ్బయ్యవ దశకం ప్రారంభం అది.

కడపలో మా అమ్మగారు, నీళ్ళూ కాఫీ పొడి కలిపి బాగా మరగబెట్టి, వేడి వేడిగా ఉన్న ఆ ద్రావణాన్ని ఒక గిన్నెలోకి వడగట్టే వారు. ఆ వడగట్టే విధానం కాస్త ప్రమాదకరంగా ఉండేది. అది ఎలాగంటే, , ఒక గిన్నెపై చేతిరుమాలు సైజులో ఉన్న ఒక గుడ్డని కప్పి అందులోకి ఈ వేడి ద్రావకాన్ని పోసి ఆ తరువాత లాఘవంగా పిండుతూ గిన్నెలోకి డికాక్షన్‍ని రాబట్టేవారు.

ఆ తరువాత ఆ గుడ్డలోని కాఫీ పొడిని పారవేసి, ఆ గుడ్డని చక్కగా ఉతికి ఆరవేసి మళ్ళీ కాఫీ టైంకి సిద్ధంగా ఉండేలా చూసుకునే వారు. నీళ్ళను కాచిన బొగ్గులకుంపటిలోని నిప్పుల్ని సవరించి, మళ్ళీ అదే బొగ్గుల కుంపట్లో ఒక ఇత్తడి గిన్నెలో కాఫీ తయారు చేసే ప్రక్రియ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.

ఇందాక తయారు చెసుకున్న డికాక్షన్‌కి, పాలు చక్కెర కలిపి, కుంపటిపైన పెట్టి, వేడి చేయాలి. ఆ కుంపటి క్రింద ఒక ద్వారం లాగా ఉండేది. దాని ముందర విసన కర్రతో విసురుతూ ఉంటే, పైన కుంపట్లో నిప్పులు ఎర్రగా మండుతూ ఒక విధమయిన వెచ్చదనం అందించేవి. చలి కాలంలో ఆ వెచ్చదనం అనుభవించడం ఒక మధుర అనుభూతి.

’చలి చలి చామవ్వ, కుంపటి పెట్టు గూనవ్వ’ అనే పాట పాడుకుంటూ కుంపటి ముందు కూర్చునేవారం పిల్లలం అందరం.

విసనకర్రతో విసిరే కొద్ది, చిటపట చప్పుడు చేస్తూ నిప్పురవ్వలు ఎగిరేవి గాల్లోకి. అదొక అద్భుత దృశ్యం అని చెప్పాలి. మా అమ్మ చేతి మట్టి గాజుల చప్పుడు, విసన కర్ర నేలని తాకిన చప్పుడు, గాలి వీచిన చప్పుడు, నిప్పురవ్వల చిటపటలు నాకు ఇప్పటికీ స్మృతిపథంలో ఉన్నాయి.

సరే, ఆ విధంగా తయారు అయిన కాఫీని తగినంత చక్కెర కలిపి త్రాగేవారు.

ఆ రోజుల్లో స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు, గ్లాసులు ఉండేవి కావు. ఇత్తడి గ్లాసులు, ఇత్తడి, కంచు పాత్రలు, రాచిప్పలు, చెక్కతో చేసిన కవ్వం, వెదురు బద్ద ఉండే విసనకర్రలు, ఉండేవి మా ఇంట్లో. కంచు పాత్రలు, రాగి, ఇత్తడి పాత్రలు, రాచిప్పలు, విసుర్రాళ్ళు, రోలు, రోకలి ఇవన్నీ చూసిన చివరి తరం మాదే అనుకుంటా.

మా నానమ్మ తమిళనాడుకు చెందిన ఆవిడ. అందువల్ల ఆవిడకి ఈ కాఫీ విషయంలో చాలా పట్టింపు ఎక్కువ ఉండేది. తమిళనాడులో అయితే ఓ ఇత్తడి చెంబునిండా కాఫీ వేసుకుని ఉదయాన్నే హాయిగా త్రాగేవారమని ఆవిడ కథలు కథలుగా చెప్పుకొచ్చేది.

