గతించని గతం-1

0
4

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]సూ[/dropcap]ర్యుడు లేత ఎరుపు పసుపు రంగులు పులిమిన ముద్దలా తూరుపునుంచి బయటపడుతున్నాడు. పొద్దు సాగిన కొద్ది కిరణాలు వేడిని పుంజుకుంటున్నాయి. నీరెండ ఎండగా పండటానికి ఆట్టే వ్యవధి పట్టడం లేదు. ఈ చరాచరా వర్తనానికి వెలుగును ప్రసాదించేది, జీవికకు జీవాధారమయినది, కారుచీకటిని పారద్రోలేది ఈ ఎర్ర ముద్దే.

‘అసలెవ్వరయ్యా ఈ సూర్యుడు? ఏదో ఆరిపోయినట్టు, తన పుట్టేదో మునిగిపోయినట్టు అంత నియమంగా క్రమం తప్పకుండా నడుస్తాడెందుకు? ఆయనకు వేరే పనీ పాటా లేదా?’ అంటే – అదంతే.

దీనికి సమాధానం లేదు.

సృష్టి ఎన్నడు మొదలయినా, దీని గమనాన్ని గమనించినప్పటినుంచి ఈ మహానుభావుని నడకను బేరీజు వేసి ‘ఇలా ఉన్నాడు. ఇలా ఉండేవాడు’ అని చెపుతారు తప్ప అసలీయన ఎవరో ఎందుకలా ఆగక పరిగెడుతున్నాడో మాత్రం చెప్పరు. ఒకవేళ ఏ మహానుభావుడయినా చెప్పినా ఇదో గ్రహమని ఊరుకుంటాడు, ఇహ చెప్పేదేమీ లేనట్టు. ఇంతేనా అని మనం చూస్తే మాత్రం ఈ బ్రహ్మాండ భాండం పగిలి ముక్కలయ్యిందని; ఆ ముక్కలే శూన్యాన నిలిచాయనీ; అవే భూమి, సూర్యుడు, కుజుడు, గురుడు వగైరా అనియును…

అప్పటినుంచి ఆయనకి ఇదే పని. ఒక్క విఘడియ కూడా తేడా పడలే. ఇక సెలవలు, అలకలు, రోగాలు, రొష్టులు బొత్తిగా తెలియవు. అయన కనుసన్నల్లోనే జీవరాశితో పాటు మనిషి పుట్టాడు. ఇంకా పుడుతున్నాడు. బ్రతుకుతున్నాడు. ఈ బ్రతికిన కొద్ది కాలంలో ప్రేమించడం, ద్వేషించడం, సంతానాన్ని కనడం, పెంచడం, ఆరాధించడం, అన్యాయం చేయడం, చంపడం, ఆదుకొనడం. ఇక ఈ బ్రతికిన నాలుగు నాళ్ళలో బ్రతుకు తెరువు అన్వేషణ, ఆరాట పోరాటాలు, తత్ఫలితమే మనిషీ వాడి కథ… ఇతని పుట్టుకనించి పుడకల్లోనికి వెళ్ళేదాకా నడిచేది – గడిచేది వాడి జీవనయానం.

నేను భద్రాచలంలో బస్సు దిగాను. అది అంత రద్దీగా లేదు కానీ మురిగ్గా కనిపించింది. బయటకు వచ్చి బాటన పడ్డాను. ఇరువైపులా చూస్తూ నడుస్తున్నాను. నాకు కావలసిన ఇల్లు కనిపించాలి కదా. త్వరలోనే దాని ఆనవాలు దొరికింది. ఆగి ఆ గడపదాకా వెళ్లి బోర్డ్ చూసి అదేననుకుని బటన్ నొక్కాను. కొద్దిసేపటికి ‘ఎవరూ’ అంటూ తలుపులు తెరుచుకున్నాయి. ఓ తల బయటికి తొంగి చూసింది. ఆనక ఒక పల్చటి పొడవాటి శాల్తీ బయటకు వచ్చింది.

నేను ‘నేనే’ అని అన్నాను. అయినా అలానే చూస్తున్నాడు. ఇంత మనిషిని ఎదురుగా కనిపిస్తుంటే  ఏమిటో ఆ చూపు అర్థం కాలేదు. అతను మాత్రం నన్ను కిందికి పైకీ ఒకసారి చూసి “ఎవరు కావాలి” అని అడిగాడు.

“వెంకటప్పయ్య గారి ఇల్లు ఇదే కదా” అన్నాను.

“ఆఁ, ఇదే… మీరడిగిన వెంకటప్పయ్యను నేనే” అని “అసలు మీరెవరు? నేను మిమ్మల్ని గుర్తించలేదు” అని ఇంకా కళ్ళు చిట్లించి చూసాడు. నాకు మాత్రం అతను గుర్తులోకొచ్చాడు.

