[box type=’note’ fontsize=’16’] “సింహప్రసాద్ 63 బహుమతి కథానికలు” అనే కథాసంపుటి 6 మే 2018న ఆవిష్కరించబడుతున్న సందర్భంగా ఆ పుస్తకానికి తను వ్రాసిన ‘ముందుమాట’ని పుస్తక పరిచయంగా సంచికకి అందిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]
[dropcap]మొ[/dropcap]హమాటం కొద్దీ, మిత్రధర్మం కొద్దీ అనుకోకుండా నాలుగైదు పత్రికలకు కథాపోటీ న్యాయనిర్ణేతగా వుంటూ వస్తున్నాను. ఏ పోటీలో చూసినా, తప్పకుండా కనిపించే కథకుల పేర్లలో సింహప్రసాద్ పేరు ఒకటి. గత ఏడాది బహుమతి తీసుకున్నారు కాబట్టి పక్కన పెట్టేద్దాం అనుకుంటాను. అదే సమయంలో ఇంకా రెండు, మూడు పత్రికల్లో బహుమతులు అందుకున్నారు కాబట్టి వేరే వాళ్ళకు ఇద్దాం, ఇతడ్ని పక్కనబెడదాం అనుకుంటాను. సింహప్రసాద్ కంటే కించిత్ మెరుగైన కథ వుంటే ఇచ్చేద్దాం అనుకుంటాం. కానీ మా ఆశలన్నీ వమ్ము చేస్తూ, ఎవరికి ఏమాత్రం సందు ఇవ్వకుండా అన్ని బహుమతులు తనే కొట్టేయడం, గత కొన్నేళ్ళుగా నేను చూస్తూనే వున్నాను.
ఇంకా నేను ప్రత్యేకంగా గమనించిందేమిటంటే, ఆయన చిన్నా చితక భేదం లేకుండా ఎక్కడ పోటీ ప్రసక్తి కనిపిస్తుందో, వెంటనే కథ పంపించేయడం ఆయనకు అవాటయిపోయింది. పోటీ కోసం కథలు రాస్తున్నారా? రాశారు కాబట్టి పోటీకు పంపిస్తున్నారా? అర్థం కాదు. ఎక్కడకు పంపినా బహుమతి రావడం ఎలా జరుగుతున్నదని అనుమానించే వాళ్ళున్నారు. నిర్వాహకులను మేనేజ్ చేసుకుని బహుమతులు తెచ్చుకుంటున్నారని ఏడిచేవాళ్ళు కూడా వున్నారు. నేను వాళ్ళందరికి సవినయంగా మనవి చేసేదేమిటంటే, దయచేసి సింహప్రసాద్ కథలు చదవండి అని.
ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద ర్యాంక్ తెచ్చుకుని మంచి ప్లేస్‌మెంట్స్ సంపాదించుకుని అమెరికా వెళ్ళి బాగుపడాలి. అంతే తప్ప సేవాభావం, పరోపకార చింతన అవసరం లేదని విద్యార్థులను బెదిరించిన ప్రిన్సిపాల్ చివరకు మంచి గుణపాఠంతో తన ‘దృక్పథాన్ని’ మార్చుకుంటాడు. కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటియన్లను తయారుచేసే లెక్కల మాష్టారుకు, చిన్నప్పుడు చదువుకున్న స్కూలు నుండి సన్మానానికి పిలుపు వస్తుంది. అక్కడ తనను లెక్కల్లో ప్రవీణుడిగా చేసిన గురువుగారు, స్వయంగా శిష్యుడికి సన్మానం చేసి ‘కార్పొరేట్ ధన వ్యామోహంలో నుండి బయటపడమని, మరో రామానుజన్ కమ్మని’ హితబోధన చేయడాన్ని ‘పరబ్రహ్మ’లో చూడవచ్చు. ఈ కథలు ప్రాథమిక విద్యలో, ఉన్నత విద్యలో చోటుచేసుకుంటున్న అలసత్వాన్ని, అవాంఛనీయ ధోరణులను తెలియజేస్తాయి.