ఆవిడ మాటల ప్రభావం వల్ల కావచ్చు, తరువాత మణిరత్నం సినిమాలు, టీవీ అడ్వర్టైజ్మెంట్లు చూడ్డం వల్ల కావచ్చు, తమిళనాడు అంటే కాఫీ, కాఫీ అంటే తమిళనాడు అన్న భావం నాలో బాగా బలంగా నాటుకుపోయింది.

కానీ కొన్నేళ్ళక్రితం తమిళనాడులో నేను వృత్తిరీత్యా ఉండాల్సి రావడం వల్ల నా అభిప్రాయం తప్పని తెలిసింది. అంటే అక్కడ కాఫీ దొరకదని కాదు కానీ, రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ టీ దుకాణాలు విస్తృతంగా కనపడతాయి కానీ, అక్కడికి వెళ్ళీ కాఫీ అడిగితే నిరాశపడాల్సి వస్తుంది. కేవలం ఒక స్థాయి గల హోటళ్ళలో మాత్రమే కాఫీ లభిస్తుంది తమిళనాట. ఈ టీ దుకాణాలన్నీ కూడా అధిక భాగం కేరళకి చెందిన మలయాళీ ముస్లింస్ నడిపేవారు.

సరే మళ్ళీ నా బాల్యానికి వస్తే, సాంకేతికత పెరిగిన కారణంగా అన్నీ రంగాలలో పెను మార్పులు సంభవించినట్టే, కొన్నాళ్ళ తర్వాత మా ఇంట్లోకి కూడా ఒక ఫిల్టర్ ప్రవేశించింది.

నేను చూసిన మొదటి ఫిల్టర్ ఇత్తడిదే.

స్టెయిన్‌లెస్ స్టీలు పాత్రలు చాలా అరుదు. అప్పుడప్పుడే స్టెయిన్ స్టీలు పాత్రలు రంగ ప్రవేశం చేస్తున్న కొత్తలు అవి. సేలంలో తయారు అయిన స్టీలు అంటే ఇక అత్యుత్తమయినవి అనే భావన ఉండేది.

ఇక పాత బట్టలు, మరీ ముఖ్యంగా జరీ చీరలు ఇస్తే ఇంటి దగ్గరికి వచ్చీ స్టీలు సామాన్లు ఇచ్చే సంస్కృతి విస్త్రృతంగా ఉండేది అప్పట్లో. బాపూ గారు బోలెడు కార్టూన్లూ వేసేవారు ఈ అంశం పట్ల.

ఆ ఫిల్టర్ అందం ఏమని వర్ణించను?

మొదట్లో మాకు కాఫీ ఫిల్టర్ ఒక అద్బుతంగా ఉండేది. పైనున్న భాగంలో తిరగేసిన గొడుగులాంటి దానిపై కాఫీ పొడి వేసి, ఆ తర్వాత దానిపై మరగబెట్టిన నీరు వేసి దాన్ని మరచిపోవాలి. ఆ తర్వాత కాసేపటికి క్రింది పాత్రలోకి వేడి వేడి డికాక్షన్ చిక్కగా దిగిపోతుంది. ఇదంతా ఒక మాయాజాలంలా అనిపించేది.

నిజం చెప్పద్దు ఇప్పుడు టెక్నాలజీ అందిస్తున్న ఎంత గొప్ప అద్బుతమైన ఆవిష్కరణాలు కూడా ఆ కాఫీ ఫిల్టర్ అందించిన థ్రిల్ ముందు దిగదుడుపే.

ఆ తరువాత పెర్కొలేటర్, కాఫీ మేకర్ ఇలా రకరకాల అవిష్కరణలు జరిగినా ఫిల్టర్ స్థానం ఫిల్టర్‍దే అని చెప్పాలి.

ఆ తరువాత ఎస్ప్రెస్సో కాఫీ అని ఒక డిస్పెన్సింగ్ మషీన్ ద్వారా కాఫీ ఇచ్చే స్టాల్స్ వెలిసాయి. ఇవి ముఖ్యంగా సినిమా థియేటర్లలోను కొన్ని రెస్టారెంట్లలో చూశాను.

