Site icon Sanchika

గాంధారి వినతి!!

(రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ రచన ‘గాంధారిర్ ఆబేదొన్’ ఆధారంగా, స్వేచ్ఛా రచనగా వ్రాసిన ‘గాంధారి వినతి!!’ అనే గల్పికని అందిస్తున్నారు శ్రీ సముద్రాల హరికృష్ణ.)

దుర్యోధనుడు: అభివాదనము తండ్రీ!

ధృతరాష్ట్రుడు: తంత్రాల గడసరీ, నీ ఆశ తీరినట్టేనా?! రాజ్యమంతా హస్తగతమైంది, ఆనందమేనా?!

దుర్యో: ఔను తండ్రీ, జయం నాదే! నేనిప్పుడు నిజమైన విజేతను! నేను ఆనందం కోసం చేయలేదు ఇదంతా! జయాభిలాషే నన్ను ముందుకు నడిపింది తండ్రీ! ఆ జయం నాకు దక్కింది నేడు. యోధ్ధకు శత్రు పరాజయం కన్నా ఆనందం ఏముంటుంది?! అదీ, ఆ విజయానంద మధు కలశం నా ముందుంది నేడు, అదే నా గర్వ కారణం! స్పర్ధ అనే సముద్రం తరచగా వచ్చిన అమృతం, ఆహా ఇది అనుపమం! ఆ పాండవులతో కలిసి ఉన్నపుడు, అదేదో అలసత్వంతో గడిపేశాం, చంద్రుడిలో మచ్చలు లాగా, ఏదో ఒక, లక్ష్య శూన్యతతో! కానీ వారి ప్రాభవం పెరిగే కొద్దీ, వారి గుణాలకూ, వారి పరాక్రమానికీ ప్రజామోదం నానాటికీ పెరిగి, ఆ కీర్తి గానాలు వినటమే మా పనిగా పర్యవసించటం మొదలైంది. వారి వైభవాచలాల పాదాలలో, బొరియల్లో కాలం వెళ్ళదీసే కప్పలలాగా, కుంచించుకు పోయాం!

ఇవాళ, అదంతా మార్చేసి, తారుమారు చేసేశాను. విజయం చేజిక్కించుకున్నాను. ఆ పాండవులు, నిస్సహాయంగా అడవి దారి పట్టారు. నాది ఇవాళ సంపూర్ణ విజయం! శత్రునిర్విశేషం!

ధృత: నువ్వు చేసిన పనికి విజయమని పేరు పెట్టావా?! మరిచిపోయావా, వారు నీ రక్త బంధువులు! ఎంత గర్హనీయం!

దుర్యో: అబ్బా, మీరన్నట్టే, ఆ విషయం పూర్తిగా మర్చిపోతే ఎంత బాగుంటుంది తండ్రీ!! మా మూలాలు ఒకటే అయినా, మా స్థాయిల్లో అంతరం?! ఎంత బాధించేది నన్ను, గుండెలో ముల్లై! ఎవరో పరిచయం లేని దూరస్థులయినా, ఇంత దాకా వచ్చేది కాదు. రాకా శశి, సూర్యుడి స్థానాన్ని ఎన్నడూ ఆశించదు, ఆ స్థానం చూసి ఎప్పుడూ అసూయా పడదు. దానికి బాగా తెలుసు, దినరాజు- సూర్యుడు ఒక్కడే అని! మరొకరికి ఆస్కారమే లేదక్కడ! ఇద్దరు సూర్యులు ఆకాశంలో ఇమడరు!

ఇవాళ్టితో, నాది ఏకచ్ఛత్రాధిపత్యం, ఒకే సూర్యుడు ఈ కురుమహాసామ్రాజ్య విశాలగగనానికి! తేల్చేశాను! అది నేనే!

ధృత: ఓసి అసూయా! నువ్వొక నీచ విషభర సర్పానివే!

