[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తాను కార్తీక్‍ని ప్రేమించినట్లు, గౌతమ్‍కి భార్యగా నటించేలేనని తల్లికి చెప్పినట్లు, ఆమె తనని బాగా చివాట్లు వేసినట్లు కలగంటుంది హసంతి. మెలకువ వచ్చకా, కలని గ్రహించి స్తిమితపడుతుంది. కార్తీక్ అమెరికా వెళ్ళిపోతున్నాడని తెలిసి బాధపడుతుంది. గౌతమ్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి కన్విన్స్ చేసి కార్తీక్ దగ్గరకు తీసుకువెళ్ళమని అడగాలని నిశ్చయించుకుంటుంది హసంతి. తల్లికి చెప్పి గౌతమ్ ఇంటికి వస్తుంది. చింపిన శుభలేఖల మధ్య కూర్చున్న గౌతమ్‍ని చూసి బాధపడుతుంది. ఏంటి పిచ్చి పని గౌతమ్ అని అంటే, నా ప్రేమ పిచ్చిది, నువ్వు కార్తీక్‍ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపో, నన్నొదిలెయ్ అంటాడు. అతని చేయి పట్టుకుని – చిన్నప్పటి నుంచి నా కోసం ఎన్నో చేశావు, ఒక్కసారి నన్ను కార్తీక్ దగ్గరకు తీసుకెళ్ళు. జీవితంలో ఇంకెప్పుడూ నిన్ను ఏదీ అడగను అని బ్రతిమాలుతుంది. ఎక్కడికి అని విరక్తిగా అడుగుతాడు గౌతమ్. ఎయిర్‌పోర్ట్‌కి తీసుకువెళ్ళమని చెప్తుంది. ఎయిర్‌పోర్ట్‌కి చేరి ఎంట్రన్స్ దగ్గరే ఆగుతారు. ధృతి దగ్గర తీసుకున్న కార్తీక్ మొబైల్ నెంబర్‍కి ఫోన్ చేస్తుంది హసంతి. నేను హసంతిని, ఎక్కడున్నావు అని అడిగితే, నీకు అందనంత దూరంలో ఉన్నాను అంటాడతను. ఎక్కడున్నావో చెప్పమని గట్టిగా అడిగితే, ఇంకో పది నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌లో ఉంటానని చెప్తాడు. నీకోసం వచ్చానని చెప్తుంది. నిన్ను కలవటం నాకిష్టం లేదు అంటాడు. నిన్ను కలవటమే నాకు ఇష్టం అని అంటుంది హసంతి. ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. ఇక చదవండి.]
[dropcap]ప[/dropcap]ది నిమిషాల తర్వాత క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్ దగ్గర దిగాడు కార్తీక్.
అతన్ని చూసి, “గౌతం బయటికి రా!” అంది హసంతి. గౌతమ్ చెయ్యి పట్టుకుని కార్తీక్ ముందుకు వచ్చి నిలబడ్డది.
“హసంతీ! గౌతమ్! మీరేంటి ఇక్కడ?!” అన్నాడు కార్తీక్ ఆశ్చర్యంగా.
అంతే! అతని గొంతు వినేసరికి హసంతి కళ్ళలో నీళ్లు. అది చూసిన కార్తీక్ కళ్ళూ తడయ్యాయి.
ఆ ఆనంద ప్రేమ బాష్పాలు ఇద్దరిలో ఒకేసారి వర్షిస్తుంటే.. అప్పటివరకు అనుభవించిన బాధంతా దూదిపింజలా శూన్యమై ప్రేమాకాశంలోకి ఎగిరిపోయింది.
‘ప్రేమ అనే పరీక్ష రాసి
వేచి ఉన్న విద్యార్థిని
నీ మనసు పలకపైన
నా సంఖ్య చూసినపుడు
నన్ను నేను నమ్మలేదు
నా కనులు నమ్మలేదు’
అని కార్తీక్ మనసులో అనుకున్నాడు.
హసంతి మనసులో కార్తీక్ మనసులో భావాన్ని గ్రహించినట్టు..
‘నమ్ము నమ్ము నన్నూ నమ్ము ప్రియుడా! నన్నూ నమ్ము
నా ప్రేమ నీకే సొంతం’ అనుకుంది.