వీటి ద్వారా వచ్చే కాఫీ కాస్తా మొదట్లో రుచిగానే అనిపించినా,ఆ తరువాత మొహం మొత్తేది. దీనిద్వారా ఇవ్వబడే కాఫీకప్పులో సగభాగం నురగే ఉండేది.

మా చిన్నప్పుడు ప్రధానంగా బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ దొరికేది. కడపలో ప్రధానంగా మా చిన్నప్పుడు నరసూస్ కాఫీ అని దొరికేది. అలాగే ’80 స్ లో గార్డన్ కాఫీ అనే బ్రాండ్ బాగా వ్యాప్తిలో ఉండేది. ప్రొద్దటూరు కి చెందిన చంద్రా కాఫీ ఈ గార్డెన్ కాఫీకి బాగా పోటీనిచ్చేది.

బ్రూక్బాండ్ గ్రీన్ లేబుల్ మాత్రమే వాడేవారం మాఇంట్లో. ఈ బ్రూక్ బాండ్ గ్రీన్ లేబుల్ వాడు తరచు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు. స్టీల్ డబ్బానో, పెన్నో ఇలాగన్న మాట. మా అమ్మగారు అప్పుడు నాకు ఒక రహస్యం చెప్పారు. రేట్ పెంచిన ప్రతీసారి వారు అలా ఉచిత బహుమతి ఇచ్చేవారు అని. అంటే ఆవిడ ఎంత సునిశిత దృష్టితో చూసేవారో అర్థం చేసుకోవచ్చు.

బ్రూక్‌బాండ్ గ్రీన్ లేబుల్ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ పొడి అని, బ్రూ అంటే, ఇన్స్టంట్ కాఫీ అని విడి విడిగా వచ్చేవి అప్పట్లో. ఇప్పుడు బ్రూక్‌బాండ్ గ్రీన్ లేబుల్ లేదు, దాని స్థానంలో బ్రూ గ్రీన్ లేబుల్ లభిస్తోంది. యూనీలీవర్ వారి లీలల గూర్చిమళ్ళీ మాట్లాడుకుందాము.

బ్రూ గూర్చి చెబుతుంటే ఒక సంగతి గుర్తు వచ్చింది.

నా ఏడో ఏట మా నాన్నగారికి తహసీల్దారుగా పెద్ద ప్రమోషన్ వచ్చింది. అప్పటి దాకా ఆయన ఆర్ ఐ పోస్టు నుంచి, అంచెలంచలుగా ఎదుగుతూ కమలాపురం అనే ఊరికి డెప్యూటి తహసీల్దారుగా పోస్టు చేయబడటంతో ఆయన విజయపరంపర ప్రారంభం అయింది. ఉద్యోగ జీవితంలో ఆయన అధిరోహించిన ఎత్తులు సామాన్యమయినవి కావు, మెజిస్టీరియల్ పవర్స్‌తో అనంతపురంలో ఆర్.డీ.వో గానూ, నంద్యాలలో సబ్ కలెక్టర్ గానూ పని చేశారు. చివరికి కర్నూలు జిల్లాలో అడిషనల్ కలెక్టర్ హోదాలో రిటైర్ అయ్యారు.

మా నాన్న గారు చాలా ముక్కు సూటి మనిషి అవటం వల్ల, ఆయన ప్రమోషన్ చాలా సంవత్సరాలు వాయిదా పడుతూ వచ్చింది అట. నేను పుట్టిన తర్వాతే అయన ఉద్యోగ జీవితంలో తీవ్రమయిన ప్రగతి మొదలయిందని మా అమ్మ అనేక సార్లు అంటూ ఉంటే నాకు సంతోషం అయ్యేది.

సరే, బ్రూ విషయానికి వస్తాను.

