[శ్రీ సలీం రచించిన ‘గతంలోకి’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]కా[/dropcap]లం లాగి విడిచిపెట్టిన బాణం లాంటిదని అంటారు. అది తిన్నగా ముందుకే దూసుకుపోతుంది. దాని దిశ మారదు. కానీ, కాలంలో ముందూ వెనుకా ప్రయాణించాలని మనిషి ప్రయత్నిస్తూనే వుంటాడు. దాన్నే ‘టైమ్ ట్రావెల్’ అంటారు.
అలాగే విధి నిర్ణయం మారదంటారు. దాన్ని మార్చాలని మనిషి ప్రయత్నిస్తూనే వుంటాడు. విధిని ఎదిరించాలని తపన పడుతూనే వుంటాడు. అలా, నేనూ, టైమ్ ట్రావెల్ ఉపయోగించి విధిని మార్చాలని ప్రయత్నించాను.
నమ్మకం కుదరటం లేదా????
ఈ కథ చదవండి.. ఇది నా అనుభవం!!!
***
ఉదయం ఆరుగంటల సమయం.. కార్ పార్కింగ్‌లో నిలిపి ఉన్న నాలుగు కార్లలో నాకిష్టమైన బెంట్లీ మోజాన్ కారులో కూచుని, రోజూ వెళ్ళే చోటుకి బయల్దేరాను. మా యింటినుంచి గంట ప్రయాణం. అక్కడో గంట పని. తిరిగొచ్చేటప్పటికి తొమ్మిదవుతుంది. బ్రేక్‍ఫాస్ట్ తినేసి, సరిగ్గా తొమ్మిదిన్నరకు కంపెనీకి బయల్దేరతాను. కొన్ని సంవత్సరాలుగా నా దినచర్య ఇదే. మార్చుకోవడం ఇష్టం లేని దినచర్య..
ఎప్పటికిమల్లె దారిలో మార్నింగ్ వాక్ చేస్తున్నవారు ఎదురుపడ్డారు. నేనూ మార్నింగ్ వాక్‍కి వెళ్ళేవాడిని.. ముప్పయ్ యేళ్ళ క్రితం వరకు.. అంకిత బతికున్న రోజుల్లో.. అంకిత నా భార్య.. కాలేజీ రోజుల్లో నేను పూజించి, ధ్యానించి, ప్రేమించిన అంకిత. ఐదేళ్ళ కాపురంలో ఎన్ని తీయటి అనుభవాలో.. ఎన్ని మధురమైన అనుభూతులో.. ఆ జ్ఞాపకాలేగా ఇప్పుడు నన్ను బతికిస్తోంది.. కానీ ఓ జ్ఞాపకం మాత్రం నా గుండెలో ఆరని కుంపటిలా మండుతూ నన్ను రోజూ కొద్దికొద్దిగా చంపేస్తోంది. నా రక్తనాళాల్లో అగ్ని కణాల్లా ప్రవహిస్తున్న జ్ఞాపకం..
ఆ రోజు కూడా ఎంత సంతోషంగా ఉన్నామో.. సాయంత్రం ఆరింటికి సరదాగా వాహ్యాళికి బయల్దేరాం. అంకిత నా చేయి పట్టుకుని, గలగలా మాట్లాడుతూ నడుస్తోంది. యింకొంత దూరం నడిస్తే సముద్రమంత విశాలంగా కన్పించే చెరువొస్తుంది. దాని గట్టున కూచుని కబుర్లు చెప్పుకోవడం మాయిద్దరికీ ఇష్టమైన వ్యాపకం..
“యింతకూ మనకు బాబు పుడ్తాడంటావా లేకపోతే పాప పుడ్తుందా?” పక్కకు తిరిగి నా వైపు చూసి నవ్వుతూ అడిగింది అంకిత.
“నాకైతే నీ అందాన్నంతా పుణికి పుచ్చుకుని, ముద్దుగా ఉండే ఆడపిల్ల పుడ్తుందనిపిస్తోంది. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని నీకు తెల్సుగా” అన్నాను.
“నీలాంటి కొడుకు పుట్టాలని నా కోరిక. చూద్దాం ఎవరి కోరిక బలంగా ఉందో.. ఎవరి కోరిక తీరుతుందో. ఆ సస్పెన్స్ విడిపోవాలంటే మరో ఏడు నెలలు ఆగాలి కదా.”
