Site icon Sanchika

ఫస్ట్ లవ్-7

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తల్లి ఒత్తిడికి లొంగి గౌతమ్‍తో ఎంగేజ్‍మెంట్‌కి ఒప్పుకుంటుంది హసంతి. నగరంలోని ఓ బాంక్విట్ హాల్‍లో ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది. రెండు వైపులా బంధువులు హాజరవుతారు. అందరి సమక్షంలో గౌతమ్, హసంతి ఉంగరాలు మార్చుకుంటారు. తర్వాత కేక్ కట్ చేస్తారు. ఇద్దరి ఫ్రెండ్స్ ఎంతో సందడి చేస్తారు. భోజనాలయ్యాకా, ఫంక్షన్ హాల్ ఖాళీ చేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరుకుంటారు. ఎప్పుడూ వెళ్ళే ఫేమస్ రెస్టారెంట్‌కి స్నేహితులతో వస్తాడు కార్తీక్. అతని దగ్గరికి వచ్చిన ఆ కేఫ్ ఓనర్ శ్రీరామ్, అతనితో కొంచెం మాట్లాడలని చెప్పి, హసంతి గురించి చెప్తాడు. ఆమె మౌనంగా కార్తీక్‌ని ఆరాధించిన విషయం చెప్తాడు. ఎప్పుడైనా ఆమెను గమనించవా అని అడిగితే, ఒకసారి చూశాననీ, వెంటనే తల దించుకుందని అంటాడు కార్తీక్. పోయిన వారం తనతో మాట్లాడాలని డిసైడైందనీ, అదే రోజు కార్తీక్ మరో అమ్మాయితో క్లోజ్‌గా మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయిందని చెప్తాడు శ్రీరామ్. ఆ అమ్మాయి తన క్లాస్‍మేట్ మృదుల అనీ, తనదీ మృదులదీ కేవలం స్నేహం మాత్రమేనని అంటాడు కార్తీక్. హసంతి వస్తే పరిచయం చేయచ్చా అని అడుగుతాడు శ్రీరామ్. తప్పకుండా చెయ్యచ్చని అంటాడు కార్తీక్. హసంతి కార్తీక్‌కి ఇద్దామని తెచ్చి, వదిలేసిన చిన్న గిఫ్ట్‌ని తెచ్చి అతనికి ఇస్తాడు శ్రీరామ్. ఇక చదవండి.]

[dropcap]గౌ[/dropcap]తమ్ సోఫాలో కూర్చుని సెల్‌ఫోన్‌లో హసంతి పిక్ పెద్దది చేసి చూస్తున్నాడు. ఫ్రెండ్ సుధాకర్ సైలెంట్‌గా వచ్చి సోఫా వెనక నిలబడ్డాడు. గౌతమ్ అతనిని గమనించకుండా తనలో తనే హసంతితో మాట్లాడుకుంటున్నాడు.

“నేను ఊహించుకున్న దానికంటే వాస్తవంలో ఎంతో అందంగా ఉన్నావు హసంతీ! అందీ అందనట్టున్నాయి నీ మాటలు. చిన్నప్పటి నుంచి నిన్నే తలచుకుంటూ 15 ఏళ్లు గడిపాను. నేనంటే నీకూ ఇష్టమే అనుకుంటున్నాను. కలలో కూడా నీ స్థానం మరొకరికి ఇవ్వలేను. నువ్వూ అలాగే అయితే, జీవితాంతం నిన్ను గుండెల్లో దాచుకుంటాను.. దాచుకుంటాను..” అని సెల్ ఫోన్ గుండెల దగ్గర పెట్టుకున్నాడు గౌతమ్.

“నిన్న ఎంగేజ్మెంట్ అయిందో? లేదో? వదినని ఇంటికి తీసుకొచ్చావు కదరా! ఖతర్నాక్‌విరా రా! నువ్వు.” అన్నాడు సుధాకర్.

అంతే! వెనక్కి తిరిగి చూసి సెల్‌ఫోన్ ఆఫ్ చేసి “ముందుకు రా..రా!” అన్నాడు.

“హసంతి ఇంటికి వచ్చిందా?! ఎక్కడ రా! బాబూ!”అన్నాడు గౌతమ్.

ముందుకొచ్చి గౌతమ్ పక్కన కూర్చుని అతని సెల్ ఫోన్ తీసుకొని హసంతి పిక్ పెద్దది చేసి “ఇదిగో ఇక్కడ చూడు” అని చూపించాడు.

“ఓ.. ఇదా!” అన్నాడు.