కళ్యాణదుర్గం అనే ఊరికి మొదటి సారిగా పూర్తి స్థాయి తహసీల్దారుగా ప్రమోషన్ వచ్చింది మా నాన్న గారికి. అప్పుడు ఆయన ఒక్కరే వెళ్ళి ఇల్లు అదీ చూసుకుని వచ్చారు. అక్కడ ఆయన ఒక్కరే ఉన్న సమయంలో బ్రూ కాఫీ చేసుకుని కాలం గడిపేవారు. అలా నాకు మొదటి సారి బ్రూ గురించి తెలిసింది.

ఏది ఏమయినా ఫిల్టర్ కాఫీ ముందు ఇన్స్టాంట్ కాఫీ దిగదుడుపే. కానీ బ్రూ/ఇన్స్టాంట్ కాఫీకి కూడా చాలా మందే అభిమానులు ఉండటం నేను గమనించాను.

ఏది ఏమయినా హోటళ్ళ విషయానికి వస్తే, రోడ్డు పక్కన టీ అంగళ్ళలో దొరికే కాఫీ ఇన్స్టంట్ కాఫీ మాత్రమే, ఇక్కడ ఫిల్టర్ కాఫీ దొరకదు.

నేను వ్యక్తిగతంగా ఫిల్టర్ కాఫీ అభిమానిని. కాఫీ దొరకకుంటే ఊరకే అయినా ఉండేవాడిని కానీ ఇన్స్టంట్ కాఫీ మాత్రం త్రాగలేకపోయేవాడిని.

ఇదంతా భూతకాలంలో ఎందుకు చెబుతున్నాను అంటే, నేను నా ఇరవయ్యేడో ఏట వరకు విపరీతంగా కాఫీ త్రాగే వాడిని. కానీ అకారణంగా ఆ తరువాత నాకు కాఫీ అలెర్జీ మొదలైంది. నిజంగా అలెర్జీనే, అంటే కాఫీ త్రాగిన వెంటనే విపరీతమైన మైగ్రైన్ తలనొప్పి రావటం, వాంతులు అవటం, కడుపులో విపరీతమైన మంట ఇలా జరగటం వల్ల విధిలేని పరిస్థితులలో కాఫీ మానేయ్యాల్సి వచ్చింది. ఏది ఏమయినా నేను కాఫీకి వీరాభిమానిని ఇప్పటికీ, కాకపోతే గుప్త అభిమానం నాది.

నా పదునాలొగో ఏట, ఒకసారి మమ్మల్నందరినీ మా నాన్న గారు తిరుపతికి తీస్కువెళ్ళారు.

నేను తిరుపతి కొండపై అప్పుడే మొదటి సారి, నేషనల్ కాఫీ బోర్డ్ వారి క్యాంటిన్, కాఫీ అవుట్‌లెట్ చూడటం తటస్థించింది. అంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటి వారు అందించడం విశేషం. మరి ఎక్కడా నాకు వారి అవుట్‌లెట్లు కనిపించలేదు.

దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయేమో తెలియదు. అంటే కెఫే కాఫీ డే విస్తరించినంత వేగంగా మరి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ కాఫీ బోర్డ్ ఎందుకు విస్తరించలేదో?

ఇటీవల మిస్ ఇండియా సినిమా చూసినప్పటి నుంచీ ఈ కాఫీ జ్ఞాపకాలు వ్రాయాలని అనుకుంటూ వస్తున్నాను. ఇలాగే వాయిదా పడుతూ వస్తోంది.

మదనోపాఖ్యానం:

ఇక చివరగా కొసమెరుపుగా మదనోపాఖ్యానం చెప్పుకుందాం. ఈ టైటిల్ చూసి కంగారు పడుతున్నారా? అదేం వద్దు. మదన్ అని నా మిత్రుడు ఒకతను కడపలో ఉండేవాడు. ఇది అతని గూర్చి అన్నమాట.

ఇతను కాఫీ ప్రియుడు. అంటే తాను కాఫీ త్రాగి ఊరికే ఉండే రకం కాదు. ప్రతీ రోజు కనీసం ఓ వందమందికి కాఫీ తాగించే వాడు అని నా అంచనా.

