[dropcap]”అ[/dropcap]నా ఈ నడమ ఈసాన్య భారతంలా గలాటాలు అయితా
వుండాయి. దేశమంతా ఈ గలాటాల గురించి మాట్లాడతా వుండారు.
దీని గురించి రవంత చెప్పునా” అంటా కిచ్చన్నని అడిగితిని.
“నీకి అదీ తెలీదేంరా” అంటా కేకరిచ్చి ఉమిసే
“నాకి తెలిసింటే నిన్ని అడిగింట్నా?” మూతి వుజ్జుకొంటా అంగలాస్తిని.
“అట్లేలరా అంగలాస్తావు, ఈ గలాటాలు పౌరసత్వ చట్టం గురించిరా.
ఈ చట్టం ప్రకారం అక్రమంగా మనదేశానికి వచ్చిన ముస్లీంలు తిరగా
వాళ్ల వాళ్ల దేశాలకి పోవలసి వుంటుంది” అనె.
“ఇట్ల ముస్లీంలేనా వచ్చింది. ఇంగెవురూ రాలేదా?” తిరగా అడిగితిని.
“దానికేం భాగ్యం మన పక్క దేశాలైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్,
బంగ్లాదేశ్ నుంచి ముస్లీలు, కిరస్తానము వాళ్లు, బౌద్ధులు, జైనులు
ఇందువులు కూడా వచ్చిండారురా”
“వీళ్లందరూ వుండొచ్చు ముస్లీంలు మాత్రమే ఏల పోవాలా?” అని
తిరగా అడిగితిని.
“రేయ్! వీళ్లందరూ ఆయా దేశాలలా మైనారిటీలురా, కాని
ముస్లీంలు అట్లకాదు వాళ్లు మెజారిటీలు. ఆ దేశాలు కూడా ముస్లీం
దేశాలు” అని అసలు విషయము చెప్పే అన్న.
గలాటాలు = గొడవలు