మనిషి బతకాలంటే పోరాటం చేయక తప్పదు. తిండికి లేని కుర్రాడి బాధలు వేరు. మంచిరోజులు వస్తాయని ఎదురు చూసే చిరుద్యోగి కథ వేరు. దొంగ అనే ముద్ర చెరిపేసుకోవడానికి వెట్టిచాకిరిలో మునిగిపోయిన వాడి కథ మరొకటి. బతకాలంటే పరిస్థితులతో పోరాడక తప్పదని, తనకు పెట్టిన పరీక్షలో నెగ్గిన యువకుడి కథే ‘సాహసం చేయరా డింభకా’.
మంచితనానికి – మానవత్వానికి రోజులు కావని మూడు కథల్లో తెలియజేస్తే, మంచిని – మానవత్వాన్ని నమ్ముకుని తమ వంతు సేవను అందజేస్తున్న కరుణామూర్తులు ఏడు కథల్లో కనిపిస్తారు. స్థూలంగా కథావస్తువు ఒకటే అయినా, వాటిని వివిధ కోణాల్లో చిత్రీకరించడంలోనే రచయిత గొప్పతనం కనిపిస్తుంది. ఉద్యోగాల పేరిట, అమెరికా పేరిట దూరమై పోయిన కొడుకు, ముసలి తల్లిదండ్రులు ఎప్పుడు చస్తారా, ఆస్తి ఎలా స్వంతం చేసుకుందామా అని ఆలోచించేవారున్నారు. అది గమనించిన ఆ ముసలివాళ్ళు సామాజిక సేవకు అంకితమైన తీరును మరికొన్ని కథలు వివరిస్తాయి. ఇవన్నీ కుటుంబ సంబంధాలలో చోటు చేసుకుంటున్న మార్పును, వ్యాపారధోరణిని, అమానవీయతను తెలియజేస్తాయి.
ఒక బిల్డర్, అవినీతి ఆఫీసర్ల మీద రాసిన ‘నేల, విలువ-విలువలు, వంశవృక్షం’ కథలు తప్పకుండా చదవాల్సిన కథలు. వీటిని వైవిధ్యభరితంగా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. డబ్బుకోసం, తన స్వార్థం కోసం ఉమ్మడి కుంటుంబాన్ని చెల్లాచెదురు చేసిన ఒక ఇంజినీరింగ్ కాలేజి ప్రొఫెసర్, తమది ఉమ్మడి కుటుంబం అని బహిరంగసభలో గొప్పలు చెప్పుకోవడం, అది విన్న టీవీ ఛానెల్‌వాళ్ళు చూస్తామని చెప్పడంతో ఇరుకున పడతాడు. ఒకరోజు షూటింగ్ కోసం అందర్నీ కలిసున్నట్లు నటిద్దామని పిలిచినా, అక్కడ వారి మధ్య ఉన్న విభేదాలు బయటపడతాయి. అందరు కలిసినట్లుగా కనిపించినా, ఎవ్వరిలోను ప్రేమానుబంధాలు వున్నట్లుగా కనిపించవు. కనీసం ఒక రోజయినా కలిసున్నట్లు నటించలేకపోయారని టీవీ ఛానెల్‌వాళ్ళు గుర్తిస్తారు.
‘‘మోడల్’ కథలో జీవితం పట్ల విరక్తి చెంది మోడల్‌గా మారిన లంబాడీ యువతి, ఆమె చిత్రం గీసి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన చిత్రకారుడు. ఇద్దరిలో చిత్రకారుడి నీచత్వాన్ని, మోడల్ నిరాసక్తతను, ఆమె గొప్పదనాన్ని ఈ కథ తెలియజేస్తుంది. ‘పొగమేడు’ కథలో భార్య ఆత్మహత్య చేసుకుంటే అంతా భార్యను ఉత్తమురాలిగా, భర్తను హంతకుడిగా ఇంటా`బయటా చిత్రీకరిస్తారు. అది ఆత్మహత్య కాదు, గుండెపోటు వల్ల చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు వచ్చినా, ఏదో గోల్‌మాల్ చేశాడంటారే తప్ప అతని నిర్దోషిత్వాన్ని నమ్మరు. ఇక ‘అల్పమానవుడు’ కథలో డబ్బు, పలుకుబడిగల వ్యక్తి పల్లెటూర్లో పెళ్ళికి వస్తే విఐపిగా ట్రీట్ చేస్తారు. అతడు అక్రమార్జనలో ఆస్తులు పోగేశాడని, పెద్ద అవినీతిపరుడని తెలిసినా అంతా పోటీలు పడి మర్యాదలు చేస్తారు. ఈ రెండు కథల్లో లోకరీతిని తెలియజేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది.