ఆయనకి పోలియో. ఒక కాలు ఈడుస్తూ నడుస్తాడు. ఆయన వయస్సు దాదాపు ముప్ఫై ఉంటుంది, అప్పటికి. ఆయనికి ఆటోమొబైల్స్ అంటే పిచ్చి. వాహనాల గుర్చి ఆయనకి తెలియని విషయాలు ఉండేవి కావు. టూ స్ట్రోక్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ల గూర్చి, జర్మన్ డిజైన్, జపనీస్ డిజైన్ ఇలా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి కూలంకషంగా మాట్లాడుతూ ఉండేవాడు నాతో, నేను గమనించింది ఏమిటి అంటే, ఎవరికి ఏది ఆసక్తో ఆ అంశం గూర్చి అంతే సాధికారికంగా మాట్లాడేవాడు. పొలాల్లో నాట్లు, ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, క్రికెట్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇలా ఆయన మాట్లాడే మాటల్లో వివిధ అంశాలు దొర్లేవి.

ఈయన కడపకు దాదాపు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే కాజీపేట అనే గ్రామం నుంచి కడపకు వచ్చేవాడు. ఒక్కోసారి కైనెటిక్ హోండాలో, ఒక్కోసారి ప్రీమియర్ 118 ఎన్ ఈ అనే కారులో వచ్చేవాడు. మంచి స్థితిమంతుడు, భూస్వామీ. ఈయన రాయలసీమ గ్రామీణ బ్యాంకులో పని చేసి, వాలంటరీ రిటయిర్మెంట్ తీస్కుని, ఏదో వ్యాపారాలు చేసేవాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవీ ఉండేవి కావు. కానీ ఈయన్ని కలుసుకోవాలి అంటే ఎక్కడ ఉంటాడబ్బా అని కంగారు పడాల్సిన పని లేదు.. కడప పట్టణం నడిబొడ్డున మద్రాసు రోడ్డులో ఉండే మిధున్ రెఫ్రెష్‍మెంట్స్ అనే రెస్టారెంట్ ఇతని అడ్డా.

నెను మిత్ర బృందంతో తరచు అక్కడికి వెళ్ళే వాడిని. అక్కడ కాఫీ చాలా బాగా ఉంటుంది.

కడపలో ఈ మిథున్ రెఫ్రెష్‌మెంట్ లోనే కాదు, మణీ హోటల్, సుజాత హోటల్, అశోకా హోటల్, మయురా టిఫిన్స్ , ఇలా ప్రతి చోటా కాఫీ బాగా ఉండేది. అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సందు ఎదురుగా క్రిష్టియన్ లేన్ ప్రారంభం మలుపులో,ఒక హోటల్ ఉండేది, పేరు గురుతు లేదు, అక్కడ కూడా కాఫీ చాలా బాగా ఉండేది.

సరే మన మదన్ మాత్రం మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ వద్దనే ఉండేవాడు. లోపల కూర్చునే వాడు కాదు. బయట రోడ్డు కనపడేలా నిలుచుని కాఫీ త్రాగేవాడు. నిలువెత్తు రౌండ్ టేబుల్స్ రెండు ఉండేవి బయట. ఆయన చుట్టూ ఎప్పుడు మిత్రులు ఉండేవారు. ఆయన ఎన్ని సార్లు కాఫీ త్రాగుతాడో లెక్కలేదు.

అతనికి నేనంటే చాలా అభిమానం ఎందుకో. ‘మీ కులపోళ్ళు అంటే నాకు చాలా గొరవం, మీరు గురువులు అన్నా’ అనేసేవాడు ఒక్కోసారి అందరి ముందే. నాకు ఇబ్బందిగా అనిపించేది అతని మాటలకు.

