Site icon Sanchika

ఫస్ట్ లవ్-4

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ రోజు పొద్దున్నే కార్తీక్ నిద్ర లేచేసరికి, ఫోన్‍లో మేఘన పంపిన పెద్ద మెసేజ్ ఉంటుంది. దాని సారాంశం ఆమె అతన్ని ఇష్టపడుతోందని. అది అతనికి నచ్చదు. ఆ మెసేజ్‌కి ఏం రిప్లై ఇవ్వలా అని ఆలోచిస్తూంటే, డైరక్టర్ రాఘవ ఫోన్ చేస్తాడు. అదే సమయంలో వాట్స‍ప్‌కి ఒక మెసేజ్ కూడా పెడతాడు. కార్తీక్ లాప్‍టాప్‍లో రాఘవ పంపిన మెయిల్ లో షార్ట్ ఫిల్మ్ సినాప్సిస్ చదివి, మిత్రుడు సిద్ధార్థకి ఫోన్ చేసి చెప్తాడు. అతని సలహా మీద, రాఘవకి ఫోన్ చేసి తానా షార్ట్ ఫిల్మ్ చేస్తానని చెప్తాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌కి కార్తీక్ రెండు రోజులు సెలవు పెడితే చాలంటాడు రాఘవ. ఆఫీస్‍కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే మేఘన ఫోన్ చేస్తుంది. తన బండి పాడయిపోయిందనీ, లొకేషన్ పెడతాననీ, వచ్చి పికప్ చేసుకుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. కుదరదంటాడు కార్తీక్. తాను ఆల్రెడీ బయల్దేరననీ, క్యాబ్ బుక్ చేస్తానని అంటాడు. ఫోన్ పెట్టేస్తుంది మేఘన. సాయంత్రం పీ.జీ. పానీపూరి సెంటర్ వద్ద కార్తీక్ మిత్రులకు పార్టీ ఇస్తుంటే అక్కడికి వచ్చిన మేఘన వస్తుంది. మోపెడ్ రిపేర్ అన్నారుగా అని కార్తీక్ అంటే, ఇప్పుడు వేసుకొచ్చినది ఫ్రెండ్ బండి అంటుంది. తన స్నేహితులకు ఆమెను పరిచయం చేస్తాడు. ఆ రాత్రి మరింత స్పష్టంగా, అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు మెసేజ్ పెడుతుంది మేఘన. అయితే తనది ప్రేమ కాదని, స్నేహమేనని, లెటజ్ బీ ఫ్రెండ్స్ అని మేఘనకి రిప్లై ఇస్తాడు. తనే తప్పుగా అర్థం చేసుకున్నాననీ, ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేస్తుంది మేఘన. కార్తీక్ కంపెనీ మారి విప్రోలో చేరుతాడు. ఇక కథ గౌతమ్ వైపు మళ్ళుతుంది. గౌతం తండ్రి రఘురాం తన బాబాయి కూతురు కవితకి ఫోన్ చేసి,  అమెరికా నుంచి గౌతమ్ నెల రోజుల సెలవులో వచ్చాడనీ, కవిత కూతురు హసంతికి, గౌతమ్‍కి పెళ్ళి చేసేద్దామని అంటాడు. మర్నాడు రాత్రి భోజనానికి రమ్మని కవిత చెబుతుంది. చిన్నప్పుడు గౌతమ్, హసంతి ఆడుకునేవారు. కవిత భర్త చంద్రశేఖర్ రోడ్ ఆక్సిడెంట్‍లో మరణిస్తే, రఘురాం ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఒక ఏడాదికి రఘురాం భార్య సంగీత గుండెపోటుతో మరణిస్తుంది. రఘురాం సింగపూర్‍లో ఉద్యోగం రావడంతో కొడుకు గౌతమ్‍ని తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచే కవిత పిల్లల ఆలనా, పాలనా చూసేవాడు. హసంతి, గీతికల చదువుకు డబ్బు పంపేవాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాకా, గౌతమ్‍కి అమెరికాలో ఉద్యోగం వస్తుంది. మూడేళ్ళ తరువాత ఇండియాకి వచ్చిన గౌతమ్ మర్నాడు – హసంతిని కలవబోతున్నాడు. కవిత వాళ్ళింటికి వెళ్ళేముందు తాను చిలుకూరు బాలాజీ టెంపుల్‍కి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తాడు గౌతమ్. కవిత ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం ఏడుగంటలు దాటిపోతుంది. ఇంటికి వచ్చిన రఘురాంని, గౌతమ్‍ని ఆప్యాయంగా పలకరిస్తారు. గౌతమ్‍కి ఎదురుగా కుర్చీలో కూర్చుని అతన్ని పరిశీలనగా చూస్తుంటే – ఆమెకు గతం గుర్తొస్తుంది. ఇక చదవండి.]

