ఫస్ట్ లవ్-17

1
1

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రోజు శనివారం కావడంతో ఆలస్యంగా నిద్రలేస్తుంది హసంతి. పెళ్ళి కావల్సిన పిల్లవు, ఇంతసేపు పడుకుంటే ఎలా తల్లి మందలిస్తే, శనివారమేగా, ఆఫీసు లేదుగా అంటుంది. సరే త్వరగా ఫ్రెష్ అయిరా, కాఫీ కలుపుతాని చెప్తుంది కవిత. తల్లితో కాఫీ తాగుతూ, పెళ్ళయితే స్వేచ్ఛ కోల్పోతామా అని అడుగుతుంది హసంతి. కొంతవరకూ నిజమేనంటుంది కవిత. అయినా రఘురాం, గౌతమ్ నిన్ను బంగారంలా చూసుకుంటారని, ఎక్కువగా ఆలోచించకని చెప్తుంది. కాసేపయ్యాకా, రఘురాం, గౌతమ్ వస్తారు. పంతులు గారిని కలిసి వచ్చాననీ, వచ్చే నెల 14, 28 తేదీల్లో హసంతి, గౌతమ్‍లకు నప్పే ముహూర్తాలున్నాయని చెప్పారని రఘురాం కవితకి చెప్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే గౌతమ్ పైకి వస్తాడు. తను తెచ్చిన డైమండ్ రింగ్ ఆమె వేలికి తొడుగుతాడు. తాను కొన్న యాపిల్ ఐ ఫోన్ ఆమెకిస్తాడు. తన చివరి శ్వాస వరకూ హసంతిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తానని చెప్తాడు. తాను కూడా అతనికి అనుకూలంగా ఉంటానని చెప్తుంది హసంతి. మాటల సందర్భంలో క్రితం రోజు కార్తీక్ అన్న మాటలు గుర్తొస్తాయి. వెంటనే గౌతమ్‍ని ఏమీ అనుకోవద్దని, అర్జెంటు పని ఉందని, ఓ ఫ్రెండ్‌ని కలవాలని చెప్పి క్రిందకి దిగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావని కవిత అడిగితే అర్జంటుగా ఫ్రెండ్‌ని కలవాలని చెప్పి వెళ్ళబోతుంది. తల్లి వారిస్తే, రఘురాం, గౌతమ్ వెళ్ళనివ్వమంటారు. హసంతి పార్క్ వైపు వెళ్తుంటే గౌతమ్ ఫ్రెండ్ సుధాకర్ ఆమెని చూస్తాడు. వెంటనే గౌతమ్‍కి ఫోన్ చేసి చెప్తాడు. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న కార్తీక్‍ని కలిసి, తనని విసిగించవద్దనీ, తనకు ఎంగేజ్‍మెంట్ అయిందని చెప్తుంది హసంతి. తన ప్రేమని కాదనవద్దని అంటాడు కార్తీక్. అతని కళ్ళల్లోకి చూడలేక, రాలడానికి సిద్ధంగా కన్నీళ్ళని తుడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోతుంది హసంతి. అప్పుడే సుధాకర్ బైక్ మీద వెనకాల కూర్చుని అక్కడికి వచ్చిన గౌతమ్ దూరంగా నిలబడ్డ కార్తీక్‌నీ, ఏడుస్తూ వెళుతున్న హసంతినీ చూస్తాడు. ఇక చదవండి.]

[dropcap]క[/dropcap]విత గుమ్మంలో నిలబడి కూతురు కోసం ఎదురుచూస్తోంది. ఆమె తన చేతిలో ఉన్న ఫోటోల వైపు తీక్షణంగా చూస్తోంది. ఆమె మొహంలో కోపం, అసహనం కనిపిస్తున్నాయి.

ఆటో దిగిన హసంతి లోపలికి వస్తుంటే, వెనకాలే వచ్చి

“ఆగు హసంతీ! ఈ ఫోటోలు ఏంటి? ఎవరితను?” అని గట్టిగా అడిగింది.

