మంచి మనుషుల మంచి కథలు – గాండ్లమిట్ట

0
2

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ ఆర్. సి. కృష్ణస్వామి రాజు రచించిన ఇరవై కథలతో ప్రచురించిన పుస్తకం ‘గాండ్లమిట్ట’. ఈ కథలు వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందినవి, వివిధ పత్రికల ఆదివారం సంచికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైనవి.

~

బిటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన సుధీర్ తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి పోటీ పరీక్షలు వ్రాసి ఒక గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న గ్రట్టు గ్రామంలో కొత్తగా ప్రారంభించబడిన గ్రామీణ బ్యాంకులో పోస్టింగ్ వస్తుంది. అమెరికాలోనో, జర్మనీలోనో ఉద్యోగం చేయాల్సిన తానూ పల్లెటూర్లలో ఉద్యోగం చేయనంటాడు. అమ్మానాన్నలు ఎంతగానో నచ్చజెప్తే చివరికి బయల్దేరుతాడు, “రెండు నెలలు చూస్తాను, నచ్చితే ఉంటాను, లేకపోతే వచ్చేస్తాను” అంటాడు. కానీ ఆ పల్లెకి చేరే క్రమంలో తారసపడిన వివిధ వ్యక్తులు, వాళ్ళు తమ ఊరికి, గ్రామస్థులకు, పశువులకు చేస్తున్న సేవని కళ్ళారా చూసిన సుధీర్‍ ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఆ ఉద్యోగంలోనే స్థిరపడాలని కోరుకుంటాడు. ‘పల్లెకు పోదాం’ వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథ.

అసోసియేట్ ప్రొఫెసర్‍గా తన బాధ్యతని సక్రమంగా నిర్వహించాలనుకునే వ్యక్తి దయాసాగర్. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే అతను ఓరోజు నున్నటి గుండుతో కాలేజీకి వెళ్ళి విద్యార్థుల హేళనకు గురవుతాడు. పాఠం చెప్పి వెళ్ళి స్టాఫ్ రూమ్‍లో కూర్చుని తన గతం గుర్తు చేసుకుంటాడు. అసలే పేదరికానికి తోడు, తండ్రికి కేన్సర్ అని తెలుస్తుంది. తల్లి కువైట్‍లో పనికి వెళ్తుంది. తండ్రికి చికిత్స సమయంలో జుట్టు రాలిపోవడంతో ఆయన బాధపడతాడు. అలా బాధపడవద్దని దయా అంటాడు, జుట్టు ఉంటేనే మనిషికి అందమని భావించే తండ్రి కోసం తానూ గుండు చేయించుకుంటాడు. అప్పటి నుండి తండ్రి కోసం గుండు కొనసాగిస్తాడు. అతని క్లాస్ స్టూడెంట్స్ అందరూ స్టాఫ్ రూమ్‍కి రావడంతో వర్తమానంలోకి వస్తాడు. తమకి అంత సులువుగా పాఠాలు చెప్పే లెక్చరర్ ఎవరు ఇంతకు ముందు తారసపడలేదని, తామూ చదువులో రాణించి ప్రయోజకులం అవుతామని అంటారు. వాళ్ళకి ప్రేరణ కలిగేలా మంచి మాటలు చెప్తాడు. ‘కురుల సిరులు’ తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాటుతుంది. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన సంబంధాలని తెలుపుతుంది.

టెన్త్ క్లాసు చదివే నాగరాజు మిత్రులతో కలిసి బడి మైదానంలో గాలిపటం ఎగరేస్తూ ఉంటాడు. ఇంతలో నాగరాజు క్లాసుమేట్ బుజ్జి అక్కడికి సైకిల్ నేర్చుకోవడానికి వస్తుంది. నాగరాజు, బుజ్జీ ఒకరినొకరు వెక్కిరించుకుంటారు. ఇంతలో ఒక పెద్దామె వచ్చి నాగరాజు చేతిలోని దారాన్ని లాక్కుని పరిగెడుతుంది. గాలిపటం తెగిపోతుంది. నాగరాజు కోపంతో ఆమె వెంబడపడి కొట్టబోతాడు. బుజ్జి అతన్ని ఆపి, ఆమె తమ పిన్నమ్మ అనీ, కొట్టద్దనీ అంటూ పిన్నమ్మ కథ చెబుతుంది. హృదయాన్ని బరువెక్కించే సంఘటనలతో అల్లిన కథ ‘గాలిపటం’.