[dropcap]హ[/dropcap]సంతి డి.ఎల్.ఎఫ్. క్యాంపస్‌లో జెన్ ప్యాక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాయిన్ అయింది. రెండు నెలల ట్రైనింగ్ పూర్తి చేశాక, ప్రాజెక్టులోకి తీసుకున్నారు.

హసంతితో ఫ్రెండ్స్ అయిన వాళ్లలో మాధురి చాలా క్లోజ్ అయింది.

మాధురి మరో ఇద్దరితో కలిసి రోజు ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌కి టీ తాగుతానికి వెళుతూ, హసంతిని పిలిచింది.

ఆ రోజు వీళ్లు రెస్టారెంట్ లోకి వెళుతుంటే.. ఎదురుగా వస్తున్న ఓ యువకుడు చూసుకోకుండా మాధురికి డాష్ ఇచ్చాడు. కావాలని చేశాడో, యాదృచ్ఛికంగా తగిలాడో తెలియదు. జరగాల్సింది జరిగిపోయింది. అతని చేతిలో ఉన్న వేడివేడి కాఫీ, మాధురి చేతి మీద, డ్రెస్ మీద పడ్డాయి.

కనీసం సారీ చెప్పకుండా ఏం జరిగిందో కూడా చూసుకోకుండా ఫోన్ చూసుకుంటూ.. వెళుతున్న ఆ వ్యక్తిని.. మరో యువకుడు వెనక నుండి వెళ్లి షర్టు పట్టుకుని లాక్కొచ్చి..

“సే! సారీ!” అన్నాడు.

“నేనేం చేశాను.” అన్నాడా వ్యక్తి పొగరుగా.

“ఇటు చూడు” అని మాధురి డ్రెస్ మీద, చేతి మీద పడ్డ కాఫీ చూపించాడు.

“కనీసం ఎదురుగా ఎవరు వస్తున్నారో చూసుకోకుండా ఎలా డాష్ కొడతారు మేడం?” అని అంటున్న ఆ యువకుడితో

“సర్లే! వాళ్ళదే తప్పు. యు గో” అని అతని చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లాక్కున్నాడు.

“హలో ఫోన్ లాక్కుంటావేంటి? నా ఫోన్ నాకిచ్చెయ్” అన్నాడు సీరియస్‌గా.

అంతలో “ఏంట్రా ఏమైంది?” అని అతని ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు.

విషయం చెప్పాడు.

“ఏది ఇలాగివ్వు” అని ఫోన్ తీసుకున్న ఫ్రెండ్ దాన్ని చూస్తూ

“యాపిల్ ఫోన్. చాలా బాగుంది. వాడుకుందాం పదండి” అని ఫ్రెండ్స్ టీ తీసుకెళ్లి ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు.

హసంతికి ఏమీ అర్థం కాలేదు.

డాష్ కొట్టిన యువకుడు “వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్. మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వు. లేకపోతే కంప్లైంట్ ఇస్తాను” అన్నాడు పెద్దగా అరుస్తూ.

ఫోన్ తీసుకున్న యువకుడు – “ఓ.కే బ్రో! ప్రొసీడ్. గివ్ కంప్లైంట్. నేను మహిళా సంఘాలకి, హ్యూమన్ రైట్స్‌కి కంప్లైంట్ ఇస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. అబ్యూజింగ్ కేసు కింద జైల్ కి వెళుదువు గాని” అన్నాడు.

“జరిగిందేదో జరిగింది. ఎందుకండీ. మా గురించి మీరు అనవసరంగా గొడవ పడతారు. ఫోన్ ఇచ్చేయండి” అంది మాధురి.

“ఓకే మేడం! అందరి ముందు మీకు సారీ చెప్తే.. ఈ ఫోన్ మీరే అతని మోహాన పడేద్దురుగాని”

హీరోలా మాట్లాడుతున్న అతన్నే చూస్తోంది హసంతి.

మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుని, “సారీ! అండీ చూసుకోలేదు.” అన్నాడా డాష్ కొట్టిన వ్యక్తి.

మాధురి వెంటనే ఫోన్ ఇవ్వబోతుంటే.. “వన్ మినిట్ బ్రో! ఇంకెప్పుడూ నిజం తెలుసుకోకుండా ఆడవాళ్ళని బ్లేమ్ చేయను అని చెప్పు” అన్నాడు.

అందరి ముందు అదే విషయం చెప్పాడతను తప్పదన్నట్టు.

అక్కడ ఉన్నవాళ్లంతా క్లాప్స్ కొట్టారు.

మాధురి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఆ వ్యక్తి, “అంత సపోర్ట్ చేస్తన్నావు? నీ ఫియాన్సీనా?” అన్నాడు.

“కాదురా! నువ్వు ఎవరో తెలియకుండా నిన్ను బ్రో అనలే.. కాబట్టి షి ఈజ్ అవర్ సిస్టర్!” అన్నాడు ఆ యువకుడు.

“థాంక్స్! భయ్యా” అంది మాధురి.

“మహిళామణులకి సముచిత గౌరవం లభించకపోతే మన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గారు ఊరుకోరు.. అసలే మహిళా రిజర్వేషన్ అమలులోకి రాబోతోంది.”

స్టైల్‌గా తల విదిలించి వెళ్ళిపోతున్న అతని రూపం హసంతిని ఆకట్టుకుంది.

అంతకుముందు ఎప్పుడైనా మాధురితో ఆ రెస్టారెంట్‌కు వచ్చే హసంతి.. ఆ రోజు నుంచి ప్రతిరోజూ, మాధురితో రావడం మొదలు పెట్టింది.

దాదాపు అదే సమయానికి అతనూ ఫ్రెండ్స్‌తో అక్కడికి వచ్చేవాడు.

రోజులు, వారాలు, నెలలు..

దూరం నుండి అతనిని దాదాపు సంవత్సరంన్నర నుండీ గమనిస్తోంది హసంతి. అతను ప్రతిరోజు వచ్చే సమయంలో ఫ్రెండ్స్‌తో కాఫీ తాగటానికి తను వస్తుంది. అతనిని దూరంగా గమనించడం ఆమె దినచర్యలో భాగమైంది. అతని బాడీ లాంగ్వేజ్, హావభావాలు, నవ్వు, డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్, హ్యూమర్ అన్నీ ఆమెకి ఇష్టమే.

కానీ అప్పుడప్పుడు అతను టీ తాగుతూ స్మోక్ చేయటం నచ్చడం లేదు. అది చూసిన మొదటి రోజు రాత్రి డైరీలో – “ధూమపానం హానికరం అని తెలిసి కూడా పొగ పీల్చడం నీ అందమైన రూపానికీ, మళ్లీ మళ్లీ వినాలనిపించే నీ స్వరానికి అపస్వరం” అని రాసుకుంది.

ప్రతిరోజూ హసంతికి అతను కొత్తగానే కనిపిస్తాడు. ఎంత పనిలో ఉన్నా, సరిగ్గా ఆ టైంకి రెస్టారెంట్‌కి అతను వచ్చే సమయంలో ఆఘమేఘాల మీద వచ్చేస్తుంది. కాఫీ సిప్ చేస్తూ ఎవరూ గమనించకుండా ఫోన్ చెవి పక్కన ఉంచుకుని అతన్నే చూస్తుంటుంది. ఒకటి రెండుసార్లు అతను హసంతి వైపు చూశాడు. వెంటనే చూపు మరలచుకుని యాదృచ్ఛికంగా చూపులు కలిసినట్టు ఫోన్లో మాట్లాడుతూ నటించేది.

ఒక్కరోజు అతను రాకపోయినా హసంతి కళ్ళు అతని కోసం ఎదురుచూసేవి. అతను రాకపోతే ఆ రోజంతా మూడ్ అవుట్‌గా ఉండేది.

అతను వచ్చి టీ తీసుకుని ఫ్రెండ్స్‌తో మాట్లాడే వ్యూ కార్నర్ టేబుల్ దగ్గరే పూర్తిగా కనిపిస్తుంది. ఎవరైనా అక్కడ కూర్చుంటే ఖాళీ అయ్యేవరకు నిలబడి కూచుని అతనిని చూడటం హసంతికి అలవాటు.

