Site icon Sanchika

గాలికి కులమేది?

[డా. నాగేశ్వరరావు బెల్లంకొండ రచించిన ‘గాలికి కులమేది?’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఓ[/dropcap] సినీ కవి గాలికి కులమేది అని ప్రశ్నించారు. నిజమే గాలికి కులం, చివరికి సమస్త ప్రాణకోటిని తనలో కలుపుకునే నేలకు మతం ఉందా?

ఒంటి పైన నూలుపొగు లేకుండా, పచ్చి మాంసం తినే మనిషి నేడు తను సృష్టించుకున్న కులం కుళ్ళులో, మతమౌఢ్యంలో చిక్కుకు పోయాడు.

వందేళ్ళు బ్రతకనని తెలిసి వేయేళ్ళకు సరిపడా సంపాదించి తన భావితరాలకు ఇచ్చివెళ్ళాలని తాపత్రయ పడతాడు మనిషి. అవసరమైతే తన పాపంలో (సొత్తు) లో భాగం తను నమ్ముకున్న దేవుడికి ఇస్తాడు. కాంతం, కనకం, కొసం అలుపెరుగని పరుగు తీస్తూనే ఉంటాడు జీవితాంతము.

ఆక్సిజన్ అసలు కథ తెలుసుకుందాం.

భూమ్మీద సమస్త ప్రాణి కోటి మనుగడకు ఆక్సిజనే ఆధారం.

మన వాతావరణంలోని గాలి ప్రత్యేకతే వేరు. ఇందులో 21% ఆక్సిజన్‌ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు విశ్వంలో మరెక్కడి వాతావరణంలోనూ ఇంత ఎక్కువ స్థాయిలో ప్రాణవాయువు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్సిజన్‌ను భూమి సంతకమనీ అనుకోవచ్చు. ఇంతకీ మన భూమ్మీద ఆక్సిజన్‌ ఎలా పుట్టుకొచ్చింది? ఇంత ఎక్కువస్థాయిలో ఎలా ఉంటోంది? ఇంతటి కీలకమైన ఆక్సిజన్‌ స్థాయిలు ఎలా స్థిరంగా ఉంటున్నాయి? అన్నీ ఆలోచించదగ్గ, ఆశ్చర్యకరమైన ప్రశ్నలే. భూమి, ఖండాలు, మహా సముద్రాలు ఏర్పడిన తర్వాత మన వాతావరణం క్రమంగా ఆక్సిజన్‌ లేమి స్థితి నుంచి ఆక్సిజన్‌ సహిత స్థితికి చేరుకుంది. వాతావరణంలో ఇంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కావటానికి మూలం కిరణజన్య సంయోగ క్రియ. మూడొంతుల ఆక్సిజన్‌ ఇలా పుట్టుకొచ్చిందే. చెట్లు, మొక్కల ఆకులే కాదు.. సైయానోబ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములూ ఇందులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఆక్సిజన్‌ అనేది కిరణజన్య సంయోగక్రియలో భాగంగా పుట్టుకొచ్చే ఓ వ్యర్థ పదార్థం! సూర్యరశ్మి ప్రసరించినప్పుడు వీటిల్లోని పత్ర హరితం సూర్యరశ్మిని పట్టేసుకొని దాన్ని పిండి పదార్థంగా మార్చేస్తుంది. ఈ పక్రియలో భాగంగా నీటి అణువులు విడిపోయి ఆక్సిజన్‌ పుట్టుకొస్తుంది. ఇదే ప్రాణుల మనుగడకు బీజం వేసింది. చాలామంది నిపుణుల అంచనా మేరకు 50 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి భూమ్మీద జీవం ఆరంభమైంది. 450 కోట్ల సంవత్సరాల క్రితం వరకు సజీవ కణాలు.. ఆ మాటకొస్తే బ్యాక్టీరియా కూడా ఉనికిలో లేవు. తదనంతర కాలంలో బ్యాక్టీరియా, ఇతర కణాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఆక్సిజన్‌ రహిత స్థితిలోనే జీవక్రియలు కొనసాగించాయి. కిరణజన్య సంయోగక్రియ ఆరంభమైన తర్వాతే వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం పెరగటం మొదలైంది. పెద్ద ప్రాణుల పుట్టుకకు.. పరిణామక్రమంలో జీవుల మనుగడకు మార్గం సుగమం చేసింది ఇదే.