“ఇంకా ఎంతసేపు ఇలా ఫోన్లోనే చూస్తావురా! ఎల్లెల్లార్ లైసెన్స్ వచ్చిందిగా! రేపు ఔటింగ్‌కి తీసుకెళ్ళరా! బాబూ!”

“ఔటింగా?! ఒప్పుకుంటుందో లేదో”

“సింగపూర్‌లో చదువుకున్నావు. అమెరికాలో జాబ్ చేస్తున్నావు. డేటింగ్, ఔటింగ్‌ల గురించి నీకు నేను చెప్పాలా!?! మాకు నువ్వు చెప్పాలి గానీ..”

“అది.. అది.. ” అని గౌతమ్ నీళ్లు నములుతుంటే..

“ఫోన్లో చెప్పి ప్రోగ్రాం ఫిక్స్ చెయ్యరా!” అన్నాడు సుధాకర్.

“తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు రా!”

“!?..!?…!?” గౌతమ్ వైపు వింతగా చూసాడు సుధాకర్.

“ఎందుకురా! అంత ఆశ్చర్యం?!” అన్నాడు గౌతమ్ చిన్నబుచ్చుకున్నట్టు.

“మచ్చా! నువ్వేం మారలేదు రా! నిన్ను అమెరికా పంపినా, సింగపూర్ పంపినా నువ్వు చిన్నప్పటి శుద్ధ పప్పు లాగే ఉన్నావు.”

“నేను అంతే రా?!”

“అసలు నువ్వే కాలంలో ఉన్నావు రా! ఏ కంట్రీలో ఉంటున్నావో తెలుస్తోందా? ఆమె కోసం యాపిల్ ఫోన్ తెచ్చానన్నావు. ఎంగేజ్మెంట్‌లో ఇస్తా అన్నావు! ఇవ్వలేదా?”

“ఆ.. అవకాశమే రాలేదు రా! అంతా బిజీ బిజీ..”

“అంటే మొదటిసారి కలిసినపుడే ఇద్దామని అనుకున్నాను. ఆమె ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తను మూడీగా ఉందనిపించింది.”

“రేయ్ పోరా! హసంతి నీ అత్త కూతురు రా! మగాడివి నువ్వే చొరవ తీసుకోవాలి. 10 ఏళ్ల తర్వాత నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఆమెలో కాస్త సిగ్గు, బిడియం ఉండటం సహజం. నువ్వే అమ్మాయిలా ముడుచుకు పోతుంటే, ఆ అమ్మాయి చొరవేం చేస్తుంది రా! అమ్మాయి రిజర్వ్‌డ్ గా ఉండక, వచ్చి ఒళ్ళో వాల్తుందా!” అన్నాడు సుధాకర్.

“మరి ఇప్పుడు ఏం చేయాలి? రా!”

“నెక్స్ట్ ఫ్లైట్లో అమెరికాకి పేకప్పవ్వరా!”

“జోకులు ఆపరా! బాబూ! నేను ఇక్కడ ఉండేది నెలరోజులే. అప్పుడే కౌంట్ డౌన్ మొదలైంది”

“మీ అత్తగారికి ఫోన్ చేసి హసంతి నెంబర్ అడుగు”

“అవన్నీ వర్కౌట్ అవ్వవు లేరా! ఇంకేదైనా ఐడియా చెప్పు” అన్నాడు గౌతమ్.

సుధాకర్ ఆలోచిస్తుంటే..

“రేయ్ ఎవరో ఎందుకురా! మా నాన్న దగ్గరే హసంతి నెంబర్ ఉంది. నిన్న ఇంటికి వచ్చాక ఆమెతో మాట్లాడాడు”.

“మరి ఇంకేంటి రా! అంకుల్‌కి కాల్ చెయ్యి”

అంతలో గౌతమ్ కి తండ్రి రఘురాం ఫోన్ చేశాడు.

“చెప్పు డాడీ!”

“హసంతి నీకు మనస్ఫూర్తిగా నచ్చిందా?!” అన్నాడు.

“ఇప్పుడెందుకొచ్చిందా డౌటు? ఇంతకాలం ఎప్పుడూ నువ్వు ఇలా అడగలేదు కదా!”