“నన్ను శివుడంటారు. మాది సిరిపురం” అన్నాను. “ఇంత త్వరగా ఇల్లు దొరికినందుకు సంతోషం అనిపించింది.”

‘ఓహో అలాగా’ అని కళ్ళజోడు తీసి, అద్దాలను శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాడు తప్ప నన్ను లోపలికి రమ్మని మాత్రం పిలవలేదు.

“సత్యవతి గారు ఉన్నారా?” అడిగాను అక్కడే నించుని.

“ఉంది. మా సత్యది సిరిపురమే. నేను పెద్దగా అక్కడకు వెళ్ళిన వాడిని కాదు. సత్యవతికి నాతో పెళ్ళినాటికే వాళ్ళు సిరిపురాన్ని వదిలేశారు. అంచేత అక్కడి వారితో గానీ, సత్య బంధువులతో కానీ అంతగా సంబంధ అనుబంధాలు లేవు. పరిచయాలు నామమాత్రమే” అని అంటూ, “అరే, నేను మిమ్ముల్ని లోనికి రమ్మనమని అనలేదు కదూ, రండి” అని గడపనుంచి లోనికి తొలగి గదిలో ఫాన్ వేసి కూర్చున్నాడు.

వెంటనే లోనికి వెళ్లి నాలుగు నిమిషాల్లో తిరిగి వచ్చి “వస్తుంది కూర్చోండి. స్నానాల గదిలో ఉంది” అని డోర్ కర్టన్‌ను సరిచేసి, కిటికీలను బార్లా తెరిచి కూర్చున్నాడు.

ఆనక నన్ను గుచ్చి గుచ్చి చూస్తూ “నాకు తెలియక అడుగుతాను, మా సత్య మీకు గానీ బంధువా? నీకు లోగడ మిమ్ములను చూసిన ధ్యాస రావడం లేదు” అన్నాడు.

“అంత మరీ దగ్గరి బంధువులం కాదు లెండి” అన్నాను ఆయన్నే చూస్తూ.

“బంధుత్వానిదేముంది లెండి, ఒక ఊరి వారే కదా” అని అదోలా నవ్వి “మీరిప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు” అని అడిగాడు.

చెప్పాను.

“అయితే ఇవ్వాళే వచ్చారా? మా భద్రాచల రామున్ని చూసి పోదామని గానీ రాలేదు కదా?” అన్నాడు.

తల అడ్డంగా ఊపాను.

తరువాత ఆయన్నే చూస్తూ “సత్యవతిని చూసి ఒకసారి పలకరించి పోదామని వచ్చాను” అన్నాను.

దీనికి అతను కుర్చీలో అసహనంగా కదిలాడు. అప్పటిదాకా అతని మొకాన కనిపించిన కాస్త ప్రసన్నతా కనుమరుగయింది. కండ్లజోడు ముక్కు చివరకు జారి ఆగింది. హడావిడిగా సర్దుకున్నాడు

“స్కూల్‌లో చదివేటప్పుడు కానీ స్నేహితులయి ఉంటారు” అని అరగొండి నవ్వు నవ్వాడు, నాకందులో వ్యంగ్యం ధ్వనించింది.

“మేము ఒకే ఊరి వాళ్లము” అనగానే ఎదురొచ్చి “ఎక్కడ దిగారేమిటి?” అని అడిగాడు.

“ఎక్కడా దిగలేదు. ఇక్కడికే సీదా వస్తున్నాను” అన్నాను.

“అల్లాగా” అని మూలిగాడు.

“ఇవ్వాళ అతిథన్న మాట.”

ఈ యాత్రా స్థలాలలో ఉన్న చిక్కిదే… ‘వారి పుణ్యం కోసం వచ్చి ఇలా మనపై వాలిపోతారు’ అనుకున్నట్టు ఉంది.

“నేను చదువుకునే రోజుల్లో సత్యవతిని ప్రేమించాను. అప్పుడామె నా ప్రేమను పుచ్చుకుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మా వివాహం జరగలేదు. ఆనక అయిదేళ్లకు కానీ నా పెళ్లి కాలేదు” అని ఆగి “ఈ మధ్యనే ఎందుకో సత్య నా తలపుల్లోకి వచ్చింది. చూడాలనిపించింది. అడ్రెస్ కోసం ప్రయత్నించాను. దొరికింది. బయలుదేరి సీదా వచ్చేసాను” అన్నాను అతన్ని గమనిస్తూనే.