శక్తి మూలం!:

ఆక్సీస్‌, జీన్స్‌ అనే గ్రీకు పదాల కలయికతో ఆక్సిజన్‌ పేరు పుట్టుకొచ్చింది. ఆక్సీస్‌ అంటే పదునైన, జీన్స్‌ అంటే తండ్రి అని అర్థం. మొదటి పదం ఏమో గానీ రెండో పదం మాత్రం నిజంగానే అర్థవంతంగా నిలిచింది. భూమ్మీద జీవం మనుగడలో ఆక్సిజన్‌దే కీలకపాత్ర మరి. మన విశ్వంలో హైడ్రోజన్‌, హీలియం తర్వాత ఇదే అతి పెద్ద మూలకం. భూ కేంద్రంలో 50% వరకు ఉండేది ఇదే. మనుషుల ద్రవ్యరాశిలో మూడింట రెండో వంతు ఆక్రమించేదీ ఇదే. ఆక్సిజన్‌, హైడ్రోజన్‌తోనే కదా నీరు ఏర్పడేది. అంటే మన శరీరంలోని అతి పెద్ద మూలకం ఆక్సిజనే అన్నమాట. ఆక్సిజన్‌ అణువుల కన్నా హైడ్రోజన్‌ అణువుల సంఖ్య ఎక్కువైనా ద్రవ్యరాశి విషయంలో ఆక్సిజన్‌దే పెద్ద పీట. ఇది మనకు రకరకాలుగా ఉపయోగపడినా అన్నింటికన్నా ముఖ్యమైంది – శ్వాసక్రియలో పాల్గొంటూ శరీరానికి అవసరమైన శక్తినివ్వటం. మనం శ్వాస ద్వారా పీల్చుకునే ఆక్సిజన్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోని గాలి గదుల్లోకి వెళ్తుంది. అక్కడ్నుంచి రక్తం ద్వారా కణాలకు చేరుకుంటుంది. కణ కేంద్రకమైన మైటోకాండ్రియా ఈ ఆక్సిజన్‌ సాయంతోనే పోషకాలను శక్తిగా మారుస్తుంది. అంటే తగినంత ఆక్సిజన్‌ లేకపోతే మన శరీరం చతికిల పడిపోతుందన్నమాట. హానికారక సూక్ష్మక్రిములను, రక్తంలో విశృంఖలంగా సంచరించే కణాలను కట్టడి చేయటంలోనూ పాలు పంచుకుంటుంది. ఇంతటి కీలకమైనదైనా దాదాపు 230 ఏళ్ల క్రితం వరకు ఆక్సిజన్‌ను గుర్తించనే లేదు.

మహా సముద్రాల నుంచీ:

ఆక్సిజన్‌ అనగానే మనకు ముందుగా చెట్లే గుర్తుకొస్తాయి గానీ మన భూమి మీదుండే ప్రాణవాయువులో కనీసం 50-80% మహా సముద్రాల నుంచే పుట్టుకొస్తుంది. ఇందులో చాలావరకు మహా సముద్రాల్లోని అతి చిన్న ప్రాణులు (ప్లాంక్టన్‌), పాచి, కొన్ని రకాల బ్యాక్టీరియా జరిపే కిరణజన్య సంయోగ క్రియ నుంచే ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ప్రొక్లోరోకాకస్‌ అనే బ్యాక్టీరియా మొత్తం జీవావరణంలో 20% వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదు!

సైయానోబ్యాక్టీరియా కిరణజన్య సంయోగక్రియతో ‘శ్వాసించటం’ ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను బయటకు విడుదల చేస్తుంది. భూమ్మీద మొట్టమొదటి ఆక్సిజన్‌కు ఇదే మూలమని భావిస్తున్నారు.

ఆక్సిజన్‌ను 1772లో స్వీడన్‌ శాస్త్రవేత్త కార్ల్‌ విల్‌హెల్మ్‌ షీలే తొలిసారి కనుగొన్నారు. మరో ఆంగ్ల శాస్త్రవేత్త జోసెఫ్‌ ప్రీస్ట్లీ కూడా 1774లో దీన్ని గుర్తించారు. ద్రవ గాలిని ఆవిరి రూపంలోకి మార్చటం ద్వారా ఆక్సిజన్‌ను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో నైట్రోజన్‌ ఆవిరి రూపంలో వేరై.. ద్రవరూపంలోని ఆక్సిజన్‌ మిగిలిపోతుంది. స్వచ్ఛమైన, పొడి గాలిని హైడ్రోజన్‌ అణువుల జాళ్ల ద్వారా ప్రసరింపజేసీ ఆక్సిజన్‌ వాయువును ఉత్పత్తి చేస్తుంటారు. విద్యుత్తు సాయంతో నీటిని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌గా విడగొట్టటం ద్వారానూ ఆక్సిజన్‌ను తయారు చేస్తారు.

