గతించని గతం-11

0
2

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]”మీ[/dropcap]కు ఉత్తరం వచ్చింది నాన్నగారు” అని గబగబా పైకి వచ్చింది హరిచందన.

‘ఇది ప్రేమలేఖలు వచ్చే వయసు కాదులే ఇచ్చిరా….’ అని నెమ్మదిగా వంటింట్లోకి నడించింది నా ఇల్లాలు.

నాకు ఆవిడ సణుగుడు లీలగా చెవిన పడింది. నవ్వు వచ్చింది.

వయసున వ్రాసుకున్నా, బలాదూర్‌గా దేశాలంట సంవత్సరాలు తిరిగినా ఏం చేసిందట? గుడ్ల నీరు కుక్కుకుంటూ ఎదురు చూడటం తప్ప.

నిజానికి ఈ దేశం లోనే కాదు… ప్రపంచాన ఎక్కడయినా ఆడవాళ్ళకు స్వతంత్రం వచ్చిందని, పురుషులతో సరి సమానమని ఎంత చెవికోసిన మేకల్లా గొంతు చించుకుని అరిచినా, వాస్తవం మాత్రం ఆడది వంటింటి పడకటింటి వాడకపు సరకు మాత్రమే, ఆ స్థాయిని మించి ఎదిగిన.. ఎదగనిచ్చిన దాఖలాలు అంతగా కనపడవు. కొండొకచో కనిపించినా… అవి నిజాలు కావు. నిజం వారి పట్ల చాలా నిష్ఠూరంగా ఉంది అన్నది వాస్తవం.

ఉత్తరం చేతులో పెట్టి వచ్చినంత వేగంగా కిందికి వెళ్ళిపోయింది చందన.

ఉత్తరం కొంచం బరువుగా అనిపించింది. బహుశా డా.పాండే వ్రాసి ఉంటాడని అనుకుని నా గదిలోకెళ్ళి కవరు తెరిచాను. నాలుగు పేజీల కవరు. అక్షరాలు గుండ్రంగా ఉన్నవి.

డాక్టర్ గారి దస్తూరి కాదది, ఆడవారి చేతి వ్రాత. నాకు ఉత్తరం వ్రాసే ఆడవాళ్ళెవరబ్బా అనుకుంటూ… మడతలు పూర్తిగా విప్పి సంతకం దిశగా పేజీలు తిప్పాను. ‘సత్యవతి’ అని ఉంది.

గుండె జారినట్టయ్యింది.

నా చేతిలోని కాగితాలు నాకు తెలియకుండానే నేలకు జారినవి, మంచం దిగి కాగితాలను ఏరుకుని వరుస క్రమాన పెట్టి వాలుకుర్చీన కూర్చుండిపోయాను.

“సత్యవతి.”

నా సత్యవతి ఉత్తరం రాసిందా?

ఇంత జీవితాన ఎన్నడూ కార్డు ముక్క రాయని సత్యవతి ఇప్పుడు నాలుగు పేజీల ఉత్తరం రాసింది. ‘బ్రతుకు చివరన ఉత్తరం రాయాలని అనిపించింద’న్న మాట. నాకు తెలియకుండానే నవ్వు వచ్చింది. పెద్దగా నవ్వాను. ఆ నవ్వు ఆగలేదు. కళ్ళు తడి అయినవి. నాలో నేను చాలాసేపు నవ్వుకున్నాను. మనసంతా ఏదోలా తేలి ఏటేటో నడిచింది. నా పైన నాకే జాలి. కళ్ళజోడు సరిచేసుకుని కాగితాల్లోకి తల పెట్టాను. అక్షరమాలన సత్య.

“శివుడూ..”అని ఉంది.

మొదటినుంచీ సత్యవతి మనసుపెట్టి ‘శివుడూ’ అని పిలుస్తుంది.

“నేను సత్యవతిని. కంగారుపడకు. ఆశ్చర్యపోకు. ఎన్నడూ లేనిది ఈ పొద్దుటే ఎందుకో నీకు ఉత్తరం రాయాలని అనిపించింది. నువ్వు మనసునూ నన్నూ వదలక చుట్టుముట్టావు.

ఆరోజు పొద్దుట నువ్వు అకస్మాత్తుగా నా వద్దకు వచ్చి వెళ్ళాక అప్పటిదాకా లేని, అడుగుపొరకు వెళ్ళిపోయిన బాధ నన్ను మెలితిప్పింది. మనసంతా అల్లకల్లోలమయ్యింది. గుండె ముక్కలు చెక్కలయింది.

శివుడూ….. తిరిగిరానిది, అందనిది, దొరకనిది, జీవనగమనాన మాత్రమే దొరికేది, అమూల్యమయింది నేనెంత పోగొట్టుకున్నానో అర్థమయ్యి కళ్ళు తడయినవి,

కానీ ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదు.

ప్రేమ అనేది ప్రేమించినప్పుడు మాత్రమే అర్థమయ్యి అదృశ్యమయినట్టు అనిపించింది. నా బాట అకస్మాత్తుగా గజిబిజి కావటంతో మొలకెత్తి పరపంజుకుంటున్న మధురానుభూతికి ఫుల్‌స్టాప్ పడింది. ఆ ప్రేమా దోమా ఏమి లేకుండా భార్యాభర్తలుగా పాతికేళ్ళనుంచి మొగుడు పెళ్ళాల ఆటలోనే గడిపాను. తెగడుకుంటూ.. మనసునే చస్తూ… బాధన ఇష్టం నటిస్తూ, నేను చేసేది కాపురమేనా అనిపించినా; ఏడవలేక నవ్వొచ్చినా, భర్త గారు నాకిచ్చేది ప్రేమేనా?’ అని అర్థం అవ్వకపోయినా తాళితో శరీరంపై సంపాదించిన హక్కును నా సంబంధం లేకుండా వినియోగించుకుంటుంటే ఉగ్గపట్టి ఇంతకాలం ఎలా నెగ్గుకోచ్చానో? ఎందుకు చావలేదే? ఆలోచిస్తేనే భయంగా ఉంది.

మా వాళ్ళు ఆకస్మాత్తుగా ఒక సంబంధాన్ని ఖాయం చేసారు. అవతల వాళ్ళ వెతుకులాటలో తగిలిందది. సంబంధం అనేది తేగలిగారు కనుక అదే వారికి గొప్ప. రెండవ పెళ్లి వాడయినా.. ఐదో పెళ్లి వాడయినా… వారికి కావలసిందల్లా పెళ్లయ్యిందనిపించి బరువుగా ఉన్న ఒక శాల్తీని బయటకు పారదోలటం. మా కుటుంబ భవిష్యత్తు కోసం నేను దాన్ని మెచ్చినట్టు నటించి, దిక్కుమాలి ఒప్పుకోనటం, అదేదో గొప్ప త్యాగం లాంటిదని నేను మాత్రమే చేస్తున్నదిగా భావించమని ఊహల్లో అనుకొనడం. ఆ భ్రమలో నేనుండగా అతగాడు తాళి కట్టాడు కనుక అతన్నే సర్వస్వంగా భావించి రాత్రుళ్ళు కిమ్మనక నా శరీరాన్ని అతని అవసరానికి అప్పగించడం, వగైరా వగైరాలు……

శివుడూ… రెండు శరీరాల కలయిక మాత్రమే ప్రేమ కాదని… నా మొదటి రాత్రి అనుభవం అద్దంలా చూపింది. కనీసం పశువులకు వున్న స్వేచ్ఛ కూడా కరువైన మా కలయిక. నన్ను చూడగానే నాకు తాళి కట్టిన అధికారంతో మొగడనే శాల్తీ, నన్ను అనుభవించేందుకు హక్కు పొందినవాడు లుంగీ ఎగగట్టుకుని, గదిన ఉన్న చెమట చిత్తడిని లెక్క చేయక నా వొంటి కోసం ఆబగా చూడటం (కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన). మన సాంప్రదీకుల అభిప్రాయం ప్రకారం నన్ను కన్నె చెరనుంచి విముక్తి కలిగించడం.

