[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[శ్రీరామ్ ఇచ్చిన అడ్రస్‍కి వెళ్లి తలుపు కొడతాడు కార్తీక్. ఒక అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. హసంతి అంటే, తనే నంటుంది. కార్తీక్ తన మొబైల్‍లో ఫేస్ బుక్ తెరిచి అందులో కవితని చూపించి, ఇది మీరే పోస్ట్ చేశారా అని అడుగుతాడు. అవునంటుంది. తన ప్రెండ్ ఆ కవితని వాట్సప్ స్టేటస్‍లో పెడితే నచ్చి ఎఫ్.బి.లో పోస్ట్ చేశానని చెప్తుంది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన కార్తీక్ నిరాశ పడతాడు. ఆమెకు సారీ చెప్పి వెళ్ళబోతుంటే, – సారీ ఎందుకు? – అని, మీరెవరినో వెతుకుతున్నట్టున్నారు అంటుందామ్మాయి. నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి పేరు కూడా హసంతే అని చెబుతాడు. లవ్ అంటున్నారు, వివరాలు తెలియవా అంటే, తెలియదని చెప్తాడు. తన ఫ్రెండ్‌తో మాట్లాడి, ఏమైనా క్లూ, వివరాలు తెలిస్తే మీకు చెప్తాను అంటూ కార్తీక్ ఫోన్ నెంబరు తీసుకుంటుందా అమ్మాయి. గౌతమ్ కవితకి ఫోన్ చేసి హసంతి ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాడు. ప్రస్తుతం బానే ఉందని చెప్తుందామె, అయితే రెండు రోజులుగా చాలా ముభావంగా ఉంటోందని, అందుకని హసంతిని బయటకు తీసుకెళ్లమని చెబుతుంది. రేపు తీసుకెళ్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మర్నాడు హసంతి, గౌతమ్ పార్క్‌కి వస్తారు. బెంచీ మీద కూర్చుని చిన్నప్పటి కబుర్లేవో గౌతమ్‍కి చెబుతూంటుంది హసంతి. అదే సమయంలో అక్కడికి మృదుల, కార్తీక్ కూడా వస్తారు. దూరం నుంచి చూస్తున్న హసంతికి వాళ్ళిద్దరూ లవర్స్ అనే అనిపిస్తుంది. ఇక అక్కడ ఉండబుద్ధి కాక, కాఫీ తాగుదాం పద అంటూ గౌతమ్‍ని అక్కడ్నించి బయల్దేరదీస్తుంది. రాత్రి 12 గంటలకు తన గదిలో షార్ట్-ఫిలింకి అదించాల్సిన రీరికార్డింగ్ తన కీబోర్డ్ మీద కంపోజ్ చేస్తుంటాడు కార్తీక్. అప్పుడతని ఫోన్ మోగుతుంది. హలో అంటాడు. మీరు కార్తీకేనా అని అడిగి, మీరు మొన్న ఓ అమ్మాయిని కలిగి ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా – అని అంటుందో అమ్మాయి అటునుంచి. ఒరిజినల్ హసంతి మీరేనా అని ఆతృతగా అడుగుతాడు. కాదంటూ, తన హసంతి ఫ్రెండ్‍ననీ, పేరు ధృతి అని చెప్తుంది. ఎఫ్.బి.లో కవిత పోస్ట్ చేసింది మీరేనా అంటే, అవునని, అది హసంతి తన లవర్ కోసం రాసినదని, బాగుందనిపించి ఎఫ్.బిలో పోస్ట్ చేశానని చెప్తుంది. ఆ లవర్ తానేనంటాడు కార్తీక్. ఋజువుగా శ్రీరామ్ చెప్పిన విషయాలు, హసంతి ఇచ్చిన గిఫ్ట్‌ల గురించి చెప్తాడు. చివరికి కన్విన్స్ అయిన ధృతి హసంతి అడ్రస్ ఇస్తుంది. ఎగిరి గంతేస్తాడు కార్తీక్. మర్నాడు ఉదయం గౌతమ్ నిద్ర లేస్తూనే హసంతికి గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపుతాడు. వారిద్దరి మధ్యా కాసేపు చాటింగ్ నడుస్తుంది. కాసేపటి తర్వాత అమ్మ పిలుస్తోంది అంటూ మెసేజెస్ ఆపేస్తుంది హసంతి. ఇక చదవండి.]
[dropcap]ధృ[/dropcap]తి పంపిన అడ్రస్ ప్రకారం ఇంటి నంబరు వెతుక్కుంటూ ఆ వీధిలోకి వచ్చాడు కార్తీక్.