ఒక్క వైద్యపరంగానే కాదు.. పరిశ్రమల్లోనూ ఆక్సిజన్‌ను విరివిగా వాడుతుంటారు. స్టీలు తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. వాణిజ్యపరంగా ఉత్పత్తయ్యే ఆక్సిజన్‌లో 55% దీనికే ఉపయోగిస్తుంటారు. ఎథిలీన్‌ ఆక్సైడ్‌, ఆక్రిలిక్‌ యాసిడ్‌, డైఫార్‌మైల్‌-ఫురేన్‌, బెంజైలిక్‌ యాసిడ్‌ వంటి రసాయనాల తయారీకీ ఇది అవసరమే. లోహాలను కోయటానికి, వెల్డింగుకూ ఆక్సిజన్‌ ఉపయోగపడుతుంది. రాకెట్‌ ఇంధనంలో ఆక్సిడైజర్‌గానూ, నీటిని శుద్ధి చేయటానికీ దీన్ని వాడుకుంటారు.

మనం జీవించటానికి ఆక్సిజన్‌ అత్యవసరమే అయినా ఎక్కువైతే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే ఇది ఆక్సిడెంట్‌. ఇతర పదార్థాల నుంచి ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది. ఆక్సిజన్‌ స్థాయిలు మరీ ఎక్కువైతే శరీరం దీన్ని నెగెటివ్‌ శక్తితో కూడిన అయాన్‌గా విడగొడుతుంది. ఇది ఐరన్‌కు అంటుకుపోతుంది. హైడ్రాక్సీల్‌ విశృంఖల కణం పుట్టుకొచ్చి కణాల పొరల్లోని కొవ్వులను దెబ్బతీస్తుంది.

మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నిమిషానికి సగటున 7-8 లీటర్ల గాలిని లోపలికి పీల్చుకుంటాం, బయటకు వదులుతుంటామని అంచనా. ఇలా రోజుకు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తుంటామన్నమాట. అయితే ఇదంతా ఆక్సిజన్‌ కాదు. పీల్చుకునే గాలిలో 20%, వదిలే గాలిలో 15% ఆక్సిజన్‌ ఉంటుంది. అంటే ప్రతి శ్వాసలో సుమారు 5% ఆక్సిజన్‌ను శరీరం వినియోగించుకుంటుందన్న మాట. మొత్తమ్మీద రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్‌ను తీసుకుంటామని చెప్పుకోవచ్చు.

మండిస్తుంది.. మండదు!:

ఆక్సిజన్ గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ఇది ప్రకృతిలో లభించే మూలకాలన్నిటి కంటే అత్యధికంగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తున్నారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవులు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.

ఆరోగ్యానికి ప్రాణవాయువు..!:

మన ఆరోగ్యానికి ప్రాణవాయువు ఎంతో ముఖ్యమంటున్నారు ఆరోగ్యనిపుణులు. మనం తీసుకునే శ్వాసలో నాణ్యత ఉందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. శరీరానికి ఉత్తమమైన, స్వచ్ఛమైన గాలి లభించకపోవడం వల్ల శరీరం రోగాలమయం అవుతున్నది.

మనం గాలి పీల్చుకున్న తరువాత అందులో ఉండే ఆక్సిజన్‌ శరీరంలో కలిసి కణాలన్నింటికీ చేరుతుంది. అప్పుడే కణజాలం ప్రక్రియ సజావుగా సాగుతుంది. శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు.

ప్రస్తుతమున్న మనం తీసుకుంటున్న గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతోందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. దీంతో మన శరీరంలోని కణజాలాలు మాలిన్యాలతో నిండిపోవడంతో శరీరం అవసరమైన ఆక్సిజన్‌ను గ్రహించలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు ఆరోగ్యనిపుణులు. మెదడుకు సరిగా ఆక్సిజన్‌ అందకపోవడం వలన మనలోని ఆలోచనా పటిమ తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన ప్రాణవాయువును తీసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

మన పురాణాలలో..:

హిందూ పురాణాల ప్రకారం ప్రాణవాయువుకు అధినేత వాయుదేవుడు అని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు వాయవ్య దిక్కుకు అధిపతి. ఒక ప్రాథమిక హిందూ దేవత, గాలుల ప్రభువు, భీముడు తండ్రి, హనుమంతుడి ఆధ్యాత్మిక తండ్రిగా పరిగణిస్తారు. అలాగే ప్రకృతి ఉనికికి కారణమైన పృధ్వి, అగ్ని, నీరు, వాయువు, శూన్యం అనే మౌలికమైన పంచభూతాలకు చెందిన ఒకటిగా చెప్పుకోవచ్చు. ‘వాయు’ను ఇంకా గాలి, పవన, ప్రాణ అని వర్ణించారు. ఋగ్వేదం ప్రకారం రుద్ర అని కూడా వర్ణించారు.

పురాణ గ్రంథాల శ్లోకాలలో వాయు రెండు లేదా నలభై తొమ్మిది లేదా వెయ్యి తెల్లని గుర్రాలతో మెరిసే రథంపై అసాధారణమైన అందంతో శబ్దం చేస్తూ ఉంటాడని వర్ణించబడ్డాడు. అతని రథంపై తెలుపు జెండా ఉండటం ప్రధాన లక్షణం అని, ఇతర వాతావరణ దేవతల మాదిరిగానే, ‘శక్తివంతమైన వీరోచిత యుద్ధ విధ్వంసకుడు’ అని వర్ణించబడింది.