గదికి ఉన్న ఒక కిటికీని గట్టిగా మూసి ఇహ పర్వాలేదు అన్నట్టు నన్ను చూసి “సత్యవతీ రా, బిడియ పడతావే?” అని భుజం మీద చేయేసి హత్తుకుని, జబజబలాడే వంటితో మంచం పైకి తీసుకెళ్ళాడు. ఆ వెంటనే చేతులు దులుపుకుని నా వైపు రెండడుగులు వేసి, పరిచి ఉంచిన చాప పైకి నన్ను దించాడు. నేను గభాలున లేచి కూచోబోయాను. ఆయనకేం కావాలో దానిని నాపై రెండు నిముషాలు ఆదరాబాదరాగా పూర్తి చేసుకుని “ఇదేం ఉక్కపోత” అని చెమటలు కార్చుకుంటూ లేచి తలుపులు బార్లా తెరిచి బయటకు వెళ్ళిపోయాడు. నాకప్పుడు ఏమని అనిపించిందో తెలుసా? మన వీపున చీదర (గుల) పుట్టినప్పుడు పక్కింటి పసిపోరడితో స్కేల్ తీసుకురమ్మని వీపు రుద్దించుకుని ‘ఇహ పో’ అని గదిమినట్టు గుర్తుకు వచ్చింది. అంతరాంతరంలోను నవ్వొచ్చింది.

పశువులు సహితం ఈ సృష్టిన తోటి పశువు ఇష్టా ఇష్టాలను గుర్తించి మెసలడం మనకు కనిపించే నిజం. అయినా మనం మనుషులం. ద్విపాద పశువులం.

నేను స్కూల్‌లో పనిచేసేటప్పుడు అహల్య అనే అమ్మాయి (అమ్మాయంటే పెళ్లి కాని పిల్ల అనుకునేవు, వివాహిత) తో పరిచయం అయ్యింది. ఆవిడ టీచర్‌గా నాతో పనిచేసేది. పరిచయం స్నేహంగా మారింది. ఒకనాడు నాతో “సత్యా నీ దగ్గర నాలుగు రోజులు ఉంటానే” అంది.

ఎందుకన్నట్టు చూసాను. దాని భర్త ఎటయినా టూర్ వెళ్తున్నాడేమో, ఒంటరిగా ఉండలేక నాతో ఉంటానంటుందేమో అనుకుని “మీ ఆయన ఎటెళ్ళుతున్నాడే?” అని అడిగాను.

“ఆయనా… ఎటు పోతాడు? గుడ్లకోడి. ఎటూ పోడు” అంది.

దాని ముఖాన ఏదో మార్పు కనిపించింది. దగ్గరకు వచ్చాక విషయమేమిటని అడిగాను.

“వాని బాధపడలేకనే నీ దగ్గర ఉందామనుకునేది” అన్నది. నాకర్థం కాలేదు.

“ఛా! ఎట్టా పుట్టావే? అడివి మనిషిలాగా ఉన్నావు. ఏది నీకు అర్థమయి చావదు” అని విసుక్కుంది.

“మా ఆయనకు ఉద్యోగం సద్యోగం లేదు. రికాగ్గా ఉంటాడు. రాత్రి తొమ్మిది దాటుతుండగా వాచీ వైపు చూసుక లేస్తాడు. ఆనక తలుపులు మూసేస్తాడు. అంటే రాత్రి తొమ్మిదిన్నర నుంచి తెల్లవారినదాకా నా పక్క వదలడు. నా స్థితిని గమనించడు. పగలల్లా పనీ పాటా లేదు కనుక దిట్టంగా తిని సావు నిద్ర పోతాడు. రాత్రి వానికి నిద్ర రాదు. నా స్థితి గమనించడు. నన్ను నిద్ర పోనివ్వడు.

ఆయనకు నాపై ఎంత వ్యామోహం ఉన్నా సంవత్సరాల కాపురంలో ఎలా ఉంటుందే? నా విసుగుని అసహనాన్ని లెక్క చేయక ప్రాణం తీస్తాడు. అందుకే ఇంటికి వెళ్ళాలంటే భయం. అసలు మూడురోజుల సెలవు మనకు ఎట్టాగో ఉంటుంది కదా… దానికి తోడు మరో నాలుగు రోజులు ఎడంగా ఉంటే బాగు. ఆయన్ను భరించే స్థితి నాకు వస్తుంది. అనావృష్టి ఎంత నష్టమో, అతివృష్టి అంతే నష్టము అనేది మనం ప్రకృతిన చూస్తున్నదే” అంది.

నవ్వుకుని దానికి నా దగ్గర ఉండే అవకాశం కల్పించాను.

ఒకనాడు నేను స్కూల్‌కి బయలుదేరేముందు దేవుని పటం దగ్గరకు నడిచి దణ్ణం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నాను. ఆ పూట కాలేజీ లేదని నా చెల్లెలు ఇంట్లోనే ఉన్నది. ఇంట్లో నుంచి నాకో మాట వినిపించింది నెమ్మదిగా.

“అబ్బా… భుజం కొరుకుతావేమిటి? నువ్వు మనిషివేనా? ఇదేం సరసం. ఛా… దూరంగా ఉండు. ఎడంగా ఉంటే నువ్వు చెప్పే భగవద్గీత వినిపించదా? ఛా.. ఏం మనిషివయ్యా? ఈ చిల్లర భాగవతం అక్కతో చెపుతాను” అని నా చెల్లెలు అంటోంది.

నాకు తాళి కట్టిన భర్త గారు నా చెల్లెలుతో ప్రవర్తిస్తున్న తీరిది. అప్పటికే ఆ వెధవకు నేను రెండవ భార్యను, ఏమనాలి?

నేను ఇంత చదువు చదివి, లోకాన్ని పరిసరాలని అర్థం చేసుకుని తోటి మనుషులను అవగాహన చేసుకునే శక్తి ఉండి అనామికలా ఆయన విచిత్రమయిన మగతనానికి ఆహుతయ్యాను. శరీరం కానీ మనస్సు గానీ…. అతగాని చర్యలకు నా బ్రతుకు మొత్తంలో చింతాకంత స్పందించిన ఘటన గుర్తులేదు. లేందేం గుర్తుకొస్తది? కలత నిదరన ఉండి పక్కకు తిరగడం తప్ప.

