తెలంగాణ మలితరం కథకులు – కథన రీతులు – 11: జి. వెంకటరామారావు – నిజమైన ‘పరిష్కారం’ ఏది?

0
2

[box type=’note’ fontsize=’16’] “ఆశలు, ఆశయాలు, ఆదర్శాల చుట్టు తిరిగే ఈ కథలలో కొంత ఫ్లాష్‌బాక్ టెక్నిక్ ఉంది. మంచి పఠనీయతా గుణం కలిగిన ఈ కథలు, ఇప్పుడు కూడా ఆసక్తిగా చదివింపజేస్తాయి” అని జి. వెంకటరామారావు కథలను విశ్లేషిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

[dropcap]తె[/dropcap]లుగువారు గర్వించదగ్గ రాజకీయ చరిత్రకారుడు జి. వెంకటరామారావు. నిజాం కాలం నాటి పాత వార్తాపత్రికలు – తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ అన్నీ తిరగేసి తారీఖులు పట్టుకుని, ఆయా సంఘటనల్ని రాసుకుంటూ రావడమంటే ఎంత కష్టం? గతాన్ని వర్తమానంలోకి ఈడ్చుకురావడమే. అలా కాలం పొరల్లో దాగిన రాజకీయ, సాంఘిక, సామాజిక మార్పుల్ని నిబద్ధతతో, నిజాయితీగా రాస్తూ వచ్చారు. ఎనభై రెండేళ్ళ వయసులో కూడా అదే పట్టుదల, అదే దీక్ష, అదే చిత్తశుద్ధితో ప్రచార ఆర్భాటాలను ఆశించకుండా తన పని తాను చేసుకుంటూపోయారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.

జి. వెంకటరామారావు 1935 ఫిబ్రవరి 14న నాటి మెదక్ జిల్లా బాగాత్ తాలూకా మాధాపురం గ్రామంలో జన్మించారు. అక్కడి నుంచి వచ్చిన వెంకటరామారావు కుటుంబం గౌలిపురలో స్థిరపడింది. ఆయన, ఆయన సోదరుడు రంగారావు ‘రిఫాయే-ఆమ్’ అనే నాటి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. వీరు 1946 ప్రాంతంలో విద్యార్థి దశలోనే రజాకార్లతో దెబ్బలు తిన్నారు. ‘క్విట్ స్కూలు’ ఉద్యమంలో తొమ్మిది నెలలు చురుకుగా పాల్గొన్నారు. అప్పుడు ఆయన తొమ్మిదో తరగతి విద్యార్థి. పద్నాలుగు సంవత్సరాల వయసులో ‘ఇమ్రోజ్’ పత్రికా సంపాదకుడు పోయెబ్ ఉల్లాఖాన్‌ను రజాకార్లు హత్య చేసినప్పుడు ఆయన, ఆయనలాంటి విద్యార్థులంతా సమావేశమై రహస్యంగా సంతాపసభ జరుపుకున్నారు. 1948లో హైదరాబాద్‌లో కదం తొక్కిన యూనియన్ సైన్యాన్ని ఆహానించడానికి సికింద్రాబాద్‌లోని బొల్లారం చేరుకున్న విద్యార్థుల్లో యువ జివిఆర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ పరీక్షలలో జివిఆర్ డెబ్బయ్ శాతం మార్కులతో పాసయ్యారు. ఆయనకు తెలివైన విద్యార్థిగా మంచి పేరుండేది. చరిత్ర, తెలుగు, ఎకనమిక్స్, కామర్స్, జాగ్రఫీ వంటి సబ్జెక్టులతో నాటి ఛాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. రోజుల్లో పల్లా దుర్గయ్య వీరికి అధ్యాపకులుగా ఉండేవారు. అందువల్ల తెలుగు భాషమీద, సాహిత్యం మీద అభిరుచి పెరిగింది. ఫలితంగా కొంతకాలం సృజనాత్మక రచనల వైపు దృష్టిని మళ్ళించారు. కళాశాల వార్షిక సంచిక ‘తెలుగు వీణ’ లో తన తొలి కథానికను ప్రచురించారు.

ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఆరేళ్ళకు బి.ఎ. డిగ్రీ పూర్తి చేశారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా చేరి పదోన్నతిపై చివరకి జిల్లా విద్యాశాఖాధికారిగా పదవీ విరమణ చేశారు. తర్వాతి కాలంలో అనగా 1967లో జివిఆర్ “పరిష్కారం” పేరుతో ఒక కథానికల సంపుటి ప్రకటించారు. చరిత్ర పరిశోధకుడిగా, రెండు వేలకు పైగా వ్యాసాలు ప్రకటించడం వల్ల ఆయనలోని సృజనాత్మక రచయిత మరుగున పడిపోయాడు.

చారిత్రక నేపథ్యంలోంచి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర, భారత దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు, తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర మొదలైనవి ఎన్నెన్నో ప్రకటించారు. అంతేకాదు, ఎంతోమంది నాయకుల జీవిత చరిత్రలు కూడా రాశారు. ముఖ్యంగా చెప్పుకోవల్సినవి- ప్రధానిగా పి.వి. నరసింహారావు, పులిజాల రంగారావు, నూకల రామచంద్రారెడ్డి, జె.వి నర్సింగరావు, కోదాటి నారాయణరావు, ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య, ఉన్నవ వెంకట రామయ్య, కోట్ల విజయ భాస్కరరెడ్డి, స్వాతంత్య్ర సమర నిర్మాతలు మొదలైన ఎన్నో జీవిత చరిత్రలు రాశారు. వాటి విలువ వెలకట్ట లేనిది. చరిత్ర పుటల్ని తన పుస్తకాల పుటల్లో భద్రపర్చిన ధన్యుడు ఆయన.

