[dropcap]’గ[/dropcap]మనం’ – ఇటీవలే ‘ఓటిటి’లో విడుదల అయి ‘AMAZON PRIME’ లో ప్రదర్శింపబడుతున్న చిత్రం ఇది.
KRIA FILM CORPORATION వాళ్ళు నిర్మించిన చిత్రం. కథ-కథనం-దర్శకత్వం సుజన రావు.
నిరుడు, ఈ ఏడు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వర్షాల వల్ల బస్తీల్లో బ్రతికేవారు, దిగువ మధ్యతరగతి జీవులు ఎదుర్కున్న సమస్యలని నలుగురికీ తెలియచేయాలనుకున్న చిత్రం!
ముఖ్య పాత్రలు శ్రియ శరణ్, బిత్తిరి సత్తి, చారుహాసన్, వాసు ఇంటూరి, సంజయ్ మొదలైన వారు పోషించారు.
నాలుగు – ఐదు పాత్రల చుట్టూ కధ నడుస్తూ ఉంటుంది.
శ్రియ పాత్ర పేరు కమల. ఆమె భర్త.. ఉద్యోగం కోసం దుబాయ్ వెళతాడు. కమలకి చెముడువల్ల మాటలు వినపడవు. భర్త దగ్గర లేకపోవటం వల్ల, తన జీవితం గడవటానికి, ఒంటరిగా పసిబిడ్డని పెంచటానికి ఒక హోల్ సేల్ టైలరింగ్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటుంది. ఆ సంస్థకి యజమాని వాసు ఇంటూరి.
నీటి సప్లైకి, డ్రైనేజ్ అవసరాలకి రోడ్ల కింద వేసే పెద్ద పెద్ద సిమెంట్ పైపులే తమ శాశ్వత ఆవాసాలుగా బతికే జీవులు కొందరు అక్కడికి దగ్గరలో ఉంటుంటారు. అందులో ముగ్గురు కుర్రాళ్ళు కూడా ఉంటారు. వారు మునిసిపాలిటీ చెత్త డంపింగ్ యార్డ్‌లో పాత పేపర్లు, సీసాలు, డబ్బాలు ఏరుకుని, వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అలా వాళ్ళు కాయితాలు ఏరుకునేటప్పుడు ఒక్కోసారి సగం తాగి వదిలేసిన మంచినీళ్ళ బాటిల్స్, సగం తిని వదిలేసిన ఆహారం కవర్లల్లో దొరుకుతూ ఉంటుంది. అది మహద్భాగ్యంగా ఆరగిస్తూ ఆకలి తీర్చుకుంటూ ఉంటారు.
వారిలో ఒకడు క్యాటరర్ల దగ్గర హెల్పర్‌గా కూడా పని చేస్తూ ఉంటాడు. అలా వారు అప్పుడప్పుడు వాడికిచ్చిన ఆహారాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా పెడుతూ ఉంటాడు. ఆ రోజు వాళ్ళకి పండగే!
ఒకసారి క్యాటరర్స్‌కి అదనపు హెల్పర్స్ అవసరమయిందని… మిత్రులిద్దరినీ కూడా ఒక ధనికులింట్లో పుట్టిన రోజు డిన్నర్‍కి తీసుకెళతాడు. అక్కడ ‘Happy birthday to you’ అని అందరూ కేరింతలు కొడుతూ పాడుతుంటే.. అందరిలోకి చిన్నవాడు బర్త్ డే అంటే ఏమిటి అని అడుగుతాడు. మనబోటి వారికి అవి ఉండవు అని చెబుతాడు, వాడి అన్న.
అక్కడ కేక్ చూసి తినాలని చిన్న వాడు ఆశపడతాడు. అక్కడి యజమాని సహజంగానే వాడిని తిట్టి పంపేస్తాడు.
ఇక అప్పటి నించీ వాడికి కేక్ తినాలనే కోరిక మొదలయి అది పెద్ద వటవృక్షంగా పెరుగుతుంది. కేక్ ఖరీదు 500 రూపాయలుంటుందని తెలుసుకుని, ఆ చిన్న పిల్లవాడు ఆ 500 సంపాదించటానికి వాళ్ళు ఎన్ని పేపర్స్ ఏరారో అనుకుంటాడు తనలో తను! వాడి దృష్టిలో ఎవరికైనా పాత కాయితాలు, సీసాలు ఏరుకోవటం వల్లనే డబ్బు వస్తుంది!
ఎలాగయినా అంత సంపాదించాలని ఇక ఆ రోజు నించి కష్టపడి డబ్బు పోగేస్తూ ఉంటారు.
వీళ్ళు ఉండే చోటికి దగ్గరలో ఇంకొక అల్ప జీవి… మెడకి ఒక చిన్న బల్ల లాంటిది వేలాడేసుకుని దాని మీద చిన్న చిన్న బొమ్మలు పెట్టి అమ్ముతూ ఉంటాడు. వీళ్ళ కంటే సంపాదనలో వాడొక మెట్టు పైన ఉన్నట్టు! ఆ పాత్ర బిత్తిరి సత్తి పోషించాడు.