“పెళ్ళయిన ఐదేళ్ళ వరకు పిల్లలు వద్దన్నావని కదా ఆగాం. లేకపోతే ఈ పాటికి బాబుతో పాటు పాప కూడా ఉండేది” నిష్ఠూరంగా అన్నాను.
“యిప్పటికైనా మించిపోయింది ఏముంది? మరో రెండేళ్ళు ఆగి ఆ కోరిక కూడా తీరుస్తాలే” అంది గలగలా నవ్వుతూ.
తన నవ్వంటే నాకెంతిష్టమో.. మల్లెపూలు దొంతర్లు దొంతర్లుగా రాలిపడ్డట్టు నవ్వుతుంది. నా చిన్నప్పుడు మా యింటి ఎదురుగా పున్నాగ చెట్టు ఉండేది. ఉదయం లేవగానే ఆ చెట్టు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. నక్షత్రాలు రాలిపడ్డట్టు చెట్టు కిందంతా పున్నాగ పూలు దర్శనమిచ్చేవి. ఎంతదృష్టముంటే అటువంటి దృశ్యాలు కళ్ళబడ్తాయో కదా అనుకునేవాడిని. అంకిత పరిచయమయ్యాక, ఆమె నవ్వినపుడల్లా అటువంటి అనుభూతికి తిరిగి లోనయ్యేవాడిని. నేల మీద తన చుట్టూతా పున్నాగపూలు పర్చుకుని ఉన్నాయేమో అని వెతుక్కునేంత పిచ్చి నాకు తన నవ్వంటే..
చెరువు గట్టున ఉన్న రెండు తాటిచెట్లను ఆనుకుని కూచున్నాం. మాకెంతిష్టమో ఈ చెట్లంటే.. వాటి కాండాల మధ్య గజం దూరం ఎడమున్నా, పైకెళ్ళే కొద్దీ ప్రేయసీ ప్రియుల్లా పెనవేసుకుని పెరిగిన చెట్లు.. దూరంనుంచి చూస్తే ఒకరి భుజంమీద మరొకరు తల పెట్టుకుని ఓదార్పు పొందుతున్నట్టు కన్పించే చెట్లు..
చెరువులోని నీళ్ళు గాలి మృదువైన వ్రేళ్ళ స్పర్శకు పులకించిపోయి తరంగాలుగా తుళ్ళిపడ్తున్నాయి.
“పాప పుడ్తే ఏం పేరు పెడ్దాం?” అంది అంకిత.
తను తల్లి కాబోతుందని తెల్సిన క్షణం నుంచి అంకిత ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డ చుట్టే తిరుగుతున్నాయి. తను మాట్లాడే మాటల్లో తొంభై శాతం పిల్లల గురించే ఉంటున్నాయి.
“నువ్వేమనుకుంటున్నావో చెప్పు” అన్నాను.
‘ఆడపిల్ల పుడితే దాని పేరు నీ ఇష్టం. మగపిల్లాడు పుడ్తే వాడి పేరు నా యిష్టం” అంటూ నవ్వింది. నీళ్ళతో సయ్యాటలాడ్తున్న గాలి, ఆ నవ్వు విని, ఎక్కడినుంచో నీటి మువ్వల సవ్వడి విన్పించినట్టు భావించి, కొన్ని క్షణాలు మైమరచి ఆగిపోయి, మళ్ళా అల్లరిగా నీళ్ళ చెక్కిళ్ళను ముద్దాడసాగింది.
“అపురూప అని పెడ్దామా?” అన్నాను.
“నీ ఇష్టం” అంది.
మెల్లగా చీకట్లు పొరలు పొరలుగా అల్లుకోసాగాయి. లైట్లు వెలిగించారు. విద్యుద్దీపాల కాంతి చెరువులో దివ్వెల్లా తేలుతూ, వింత సోయగాన్ని వెదజల్లసాగింది.
“యిక వెళ్దామా?” అంటూ తను లేచి నిలబడింది. నేను కూడా లేచి తన చేయి పట్టుకుని మెల్లగా యింటి వైపుకు నడవసాగాను.
తను నాకు కుడివైపున నడుస్తోంది. యిద్దరం మా కాలేజీ రోజుల్లో చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ, బాహ్యప్రపంచాన్ని పట్టించుకోలేనంతగా అందులో మునిగి ఉన్నప్పుడు జరిగిందా సంఘటన.. మేము వీధి మలుపులోకి తిరగబోతున్న సమయంలో అటునుంచి వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. మమ్మల్ని ఎదురుగా చూడగానే కారు నడుపుతున్న ఇరవైయేళ్ళ కుర్రవాడు కంగారు పడి, స్టీరింగ్‌ని వేగంగా తన ఎడం వైపుకు తిప్పాడు.