అది ఒక్క క్షణమే. కార్తీక్ కళ్ళలో నీళ్లు చూడలేక, హసంతి వేలితో తుడవబోతుంటే..
కార్తీక్ వేగంగా వెనక్కి జరిగి
“నువ్వు తుడవాల్సింది నా కన్నీళ్లు కాదు. గౌతమ్ మనోవేదనని. అతనే నీకు సరైన జోడి. ఎందుకంటే నీ జీవితంలో నాతో ప్రయాణం లోకల్ ట్రైన్ ఎక్కినట్టు. కానీ, గౌతమ్‌తో జీవితమనే రైలు చిన్నప్పుడే ఎక్కేశావు.
లోకల్ ట్రైనులో మనం ఏ స్టాపులో కావాలంటే ఆ స్టాపులో దిగిపోవచ్చు. కానీ జీవితమనే రైలులో ఒకసారి ఎక్కితే గమ్యం చేరే వరకూ దిగాల్సిన అవసరమే ఉండదు.
మానసికంగా గౌతమ్ ఊహల్లో నువ్వెప్పుడో అతని సొంతమైపోయావు. అతని హృదయంలో ఏర్పడ్డ వ్యాక్యూమ్‌ని పూర్తి చేయడం నీ బాధ్యత. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను ఇష్టపడ్డానేమో! మన ప్రేమలో ఆవేశం మాత్రమే ఉంది. కానీ గౌతమ్ ప్రేమలో ఆరాధన ఉంది. రెండు కుటుంబాల బంధాలు, అనుబంధాలు ఉన్నాయి. నువ్వు గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటే కృతజ్ఞత పరస్పరం ఎల్లప్పుడూ ఉంటుంది. అది కృతఘ్నతగా మారకుండా, జీవితాంతం తప్పు చేశామనే బాధ లేకుండా చూడాల్సింది నువ్వే. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్.. ఏదీ ఎవరికోసమూ ఆగదు.
నీ తొలిప్రేమను పెళ్లితో గౌతమ్‌కి పంచివ్వు. స్నేహాన్ని ఈ కార్తీక్‌తో పంచుకుంటే.. జీవితాంతం మన ముగ్గురి మధ్య అనుబంధం శాశ్వతంగా ఉంటుంది” అన్నాడు.
హసంతి ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూసింది.
“ఈ మాటలు నీ నోటి నుండే గౌతమ్ వినాలని ఇంత దూరం తీసుకొచ్చాను. ఇంతకాలం నేను ఎంత చెప్పినా అతనికి అర్థం కాలేదు. నిజమైన ప్రేమను స్నేహంగా మార్చుకుంటే శాశ్వతంగా ఉండిపోతుంది” అంది జీరబోయిన కంఠంతో.
“మీ పెళ్లికి ఉంటానేమో అనుకుని, మీ ఇద్దరి కోసం రెండు కపుల్ రింగ్స్ కొన్నాను. మీరు కలవకపోతే వాటిని మీ గుర్తుగా దాచుకోవాలనుకున్నాను. కానీ నన్ను వెతుక్కుంటూ మీరే వచ్చినందుకు థాంక్స్. మీ అభిమానానికి నా చిన్ని బహుమానం.
నిత్యం ఎన్నో వేల మందిని జాతి, మత, కులాతీతంగా ఒకచోట కలిపే ఎయిర్‌పోర్ట్ సాక్షిగా ఈ రింగ్స్ మీరిద్దరూ మార్చుకుంటే.. మీ పెళ్లి చూసినంత సంతోషంతో, అనుభూతితో వెళ్ళిపోతాను” అని ఇద్దరితో ఇద్దరితో రింగులు మార్పింపించాడు కార్తీక్.
హసంతి కళ్ళలోనే కాదు.. ఈసారి గౌతమ్ కళ్ళు కూడా తడయ్యాయి.
“గౌతమ్ విత్ యువర్ పర్మిషన్” అని, ఇద్దరి కళ్ళూ వేలితో తుడిచి, ఇద్దరినీ దగ్గరికి తీసుకొని “విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అని చెప్పి ఎయిర్‌పోర్ట్ లోపలికి వేగంగా వెళ్ళిపోయాడు కార్తీక్.
(సమాప్తం)