దుర్యో: కాదు జనకా! స్పర్ధ నీచమైనది కాదు, అది ఉన్నతం! గొప్పవారి లక్షణం, విజయపథంలో నడిపించే ఇంధనం! గడ్డిపోచలు మాత్రమే తండ్రీ, నిలకడ లేక ఊగిపోతూ, సమ్మర్దంలో పెరిగేది! మహా వృక్షాలు ఎప్పుడూ నిటారుగా, ప్రత్యేకంగా, అల్పాలకు అందని ఎత్తుల లోనే! ఇంకేదీ, వాటి ఛాయల్లో పెరగవు, పెరగలేవూ!! మిణుకుమిణుకుల తారలు ఎన్నో గుమికూడి ఉంటే ఏం లాభం తండ్రీ, ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు అంతే!

శాసకులు వీరే! పాండవుల తార అదిగో, సుదూరాన  మసక వెలుగులో, అస్తమిస్తున్నదై! మా కౌరవుల భాగ్యరేఖ, ఇదిగో విజయకేతనమై వినీలాకాశంలో ఆనందనాట్యం చేస్తున్నదై!

***

ధృత: ఇవాళ ధర్మం ఓడిపోయినట్టు ఉన్నది!

దుర్యో: ఓహో, తండ్రీ, సామాన్యుల ధర్మాన్ని, క్షత్రియుల ధర్మంతో కలగలిపి మాట్లాడవద్దు! సామాన్యులకు ఒప్పే, వారి సంపదను పంచుకోవటం! కానీ మన లాంటి సార్వభౌములది ప్రత్యేక స్థానం, ఇక్కడ పెంచుకోవడమే కానీ, పంచుకోవటం ఉండదు! ఒక వేళ ఎవరైనా సమ ఉజ్జీ భాగస్వామ్యానికి ఉంటే, వాడు ఎప్పటికైనా కంటకమే, ముప్పే, తొలగించవలసిన శత్రువే!! వాడు మన దారికి అడ్డంకే, పక్కలో బల్లమే, మన కీర్తికి పట్టిన పరభుక్కే!

రాజదండం, అధికారము పంచిన కొద్దీ పలచ బడుతుంది, ఇది నిశ్చయం! పూర్ణాధికారం లేని రాజు, ఏమి న్యాయం చేయగలడు, దుష్టులను శిక్షించడంలో, శిష్టులను ఆదరించడంలో!!

రాజధర్మం సోదరుడు, స్నేహితుడు, ఈ బంధుత్వాలను గణనలోకి తీసుకోకూడదు తండ్రీ! తన విజయమే దాని అంతిమ లక్ష్యం! ఏ విధంగానైనా, ఏ దారిలో నైనా!

ఆ విధంగా చూస్తే, ఇవాళ నేను సంపూర్ణ విజయం సాధించాను, నా శత్రువును తరిమి కొట్టేశాను, నిష్కంటకం చేసుకున్నాను నా మార్గం!!

***

ధృత: మాయాద్యూత విజయం కూడా ఒక విజయమా సుయోధనా?! దానికే ఇంత మిడిసిపాటా నీకు?!

దుర్యో: బలం ఉన్నపుడు చూపించడమే వీరుడి ధర్మం తండ్రీ! ధనుష్బాణాలతో వెళ్ళి పులిని వేటాడి చంపితే, అది మన బలమే కానీ, సిగ్గుపడే దేముంది అందులో! అదను, అనువు చూసి గెలుపు చేజిక్కించుకోవడానికే ఏ యుధ్ధమైనా! ఇవాళ అట్టి యుధ్ధవిజేతను నేను, అదీ నా గర్వ కారణం!

ధృత: అవునవును, అందుకే పురవీధుల్లో నిన్ను నిందిస్తున్నారు ప్రజలు, ఆ నిందా వాక్యాలతో వాడంతా మార్మ్రోగుతోంది!

