[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[హసంతి క్లాస్‍మేట్ ధృతి హసంతి వాళ్ళింటికి వస్తుంది. ముందుగా కవితని పలకరిస్తే. హసంతి ఎంగేజ్‍మెంట్‍కి రాలేదేమని కవిత అడుగుతుంది. ఎంగేజ్‍మెంట్ సంగతి నాకు చెప్పలేదు అంటూ పైకి హసంతి ఉన్న గదిలోకి వెళ్తుంది ధృతి. తనలో తాను బాధపడుతున్న హసంతి కనిపిస్తుంది. హసంతిని మాటల్లో పెట్టి అసలు విషయం కనుక్కుంటుంది ధృతి. నీ ప్రేమ గురించి గౌతమ్‍తో చెప్పేయ్ అంటుంది ధృతి. ఇందులో గౌతమ్ తప్పేమీ లేదని, అతని జీవితం పాడు కాకూడని అంటుంది ధృతి. గౌతమ్ చీకట్లో కూర్చుని పాట వింటూంటాడు. తండ్రి రఘురాం వచ్చి ఎందుకు డల్‍గా ఉన్నావ్, ఏమైందని అడుగుతాడు. తనతో పెళ్ళి హసంతికి ఇష్టమో కాదో కనుక్కునే ఎంగేజ్‍మెంట్ చేశారా అని తండ్రిని అడుగుతాడు గౌతమ్. అదేంటని తండ్రి అడిగితే, హసంతి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదని అనిపిస్తోందని అంటాడు. అది అపోహ అని, ఆడపిల్లలు అంత చొరవగా మాట్లాడరని చెప్పి, మనసు పాడుచేసుకోకు అని వెళ్ళిపోతాడు రఘురాం. బాగా ఆలోచించిన హసంతి – కార్తీక్‍కి తాను ఎవరో తెలియదు, తను అతనికి ప్రేమిస్తున్నట్టు కూడా చెప్పలేదు, అలాంటప్పుదు ఈ విషయంలో కార్తీక్ పాత్ర ఏముంది? గౌతమ్‍పై తాను అనవసరంగా వ్యతిరేకత పెంచుకుంటున్నాని అనుకుంటుంది హసంతి. గౌతమ్‍కి ఫోన్ చేస్తుంది. తండ్రితో మాట్లాడుతున్న గౌతమ్, సంతోషంగా, నాన్నా హసంతి ఫోన్ చేస్తోంది అంటాడు. జాగ్రత్తగా మాట్లాడు అంటాడాయన. బయటకి వెళ్తామని అంటుంది హసంతి. తానే వచ్చి పికప్ చేసుకుంటానంటాడు గౌతమ్. ఇక చదవండి.]
[dropcap]గౌ[/dropcap]తమ్ బైక్ మీద వచ్చి హసంతి ఇంటి ముందు ఆగాడు. అప్పటికే హసంతి తయారై బయటికి వచ్చింది. అబ్బురంగా ఆమె వైపు చూసి మనసులో..
‘నీకు దగ్గరగా వచ్చినప్పుడు దూరంగా అనిపిస్తావు. దూరంగా ఉండాలనుకున్నప్పుడు దగ్గరగా కనిపిస్తావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు హసంతీ! ఏదో మాయ చేస్తున్నావు’ అనుకుని ఆమెని చూస్తున్నాడు.
హసంతి దగ్గరగా వచ్చి గౌతమ్ కళ్ళ ముందు చెయ్యూపి..
“హలో! డే డ్రీమ్సా!?” అంది.
“నో.. నో.. అదేం లేదు. రా! హసంతీ! బైక్ ఓ.కే.నా?” అన్నాడు
“బైక్ మీదే వెళ్దాం” అని వెనకాల కూర్చుని, అతని భుజం మీద చెయ్యేసింది.
అంతే! గౌతమ్ చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా నేర్చుకుని పాడుకునే పాట
‘ఆనందమానందమాయే,
మది ఆశల నందనమాయే,
మాటలు చాలని హాయే,
ఒక పాటగ మారిన మాయే’
మనసులో పెద్దగా పాట వినిపించసాగింది.
వెనక కూర్చున్న హసంతి
‘ఇహ నేను కార్తీక్ గురించి ఆలోచించను. ఆఫీసు దగ్గర రెస్టారెంట్లో కూడా అతని చూడటానికి అవకాశం లేదు. నాకు వెల్స్ పార్గోలో జాబ్ వచ్చింది. ఆఫీస్ కూడా దూరం. ధృతి చెప్పినట్టుగా ఇకపై నా జీవితం గౌతమ్ తోనే’ అనుకుంది మనసులో.