జివిఆర్ రాసి, ప్రచురించిన కథాసంపుటి ‘పరిష్కారం’ పేరిట 1967లో వెలువడింది. ఇందులో మొదటగా ఉన్న టైటిల్ కథ ‘పరిష్కారం’ 96 పేజీల పెద్ద కథ. ఇందులో సేవ, అంకితభావాలతో పనిచేసే డాక్టర్ మోహన్ పేదల డాక్టర్‍గా, మంచి హస్తవాసి గల డాక్టరుగా అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒక రోజు క్షయ వ్యాధి ముదిరిపోయిన సుబ్రహ్మణ్యం అనే ముసలి పేషంట్‌ను, ఎంత ప్రయత్నించినా డాక్టర్ బతికించలేకపోతాడు. ఆ శవంపై పడి రోదిస్తున్న ఇరవైఏళ్ళ యువతిని గుర్తుపడతాడు. ఆమె ఎవరో కాదు. తన చిన్ననాటి నెచ్చెలి సుజాత. తన చిన్నతనంలో తమ పొరుగింట వుండే బ్యాంక్ క్యాషియర్ శాస్త్రులుగారి కూతురు. ఆమె తల్లి, తన తల్లి స్నేహితురాళ్ళుగా కలిసిపోతారు. సుజాత కూడా మోహన్ దగ్గర చదువుకోవడానికి వచ్చేది. శాస్త్రులుగారికి ట్రాన్స్‌ఫర్ కావడంతో, కుటుంబంతో సహా వెళ్ళిపోతాడు. మోహన్ ఇంటర్‍లో నెగ్గి మెడిసిన్‌లో చేరుతాడు. అ తర్వాత ఆ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టి మంచి పేరు తెచ్చుకుంటాడు. సుజాత ఇంటి అడ్రసు కనుక్కుని డాక్టర్ మోహన్ ఆమె ఇంటికి వెళతాడు. డాక్టర్ మోహన్ ఇంకా అవివాహితుడని తెలిసి ఆశ్చర్యపోయిన సుజాత తన కథ తెలియజేస్తుంది. కలరాతో సుజాత తల్లి చనిపోగా, ఆ బాధతో శాస్త్రులుగారు చాలాకాలం పాటు కోలుకోలేకపోతారు. ఫించను కోసం తిరుగుతూ, ఆ ఆఫీసులో పనిచేసే భార్యావిహీనుడైన సుబ్రహ్మణ్యం అనే గుమాస్తాతో సుజాత పెళ్ళి జరిపిస్తాడు. మొదటిరాత్రి గదిలోకి వచ్చిన సుజాతతో “నేను క్షయ రోగిని. ఇంతకాలం ఎవరికీ అన్యాయం చేయకూడదని పెళ్ళి చేసుకోలేదు. నిన్ను నేను కళంకితం చేయను. నువ్వు డిగ్రీ చదువుకో” అని ప్రోత్సహిస్తాడు. దానికి సుజాత తన స్త్రీత్వాన్ని కాపాడుకుంటూ, ఆయన చరణదాసిగా శేషజీవితం గడపాలని నిశ్చయించుకుంటుంది. తర్వాత భర్త పరిస్థితి విషమించి చనిపోవడంతో ఏకాకిగా మిగిలిపోతుంది. ఆమెను తరచుగా కలుస్తూ, ఆమె ఆరోగ్య విషయాలను కనుక్కుంటూంటాడు మోహన్. తన బాల్య జ్ఞాపకాలను తెలియజేస్తున్న డాక్టర్ మోహన్‌లో తన పట్ల ప్రేమ అలాగే వుందనీ, తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిసి సుజాత తట్టుకోలేకపోతుంది. వితంతువుగా తాను అనర్హురాలినని భావిస్తుంది. ఒకసారి షాపింగ్‌లో కలిసిన సుజాతను, డాక్టర్ మోహన్ ఇంటికి తీసుకువచ్చి తల్లికి పరిచయం చేస్తాడు. ఆమె గతాన్ని జ్ఞాపకం చేసుకుని, సుజాత విషాద గాథ విని చలించిపోతుంది. ఆమె కొడుకు పెళ్ళి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. తల్లి మాట జవదాటని డాక్టర్ మోహన్ తనను పెళ్ళి చేసుకుంటాడా? చేసుకున్నా ఆ పెళ్ళిని ఆయన తల్లి ఆమోదిస్తుందా? అనే ఆలోచనలతో సుజాత క్రుంగిపోతుంది. లోకం కూడా తన ప్రేమను అర్థం చేసుకోదు. ఒక వితంతువు డాక్టరుగారిని వలలో వేసుకుందని ప్రచారం చేస్తారు, ఎలా? అని సతమతమైపోతుంది. ఈలోగా సుజాత ఫించన్ ఆఫీసులో గుమాస్తాగా చేరుతుంది. ఆఫీసులో అందరికంటే మిన్నగా పనిచేసుకుంటూపోయే సుజాతను చూసి, ఒంటరి ఆడదని భావించి ఆ ఆఫీసులో వుండే వాళ్ళంతా ఆమెను లోబరుచుకుందామని ప్రయత్నించి విఫలమవుతారు. దాంతో ఆమెకు మగాళ్ల మీదనే అసహ్యం పుట్టుకొస్తుంది. ఇంకోవైపు డాక్టర్ మోహన్ తండ్రికి స్నేహితుడైన ప్రసాదరావు కాంట్రాక్టరుగా ఎదుగుతాడు. అతను డాక్టర్ మోహన్ వివరాలు తెలుసుకున్నాకా, తన కూతురు శైలజని ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. దాని కోసం మోహన్ తల్లిని బలవంతపెట్టగా,  బెంగుళూరులో ఉన్న శైలజను చూడడానికి వెళుతూ, రైలు ప్రమాదంలో చనిపోతుంది. అతన్ని ఓదార్చడానికి సుజాత వచ్చిపోతూంటుంది. డాక్టర్ మోహన్ పుట్టిన రోజున ఇంటికి వచ్చిన సుజాతకు డాక్టర్ రఘు వెంట వచ్చిన శైలజ కనిపిస్తుంది. శైలజ తండ్రి ప్రసాదరావు అనారోగ్యంతో తమ ఆస్పత్రిలో చేరాడని చెబుతాడు. ఇంటికి వచ్చిన సుజాతతో తన ప్రేమను వెల్లడించి, మోహన్ ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. ఇద్దరూ ప్రేమ పారవశ్యంలో మునిగిపోతారు. ఆస్పత్రిలో వున్న ప్రసాదరావు, డాక్టర్ మోహన్ ఇంటికి వెళదామంటే కూతురు వారిస్తుంది. రైలు ప్రమాదంలో తల్లి చనిపోవడం, మోహన్ వితంతువైన సుజాతను పెళ్ళి చేసుకున్నాడన్న విషయం విన్న ప్రసాదరావు మండిపడతాడు. “వాడు దుష్డుడు, ధూర్తుడు. పుట్టగానే తండ్రిని మింగాడు. పెంచి పెద్ద చేసిన తల్లిని పొట్టనపెట్టుకున్నాడు. కనీసం తల్లి మాటనైనా పాటించని కృతఘ్నుడు. మనం వీళ్ళ సంబంధం చేసుకోందే నయమైంది. వీళ్ళ వంశానికో శాపముంది. ఈ వంశంలోని మగవాళ్ళు నలభై ఏళ్లు దాటి బతకరు. వీడి తండ్రి, తాత ముత్తాతలు అంతా అలాగే చచ్చారు.  రేపు వీడు కూడా అంతే” అని కూతురితో అన్న మాటలు చాటుగా విన్న డాక్టర్ మోహన్ క్రుంగిపోతాడు. ఇంటికి వచ్చిన మోహన్ నిద్రపట్టక మార్ఫియా ఇంజక్షన్లు ఎక్కువ డోసులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.

