గంటుమూటె : మూటకట్టుకున్న జ్ఞాపకాలు

0
2

[box type=’note’ fontsize=’16’] “ఈ చిత్రం బాల్యం నుంచి యవ్వనంలో అడుగుపెట్టే అమ్మాయి మనఃస్థితిని బాగా పట్టుకుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘గంటుమూటె’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]గం[/dropcap]టుమూటె అన్న కన్నడ చిత్రం పరిచయం ఈ వారం. గంటుమూటె అంటే బేగేజి అని చూపిస్తారు తెరపై టైటిల్స్ అప్పుడు. బేగేజి అనగానే అనవసరమైన బరువును మొస్తుండడం గుర్తొస్తుంది. మళ్ళీ మూటె అంటె తెలుగులో మూట అంటే మనం ఇష్టంగా దాచుకున్నవి లాంటి భావనలు కలుగుతాయి. ఏది ఏమైనా ఈ చిత్రం బాల్యం నుంచి యవ్వనంలో అడుగుపెట్టే అమ్మాయి మనఃస్థితిని బాగా పట్టుకుంది.

తోటి పిల్లలు పిక్నిక్ కి బయలుదేరితే వాళ్ళతో వెళ్ళకుండా మీరా (తేజు బెలావడి) వో కొండమీదకు ట్రెక్కింగ్ కు వెళ్తుంది. ఆ పచ్చదనం మధ్య కూర్చుంటే తనకు నిజమైన అర్థంలో ఇంట్లో వున్నట్టుంటుంది. అలవాటైన డైరీ తీసి వ్రాస్తూ, పాత జ్ఞాపకాలను తలచుకుంటూ చెబుతుంది తన కథ.

పాతికేళ్ళ క్రితం కాలంలో కథనం. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు. మీరా పెద్దదవుతోందని గ్రహించి, ఎక్కడ ఎవరితోనో లేచిపోతుందన్న భయంతో వాళ్ళు ఆ వూరు నుంచి బెంగుళూరుకు మారతారు. ఆ వయసులోని అందరు పిల్లలలాగే మీరాకు కూడా సినెమాలంటే ఇష్టం. వోసారి వొక్కతే వో సినెమా చూడడానికి వెళ్తుంది. పక్కన కూర్చున్నతను ఆమె తొడపై చెయ్యి వేస్తాడు. కంపరం పుట్టి లేచి బయటకు వచ్చేస్తుంది. అంతలోనే ఆలోచన: ఎవరి కారణంగానో తను వో సినెమాని చూసి ఆనందించకుండా ఎందుకుండాలి? మళ్ళీ హాల్లోకి వెళ్ళి వేరే చోట కూర్చుని సినెమా మొత్తం చూస్తుంది. అప్పటికి తొమ్మిదేళ్ళ వయసు ఆమెకి. ఈ వొక్క సీన్ తోనే ఆమె మనస్తత్వం అర్థం అయిపోతుంది; ఇదే తర్వాత కూడా ఎన్నోసార్లు కనిపిస్తుంది మనకు. అలాంటి ముందు చూపు వున్న అమ్మాయి, భయపడకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకునే అమ్మాయిని చూసి మనమూ ముచ్చట పడతాము. చాలా మంది లాగే మీరా కూడా సల్మాన్ ఖాన్ ని ఆరాధించడం మొదలు పెడుతుంది. క్లాస్ లో తోటి విద్యార్థి మధు (నిశ్చిత్ కొరొడి) లో ఆమెకు సల్మాన్ పోలికలు కనబడి ఆకర్షితురాలవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా చూపించిన ప్రేమలో ఎక్కడా సినెమేటిక్ చమక్కులు లేవు, వీలయినంత సహజంగా చిత్రించారు. ఇద్దరిలోనూ అమాయకత్వం, కుతూహలం, అల్లరి, ఏదో ప్రపంచంలో విహారం అన్నీ. ముఖ్యంగా మీరాలో. సల్మాన్ సినెమా చూడడానికి ముందూ తర్వాత ఆమె నడకలో సైతం మార్పు వచ్చేస్తుంది. తొమ్మిదో మబ్బుమీద విహరిస్తున్నా వాస్తవిక ప్రపంచం మెదడు నుంచి పోదు, ఆమె తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ అది ప్రతిఫలిస్తుంది. ఆ ప్రేమ కారణంగా ఆమె చదువైతే దెబ్బతినదు. స్కూల్ ఫస్ట్ వస్తుంది. కాని దాని మాయలో పడి మధు మాత్రం రెండు సార్లు ఫేలవుతాడు. ఆమె కాలేజి లో జేరుతుంది. అతను సప్లిమెంటరీలు వ్రాస్తుంటాడు. నెమ్మదిగా అతనిలో న్యూనతా భావం రావడం, మాటల్లో అదుపు, పధ్ధతీ లేకపోవడం, అన్నిటికీ ఆమెనే తప్పు పట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు. మీరాకు అతన్ని నచ్చచెప్పడం కష్టమవుతుంది.