నా మాటకు వడదెబ్బ తగిలిన వాడిలా అయిపోయాడు. అసలే రివట లాంటి శరీరమేమో వణకసాగింది. కుర్చీలో బాగా వెనక్కు వాలిపోయాడు, అరకొరగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఏదోలా అనిపించాడు.

“ఏమయ్యింది” అని అడిగాను.

‘ఇంకా ఏమీ కాలేదు’ అన్నట్టు చేయి కదిపాడు, అతన్ని శ్మశాన ప్రశాంతత ఆవరించింది.

పరవాలేదనుకుని “నేను ఈమధ్య పాత డాక్యుమెంట్ల కోసం వెతుకుతుంటే అప్పటి నా ఫోటో దొరికింది. అదసలు నా ఫోటోనేనా అనే అనుమానం వచ్చింది. దాన్ని తీసుకుని అద్దం ముందుకు వచ్చి మరీ ఇప్పటి నాకూ దానికి టాలీ చేసుకుని చూసుకున్నాను. ఎంత మార్పు. అదే శరీరం, అదే మనస్సు, అదే తీరు నన్ను నేను చూసుకుంటున్నదే, అయినా అంతులేని మార్పు, చిత్రంగా అనిపించింది. అప్పుడు సత్యవతి అకస్మాత్తుగా నా గుర్తులోకొచ్చింది. ఇప్పుడామె ఎలా ఉండిందో? ఇప్పటి ఆమెను చూడాలని అనిపించింది. మైమరిపించే అందం, నాజూకుతనం, సన్నని నడుము, ఆ తీరూ ఎలా ఉందో చూడాలి. అంతే వెంటనే బయలుదేరి వచ్చాను.”

కుర్చీ లోంచి కదిలాడు వెంకటప్పయ్య. వానిలో జీవముందో లేదో కానీ కదలిక ఉంది, అతను నిటారుగా నిలబడేసరికి జంకు కలిగింది.

“సత్యవతి మీకు గానీ ఉత్తరాలు రాస్తున్నదా?” అడిగాడు గొంతు సరిచేసుకుని. అనుమానం పెను భూతమయి వేధిస్తున్నట్టుంది. అలా ఎందుకడిగాడో అర్థం కాలేదు.

“అలాంటిదేమీ లేదు” అన్నాను, నిజంగా లేదు కనుక.

పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చినట్లు చూశాడు నన్ను. వాడి వాలకం చూస్తే నాకు నవ్వొచ్చింది. నాకు చిన్నగా నవ్వడం రాదు. నా నవ్వు అతన్ని మంటల్లోకి నెట్టింది. అసహనంగా కదులుతూ తనను తానుగా నిలదొక్కుకుని నా వైపు అసహనంగా చూసి “లే” అన్నాడు.

నేను లేవలేదు. నాకు లేవాలని అనిపించలేదు.

“లే” అని ఊగిపోతూ మళ్ళీ అరిచాడు. కీచుగా వినిపించింది. తిరిగి కుర్చీలో పడిపోతాడేమో అనిపించింది. అయితే నన్ను బయటకు వెళ్ళమంటున్నాడని మాత్రం అర్థం అయ్యింది.

నేను అప్పుడున్నది అతనింట్లో. అతని భార్య సత్యవతే కావచ్చు లేదా సత్యవతి భర్త అతగాడు కావచ్చు. నన్ను లే అన్నది అతడే కావచ్చు, అతన్ని తేరిపారా చూసి నెమ్మదిగా లేచాను. కానీ సత్యను చూడక ఎలా వెళ్ళడం? వెంకటప్పయ్య నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నాడో కూడా అప్పుడే అర్థమయ్యింది. సత్యవతి అతని భార్య కదా. నేనతనితోనే ‘మీ బార్య ప్రేమికుడినని, ఆమెను కలిసేందుకే వచ్చాన’ని చెబితే, మరీ చచ్చువెధవ కనుక ‘లే’ అని అరిచాడు. మరొకడయితే నిలువునా చీరేసేవాడు… అనుకుని నేనలా చెప్పినందుకు సిగ్గుపడి లేచి కదిలాను.

సత్యవతి స్నానం పూర్తయినట్లు ఉంది. “ఎవరొచ్చారు” అంటూ బయటకు వచ్చింది.

అది నా సత్య గొంతే.

నేను నిలుచొని కనిపించాను.

ఆవిడా కనిపించింది.