నేను నౌకరీ చేస్తున్నాను. నాకు జీతం ఇస్తున్నారు. కనుక డ్యూటీ చేయాలి. అంటే క్లాస్ రూమ్ కెళ్ళి పాఠాలు చెప్పాలి. బెల్ కొట్టగానే ముగించి వచ్చేయ్యాలి, లేకపోతే జీతం ఇచ్చే ప్రభుత్వం ఊరుకున్నా ప్రధానోపాధ్యాయుడు ఊరుకోడు. డ్యూటీ డ్యూటీ అని జుట్టు పీక్కుంటాడు.

ఇహ పోతే… కాల గమనాన ఏదో విధాన నా చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు అయినవి. ఆడపిల్లకు చివరి మజిలి ఈ దేశాన అదే కదా..! మన గడప దాటాక అది చచ్చినా బ్రతికినా ఎట్టా పోయినా ఏం లేదు. లోకం కోసం బాధ్యతలేని ఏడుపు ఒకసారి  (నలుగురికి కనపడేటట్టు) ఏడ్చి చేతులు కడుక్కుంటారు.

అయితే శివుడూ…. నా చివరి చెల్లెలు మాత్రం మా మాదిరిగా బలిపశువులా మారడానికి ఒప్పుకోలేదు. ఎదిరించలేదు. ఎదురు తిరగనూ లేదు. గుట్టుగా ఒకన్ని ప్రేమించింది. తనను బాగా ఇష్టపడే వాడిని, మంచిగా చూసుకోగలడన్న వాడిని. కులాంతర వివాహమే అయినా…. ఆర్య సమాజాన చేసుకుంది.

ఇంటివారికి చెప్పింది వెళ్తూ “రేపు ఆర్యసమాజాన నా పెళ్ళి” అని.

ఇది మా సాంప్రదీయులకు పిడుగులాంటి వార్త. మా సోకాల్డ్ కుటుంబమంతా తాము భద్రంగా దాచుకున్న పరువు లాంటి వస్తువుకు ఆ పిల్ల పెద్ద కళంకం తెచ్చిందని బోలెడు ఆవేశాలు ప్రదర్శించారు. గంగవెర్రులెత్తినట్టు చిందులేసారు. కొందరు కథాకళి ఆడారు. అంతటితో ఆగక సమాజపు సానుభూతి కోసం కడవలుగా కన్నీరు కార్చారు. చివరకు నా భర్త అనే వాడు కూడా. మొగుడు హఠాత్తుగా చచ్చిన ముండలాగయ్యాడు.

“ఛా… ఇలా చేస్తుందా? ఇంత బరితెగింపా? ఇంక కులం మధ్య తలెత్తుకుని ఎలా తిరగడం?’ అని కోపం ప్రదర్శించాడు. ‘వీడు, పెళ్ళాం చెల్లెలు సందున స్నానం చేస్తుంటే ఆబగా చూసే సంస్కారం. దానితో ఆమాటా ఈ మాటా చెపుతున్నట్టు దాన్ని తాకి ఆనందం పొందే బుద్ధిమంతుడు’. ఇతని స్టేట్మెంట్ సరయినదని మా వాళ్ళు అభిప్రాయపడ్డారు. వత్తాసు పలికారు. ఇక దానితో ఎటువంటి సంబంధం ఉండకూడదని ఎదురుపడ్డా మాటాడరాదని తీర్మానించారు. ఇక నా గౌరవనీయులయిన తల్లిదండ్రులయితే “అది మాకు పుట్టలేదనుకుంటాం, చనిపోయిందని అనుకుంటాం” అని బీరాలు పలికారు.

నేను మాత్రం సీదా పెళ్లి దగ్గరకు వెళ్లి నాకు తోచిన కానుకలు ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, “భగవంతుండా.. నువ్వుంటే వీళ్ళని చల్లగా చూడు”  అని అ రాతి దేవుడికి కూడా మొక్కుకుని, హుండీలో ఓ రూపాయి కాసు వేసి తిరిగి వచ్చాను.

ఇంటికి రాగానే “ఎక్కడికెళ్ళావ్?” అని అడిగాడు తాళి కట్టినోడు.

వాన్నొక పురుగులా చూసి మాటాడక లోనికి నడిచాను.

“నిన్నే” అని హూంకరించాడు మా వాళ్ళ ఎదురుగా.

“నేను లోనికి వచ్చి చెప్పాలా” అన్నాను.

ఉరిమి చూసాడు.

వాని చూపుదేముంది అనుకుని మాటాడక మంచంపై కూర్చున్నాను.

“అడిగింది నిన్నే” అన్నాడు ఎదురుగా వచ్చి నిల్చుని.

నాకు తిక్క రేగింది. లేచాను.

“ఎప్పుడయినా నిన్ను నేను ఇలాంటి ప్రశ్న వేసానా?” అన్నాను.

“నన్నా… నన్నా… నన్నడిగేదేమిటి?” అన్నాడు చిర్రెత్తిపోతూ,

“మనము మొగుడు పెళ్ళాలము తెలుసా?” అని “ఇదిగో నీకు ఇంతకు ముందు ఇంకొక దానితో సంబంధం ఉందేమో కానీ నాకు లేదు. నా స్వభావమేమిటో కూడా ఇన్నేళ్ళలో నీకు అర్థం కాలేదంటే ఏమనుకోవాలి. దాన్ని మొదట నువ్వు తెలుసుకో” అన్నాను,

పిచ్చెక్కినట్టు చేతులు విసురుకుంటూ, బయటకు వెళ్ళిపోబోయాడు.

“ఆగు” అన్నాను పెద్దగా. ఆగాడు.

“నేను ఫలానాది కావాలని ఎన్నడయినా నిన్ను అడిగానా? నేను నీ పెళ్ళాన్ని అని మురిసిపోయి చస్తుంటావు కదా…! నాకేమయినా కావాలని ఎన్నడయినా అడిగావా?”

నోటమాట రాలేదు.

“చివరకు నా చెల్లెలు ఇక్కడ తలదాచుకుని చదువుకుంటుంటే నీ చేతాళానికి తోడు సరసాలాడావు. అడిగానా?”

తల నేలకేసాడు.

“తాళి కట్టావు కాబట్టి మగడిగా మాత్రమే నువ్వు మిగిలి ఉన్నావు. మగాడిగా కాదు గుర్తుంచుకో. నన్ను ఎప్పుడయినా ఏమిటని అడిగే ప్రయత్నం చేయకు. నేనే అడగాల్సి వస్తే నువ్వు నిష్కారణంగా చస్తావ్. నీ గజ్జికుక్క తత్వాన్ని అందరికీ నా నోటితో చెప్పే అవకాశం రానివ్వకు. ఇహ పో” అని నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. అతనేమయ్యాడో గమనించలేదు. రాత్రి పొద్దుపోయాక కంచం ముందు హాజరీ మాత్రం వేయించుకున్నాడు. సిగ్గు శరం వదిలిన బ్రతుకు కదా,

శివుడూ.. నా చెల్లి ఎందుకలా చేసిందనే దానికి అర్థం తెలిసింది. ఇప్పుడు మా చెల్లెళ్లందరిలోకి అదే సుఖంగా ఉంది. ఇద్దరి పిల్లల్ని కన్నది. పిల్లలు కలగకుండా భర్తను ఆపరేషన్ చేయించుకోమన్నది. పది పన్నెండు సంవత్సరాలుగా కాపురం చేసుకుంటున్నా కొత్త దంపతుల్లా అనిపిస్తారు. అది కాపురం అంటే. దైర్యంగా ఆ క్షణాన ఎదురుతిరిగింది కనుక జీవితాన్ని సజావుగా మలుచుకోగలిగింది. తృప్తిగా ఉంటున్నారు.