స్త్రీల శక్తి సామర్థ్యాలను గుర్తించిన రచయిత వారిని ఆత్మవిశ్వాసంగల స్త్రీలుగా తన కథల్లో చిత్రీకరించిన విధానం బాగుంది. ఫైర్ ఫైటర్‌గా కూడా స్త్రీలు రాణించగరని నిరూపించిన సీత ఒక ‘యోధ’. ‘ఫీనిక్స్’ కథలో భార్యాపిల్లల్ని వదిలేసి ఒక బడా నిర్మాత, సీనియర్ నటిని పెళ్ళి చేసుకుంటాడు. వాడి దయాధర్మాలను ఆశించక భార్య స్వశక్తితో తన కాళ్ళమీద తాను నిలబడి, ఉన్నతస్థాయికి ఎదిగి వాడ్ని దిగ్భ్రాంతపరుస్తుంది. ‘ప్రతిధ్వని’లో పోలీసులు సి.ఎం. ఇంటి చుట్టూ వున్న రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో, తన ఇంటికి ఎలా వెళ్ళాని అనన్య పోలీసుల్ని ప్రశ్నిస్తుంది. వారు సమాధానం చెప్పకపోగా, ఆమెపై లాఠీ ఝుళిపిస్తారు. అరెస్టు చేసి జైల్లో పెడతారు. చిత్రహింసలకు గురిచేస్తారు. ఇది మీడియాకు చేరి కోర్టు కెక్కడంతో, న్యాయమూర్తి నిజానిజాల్ని గుర్తించి, దీనికంతా కారణమైన వాళ్ళపై చర్య తీసుకోవాల్సిందిగా తీర్పునిస్తాడు. అమ్మాయిలను ఆడ బొమ్మల్లా భావించే అధికారులకు తగిన గుణపాఠం చెప్పిన ‘ఓ సీత కథ’ వుంది. ఉద్యోగరంధిలో పడిపోయి భార్యను అబార్షన్ చేసుకోమన్న భర్త మాటను కాదని, పిల్లాడ్ని కనడానికే నిశ్చయించుకున్న భార్య మరో కథలో కనిపిస్తుంది.
‘తల్లీ నిన్ను దలంచి’ కథలో ఒక పేదరాలు డబ్బుకోసం సరోగేట్ మదర్‌గా తయారవుతుంది. కన్న తర్వాత ఆ విదేశీయులు పిల్లవాడ్ని వదిలేసిపోతే, ఆ పేదరాలే పెంచుకోవడానికి ముందుకొస్తుంది. ఈ కథలన్నీ స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదనీ, వారి జీవితాలను వారే చక్కదిద్దుకునే నేర్పు సామర్థ్యాను కలిగివున్నారనే తెలియజేస్తాయి. మిగతావాళ్లకు మార్గదర్శనంగా కనిపిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు. ‘పురుషుడు’ కథ మరో ఎత్తు. మగవాడ్ని గుడ్డిగా నమ్మడంలోనే ఆడదాని జీవన విధ్వంసం దాగివుందని నిరూపించిన కథ ఇది. స్త్రీవాదం పేరుతో కవయిత్రిని రెచ్చగొట్టి, ట్రాప్ చేసి సహజీవనం పేరుతో ఆమెను మోసగించిన ఉద్యమకారుడి కథ ఇది. ఆడదాన్ని మోసగించడానికి రకరకాల ఉచ్చులు మగాడి దగ్గర వుంటాయని తెలుసుకోకపోతే అంతే మరి. ఏ వాదాలు, ఏ ఉద్యమాలు ఆమెను కాపాడలేవని గుర్తించాలి. అలాగే అంటరానితనం మీద వచ్చిన ‘గబ్బిలం’ కూడా గొప్పకథగా నిలిచిపోతుంది.