నేనలాగే చూస్తున్నాను,

జుట్టు కొంచం నెరిసింది. శరీరం లేతదనాన్ని కోల్పోయింది. రంగు రూపు నడకా అదే. ఆ కళ్ళలోని మెరుపు వసివాడలేడు. ఆ మెరుపు కోసమే ఆ రోజుల్లో ఎదురుచూసేవాడిని. కళ్ళ చుట్టూ ఎరుపుదనం తగ్గింది. మానసికంగా బాగున్నట్టు లేదు. భర్త వెంకటప్పయ్య ఎదురుగా కనిపిస్తున్నాక మానసికంగా ఎలా బాగుంటుంది. వయో భారపు ప్రభావము అంతగా కనిపించలేదు.

సత్యవతి నన్ను పరిశీలనగా చూసి “ఎవరు?” అని అడుగబోయి ఆగింది.

నన్ను గుర్తుపట్టి ఆశ్చర్యంలో మునిగి నన్ను చూస్తూ “ఏయ్ నువ్వు… నువ్వు… ” అంటూ అడుగులు కదిపింది. వేగంగా నన్ను చేరుకోవాలనిపించి తడబడినదానిలా నడిచింది,

“నువ్వు శివుడివే కదూ..” అంది గుండె పగిలే సంతోషంతో.

మా ఇద్దరి మద్య గడకర్రలా వెంకటప్పయ్య.

“అవును సత్యవతీ, నేను శివుడినే” అన్నాను.

“అవునా? అవును కదూ” అని దాపుకొచ్చి నన్ను పట్టుకొని నా గుండెకి తల ఆనించి నిలుచుంది. ఆవిడలో ఆరాధనా భావం, ఆర్తి, అంతులేని ప్రేమ, అలాగే గట్టిగా కౌగిలించుకుంటుందేమో అనుకున్నాను. కానీ నిగ్రహించుకుంది.

“నిల్చున్నావేం శివుడూ, కూర్చో. ఎలా వున్నావు” అంది నా చేతులు పట్టుకుని.

“ఇదిగో ఇలా ఉన్నాను, కనిపిస్తున్నాను కదా” అని నవ్వాను. నా భావనను చదవగలిగిందో ఏమో కానీ “కాఫీ కలుపుతాను కూర్చో” అని వెంకటప్పయ్యను పట్టించుకోకుండా వెనక్కు మళ్ళింది.

“సత్యవతీ ఆగు” అన్నాను,

ఆగింది.

“లోపలికి వెళ్ళకు. ఇక్కడే ఉండు. నిన్ను చూడాలనిపించి కదా వచ్చాను, కనులారా చూసాను. చాలు.” అని ఒక క్షణం ఆగి సత్యవతి భుజం పట్టుకుని “నీకు పిల్లలు లేరు కదూ, నీ పెళ్ళికి ముందే నీ మొగడు ఆపరేషన్ చేయించుకున్నాడని, అతనికప్పటికే పిల్లలున్నారని విన్నాను. నేవిన్నది నిజమే కదా” అని అడిగాను.

కళ్ళనిండా నీరు నిండుగా అవునన్నట్టు తల ఊపింది.

నా కౌగిలిలోనికి తీసుకుని ఓదార్చాలని అనిపించింది. భాదల్ని, మనస్తాపాల్ని కడిగేయడం మంచిది కదా. కానీ అడుగు కదపలేక పోయాను. దేవతలా ఉండే సత్య నాకు బూజర బూజరగా అనిపించింది,

అయినా అడుగు ముందుకు కదిపి దగ్గరకు తీసుకుని ‘ఇక వెళ్తాన’ని సత్య కళ్ళల్లోకి చూసాను.

సత్య నన్ను ఆరాధనగా చూస్తూంది. నా గుండె నిండా ఆనందం.

“నువ్వు కనిపించావు చాలు” అని పెద్దగా నవ్వి “ఈ కట్టె ఇంకెంత కాలం ఉంటుందో ఏమో? నాకీ అదృష్టం చాలు. ఈ బ్రతుకున నిన్ను తిరిగి చూడగలనో లేదో?” అని నీళ్ళు నిండిన కళ్ళను గట్టిగా అడ్డుకుని మరొక్కసారి నా సత్యను కళ్ళారా చూసుకుని “వెళ్తున్నాను. బై” అని వెనక్కు మళ్ళాను.

గడప దాటాను. మెట్లు దిగుతున్నాను, నా వెంటపడి పరుగున వచ్చినట్టు అనిపించింది.

లిప్త పాటు ఆగాను. నిజంగానే దాపుకొచ్చిన సత్య నా భుజాలపై చేయి వేసింది. ఎదురుగా మళ్ళాను. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరింది. వొంగి చేతులను ముద్దాడింది.

కొద్దిగా జరిగి “వెళ్తున్నా” అని వచ్చాను. సత్యవతి నాకోసం ఎంతగా పరితపించిందో స్పష్టంగా అర్థమయ్యింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here