Site icon Sanchika

‘గద్దెనెక్కినంక’ – పుస్తకావిష్కరణ వార్త

ధిక్కార స్వరానికి ప్రతీక ‘గద్దెనెక్కినంక’

[dropcap]పా[/dropcap]లమూరు యువకవి కె.పి. లక్ష్మీనరసింహ రచించిన ‘గద్దెనెక్కినంక’ దీర్ఘ కవిత ధిక్కార స్వరానికి ప్రతీక అని పలువురు వక్తలు పేర్కొన్నారు.

పాలమూరు సాహితి, పాలమూరు యువకవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 17 మార్చి 2024న మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో గల లుంబిని హైస్కూలులో ‘గద్దెనెక్కినంక’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా విచ్చేసిన ప్రముఖ కవి వల్లభాపురం జనార్దన మాట్లాడుతూ లక్ష్మీనరసింహ రచించిన ‘గద్దనెక్కినంక’ పుస్తకంలో కవి మనువు సృష్టించిన చాతుర్వర్ణ వ్యవస్థలోని లోపాలను ఆవిష్కరిస్తూ రచన చేశారన్నారు. వచన కవిత నుంచి దీర్ఘ కవితలోకి అరంగేట్రం చేసిన లక్ష్మీనరసింహను అభినందించారు.

సభకు అధ్యక్షత వహించిన పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహ కవిత్వం సమకాలీనతను ప్రతిబింబిస్తుందన్నారు. సమాజంలోని రుగ్మతలను అంశాలుగా తీసుకుని రచనలు చెయ్యడం అభినందించదగ్గ విషయమన్నారు. కాలంతో పాటు నడుస్తున్న కవియని ప్రశంసించారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన కె. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కొందరు భ్రష్టుపట్టించడం దురదృష్టకరమన్నారు. సమసమాజాన్ని కాంక్షించిన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొందరు భ్రష్టుపట్టిస్తున్నారన్నారు.

మరొక అతిథి డా. పరిమళ్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహ కవిత్వంలో ఆవేదన, ఆక్రోశం కనిపిస్తుందన్నారు. సమాజంలో మనుషులు కుల, మతపరంగా విభజన రేఖలు గీసుకుని జీవిస్తుండబం దురదృష్టకరమన్నారు. సమాజంలో మనుషులంతా ఒకటేననే భావనను వ్యక్తపరిచారు.

పుస్తక సమీక్ష చేసిన విఠలాపురం పుష్పలత మాట్లాడుతూ మనువు సృష్టించిన చాతుర్వర్ణ వ్యవస్థలో ఇంకా బతుకుతున్నామన్నారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ మనుషులు మారలేకపోవడం సమాజ దైన్యాన్ని తెలియజేస్తుందన్నారు.

గ్రంథ స్వీకర్త, ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలోనూ ఇంకా మనుషులు కుల, మత చట్రంలో బతుకుతుండడం బాధేస్తుందన్నారు. మూడు శాతంలేని వారే ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తుండడం శోచనీయమన్నారు.

కార్యక్రమ సమన్వయకర్త, యువకవి బోల యాదయ్య మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ కవిత్వంలో ప్రధానంగా గాఢత కనిపిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పొన్నగంటి ప్రభాకర్, ఖాజా మైనోద్దీన్, పులి జమున, కె.ఎ.ఎల్. సత్యవతి, రావూరి వనజ, గుడిపల్లి నిరంజన్, వహీద్ ఖాన్, ఎదిరేపల్లి కాశన్న, ముచ్చర్ల దినకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version