గేమ్‌ ఓవర్ : భయపెట్టి కాలక్షేపం ఇస్తుంది

0
3

[box type=’note’ fontsize=’16’] “చివరి ముఖ్యమైన ఘట్టాలు మూడు కథనాలతో చూపించాడు దర్శకుడు. అది కాస్త ఆకర్షణీయంగా వుండి, ఈ కథకు అతికింది. మొత్తం మీద చూడతగ్గ (మినహాయింపులతో) చిత్రమే” అంటున్నారు పరేష్ ఎన్. దోషిగేమ్‌ ఓవర్‌‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]నే[/dropcap]ను సినెమా చూస్తే మొదట దానికి వుండాల్సిన కనీస హామీ (మినిమం గేరంటీ) వున్నదా లేదా చూస్తాను. అది మరేం లేదు సినెమా ఆడుతున్నంత సేపూ నా దృష్టిని పట్టుకుని నిలుపుకుంటుందా లేదా అన్నది. మంచి చెడ్డలు నెమ్మదిగా నెమరవేసుకున్నప్పుడు యెంచవచ్చు. ఆ కాసేపు అపనమ్మకాన్ని ఇష్టపూర్వకంగా తేలుతూ వదిలేసి సినెమా చూస్తాను. ఆ లెక్కలో ఈ చిత్రం పాసవుతుంది.

అశ్విన్ శరవణన్ (ఇదివరకు ఇతని చిత్రాలు నేను చూడలేదు) యేకకాలంలో తమిళ-తెలుగు భాషల్లో తీసిన చిత్రం ఇది. హిందీ లో కూడా డబ్ అయి ఆడుతోంది. కావ్యా రాంకుమార్ తో కలిసి కథ వ్రాసుకున్నాడు. తెలుగు సంభాషణలు కంచర్ల వెంకట్ వ్రాశాడు. ముఖ్యంగా ఇది సస్పెన్స్ చిత్రం. వూరికి దూరంగా వుండే ఇళ్ళల్లో హంతకులు ప్రవేశించి చేసే బీభత్సం దీని కథ. హత్యల కోసం కాకపోయినా దోపిడి భయాలు నగరం బయట విసిరేసినట్టు వున్న ఇళ్ళల్లోని వారికి వున్న విషయమే. ఇక ప్రతిఘటిస్తే హత్యలు కూడానూ.

వొక యేడాది క్రితం వొక అత్యాచారానికి గురైన స్వప్న (తాపసీ పన్ను) చాలా కలత పడుతుంది. ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది, ఈ జాగ్రత్త తీసుకోవాల్సింది లాంటివి మాట్లాడే తండ్రికి యేమీ చెప్పలేక, తన తప్పు యేమీ లేకపోయినా ఆ అవమాన భారం, ఈ అవమాన భారం రెండూ మొయ్యలేక తల్లిదండ్రుల నుంచి దూరంగా వొక్కతే వుంటుంది, నగరం చివరి బంగళాలో. నిక్టోఫోబియా (చీకటంటే భయం) వున్న ఆమెకు సాయంగా పనికత్తె కలమ్మ (వినోదిని). ఆఫీసుకెళ్ళి అందరితో మెలగలేక ఇంటి నుంచే పని చేస్తుంది ఈ వీడియో గేం డెవెలపర్. నిరుడు పెట్టించుకున్న పచ్చబొట్టు ఆమె జీవితంలో విచిత్రమైన పరిణామాలు తెస్తుంది. గత యేడాది విచిత్ర పరిస్థితుల్లో వొక వొంటరి అమ్మాయిని ప్లాస్టిక్ కవర్ తో ముఖం కప్పేసి ఊపిరాడకుండా చేసి చంపి, తలను నరికి మొండేన్ని తగలబెట్టేస్తారు కొందరు. టీవీలో కూడా ఇదే వార్త : వూరి బయట వున్న ఇళ్ళల్లో కొందరు గుర్తు తెలియని దుండగులు వొంటరి స్త్రీలను వేటాడి దారుణంగా చంపేస్తున్నారని. ఇంత వరకూ తెలిసిన తర్వాత ప్రేక్షకుడిలో కూడా ఉత్కంఠ రేగుతుంది. సినెమా కూడా దానికి తగ్గట్టుగానే వుంటుంది, కాబట్టి అక్కడక్కడా చిరాకు తెప్పించినా చివరిదాకా చూసేలా చేస్తుంది ఇది.

