గల్పికల ప్రచారం జరగాలి

1
1

గల్పికా తరువు ఎందుకంటే

(గల్పిక – నేను – కొన్నికలాలు)

భావ ప్రకటనకు అవసరమైన భాషా ప్రక్రియలు అనేకం. పాలకుల భాష పాలితుల బాష వేరువేరుగా ఉన్న కాలంలో పాలకులు ఏం చెబుతున్నారో తెలియక ప్రజలు, ప్రజలకు ఏమి కావాలో తెలియక పాలకులు, ఉన్న కాలంలో భాషాపరమైన కృషి జరిగింది. ఆ తర్వాత భాషాభివృద్ధిలో భాగంగానే అనేక ప్రక్రియలు సాహిత్యంలో మొదలయ్యాయి. డబ్బంటే డాలర్లు అన్నట్టుగా, సాహిత్యం అంటే పద్యం, భాష అంటే గ్రాంథికం అనే ప్రచారం కొన్నాళ్ళు సాగింది.

వ్యవహారిక భాషలో సాహిత్య సృష్టి జరగడానికి, కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఎన్నో ఉద్యమాలు చేయవలసి వచ్చింది. గ్రంథాలయోద్యమం, వ్యవహారిక భాషోద్యమం, మాతృభాషోద్యమం, ప్రాంతీయ భాషోద్యమం మొదలైన వాటి ఫలితంగానే, మనం ఇప్పుడు మాట్లాడుతున్న, చదువుతున్న, రాస్తున్న భాష సాధ్యమైంది.

అయితే సాంకేతిక అభివృద్ధి కారణంగా లేఖలు అంతరించి, మెసేజ్‌లు మెయిల్స్ మనకు సమాచార వ్యాప్తికి ఉపయోగంలోకి వచ్చాయి. మరో అడుగు ముందుకు వేసి, కొందరు ఒక్క అక్షరం కూడా రాయనవసరం లేకుండా, ఒక్క ముక్క కూడా చదువనవసరం లేకుండా, వాయిస్ మెయిల్‌లో సమాచార పంపిణీ, మరియు సాహిత్య ప్రచారం చేస్తున్నారు. ఎవరంగీకరించినా అంగీకరించక పోయిన కవిత్వం పలుచబడింది. కథలు కతలు పడుతున్నాయి. భాష బహురూపాలుగా మారుతున్నది. అతి మామూలుగా డబ్బాలు మోగుతున్నాయి. డబ్బాలతో సాహిత్య కుట్రలు సాగుతున్నాయి.

ప్రాంతీయ భాష, ప్రజల భాష న్యాయస్థానాల్లో ఉపయోగించాలని తీర్పులు అర్జీలు కొనసాగాలనీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలుగు (ప్రాంతీయ భాష)లో జరగాలని ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే, కరోనా లాక్‌డౌన్ సమయంలో ఒక ప్రచారం వేగం పుంజుకుంది. పద్యపూరణాలు అవధానాలు పద్యరచన పోటీలు ఊపందుకున్నాయి. చూస్తుండగానే సాహిత్య రచన అంటే పద్య రచనే అనే స్థాయికి సాహితీ పురోగమనం మొదలైంది. ఆ భ్రమలు నేటి యువరచయితలను ఒక ఆకర్షణలోకి గుంజుతున్నాయి. 

సాహిత్యరంగంలో అన్ని ప్రక్రియలు సమానమే. అన్నింటినీ సమానంగా గౌరవించి ప్రచారం చేయాలి. ఛందోబద్ధమైన చట్రాలలో సాహిత్యాన్ని బంధించడానికి, ఏదో ఒక రకమైన ప్రక్రియకు ‘పెద్దపీఠం’ వేయడం సరికాదని నా అభిప్రాయం. పాట, గేయం, పద్యం అనేవి వచనం కంటే ఎక్కువ ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయేమోకానీ. కథ జీవితానుభవాలు నేర్పుతుంది. వినోదాన్ని అందిస్తుంది. మార్గదర్శనం చేస్తుంది. సాహితీ చరిత్రలో పద్య కథల, తొలి కథల స్థానం “గాథాసప్తశతి”కి దక్కింది.. ఇందులోని కథలన్నీ దాదాపు గల్పికలనే చెప్పవచ్చు. కథ, కథ కంటే చిన్నది కథానిక, కథానిక కంటే చిన్నది గల్పిక.