రెస్టారెంట్ ఓనర్ శ్రీరామ్ హసంతికి ఇంజనీరింగ్‌లో సూపర్ సీనియర్. శ్రీరామ్‌కి కామెడీ సెన్స్ ఎక్కువ. కాలేజీలో ర్యాగింగ్‌లో హసంతి బ్యాచ్‌తో ఓ రేంజ్‌లో ఆడుకుని పాపులర్ అయ్యాడు. అందుకే అతన్ని ‘ర్యాగింగ్ రామ్’ అని పిలిచేవాళ్ళు.

హసంతి జాబ్‌లో జాయినయిన వారం తర్వాత కోలీగ్‌తో రెస్టారెంట్‌కి వచ్చి అక్కడ శ్రీరామ్‌ని చూసి ఆశ్చర్యపోయింది.

“అమెరికా, కెనడా అని బిల్డప్ ఇచ్చేవాడివి. ఇక్కడ రెస్టారెంట్లో రీ ఎంట్రీ ఇచ్చావేంటి” అంది.

“అవును! ఇక్కడే క్లీనర్ జాబ్ దొరికింది”

“అదే నీకు యాప్ట్”

“హమ్మయ్య ఇన్నాళ్ళకి మాటలు నేర్చుకున్నావా!? అసలు నీ గొంతు ఎలా ఉంటుందో మర్చిపోయాను. అవును నువ్వు ఇక్కడ ఏంటి?” అన్నాడు.

ఐ.డి కార్డు చూపించింది

“మరి నువ్వూ?”

“ఈ రెస్టారెంట్ నాదే. సిటీలో ఇంకొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. స్టార్టప్ అంతే”

ఆ రోజు నుంచి హసంతి రాగానే తనూ వచ్చి ఆమెతో కాఫీ తాగుతూ కబుర్లు చెప్తాడు శ్రీరాం.

హసంతి అతని కోసం చూసే ఎదురు చూపుల్ని గమనించిన శ్రీరామ్ ఓ రోజు అడిగాడు.

“అదీ.. అదేం లేదు”

“నేను రోజూ ఎంతోమందిని చూస్తుంటాను. నిజం చెప్పు. ప్రేమించడం తప్పేం కాదు. ఈ వయసులో ప్రేమలో పడకపోవడమే తప్పు. అదో లోపం అని మనోవైద్యులు అంటారు. నీ ఫియాన్సీ చాలా బాగున్నాడు. లవ్వా!?”

“లవ్వు లేదు, జివ్వు లేదు. లేనిపోనివి అంటగట్టకు”

“బిల్డప్ చాల్లే! నేనూ ప్రేమ పిపాసినే. ప్రేమించే పెళ్లి చేసుకున్నా! అతని వివరాలు తెలుసా?! తెలుసుకోమంటావా?” అన్నాడు శ్రీరామ్.

“ఆఁ.. ఆఁ.. ఆ పని మాత్రం చెయ్యకు. ఇప్పుడే వద్దు. ముందు మా అక్కకి పెళ్లి అవ్వాలి. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు” అంది భయంగా.

“నటించకు, నీకు అక్క లేదని నాకు తెలుసు. నేనే మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడుతాను.”

“బాల్ లేదు, బ్యాటు లేదు ఆట పేరు క్రికెట్ అన్నట్టుంది. అసలు మా ఇద్దరికీ పరిచయమే లేదు. అప్పుడే ఇంట్లో చెప్పే వరకు వెళ్లావు” అంది హసంతి.

“ఓ! అదా సంగతి. ఇదేముంది. వెరీ సింపుల్. నేను అతనితో మాట్లాడుతాను. ముందు అతనికి నీ ప్రేమ ఎలా తెలియజేయాలో ఆలోచించు. వస్తా!” అని వెళ్ళాడు శ్రీరామ్.

***

మూడు రోజుల తర్వాత..

హసంతి రెస్టారెంట్ వచ్చినప్పుడు అతను కనిపించలేదు. ఆమె కళ్ళు ఎదురు చూసి చూసీ అలసి పొయ్యాయి. అసహనానికి పరిహారంగా ఒక కప్పు కాఫీ కాస్త రెండయ్యాయి. శ్రీరామ్ కూడా కనిపించలేదు. వెళ్లిపోతుంటే శ్రీరామ్ ఎదురొచ్చాడు.