“అదీ.. అదమ్మా” అని కంగారుగా, “ఇవి నీకు ఎక్కడ దొరికాయి?” అంది.

“ఎక్కడా? దిండు కవర్లో. వచ్చే నెలలో పెళ్లి పెట్టుకొని నువ్వు చేస్తున్న ఈ పనేంటే.. పాపిష్టిదానా?” అంది.

హసంతికి చెమటలు పట్టాయి.

“ఈ విషయం రఘురాం మామయ్యకి, గౌతమ్‌కి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుస్తోందా?” అని చెంప మీద ఒక్కటేసింది.

“కుదిరిన పెళ్లిని చెడిపోయే వరకూ తెచ్చే లాగున్నావు.”

తల్లి అరుపులకు గాఢ నిద్రలో ఉన్న హసంతి ఉలిక్కిపడి లేచింది.

‘ఛా ఇదంతా కలా!?!’ అనుకుంటూ.. దిండు కవర్లో వెతికింది. నాలుగు కార్తీక్ ఫోటోలు ఉన్నాయి. కార్తీక్‌కి తెలియకుండా దూరం నుండి రెస్టారెంట్లో కూర్చొని తీసినవి. ధృతి వాళ్ళ కజిన్ ఫోటో స్టూడియోలో ప్రింట్లు వేయించింది. హసంతి వాటిని చూస్తూ అలాగే కూర్చుంది. మనసంతా మెలిపెట్టసాగింది. ఎక్కువసేపు కూర్చుంటే తల్లి వస్తుందేమోనని లేచి, కబోర్డ్‌లో ఉన్న మ్యాచ్ బాక్స్ తీసుకుంది. వాష్ రూమ్‌కి వెళ్లి ఏడుస్తూ ఆ ఫోటోలకి నిప్పంటించింది. మంటల్లో కాలిపోతున్న కార్తీక్ని చూస్తూ, తలుచుకుని ఏడుస్తూ, వాటిని కమోడ్‌లో వేసి ఫ్లష్ ఆన్ చేసింది.

బయటకొచ్చి తెరిచి ఉన్న కబోర్డులో మూస్తుంటే.. ఎదురుగా గౌతమ్ ఇచ్చిన సెల్‌ఫోన్ కనిపించింది. వెంటనే హసంతి కళ్ళు వేలికి ఉన్న డైమండ్ రింగ్ మీదకి మళ్ళాయి.

ఆ రెండూ వాట్సాప్ ఎమోజీల్లా పగలబడి నవ్వుతున్నట్టు అనిపించాయి.

వెంటనే గౌతమ్‌కి మెసేజ్ చేసింది. బదులు లేదు.

అంతలో పైకి వచ్చిన కవిత కూతుర్ని చూసి

“హసంతీ! ఇంకా పడుకోలేదా? లైట్ ఆర్పి పడుకో, అర్ధరాత్రి దాటింది” అని వెళ్ళింది.

“అలాగేనమ్మా!” అని లైట్ ఆర్పి కిటికీ తలుపులు వెయ్యబోతుంటే.. రోడ్డుమీద స్ట్రీట్ లైట్ కింద నిలబడ్డ కార్తీక్ “హలో!” అని చెయ్యూపుతున్నట్టు అనిపించింది. కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసింది. ఈసారి కార్తీక్ కనిపించలేదు. తన భ్రమకి తానే దుఃఖం లోనూ విరక్తిగా నవ్వుకుంది. కిటికీ తలుపులు మూసి మంచం మీద పడుకుంది. కళ్లు మూసుకుంది.

కార్తీక్ కళ్ళెదురుగా నిలబడి “నా ఫోటోలు కాల్చేశావు కానీ నీ హృదయం నుండి నన్ను బయటికి పంపగలవా!? నీలోని నన్ను, నాలోని నిన్ను.. ఎవరిని ఎవరూ బయటికి పంపలేరు. ఇది నిజం.. నిజం.” అన్నట్టు అనిపించింది.

