[dropcap]“గ[/dropcap]డ్డిపూలు అనే చులకన చేయకండి/వాటికి మనసును మురిపించే శక్తి ఉంది/ఇంట్లో అలంకరించేంత” ఈ తొలి పదాలతో ప్రారంభమైన ఈ పుస్తకం చదివిన వారికి గడ్డిపూలు అందం, దానిపై చల్లని మంచు బిందువుల తుప్పర్ల లాంటి అనుభవాల గంధం పాఠకుల మనసులను ఆహ్లాద పరుస్తాయి.
ఇవి కవితలా, సూక్తులా, నినాదాలా, సుభాషితాలా అని ఆలోచించి తలబద్దలు కొట్టుకునే కంటే ఈ పదాల్లోని రచయిత ఆలోచనల్ని మనం అర్థం చేసుకుంటే భవిష్యత్తుకి బంగారు బాటలు వెతుక్కోవచ్చు.
“ఒకరి ఇంట్లో/జూదమూ, మద్యపానము, ప్రవేశిస్తే పతనం కూడా వెంట వస్తుంది” రచయిత రాసిన ఈ మూడు పాదాల వాక్యంలో ఏమాత్రం అసత్యం లేదు కదా.
“ఆలోచనలు సరైనవి అయితే/ఆచరణ పెద్ద కష్టమేమీ కాదు” ఇటువంటి మంచి మాటలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రచయిత అనుభవాలు పిల్లలకి బతుకు పాటాల్లాగా ఉన్నాయి.
ముఖచిత్రం మీదే ‘చదవండి -ఏమీ అనకండి’ అని రచయిత సవినయంగా, కాసింత భయంగా ప్రకటించారు కానీ ఇటువంటి భయపడేంత వాక్యాలు ఏం లేవు.
కాకపోతే “మహానుభావులు మరు జన్మలో, కుక్క జన్మ ఎత్తుతారు” – “ఒకరి కింద పని చేసే వారి/మెదడు కూడా స్వతంత్రం కోల్పోతుంది” ఇటువంటి వాటికి అర్థాలు కొంచెం కష్టంగా వెతుక్కోవలసి వస్తుంది.
మొత్తానికి పద నియమం లేని.. కవితలు లాంటి ఈ వ్యాఖ్యానాలు.. మంచి దారిలో నడిపే ప్రయత్నంలో ఉపకరిస్తాయని చెప్పవచ్చు.
***
గడ్డిపూలు మంచు బిందువులు
రచన: చల్లా వినయ మోహన్,
పుటలు :140,
వెల:రూ.100/-,
ప్రతులకు: చల్లా వినయ మోహన్,
డిప్యూటీ కలెక్టర్,
ఇంటి నెంబర్ 115-5-310,
కోలమూరు పోస్ట్,
రాజమండ్రి-533102,
సెల్ నెంబర్:9640777799