వస్తువులో స్పష్టత, శిల్పంలో పదునుతో సంక్షిప్తమైనవి గల్పికలు. హిందీ సాహిత్యంలో కథానికను గల్ప అంటారు. తెలుగులో వేరు వేరు ప్రక్రియలుగా కథానిక, గల్పిక గుర్తించ బడ్డాయి. 

గల్పిక లక్షణాలు:

వ్యంగ్యం, సంక్షిప్తత గల్పిక ప్రధాన లక్షణాలు. వర్ణనలు లేకుండా ఒక సంఘటన లేదా సన్నివేశం ద్వారా, చెప్పదలుచుకున్న విషయాన్ని పరోక్షంగా కొసమెరుపుగా చెప్పడం గల్పికలలో కనిపిస్తుంది. కథా కథనానికి ప్రాధాన్యత లేకుండా, ఒక మార్పును సూచించడం గల్పిక లక్షణమని సాహితీవేత్తలు సూచించారు.

గల్పికకు వెటకారం ప్రాణం. వ్యంగ్యం కాయం. అందుకే చూడగానే ఆకర్షణ లేని మనిషిలా అనిపిస్తుంది. ఒక్కోసారి అశ్చర్యాన్ని కలిగిస్తుంది.. కథానిక మనిషి జీవితంలో ఒక కోణాన్ని, లేదా ఒక పార్వ్శాన్ని చిత్రీస్తే, గల్పిక ఆ కోణంలోని కొన్ని దశల విశేషాలను స్పృశిస్తుంది.

గల్పిక ప్రక్రియ కొత్తదేమీ కాదు. పాశ్చాత్య సాహిత్య అనుకరణ స్మాల్ స్టోరీకి తెనుగీకరణ కథానిక అంటారు. కానీ బోధిసత్వుని బోధనలలో బౌద్దసాహిత్యంలో ఎక్కువ గల్పికలును పోలిన చిన్న కథలు ఉన్నాయి. బైబిల్లో కూడా గల్పికలు ఉన్నాయి. పురాణేతిహాసాలలో రామాయణ భారతాలలోనూ గల్పికలు బోలిన పిట్టకథలు కోకొల్లలు. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి పుస్తకాలలో కొన్ని గల్పికలు వంటివి కనిపిస్తాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రహేళికలు సామెతల రూపంలో కొన్ని గల్పికలు ఉన్నాయి.

ఆధునిక సాహిత్యంలో కొడవటిగంటి కుటుంబరావు గల్పికను ఆ పేరుతోనే రాసి ప్రచారం కలిగించారు. వారు దాదాపు 52 గల్పికలు రాశారు. 

కొడవటిగంటి కుటుంబరావు రాసిన రెండు గల్పికలు చెప్పుకోదగ్గవి. ఒకటి ‘ఫారిన్ కొలాబొరేషన్’ రెండవది ‘స్వాతంత్రం ఖరీదు’.

తెలంగాణ సాహిత్యంలో నెల్లూరి కేశవస్వామి, నందగిరి ఇందిరాదేవి, యశోదారెడ్డి, బొమ్మ హేమాదేవి రచనల్లో కొన్ని గల్పికలు ఉన్నాయి. అంతేకాక కాలువ మల్లయ్య 1984లో ‘సత్కారం’, ‘విధిలిఖితం’ వంటి గల్పికలతో మొదలు పెట్టి ‘దేశద్రోహం’, ‘ముడుపు’, ‘స్త్రీ సౌఖ్యం’, ‘గడ్డుప్రశ్న’ వంటి ఇరవై గల్పికలు రాశారు.