శివుడూ… నువ్వు లేక నేను లేను అనుకుంటున్న రోజుల్లోనే మన ప్రేమ కథ కొడిగట్టి పోయింది. నేను ఎవరి కోసం నా జీవితాన్ని ఇలా మోడు చేసుకున్నానో వారు ఎవళ్ళకి వాళ్ళు మొగుళ్ళతో ఎవరి దగ్గరకు వారు వెళ్లి పోయారు. పిల్ల పాపలతో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళే నన్ను ఏమంటున్నారో తెలుసా?

“దానికేం? బోలెడు సంపాదన. పిల్లా జల్లా లేరు. గొడ్డుబోతు. మా చిన్న దాన్నో, పెద్ద దాన్నో తీసుకు వెళితే ఏం?” అని. అసలు నేనెందుకిలా మిగిలిపోయానో? నిస్సంతుగా నా బ్రతుకు ఎందుకిలా అయ్యిందో?, మంచి మనస్సుతో సుఖం సంతోషం అన్న వాటిని ఎందుకు బలిపెట్టాల్సి వచ్చిందో, నా కుటుంబంలో అందరికీ తెలుసు. తెలిసి కూడా నా చెల్లెళ్ళు అలా మాట్లాడుతున్నారంటే, బ్రతికి ఉన్న నా తల్లి తండ్రులు నోరు మెదపక పైగా, “డబ్బు మనిషే అది. మొదటనుంచి అదంతే” అనటం ఈ చెవులతో విన్నాను.

ఇలాంటి గొప్ప సహృదయుల కోసం నా బ్రతుకును త్యాగం పేరిట ఫణంగా పెట్టమన్నారు. అపాత్రదానం అని ఇప్పుడు తెలిసి ప్రయోజనం? నా బ్రతుకున మోడువారిన వసంతాన్ని ఎవరు తేగలరు. ఆ వేళే కొంచం దైర్యం చేస్తే మనం మన బ్రతుకులని పండించుకునే వాళ్ళమే కదా…! కాల యవనికన గడిచిన లిప్తపాటు కాలం తిరిగి రాదే! నా మొత్తం జీవితాన్ని ఎవరికోసమో…. ప్చ్… ఏం మిగుల్చుకున్నాం? నన్ను అర్థం చేసుకోలేని మనుషులు, నా చితికిన బ్రతుకునుంచి లబ్ది పొందిన మనుషులు, నన్ను గమనించక వెళ్లడాన్ని మిగుల్చుకున్నాను. – అంతే.

శివుడు…. త్యాగం చేయడమంటే మనం చేసింది కాదు, దాన్ని త్యాగం అనరు. నాకు మా మేరి గుర్తుకొస్తుంది. త్యాగమంటే కళ్ళల్లోకి నీళ్ళు ఊరుతాయి. మనసంతా ఆనందం నిండుతుంది. నువ్వు తప్పక తెలుసుకోవలిసిన వ్యక్తి మేరీ. ఇప్పుడు ఉన్నది. వీలుంటే, వీలు ఉండటం కాదు. వీలు చేసుకుని వెళ్ళు. ఆవిడ అడ్రస్ కింద రాస్తాను.

త్యాగం అంటే ఏమిటి? అసలు మనిషేమిటి? అన్నదానికి నీకు తప్పక అర్థం దొరుకుతుంది.

ఆవిడది ఆస్ట్రేలియా. బాగా స్థితిపరుల ఇంట పుట్టింది. తల్లితండ్రులకు ముద్దు బిడ్డలా పెరిగింది. బాల్యం అంతా తిరగడం, చదవడంలోనే గడిచింది. మేరీ ఏది కావాలంటే అది ఆవిడ స్కూల్ నుంచి కానీ బయటనుంచి కానీ ఇంటికి చేరేసరికి తండ్రి అమర్చి ఉంచేవాడు. దానిని మేరీ చూసి పొందే ఆనందాన్ని చూస్తూ సంబరపడేవాడు. సిల్వర్ స్పూన్ కాదు… గోల్డెన్ స్పూన్ నోట ఉంచుకుని పుట్టిందా పిల్ల. చదువు పూర్తయ్యింది. సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. పందొమ్మిది సంవత్సరాల వయస్సుకు వచ్చింది. అందంగా తయారయ్యింది.

“పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? ఇంకా చదువుతావా?” అని తల్లితండ్రులు డిన్నర్ టేబుల్ దగ్గర అడిగారు. తండ్రిని జాగ్రత్తగా చూసి “డాడీ నన్ను మీనుంచి దూరంగా పంపదలిచారా?” అంది.

పాపం ఆ తల్లి తండ్రులు చాలా నొచ్చుకున్నారు. సారీ చెప్పుకున్నారు. “మరి చదువుతావా?” అడిగింది తల్లి.

“ఇప్పటిదాకా చదువుకుంటూనే ఉన్నాను కదా!” అంది.

“మాకు తెలియకుండా ఎక్కడ జాయిన్ అయ్యావమ్మా?” అని అడిగారిద్దరూ.

“డిగ్రీ చదువులకయితే ఎక్కడో ఒక చోట చేరాలి. కానీ నేను చదివిన చదువుకు ఎక్కడికి పోనవసరం లేదు” అని నవ్వింది. అర్థం కానట్టు చూసారు.

“నేను రామకృష్ణా వివేకానందా సాహిత్యం చదువుతున్నాను. ఇంతకు ముందే బుద్ధుని గూర్చి చదివాను.”

చిత్రంగా చూసాడు ఆ అమ్మాయి వైపు. పెళ్ళెప్పుడు చేయాలని ఆరాటంగా ఎదురుచూసే తల్లితండ్రులకు దొరికిన సమాధానమిది.

“డాడీ….. నాకీ సాహిత్యం చదివాక పెళ్లి చేసుకుని సుఖాలను అనుభవించాలని అనిపించడం లేదు. మానవ సేవే మాధవ సేవగా అర్ధమయ్యింది. అనాథలను – అభాగ్యులను ఆదుకుంటూ…. వారితో జీవితం గడపాలని ఉంది” అని అంది.

తల్లి తండ్రులు ఏమి మాట్లాడలేక పోయారు. అలాగే చూస్తుండిపోయారు.

