[dropcap]వె[/dropcap]న్నంటి నడుస్తున్న కాలాన్ని
అపుడపుడూ అడుగుతుంటాను
కాసేపు వెనక్కెళ్ళి వద్దామని
బాల్యపు స్మృతులని
యవ్వనపు అనుభూతులను
అల్లుకున్న బంధాలను
తెగిపోయిన అనుబంధాలను
తరిగిపోయిన మమతానురాగాలను
తనివితీరా తడుముకుందామని
వీలైనపుడల్లా అడుగుతుంటాను
దాటొచ్చిన దారులనూ ఈదొచ్చిన ఏరులనూ
దిగివచ్చిన లోయలను ఎక్కిదిగిన కొండలను
మరోసారి మౌనంగా పలకరించి చూద్దామని
మళ్ళీమళ్ళీ అడుగుతూనే ఉంటాను
తల అడ్డంగా ఊపుతూంటుంది కాలం
త్రోవ తలుపు ముందుకే తెరచి ఉంటుందని
అడుగులు వేయాల్సిన నడక ఆ దిక్కుకేననంటూ
ముందుకు నన్ను పట్టుకు లాక్కెళుతూంటుంది
నేనెంత బెట్టు చేస్తున్నా తన పట్టు విడవకుండా
భంగపడిన నా మనసును
గమనిస్తుంటుందేమో గడుసరి కాలం
జ్ఞాపకాలు కాసిన్ని తాయిలంగా ఇచ్చేస్తుంటుంది
నెమరేస్తూ నెమ్మదిగా ముందుకు సాగమంటూ