హసంతి కళ్ళ ముందు తరాజులో కార్తీక్ ఓ పక్క, గౌతమ్ మరోపక్క నిలబడి “హసంతీ! నువ్వు నాకే కావాలి! నాకే కావాలి!” అని పోటీపడి పిలుస్తున్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరిని బలవంతంగా బయటికి నెట్టి.. కళ్ళు మూసుకుంది.

***

చిరాగ్గా ఇంటికి వచ్చిన గౌతమ్ బ్యాగ్ సోఫాలో పడేసి, తల నొక్కుకుంటూ కూర్చున్నాడు. మనసులోని వేదన అతన్ని ఓ చోట కుదురుగా కూర్చొనివ్వటం లేదు. ఎటు చూసినా హసంతి, ఆమెతో మాట్లాడుతున్న తన వయసున్న కుర్రాడే కనిపిస్తున్నారు. కోపం, దుఃఖం మనసులో కల్లోలం సృష్టిస్తున్నాయి. హసంతికి లవర్ ఉన్నాడా? ఉంటే.. ఎందుకు చెప్పట్లేదు? ఎంగేజ్మెంట్ అయ్యాక అతనితో చాటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏముంది?” ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది.

కళ్ళు మూసుకున్నాడు. తల్లి కళ్ళ ముందు నిలబడి గౌతమ్ తల నిమురుతూ..

“ నాన్నా! గౌతమ్” అంది.

“అమ్మా! మనసేం బాగాలేదు.”

“ఎందుకంతగా ఫీల్ అవుతున్నావు?”

“అదీ.. అది.. హసంతి మరొకరితో ప్రేమలో ఉందేమోనని”

“నీకు చెప్పిందా?”

“లేదు”

“వాళ్ళిద్దరూ నీ కళ్ళ ముందు ఏమైనా అసభ్యంగా ప్రవర్తించారా?”

“లేదు”

“మరి నువ్వెందుకు కన్నా! ఏదో ఊహించుకొని బాధపడుతున్నావు?”

“నీతో పెళ్లి కుదిరినంత మాత్రాన, హసంతి ఏ అబ్బాయితోనూ.. మాట్లాడకూడదా? ఏ కాలంలో ఉన్నావు గౌతమ్? కాస్త బ్రాడ్ మైండ్‌తో ఆలోచించు. అతను హసంతి కొలీగ్ అయ్యుండొచ్చు, ఫ్రెండ్ అయ్యుండొచ్చు, బంధువు అయ్యుండొచ్చు.

ఎంగేజ్మెంట్ నీతోనే అయింది కదా! అంటే సగం పెళ్లయినట్టే. ఇవాళ రేపు స్కూలు పిల్లలు, కాలేజీ యువతీ యువకులు, ఉద్యోగస్తులు లవర్స్‌ని వెంటేసుకొని తిరుగుతున్నారు. నువ్వేంటి హసంతితో బయటకు వచ్చినా, ఆమెతో ఫ్రీగా గడపలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు. ఆమె ఏం చెప్పొచ్చినా అడ్డుపడుతున్నావు. బయటకు తీసుకెళ్లమంటే రెస్టారెంట్లో కూర్చోబెట్టడం కాదు. రెస్టారెంట్లో అందరి ముందు అమ్మాయి నీతో ఏం మాట్లాడుతుంది. ఆలోచించావా! ఇంకెన్నో ప్రదేశాలున్నాయి. అనవసరంగా ఏమో ఊహించి, ఆలోచించి మనసు పాడు చేసుకోకు” అని లాలనగా తల నిమురుతుంటే గౌతమ్ సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు.

***

రాత్రి 12 గంటలు.

నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుమీద బైక్ మీద వస్తున్నాడు కార్తీక్. అతను షార్ట్ ఫిలిం రీ-రికార్డింగ్ ముగించుకొని రూమ్‌కి వస్తున్నాడు. బైక్ రోడ్ పక్కన ఆపి సిగరెట్ ముట్టించాడు.