అరవయ్యవ దశకంలో వచ్చిన పాపులర్ ధోరణులకు అనువుగానే ఈ కథ రూపుదిద్దుకుంది. ప్రేమ, వియోగం, పెళ్ళి, త్యాగం అనే ఫార్ములా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులొ డాక్టర్ మోహన్ పాతికేళ్ళ వరకు ఎందుకు అవివాహితుడుగా వున్నాడో తెలియదు. బాల్యంలో విడిపోయిన సుజాత పట్ల అనురాగముందని తెలియదు. ఏ విషయమూ రచయిత స్పష్టంగా చెప్పడు. ఇతర పాత్రధారులు కూడా అంతే. మోహన్ సుజాతను, సుజాత మోహన్‌ను ప్రేమిస్తున్నట్లు వాళ్ళు చెప్పుకోరు. మంచితనం, ఆదర్శాలు, లోకభీతి పేరిట వాళ్ళలో వాళ్ళే నర్మగర్భంగా మాట్లాడుకుంటారు. అంతా దాగుడుమూతలే. ప్రేమ కథ విఫలం కవడానికి విలన్‌గా తల్లి అడ్డు నిలుస్తుందనుకుంటే, ఆమె కాస్తా రైలు ప్రమాదంలో చచ్చిపోతుంది. అనుకోకుండా మధ్యలో వచ్చిన ప్రసాదరావు విలన్ పాత్రను నిర్వహిస్తాడు. వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవలసిన వైద్యుడు, ప్రసాదరావు చెప్పిన శాపం అనే మూఢనమ్మకాన్ని నమ్మడం ఏమిటి? అది నిజం చేస్తూ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అదీ ఆయన ఎంచుకున్న ‘పరిష్కారం’గా భావించడమేమిటి? సంసార సుఖానికి నోచుకోకుండా సుజాత ఎప్పటికప్పుడు వితంతువుగానే మిగిలిపోవడమేమిటి? అంతా విచిత్రంగా వుంటుంది.