ఎంత పెద్ద చింత చెట్టయినా అవలీలగా ఎక్కి చిగురు కోసే భారతక్కది కష్ట జీవితం. భర్త చనిపోతాడు. తానూ, కొడుకూ చిన్నా చితక పనులు చేసి తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఒకసారి చిగురు కోయడానికి చింత చెట్లున్న ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ కబడీ ఆడుతున్న మగపిల్లలు, ఆటని చూస్తున్న ఆడపిల్లలు తమకు కొన్ని చింత కాయలు కోసివ్వమని అడగగా, కోసిస్తుంది భారతక్క. ఆ సమయంలో అటుగా పోతున్న మగవాళ్ళు ఆమెను చూసి రకరకాల వ్యాఖ్యలు చేస్తారు. అంతలో వర్షం మొదలవుతుంది. అటుగా బుల్లెట్ బండి మీద వెళ్తున్న తండ్రీకొడుకులు చింత చెట్టు కింద ఆగుతారు. భారతక్కని చెట్టు మీద చూసిన తండ్రి – డబ్బుల కోసం ఆమె ఎంత కష్టపడుతుందో చెప్పి, ధనం వృథా చెయ్యద్దని కొడుకుతో అంటాడు. ఆమె నవ్వుకుంటుంది. ఇంతలో ఊర్లో నిప్పంటుకుని తన ఇల్లు కాలిపోయిందన్న కబురు తెలుస్తుంది భారతికి. గబాగబా ఇంటి వైపు పరుగెత్తుతుంది. కొడుకు కూడా వచ్చేస్తాడు. ఉన్నట్టుండి నిప్పుల మధ్య నుండి గుడిసెలోకి పరిగెడుతుంది భారతి. ఆమె అలా ఎందుకు చేసిందో ‘చింత చిగురు’ కథలో చదవాల్సిందే.

ఓ పల్లెటూరులో – ఉగాది రోజున – తమ కూతుర్ని పెళ్ళి చూపులు చూడడానికి వచ్చిన కుటుంబాన్ని ఆప్యాయంగా ఆప్యాయంగా ఆహ్వానిస్తారు ఈశ్వరమ్మ, నరసరాజు దంపతులు. పెళ్లికొడుకు కర్నూలులో హోటల్ యజమాని. పెళ్ళిచూపుల తతంగంలో గ్రామస్థులంతా చేరుతారు. చివరగా ఈశ్వరమ్మ తాను రిటైరయ్యాకా వచ్చే పెన్షన్ డబ్బులు కూడా కాబోయే వియ్యంకులకే ఇచ్చేస్తామని అంటుంది. పెళ్ళి చూపులకు వచ్చిన కుటుంబాన్ని ఊర్లోకి తీసుకెళ్ళి తమ ఊరి విశేషాలను చెప్తాడు నరసరాజు. ఆ ఊర్లో అధిక సంఖ్యలో ఉన్న గబ్బిలాలను తాము దేవతా పక్షులుగా భావిస్తామని చెప్తాడు. ఈలోపు ఆ సంబంధం తెచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య ఈశ్వరమ్మతో మాట్లాడుతూ “మీరు రిటైరయ్యాకా వచ్చే పెన్షన్ డబ్బులు కూడా వారికే ఇస్తాననడం సరికాదు. భవిష్యత్తులో మీకూ డబ్బుల అవసరం ఉంటుంది” అంటూ తన గతం వివరిస్తాడు. తాను అలా అన్నందుకు సంశయంలో పడుతుంది ఈశ్వరమ్మ. అయితే కాబోయే వియ్యంకుడు ‘మీ పెన్షన్ మాకొద్దు!’ అని ఎందుకన్నాడో తెలియాలంటే ఈ కథ చదవాలి.

సైన్యంలో సిపాయిగా పనిచేసే శ్రీనివాస్ సెలవు మీద సొంతూరుకి వస్తాడు రేణిగుంటలో రైలు దిగి తన ఊరు అన్నాస్వామి పల్లెకి కాలినడకన బయల్దేరుతాడు. తాను వస్తున్న విషయం అమ్మకి తెలియజేయడు. నడుస్తూ తాను సైన్యంలో చేరిన క్రమాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇంటికి చేరిన అతనికి వాళ్ళ అమ్మ ఓ అబద్ధం ఎందుకు చెప్పిందో తెలిస్తే కళ్ళు చెమరుస్తాయి. ‘అమ్మకు జేజేలు’ హృదయాన్ని తాకే కథ. పాలపిట్ట మాసపత్రిక, దసరా కథల పోటీలో ఎంపికైన కథ.

ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా – అవి సొంత ఊరుకి సాటి రావని చెపుతుంది ‘బూడిదైపోవద్దు!’ కథ. సిగరెట్లు బీడీలు అమ్మే సహదేవమ్మ – జనాలకి సిగరెట్లు తాగద్దని ఎందుకో చెబుతుందో తెలిసాక ధర్మడితో పాటు చదువరుల గుండెలు బరువెక్కుతాయి.

పాడి లేని ఇల్లు, పేడ లేని చేను..’ కథ గ్రామాలలో పశువులకు, మనుషులకు ఉండే పరస్పరాధిత సంబంధాన్ని గొప్పగా చెబుతుంది. గ్రామీణ ప్రాంతాలో వాడే పలు సామెతలను ఈ కథలో సందర్భోచితంగా ఉపయోగించారు రచయిత.

ముగ్గురు ఆడపిల్లలు కలిసి తమ ఇంటి ఆవరణలో బావి తవ్వేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు. ఆ క్రమంలో గ్రామంలో చాలామంది వాళ్ళని హేళన చేస్తారు, వెనక్కి లాగాలని చూస్తారు. కానీ తమ తల్లి కోసం పట్టు వదలకుండా ఆ ముగ్గురు అక్కచెల్లెళ్ళు కలిసి తాము అనుకున్నది సాధిస్తారు. మహిళలు బలహీనులు అనే ఆలోచనను దగ్గరకి రానివ్వదని చెబుతుంది ‘నీళ్ళ బావి’ కథ.

అత్యంత మానవీయతని ప్రదర్శించిన కథ ‘గాండ్లమిట్ట’, ఈ కథని పుస్తకానికి శీర్షికగా రచయిత ఎంచుకోవడం ఏ మాత్రం తప్పుకాదని పాఠకులకి అర్థమవుతుంది. తెలుగులో వచ్చిన మంచి కథల్లో ఒకటిగా నిలుస్తుందీ కథ. డా. చంద్రకళ స్మారక కథల పోటీలో బహుమతి పొందిందీ కథ.

శానిటరీ పాడ్స్ నేపథ్యంలో అల్లిన కథ ‘మగువా.. ఓ మగువా..’.  కుప్పారెడ్ది అనే చిరు వ్యాపారి ఊర్లోని ఆడబిడ్దలకి అవసరమైనప్పుడు శానిటర్స్ పాడ్స్ ఎందుకు ఉచితంగా ఇస్తాడో, దాని వెనుక ఉన్న వేదన ఏమిటో తెలిసినప్పుడు చదువరుల కళ్ళు చెమరుస్తాయి. చిన్ని నారాయణ రావు ఫౌండేషన్, మల్లెతీగ వారి కథల పోటీలో ఎంపికైన కథ ఇది.

బంగారం సంచి’ కథ స్వార్థపరుల విషపుటాలోచనలను, అమాయక యువతుల నిస్సహాయతను చాటుతుంది. స్వార్థపరుడి మోసానికి బలై తల్లి అయిన దాక్షాయణి తన కొడుకు ముఖంలో ఉజ్జ్వల భవిష్యత్తును చూస్తుంది. దాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తుంది.

తన తల్లి కోరికని తీర్చిన రంగారావు కథ ‘అమ్మ విమానం ఎక్కాలంది!’ విమానం ఎక్కేవారంతా తమలాంటి మనుషులేననీ, మనం తక్కువని భావించనక్కరలేదని తల్లికి అర్థమయ్యేలా రంగారావు చెప్పిన తీరు హృద్యంగా ఉంది. కాని కథ చివర్లో తిరిగిన మలుపు చదువరులకు కాస్త బాధని కలిగిస్తుంది. విడదల నీహారికా ఫౌండేషన్, సాహితీ కిరణం వారి బహుమతి పొందిన కథ ఇది.

ఏ ఉద్యోగమయినా మనసు పెట్టి చేస్తే అంతులేని ఆనందం దొరుకుతుందని చెప్పిన కథ ‘మస్తాన్ రెడ్డి’. రంజని తెలుగు సాహితీ సమితి వారి కథలో పోటీలో బహుమతి పొందిందీ కథ.