కారు మా మీదకు నేరుగా దూసుకొస్తోందన్న కంగారులో నేను ఎడం వైపుకు గెంతుతూ అంకితను కుడి వైపుకు బలంగా తోశాను. కొన్ని క్షణాల తర్వాత తెప్పరిల్లి చూస్తే అంకిత కారు కింద రక్తపు మడుగులో పడి ఉంది.
కారు నడుపుతున్న యింజనీరింగ్ కుర్రాడితో పాటు కార్లో ఉన్న అతని ముగ్గురు స్నేహితులు బాగా తాగి ఉన్నాడు. నలుగురూ కారు దిగి పారిపోయారు.
నేనా షాక్ నుంచి చాలా సేపటివరకు కోలుకోలేకపోయాను. ఇప్పటికైనా కోలుకున్నానా? లేదు. ఆ దుస్సంఘటన ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళముందు జరిగినట్టు.. కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీళ్ళు కారుతున్నాయి.. శరీరం సన్నగా వణుకుతోంది.. గుండె పగిలిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటోంది.
సడన్ బ్రేక్ నొక్కి కారు ఆపాను. ఎదురుగా నాక్కావల్సిన భవంతి మెజిస్టిక్‌గా నిలబడి ఉంది. ప్రవేశద్వారానికి పైన ఉన్న బోర్డ్ మీద పెద్ద అక్షరాలతో ‘టైం ట్రావెల్ జంక్షన్’ అని రాసి ఉంది. దానికింద చిన్న అక్షరాలతో ‘వాంట్ టు గోబ్యాక్ ఇన్ టైం? నాట్ టు ఛేంజ్ ఎనీథింగ్ బట్ టు ఫీల్ సంథింగ్ ఎగైన్ అండ్ అగైన్’ అని రాసి ఉంది.
కార్‌ని పార్క్ చేసి, లోపలికి నడిచాను. నన్ను చూడగానే ఆఫీస్ రూంలో కూచుని ఉన్న అభిజిత్ మెత్తగా నవ్వాడు. “టైం మెషిన్ ఎంత ఖచ్చితంగా సెకండ్లతో సహా లెక్క కట్టి మనుషుల్ని గతంలోకో భవిష్యత్తు లోకో తీసుకెళ్తుందో, నువ్వు కూడా అంతే ఖచ్చితంగా ఏడు గంటలకు యిక్కడుంటావు కదా” అన్నాడు.
“టైం విషయంలో అంత ఖచ్చితంగా ఉండబట్టే కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థల్ని నడపగలుగుతున్నా” అన్నాను.
“నిన్ను చూసినపుడల్లా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది సందీప్. నేను టైం ట్రావెల్ జంక్షన్ మొదలెట్టినప్పటినుంచి రోజూ వస్తున్నావు.. ఎన్నోయేళ్ళు గడిచిపోతున్నా వస్తూనే ఉన్నావు. ప్రతిసారీ నీ గతంలోకే వెళ్తావు. అంత ఆసక్తికరమైంది గతంలో ఏముంటుంది? ఒకవేళ ఉన్నా రోజూ చూస్తే బోర్ కొట్టదా? గతమే కదా. మనకు తెల్సిందే. మనం అనుభవించిందే. అదెలాగూ జ్ఞాపకాల్లో నిక్షిప్తమై ఉంటుందిగా. యింకా కొత్తగా అనుభవించేది, అనుభూతి చెందేది ఏముంటుంది?” అన్నాడు.
నేను సమాధానం చెప్పకుండా నవ్వి వూర్కున్నాను. అభిజిత్ కాలేజీలో నా క్లాస్‍మేట్. అతనికి అంకితకు నాకూ మధ్య నడిచిన ప్రేమ గురించి తెలుసు. మా పెళ్ళి తెలుసు. అంకిత యాక్సిడెంట్లో చనిపోవడం గురించి కూడా తెలుసు. చనువుంది కాబట్టి మరిన్ని ప్రశ్నలతో విసిగిస్తాడని భయమేసి, నేనే “ఎలా ఉంది నీ బిజినెస్?” అని అడిగాను.
“టైం ట్రావెల్ అంటేనే చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం కదా. బాగా ధనవంతులు కూడా ఒకట్రెండు సార్లకు మించి రారు. నీలా రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఐనా పర్వాలేదు. సమ్ హౌ పుల్లింగ్ ఆన్” అన్నాడు.