“ఏంటి హసంతీ! ఈరోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు!”
“కారణం నువ్వే గౌతమ్”
“నేనా!?”
“అవును బాల్యంలో నిన్ను ఎంత టార్చర్ పెట్టేదాన్ని అన్నావు కదా! అయినా నా కోసం ఎప్పుడూ నువ్వు ఓడిపోతూ.. నన్ను గెలిపిస్తూనే ఉండేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇవ్వను.”
“అదేంటి?”
“ఓడిపోవటంలో, కాంప్రమైజ్ అవ్వటంలో ఉండే ఆనందం నాకు నువ్వు చిన్నప్పుడే నేర్పించావు. నిన్ను చూసే నేర్చుకున్నాను. అవునా!?”
“అమ్మో! నువ్వు ఓడిపోవడం జరగనే జరగదు. ఒకవేళ ఓడిపోతే.. ఆ తర్వాత నువ్వు చేసే యాగీ ఇప్పుడు నేను తట్టుకోలేను. ఎందుకంటే నా మనసు నీ దగ్గరే ఉందిగా! దాన్ని నువ్వు ఎంత పదిలంగా కాపాడుకుంటావో నాకు తెలుసు. అలాగే నిన్ను ఎంత అపురూపంగా చూసుకోవాలో నా మనసుకు తెలుసు. సో! నీ నోటి నుంచి ఓడిపోవడం, కాంప్రమైజ్ అవ్వటం అనే పదాలు ఇంకెప్పుడూ రానీయకు” అన్నాడు.
***
బైక్ గచ్చిబౌలిలో స్టార్బక్స్ కాఫీ షాప్ ముందు ఆగింది.
“రా! హసంతీ!” అన్నాడు గౌతమ్.
ఇద్దరూ లోపల కూర్చున్నారు.
హసంతి పక్కనున్న కిటికీ నుంచి బయటికి చూసింది. చిన్న లాన్, చెట్లు. వాటి కింద టేబుల్స్, కుర్చీలు కనిపించడంతో క్షణంలో జ్ఞాపకాలు కార్తీక్‌ని గుర్తు చేశాయి.
అప్పటివరకు నవ్వుతూ ఉన్న ఆమె మొహం ఏదో ఆలోచనలో ఉన్నట్టు మారిపోయింది.
“ఏం తీసుకుందాం?”
“కాఫీ”
“కెఫే లాటే ఓ.కే.నా?”
తల ఊపింది.
క్యాష్ కౌంటర్ దగ్గర కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్న శ్రీరామ్కి హసంతి కనిపించింది.
దగ్గరకొచ్చి “హలో!” అన్నాడు.
ఎంబరాసింగ్‌గా అతని వైపు చూసింది.
“హసంతీ! ఏంటి? ఇక్కడ? బాగున్నావా? ఈమధ్య ఆఫీస్‌కి రావడం లేదా? జాబ్ చేస్తున్నావా? మానేశావా? నిన్ను చూసి చాలా రోజులైంది?. నీకు ఓ విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. దట్ ఫెలో పేరు గుర్తు రావటం లేదు.” అని ఏదో చెప్పబోతుంటే..
గౌతమ్‌కి అర్థం కాక బ్లాంక్‌గా చూస్తున్నాడు.
“హి ఈజ్ గౌతమ్. మా అత్తయ్య కొడుకు. అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది”
“హలో!” అన్నాడు శ్రీరామ్.
“గౌతమ్! ఇతను నాకు కాలేజీలో సూపర్ సీనియర్. రెస్టారెంట్ ఓనర్” అంది.
“హాయ్! బ్రో!” అన్నాడు గౌతమ్.
“సరే! హసంతీ! ఎంజాయ్ ద డే. నాకు పనుంది. మళ్లీ కలుస్తాను” అని వెళ్తూ..
‘ఏంటి హసంతి ఇలా చేసింది? నిన్నటిదాకా నాకు కార్తీక్ కావాలని వెంట పడ్డది. ఇప్పుడు మేనమామ కొడుకుతో ఎంగేజ్మెంట్ అయింది అంటోంది. అసలు ఈ అమ్మాయిలు ఇంతే. ఎందులోనూ క్లారిటీ ఉండదు’ అనుకుంటూ క్యాష్ కౌంటర్ దగ్గరకొచ్చాడు శ్రీరామ్.