కమల ఉండే బస్తీలో రెండు ముస్లిం కుటుంబాలు ఉంటాయి. ఒక ఇంట్లో ఒక యువకుడు ‘ఆలి’, అతని తాత నాయనమ్మ కలిసి బతుకుతూ ఉంటారు. ఆ యువకుడికి క్రికెట్ ప్రాణం. ఎప్పటికైనా భారత్ తరఫున జాతీయ స్థాయిలో ఆడాలని కోరిక. దానికోసం చేసే కృషి వల్ల చదువుని అశ్రద్ధ చేస్తూ ఉంటాడు. ఈ విషయం మీద తరచు తాతా మనవల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది.
ఆ దగ్గర ఇంకో ఇంట్లో ఉండే ముస్లిం యువతి ‘జహరా’ని ఈ యువకుడు ప్రేమిస్తూ ఉంటాడు. అది ఆ అమ్మాయి తండ్రికి ఇష్టం ఉండదు. సందర్భం వచ్చినప్పుడల్లా తన కూతురిని కేకలెయ్యటం, ఆ యువకుడిని అవమానించటం చేస్తూ ఉంటాడు.
కమల తన సంపాదనలో కొంత భాగం ఖర్చు పెట్టి తన చెవికి మిషన్ పెట్టించుకుంటుంది. అంతకు ముందు వరకు పబ్లిక్ ఫోన్ లో నించి దుబాయ్ లో ఉన్న భర్తకి ఫోన్ చేయిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పట్ల జాలితో… ఆ షాప్ అతను ఆమె భర్త ఏం మాట్లాడాడో చెప్పడు.
మిషన్ పెట్టించుకున్న తరువాత తనే భర్తకి ఫోన్ చేస్తుంది. అతనికి తనకొక పిల్ల పుట్టినట్టు తెలియదనీ… ఈ చెమిటి భార్యే వద్దనుకుంటుంటే ఆ పిల్ల ఇంకొక లంపటం అనీ.. అతనికి ఈమె పట్ల ఏ అక్కర లేదని, వేరే పెళ్ళి చేసుకుని హాయిగా బతుకుతున్నానని, ఇంకెప్పుడూ తనకి ఫోన్ చెయ్యద్దనీ చెప్పేసరికి ఆ అమ్మాయి ఆశలు కుప్పకూలిపోతాయి.
ఇలా ఈ నలుగురి జీవితాలు…. భవిష్యత్తు మీద ఆశ పడాలో… లేదో తెలియక భారంగా నడుస్తున్న సందర్భంలో ఒక రోజు రాత్రి పెద్ద వర్షం మొదలవుతుంది. ఆకాశానికి చిల్లు పడ్డట్టు పడుతున్న వాన రోడ్లు, కాలనీలు, ఇళ్ళు ముంచెత్తుతూ రెండు-మూడు రోజులు ఎడ తెరిపి లేకుండా పడుతుంది. రాత్రి మామూలుగా తన బిడ్డతో బస్తీలో తనుండే ఆ ఒక్క గదిలో నిద్రిస్తుంది కమల. తెల్లవారేసరికి విజృంభించిన వర్షంతో, ఇంటి ముందు ట్రక్ ఆపి ఉన్నందువల్ల బయటికి మాత్రమే తెరుచుకునే అవకాశం ఉన్న తలుపులు, తెరుచుకోక ఇంట్లో చిక్కు పడిపోతుంది. ఇల్లు వర్షం నీటితో నిండి పోయి ఇంట్లో వస్తువులు ఆ నీటిలో తేలుతూ ఉంటాయి. అంతకంతకీ పెరుగుతున్న నీటిలో నించి బయటపడటానికి తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది. అన్ని ప్రయత్నాలు వృథా అవుతాయి. వాన వల్ల చుట్టుపట్ల జనసంచారం లేక హోరువానలో ఆమె ఆక్రందన ఎవరికీ వినిపించదు.
అలా ఆ వర్షంతో అందరి జీవితాలు అతలాకుతలమైపోతాయి.
కేక్ తినాలని ఆశపడిన చిన్న పిల్లవాడు, తాము అప్పటి వరకు సంపాదించిన 200/- రూపాయలకి తోడు మరో 300/- సంపాదించటానికి బయటికివెళ్ళాలని అన్నతో పోరు పెడుతుంటాడు.
అలా ఆ వర్షంలోనే మెడలో చెక్క బల్ల మీద బొమ్మలమ్మే వ్యక్తి (బిత్తిరి సత్తి) మట్టి వినాయకుడి బొమ్మలు అమ్ముతూ ఉంటాడు. అతను అత్యవసరంగా తన ఊరు వెళ్ళవలసి వస్తుంది. అప్పుడే బయటికొచ్చిన ఈ కుర్రాళ్ళు తమకి ఇంకా కావలసిన 300/- కోసం వచ్చినట్టు చెప్పి ఎలాగయినా తమకి ఆ డబ్బు సంపాదించే మార్గం చెప్పమంటారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్న బొమ్మలమ్మే వ్యక్తి, తన బొమ్మల ఖరీదు మొత్తం 500/- అని వాళ్ళదగ్గరున్న 200/- తనకిచ్చెయ్యమని, మిగిలిన 300/- బొమ్మలమ్మాక ఇమ్మని చెప్పి… 500/- కి మించిన లాభంలో వాటా ఇమ్మని చెప్పి వెళ్ళిపోతాడు.