దుర్యో: దూషణలు, విమర్శలు! ఎవరు పట్టించుకునేది?! నా అధికారపు ఉక్కు పాదాల కింద ఆ, వ్యతిరేక, ప్రతిఘటన శక్తులను మట్టి కరిపించేస్తాను!! దుర్యోధనుడు పాపి, కుటిలుడు, నీచుడు – ఓహ్ చాలా కాలం విన్నాను నేను ఈ కారుకూతలు! ఇక రాజదండపు ప్రభావం రుచి చూస్తారు వారందరూ! మోకాళ్ళ మీద నుంచొని శరణు శరణు అనాల్సిందే! ఈ దుర్యోధన ప్రభువులు వాచాలత్వాన్ని సహించరు అని బాగా తెలుసుకుంటారు వారందరూ, అతి త్వరలో!

ధృత: విను నాయనా! అణచిన కొద్దీ పెరుగుతుంది అంతరంగాలలో ఈ వ్యతిరేక భావం! వాగనిచ్చావా, అవే సాగి సాగి ఆగిపోతాయి! ద్వేషం అనే విషసర్పాన్ని ప్రేఘపంజరంలో బంధించేయ్, చిరునవ్వుతో కట్టేయ్!!

దుర్యో: మా ఆధిపత్యానికి, అభిజాత్యానికి ఆవగింజంత హాని చేయలేవు, ఈ అణచబడ్డ ఆవేశాలు! ఒకడు నన్ను ఇష్టపడటం లేదంటే, దాంట్లో నేను బాధ పడాల్సిందేమీ కనబడదు ప్రభూ నాకు! అవిధేయత, తెంపరితనం మాత్రం మేము సహించం! ప్రేమలు పంచుతూ పోవటం, దుర్బలుల లక్షణం! అట్లాంటి వారిని, వాళ్ళ పెంపుడు జంతువులతో, ఆ పాండవులతో పంచుకోనివ్వండి, ఆ ఇష్టాలను! జాలిపడతాను అటువంటి బలహీన మనస్కులను చూసి, అంతే! నేనంటే భయంతో తల ఒగ్గాలి అందరూ! విజయం నా హక్కు! సాధించే తీరుతాను, మార్గం ఏదైనా సబబే, ఆ గమ్య సాధనకు!

***

ప్రతీహారి: ప్రభూ! రాణీ గారు తమ దర్శనార్థం వచ్చి యున్నారు!

దుర్యో: రాజా, మరి నాకు సెలవిప్పించండి!

ధృత: అదేమిటి, దుర్యోధనా! పవిత్రురాలు మీ అమ్మ మెరుపు లాంటి చూపుని నే నెట్లా తట్టుకుంటాను, ఒంటరిగా?! సుపుత్రా, సుయోధనా, నేనంటే వీసమెత్తు లక్ష్యం, భయం, ఆదరణ లేవా..?!

***

(దుర్యోధనుడు, విసవిస నిష్క్రమిస్తాడు)

***

గాంధారి ప్రవేశిస్తుంది!

గాంధారి: ప్రభూ! నాదొక వినతి, మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. దయచేసి వినండి.

ధృత: నీ కోరిక ఎన్నడైనా కాదన్నానా, గాంధారీ?!

గాంధారి: తక్షణం అతనిని వదిలేయండి, ఈ క్షణమే!!

ధృత: ఎవరిని, పట్టమహిషీ?!

గాం: ఎవరి పాపాలైతే తలలెత్తి విర్రవీగుతూన్నాయో, ఆ మూఢ, దుర్యోధనుణ్ణి! ఆ పాపాలు తలపడటానికి ఉంకిస్తున్నవి, ధర్మం అనే మహాఖడ్గంతో! దిన దినమూ, దానిని మరింత పదునెక్కిస్తూ!

ధృత: మన దుర్యోధనుణ్ణా, మీరు బహిష్కరించమంటున్నది రాణీ! మీ కోరిక ఒక విడ్డూరమే కాదు, విపత్కరమైనది కూడా!