“ఎప్పటినుంచో నిన్నో విషయం అడగాలనుకుంటున్నా. బైట బోర్డ్ మీద గోయింగ్ బ్యాక్ ఇన్ టైం గురించి చక్కటి కొటేషన్ రాయించావు. కానీ ట్రావెల్ టు ఫ్యూచర్ గురించి ఎందుకని ఏమీ రాయించలేదు?” అని అడిగాను.
“గతించిన కాలంలో జరిగిందంతా నిజం. దాంతో అల్లుకుని మనిషికి కొన్ని జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. కొంత అవగాహన కూడా ఉంటుంది. అందుకే ఎక్కువమంది గతంలోకి ప్రయాణం చేయడానికి ఉవ్విళ్ళూరుతారు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అది కల్పన కావొచ్చు. వూహాజనితం కావొచ్చు. దాని గురించి తెల్సుకోవాలని మనిషికి ఆసక్తి ఉంటుంది తప్ప ఆ కాలంతో అనుబంధం ఉండదు. అనురక్తి ఉండదు. అందుకే ఫ్యూచర్ లోకి ప్రయాణం చేయాలనే వాళ్ళ సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. నా ఆదాయంలో తొంభై శాతం పాస్ట్ లోకి ప్రయాణించేవాళ్ళ వల్లనే” అన్నాడు.
“సరిగ్గా అంచనా వేశావు” అంటూ నా టైం ట్రావెల్ కోసం కట్టాల్సిన డబ్బులు కట్టేశాను. “ఏ కాలానికి వెళ్ళాలనుకుంటున్నావు?” అని అడిగాడు.
“ముప్పయ్ ఎనిమిదేళ్ళు వెనక్కి..”
“ఎంతసేపు?”
“కొత్తగా అడుగుతావేం? గంట చాలు.”
అతను నవ్వుతూ టైం ట్రావెల్ వెహికిల్‍లో నేను కోరుకున్న కాలాన్ని, సమయాన్ని పొందుపరిచాడు. నేను వెహికిల్‍లో కూచున్నాక, తలుపులు మూసే ముందు, “నీకు చెప్పాల్సిన అవసరం లేకున్నా, నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. నువ్వు అక్కడ దేన్నీ కదిలించ కూడదు. దేన్నీ నీతోపాటు తెచ్చుకోకూడదు. కేవలం ఓ ప్రేక్షకుడిలా ఓ గంట వ్యవధిలో జరిగే సంఘటనల్ని చూసి రావాలి. అంతే” అన్నాడు.
నేను నవ్వి, తలుపులు మూసుకున్నాక, స్టార్ట్ అని ఉన్న ఎర్రబటన్‍ని నొక్కాను. కళ్ళముందు మెరుపేదో మెరిసినట్టయింది. చెవుల పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్ళినపుడు విన్పించే శబ్దం లాంటిదేదో విన్పించింది.
పార్కులో ఓ సిమెంట్ బెంచీ మీద కూచుని ఉంది అంకిత.. ఆమె పక్కనే ఇరవైయేళ్ళ నేను..
వాళ్ళ ఎదురుగా ఉన్న బెంచీ మీద కూచుని అందానికి అసలైన అర్థంలా కన్పిస్తోన్న అంకిత వైపు కళ్ళార్పకుండా చూడసాగాను. ఎంతందమైన కళ్ళో.. అరుణోదయంలో లేత గులాబీ రంగులో మెరిసే శుద్ధ కాసారాల్లా..
“ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?” ఇరవై యేళ్ళ సందీప్ అడిగాడు.
అంకిత వెల్తురు పూలు విరబూసినట్టు నవ్వింది. “అంత తొందరెందుకు? మన వయసు ఎంతని? ఇరవై యేళ్ళు. యింకా చదువు కూడా పూర్తి కాలేదు” అంది.
“యింకో ఏడాదిలో మన డిగ్రీ పూర్తవుతుందిగా. నాకు ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మా డ్యాడీ నడుపుతున్న వ్యాపారసంస్థల వ్యవహారాలు చూసుకుంటే చాలు. పెళ్ళి చేసుకోడానికి అంతకన్నా అర్హతలేం కావాలి?”
“నువ్వు డిగ్రీతో ఆపేయాలనుకుంటే అది నీ యిష్టం. నేను మాత్రం పీజీ చేస్తాను. ఆ తర్వాతే పెళ్ళి.”