“ఏంటి వెళ్ళిపోతున్నావ్? ఫియాన్సీ రాలేదా?”

రాలేదన్నట్టు సైగ చేసి చూపించింది.

“ఈ రోజు లీవేమో!”

“ఏమో!”

అంతలో అతను వచ్చేశాడు. హసంతి మోహంలో హాసం ప్రత్యక్షమైంది. వెనక్కి వచ్చి శ్రీరామ్‌తో కలిసి మళ్ళీ కార్నర్ సీట్లో కూర్చొని అతన్ని చూస్తుంటే శ్రీరామ్ ఇద్దరినీ చూశాడు.

***

సో! హసంతి అతనిని సంవత్సరన్నర నుండి ఒరుతలై రాగం అంటే.. అదేనండి! వన్ సైడ్ లవ్.. కమలహాసన్ పుష్పక విమానం సినిమాలో లాగా అతనితో మూకీ లవ్‌లో ఉంది.

***

ఓ రోజు సన్నగా వర్షం పడుతోంది. అలవాటు ప్రకారం అతను వచ్చే సమయానికి హసంతి వచ్చింది.

ఆమె రాగానే శ్రీరామ్ ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. రెండు కాఫీలు వచ్చాయి.

“హసంతీ! నీకో నిజం చెప్పనా! కాలేజీలో నిన్ను చూసిన మొదటి రోజే నీ అందానికి ఫిదా అయిపోయా! ఏం చేస్తాం! అప్పటికే మా మేనమామ కూతురుతో నా ప్రేమ, పెళ్లి రెండూ ఫిక్సయి పోయాయి.”

“ప్చ్ … బాడ్ లక్.” అందొకలా హసంతి.

“ఊఁ.. నీ ఫియాన్సీ రాలేదు. వర్షం పడుతుందిగా రాడేమో”

“హలో! అలాంటి జోస్యం చెప్పకు మహాప్రభో! చూసి 24 గంటలు అయింది” అంది.

“సరే! నేను వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్” అని శ్రీరామ్ వెళ్ళిపోయాడు.

మరో పది నిమిషాలు గడిచినా అతను రాకపోయేసరికి చిరాగ్గా లేచి వెళ్ళబోతుంటే.. ఫ్రెండ్స్‌తో కలిసి అతను వచ్చి టీ తీసుకుని, దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుని కబుర్లు చెబుతున్నాడు.

అతను చెప్పిన జోక్‌కి ఫ్రెండ్ విరగబడి నవ్వుతున్నాడు. అతనే కాదు పక్కన టీ తాగుతున్న వాళ్ళు కూడా నవ్వడం మొదలుపెట్టారు.

వెళ్ళబోతున్న హసంతి వెనక్కి వచ్చి తన సీటులో కూర్చొని, నీకు ఇదేం లహరి రా! బాబూ! అనుకుంది. సరిగ్గా అప్పుడే అతను స్టైల్‌గా తల విదిలించి, చేత్తో తల మీద పడ్డ వర్షం చినుకులు తుడుచుకున్నాడు. కర్చీఫ్ తీసి తలకి కట్టుకున్నాడు. వెంటనే హసంతి సెల్‌ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు పక్కకు తిరిగి సరిగ్గా అతని పిక్ తీసింది.

***

ఆరోజు రాత్రి బెడ్ రూమ్‌లో మంచం మీద బోర్లా పడుకుని సెల్లో అతనిని చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయింది. తర్వాత డైరీ తీసుకుని..

క్షణంలో పుట్టే ప్రాణం

నిజమైనప్పుడు

క్షణంలో వచ్చే మరణం

నిజమైనప్పుడు

క్షణంలో పుట్టే ప్రేమ కూడా

అంతే! నిజమవుతుంది.

“నాలో నువ్వు నిండిపోయావు. నేను నువ్వవుతుంటే, నా మనసు నీదవుతోంది., నేను నీతో పాటు వర్షపు తుంపర్లో తడుస్తున్నట్టుంది. తనువు, మనసు ప్రేమతో తడిసి ముద్దవుతుంటే.. ఇది ప్రేమే అని అర్థమవుతోంది నాకు. నీకు అర్థం అయ్యే రోజు ఎప్పుడొస్తుందో!? వస్తుందన్న ఆశ. నా ప్రేమ ఏడాదిన్నర పసిపాప. నీకు అర్థం అయినా, కాకపోయినా నా ప్రేమ నాకే సొంతం.” అని రాసుకుంది. లేచి లైటార్పి, చీకటి గదిలో ఫోన్ ఆన్ చేసి అతని పిక్నే చూస్తూ నిద్రలోకి జారిపోయింది హసంతి.