‘హసంతికి ఎంగేజ్మెంట్ అయిందా? అయినా ఆమె మనసులో నేనే ఉన్నాను. నన్ను తిరస్కరించలేక ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిని ఆహ్వానించలేక మథన పడుతోంది. నేనంటే ఇష్టం లేకపోతే ఒంటరిగా నన్ను కలవడానికి ఎందుకు వస్తుంది? నా కళ్ళలోకి చూసి ఎందుకు మాట్లాడలేకపోతోంది? తను నన్నే ప్రేమిస్తోంది.. కాదు.. కాదు నన్నే ప్రేమిస్తోంది. తను నాకే సొంతం కావాలి’ అనుకున్నాడు.

***

మరుసటి రోజు ఉదయం ఫోన్‌లో అలారం మోగుతోంది. హసంతి బద్దకంగా లేచి టైం చూసింది.

రాత్రి గౌతమ్‌కి పెట్టిన మెసేజ్‌కి రిప్లై రాలేదు.

‘సరే ఇప్పుడు కాల్ చేద్దాం’ అనుకొని కాల్ చేసింది.

‘ద నంబర్ యు ఆర్ ట్రైయింగ్ టు కాల్ ఈజ్ నాట్ రీచబుల్’

కాసేపాగి మళ్లీ చేసింది. మళ్లీ అదే రిప్లై. రఘురాంకి కాల్ చేసింది. నాట్ రీచబుల్ అనొస్తోంది.

‘ఏంటి ఇద్దరూ ఎటైనా వెళ్లారా? లేక ఫోన్లు పనిచేయటం లేదా!’ అనుకొని గబగబా తయారై, గౌతమ్ ఇంటికి వెళ్లి వస్తానని తల్లికి చెప్పింది. “నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు కీ తీసుకుని వెళ్ళు” అంది.

***

ఆటోలో గౌతమ్ వాళ్ళ ఇంటి కెళ్ళింది. ఇంటి గేటుకి తాళం వేసుంది. ‘ఎక్కడికెళ్లి ఉంటారబ్బా!’ అనుకుని గౌతమ్ కాల్ చేసింది. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. అదే ఆటోలో తిరిగి ఇంటికి వచ్చింది.

***

హసంతి ఇంటికి తిరిగి వచ్చేసరికి, తలుపులు తీసే ఉన్నాయి. అమ్మ గుడికి వెళ్ళలేదేమో.. అనుకుంటూ, లోపలికి వచ్చేసరికి.. హాల్లో గౌతమ్ కూర్చుని ఉన్నాడు.

అతనిని ఆశ్చర్యంగా చూసి

“ఏంటి గౌతమ్? నేను నీకోసం మీ ఇంటికి వెళ్లొచ్చాను. తాళం వేసుంది” అంది.

“అవును.. నాన్న వాళ్ళ ఊళ్ళో స్నేహితుడి కూతురు పెళ్లికి వెళ్లారు. నేను నీ కోసం ఇక్కడికి వచ్చాను. జస్ట్ కో ఇన్సిడెన్స్” అన్నాడు.

“ఫోన్ ఏంటి, స్విచ్ ఆఫ్ చేసుకున్నావు?”

“చార్జింగ్ లేదు. స్విచ్ ఆఫ్ అయింది.”

“నమ్మమంటావా?” అంది

“అది నీ ఇష్టం” అన్నాడు ముభావంగా.

“అమ్మా!” అని పిలిచింది.

“అత్తయ్య గుడికి వెళ్ళింది” అన్నాడు.

హసంతి టీ.వీ ఆన్ చేసి, తన గదిలోకి వెళ్ళి, బట్టలు మార్చుకొని ఐదు నిమిషాల తర్వాత కిందికి వచ్చింది. టీ.వీ స్విచ్ ఆఫ్ చేసుంది.

అంతలో కవిత వచ్చింది.

అప్పుడు గౌతమ్ హసంతితో “బయటికెళ్దాం వస్తావా!” అన్నాడు.