అంతలో అక్కడికి కార్తీక్ వచ్చాడు. అక్కడ శ్రీరామ్‌ని చూసి గుర్తుపట్టి
“హలో! సార్! గుర్తుపట్టారా? ఇది కూడా మీ బ్రాంచేనా?” అన్నాడు.
“నాది కాదు ఫ్రెండ్‌ది. నువ్వేంటి ఇక్కడ?”
“ఓ ఫ్రెండ్ ఇక్కడ కలుద్దాం అంటే వచ్చాను”
“సర్లే! రా! అక్కడ కూర్చుందాం” అని హసంతి, గౌతమ్ కనపడకుండా ఓ కార్నర్‌కి తీసుకెళ్లాడు.
“సార్! ఆ అమ్మాయి ఫోన్ నెంబరు, అడ్రస్ మిమ్మల్ని అడిగాను. తెలిసిందా!?”
“లేదు కార్తీక్! నేను వారం రోజులు ఆంధ్రా వెళ్లాను. ఆ అమ్మాయి ఇప్పుడు రెస్టారెంట్‌కి రావడం లేదు. లీవ్‌లో ఉందేమో!”
“నేనూ నాలుగు రోజులు నుండి లీవ్‌లో ఉన్నాను లెండి”
ఇద్దరికీ కాఫీ ఆర్డర్ టోకెన్ నెంబర్ వినిపించింది. ఇద్దరూ లేచి కౌంటర్ దగ్గరికి వచ్చారు. అక్కడే గౌతమ్ నిలబడి ఉన్నాడు. అంతలో శ్రీరామ్ ఫోన్ మోగింది.
“వన్ మినిట్ బ్రో”.. అని కార్తీక్‌కి చెప్పి పక్కకెళ్లాడు.
ముందుగా గౌతమ్ ఆర్డర్ ఇచ్చిన కాఫీ రావటంతో రెండు కప్పులు చేతుల్లో పట్టుకుని వెళ్ళబోతుంటే.. ఎదురుగా వచ్చిన కస్టమర్ చూసుకోకుండా గౌతమ్ చేతికి తగలటంతో.. వేడి కాఫీ ఒలికి చేతి మీద పడ్డది.
సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడా వ్యక్తి.
అప్పుడే కార్తీక్ అటు తిరగటంతో
“హలో బ్రదర్! వన్ మినిట్” అని ఓ చేతిలో ఉన్న కాఫీ కప్పు అతనికి ఇచ్చాడు.
గౌతమ్ చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. కార్తీక్ రెండు చేతుల్లో కాఫీ పట్టుకుని నిలబడ్డాడు.
అంతలో.. కార్తీక్ ఫోన్ వైబ్రేట్ అవుతుంటే, అక్కడికి దగ్గరలో ఉన్న టేబుల్ మీద కాఫీ కప్పు పెట్టి ఫోన్ తీసుకొని “హలో” అన్నాడు.
అతని గొంతు విని, హసంతి కళ్ళెత్తి చూసింది.
కార్తీక్ కనిపించేసరికి ఒక్కసారి వంద వయోలిన్ల సింఫనీ శబ్దం మనసంతా మోగింది.
అంతే! ఆశ్చర్యం, దుఃఖం కలబోసిన మొహంతో వేగంగా లేచి నిలబడి, మొహం తిప్పుకొని అతని ముందు నుంచే వెళ్ళిపోయింది. ఆమె ఎవరో తెలియని కార్తీక్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు.
గౌతమ్ వచ్చి హసంతి కల్పించకపోయేసరికి, అక్కడ టేబుల్ మీద కనిపించిన ఆమె సెల్‌ఫోన్ తీసుకుని వేగంగా బయటికి వచ్చాడు. వెళ్తున్న హసంతిని చూసి “హసంతీ!” అని పిలిచాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఆటో ఎక్కింది.
***
హసంతి ఆటో దిగి వేగంగా ఇంట్లోకి వచ్చింది. తల్లి ఫోన్లో మాట్లాడుతోంది.
“ఆఁ.. సరోజా! అలాగే” అంటూ లోపలికి వెళ్తున్న హసంతిని చూసి “ఆగు హసంతి! సరోజ పిన్ని లైన్‌లో ఉంది మాట్లాడు” అంది.
తల్లి మాట పట్టించుకోకుండా గదిలోకి వెళ్లి తలుపేసుకుంది.
