Site icon Sanchika

గబ్బిలం

[dropcap]క[/dropcap]నులు లేవని నీవు కలత పడలేదు
నీ చెవులనే కనులుగా చేసి చూశావు
సృష్టిలో నీకున్న గొప్ప ధర్మాలు
వేరొక్క ప్రాణికి లేవు చూడంగ

తలక్రిందులుగా నీవు తపస్సు చేశావు
అన్యు లందని ఎన్నో వరాలు బడిశావు
మొదట నీకు కండ్లు కానరాకున్న
తపస్సు చేసి దివ్యదృష్టి పడిశావు
కనుల ధర్మము నీవు చెవుల గరిశావు!

గుప్పించెదవు ‘అల్ట్రాసోనిక్ తరంగముల’ నోట
అంతటి హెర్ట్జ్ (Hertz) గల ధ్వని తరంగాల
వినుటకు మా చెవుల తరము గాదు
అంచెలంచెలుగా నూది పయనించగలవు
ఆ ప్రసార మార్గానికడ్డేమొవస్తె
అవి పరావర్తనం జెంది చెవులబడును
అడ్డమొచ్చిన దాని పొడవు, నిడివెంత –
దూర, వేగ, దిశ, కోణములు నెంత?
ఊదిన నీ నోరు ‘ట్రాన్స్‌మీటర’వగ
పరావర్తనాల గ్రహించి నీ చెవులు ‘రిసీవర్’ అగును.
నీ మెదడుయే ‘ప్రోగ్రామరు’, ‘అనలైజరు’, ‘డిసైడర’గును
తదుపరి నీ గమన దిశను మార్చెదవు
అడ్డులేని దిశను అందుకొనియెదవు
కనులు లేని నీకు అడ్డంబునేది?
అంతేకాదు- కనులున్న మనుషులకు దారి చూపావు!
‘రాడారు’ పుట్టుకకు మూలమైనావు
శత్రు విమానాల జాడ తెలియంగ
వల్ల గాక నరులు ఖిన్నులైయుండ
నీవు – ఆంజనేయుడి వలే అగుపించినావు!
నీకున్న ప్రత్యేకత మరేదానికీ లేదు
అంధుడు కనలేడు పట్టపగలైన
చూపరి కనలేడు కటిక చీకటిన
అంధున కర్ధరాత్రియైనను పట్టపగలైనదేమి యొక్కటే –  వాడు చూడలేక
నీకును అర్ధరాత్రియైనను పట్టపగలైనను నొక్కటే – నీవు చూడగలిగి!

సృష్టిలో అరుదైన –
అండంబులిడి, స్తన్యంబు గుడుపు జాతి –
ఆకసమున కెగరలేవు,
విహంగములేమో గర్భంబు దాల్చనేరవు, స్తన్యంబుగరపలేవు.
మరి నీవో! విహంగమలే,
కానీ, గర్భంబు దాల్చి, స్తన్యంబు గుడుపగలవు!
జనులందు గలరు కొందరు
తలతురు నిన్ను అరిష్ట మూలకారణముగ
అసలుకైతే అరిష్టాలను బాపే మూలకారకురాలవు నీవు –
అరిష్ట కారక క్రిమి సంహారకానివి – పెస్టిసైడువవు.
తెలిసున్న జనులు నిన్ను కోరుతున్నారు –
తమ యిల్లు దర్శించి తీర్థమందించవా అని!

Exit mobile version