పెళ్లికి ఆ అమ్మాయిని ఒప్పించలేమని ఆ ఇరువురికీ అర్థమయ్యింది, అయిన వారితో చిన్న చిన్న ప్రయత్నాలు చేయించి చూసాక.

కొంత కాలం ఆగాక మేరీ ఒకనాడు వచ్చి తల్లి తండ్రులను కూర్చోపెట్టి ‘శాంతి సేవా సంఘాలలో పని చేసేందుకు వాళ్ళ వెంట నేను సిలోన్ వెళ్ళాల్సి వస్తుంది. అది తెలిసిన తరువాతనే పేరు నమోదు చేయించు్కున్నాను” అని తన అభిలాషను స్పష్టంగా వారి ముందు పెట్టింది. మేరీ స్థిర నిర్ణయాన్ని గమనించి మేరీని పంపడం ఇష్టం లేకపోయినా తలలూపారు.

శాంత సేవా సంఘంతో పాటు వెళ్ళే రోజు రానే వచ్చింది. తల్లి తండ్రులు ఆశీస్సులతో పాటు సెలవు తీసుకుని సంఘ సభ్యులతో పాటు సిలోన్ వెళ్ళింది.

అక్కడ బుద్ధుని అవశేషాలు అనేకం చూసాక నాలుగైదు నెలలు రోగులకు సేవ చేసాక, బుద్ధ భగవానుని జన్మభూమి అయిన భారతదేశాన్ని ఒకసారి చూడాలని అనుకుంది.

నాలుగు మాసాల తరువాత సంఘ సేవకులు అక్కడనుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిముషాన రామకృష్ణ మిషన్ ఆహ్వానంతో రెండు మాసాలు గడిపేందుకు, అక్కడ పేద ప్రాంతాలలో స్థితిగతులను పూర్తిగా గమనించేందుకు ఈ బృందాన్ని పంపారు. అలా మేరీ కోరిక నెరవేరింది.

పది పదిహేను దినాలు దక్షిణ దేశం తిరిగాక ఆంధ్రప్రదేశ్‌కి చేరారు. ఇక్కడ చివరకు ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకుని అటవీ ప్రాంతం చూసేందుకు గిరిజనుల పరిస్థితి గమనించేందుకు నెలరోజులు ఉండేందుకు అవకాశం ఇచ్చారు. అక్కడ వికలాంగులను, అనాథలను చూసాక మేరీ మనసున ఒక రకమయిన అలజడి బయలుదేరింది. వికలాంగుల పట్ల, అనాథల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపటం ప్రారంభించింది. చాతనయింత మేర వారిని పరిపూర్ణ మనుషులుగా తీర్చిదిద్దాలి, వారు అనాథలు కారు అన్న భావనను వారిలోనే నెలకొల్పగలగాలి అన్న ఆలోచన దృఢంగా పెరిగింది. ఖమ్మం వచ్చాక అదే అభిప్రాయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలిపింది. వారు దానిని పరిశీలించి సరేనన్నారు. ప్రాథమికంగా కావలసిన పైకాన్ని తన తల్లితండ్రుల ద్వారా తెప్పించుకుంది. శాంతి సేవా సంఘం ఆస్ట్రేలియా వెళ్ళాక మరికొంత సహకారం లభించింది,

మేరీ వికలాంగుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం ప్రారంభించింది. అందుకు రామకృష్ణ మిషన్ వారు సహకరించి ప్రదేశాన్ని ఇచ్చారు. టౌన్ లోని కొందరు పెద్దల్ని కలిసింది. తన భావన వినిపించింది. నాలుగు పాకలేసి స్వచ్ఛందంగా ఆశ్రమాన్ని ప్రారంభించింది. దాతల్ని అందరిని కలిసింది. ఎవరినీ చందా రూపంగా అడగలేదు. ఏ దాతయినా సరే నెలకు నూట తొంబై రూపాయలు పంపితే…. పంపగలిగిన వారుంటే వారి పేర మరో వికలాంగుడిని దత్తత చేసుకుని అతనికి విద్యాబుద్ధులతో పాటు, వారి అవయవ స్థితిగతులను బట్టి వృత్తి విద్యలను కూడా నేర్పడం ప్రారంభించింది. అంతు లేని శ్రమకు గురయ్యింది. అయినా వారితోనే ఉంటూ ప్రారంభించిన పని పద్ధతిగా చేసుకుంటూ… ముందడుగు వేసింది. దీన్ని చూసిన మరికొందరు నెలకు నూటా తొంబై ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

అలా ప్రారంభమయిన ఆ సేవా శిబిరాన ప్రస్తుతం అయిదు వందల మంది ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఎనిమిది బాచ్‌లు శిబిరాలను విడిచి బయటకు వెళ్ళినవి. వారి కాళ్ళపై వారు చాలా ఆత్మస్థైర్యంతో బ్రతకగలిగిన స్థితిన ఉన్నారు.

మేరీకి వాళ్ళ తోటిదే లోకం. నిరంతరం ఏదో ఒక వృత్తి విద్య నేర్పుతూనే ఉంటుంది. వాళ్ళతో కలిసి తిరుగుతూ వాళ్ళకు పెడుతూనే తను తింటుంది. ఇక్కడ పని నేర్చుకుని వెళ్ళిన వారికి ఆర్థిక సహాయం కోసం ‘బ్యాంక్’లకు వెళుతుంది. వారి పనితీరును చూసి వస్తుంది. వారికి దైర్యాన్ని ఇస్తుంది. వారిని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేందుకు ఏం కావాలో? ఎలా కావాలో చెప్పుతుంది… చూపుతుంది. అక్కడి నుంచి వికలాంగుడొకడు బయటకు వస్తే వెంటనే ఉద్యోగాని కోసం ప్రభుత్వాన్ని దేబిరించాల్సిన పని లేదు. ఏదయినా పని దొరికే వరకు ఎలా? అని ఎవరూ భయపడరు. అవయవ లోపం ఉన్నా… తన ఉపాధి కోసం ఆశ్రమంలో నేర్చుకున్న పనినే ఇష్టంగా వృత్తిగా స్వీకరిస్తాడు. అంచేత అతనికి ఎవరి ఆసరా అక్కరలేదు. ఇంకా చెప్పాలంటే కొండొకొచో దొరికిన వనరును బట్టి అతనే కొందరికీ ఆసరా కాగలడు, అలా తర్ఫీదు ఇచ్చి పంపుతుంది మేరీ.