గాం: ఇది నా ఒక్కదాని అభ్యర్థనా ప్రభూ?! మన పూర్వులందరూ, స్వర్గం నుంచి, ఇదే కోరుకుంటున్నారు, ఈ కౌరవ కుల మహావృక్ష రక్షణార్థం!! దుర్యోధన విసర్జనమే కర్తవ్యం మహారాజా, లేదా మన భాగ్యలక్ష్మి మన అందరినీ, ఈ కురువంశాన్నే వీడి వెళ్ళిపోతుంది!

ధృత: ధర్మమే, కాలమే నిర్ణయిస్తుంది ప్రతివారి శిక్షను, గాంధారీ, వారి తప్పులను బట్టి! నా జ్యేష్టపుత్రుడు రాణీ, దుర్యోధనుడు!

గాం: అవును ప్రభూ, నేను వాడి తల్లినే, ఈ కోరిక కోరుతోంది, వంశ క్షేమం కోసం! కడుపులో మోసి కన్న బిడ్డ! నేను కాదూ పాలిచ్చి, ఆ ముద్దు మోమును చూసి మురిసిపోయినది?! ఫలం కొమ్మను అంటుకొని ఉన్నట్టు, వాడి చేతులు నా చుట్టు వేసి నా ఒళ్ళో ఆడిన వాడు కాదూ వీడు?! తొలి చూలై వెలసి, మన జీవితాలలో అప్పుడు వెలుగు నింపిన వాడు కాదూ?! ఆ తల్లిని, నేనే అడుగుతున్నాను, స్వామీ, పంపించి వేయండి దుర్యోధనుణ్ణి, మనమే నాటిన ఆ బీజాన్ని!!

ధృత: ఇప్పుడు వాడిని పంపించేస్తే, ఇక ఆధారం ఎవరు గాంధారీ, మనకు?!

గాం: మీ విలువలు స్వామీ, మీ ధర్మగుణం! అవే ఎవరికైనా ఆధారం, కాపుదల!

ధృత: మన కేమిటి దక్కేది, ఈ నిర్ణయంతో?!

గాం: మిగిలేది కొత్త చింతలే రాజా, కానీ తప్పదు! అధర్మంతో గెలిచిన ఈ వైభవంలో సుఖం శూన్యం. కనుకనే కఠినమైనా,ఈ నిర్ణయం మనకు తప్పదు.

ధృత: పాండవులు నిర్లక్ష్యంగా జూదం ఆడి సర్వస్వం పోగొట్టుకొన్నా, నా ధర్మం కాబట్టే, వారికి తిరిగి ఇచ్చేశాను. కానీ అక్కడే నాలోని పితృభావం నిలదీసి నన్ను అడగటం మొదలుపెట్టింది. ధర్మం, అధర్మం, మంచి చెడు, కర్తవ్యం, యథేఛ్ఛావిహారం – ఈ రెండ్రెండు పడవల్లో ఒకేసారి ప్రయాణించ లేవు, వృధ్ధరాజా, అని లోనుండి హెచ్చరికలు బయల్దేరినయ్యి! ‘ఎప్పుడైతే నువ్వు అన్యాయం వైపు మొగ్గావో, అపుడే నీకు ఋజు మార్గం మూసుకుపోయింది. చూడలేని కబోదిరాజా! కనీసం విను ఈ మాట, నీ రెండు మార్గాల నడక మాను’, అని తీవ్ర హెచ్చరికలు!

‘చెడు, చెడునే పెంచుతుంది! బలవంతులతో ఆటలాడ వద్ద’ని చెప్పింది. ‘రాజ్యం ఇచ్చేశా నిపుడు, నా మీద ప్రేమ పెరుగుతుంద’ని అనుకుంటున్నావా వాళ్ళకు, మూఢుడా! నిజానికి వాళ్ళ ఆగ్రహం పెరుగుతుంది, నీ అంతు చూస్తుంది. బలమైన శత్రువును చిన్న దెబ్బతో వదిలేయకూడదు. కొడితే కుంభస్థలమే, శత్రువు మిగలకూడదు, అదీ రాజనీతి, అని ఆ వాణి బోధించింది.