“అమ్మో.. నువ్వు యూనివర్శిటీలో చేరి పీజీ చేస్తుంటే, నేను బిజినెస్ చేసుకుంటూ నీకు దూరంగా బతగ్గలనా? ఇంపాజిబుల్. నేను కూడా పీజీలో చేరతాను.”
మెరుపుల్ని తురుముకున్న ఆకాశంలా అంకిత పెద్దగా నవ్వింది. “నిజం చెప్పు.. నన్ను చూడకుండా ఉండలేకనా లేకపోతే..” అంటూ ఆగింది.
“యింత అందాలరాశిని గుండెల్లో దాచుకుని కాపాడుకోవాలన్న కోరిక. అజాగ్రత్తగా ఉంటే యింకెవరైనా ఎత్తుకుపోతారన్న భయం.”
“భయం కాదు స్వార్థం.. నలకూబరుడే వచ్చి ప్రపోజ్ చేసినా అంగీకరించనని నీకు తెలియదా? నా జీవితంలో నీకు తప్ప యింకెవ్వరికీ స్థానం లేదని ఎన్నిసార్లు చెప్పాలి?” చిరుకోపంగా అంది.
“కోపంలో కూడా ఎంత బావుంటావో తెలుసా?” ఇరవై యేళ్ళ నేను..
ఆమె మళ్ళా నవ్వింది. అందమైన నవ్వు రూపం మార్చుకుని ఐదడుగుల నాలుగంగుళాల అపురూపమైన, అలౌకికమైన అమ్మాయిగా మారిపోయినట్టు.. ఒళ్ళంతా నవ్వే..
నా సమయం పూర్తి కావడానికి మరో ఐదు నిమిషాలే వ్యవధి ఉండటంతో, అయిష్టంగానే టైం ట్రావెల్ వెహికిల్‍ని చేరుకున్నాను.
***
తర్వాత మరికొన్ని రోజులు గతంలోకి ప్రయాణించి, మేమిద్దరం పీజీ చేసే రోజుల్లోని కొన్ని మధురమైన సంఘటనల్ని కళ్ళారా, తనివి తీరా చూసుకున్నాను. పెళ్ళి.. మా కాపురం.. ఐదేళ్ళలో ఎన్ని తీయటి అనుభవాలో.. మన మనసు కూడా టైం మెషీన్ లాంటిదే. మనల్ని గతంలోకి లాక్కెళ్ళి, మనోఫలకం మీద ప్రత్యేకమైన ఆ సంఘటనని పునః ప్రదర్శించి, అప్పటి అనుభూతినో ఆవేదననో తిరిగి అనుభవంలోకి తెచ్చే జ్ఞాపకాలు కాలాన్ని వెనక్కి తిప్పే వాహకాలైతే, మన కలలు భవిష్యత్తులోకి దూసుకెళ్ళి, రంగుల ప్రపంచాన్ని మన కళ్ళముందుంచే ట్రావెల్ వెహికిల్స్ కదా. కానీ ఈ టైం ట్రావెల్ వాహనంలో గతంలోకి వెళ్ళడం వల్ల ప్రత్యక్షంగా అప్పటి సంఘటనల్ని పదేపదే అనుభవంలోకి తెచ్చుకుని, తృప్తి పడే అవకాశం ఉంది.
అంకిత తను తల్లి కాబోతున్న విషయం చెప్పినప్పటి అపురూపమైన క్షణాల్ని కూడా చూసుకున్నాను. యిక మిగిలింది తను యాక్సిడెంట్లో చనిపోయిన సంఘటన.. ఈ సర్కిల్‍ని ఎన్నిసార్లు పూర్తి చేశానో.. అంకిత పరిచయమైన క్షణం నుంచి తను కారు టైరు కింద పడి విగతజీవిగా మారిపోయేవరకు ఉన్న సర్కిల్..
కారు ప్రమాదాన్ని గతంలోకి ప్రయాణించి చూసుకున్నప్పుడల్లా ఎంతటి దుఃఖాన్ని మోసుకుంటూ తిరిగి వస్తానో.. నా ఎముకల్ని, కండరాల్ని కరకరా నిమిలి తినేసే అపరాధభావన.. కారు తనని ఢీకొట్టలేదు. నేనే తనని కారు కిందికి తోశాను. అలా తోయకుండా ఉంటే నా అంకిత బతికే ఉండేది. నా కోసం యిద్దరు పిల్లల్ని కనేది. ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయి.. వాళ్ళకు పెళ్ళిళ్ళయి.. మాకు మనవళ్ళూ మనవరాళ్ళు ఉండి.. సంపూర్ణమైన, సంతృప్తికరమైన సంసార జీవితం అంటే అదే కదా. నేనే పాపాత్ముడిని. అద్భుతంగా పెనవేసుకుంటున్న జీవన లతల్ని అర్ధాంతరంగా నా చేతుల్తోనే తుంచేశాను.