మధ్యలో కన్ఫ్యూజై ఓ వ్యక్తిని అడిగాడు.
“మూడిళ్ళవతల”
కార్తీక్ బండి స్పీడ్ పెంచి
“మేఘాల మీద సాగాలి
అనురాగాల రాసిన చూడాలి”
ఎప్పుడో విన్న పాత సినిమా పాట హమ్ చేసుకుంటూ ఆ ఇంటి ముందు ఆగాడు. ఇంటి నంబర్ చూసి, నిర్ధారించుకున్న తర్వాత,. హసంతిని చూడబోతున్న సంతోషం మనసులోనూ, మొహంలోనూ కనిపించాయి.
***
“హసంతీ! కాలింగ్ బెల్ మోగుతోంది. చూడు” అంది తల్లి పూజ చేసుకుంటూ.
హసంతి చేతిలో ఫోన్ ఆఫ్ చేసి, కిందికి వచ్చి తలుపు తీసింది.
అంతే! ఎదురుగా కనిపించిన కార్తీక్‌ను చూసి నోటమాట రానట్టు స్థాణువులా మారింది.
ఎగిసిన కెరటం సముద్రంలో కలుస్తున్నట్టు
ఆకాశం నుండి నక్షత్రాలు జలజల రాలుతున్నట్టు
అగ్ని కొండలు విస్ఫోటనం చెందుతున్నట్టు..
ఏమీ మాట్లాడకుండా శిలలాంటి పడ్డ ఆమెను చూసి
“హసంతీ!!!” అన్నాడు ఉద్వేగంగా.
“………”
హసంతి కళ్ళలో తడి, మోహంలో ఆందోళన.
“మొన్న స్టార్ బక్స్ కేఫెలో నన్ను చూసి కంగారుగా వెళ్ళిపోయింది మీరే కదా! ఎందుకు వెళ్లారు!”
బదులు ఇవ్వకుండా విభ్రాంతిగా ఎర్రబడ్డ కళ్ళతో చూస్తుంటే..
“మీరే హసంతి కదూ!” అన్నాడు నవ్వుతూ.
ఆ నవ్వు కోసమే సంవత్సరం పాటు దూరం నుండి కళ్ళు కాయలు కాసేలా చూసింది. ఇప్పుడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ నవ్వును ఆస్వాదించలేక, ఆహ్వానించలేక గుమ్మంలోనే నిలబెట్టింది. ఎంత దురదృష్టం.
మళ్లీ అడిగాడు – “మీరు హసంతే కదూ. నాకు తెలుసు. మీ కళ్ళు చెబుతున్నాయి”
కాదన్నట్టు తల అడ్డంగా తిప్పింది. అతని కళ్ళలోకి చూడలేక తల తలదించుకుంది.
“అబద్ధం చెప్పకండి. మీరు హసంతే. నాకు తెలుసు.
“నేను కాదు హసంతిని కాదు”
“నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఆరోజు స్టార్ బక్స్‌లో నన్ను చూడగానే మీ కళ్ళలో కనిపించిన కన్నీళ్లే ఇప్పుడూ కనిపిస్తున్నాయి. నిజమైన కన్నీళ్లు అబద్ధం చెప్పవు. మీరే హసంతి” అంటుంటే.. మొహం మీదే ధడేల్న తలుపులు వేసింది.
అంతే! అక్కడే నిలబడ్డ కార్తీక్‌కి ఆమెది అహంకారమో, అహంభావమో, అసహనమో అర్థం కాలేదు. కనిపించక ముందు ప్రేమించి, కనిపించాక తిరస్కరిస్తుందేమిటి? ‘ఆడాళ్ళూ! మీకు జోహార్లు’ అనుకుంటూ వెనక్కి తిరిగాడు.
లోపలికి వచ్చిన హసంతి కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తలుపు దగ్గరే కూర్చుంది.
‘దేవుడా! నాకెందుకీ శిక్ష’ అనుకుంటూ కార్తీక్‌ని అవమానించి పంపిన బాధలో కళ్ళనుండి ధారలుగా కన్నీళ్లు కారుతున్నాయి.