శివా! ఆవిడ వయస్సు ఇప్పుడెంతో తెలుసా? నలబై నాలుగు సంవత్సరాలు. మేరీ తన ఇరవయ్యివ ఏట ఇక్కడికీ వచ్చింది. నలబై నాలుగుని కూడా అదే సేవాభావన, డెడికేషన్. ఎందరెందరో అనాథలనో అక్కున చేర్చుకుని ఆదుకుంది. మనుషులుగా తీర్చిదిద్ది లోకంలోకి పంపింది. బ్రతికేందుకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. వృత్తులు నేర్పింది. ‘మేమూ మామూలు మనుషులుగా జీవించగలము. మేం అంగవైకల్యము ఉన్న వారం కాదు, మానసికంగా స్థిరచిత్తంతో ఎదిగిన వారం. మా బ్రతుకును మే బ్రతకగలిగన వారం. మేమీ సమాజానికి భారం కాము’ అని నిరూపించింది. నిజంగా శివా దైవత్వం అనేది అదే కదూ! ఆమె వద్ద నాకు కనిపించిందేమిటో తెలుసా…? ఆవిడకు ఉన్న కోర్కె ఒకటే, వికలాంగుడయిన వాడేవడయినా…. తమ బ్రతుకు తాము చూసుకుంటూ దైర్యంగా బ్రతకగాలగాలి. అవకాశం ఉంటే తోటివారికి ఆసరా కాగలగాలి. వాళ్ళీ సమాజాన గర్వంగా బ్రతుకుతుంటే ఆవిడకు పరిపూర్ణమయిన ఆనందం కలుగుతుంది. ఇంకా శ్రద్ధగా వయసుతో సంబంధం లేకుండా ఎందరో అభాగ్యులను సాకుతూ అందరికి తల్లిలా, అక్కలా, ఆ మహాతల్లి ఊడలమర్రి అంత చల్లని నీడనిస్తుంది. నువ్వు తప్పక ఒకసారి వెళ్లి రా శివా. ఆమెను కలవు. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛత నిండిన ప్రదేశం అది. నాకు తెలిసినమేరకు స్వచ్ఛతకు చిరునామా ఆమె. ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటాను ఆవిడ తల్లితండ్రులు చూసేందుకు భారతదేశం వచ్చారు. కలిసారు. చేస్తున్నది చూసారు. వారం దినాలు గడిపారు. వెళ్ళేటప్పుడు మేరీని తల్లి దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకుంది. “అమ్మా…. మేరీ మనిషి అనుభవించాల్సిన జీవితంలో వయసు ప్రధానమయింది. ఆ దశను సేవా భావంలో పెట్టావు. ఇప్పుడు కౌమార దశ ప్రారంభమయ్యింది. ఇప్పుడయినా పెళ్లి చేసుకుని కొంత కాలమయినా ఈ జీవితాన్ని కూడా చూడు” అని అంది.

“అమ్మా! నాకిప్పుడు అలాంటి భావన రావడం లేదమ్మా. అయినా ‘ఇప్పుడు నాది – నేను అన్న స్వార్థంలోకి రాదలచలేదు’. నాకు తెలిసిన మేర సంసారమే పూర్తి స్వార్థపూరితమయింది. నాది అనే సంకుచిత తత్వానికి ప్రారంభం అదే. ఇహ పోతే నాకోసం నాకేదో అక్కడే ఉంచామంటున్నారు కదా. నా కోసమే ఉంచారు కనుక ఆలస్యం చేయక పంపండి. ఇక్కడ ఇంకొంత ఉపయోగపడుతుంది. మీరు ఎంత త్వరగా పంపితే అందరు అనాథల్ని చేరదీస్తాను, తృప్తిగా సాకుతాను. వారిని మీ బిడ్డలుగా భావించి వారి బ్రతుకులకు వెలుగునిచ్చే ప్రయత్నంలో మనను లగ్నం చేస్తాను” అని ఆనందంగా నమస్కరించింది.

‘అలాగే’ అన్నారు తప్ప వారినుంచి మరో మాట రాలేదు. తల్లి మాత్రం చాలా సేపు బాధపడింది. ఆ మరునాడే, తల్లితండ్రులు వెళ్ళిపోయారు, ‘దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంద’ని చెప్పి.

ఆ తరువాత మేరీకి తల్లి తండ్రులు పంపిన పైకం వల్ల ఇంకా కొంత మందిని అదనంగా తీసుకుని వాళ్ళ నుంచి చెడ్డలపై శ్రద్ధ పెట్టింది.

నా బ్రతుకున కనిపించిన ఈ మేరీ మాత్రమే త్యాగానికి గుర్తుగా అనిపిస్తుంది. మనం అనుకునేవన్నీ త్యాగాలు కావు. ఒకసారి సాయంత్రం నేను వెళ్లాను. ఆశ్రమంలోని చెట్టు కింద కనిపించిందావిడ. పావురాలకు మేత వేస్తున్నది. ఎంతో గుంపుందో ఆ చెట్టు పైన. మేరీ కోసం అవి కిందికి దిగి వస్తున్నాయి. ఆ తరువాత పోలియోతో వికలాంగులయిన వారికి వ్యాయామం చేయిస్తుంది. నిజంగా దేవత ఆ తల్లి. నిండు నూరేళ్ళు ఆ తల్లి చల్లగా ఉండాలి. ఆ చల్లని నీడన ఆనాథ దశనుంచి మంచిగ ‘బ్రతుకులలోకి గౌరవనీయం’గా ప్రవేశించాలని తపన. దీక్ష.

ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే శివుడూ… త్యాగం అనే పదానికి దేన్నీ అర్థంగా చెప్పుకోవాలో మనకు మొదట తెలియాలి. మనం కాంక్షించే స్వార్థపు పనులకు, వదులుకునే ముష్టి కోరికలకు, అవ్యక్తత దాటని అహపు త్యాగాలకు కూడా మనం ‘త్యాగం’ అని అంటాము. అలా అనరాదు-తప్పు.

ఇహ పోతే ఆవేళ పొద్దుటే వచ్చి వెళ్లావు కదా…! అతనితో నువ్వేదో నన్ను ప్రేమించానని చెప్పావట. అది పట్టుకుని సాగదీసి ఏదేదో మాటాడబోయాడు. ఆ క్షణాన నాకేమనిపించిందో తెలుసా? వాడు కట్టిన తాళిబొట్టును వాడి మొహాన కొట్టి ‘ఒరేయ్… నన్ను ప్రేమించిన వాని దగ్గరకు వెళుతున్నాను’ అని చెప్పి బయలుదేరి రావాలని అనిపించింది.

వచ్చేస్తున్నానని నువ్వు గాబరా పడేవు. అలా అనిపించిందంతే ఆ క్షణాన.

శివా…. నాకు తెలుసు. ఇప్పుడు అలాంటి ఆలోచనలు అప్రస్తుతమయినవి. నువ్వు ఎవ్వరి భర్తగా ఉన్నా.. కుటుంబీకుడిగా ఉన్నా, నీ భార్యా, సంతానం, తమ్ముడూ, మీ నాన్న, కనీసం మానసికంగా సుఖంగా ఉండాలి కదా! ఆ అవకాశాన్ని నేనుగా చెడుపగలనా?

శివుడూ…. నాకొక చిన్న కోరిక ఉంది తీరుస్తావా?

చెప్పనా?

చెపుతున్నాను. తీరుస్తావా? చెప్పనా?

అదేమిటో తెలుసా?

ఇద్దరమే మహా నందీశ్వరుణ్ణి సందర్శించాలని!

