గాంధీ మార్గం

0
2

[dropcap]జా[/dropcap]తిపిత గాంధీగారిపై ఉపన్యాసం నడుస్తోంది. జనం వింటున్నారు. “నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నా జాతి బానిసత్వం నుండి విముక్తియితే చాలు అనే భావజాలాల నుంచి దాదాబాయి, నెహ్రూ నుంచి గాందీ వరకు ఆచరణలో చూపిస్తూ దేశ ప్రజలకు ఉద్బోదిస్తూ వచ్చారు. మరో వైపు భగత్ సింగ్, సితారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ – జాతి మనుగడ కోసం స్వేచ్ఛా వాయువు పీల్చాలన్న తపన కోసం ప్రాణాలర్పించారు. నేతాజీ వారి మార్గాన్నే ఎన్నుకొని ఇతర దేశాలలో సైతం సైన్యాన్ని తయారు చేసి రణ నినాదం చేశారు. అలాంటి శ్రేష్ఠుల త్యాగ ఫలం ఇప్పటి ఈ మనం అనుభవిస్తున్న స్వతంత్రం” అని ఆగాడు మంత్రిగారు.

మంచి నీళ్లు అందించారు వందిమాగదులు.

ఓహో చాలా బాగా చెప్పారు. ఇలా చెప్పడం ఇది వరకు జరగలేదు సభ పూర్తిగా విజయవంతం అయింది. “అలాంటి పూజ్య బాపూజీ కలలు కన్న భారతదేశానికి ఎంత వరకు తోడ్పడ్డాం” అని చమటను పొందూరు ఖద్దర్ పంచతో తుడ్చుకొని “పల్లెలు స్వయం పోషకం కావాలన్నాడు. భారీ పరిశ్రమలు మనకు తగదని చిన పరిశ్రమలు దేశవ్యాప్తంగా పెట్టమన్నాడు. దళిత జనోద్ధరణను మరవద్దన్నాడు. ఈశ్వర్ అల్లా తేరేనాం అంటూ సత్య అహింసా మార్గాన ప్రయానిస్తూ అందరి మంచి కోరమన్నాడు. మరి ఇవాళ జరగుతున్నదేంటి” అనగానే జనం ఏం చెప్తాడో అని రిక్కించి చూసారు. ‘ఇంటింట నిను గట్టి ఏలాడ దీశారు, నట్ట నడి వీధీలో చెక్కి నిలవేశారు. ఇంకేమి చేయాల. ఇంకేమి కావాల’ అన్న ఓ తెలుగు కవి గేయ భాగాన్ని వినిపించి, “విగ్రహప్రతిష్ఠలతో ఉట్టి ఉపన్యాసాలతో ఆయన ఆశయాలు సఫలమైనట్టా? కాదు కదా! మరి ఏం చేయాలి?” అని ఆగి జనాన్ని చూస్తూ “ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నిజం చేయాలి. అందుకు మరో స్వాతంత్ర సమరం లాంటి దాన్ని అవసరంగా నడపాలి! స్వార్థపరత్వం రూపుమాపి న్యాయవర్తనాన్ని అందలమెక్కించాలి. ఈ జాతి, ఈ దేశం, మనది అనే భావాన్ని నరనరాల జీర్ణించుకునేలా చేయాలి. అలా చేయగలగితే ఎంతో కొంత చేసినట్టే” అని సభకు నమస్కారించి, కూర్చున్నాడు.

జనం ఆనందంగా చప్పట్లు కొట్టారు. సభ కాగానే మంత్రిగారి కారు గెస్ట్ హౌస్‌కు చేరింది. కొత్తగా ఎముకల ఫ్యాక్టరీ కట్టించిన కృష్ణస్వామిగారు విందు ఏర్పాటు చేశారు. విందులో మంత్రిగారికి ఇష్టమని పెద్దదాని మాంసాన్ని కూడా తెప్పించారు. భోం చేస్తూండగా కూర్మావతారం గారు సారా పాటలు గురించి మాట్లాడుకున్నారు. ఓ విలేకరి వచ్చి “మంత్రిగారు పల్లెలు స్వయంపోషకం కావాలన్నారు. అంటే వృత్తి విద్యలు అభివృద్ధి చెందాలి కదా, మరి పెట్టిన బేసిక్ వృత్తి విద్యాకేంద్రాల్ని ఎత్తి వేస్తున్నారే?” అని అడిగాడు.

“అసలు చదవు కోసం ఇంత బెడ్జెట్ కేటాయించడమే తప్పు. వృత్తి విద్యాలంటే అసలు ఆ లాభం లేదు. మనది పేద దేశం, ఖర్చు భరించలేం. వనరు ఏర్పాటయినాక తిరిగి తెరుస్తాం” అన్నాడు.

“మరీ భారీ యంత్రాగారాలు వద్దంటూనే ఎందుకు అనుమతులు ఇస్తున్నట్టు? చిన్న కార్మాగారం అంటేనే ప్రభుత్వం భరించేది అని అర్థం. అది అనుభవంలో తేటలెల్లం అయింది. ప్రభుత్వాన్ని దివాలా తీయించటానికి అవి పనికొస్తాయి. కనుకనే దాన్నొదిలి దళిత జనోద్ధరణ అన్నారు.”

“మన జనాభ ఎక్కువ కదా, వారందరూ ఓటర్లే కదా తప్పదు” అన్నాడు మంత్రి నవ్వుతూ.

“ఈశ్వర్ అల్లా తేరేనాం అంటున్నారు.”

“అవును ఎవరు ప్రార్థించినా దేవుడు ఒక్కడే కదా, ఆ అర్థం లోనే పరమత సహనం ఉంది. మనం మామూలుగా చేసేదేదో చేస్తాం కదా మాట తప్పేదేముంది? అని నవ్వాడు మంత్రి.

“మరి మీరు ఇప్పుడు ఇచ్చిన ఉపన్యాసం?”

“జనాన్ని ఉత్సాహపరుస్తూ మంచి మాటలు చెప్పాలి, తప్పదు” – అని, “నేను గాంధీ గ్రంథాలయ ఆవిష్కరణకు వెళ్ళాలి. దాన్ని ఓ దళిత విద్యార్థితో ప్రారంభం చేయించి నా ఆదర్శాన్ని నిలుపుకుంటాను” అని ఇక ప్రశ్నలాపమని సైగ చేసి లేచాడు మంత్రి.

“అవును గాంధీ మార్గం కదా. కలిసి శాంతంగా ప్రశాంతంగా జరగాల్సిన వాటిని పూర్తి చేసుకుందాం. నమస్తే” అని కారు దగ్గరకు నడిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here