నా ఊరికి ఏమయ్యింది?’ ఆలోచింపజేసే కథ. సొంత ఊరినే ప్రాణంగా భావించి బ్రతికిన పద్మనాభం చనిపోతే – ఆ ఊరి వాళ్ళు స్పందించిన విధానాన్ని ఈ కథ చెబుతుంది. ఉత్తర భారత దేశంలోని రుడాలీల వలె డబ్బులిస్తే శవాల దగ్గర పడీ పడీ ఏడ్చే ఈరమ్మ బృందం గురించి సందర్భానుసారంగా రచయిత చెప్తారు. తన ఊరు ఎందుకిలా మారిపోయిందని పద్మనాభం కొడుకు సుకుమార్ ఆలోచించే క్రమంలో పట్టణాల్లోనూ, గ్రామాల్లోను మనుషుల్లో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తారు. కౌముది కథల పోటీలలో బహుమతి పొందిన కథ ఇది.

నత్తలొస్తాయి, జాగ్రత్త!’ కథ వ్యవసాయం మీద ఇష్టంతో, తల్లిదండ్రుల ఆకాంక్షల విరుద్ధంగా అగ్రికల్చర్ సైన్స్ చదివిన చిరంజీవి తన చుట్టుపక్కల ఊర్లలోని రైతులకు సాయపడిన వైనాన్ని చెబుతుంది.

నమ్మకమే నాన్న’ కథ మరో చక్కని కథ. తన తండ్రిని అమితంగా నమ్మిన పద్మబాల జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన క్రమాన్ని కథలో చదివి ప్రేరణ పొందవచ్చు. మనం ముసుగుతన్ని పడుకుంటే అవకాశాలు కూడా ముసుగుతన్ని పడుకుంటాయని ఒక ఆర్థికవేత్త చెప్పిన మాటలు పద్మబాలకి గమ్యాన్ని చూసిస్తాయి. పురిమళ్ళ ఫౌండేషన్- అక్షరాల తోవ కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది.

,ఆ.. క,’ అనే కథ శీర్షిక కాస్త వింతగా ఉన్నా, పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వయోజన విద్య ప్రయోజనాన్ని చాటుతుందీ కథ. ఏ వయసు వాళ్ళయినా చదువు ఎంత ముఖ్యమో తెలుపుతుందీ కథ.

చిన్నప్పుడు అన్నదమ్ములు, పెద్ద అయినాక దాయాదులు అనే సామెత ఎలా నిజమైందో ‘కా..కా..కా’ కథ చెబుతుంది. సొంతూరులో భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకుందామని ఇండియా వచ్చిన అరవింద్‌లో తల్లి చెప్పిన మాటలతో మార్పు వస్తుంది. మక్కెన రామ సుబ్బయ్య ఫౌండేషన్ వారి బహుమతి పొందిన కథ ఇది.

తనకు వీలైనంతగా సాటి మనుషులకు సాయం చేసే రైల్వే టీసి రమణమూర్తి కథ ‘రాళ్ళ బియ్యం’. పేదరికం ఎంత దుర్భరంగా ఉంటుందో, లేమి మనుషులను ఎంతగా కలచివేస్తుందో ఈ కథ చెబుతుంది. పేదరికాన్ని, అవమానాలని జయించి టిసి ఉద్యోగం తెచ్చుకున్న రమణమూర్తి తమ మూలాలను మరిచిపోకుండా, మరికొందరిని కూడా తోటివారికి సాయం చేసేలా ప్ర్రేరణ కలిగిస్తాడు.

~

ఇవన్నీ మానవత్వం వుట్టిపడే మనుషుల కథలు. బీదా బిక్కీ అయినా, ఆస్తిపరుడూ, సంపాదనాపరుడైనా తమ ఊరికో లేదా సమాజానికో తమకి వీలైన సాయం చేసి అందరి బాగును కోరుకుంటారు. పరిస్థితులు కఠినంగా మారినా తాము మారకుండా తమ సహజ స్వభావాన్ని నిలుపుకుంటూ తాము ఆనందం పొందుతూ, ఇతరులను సంతోషపరుస్తారు. కొన్ని కథలకి పెట్టిన పేర్ల ద్వారా కథాంశం అర్థమైనా, రచయిత కథనం, శైలి పాఠకులను ఆకర్షించి కథ చదివేలా చేస్తాయి. చదవదగ్గ కథల సంపుటి ఇది.

***

గాండ్లమిట్ట (కథలు)
రచన: ఆర్. సి. కృష్ణస్వామి రాజు
ప్రచురణ: ప్రియమైన రచయితలు, విశాఖపట్టణం.
పేజీలు: 146
వెల: ₹ 160
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆర్. సి. కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here