నేననే కాదు, రోడ్డు మీద మిత్రులు ఎవ్వరు వెళుతూ కనిపించినా “అన్నా, అన్నా, ఇది అన్యాయం… చూడకుండా వెళుతున్నావు” అన్బి కేకలు వేసి మరీ పిలిచేవాడు. వారు మోటార్ సైకిల్ పార్క్ చేసి వచ్చేలోగా కౌంటర్లో వ్యక్తికి సైగ చేసి కాఫీకి ఆర్డర్ ఇచ్చేవాడు. మనం ఆ రోడ్డు గుండా ఎన్ని సార్లు వెళ్ళినా ఇలా బలవంతంగా కాఫీ ఇప్పించేవాడు.

వద్దంటే వినడు. అలుగుతాడు. మనం డబ్బివ్వబోతే “ఏదీ ఇవ్వు చూద్దాం” అని చిలిపిగా నవ్వుతూ అనేవాడు. మనం ఇవ్వబోయినా ఆ కౌంటర్ లో వ్యక్తి తీస్కునే వాడు కాదు.

వయసుతో నిమిత్తం లేదు అందర్నీఅన్నా అనే పిలిచే వాడు, పెద్దవారినీ, చిన్నవారిని కూడా అన్నా అని పిల్చేవాడు.

ఇలా ఉదయం నుంచి, సాయంత్రం దాకా కాఫీ దానం జరిగేది మదన్ ఆధ్వర్యంలో. మధ్యాహ్నం ఏదయినా హోటల్లో స్నేహితులకు, లంచ్ పెట్టించి, తానూ లంచ్ ముగించి ఏదయినా మాటినీ ఆట చూసుకుని రాత్రి ఎనిమిది ఆ ప్రాంతంలో ఇంటి ముఖం పట్టే వాడు. ఇది అతని దినచర్య.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్ గాంధీ మహాత్ముడి గూర్చి ఇలా చెప్పాడు “గాంధీ అనే వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడు అని చెప్పినా రాబోయే తరాల వారు అసలు నమ్మరేమో అని నేను బాధపడుతున్నాను” అని.

నేను మదన్ గూర్చి ఇంచుమించు ఇలాగే చెప్పాల్సి వస్తుంది. ఇలా జనాలకు ఉచితంగా నిరంతరం కాఫీలు వితరణ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఎవ్వరూ నమ్మరేమో. ఇలా నిరంతర కాఫీ యజ్ఞానికి అతను ఎంత డబ్బు తగలేసేవాడో నాకు అర్థం కాదు ఎప్పటికీ. కడపలో ఫాక్షనిస్టులు ఉన్నారు అని చెప్పి, సినిమాలు తీసే దర్శకులకు ఈ మదన్‌ని చూపాలి అనిపిస్తు ఉంటుంది.

కాఫీ కప్పు వారి చేతిలో వాలాలంటే, నాతో ఉన్న మిత్రులకు ఈ మదన్ పరిచయం ఉండాల్సిన పని లేదు. మన వెంబడి ఉంటే చాలు ఆయన వెంబడే కౌంటర్ లోని వ్యక్తికి ఫలాన అన్ని కాఫీలు కావాలని ముందే సైగల భాషలో చెప్పేస్తాడు.

మొత్తానికి కొన్ని వందల కాఫీలు త్రాగి ఆయనకి ఋణపడి ఉన్నాను నేను. తప్పించుకుని పోబోతే పోనీడు. బిల్లు కట్టబోతే కట్టనీడు. వద్దు అంటే వినడు. మనం బండి పార్క్ చేసి అతని దగ్గరికి వెళ్ళేలోగా టేబుల్ పై కాఫీ రేడీగా ఉంటుంది. మనం వద్దు అంటే, ‘సరేలే అన్నా పారేద్దాము’ అంటూ నిష్ఠూరం చేస్తాడు. మనం కాఫీ త్రాగితే ఆయనకి తృప్తి. టీ త్రాగే వారంటే ఆయనకి ఒక విధమైన చిన్న చూపుకూడా కద్దు. ఆ హోటల్లో టీ రేటు కూడా తక్కువ నిజానికి.