ఆ రోజు ఉదయం ఏడింటికి ఎప్పటికిమల్లె టైం ట్రావెల్ జంక్షన్లో అభిజిత్ ఎదురుగా కూచుని ఉన్నాను.
“ఏ కాలానికి ప్రయాణం చేయాలనుకుంటున్నావు?” అని అడిగాడు.
“ముప్పయేళ్ళు వెనక్కి” అన్నాను డబ్బులు చెల్లిస్తూ.
“యిప్పటికి కొన్ని వందలసార్లు ప్రయాణించి ఉంటావు. దీనికోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం అవసరమంటావా? ఎన్నిసార్లు చూసినా అదే అనుభవం కదా. ఇదంతా వృథా ఖర్చని నీకన్పించడం లేదా” అన్నాడు అభిజిత్.
“అంకిత చనిపోయాక నా జీవితంలో ఏం మిగిలిందని? యింకా బతికున్నానంటే కారణం రోజూ ఉదయం ఓ గంట సేపు గతంలోకి వెళ్ళి నా అంకితను చూసుకోగలుగుతున్నాను కాబట్టే. నాకిప్పుడు యాభై ఎనిమిదేళ్ళు. యింకెంత కాలం బతుకుతానో తెలియదు. నాకొచ్చే ఆదాయాన్ని యింకెవరిమీద ఖర్చుపెట్టమంటావు? నాకెవరున్నారని? యిలా నా చివరిక్షణం వరకు అంకితను చూసుకుంటూ, తన మాటలు వింటూ, తన నవ్వుని ఆస్వాదిస్తూ బతకాలనేదే నా కోరిక” అన్నాను.
“నువ్వు అంకితను అంతగా ప్రేమించావో లేకపోతే ఆమె మరణం తర్వాత పిచ్చివాడిగా మారావో నాకర్థం కావడం లేదు” అన్నాడు అభిజిత్.
నవ్వి వూరుకున్నాను.
టైం ట్రావెల్ వెహికిల్‍లో కూచుని కళ్ళు మూసుకున్నాను. అలవాటైన ప్రయాణం.. అలవాటైన శబ్దాలు..
చెరువు గట్టున ఉన్న రెండు తాటి చెట్లను ఆనుకుని కూచుని ఉన్నారు అంకిత, ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో ఉన్న నేను..
వాళ్ళకు కొద్దిగా ఎడంగా కూచుని అంకితనే ఆరాధనగా చూస్తూ వాళ్ళ మాటలు వినసాగాను.
“పాప పుడ్తే ఏం పేరు పెడ్దాం?” అంది అంకిత.
తను తల్లి కాబోతుందని తెల్సిన క్షణం నుంచి అంకిత ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డ చుట్టే తిరుగుతున్నాయి. తను మాట్లాడే మాటల్లో తొంభై శాతం పిల్లల గురించే ఉంటున్నాయి.
“నువ్వేమనుకుంటున్నావో చెప్పు” అన్నాను.
‘ఆడపిల్ల పుడితే దాని పేరు నీ ఇష్టం. మగపిల్లాడు పుడ్తే వాడి పేరు నా యిష్టం” అంటూ నవ్వింది. నీళ్ళతో సయ్యాటలాడ్తున్న గాలి, ఆ నవ్వు విని, ఎక్కడినుంచో నీటి మువ్వల సవ్వడి విన్పించినట్టు భావించి, కొన్ని క్షణాలు మైమరచి ఆగిపోయి, మళ్ళా అల్లరిగా నీళ్ళ చెక్కిళ్ళను ముద్దాడసాగింది.
“అపురూప అని పెడ్దామా?” అన్నాను.
“నీ ఇష్టం” అంది.
మెల్లగా చీకట్లు పొరలు పొరలుగా అల్లుకోసాగాయి. లైట్లు వెలిగించారు. విద్యుద్దీపాల కాంతి చెరువులో దివ్వెల్లా తేలుతూ, వింత సోయగాన్ని వెదజల్లసాగింది.
“యింక వెళ్దామా?” అంటూ అంకిత లేచి నిలబడింది.
వాళ్ళిద్దరూ మెల్లగా నడవసాగారు. నేను వాళ్ళ వెనకే అనుసరించసాగాను.