ఆ క్షేత్రానికి చేరి తెల్లారగట్ల లేచి, శుచిగా స్నానం చేసి, దైవాన్ని దర్శించి నాలుగు గుక్కల నీళ్ళు తాగి ఆ వెంటనే ఆగక శ్రీశైలం చేరి, అదే రోజు శ్రీశైలంలోని శివలింగాన్ని దర్శించి, చేతితో తాకగలిగితే సశరీరంగా కైలాసం చేరుకుంటామట. మన పురాణాలు చెప్పినవి. పెద్దలూ చెప్పారు. వారెందుకు చెప్పారో నాకు తెలియదు కానీ… అలా చేయాలని ఉంది. దీనికి కాలనియమమేమి లేదు. ఎప్పుడయినా పరవాలేదు, నీ ఇష్టం. అలా జరగలేదనుకో నేనుగా నేరుగా నీ ఇంటికే వచ్చి ‘నాకు మాటిచ్చి ఏమిటిది ప్రయాణం కాకుండా ఉన్నావే’ అని తిష్ట వేస్తాను.

మన సంబంధం ఎంత బలమయినదో చూపేందుకు నీ దగ్గరకి వచ్చి నలుగురు ముందు ముద్దెట్టుకుని మరీ చెపుతాను. ఇక ఆ పై నీ ఇష్టం.

ఇక నా భర్త గారు నా వైపు చూడలేక, ‘నేను తల ఎత్తుకుని ఎలా తిరగాలి’ అని ముసలి కన్నీరు కార్చి, ‘చనిపోవటం మంచిదనిపిస్తుంది’ అని పెద్దగా నోరు పారేసుకున్నాడు. వానికా ధైర్యం లేదనుకో.

అయితే “మంచిదనిపించిన పనిని చేయడానికి ఆలస్యం ఎందుకు? చేసేది మంచి పనయితే ఎవరయినా ఆపుతారా? ప్రోత్సహిస్తారు కానీ…” అన్నాను నవ్వుతూ.

“అయితే నేను చనిపోవాలని ఉందా?” అన్నాడు నిటారుగా గడకర్రలా నిలబడి.

“నాకెందుకు ఉంటుంది. అలా నేనన్నానా? నీకు చనిపోవాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. అదే ఇప్పుడూ అంటున్నాను” అని అనగానే బిత్తర పోయాడు మొదట. పిచ్చి పట్టినట్టు గెంతులేసాడు.

పూర్తిగా అర్థం అయిన తరువాత ఏడుపు లంకించుకున్నాడు పసిపోరడిలా…

నేనుగా వెళ్లి సముదాయిస్తానని చూసాడు. నేను నా పనిలో పడి వాడిని గమనించడమే మానేసాను.

ఆ రాత్రి బాగా పొద్దుపోయాక…. తచ్చాడుతూ నా మంచం దగ్గరకు వచ్చాడు. నేను లేచి “నీకిక్కడ పడుకోవాలని ఉందా” అని అడిగాను.

మసక చీకటిలో పళ్ళికిలించి అదోలా చూసాడు. “అయితే నేను బయటకు వెళుతున్నాను” అని లేచాను. వాడు అక్కసుగా మంచంపై కూలపడి పళ్ళు పటపట నూరాడు. ఏ మొగాడయినా చేయగలిగిన పనదేకదా. నేను మాత్రం గడప దాటుతూ ఒక క్షణం ఆగి “గట్టిగా నూరకు. పట్టులేని పళ్ళు రాలిపోతాయి” అని బయటకు వచ్చాను, ఆ తరువాత వాడి స్థితిని గమనించలేదు.

శివుడూ… చందన బాగుందా? నీలాగానే ఉంటుందా? దాని ఫోటో ఒకటి పంపు, శివా….. నాకంటే నువ్వే అదృష్టవంతుడిలా కనిపిస్తున్నావు రా..! నాకది చాలు. ఉంటాను. నా కోరిక తీర్చకపోతే మాత్రం అధికారికంగా నీ దగ్గరకు రావడం మాత్రం ఖాయం.

-సత్యవతి.

సత్యవతి నాది, ఎప్పుడయినా సరే. అదే నా భావన, రైలు పట్టాల్లాంటి బ్రతుకులు మావి. ఇద్దరం కలవనూ లేము. విడిపోనూ లేము. మరువనూ లేము.

కాలగతి వేరు. బ్రతుకు బాటన వినోదించడంలో బాధను. బాధన ఆనందాన్ని, ఆహ్లాదాన్నీ, ఆహ్లాదంలో అంతులేని వ్యథనూ, హలాహలంలో అమృత ఝరినీ పంచే విధి అసలెందుకు మనకు మనస్సును ప్రసాదించిందో అర్థం కాదు, ఈ నడకేమిటో అర్థం కాదు (మనంగానే నడుస్తున్నా). చాలా సార్లు అర్థమయినట్టు… ఒక్కోసారి బొత్తిగా అర్థం కానట్టు అనిపిస్తుంటుంది. ఇంతకన్నా ఇంకేముంది. ఒక వేళ ఉంది అనుకున్నా అందేది కాదు. అలా అనుకుంటూనే నడుస్తుంటాం. అసలేదీ కనిపించినట్టే ఆగిపోతుంటాం. అయినా ఇప్పుడు కనిపించిందేమిటి? కరిగిపోయిందా? మరుపు కమ్మిందా? ఎంత తల బాదుకున్నా అర్థమయ్యి చావదు. చివరకు జీవితమంటే ఇదేనేమో? ఇట్లానే ఉంటుందేమో? అనిపించి ఆలోచనలను ఆపి, చతికిలపడి కూర్చుంటాం. ఇక్కడే పుట్టిన వ్యక్తి నేనిలా అయితే బాగు అని తన పరిధిని కోరుకోవటం కూడా చాలాసార్లు కుదరదు. ఏవేవో మలుపులు గతుకులు. అన్ని మన కళ్ళ ఎదురుగానే జరుగుతుంటాయి. ఆపాలనుకుంటాము. ఆపగలమని అనుకుంటాము. అలా అనుకోవడం మనిషి తత్వం, దానితో ఏంతో కొంత తృప్తి మిగులుతది. మనకు ఊరట మిగులుతది. కానీ జరిగేదేదో జరుగుతూనే ఉంది. ఏదో చేద్దామని ఈ ఘర్షణల మద్య నలగడం మనిషికి అలవాటు.

ఉత్తరం పూర్తయ్యింది కానీ ఆలోచనలు మాత్రం తెగడం లేదు.

అసలు నేను చదివిందేమిటి? అనిపించిది చివరకు.

ఇన్నేళ్ళు ఇంత బాధను గుండెల్లో దాచుకుని ఎలా బ్రతకగలిగాం అన్న ప్రశ్న ఒక వైపు. అసలిది బ్రతుకవుతుందా? ఇలాంటి దానిని ఎందుకు భరిస్తూ బ్రతికినట్టు? అనేది మరో చివర.

‘అసలు నేనుగా దైర్యం చేసి సత్యవతిని ఆ రోజే పెళ్లాడితే అసలీ తిరకాసంతా లేదు కదా! అయినా ఈ కాలగమనాన్ని తట్టుకుని బ్రతికే ఉన్నాం కదా’ చిత్రంగా అనిపించింది. నా శరీరం అంతా చెమటతో తడిచిపోయింది. బాగా దాహం అనిపించింది. .