సరే ఆయన ఋణం తీర్చుకునే అవకాశం రానే వచ్చింది ఒకసారి. సామాన్యమయిన సాయం కాదు నేను చేసింది. కాకపోతే అది అనుకోకుండా జరిగింది. ఒక పెద్ద బ్యాంకు ఫ్రాడ్‌కి కుట్ర జరిగింది ఈయన వెనుక అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మంచి మనిషిని ముంచేందుకు తెగబడిన వారు ఊరికి చెందిన దగ్గరి బంధువులే కావడం విశేషం.

నాకు సిండికేట్ బ్యాంకులో స్టాన్లీ అని ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన్ని కలవటానికి తరచు స్టేషన్ రోడ్డు లోని సిండికేట్ బ్యాంకుకి వెళ్ళే వాడిని.

ఇలాగే ఒకసారి సిండికేట్ బ్యాంక్‌కి నేను వెళ్ళగా, మదన్‌తో ఎప్పుడు కలిసి తిరిగే ఇద్దరు మిత్రులు వాళ్ళ ఊరి వారే ఆ బ్యాంకులో కనిపించారు. అక్కడ శర్మ అనే మేనేజర్‌తో ఏదో సీరియస్‌గా మాట్లాడ్తూ కనిపించారు వారు. నేను ఊరకే ఉంటే ఏ ఇబ్బంది ఉండకపోయేది. నాకు శర్మగారూ పరిచయమే, ఈ ఇద్దరూ పరిచయమే. అందుకే ఆ ఇద్దరితో చనువుగా “హలో మదన్ గారు రాలేదా” అని అడిగాను.

వారు తక్షణం చచ్చిన ఎలకను మ్రింగిన వారిలా మొహం పెట్టారు. నేనక్కడికి ఆ సమయంలో రావడం వారు అస్సలు ఊహించలేదు అని అర్థం అయిపోయింది. వారిద్దరూ తెగ కంగారు పడ్డారు.

అప్పుడు బ్యాంకు మేనేజర్, చటుక్కున వారి చేతిలోంచి పత్రాలు లాక్కుని, “ఏమిటి ఈయన మదన్ కాదా?” అని నన్ను ప్రశ్నించాడు.

ఇంతకూ విషయం ఏమిటి అంటే, మదన్ పేరిట వచ్చిన ఒక యాభై వేల చెక్కుని చేతబట్టుకుని వచ్చి వీరు, బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయబోతున్నారు. ఫోటో ఐడీ, అడ్రెస్ ప్రూఫ్ ఇలా ఏదో దిక్కుమాలిన దొంగ డాక్యుమెంట్లు పట్టుకుని వచ్చి పని మొదలెట్టారు. ఇంతకూ చెక్కు వచ్చింది మదన్‌కి. వీళ్ళు దానిని తస్కరంచి పెద్ద పన్నాగమే పన్నారు.

నిజానికి అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ కంటే ముందర పాత డేట్‌తో ఇష్యూ చేయబడ్డ చెక్కుని స్వీకరించకూడదు. వీరు ఏదో కల్లబొల్లి కబురులు చెప్పి అకౌంటు ఓపెన్ చేసి చెక్‌ని కూడా డిపాజిట్ చేయబోతున్నారు. అప్పట్లో ఇలా అధార్ కార్డ్, పాన్ కార్డ్ గట్రాలు ఏమీ ఉండేవి కావు. ఇంటర్‌నెట్ లేదు.

ఆ తరువాత మదన్‌ని పిలిచి వ్యవహారం సరి చేశాను. ఆ ఇద్దరూ గుర్రు గుర్రు మంటూ వెళ్ళిపోయారు.

“అన్నా అసలు ఇంత ద్రోహం ఎట్లా చేస్తారన్నా, మనుషులు ఎందుకు అందరూ మంచివాళ్ళుగా ఉండరన్నా. నన్ను అడిగితే యాభై వేలు నేను ఇచ్చేస్తా కద అన్న ఇలా ఎందుకు చేశారన్నా?” అని వాపోయాడు ఈ కాఫీ దాత.

మొత్తానికి ఇలా మదనోపాఖ్యానంతో మన కాఫీ కబురులు సమాప్తం.

***

Images Courtesy – Internet

Exit mobile version