“అప్పుడు వేరు. 15 ఏళ్ల క్రితం ఏదో మీ అమ్మ ఆశ పడ్డది. అప్పటి పరిస్థితి వేరు. ఈ మధ్యకాలంలో మీరిద్దరూ చూసుకున్నది లేదు. అఫ్‌కోర్స్ నువ్వు ఇక్కడ లేవనుకో. హసంతితో నువ్వు ఫోన్లో కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఇలా సడన్‌గా వచ్చి ఎంగేజ్మెంట్ అంటే ఒప్పుకోవడం మీ అత్తయ్య, హసంతిల గొప్పతనం. హసంతి మనసులో భావాలేంటో!?, నీ మీద తన అభిప్రాయం ఏంటో? తెలియవుగా! నిన్న సపరేట్‌గా మాట్లాడినప్పుడు నీతో ఏమైనా చెప్పిందా? ఇద్దరి భావాలు కలిసేలా ఉన్నాయా? నీతో తను ఫ్రీగా మాట్లాడిందా? నేను మీ నాన్నగా అడగటం లేదు. ఓ స్నేహితుడుగా అడుగుతున్నాను” అన్నాడు.

“అవును డాడీ! మనం సడన్‌గా వెళ్లి పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అనగానే షి మే నాట్ బి ఓపెన్ అప్. పదేళ్ళ తర్వాత కలిసి ఏం మాట్లాడుతాం. అదీ మొదటిసారి కలుసుకున్నప్పుడు.”

“నువ్వే చొరవ తీసుకొని మాట్లాడించు. బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళు.” తండ్రి సలహా ఇచ్చాడు.

“థాంక్యూ డాడీ! నా దగ్గర హసంతి సెల్ నెంబర్ లేదు.”

“అదేంట్రా గౌతమ్! తనకోసం ఫోన్ తెచ్చావు కదా! ఇవ్వలేదా?”

“ఇచ్చే అవకాశం ఆమె ఇవ్వలేదు”

“భలే పిల్లలు రా మీరు! నీకు హసంతి ఫోన్ నెంబర్ పంపుతాను. మాట్లాడు” అని ఫోన్ కట్ చేశాడు.

వెంటనే హసంతి నెంబర్ పంపాడు గౌతమ్ తండ్రి.

“ఇదిగోరా! హసంతి ఫోన్ నెంబరు డాడీ పంపించారు”.

“మరింకేంటి! మచ్చా! కుమ్మెయ్.” అన్నాడు సుధాకర్.

“ఏమోరా! ఆమెవి చాలా స్థిరమైన అభిప్రాయాలుగా అనిపిస్తున్నాయి. పాలరాతి శిల్పంలా ముందు నిలబడ్డ ఆమెతో చెప్పాలనుకున్నవన్నీ చెప్పలేకపోతున్నాను. మర్చిపోతున్నాను”.

“నువ్వే అలా అంటే ఆ అమ్మాయి ఎలా చెప్తుంది రా! ముందు ఫోన్ చేసి మాట్లాడు. ఈరోజు సాయంత్రం బయటికి వెళ్దామని ప్రోగ్రాం చెప్పు. ఆమెకి ఇస్తానన్న ఫోను ఇవ్వటం మర్చిపోకు” అన్నాడు.

“అలాగే రా!”

“ఓ.కే మరి నేను వెళ్తాను. బి పాజిటివ్. ఆల్ ది బెస్ట్” అని సుధాకర్ వెళ్ళిపోయాడు.

***

హసంతి హాల్లో కూర్చుని టీ.వీ. చూస్తోంది. గీతిక వచ్చి పక్కన కూర్చుంది.

“ఏంటే అప్పుడే వచ్చావు? కాలేజీకి వెళ్లలేదా?”

“ఈ రోజు సండే తల్లీ! ఎంగేజ్మెంట్ అయిన దగ్గర్నుంచి నీకు తేదీలు వారాలు గుర్తు ఉండట్లేదు”

హసంతి బ్లాంక్‌గా చూసింది.

ఇంతలో హసంతి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. ఆమె కంటే ముందే గీతిక ఫోన్ తీసి చూసింది.

“అక్కా! గౌతమ్” అని ఇచ్చింది.

“ఏయ్ నా ఫోన్ ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు” అని విసుగ్గా ఫోన్ తీసుకొని చూసింది.

“హాయ్! హసంతీ! ఈరోజు సాయంత్రం బయటికి వెళ్దామా!”

చూసి ఫోన్ పక్కన పడేసింది.

“ఏంటక్కా! బావ వస్తున్నాడా?”

“కాదు.. బయటికి రమ్మంటున్నాడు”

“ఏంటి తనే రమ్మంటున్నాడుగా! అందులో సండే హ్యాపీగా వెళ్ళి రా!”

“నాకు ఇష్టం లేదు.”

ఫోన్‌కి మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఈసారి హసంతే చూసింది.