“అభిమానం” అనే కథలో జమీందారీ రద్దవగానే రాజా బహదూర్ శివశంకర ప్రసాద్ గారు మామూలు జీవితం గడపడానికి నిశ్చయించుకుంటాడు. లా ప్రాక్టీసు పెట్టడం కంటే ‘కాలేజ్ బుక్ హౌస్’ పేరుతో పెద్ద పుస్తకాల షాపును తెరుస్తాడు. రానురాను షాపుకు గిరాకీ పెరిగి బిజీ అయిపోతాడు. దాంతో నమ్మకస్తుడైన అసిస్టెంట్ కోసం వెతుకుతుంటాడు. ఒకరోజు షాపులో దాగి వున్న స్టూడెంటును పట్టుకుంటాడు. ఒకప్పుడు బాగా బతికినవాళ్ళట. ఆర్థికంగా బాగా చితికిపోవడంతో, అతి కష్టం మీద బి.ఎ. పరీక్షకి కూచుంటాడు. ఈసారి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మారిపోతాయి. కొనే తాహతు లేకపోవడంతో, ఎవరికీ కనబడకుండా ఆ షాపులోనే వుండిపోతాడు. షాపు మూసిన తర్వాత అందులోనే వుండి ఆ రాత్రంతా కూచుని నోట్సు తయారు చేసుకున్నానంటాడు. దానికి జాలిపడ్డ ప్రసాద్ గారు “మా షాపులో పని చేస్తూ చదువుకో, నీకు ఇచ్చే జీతం నీ నెల ఖర్చులకు ఉపయోగపడుతుంది” అని చెప్పి, ఆ కుర్రవాడిని షాపులో చేర్చుకుంటాడు. రమేశ్ అనే ఆ కుర్రవాడు ఆ షాపులో పనిచేస్తూ, అన్ని పనులూ నేర్చుకోవడంతో షాపు బాధ్యతల్ని అతనికే వదిలివేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. క్రమంగా రమేశ్ ఆలస్యంగా షాపును తెరవడం, తర్వాత సాయంత్రం కూడా ఆలస్యంగా రావడం గమనిస్తాడు. ఈ మార్పు ప్రసాదును ఆలోచనల్లో పడేస్తుంది. ఒకరోజు పుస్తకం అమ్మిన పదిహేను రూపాయలు క్యాష్‌లో జమ కాలేదు. కానీ రమేశ్ ఇచ్చిన రసీదు వుంటుంది. దొంగవేషాలు వేస్తున్నావని రమేశ్‌ని తిట్టి తరిమేస్తాడు. వారం రోజుల తర్వాత ప్రసాద్ గారికి, రమేశ్ రాసిన ఉత్తరం వస్తుంది. అందులో “మా అమ్మ రోగగ్రస్తురాలు. క్షయలో కొచ్చింది. డాక్టరు బిల్లులు చెల్లించలేకపోయాను. ఉద్యోగంలోంచి తీసేసిన నాలుగో రోజునే అమ్మ చనిపోయింది. డబ్బుకి చాలా ఇబ్బంది ఏర్పడింది. మీరు జీతమ్ ఇస్తానని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఒక నెల జీతం అడ్వాన్స్ ఇవ్వమని అడగాలనుకున్నాను. నాకు డబ్బు విషయంలో అభిమానం జాస్తి. అర్జెంటుగా అవసరమై పదిహేను రూపాయలు తీసుకున్నాను. నాలుగు రోజులాగి జీతం డబ్బులతో తీర్చేయాలనుకున్నాను. ఈ లోపలే ఈ సంగతి మీకు తెలిసి నన్ను వెళ్ళగొట్టారు. నేను దొంగను కాదు” అని రాస్తాడు. అందులో తన తప్పు కూడా వుందని గ్రహించిన ప్రసాద్ గారు విచారిస్తారు. అభిమానం, అతి మంచితనంతో ఈ సమాజంలో నెగ్గుకురావడం కష్టమని ఈ కథ తెలియజేస్తుంది.