***

మరుసటి రోజు ఉదయం యధావిధిగా రెస్టారెంట్‌లో కూర్చుని అతన్ని చూస్తూ కాఫీ తాగుతోంది. అక్కడికి కొలీగ్ మాధురి వచ్చి కూర్చోవటం గమనించలేదు హసంతి.

“ఏయ్! హసంతీ! ఎన్నాళ్ళే ఈ దాగుడుమూతలు. అతనితో మాట్లాడి మేటర్ చెప్పెయ్యి. అబ్బాయిలే ప్రపోజ్ చేయాలన్న రూలేమీ లేదు. పోనీ నీకు సిగ్గయితే చెప్పు ఐ విల్ కాల్ హిమ్. పిలవనా!?” అంది.

“వద్దొద్దు. ఇలానే బాగుంది” అంది చూపు మరల్చకుండా.

“బావుంటుంది నువ్విలా చూస్తూనే ఉండు. వాడిని ఎవరో ఒకరు ఎగరేసుకు పోతారు.” శ్రీరామ్ గొంతు వినిపించి చూపు మరల్చింది హాసంతి.

“నేనూ అదే చెప్తున్నా శ్రీరాం గారూ! ఇలా లాంగ్ వ్యూ నే బాగుందట” అంది మాధురి

అంతలో మాధురి ఫోన్ వైబ్రేట్ అవుతుంటే బయటకెళ్ళింది.

“చూడు హసంతీ! నువ్విలా దూరం నుండి ఎన్నాళ్లు చూసినా ఫలితం శూన్యం. రేపు అందంగా డ్రెస్ చేసుకుని రా! అతని కోసం నీ లవ్ ప్రపోజ్ చేయడానికి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ తీసుకురా! నేనే నిన్ను అతనికి పరిచయం చేస్తాను” అన్నాడు శ్రీరామ్.

“ఇప్పుడు అవసరమా!?!”

“చూడు నువ్వే అందంగా ఉంటావు. నువ్వు మెచ్చిన అందగాడిని నీకు దక్కకుండా మరెవరో ఎగరేసుకు పోకముందే ఆ పని నువ్వే చెయ్యి. ఆపై నీ ఇష్టం” అనే లేచాడు శ్రీరామ్.

ఫోన్లో మాట్లాడి వచ్చిన మాధురి “రా వెళ్దాం!” అనేసరికి అయిష్టంగానే లేచింది హసంతి.

***

ఆరోజు రెస్టారెంట్‌కి రోజూ వచ్చే సమయం కంటే ముందే వచ్చింది. ఎప్పటిలా కాకుండా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని వచ్చింది. శ్రీరామ్ ఆమెను చూడగానే “వావ్” అన్నాడు ఆశ్చర్యంగా. హసంతి చేతిలో ఉన్న ప్యాక్ చూసి “స్పెషలా!?” అని అడిగాడు.

“అవును”

“మనోడు వచ్చేసాడు.” అనగానే హసంతి కళ్ళు అప్రయత్నంగానే రోజు అతను కూచునే వైపు చూశాయి. ఎంత వేగంగా చూశాయో, అంతే వేగంగా వెనక్కి మరలబోతూ ఆగాయి. అతను పక్కనున్న అమ్మాయి భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నాడు. ఆమె కూడా అతని మీద చెయ్యేసింది. వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా క్లోజ్‌గా ఉన్నారు. ఆమె అతనితో సెల్ఫీ దిగాడు. వెంటనే అతన్ని హగ్ చేసుకుని మళ్లీ సెల్ఫీ దిగింది.

ఈసారి హాసంతి కళ్ళు ప్రయత్నంగానే వెనక్కి మళ్ళి శ్రీరామ్ కోసం వెతికాయి. అతను కనబడలేదు. అంతే! హసంతి వేగంగా వెనక్కి తిరిగింది.

(సశేషం)

Exit mobile version