తండ్రిగా అదే సబబనిపించి, వాళ్ళను రెండోసారి జూదానికి పిలిపించి, షరతులు పెట్టి ఆడించి, ఓడించి, అడవులకు పంపించాము!! ఈ లోతులు, లోకపు రీతులు మీకేం తెలుస్తాయిలే, మహారాణీ!!

గాం: ధర్మ మార్గంలో ఉండటం, ఏవో సంపదలు, ఐశ్వర్యం కట్టబెడుతుంది అని కాదు మహారాజా, బాగా గ్రహించాలి, ధర్మ మార్గ వర్తనమే, దానంతట అదే, పెద్ద సంపద, గొప్ప బలం! నేనొక మందురాల్ని, నాకేం తెలుస్తుంది మీ వంటి విజ్ఞులకు చెప్పటం, ఏది ధర్మమో ఏది కాదో?! మాటకు కట్టుబడీ, జూద నియమానుసారమూ పాండవులు, ఇపుడు రాజ్యం వెనుకకు ఇచ్చినా, తీసుకోరు, అడవికి వెళ్ళి పోతారు.

ఇప్పుడు, ఎప్పుడూ మీదే ఈ రాజ్యం! మనకు వద్దు ఇట్లా ప్రాప్తించిన, వేరే వారిని దుఃఖపెట్టిన ఈ సుఖం! మన పూర్వీకుల ప్రతిష్ఠకు భంగకరమైన ఈ  మార్గం మనకు శ్రేయోదాయకం కాదు, మహారాజా! కష్టాన్ని ఆలింగనం చేసుకుందాం, మనశ్శాంతితో జీవిద్దాము!! తక్షణమే, పంపించేయండి, దుర్యోధనుణ్ణి!

ధృత: అయ్యో రాణీ, ఎంత నిష్ఠుర నిజాలు మీరు చెప్పేవి, కానీ ఎంత క్లేశభూయిష్టం మీరు చెపుతున్న ఆ మార్గం?!

గాం: ఆ దుర్మార్గంగా సంపాదించిన రాజ్య విష ఫలాన్ని చూసి మురిసిపోతున్నాడు, మూఢుడు మన దుర్యోధనుడు. పుత్రమోహంతో, వాడికి ఆ ఫలం దక్కనివ్వద్దు మీరు, లాగి తీసేయండి, సర్వాధికారంతో! కష్టం, దుఃఖం తెలియనివ్వండి, వాడికి! తమ్ములతో సహా, వారి పాపకర్మల భారం మోయనివ్వండి!

ధృత: ధర్మాధర్మ నిర్ణేతలు దేవతలు, వారి నిర్ణయం వారిని చేయనివ్వండి రాణీ. దుర్యోధనుడిది ఇప్పుడీ రాజ్యం, నేను కేవలం పాలకుడి తండ్రిని మాత్రమే!

గాం: అదేమిటి ప్రభూ, సర్వం సహా చక్రవర్తులు మీరు! మీరు చెప్పినదే అమలు జరగాలి, ఈ మహా సామ్రాజ్యంలో! మీరే చెప్పండి, మీ పాలనలో, మీ సమక్షంలో, ఒక స్త్రీని ఎవరైనా ఇంటి నుంచి బయటకు లాగి, దుర్మదంతో అవమానిస్తే, ఏమి న్యాయం చెపుతారు మీరు, ఏ ధర్మ పథాన్ని అనుసరిస్తారు?!

ధృత: ఆ చేసిన వాడు నిస్సందేహంగా, బహిష్కరణకు గురి అవుతాడు!!

గాం: అదే, అదే ప్రభూ, నేనూ చెపుతున్నది, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. ఏ బాంధవ్యానికీ తావు లేదిక్కడ! న్యాయం చేయండి ప్రభూ, స్త్రీజాతి ఏకధారగా కారుస్తున్న కన్నీటి తరఫున అర్థిస్తున్నాను! మన పుత్రుడు, తప్పు చేశాడు, అందరి ముందూ! ఆ అందరిలో మీరూ అక్కడే ఉన్నారు!