అంతకంతకీ ఉధృతమవుతున్న వానలో మట్టి బొమ్మలు కరిగిపోతుండగా, అప్పటివరకు తాము కూడబెట్టుకున్న 200/- పరాయి పాలవ్వగా ఆ కుర్రాళ్ళిద్దరూ ఆశగా ఎలాగయినా ఆ బొమ్మలు అమ్మాలని పట్టుదలతో వర్షంలో తడుస్తూ ప్రతి వారిని బొమ్మలు కొనుక్కోమని ప్రాధేయపడుతూ ఉంటారు. బొమ్మలేమో కరిగిపోతూ ఉంటాయి.
అంత కష్టపడినా… కేక్ తినటం అనే అతి చిన్న ఆశ ఆ పిల్లలకి నెరవేరలేదు.
బస్తీలో ఉండే ముస్లిం యువకుడు ‘ఆలి’, ఆటలో ఎంత ప్రావీణ్యత ఉన్నా కూడా… రంజీకి ఆడే లిస్టులో పేరు ఉండాలంటే 25,000/- కట్టాలని తెలుసుకున్న అతని ప్రియురాలు.. ‘జహరా’ ఇంట్లో… తండ్రి వేరే అవసరం కోసం దాచిన డబ్బు తెచ్చి ‘ఆలి’కి ఇవ్వాలనుకుంటుంది. అది కనిపెట్టిన తండ్రి ‘ఆలి’ తాతని నానా దుర్భాషలాడి కూతురిని తీసుకెళ్ళి ఇంట్లొ బంధిస్తాడు.
చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న ‘ఆలి’ని ఈ సంఘటనతో కలిగిన కోపంతో తాత ఇంట్లో నించి వెళ్ళగొడతాడు.
అలా… వానలో బొమ్మలమ్మాలనుకున్న కుర్రాళ్ళు, తాత చేత వెళ్ళగొట్టబడిన ‘ఆలి’, తండ్రి చేత బంధించబడిన ‘జహరా’, భర్తతో తిరస్కరించబడిన కమల వర్షంలో పడరాని పాట్లు పడుతుండగా… పక్కనే ఒక హాల్లో ఒకావిడ పాట కచేరి చేస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న కొందరు పాఠశాల విద్యార్ధులు తిరిగి తమ ఇళ్ళకి బయలుదేరతారు. వారెక్కిన బస్సు వాన నీళ్ళల్లో చిక్కుబడి తలుపులు లాక్ అవుతాయి. వాళ్ళు కంగారు పడుతుండగా, అటుగా వెళుతున్న ‘ఆలి’ ప్రాణాలకి తెగించి వారిని కాపాడతాడు.
ఆ వార్త మరునాడు పేపర్‌లో చూసి జహరా తండ్రి, ఆలి తాత ఒక్కసారిగా ఆలి గొప్పతనాన్ని గుర్తిస్తారు.
కమల చివరికి కిటికీ బద్దలు కొట్టి బయట పడుతుంది.
ఈ చిత్రానికి తీసుకున్న కధా నేపథ్యం గొప్పదే కానీ… మెలోడ్రామా ఎక్కువగా ఉన్నది. ఆ పాత్రలకి శ్రియ, చారు హాసన్, బిత్తిరి సత్తి, సంజయ్, వాసు ఇంటూరి లాంటి సీనియర్ నటులు అనవసరం అనిపించింది. వారిని పెట్టటం ద్వారా సినిమాకి ఆకర్షణ, ప్రాధాన్యత పెంచవచ్చని భావించారేమో నిర్మాత-దర్శకులు.
సినిమా మొత్తం మీద ఒక continuity ఉన్నట్టు అనిపించలేదు. సంఘటనలు ఒక దానితో ఒకటి పెనవేసుకున్నట్టుగా కాక, ముక్క ముక్కలుగా ఉన్నట్టనిపించింది.
స్కూల్ పిల్లలని చూపించటం కోసమే పాట కచేరి… దానికి వారి నృత్యం ఒక అతుకు లాగా ఉంది.
కమల పాత్రకి చెముడు పెట్టటం వెనక, జాలి కలిగించటం తప్ప పెద్ద ప్రాధాన్యత ఉన్నట్టనిపించలేదు. భర్త వదిలెయ్యటానికి అది కారణం కానక్కరలేదు. ఆమె చెముడు, భర్త వదిలేసిన అసహాయత, వర్షంలో చిక్కుపడటం.. ఒక దానికి ఒకదానికి లింక్ లేదనిపించింది.
కొంచెం ఆలోచించి ఇంకా బాగా తియ్యచ్చు అనిపించింది.