“ఇది ఎలాంటి త్యాగం” కథలో రచయిత ఇంటర్ చదివేటప్పుడు వనజ క్లాస్‌మేట్. ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమెకు రచయితకూ మధ్య అన్ని విషయాలలో పోటీ ఏర్పడుతుంది. సెకండ్ ఇయర్‌లో కాలేజీ మాగజైన్ కోసం కథ రాసి ఇస్తే, సంపాదకురాలైన వనజ తన పేరు మీద అచ్చువేసుకోవడంతో ఆమె మీద ఉన్న సదభిప్రాయం తొలగిపోతుంది. డిగ్రీలో వున్నప్పుడు జ్వరం వచ్చి డాక్టర్ భాస్కర్ దగ్గరకు పోతాడు. అక్కడకు వనజ వచ్చి వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీకి టిక్కెట్టు కొనమని ఆ డాక్టరును ఒత్తిడి చేయడం, అదంతా నటనగా, అతిశయంగా భావిస్తాడు. ఇది జరిగిన పన్నెండేళ్ళకు, ఒకసారి కిక్కిరిసిన బస్‌లో వెళుతుంటే, ఒక జవాను వచ్చి ఆపి తమ మహిళా ఆఫీసరును ఎక్కించుకోమంటాడు. సీటిచ్చి కూర్చోబెట్టి గమనిస్తే, ఆమె వనజ అని గుర్తుపడతాడు. కాని ఆమె కన్నెత్తి కూడా చూడదు. మరుసటి రోజు ఇంటికొచ్చి చూసేసరికి, వనజ తన పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఆమె పెళ్ళి చేసుకుందనీ, పిల్లలు లేరనీ, ఈ జిల్లాకు వెల్ఫేర్ ఆఫీసర్‍గా వచ్చిందని తెలుసుకుంటాడు.  ఒకసారి ఆమెను కలవడానికి వారి ఇంటికి వెళతాడు. ఆమె భర్తగా పరిచయం చేసిన డాక్టర్ భాస్కర్ నేఫా యుద్ధంలో గాయపడి కళ్లూ, చెవులు పోగొట్టుకుంటాడు.  అతడ్ని పెళ్ళి చేసుకుని అవి లేని లోటును తీరుస్తున్నానని చెబుతుంది.. అందరిలా సుఖపడే అవకాశాన్ని విడిచిపెట్టి, ఒక అంగవికలుడ్ని చేసుకుందని రచయిత విచారిస్తే, “సౌందర్యం పై గల భ్రమ ఒక మైకం వంటింది. దాన్ని నేను జయించాను” అంటుంది. తన గతం గురించిన జ్ఞాపకాలను చెరిపివేయడానికి “యశస్సుపై గల వ్యామోహం ఒక ఉన్మాదం వంటిది. ఆ ఉన్మత్తావస్థ నుండి నేను తేరుకున్నాను” అని చెబుతుంది. దేశ రక్షణలో ప్రాణం వినా ఇతరత్రా అన్నీ కోల్పోయిన ఒక దేశభక్తుని కోసం వనజ తన్ను తాను అర్పణం చేసుకుందనే విషయం అతడ్ని పులకరింపజేస్తుంది.  ఇప్పుడు ఆమె మీద గౌరవం ఎన్నో రెట్లు పైకెదిగిపోయిందని భావిస్తాడు.

“కాలాతీత వ్యక్తి” కథలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న శర్మ గారు రజాకార్ల పాలనలో జ్యేష్ఠపుత్రుడిని కోల్పోయారు. తెలంగాణములోని ఆంధ్రమహాసభలలో ముఖ్యకార్యకర్తగా వ్యవహరించారు. ఆంధ్ర సారస్వత పరీక్షలు పెట్టించి ఎందరిలోనూ మాతృభాషా జ్ఞానం కలిగించారు. ఆనాటి గోలకొండ పత్రికలో తామరతంపరగా ఘాటైన వ్యాసాలు రాసి పాలకవర్గంవారి నిఘాలో ‘ఇంక్విలాబ్’ పురుషుడిగా నమోదు అయ్యారు. పోలీస్ చర్య అనంతరం ఆ వూళ్ళో వెలసిన యువజన సంఘం సభ్యులు ఆయనను గొప్పగా సన్మానించి జైహిందూ శంఖారావం తొలుత మ్రోగించిన వాడగుట వల ఆయనకు జైహింద్ శర్మగారనే బిరుదు ప్రదానం చేశారు. శర్మగారు అసాధారణమైన వ్యక్తి. నాటక అభినయంతో పరిణతి చెందిన నటుడు. మంచి వాదనా పటిమ గలవాడు. మూడు భాషలలో అనర్గళంగా మాట్లాడేస్తారు. మాట్లాడేవి సూటిగా సాఫీగా ఉండి, నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పగలరు. ఆయన పట్ల ప్రజలకు గౌరవాభిమానాలు వునన్పటికీ, శిష్యులతో పరాభూతుడై మోసగింపబడ్డాడు శర్మగారు. ‘ఎందులోనూ ఆయనకు మొదటి స్థానం రాదు – రెండవ స్థానానికందుకోరు. ఆనాడు ధర్మరాజైనా అబద్ధమాడడానికి శ్రీకృష్ణునితో రాజీ పడ్డాడు కానీ ఈయన మాత్రం తన ఆదర్శాల శిఖరాగ్రంపై కూర్చుని ఒక్క మెట్టు క్రిందకి దిగడు. ఆయన దేశభక్తి, త్యాగనిరతి ఆదర్శాలనే ఎడారిలో ప్రవహించి ఇమిడిపోవడం మా దురదృష్టం’. ఇప్పుడు తెలంగాణ  వైతాళికులుగా కొనియాడబడే చాలామంది అప్పట్లో ఎదుర్కొన్న సమస్య అది. తెలంగాణ విముక్తం కావడంతో స్వార్థపరులు, అవకాశవాదులు రాజకీయాలలో దూరి నిజమైన పోరాట యోధులు, త్యాగధనులను పక్కకు తప్పించేశారు. అయినా వారు అది పట్టించుకోకుండా మారుతున్న కాలాన్ని, ధోరణులను గమనించక ఆశయాలు, ఆదర్శాలు అంటూ పాకులాడి, కొత్తతరం వారి దృష్టిలో ఛాందసులుగా మిగిలిపోయారు. అలాంటివారిలో ఒకరైన శర్మగారు మారుతున్న పరిస్థితులను తన దృష్టితో బేరీజు వేస్తే, ఒక మేస్టారు సరిదిద్దడం ఈ కథలో కనిపిస్తుంది. ‘ఎందులోనూ ఆయనకు మొదటి స్థానం రాదు – రెండవ స్థానానికందుకోరు’ అని చెప్పడం, ‘శిష్యులతో పరాభూతుడై మోసగింపబడ్డాడు’ అని చెప్పడం యన్.జి.రంగాను ఉద్దేశించి ప్రచారంలో వున్నవి. ఇవన్నీ కూడా తెలంగాణ శర్మకే ఆపాదించి, ఆ పాత్రకు సానుభూతి కలిగేట్లుగా రచయిత ప్రయత్నించడం ఇందులో కనిపిస్తుంది.