“హసంతీ! తలుపు తీయవే. పిన్ని మాట్లాడతానంటే వినిపించుకోవేంటి? తలుపు తియ్యి” అని ఫోన్లో “సరోజా! సరోజా!” అంటుంటే అప్పటికే ఫోన్ కట్ అయింది.
“తలుపు తియ్యి హాసంతీ!” అంది కవిత.
“కొంచెంసేపు నన్ను డిస్టర్బ్ చెయ్యకమ్మా!” లోపల్నుంచి విసుగ్గా అంది హసంతి.
‘వెళ్లేటప్పుడు బాగానే బయటికి వెళ్లిందిగా! ఇంతలో ఏమైంది? దీనికి’ అనుకుంటూ కిందికి రాబోతుంటే, మెట్ల మీద పైకొస్తున్న గౌతమ్ కనిపించాడు.
“రా! గౌతమ్” అంది.
“అత్తయ్యా! హసంతి ఫోన్ మర్చిపోయింది. ఇచ్చి వెళదామని వచ్చాను”
“రా! లోపలికి రా!” అని ఫోన్ తీసుకుంది.”
“ఇంకోసారి వస్తాను. కొంచెం పని ఉంది వెళ్తాను”
“కాఫీ తాగెళ్లు”
“వద్దత్తయ్యా! తాగాలని లేదు” అని వెళ్లిపోయాడు.
ఏంటి ఈ పిల్లలు! బయటికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం మొహాలు ఇంత లావున పెట్టుకొని, ఇంటికి వస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య మాటలు పోసగటం లేదేమో! అభిప్రాయాలు కలవడం లేదేమో! ఏమో! అంతా అయోమయంగా ఉంది.. అనుకుంటూ లోపలికి వెళ్ళింది కవిత.
***
గదిలో కూర్చున్న హసంతి ఏడుస్తూ తనలో తాను
‘కార్తీక్‌ని చూడకూడదనుకునే కదా! గౌతమ్‌తో బయటికి వెళ్ళింది? అక్కడికి కార్తీక్ వస్తాడని తెలియదు. అయినా ఎందుకు అతన్ని చూశాను? ఎలా చూశాను? కార్తీక్‌ని వద్దనుకున్నా వదిలిపోవడం లేదు. ఎందుకని?’ తనలో తాను అనుకుంటూ ఏడుస్తోంది.
అంతలో మనస్సాక్షి ఆకాశవాణిలా మాట్లాడటం మొదలు పెట్టింది.
‘నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు హసంతీ! కార్తీక్ నిన్ను చూశాడా? నువ్వు కార్తీక్‌ను చూసావా? నువ్వే కదా అతనిని చూసింది. ఒకవేళ అతను నిన్ను చూసినా, నువ్వు ఎవరో అతనికి తెలియదు. అతని రియాక్షన్ ఏంటో నీకు తెలియదు. ఇందులో అతని తప్పేముంది? నువ్వే మనసనే సముద్రంలో రెండు పడవల మీద రెండు కాళ్లు పెట్టి పెట్టి ప్రయాణం చేస్తున్నావు. ఆలోచించు’ అని అదృశ్యమైంది.
***
‘ఏంటి గౌతమ్ అదోలా మాట్లాడెళ్ళాడు. ఇద్దరూ వెళ్లేటప్పుడు బాగానే వెళ్లారుగా! బయట ఏమైనా గొడవపడ్డారేమో! ఇద్దరూ అదోలా ఉన్నారు. ఏంటో ఈ కాలం పిల్లలు. ఎవరికీ అర్థం కారు. వాళ్లకు వాళ్లే అర్థం కారు.’ అనుకుంటూ కిచెన్ లోకి వచ్చింది కవిత.
***
రఘురాం సోఫాలో కూర్చుని డో బర్న్ పుస్తకం ‘ద సీక్రెట్’ పుస్తకం చదువుతున్నాడు. గౌతమ్ లోపలికి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు.
“గౌతమ్ హసంతితో బాగా మాట్లాడావా? తనని మాట్లాడిన మాట్లాడనిచ్చావా?”
“ఊఁ..” అన్నాడు ముభావంగా.
రఘురాం నవ్వి మళ్ళీ పుస్తకంలో కళ్ళు దూర్చాడు.
రెండు నిమిషాల తర్వాత గౌతమ్ తండ్రి ఒళ్ళో తల పెట్టుకుని ఒదిగి పడుకున్నాడు.