“సే.. ఎస్ ఆర్ నో”

హసంతి ఫోన్ గట్టిగా పట్టుకుని “అబ్బా! ఏంటే ఈ టార్చర్. సండే కూడా ఇంట్లో ఉండకూడదా” అంది.

లోపలి నుంచి తల్లి “గీతికా! ఇంకా కాలేజీకి వెళ్లలేదా” అంది.

“ఏంటమ్మా ఇంట్లో అందరూ కలిసి సండే కూడా నన్ను కాలేజీకి పంపేట్టున్నారే” అంది.

“అవునే.. ఇవ్వాళ ఆదివారం కదా!”

“అమ్మా! గౌతమ్ అక్కని బయటికి రమ్మంటుంటే.. ఇదేమో వెళ్ళదట.”

చెల్లెలు వైపు సీరియస్‌గా చూసి “నిన్ను అమ్మ అడిగిందా!” అంది.

“అడగక్కర్లా! నీ చెల్లెలుగా అమ్మకి చెప్పటం నా కనీస బాధ్యత అక్కా! నువ్వు ఎలాగూ చెప్పవుగా” అంది గీతిక.

“నిన్నూ..” అని పట్టుకుపోయింది కోపంగా హాసంతి.

“చూడక్కా! గౌతమ్ పిలుస్తుంటే నువ్వు వెళ్ళనంటున్నావు. నేనేమో ఎవరు పిలుస్తారా! అని ఎదురు చూస్తున్నాను. నేను నీ స్థానంలో ఉంటే ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోను”

అంతలో లోపలి నుంచి తల్లి వచ్చింది.

“ఇందులో నువ్వు భయపడటానికి ఏముంది హసంతీ! గౌతమ్ ఇండియాలో నెలరోజులే ఉంటాడు. నిర్భయంగా వెళ్ళు. వస్తానని మెసేజ్ చెయ్యి” అంది.

“……….”

“ఎంగేజ్మెంట్ అయ్యాక సంకోచిస్తావేంటి? ధైర్యంగా వెళ్ళు” అంది తల్లి కిచెన్ లోకి వెళ్తూ.

తల్లి వెళ్ళాక హసంతి ఫోన్ తీసుకున్న గీతిక గౌతమ్‌కి మెసేజ్ పెట్టింది.

ఐదు నిమిషాల్లో ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేసిన మెసేజ్ వచ్చింది.

హసంతికి మెసేజ్ ఫోన్లో చూపించి, ఫోన్ ఇచ్చి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గీతిక.

“ఛా!” అని విసుగ్గా ఫోన్ పక్కన పడేసింది హసంతి.

***

 అయిష్టంగానే గౌతమ్‌ని కలవడానికి బయలుదేరింది హసంతి. ఆమెకి అనేక అనుమానాలు. బయటికి తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? అబ్బాయి అమెరికా కదా! విదేశీ కల్చరేమో! కానీ చూడటానికి అంత సీన్ లేదనిపిస్తోంది! క్లబ్బు, పబ్బు అంటాడో, లేకపోతే గుడి, పార్కు అంటాడో! అసలు గౌతమ్‌లో బాల్యపు లక్షణాలు ఇంకా పోలేదనిపిస్తోంది. మాటతీరు, మనిషి తీరు చూస్తే నాకు చిన్నప్పటి గౌతమే గుర్తొస్తున్నాడు. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయే తత్వం ఇంకా అతనిని వదిలిపోలే పోలేదనిపిస్తోంది. అబ్బాయిలు కమాండింగ్‌గా ఉండాలి. కానీ కాంప్రమైజింగ్‌గా ఉంటే తనకు అసలు నచ్చదు. ఇప్పుడు నచ్చినా, నచ్చకపోయినా చేయగలిగింది ఏమీ లేదు. ఎంగేజ్మెంట్ కూడా తన ప్రమేయం లేకుండానే అయిపోయింది. ఇహ కాంప్రమైజ్ అయ్యే సీనులో నటించటం నా వంతు అవుతుందేమో! నా జీవితానికి నేను రాసుకోదలచుకున్న అడ్రస్ ఇంత తొందరగా మారిపోతుందని కలలో కూడా అనుకోలేదు. ఆలోచిస్తుంటేనే గౌతమ్ పెట్టిన లొకేషన్ దగ్గర క్యాబ్ ఆగింది.

***

సాయంత్రం ఐదు:

గౌతమ్ షేర్ చేసిన లొకేషన్‌కి వచ్చింది హసంతి. ఎంట్రన్స్ లోనే ఆమెని రిసీవ్ చేసుకున్నాడు.