జీతం, జీతం తాలూకూ ఇతర బకాయిలతో పెద్ద మొత్తం డబ్బుతో ఏప్రిల్ ఫస్టున ఇంటికి వస్తున్న ఆఫీసర్‌ను, మధ్యలో ఒక అందమైన అమ్మాయి పరిచయం చేసుకుని, స్కూటర్ మీద ఎక్కించుకుని హోటల్‌కు తీసుకువెళుతుంది. ఆ అమ్మాయి ప్రవర్తనతో అందమైన కలల్లో విహరించి, బస్టాండుకు చేరుకున్న ఆఫీసర్‍, ఆ అమ్మాయి తన పర్స్ కొట్టేసిందని తెలిసి స్తంభించిపోతాడు. అతడు స్ట్రిక్ట్ ఆఫీసర్‍గా ఒక సింధీ వ్యాపారి బ్లాక్ మార్కెట్‌ను పట్టుకుంటాడు. వాడిచ్చే లంచానికి లొంగక వాడ్ని తీవ్రంగా శిక్షిస్తాడు. వాడి కూతురే అలా వచ్చి తనను దోచుకుపోయిందని, ఆమె మోసాన్ని గ్రహించక “ఏప్రిల్ ఫూల్” అయ్యానని తెలుసుకుంటాడు.

ఆశలు, ఆశయాలు, ఆదర్శాల చుట్టు తిరిగే ఈ కథలలో కొంత ఫ్లాష్‌బాక్ టెక్నిక్ ఉంది. కొన్నింటిలో కొసమెరుపు ఛాయలు కనిపించినా, నేరుగా కథనంలోకి వెళ్ళిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. మంచి పఠనీయతా గుణం కలిగిన ఈ కథలు, ఇప్పుడు కూడా ఆసక్తిగా చదివింపజేస్తాయి. ఇంత మంచి కథలు రాసిన జివిఆర్ తర్వాతి కాలంలో సృజనాత్మక రచనలకే దూరం కావడం విచారకరం. అందుకే జీవిఆర్ అభిమానులకు కూడా వారు కథకులన్న సంగతి చాలామందికి తెలియకుండా పోయింది. ఆయన కథకుడిగా కాకుండా రాజకీయ రచనావ్యాస దురంధరుడిగానే ప్రసిద్ధి చెందారు. ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూపోయే జివిఆర్ చివరకు తన 82వ యేట 2018 ఫిబ్రవరి 11న కన్నుమూశారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here