[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘గాలి ఓ అనాథ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]కు[/dropcap]లం లేదు మతం లేదు
గాలికి
గూడు లేదు నీడా లేదు
గాలి ఓ అనాథ
గట్టు మీద చెట్టు మీద చెరువుమీద
ఇంటి మీద మురికి కాలువ మీద
నా మీద నీ మీద ఎక్కడెక్కడో వుంటుంది
ఎక్కడయినా వుంటుంది
గాలి ఓ నిర్వాసితురాలు
కాళ్ళు లేవు
ఒక చోట నిలబడదు
విరామం లేదు విసుగూ లేదు
గాలి ఓ నిరంతర యాత్రికురాలు
కంటికి కనబడదు
ఒంటికి తెలుస్తుంది
గాలి పారదర్శకం
కాలింగ్ బెల్ నోక్కకుండానే
దర్వాజాలోంచి దర్జాగా ఇంట్లోకొస్తుంది
కిటికీల్ని టపటప లాడిస్తుంది
వెంటిలేటర్లోంచి తొంగి చూసి లోనికి దూరుతుంది
గోడలకు వేలాడేసిన కాలేండర్లనీ ఫోటో లనీ
దడ దడ లాడిస్తుంది
హాల్లోకి వంటింట్లోకి ఆడపడుచు
వచ్చినట్టు చొచ్చుకొస్తుంది
దానికి ఎవరి అనుమతి అక్కర్లేదు
బెడ్ రూము లోకొచ్చినా
మనం సిగ్గుపడం దుప్పటి కప్పుకోం
కానీ ఎండ చేసిన నేరానికి
గాలిని కట్టడి చేస్తాం కండీషన్ల పెడతాం
గాలి ఇంటిలోకే కాదు
నింతరంగా ఒంట్లోకీ చేరుతుంది
గాలి నాలుగు క్షణాలెక్కడయినా
దాక్కుంటే దాగుడు మూతలాడితే
ఊపిరి నిలబడి పోతుంది పాడెక్కేస్తాం
గాలి మన చుట్టూరా తిరుగుతుంది
మనం దాని చుట్టూరా అల్లుకుంటాం
బట్టలు ఆరేస్తాం, పంటలు తూర్పార బడతాం
వాకిట్లోనో వాకింగులోనో వరండాలోనో
గాలి హాయిని వినోదిస్తం
మంద్రంగా వీస్తే హాయిగా ప్రాణం లేచొస్తుంది
కొంచెం వేగంగా వీస్తే ఈదర గాలి పాడు గాలి అంటాం
అంతేనా గాలి మాటలు గాలి తిరుగుడు అంటూ నిందిస్తం
గాలంటే మనకు దయలేదు ప్రేమ లేదు
ఎవరి పైనయినా వాటిని కోల్పోయి
చాలా కాలమే అయింది