పూజ గదిలో నుంచి “ఎవరు హసంతీ!” అంది తల్లి. వెంటనే లేచి నిలబడి, తన గదిలోకి వెళ్తున్న హసంతి
“ఎవరో రాంగ్ అడ్రస్ కి వచ్చారట.” అని గబగబా మేడ మెట్లు ఎక్కుతూ, రోడ్డు మీద వెళ్లిపోతున్న కార్తీక్‌ని చూసింది. తన ప్రేమ అంతా తానే ముక్కలు, ముక్కలుగా చేసి, అతని చేతుల్లో పెట్టి పంపిస్తున్నట్టు అనిపించింది.
కాసేపటికి ధృతి వచ్చింది.
“ఏంటే! ఇంత పొద్దున్నే వచ్చావు.?”
“రావద్దంటే వెళ్ళిపోతాను”
“అది కాదు. ఉదయం పూట నువ్వు బిజీగా ఉంటావుగా!” అంది హసంతి.
ధృతి హసంతి కళ్ళలోకి సూటిగా చూస్తుంటే..
“ఎందుకే అలా గుచ్చినట్టు చూస్తున్నావు!” అంది
“పద మేడ మీద గదికి వెళదాం”
ఇద్దరూ పైకి వచ్చారు
“కార్తీక్ నిన్ను చూడటానికి వచ్చాడా?”
వెంటనే హసంతి మొహం పక్కకు తిప్పుకొని
“కార్తీక్ నీకెలా తెలుసు?” అంది.
“ఎలాగోలా తెలుసులే. ఇప్పుడు అది కాదు ముఖ్యం. అతనితో నువ్వు ఎవరో నాకు తెలియదన్నావట. పైగా నేను హసంతిని కాదని, మొహం మీదే తలుపేసి పంపావట. ఎందుకలా చేసావే?”
“ఇప్పుడు నన్నేం చేయమంటావు?”
“అసలు కార్తీక్ నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడో తెలుసా?! శ్రీరాంతో నువ్వు పంపిన గిఫ్ట్ ప్యాక్‌లో ఉన్న అమూల్యమైన బహుమతులన్నీ చూసి ఫిదా అయిపోయి, తనకు తెలియకుండా ప్రేమిస్తున్నావన్న సంతోషంలో, నువ్వు ఎవరో తెలియకపోయినా నీ అడ్రస్ తెలుసుకుని, నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు” అంది ధృతి.
“కార్తీక్ నన్ను ప్రేమిస్తున్నాడా!? అయితే మరి మృదుల ఎవరు?” అంది ఆశ్చర్యంగా.
“అతని ఫ్రెండ్, క్లాస్మేట్. ఇదే ప్రశ్న నేను అతనిని అడిగితే తనే చెప్పాడు.”
అంతే! హసంతికి మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది.
“ఏయ్! ఏడవకే బాబూ! మాట్లాడితే ట్యాప్ తిప్పుతున్నావు ఈమధ్య. ఆపేయ్! నువ్వేగా అతను నిన్ను ప్రేమించాలనుకున్నావు. ప్రేమిస్తున్నానని ఇల్లు వెతుక్కుంటూ వస్తే అవమానించి పంపావు”
“ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు? నేను కార్తీక్‌ని ఇష్టపడుతున్నట్టూ, అతనికి నా ప్రేమ గురించీ తెలియదు. ఇప్పుడు గౌతమ్‌తో నా ఎంగేజ్మెంట్ అయ్యాక, కార్తీక్ నన్ను వెతుక్కుంటూ వస్తే.. నేనేం చేయాలో నువ్వే చెప్పు” అంది ఏడుపు గొంతుతో హసంతి.
“అంటే! గౌతమ్‌ని పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యావన్నమాట”.
“నాకు అతనితో ఎంగేజ్మెంట్ అయిందన్న సంగతి మర్చిపోకు. నా కారణంగా గౌతమ్ జీవితం పాడవ్వకూడదు”
“నీకు ఏమైనా మెంటలా? ఇండివిడ్యువాలిటీ లేదా? ఎవరినైతే ఇష్టపడి ప్రేమించావో, అతనికి నీ ప్రేమ గురించి అప్పుడే చెప్పేసి ఉంటే.. ఇంత దాకా వచ్చేది కాదు కదా! ఎంగేజ్మెంట్ అయిన ఎన్నో పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతున్నాయి” అంది ధృతి.
“లీవిట్ ధృతీ! నన్ను వదిలెయ్. నా ఖర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది”
“మరి కార్తీక్‌కి ఏం చెప్పమంటావు?”
“హసంతి లేదని చెప్పు”
“నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?”
“ఇహపై ఈ విషయం గురించి నాతో మాట్లాడకు ధృతీ! నీకో నమస్కారం” అని హసంతి ఏడుస్తూ.