ఉపనిషత్తులలో వాయుదేవుడు గొప్పతనం గురించి అనేక వివరణలు, దృష్టాంతాలు ఉన్నాయి. శారీరక విధులను నియంత్రించే దేవతలు ఒకప్పుడు వారిలో ఎవరు గొప్పవారో నిర్ణయించడానికి పోటీలో నిమగ్నమయ్యారని బృహదారణ్యక ఉపనిషత్తు పేర్కొంది. మనిషి శరీరాన్ని దృష్టి దేవత విడిచిపెట్టినప్పుడు, ఆ మనిషి చూపులేనివాడిగా ఉన్నప్పటికీ జీవించే ఉంటాడు. ఆ దేవతలు తిరిగి తన పదవికి వచ్చిన తర్వాత కోల్పోయిన నష్టాలను పొందగలడు. ఒక్కొక్కటిగా దేవతలు అందరూ శరీరాన్ని విడిచిపెట్టి మలుపులు తీసుకున్నారు. కానీ మనిషి వివిధ విధాలుగా బలహీనంగా ఉన్నప్పటికీ జీవించడం కొనసాగించాడు. చివరగా ‘ప్రాణ’ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మిగతా శారీరక విధులను నియంత్రించే దేవతలందరూ వాటి విధులను తప్పనిసరి పరిస్థితులలో నిర్వర్తించలేక పోయాయి. ‘ఒక శక్తివంతమైన గుర్రం అతను కట్టుబడి ఉన్న భూమిలో కొయ్యలను తీసివేసినట్లే’. ఇతర దేవతలు వాయు చేత అధికారం పొందినప్పుడే పనిచేయగలరని గ్రహించాయి. మరొక వర్ణన ప్రకారం, దాడిలో ఉన్న పాపపు రాక్షసులచే బాధపడని ఏకైక దేవత ‘వాయు’ అని చెప్పబడింది. వాయువును ఉడ్గిత (మంత్ర అక్షరం ఓం) గా మాత్రమేని తెలుసుకోవడం ద్వారా తప్ప, మాధ్వ బ్రాహ్మణులు కాదని చందోగ్య ఉపనిషత్తు పేర్కొంది.

వాయు అవతారాలు:

‘వాయు’ పరమ దేవుడైన విష్ణువును ఆరాధించడానికి విలువైన ఆత్మలను పొందడానికి ముఖ్యంగా కూడా మాధ్వాచార్యగా అవతరించారని మాధ్వ బ్రాహ్మణులు నమ్ముతారు.

ఈ గాలికి (వాయువుకి )ఎన్ని మారుపేర్లో..

పవనం, మారుతం, హోరుగాలి, సుడిగాలి, చిరుగాలి, గాలి వాటు, ఈదురు గాలి, చలి గాలి, వడ గాలి, పిల్ల గాలి, లేత గాలి, గాలి కబురు, గాలి చేష్ట, కొండ గాలి, పైర గాలి, సుడిగాలి.. ఇలా పలు పేర్లు మన వాడుకలో ఉన్నాయి.

సమస్త ప్రాణకోటికి చెట్లవలన ప్రాణవాయువు ఉచితంగా లభిస్తుంది. యిలా మనకు ప్రాణదాతలైన చెట్లను మనం ప్రాణప్రదంగా పెంచాలి. చెట్లే మన ప్రాణదాతలు అని మరువకూడదు.

మన సినీకవులు ఈ గాలిని తమ పాటల్లో ఎంతో గొప్పగా తెలియజేసారు.

‘సన్నగ వీచె చల్లగాలికి’ గుండమ్మకథ. ‘ఈ గాలి ఈ నేల’ సిరివెన్నెల. ‘కొండ గాలి తిరిగింది’ ఉయ్యాల జంపాల. ‘సొలి తూలెను తూరుపు గాలి’ అడుగు జాడలు. ‘గాలిలో’ కలిమి లేములు. ‘చక్కనైన ఓ చిరుగాలి’ ప్రేమ సాగరం. ‘గాలిలోన పువ్విడింది’ జడగంటలు. ‘చల్లని గాలి’ పెళ్ళి కాని పిల్లలు. ‘సడి సేయకో గాలి’ రాజమకుటం. ‘చిరుగాలి’ ఈడు జోడు. ‘గాలిలొన పైట చెంగు’ ప్రతిజ్ఞా పాలన. ‘చిరుగాలే వింజామర’ శ్రీదేవి.

ఇలా ఎన్నో పాటలు మనలను అలరించాయి.

Exit mobile version