మనం ఊహించుకున్నట్టే ముగ్గురు ముసుగులు వేసుకుని ఆ ఇంటి మీద దాడి చేస్తారు. ముందు కాపలాదారుని చంపి తర్వాత ఇంట్లో ప్రవేశిస్తారు. అసలే భయవిహ్వల అయిన స్వప్న ఇదంతా యెలా యెదురుకుంటుంది అన్నది చూస్తేనే బాగుంటుంది. అదంతా ఇక్కడ చెప్పి మీ అనుభవాన్ని పలుచన చేయలేను.

ముందుగా తాపసి పన్ను నటన మనల్ని ఆకర్షిస్తుంది. ఈ పాటికి ఆమెనుంచి మంచి నటన ఆశించడం, భంగపడకపోవడం మామూలు అయి పోయింది. వినోదిని కూడా బాగా నటించింది. అశ్విన్ దర్శకత్వం బాగుంది. సస్పెన్స్ చిత్రాలకు మంచి సంగీతం అవసరం చాలానే వుంటుంది. దీనికి సంగీతం ఇచ్చిన రాన్ ఎథాన్ యోహన్ మంచి నేపథ్య సంగీతమే ఇచ్చాడు. ఎ వసంత్ కెమెరా పనితనం కూడా బాగుంది. వీడియో గేమ్స్ లో వివిధ స్థాయీ భేదాలతో వున్నట్టే ఇందులో చివరి ముఖ్యమైన ఘట్టాలు మూడు కథనాలతో చూపించాడు దర్శకుడు. అది కాస్త ఆకర్షణీయంగా వుండి, ఈ కథకు అతికింది.