“చిన్నప్పటినుంచి తెలిసిన నువ్వు నాకే అర్థం కావట్లేదు. బయటిక వాళ్ళకి ఏం అర్థం అవుతావు?” అని ధృతి వెళ్ళిపోయింది.
ఓ గంట తర్వాత హసంతి ఫ్రెష్ అయి.. కిందికి దిగుతూ బాల్కనీ నుండి కిందకు చూసింది.
ఇంటిముందు రోడ్డు మీద కార్తీక్ నిలబడి తన వైపే చూస్తున్నాడు.
వేగంగా కిందికి దిగింది హసంతి. తల్లి కంట పడకుండా కార్తీక్ దగ్గరకు వచ్చి, రెండు చేతులూ జోడించి..
“దయచేసి మా ఇంటి వైపు రావద్దు కార్తీక్! ఇంట్లో వాళ్ళు చూస్తే గొడవ అవుతుంది. నువ్వు అనుకునేది జరగదు. ప్లీజ్ వెళ్ళిపో!” అంది ఆవేదనగా.
అప్పటివరకు సూటీగా ఆమె కళ్ళలోకి చూసిన కార్తీక్ నవ్వుతూ “ఐ లవ్ యు హసంతీ!” అన్నాడు.
ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ.. ఒక్క అడుగు వెనక్కేసింది.
“నేనెవరో తెలియదటున్నావు, ఇప్పుడు దణ్ణం పెడుతున్నావు. వెళ్లిపోమ్మని అంటున్నావు. ప్రేమంటే ఇదేనా? ఇందుకేనా సంవత్సరంన్నర పాటు నన్ను దూరం నుండి చూసి ప్రేమించావు?” అన్నాడు.
హసంతి బ్లాంక్‌గా ఏమీ అర్థం కానట్టు చూసింది.
“నన్ను ప్రేమించకపోతే.. నా కోసం ఇవన్నీ ఎందుకు పంపావు?” అని చేతికున్న ఉన్న కంకణాన్ని, సెల్ఫోన్‌లో పిక్స్‌ని చూపించాడు.
హసంతి కళ్ళలో నీళ్లు టపటపా రాలాయి.
“ధృతి నీ అడ్రస్ ఇచ్చింది. మృదుల నా ఫ్రెండ్, లవర్ కాదు. నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావని తెలిసాక, నిన్ను చూడకుండా, నీకోసం రాకుండా ఎలా ఉండగలనని అనుకున్నావు? నిన్ను కాకుండా మరొకరిని జీవితంలోకి ఆహ్వానించలేను” అన్నాడు.
హసంతి ఫోన్ రింగ్ అయింది. చూసింది గౌతమ్. ఫోన్ కట్ చేసింది.
“ఇప్పుడైనా ఏదో ఒకటి మాట్లాడు హాసంతీ!” అన్నాడు కార్తీక్.
కన్నీళ్లు తుడుచుకుంటూ
“నేను వెళ్తాను” అని వెళ్లబోతుంటే, ఆమె చేయి పట్టుకుని ఆపాడు. భయంగా చుట్టూ చూసి, నిస్సహాయంగా అతని వైపు చూసింది. మళ్లీ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ కట్ చేసింది.
“నువ్వు వెళ్ళు హసంతీ! కానీ వెళ్ళేముందు ఒక్క విషయం గుర్తుంచుకో! ఈ క్షణం నుండి రేపు మళ్లీ ఇదే సమయం వరకు ఒక్క సెకండ్ అయినా.. నీ ఆలోచనలలోకి నేను రాకపోతే.. నీకు ఇంకెప్పుడూ నేను కనిపించను” అని చేతిని వదిలేసాడు.
హసంతి కళ్ళు తుడుచుకుంటూ వెళ్లబోతుంటే..
“రేపు నీకోసం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకి చిల్డ్రన్స్ పార్క్ గేట్ దగ్గర ఎదురు చూస్తుంటాను. నీకు తప్ప నా జీవితంలో మరొకరికి స్థానం లేదు. నన్ను చూడగానే ఎక్సయిట్ అవుతావని, ఆ సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని నీ కళ్ళలో చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. ఓ.కే లెట్ ఇట్ బి ఇన్ మై డ్రీమ్స్. థాంక్స్ ఫర్ వామ్ అండ్ డిఫరెంట్ వెల్కమ్” అని ఆమె వెళ్తున్న వైపు చూస్తూ వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయాడు కార్తీక్.
(సశేషం)