ఒకే వస్తువును తీసుకుని వివిధ రకాలుగా రాయడం సింహప్రసాద్ ప్రత్యేకత. ఒక కథకు మరో కథకు పోలిక ఉండదు. దేనికి దాన్ని వైవిధ్యభరితంగా చిత్రీకరించడం వారికే చెల్లింది. ఉదాహరణకు ‘గోవు’ను ఇతివృత్తంగా తీసుకుని అవినీతి హిందూ ఆఫీసర్ దృష్టితో ఒక కథ, పాపభీతికల ముస్లిం బస్ డ్రైవర్ కోణంలో చిత్రీకరించిన కథను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే భార్య మీది కోపంతో భర్త తొందరపడితే ఏమవుతుంది? భర్త మీది కోపంతో భార్య తొందరపడితే ఏమవుతుంది? అని ఇద్దరి దృక్పథాలతో విడివిడిగా రాసిన రెండు కథలో మంచి సందేశముంది. ముఖ్యంగా ‘మనసా తొందరపడకే’ కథలో – భార్యాభర్తల మధ్య కలహాల్ని, స్త్రీవాదం పేరిట నాశనం చేసుకోవద్దు. వారి వారి చదువుల్ని, హోదాల్ని, పదవుల్ని పక్కనబెట్టి స్నేహితుల్లా మాట్లాడుకుంటే మబ్బున్నీ విడిపోతాయని చెప్పే అమ్మమ్మలు ఇప్పుడు లేరు. వీటితోపాటు ప్రపంచీకరణ ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల గురించి తెలియజేసిన కథలున్నాయి.
అలాగే ప్రపంచీకరణ రైతుల జీవితాలలో తెచ్చిన మార్పును రెండు కథలు వివరిస్తాయి. రోజు రోజుకు అప్పు ఊబిలో కూరుకుపోవడం కంటే, పంట విరామం ప్రకటించాలని రైతులు తీసుకున్న నిర్ణయం ఒక కథలో కనబడితే – ప్రపంచీకరణ ప్రభావం వల్ల రైతు, కూలీగా మారుతున్న వైనాన్ని ఇంకో కథ తెలియజేస్తాయి. ఇలా ఏ కథ తీసుకున్నా అన్ని విషయాలను కవర్ చేస్తూ, పూర్తి సమాచారాన్ని రచయిత అందజేయడం విశేషం. మామూలు ఇతివృత్తాన్ని కూడా సమకాలీన సమస్యలు, సంఘటనలు జోడించి, వైవిధ్యంగా తీర్చిదిద్దడంలోనే రచయిత ప్రతిభ కనిపిస్తుంది.
ఈ సంపుటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో బహుమతి పొందిన కథలున్నాయి. విశేష బహుమతి, ఉత్తమ బహుమతి, ప్రత్యేక బహుమతి, కన్సోలేషన్ బహుమతి పొందిన కథలు కూడా ఉన్నాయి. ఇతివృత్తానికి సంబంధించి సమకాలీన సమస్యను చిత్రీకరించిన కథలు ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు హాస్యకథలు, హాస్యవ్యంగ్య కథలు, సాహసకథలు, క్రైం కథలతో పాటు ‘ఇష్టమైన ఇతివృత్తాన్ని’ ఎంచుకుని బహుమతి పొందిన కథ కూడా ఉంది. ఏ కథ రాసినా ఆద్యంతం ఉత్కంఠభరితంగా చదివింపజేసే శైలి రచయిత స్వంతం. ఇన్ని ఉత్తమకథలను లేదా బహుమతి పొందిన కథలను ఒక దగ్గర చదవడమే మంచి అనుభూతి.
617 పేజీల ఈ పుస్తకం వెల రూ.300/- అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యం.