‘పెళ్లీడు వయసు వచ్చినా.. వీడికి చిన్నప్పటి అలవాటు పోలేదు’. అనుకుని కొడుకు ఒత్తయిన జుట్టుని నిమిరాడు.
గౌతమ్ మౌనంగా పడుకుని
“మాట్లాడదాం రమ్మని, తిరిగి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్ళింది. ఏంటి? హసంతి అర్థం కాని ప్రశ్నలా ఉందేంటి? అసలు నేనంటే తనకి ఇష్టం ఉందో!? లేదో!? కనీసం తెలుసుకునే అవకాశం నాకు ఇవ్వటం లేదు. చెప్పే అవకాశం తను తీసుకోవటం లేదు. కానీ ఆమె మనసులో ఏదో తెలియని బాధపడుతోంది. అది ఎలా కనుక్కోవాలో, నాకు తెలియటం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు” అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
తనలో తాను మాట్లాడుకుంటున్న గౌతమ్ మాటలు విని, పుస్తకం పక్కనపెట్టి “గౌతమ్” అన్నాడు.
“నిద్ర వస్తోంది డాడీ! వెళ్లి పడుకుంటాను” అని తన గదిలోకి వెళ్ళాడు.
కొడుకు వెళ్తున్న వైపే చూస్తున్న రఘురాం..
‘చిన్నప్పటినుంచి తల్లి లేకపోయినా, హసంతిని తలుచుకుంటూ పెరిగాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య అవగాహన కుదరటం లేదేమో!? ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకోకుండా పెద్దవాళ్ళం తొందరపడి ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చామేమో! హసంతితో బయటకు వెళ్ళేటప్పుడు ఉండే ఉత్సాహం, తిరిగి వచ్చాక ఉండటం లేదు. గౌతమ్ జీవితం ఎలా ఉండబోతుందో!? ఏమిటో!’ అనుకున్నాడు రఘురాం.
***
కార్తీక్ రూమ్ లోకి వచ్చి భుజానికి ఉన్న గిటార్ టేబుల్ మీద పెట్టాడు. డ్రెస్ మార్చు కుని వచ్చి, లైటు,ఫ్యాను వేసుకుని రిలాక్స్డ్ గా కుర్చీలో కూర్చున్నాడు.
అసలీ హసంతి ఎవరు? ఎలా తెలుసుకోవాలి? ఎలా కలుసుకోవాలి? ఆమెను చూడాలన్న ఆత్రుత క్షణ క్షణానికి పెరిగిపోతుంది. ఆమె గురించి చెప్పి, ఆమె ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి, ఆమెతో మాట్లాడమని ఎంకరేజ్ చేసి, ఇవ్వాళేంటి? “బ్రదర్ డోంట్ వేస్ట్ యువర్ టైం! డోంట్ ట్రై ఫర్ హర్! తను నీకు దక్కదు” అని అంటాడు ఈ శ్రీరామ్. ఎందుకలా అన్నాడో! అర్థం కావడం లేదు. ‘అసలు హసంతి అనే అమ్మాయి ఉందా? లేదా సినిమాల్లోలా ఊహ సుందరి క్యారెక్టరా? అంతా అయోమయంగా ఉంది’ అనుకుంటుండగా ఫోన్ మోగింది.
***
హసంతి రూమ్‌లో ఫోన్ కోసం వెతుకుతోంది. కనిపించకపోయేసరికి
“అమ్మా!” అంటూ తల్లి దగ్గరికి వచ్చింది.
“ఏంటి? ఏమైనా కావాలా?”
“నా ఫోన్ చూసావా?”
“హసంతీ! నీకూ, గౌతమ్‌కి ఏమైనా గొడవ జరిగిందా? అసలు మీ ఇద్దరికీ అండర్స్టాండింగ్ కుదరటం లేదా”
“ఏం జరగలేదు. అలాంటిదేం లేదు.” అంది విసుగ్గా
“లేదు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు.”
“అమ్మా! నా ఫోన్ చూసావా? లేదా?”
“చార్జింగ్ పెట్టాను. వెళ్లి తీసుకో” అంది తల్లి చిరాగ్గా.
హసంతి వేగంగా వెళ్ళిపోయింది.
‘ఈమధ్య వీళ్ళిద్దరూ నార్మల్‌గా ఉండటం లేదు. రఘురాం అన్నయ్యతో మాట్లాడి పెళ్లి పనులు త్వరగా మొదలు పెడదామని చెప్పాలి’ అనుకుంది కవిత.
(సశేషం)