Site icon Sanchika

గడ్డిపువ్వు

[box type=’note’ fontsize=’16’] గడ్డిపువ్వుకు మెత్తని మనసుతో పాటు తెగువ కూడా ఉంటుందని చెబుతున్నారు ఎం.కె. కుమార్ ఈ కవితలో. [/box]

[dropcap]మె[/dropcap]రవడం, ఉరమడం ఆకాశం సొత్తు కాదు
అది ఈ భూమ్మీద మొలకెత్తిన పచ్చని గడ్డిపువ్వు తెగువ కూడా
గడ్డిపువ్వు మెత్తనైన మనసు కలది
కాని అనంతమైన ఆకాశపు పిడుగుల గర్జనకు ఏ మాత్రం చలించదు

అది రొమ్ము విరుచుకుని ఆత్మవిశ్వాసంతో, పదునైన చిరునవ్వుతో
మోర ఎత్తుకుని నింగికేసి చురుకైన చూపులను
చురకత్తుల వలె విసురుతుంటుంది

ఆకాశం తన విశాలమైన శరీరంతో, మరింత నల్లగా మారి
తుఫానులను సృష్టించినా, అవి వరదలై వెల్లువలా మారి
గడ్డిపువ్వును కర్కశంగా పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో
ఎన్‌కౌంటర్‌ చెయ్యచ్చు

పువ్వురాలిందనే అమానుష తృప్తితో తను సృష్టించిన విధ్వంసాన్ని  దాని తల ప్రక్కన
పడేసి సంతృప్తితో వెళ్లిపోవచ్చు
మళ్లీ వేకువకి మరో పసుపచ్చని మెత్తనైన గడ్డిపువ్వు
అదే చిరునవ్వుతో, ఆకాశం కేసి తలెత్తుకుని
నవ్వూతూనే వుంటుంది

అలసిన ఆకాశం, గెలిచానన్న తృప్తి
ముఖంలో మెరవకముందే జరిగిన హత్యకు
రంగులు పులుముకునేదానికి నానా తిప్పలు పడక తప్పదు

భూమి గర్భాన కన్నపేగు తెగుండొచ్చు
ఆ కన్నపేగును చీల్చుకుని, వేలాది పచ్చని గడ్డిపువ్వులు
ఈ భూమ్మీద తడి ఆరని రక్తపు గురుతులు సాక్షిగా
ఎర్రని వేకువలని పూయిస్తూనే వుంటాయి.

Exit mobile version