మగవాళ్ళ పౌరుషాలూ, పంతాలతో మాకు పని లేదు మహారాజా! ఎక్కడో అంతఃపురాలలో, సౌమ్య జీవనాలను గడిపేవారము! మాకు అసలు అర్థం కూడా కావు, పురుష పుంగవుల గొడవలు, వారి స్పర్ధలు, కక్షలు, ఇట్లాంటివి. మీ లోకంలో కత్తులు కత్తులతో తలపడతాయి, జిత్తులు జిత్తులతో! స్త్రీ జనమంతా బహు దూరం, ఈ మగవారి మంత్రాంగాలకూ, తంత్రాంగాలకూ! మేము నీడ పట్టున ప్రశాంత జీవనం కోరుకునే వారం! అందునా, నా గర్భజనితమా ఈ పాప కళంకిత బుధ్ధి?! నేనెట్లా సహించ కల్గుతాను, నా సంతతే పిరికివారూ, నీచ మతులైతే?!

పాంచాలి ఆక్రందనలు నా చెవుల్లో ఇంకా మారుమ్రోగుతున్నాయే?! అవి మన రాజప్రాసాదాల పునాది రాళ్ళనే కరిగించేశాయే ఆ భయంకర దుస్స్వప్నం లాంటి ఆ రోజున! ఆ రోజే, ఈ గాంధారీ సుతుల దుష్టకరాలు, ఆ ద్రౌపది చీర కొంగు పట్టి లాగినయ్యి, దాని తోటే నా మాతృత్వ స్థాయికి గ్రహణం పట్టింది! అయ్యో, ఎంత అసహాయ, మౌన రోదనం నాది ఆ రోజున?!

దుస్సహం ప్రభూ దుస్సహం, ఈ అన్యాయాన్ని చూసి కూడా ఉపేక్షించటం!! మీ పౌరుష మేమయింది మహారాజా, ఏ అడవిలో దాక్కుంది, ఈ విశాల భారతావనిలో, కాతరత్వంతో! మచ్చుకు కానరాక జీవచ్ఛవమయిందే, దాని నిశ్శబ్దం దుర్భరమయిందే, ఆ విష ఘడియల్లో!

మీరందరూ, యోధానుయోధులు ఆ సభలో విగ్రహమాత్రులై కూర్చున్నారు, ఆ రాక్షస కృత్యం అక్కడ కృత్యలా తాండవిస్తుంటే! మీ కత్తులు ఒరల్లో పదునులు కోల్పోయి, నిద్రకొరిగినట్టు!

ఈ తల్లి తలవంపులకు కారణమైన ఆ మూలాన్ని, పెకలించు మహారాజా, ఆ సౌశీల్యవతి, పాండవ పట్టమహిషి గౌరవాన్ని నిలుపు! ఏ మర్యాదలైతే  అతిక్రమించబడ్డాయో, వాటిని యథా స్థానంలో నిలుపండి, మహాప్రభూ!

దురాలోచనల దుర్యోధనుని నిష్కాసితుణ్ణి చేయండి, ఈ క్షణమే, సమయం దాటనివ్వద్దు!

ధృత: నీ వాక్పారుష్యం ఈ వ్యధిత హృదయాన్ని క్రుంగదీస్తోంది గాంధారీ!

గాం: నేను అంతకన్నా వేయి రెట్లు బాధతోనే, ఈ మాటలు చెపుతున్నాను, రాజా! కానీ ధర్మ నిర్ణయం చేసే ప్రాడ్వివాకుడి ప్రథమ లక్షణం – విషయాన్ని నిర్లిప్తంగా, నిరపేక్షుడై చూడటం! మీరిప్పుడా స్థానంలో ఉన్నారు, కొంత బాధ తప్పదు ఒక కఠిన నిర్ణయం వెలువరించే ముందు. కానీ ఆ బాధ, వైయక్తికం, తాత్కాలికం!!