మారు మాట్లాడకుండా “సరే” అని తల్లికి చెప్పి, ఇద్దరూ బయటికి వచ్చారు.

గౌతమ్, హసంతి పార్క్ దగ్గరికి వచ్చారు. మూలగా ఉన్న బెంచి మీద కూర్చున్నారు. ఎప్పుడూ గలగల మాట్లాడే గౌతమ్ మౌనంగా కూర్చుంటే.. భరించలేక,

“గౌతమ్ ఉదయం నుండి నా మెసేజ్‌కి నువ్వు బదులు ఇవ్వలేదు. నా కాల్‌కి రిప్లై ఇవ్వలేదు. ఎందుకని?”

“చెప్పానుగా! ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని”

“కాదు వేరేదో ఉంది. ఏదైనా ఉంటే ఓపెన్‌గా మాట్లాడు. నిన్ను ఇలా మౌనంగా చూడలేను.”

“హసంతీ! నిన్ను ఒకటి అడగనా? నా ఫ్రెండ్ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరో వ్యక్తితో మాట్లాడుతూ, బాధపడటం చూశాడు.”

అంతే! షాక్ కొట్టిట్టు చూసిందతని వైపు. ఆమె మొహం మీద స్వేదం వేగంగా పేరుకుంది.

“అది చూశాక అతనిలో కొత్త అనుమానం తలెత్తింది. తనతో పెళ్లి ఫిక్స్ కావడానికి ముందే, వాళ్లిద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ ఉందేమోనని అనుమాన పడుతున్నాడు. ఇది అమ్మాయిని అడగాలా? వద్దా? అని నన్ను అడుగుతున్నాడు. నువ్వేమంటావు?” అన్నాడు.

హసంతికి గొంతు పొడారినట్టైంది.

“నువ్వేం చెప్పావ్ గౌతమ్” అంది.

“అది నువ్వే చెప్పాలి హసంతీ!” అన్నాడు.

గౌతమ్ తనను గురించే అంటున్నాడని అర్థమైంది.

“గౌతమ్!” అంది చెమట తెడుచుకుంటూ.

“సాధారణంగా అబ్బాయిలు నమ్మి, ప్రేమించిన అమ్మాయి దగ్గర ఏదీ దాచుకోకుండా తన గతం గురించి చెప్పేస్తారు. కానీ అమ్మాయిలు పెళ్ళికి ముందు క్రష్ గురించి నిజాయితీగా చెప్తారా? అని అడిగాడు. నా ఫ్రెండ్ ఇంకో మాట కూడా అన్నాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దగ్గర గతం గురించి అడగకూడదు. ఎందుకంటే అది మ్యారేజ్ లైఫ్‌లో సంతోషం లేకుండా చేస్తుందట. అదే ఫ్రెండ్ ఇప్పుడు పెళ్లికి ముందు ఒకరి గతం మరొకరికి తెలుసుకోవాలని అంటున్నాడు. అంతా కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా”

“నువ్వేం సలహా ఇచ్చావు గౌతమ్” అంది

“నా గతం, భవిష్యత్తు రెండూ నువ్వే హసంతీ! నీ దగ్గర దాచేందుకు, నా దగ్గర ఏదీ లేదు. నువ్వు నాలాగే అనుకుంటున్నాను” అన్నాడు.

ఏం చెప్పాలో తెలీక తలదించుకుంది.

“హసంతీ! నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?”

తల అడ్డంగా తిప్పి, తలెత్తి చూసి “ఏమీ లేదు గౌతమ్!” అంది.

గౌతమ్ అక్కడినుంచి లేచి “రా వెళ్దాం!” అన్నాడు.

“వచ్చి పది నిమిషాలు కూడా కాలేదుగా!” అంది.

“పర్లేదు. నేను మీ ఇంటికి వచ్చి చాలాసేపు అయిందిగా!” అని వేగంగా నడుస్తూ వెళ్లిపోయాడు.