వాళ్ళు వీధి మలుపులోకి తిరగబోతున్న సమయంలో అటునుంచి వేగంగా ఓ కారు దూసుకొచ్చింది. వాళ్ళని ఎదురుగా చూడగానే కారు నడుపుతున్న ఇరవైయేళ్ళ కుర్రవాడు కంగారు పడి, స్టీరింగ్‌ని వేగంగా తన ఎడం వైపుకు తిప్పాడు.
ఎన్నోమార్లు ఈ సంఘటనను చూస్తూ, ఏ చేయాలో ఎన్నోమార్లు మనసులో ట్రయల్స్ వేసుకున్న నేను ఎదురుచూస్తున్న క్షణమది.
అందుకోసమే ఎదురు చూస్తున్న నేను ఒక్క దూకు దూకి, ఎడం వైపుకు గెంతుతూ అతను ఎడమ వైపుకు తోసిన అంకితను కుడి వైపుకు బలంగా తోశాను. కొన్ని క్షణాల తర్వాత తెప్పరిల్లి చూస్తే అంకిత కారు కింద రక్తపు మడుగులో పడి ఉంది.
కారు కుడివైపున్న చక్రం కింద ఆమె శరీరం..
నేను శిలాప్రతిమలా నిలబడిపోయాను. మళ్ళా రక్తనాళాల్లో విషంలా పాకుతూ అపరాధభావన.. అంతా అయోమయంగా ఉంది. నేను పదిసార్లు చెక్ చేసుకున్న చోటనే నిలబడ్డానే.. అంకితను అనుకున్న వైపుకి తోసి కదా మరో వైపుకి గెంతాను.. ఐనా అంకిత కారు టైర్ కింద ఎలా పడిపోయింది? అప్పుడెలా పడిఉందో అలానే కారుకి కుడివైపున్న టైర్ కింద ఆమె శరీరం.. ఎక్కడ పొరపాటు జరిగింది? నా మెదడు నిండా ఆలోచనల విస్ఫోటం..
అంకితను ఎడమవైపు తోస్తే కారు చక్రం క్రిందపడింది. అందుకని చాలా పరిశీలించి, పక్కా ప్రణాళిక వేసి, సరయిన సమయానికి కుడివైపు నెట్టాను. కానీ, ఫలితం మళ్ళీ అంకిత శరీరం కారు క్రిందనే!!!!
నేను అంకితను కుడివైపు నెట్టకుండా ఉన్నా బతికేది. నేను ఎడం వైపుకి గెంతుతూ తనని కూడా నాతో పాటు లాగేసినా బతికుండేది. డ్రైవింగ్ చేస్తున్న కుర్రవాడు తాగి ఉన్నా, సమయస్పూర్తితో స్టీరింగ్‍ని ఎడం వైపుకు కోశాడు. అతని తప్పు లేదు. తప్పంతా నాదే. నేనే నా అంకితను మళ్ళీ కారు చక్రాల ముందుకి నెట్టి చంపేశాను.
నేను నెట్టినపుడు అంకిత అంత దూరంలో పడకుండా ఓ అడుగు దూరం ఇవతలకు పడినా బతికుండేది. తన చావుకీ బతుక్కి మధ్య దూరం ఓ అడుగు మాత్రమే..
నేను ఎంతో ఆలోచించి, నా ఆస్తినంతా డబ్బు రూపంలో మార్చి, బ్రతికిన అంకితతో ఎలాంటి జీవితం దొరికితే అలాంటి జీవితం గడపాలనుకున్నాను. వెనక్కి వెళ్ళకూడదనుకున్నాను. కానీ, ఇప్పుడు నేను గతంలో వుండి సాధించేదేమీ లేదు. నా భవిష్యత్తు లోకి, అంటే వొంటరి వర్తమానంలోకి వెళ్ళక తప్పదు.
చివరి క్షణంలో టైమ్ ట్రావెల్ యంత్రంలోకి అడుగుపెట్టాను. తలుపులు మూసుకుని నా గతంపై శాశ్వతంగా తెర పడే ముందు ఆ వైపు చూశాను.
అతను అంకిత తలను ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తున్నాడు. కారులో ఉన్న కుర్రవాళ్ళు దిగి పారిపోతున్నారు. మనుషులు చుట్టూ గుమికూడుతున్నారు. ఆ గుంపులోంచి ఎవరో నీడలాంటి వ్యక్తి అందరికీ వ్యతిరేక దిశలో పరుగెత్తుతున్నాడు. నేనెప్పుడూ ఆ వ్యక్తిని గమనించలేదు. అంతా గందరగోళంగా వుంది.