ధర్మానుసారమై వ్యవహరించటం అన్ని వేళలా సులభం కాకపోవచ్చు! కానీ అది చేయగల దిటవు కలవారే, ప్రభు పదార్హులు! కాబట్టి ఆ దృఢత కనబరచాల్సిందే ప్రభూ! న్యాయ నిర్ణేత చిత్తం కూడా కలచబడుతుంది, నిజమే.

అట్లాంటి చలనమే చిత్తంలో లేకపోతే, ఇక కాఠిన్యమే అక్కడ రాజ్యమేలేది, బలవంతుడి అధికారమే అక్కడ అమలయ్యేది! ఏ శిక్ష మీ సంతానానికి వేయడానికి జంకుతారో, మరి అదే శిక్ష ఇంకెవరికీ వేసే హక్కు, మీకు లేదు మహారాజా! ఆ అపరాధి కూడా ఒక తల్లికి కొడుకే! ఈ దృష్టి లేనిదే, న్యాయ నిర్ణయార్హతే లేదు మహారాజా!

మీ కొడుకని ఈ రోజు మీరు ధర్మ పథం నుంచి తప్పుకుంటే, తద్భిన్నంగా ఆచరిస్తే, నేటి వరకు మీరిచ్చిన శిక్షలన్నీ మిము వెన్నంటి పీడిస్తాయి ప్రభూ! మీతో పాటే, మేమంతా ఆ దోషఫలం అనుభవించాల్సిందే!

కనుక వెంటనే, దుర్యోధనుని వెలి వేసి ప్రక్షాళనం చేసుకోండి మహారాజా! నా బుద్ధికి తట్టినవీ, నా ఎరుక లోని న్యాయ మార్గం చెప్పాను, ఓ కురు మహాసామ్రాజ్య చక్రవర్తీ! ఇక కర్తవ్య పాలన మీ వంతు!

ధృత: అబ్బా, ఎలా చెప్పను మీకు మహారాణీ! మీరు కాస్త శాంతమనస్కులుగా ఉండండి, సౌమ్య పద్ధతులను  ఆలోచించండి. మీరు చెప్పేవి నిజాలే అయినా, ఆచరణాత్మకంగా లేవు! నా యీ పుత్రుడు, దుర్యోధనుడు దైవాలచే బహిష్కృతుడుగా అనిపిస్తాడు, అందుకే వాడికీ పెడ బుద్ధులు! అట్లాంటి అసహాయుణ్ఢి, నేను కూడా వదిలెయ్యాలా, ఎలా సాధ్యం గాంధారీ?!

ప్రస్తుతం నేనొక్కడ్నే ఆధారం వాడికి! ఇప్పుడే నా అవసరం ఎక్కువ ఉన్నది వాడికి, అందరూ ఎదిరిపక్షమై కత్తులు నూరుతున్న ఈ సమయంలో! ఏ పాపకూపమైనా ఇద్దరమూ కలిసే దూకటం ఇక! తప్పదు! ఆ అంతంలో నాదీ సగభాగం, ఆ శిక్షల్లో నాకూ సమ భాగం! అనివార్యం ఇది, ఇప్పుడు ఈ ప్రవాహ గతి మార్చటం, క్షాళన ప్రయత్నం చేయటం వృథా! గత జల సేతు బంధనమే అవుతుంది! విధి లిఖితమే జరిగినది! జరగబోయేదీ, ఆ విధి చేతుల్లోనే ఇక, వేరే దారి లేదు!

***

మౌనంగా గాంధారి లేచి నిష్క్రమించగా, భారంగా పడుతున్న ఆమె అడుగుల శబ్దము వింటూ, ఏకాకిగా స్తబ్ధుడై మిగిలిపోయాడు ఆ మహాభవంతిలో- అంధ కురు మహీపతి, ధృతరాష్ట్రుడు!!

***

ఓం శాంతి!!

Exit mobile version