యాంత్రికంగా నడుస్తున్న హసంతి ‘దేవుడా! నేనేం చెయ్యాలిప్పుడు. ఏదెలా జరగాలని ఉంటే, అలాగే జరుగుతుంది’ అనుకుని గౌతమ్ వెళ్తున్న వైపు చూసింది. తనని వదిలి ముందుకు వెళ్తున్న గౌతమ్‌ని ఆశ్చర్యంగా చూస్తూ.. పిలుద్దామనుకుని ఆగిపోయింది.

అంతలో వేగంగా బైక్ మీద వచ్చి ఆమె ముందాగాడు కార్తీక్. ఆశ్చర్యంగా, చిరాగ్గా అతని వైపు చూసింది.

“నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా కార్తీక్! నన్ను ఇలా టార్చర్ చెయ్యకు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పాను కదా!” అంది కోపంగా.

“నీ డ్రెస్ చాలా బాగుంది హసంతీ!” అన్నాడు కూల్‌గా.

“నేను సీరియస్‌గా చెప్తుంటే, నువ్వు లైట్‌గా తీసుకుంటావేంటి?” అంది.

హసంతి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, జేబులో నుంచి గులాబీ పువ్వు తీసి ఆమె చేతుల్లో పెట్టి, “నీ డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ఉంటుంది” అని తిరిగి చూడకుండా బైక్ మీద వెళ్లిపోయాడు కార్తీక్.

అదే ఇంకోసారి.. అయితే కార్తీక్ సమయస్ఫూర్తికి, సెన్సాఫ్ హ్యూమర్‌కి పొంగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. దానిని ఎంత చెప్పినా కార్తీక్ అర్థం కావటంలేదు. గౌతమ్ మాటల్లోనే అనుమానిస్తున్నట్టు అన్పిస్తోంది. మనసంతా గజిబిజిగా మారిపోయింది. మౌనంగా ఇంటికి బయలుదేరింది హసంతి.

***

“హసంతీ! హసంతీ! తొందరగా రా! ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం” పిలిచింది కవిత.

“నేను రెడీగా ఉన్నానమ్మా!” అని హాల్లోకి వచ్చింది.

“పద.. పద” అని బయటకు వచ్చి, ఇల్లు తాళం వేయబోతూ “రెండు నిమిషాలు ఉండు” అని కవిత లోపలికి వెళ్ళింది.

హసంతి గేటు లోపలి వైపు నిలబడి రోడ్డు వైపు చూస్తోంది.

సడన్‌గా బైక్ మీద వచ్చిన కార్తీక్ స్టాండేసి, వేగంగా వచ్చి చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప, ప్రసాదం ఉన్న కవరు హసంతి చేతిలో పెట్టి..

“పొద్దున్నే గుడికెళ్లి పూజ చేయించాను. ప్రసాదం తీసుకో. ఐ లవ్ యు” అని వెళుతుంటే.. తల్లి వస్తుందేమోనని భయంగా, కంగారుగా వెనక్కి తిరిగి చూసింది.

వేగంగా కార్తీక్ ఇచ్చిన ప్రసాదం కవర్ పక్కనున్న పూల కుండీలో దాచి పెట్టింది. అప్పటిదాకా అదంతా కలేమో అనుకుంది హసంతి. కానీ కల కాదని కార్తీక్ మళ్ళీ వెనక్కి వచ్చి బైక్ పై స్లోగా వెళుతూ..

“నువ్వు టైం ఇస్తే, చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళొద్దాం” అని ఆమెకే వినిపించేంత మెల్లగా చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు.

‘ఛా! క్షణంలో ఎంత టెన్షన్ పెట్టాడు. అమ్మ చూస్తే..’ అనుకుంది.

‘చూడలేదు గా!’ మనసు మూలిగింది.

“పద వెళ్దాం!” అని వెనకనుండి తల్లి మాట వినిపించగానే, హసంతి కళ్ళు సమీపంలో ఎక్కడైనా కార్తీక్ ఉన్నాడేమోనని వెతికాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here