సినెమా చూడని వాళ్ళు ఇక్కడితో ఆగిపోయి చూసిన తర్వాత చదవండి. కథలో బలం తక్కువ, కథనం బాగుండబట్టి మనం చివరి దాకా చూస్తాము. వొక్క సస్పెన్స్ అన్న విషయాన్ని పక్కన పెడితే దర్శకుడు కొన్ని సాంఘిక వాస్తవాలను కూడా కథలో అల్లాడు. కాని ఈ జానర్ వాటిని వివరంగా విశదంగా చర్చించడానికి అవకాశమివ్వదు. పోనీ ఆ హంతకుల గురించిన సమాచారం తగుమాత్రంగా వుందా అంటే అదీ లేదు. వాళ్ళు యెవరు, ఇలా హత్యలు చేయడానికి కారణం యేమిటి వగైరా యెక్కడా చెప్పడు దర్శకుడు. యేడాది క్రితం స్వప్నను కొందరు యెత్తుకెళ్ళి కాళ్ళూ చేతులూ నోరూ కట్టేసి వొక చీకటి ఇంట తీసుకెళ్తారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా అదంతా కెమెరాతో చిత్రీకరిస్తారు. తర్వాత ఆ వీడియో కూడా ఇంటెర్నెట్ లో పెడతారు. ఆమె కేఫ్ కి వెళ్ళినా కొందరు ఆ వీడియో ఆధారంగా ఆమెను పోల్చుకోవడం, అసహ్యంగా యెగతాళిగా నవ్వడం ఆమెకు చిత్ర వధను కలిగిస్తుంది. ఇక ఇంట్లో తండ్రి ఆమె బాధను అర్థం చేసుకోక అందుకే రాత్రిళ్ళు ఆలస్యంగా బయట తిరగొద్దు అనేది, ఇలా చేయాల్సింది కాదు వగైరా అంటాడు. అసలు ఆమె తప్పే లేనప్పుడు, ఆమె పట్ల సానుభూతి లేకపోగా ఇలా మాట్లాడటం ఆమె మానసిక స్థైర్యాన్ని బాగా తగ్గించేస్తాయి తండ్రి మాటలు. ఇల్లొదిలి వూరికి దూరంగా వొక బంగళాలో కలమ్మ అనే మైడ్ తోడుతో వుంటుంది. కాని పనికి వెళ్ళి అందరితో కలవలేక, ఇంటి నుంచే పని చేస్తుంది. ఇక్కడ కథ కొంచం సామాజికతను మన ముందు తెస్తుంది, గానైతే పైపైకి. నాకు దేవదాసు కథను ప్రస్తుతకాలం లో చిత్రించిన అనురాగ్ కాశ్యప్ “దేవ్ డి” గుర్తుకొచ్చింది. అప్పట్లోనే వొక స్కూల్ విద్యార్థిని తన స్నేహితుడితో గడిపిన క్షణాలను అతనే మొబైల్ లో షూట్ చేసి, తర్వాత మిత్రులతో పంచుకుంటాడు తన మగతనం చాటుకోవడానికన్నట్టు. అది కాస్తా ఇంటెర్నెట్ యెక్కేస్తుంది. ఆ ఉదంతాన్ని అనురాగ్ చాలా నైపుణ్యంగా ఈ చిత్రంలో వాడుకున్నాడు. తండ్రి అవమానం భరించలేక ఆత్మ హత్య చేసుకుంటాడు, కూతురు ఇల్లొదిలి వెళ్ళి పోతుంది కాని జరిగిన దానికి వొక్క క్షణం కూడా తల దించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. వొక సామాజిక ఘటనకు సినెమా యే విధంగా ప్రజల దృష్టికోణాన్ని మలచడానికి ప్రయత్నిచాలి (ప్రయత్నమేగా వాళ్ళు చేయగలిగేది, మిగతా సగం ప్రేక్షకుడు చేయాలి) అన్నదానికి అది వొక గుర్తుండిపోయే చిత్రం.

ఇందులో దాదాపు అలాంటి సంఘటనలే కొద్ది తేడాతో వున్నా దాన్ని నామమాత్రంగా స్పృశించి వూరుకున్నాడు. “మనకు వాస్తవానికి రెండు జీవితాలు వున్నాయి, రెండోది మనకున్నది వొకే వొక్క జీవితం అన్న జ్ఞానం వచ్చిన వెంటనే మొదలవుతుంది” అని వ్రాసివున్న వొక గ్రీటింగ్ కార్డు స్వప్నలో ధైర్యాన్ని నింపుతుంది. మరణమైనా రాని, కలమ్మా, మనం చివరిదాకా పోరాడుదాం, భయం వద్దు అంటుంది. ఇక వో స్త్రీ పాత్ర ధైర్యవంతురాలుగా విపత్కర పరిస్థితులను యెదురుకునేటప్పుడు ఆమెను వికలాంగురాలుగా కూడా చేస్తే ఇంకా ప్రభావవంతంగా వుంటుంది కదా అని, ఆమె చేత బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయించి, కాళ్ళు పోయి ప్రాణం నిలిచినట్టు కథ అల్లాడు. సరే ఇవన్నీ మనం వూహించగల మసాలాలే. పెద్ద ఇబ్బంది వుండదు. కాని ఆ పచ్చబొట్టు వెనుక వున్న మూఢనమ్మకపు కథ చాలా చిరాకు వేస్తుంది. సైకియాట్రిస్టులు తమ పేషంట్లను చికిత్స చేసేప్పుడు VR technologies వాడతారా లేదా నాకు అనుమానమే.

మొత్తం మీద చూడతగ్గ (మినహాయింపులతో) చిత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here