ఆ తర్వాత కథ ఏమిటి? అతను మామూలు మనిషవుతాడా? ఇవన్నీ ఇక్కడ చెప్పను. అమేజాన్ లో చూడండి.

రూపా రావు రచనా, దర్శకత్వమూ బాగున్నాయి. తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది తేజూ, నిశ్చిత్ ల నటనా, కెల్వాది సహదేవ్ చాయాగ్రహణం. ఈ కథ చెబుతున్నది మీరా కాబట్టి కెమెరా కన్ను కూడా ఆమె కంటి నుంచే చూస్తుంది. అదీ కాక తెలివితేటలూ, ధైర్యం, సమయ స్ఫూర్తి అన్నీ వున్న అమ్మాయి కాబట్టి అవన్నీ కెమెరా కథనంలో బాగా కొట్టొచ్చేట్టు కనబడుతుంది. ఆమె మిగతా సినెమాలలో లాగా నాజూకుగా నడుస్తూ, వయ్యారాలు పోతూ, దొంగ చూఒపులు చూస్తూ, బెట్టు చేస్తూ కనబడదు. అబ్బాయిలు సిగరెట్ తాగుతూ వుంటే అడుగుతుంది. మంచి అమ్మాయిలు సిగరెట్ తాగరు అని అంటే లాక్కుని మరీ తాగుతుంది. హక్కుగా మధు ని దగ్గరకి లాక్కుంటుంది. అతని ముద్దు చెల్లించడానికి ధైర్యం చేసి తనే ఆ పరిస్థితి కల్పిస్తుంది. అతను ఫేలయ్యి న్యూనతకు గురైతే తనే పెద్దరికం వహించి అతనికి బుధ్ధులు చెప్తుంది. కొంత సినెమా ప్రభావం, కొంత సొంత ఆలోచనలు : లోకల్ గూండాల చేత దెబ్బలు తిని డీలా పడిపోయిన మధు ని చూస్తే ఇతనేం హీరో, తనని రక్షించి వాళ్ళతో పోరాడాలి గాని, నేనేం చెయ్యను అంటాడేం అనుకుంటుంది. ఇలా ఆమె చాలా ఆలోచనలను బయటపెట్టడానికి సహజమైన పరిస్థితులు అల్లింది దర్శకురాలు. కాని చివరికొచ్చేసరికి కొంత సాగతీత అనిపిస్తుంది. మళయాళంలో, తెలుగులో ఇలాంటి ప్రేమ గాథలు చాలా చూశాము. కన్నడ సినెమాకి ఇది కొత్తట.

ఇంకొంత వ్రాయాలని వుంది. కాని అది వొక spoiler alert అయిపోతుందన్న భయంతో వ్రాయడంలేదు. అది ఆమె దృక్కోణాన్ని వ్యక్తపరిచే వొక వాక్యం అంతే. వీలైతే చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here