రామా చంద్రమౌళి ‘తెగిన చుక్కలు’, ‘నిర్నిద్ర’, ‘జరిమానా’ మొదలనలబై గల్పికలు రాశారు.

బి.ఎస్.రాములు 1983లో ‘బాతాల పోశెట్టి’, ‘ఏతుల ఎంకటి’ వంటి గల్పికలు రాస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన జాతశ్రీ, శిరంశెట్టి కాంతారావు గల్పిక రచన చేశారు.

పెద్దింటి అశోక్ కుమార్ “మానేటి కథలు” పేరుతో గల్పికలు “మంజీర వెబ్ మ్యాగజైన్”లో రాశారు. 

గల్పికలకు సంబంధించిన వ్యాసాలను విహారి, పోరంకి దక్షిణామూర్తి మొదలైన వారు రాశారు. మంజీర, నెచ్చెలి, విహంగ, సంచిక, మాలిక, సాహితీ గోదావరి, సిరిమల్లి వంటి మ్యాగజైన్లు గల్పికలను ప్రోత్సహిస్తున్నాయి. 

కేతు విశ్వనాథరెడ్డి, అత్తలూరి విజయలక్ష్మీ, తాతినేని వనజ‌, చివుకుల శ్రీలక్ష్మీ మొదలైన వారు గల్పికలను వివిధ పత్రికలలో రాస్తూన్నారు.

కార్డు కథలు, చిట్టి కథలు, కాలమ్ కథలు, పేజీకథలు ఆన్లైన్ సమూహాలలో రాస్తూన్నారు. పోటీలు కూడా నిర్వహిస్తూన్నారు. కానీ గల్పికా ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం జరగాలి. పరిశోధనలు జరపి గల్పికలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి పునఃప్రచారం చెయ్యాలి. 

ప్రస్తుతం “గల్పికా తరువు” అనే ఈ సంకలనం కోసం గల్పికలను సేకరించే ప్రయత్నంలో 104 గల్పికలు వచ్చాయి. ఇందులో పేరుపొందిన వారు, పేరు పొందవలసిన వారూ, అందరూ ఉన్నారు. ఇటువంటి పుస్తకాలు ప్రతి ఇంట్లో ఉండాలి, ఇవి పఠనాభిలాషను పెంచడంతో పాటు యువ కథారచయితలకు మార్గదర్శనం చేస్తాయి.

11-11-2020న మొదలైన ప్రయత్నం నెలరోజుల లోపే పూర్తయ్యింది. ఇందులో ఒక ప్రయోగం చేశాను. రచయిత పేరులేకుండా కేవలం రచనల పేర్లనే ప్రచురించాను, ఔను కారణం మీరనుకునేదే, రచయితల లేదా రచయిత్రుల పేర్లు చూసి రచన చదవడం అనే అలవాటును నిరుత్సాహ పరచడం నా ఉద్దేశం. రచనను ఆస్వాదించడమే లక్ష్యంగా ఈ కథలు పాఠకులు చదవాలనే నా ఆకాంక్ష. మరెట్లా ఎవరిది ఏ రచనో ఎట్లా తెలియాలంటారా? రచయతల/రచయిత్రుల చిరునామాలతో సహా పుస్తకం చివరికి ఇచ్చాను చూడండి. 

నేనొక ప్రయత్నం చేశాను. చేయవలసింది చాలా ఉన్నది. 

(పైన పేర్కొన్న రచయితలు, రచనలు, పత్రికలే కాక ఇంకా గల్పికా రచన చేసిన వారు ఉండే ఉంటారు, ప్రచురించిన పత్రికలు ఉండే ఉంటాయి. నేను తవ్విన చోట ఆ రత్నాలు దొరకలేదు, నేను సంపూర్ణ తవ్వకాలు జరపుటకు అశక్తురాలను).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here