ఆ గందరగోళంలో సరిగ్గా గమనించలేదు. నేను రోడ్డు పక్కన కుడివైపు పడిపోయి ఉన్నాను. కారు నాకు ఎడం వైపున ఆగి ఉంది. అప్పుడర్థమైంది ఏం జరిగిందో. అంకిత విసురుగా నా మీద పడటం వల్ల నేను దూరంగా వెళ్ళి పడ్డాను. తనను ఎడం వైపుకు తోశాననుకున్నాను. లేదు. తోయకముందే పడిపోయాను.
ఎంతటి దిగులు కమ్మేసిందో.. మళ్ళా అపరాధ భావన.. గుండెల్లో కొలిమిలా మండుతూ.. అంకిత నా మీద పడినప్పుడు నేను బలంగా తట్టుకుని నిలబడి, తనని ఎడం వైపుకు నెట్టి ఉంటే బతికేది. నాదే తప్పు..
నేను ఏదో ఓ రకంగా కాలాన్ని వెనక్కు తిప్పి అంకితను బ్రతికించుకోవాలనుకున్నాను. కాలాన్ని ధిక్కరించాలనుకున్నాను. విధిని వెనక్కు తిప్పాలనుకున్నాను. కానీ, కాలం ముందుకే ప్రవహిస్తూనేవుంది. విధి వెక్కిరిస్తూనే వుంది.
టైం ట్రావెల్ వెహికిల్ కదలిక బరువుగా వుంది. నిరాశ ఆకాశంలా నాలో విస్తరిస్తూ.. గిల్ట్ సముద్రమంత లోతున చొచ్చుకుపోతూ..
‘గతాన్ని ఎవ్వరూ మార్చలేరు’ అనే మాట నా చెవుల్లో ప్రతిధ్వనించసాగింది.
‘ఏం సార్ అలా వున్నారు?’
టైమ్ మెషీన్ నుంచి బయటకు వస్తున్న నన్ను అభిజీత్ అడిగాడు.
నేను మాట్లాడలేదు. మౌనంగా బయటకు నడిచాను. ఇక ఇదేసారి నేను ఇక్కడికి వచ్చేది. ఎంత ప్రయత్నించినా కాలాన్ని వెనక్కు తిప్పలేను, విధిని మార్చలేను. అలాంటప్పుడు గతంలోకి ప్రయాణించి లాభంలేదు. గతాన్ని తలచి లాభంలేదు.
మనిషి గతంలో ఆగిపోకూడదు. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. వర్తమానంలో బ్రతకాలి. ఈ క్షణమే మనది. ఒక నిశ్చయానికి వచ్చాను.
***
బయటకు వస్తూంటే, చెట్టు వెనక్కాల ఎక్సయిటెడ్‌గా వాదించుకుంటున్న ఆ నలుగురిపై దృష్టి పడింది. అంత ఎక్సయిట్‌మెంట్ ఈ నడివయసువారికి అనిపించింది. వారు నలుగురు దాదాపుగా పిచ్చివాళ్ళలా వున్నారు.
వారికి దగ్గరగా నడిచాను.
“నువ్వు నిజంగా వెళ్ళావా? మనం అనుకున్నది అనుకున్నట్టు చేశావా?”
“చేశాను. ఆమెను బ్రతికించి మన మనసులోంచి నేర భావనను తొలగించుకోవాలని నాకూ వుంది. మనం అనుకున్నట్టే, నేను ఆ నలుగురినీ లిఫ్ట్ అడిగాను. సందు మలుపు తిరిగే సమయంలో, బలవంతంగా స్టీరింగుని వ్యతిరేక దిశలో తిప్పాను. కానీ, వాడెవడో ధూర్తుడు, ఇన్నిసార్లు మనం పరిశీలించినా, ఒక్కసారి కూడా కనబడలేదు, ఎక్కడనుంచి ఊడిపడ్డాడో, ఈసారి ఊడిపడ్డాడు. సరిగ్గా అమ్మాయిని కారు క్రిందకు తోశాడు. చేసిన తప్పు నుంచి తప్పించుకోలేము. ఈ నేర భావన నుంచి మనకు విముక్తి లేదు.” ఏడుస్తూ అంటున్నాడతడు.
జరిగింది నాకు అర్థమయింది..
వున్న చోటనే కూలబడిపోయాను.
(సమాప్తం)