“థాంక్స్ ఫర్ కమింగ్” అన్నాడు.

నవ్వాలి కాబట్టి నవ్వి, థాంక్స్ అనాలి కాబట్టి “థాంక్స్” అంది. ఇద్దరూ లోపలికి వెళ్లి ఓ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరి మధ్య మౌనం. అయిదో నిమిషం దాటాక “వస్తావని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థాంక్స్” అన్నాడు గౌతమ్.

“అలా ఎందుకు అనుకున్నావు గౌతమ్. నేనూ ఇలా కలుస్తానని అనుకోలేదు. థాంక్స్ ఫర్ కాలింగ్!” అంది.

అంతలో బేరర్ వచ్చాడు. మెనూ చూస్తూ “వాట్ డు యు వాంట్” అన్నాడు.

“ఎనీథింగ్ ఓకే ఫర్ మి”

“కాల్ మీ గౌతమ్” అన్నాడు. మౌనంగా అతని వైపు చూసి

“కాఫీ” అంది.

“ఓ.కే. రెండు కాఫీ” అన్నాడు బేరర్‌తో.

మళ్లీ మౌనం. ఫోన్లో మెసేజ్ చూస్తున్న హసంతితో

“స్పీక్ సంథింగ్” అన్నాడు.

“యాఁ.. అసలు నేను..”

అంతలో గౌతమ్ ఫోన్ రింగ్ అయింది. తీసి చూసి, ఆఫీస్ కాల్, “వన్ మినిట్” అని పక్కకెళ్ళాడు. 15 నిమిషాలైనా గౌతమ్ రాలేదు.

హసంతి లేచి గౌతమ్కి కొద్ది దూరంలో నిలబడ్డది. మాటలు వినిపిస్తున్నాయి

“……….”

“ఒ.కే. థాంక్యూ”అని వచ్చాడు. ఆమె కోసం అతని కళ్ళు వెతుకుతుంటే మౌనంగా వచ్చి కూచుంది.

“జస్ట్ వాష్ రూం” అంది.

“ఓ.కే. కాఫీ చల్లారి పోయినట్టుంది. మళ్లీ ఆర్డర్ చేస్తా అని బేరర్‌ని పిలిచాడు.

“వద్దు.. నేను ఓ ఫంక్షన్‌కి వెళ్ళాలి. ఇంకోసారి కలుద్దాం” అని లేచింది.

“అర్జెంట్ ఆఫీస్ కాల్. మనం టైం స్పెండ్ చేద్దామని వస్తే ఇలా టైం వేస్టయింది. సారీ!” అన్నాడు.

“నో.. ప్రాబ్లం సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంటాయి. ఓ.కే. వెళ్తాను” అని వెళ్ళబోతుంటే..

“ఎక్కడో చెప్తే.. నేను డ్రాప్ చేస్తాను” అన్నాడు.

“వద్దు. నేను, ఇంకో ఫ్రెండ్ క్యాబ్‌లో వెళ్తాం” అని వెళ్ళింది.

హసంతికి ఇద్దామని తెచ్చిన గిఫ్ట్ ఫోన్ అతన్ని వెక్కిరిస్తున్నట్ట నిపించింది. ఆమెకిద్దామని మెయిన్ గేట్ వరకు వచ్చాడు. ఆ లోపలే హసంతి క్యాబ్ ఎక్కేసింది.

క్యాబ్ నుండి హసంతి చెయ్యూపింది. నిస్సహాయంగా తనూ చెయ్యూపి ఆమె వెళ్లిన వైపే చూస్తుంటే.. అంతలోనే క్యాబ్లో హాసంతి వెనక్కి తిరిగి వచ్చింది.

“ఏంటి? హసంతీ!” అన్నాడు కంగారుగా.

“ఇందాక మనం కూర్చున్న చోట నా వేలెట్ మర్చిపోయాను” అంది.

గౌతమ్ గబగబా కూర్చున్న టేబుల్ దగ్గరకి వెళ్లి చూశాడు. వాలెట్ కోసం వెతుకుతుంటే కౌంటర్‌లో కూర్చున్న వ్యక్తి పిలిచి “ఇదేనా?” అన్నాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన హసంతి “ఆ.. ఇదే ధాంక్యూ” అంది తీసుకుంటూ.

“ఓ.కే. గౌతమ్ వస్తాను” అని వెళ్ళిపోయింది.

మళ్లీ ఆమెకి ఫోన్ ఇవ్వటం మర్చిపోయినందుకు మరోసారి ఫీల్ అయి బయలుదేరాడు గౌతమ్.

(సశేషం)

Exit mobile version