“చందనా మంచినీళ్లివ్వు” అని పెద్దగా అరిచాను.

రెండు నిముషాల్లో చల్లని నీళ్ళు తెచ్చి నా ముందు ఉంచింది. ఇస్తూ నన్ను చూసి కళ్ళింత చేసుకుని “స్నానం చేసినట్టుగా మీ వంటి పైన ఉన్న బట్టలు తడిచిపోయినవి నాన్నగారు. పైన ఫాన్ తిరుగుతున్నా – బయట కూడా అంతే వేడిగా లేదు. నేను స్కిప్పింగ్ ఆడుతూ మీరు పిలిస్తే వచ్చాను. నాకింకా అంతగా చెమట రాలేదు. మీరిక్కడ కదలక కూర్చున్నారు కదా మరీ చెమటేమిటి? వ్యాయామం కానీ చేసారా?” అంది నవ్వుతూ…

నన్ను నేను అప్పుడు చూసుకున్నాను. దాన్ని అనాల్సింది ఏమీ లేదు. నా పరిస్థితి అది చెప్పినట్టే ఉంది.

“అమ్మా… స్నానం చేస్తాను. నీళ్ళు పెట్టమను” అన్నాను.

“నాన్న స్నానం చేస్తారట” అని కిందికి పరుగున వెళ్ళిపోయింది.

వెళ్ళిన కొద్దిసేపటికే నీళ్ళు తోడినట్టు కబురొచ్చింది. వెళ్లి తలారా స్నానం చేసాను. అప్పుడు కానీ ప్రశాంతంత చిక్కలేదు.

నా తరువాత చందన స్నానం ముగించింది. తలని ఆరబెట్టుకుంటూ నా గదికి వచ్చి నన్నే గమనిస్తూ ఎదురుగా కూర్చింది.

“ఏమిటిరా?” అన్నాను.

“నాన్నగారూ, ఒక విషయం అడుగుతాను చెప్పాలి. నేను పలానా ను ప్రేమించాను. ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోవాలి కదా? ప్రేమ వేరు, పెళ్లి వేరు కాకూదంటారు పెద్దలు. ఏమంటారు?” అంది.

ఆ.. ఆ… అన్నాను.

ఇదేం సమస్య తెచ్చిపెడుతుందేమో అన్న భయం నాలో మొదలయ్యింది.

“మేము ప్రేమించుకొనటం, పెళ్లి మీ చేతుల మీదుగా జరపడం, తల్లితండ్రులకు విజ్ఞత అవుతుంది. కాదంటారా?”

“వింటున్నాను. నువ్వు చెప్పేంతా అర్థమవుతుందమ్మా” అన్నాను.

“లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు. నిజంగా ప్రేమ గుడ్డిదా?” అడిగింది హఠాత్తుగా.

“ఆ…” అన్నాను చూస్తూ.

“మీరసలు బాధ్యతాయుతమయిన తండ్రిగా చెప్పక… సమాధానం దాటేస్తున్నారు. మీ ఆలోచనలోకి మీరు వెళుతున్నట్టు ఉంది. సరిగ్గా వినండి. ‘ప్రేమ గుడ్డిది’ అంటే ‘మనస్సు చెడ్డదనే కదా’! అసలు ప్రేమా దోమా లేదు. పెళ్ళిళ్ళు దైవదత్తమయినవి, ఎక్కడో అవి రాసిపెట్టి ఉంటాయి అంటారా?”

“అమ్మా చెందినా…. ఒక్కో సందర్భాన్ని బట్టి కొన్ని సరిగ్గానే అనిపిస్తాయి. ఆ పరిస్థితుల వరకే అవి పరిమితం. తరువాత వాటి అర్థాలు స్వరూప స్వభావాలూ మారిపోతాయి. చాలా సందర్బాలలో దీనికి సమాధానాలు చెప్పడం అంత తేలిక కాదు.

మనిషి బ్రతుకు అనుభవ సారం,.

వయస్సు నుంచి కౌమార దశకు వచ్చి వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తుండగా బాగా అర్థమౌతుంది. కానీ అప్పటికి అంతా చేయి దాటి పోతుందమ్మా, దేన్నీ తిరగ రాసుకోలేము. చందనా….. ఈ ప్రపంచాన మనుషులున్న సమాజమే అతనికి పాఠశాల లాంటిది. దీనిలోని వ్యక్తి ఎవరయినా సరే తులసినీళ్ళు మింగేంత వరకు విద్యార్థే” అని నవ్వాను..

“నాన్నగారూ.. నేను వేసిన ప్రశ్న ఎంత సీదా సాదాగా ఉంది. మరి మీరిచ్చిన వివరమేమో?”

నవ్వాను మళ్ళీ.

“అసలు మీరు చెప్పింది సమాధానమౌతుందా? లేనిపోని అనుమానాలను అపోహలను పెంచేదిగా ఉంది తప్ప. జవాబు ఎలా ఉండాలి? బిట్ పేపర్‌లా ఎస్-నో తో తేలిపోవాలి. అలా కాక డొంక తిరుగుడుగా రెండర్థాలు వచ్చేలా ఎలా అన్వయించుకుంటే అలా సరిపోయేలా ఉంటే ఎలా చెప్పండి?”

ఓ క్షణం ఆగి చందననే చూస్తూ…. “అమ్మా నేను చెప్పింది సీదాగానే ఉంది. కాకపోతే నీకిది ఇప్పుడు అర్థం కాదు. ఇంతెందుకు నీ వయస్సున నాకిలాంటివి చాలా అర్థం కాలేదు. నాకిప్పుడిప్పుడే అర్థం అవుతుంది. కానీ ప్రయోజనం? గతజల సేతుభంధనం వంటిది.

ఇహ పోతే మనిషికి ‘మరుపు’ మంచిదని భావించేవాడిని నేను. ఆ మరుపు ఉండటం వల్లనే నేనింకా బ్రతికి ఉండగలిగాను. ఎంచేతనంటే కాలగమనాన ఇవ్వాళ మనకు మంచిగా తోచింది తరువాత మంచిగా అనిపించక పోవచ్చు. మన పెద్దలు పిల్లా పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండమని దీవించేవారు. మరి ఇవ్వాళ ఒక్కరూ లేక ఇద్దరూ అని దీవించాలా? అంచేత కాలమన్న మంచనేది అప్పటికే. సమాజాన వస్తున్న మార్పులకనుగుణంగా మార్పులూ చేర్పులూ జరుగుతాయి. నువ్వు ప్రశ్న సూటిగానే వేశావు. కాదనను. కానీ ప్రశ్నించే ముందు నీకు జన్మనిచ్చిన తల్లితండ్రులున్నారని వారు నిన్ను కని పెంచి కంటికి రెప్పలా చూసుకున్నారని, నీకు మంచి జరగాలనే తపనతో సాకారని, నువ్వు నిండు నూరేళ్ళు సుఖపడాలనే భావన వారి మనస్సు నిండా నిండి ఉంటుందని, ప్రాణ సమానంగా వారు నిన్ను చూసుకుంటూ బ్రతుకుతున్నారని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచన చేయక వేసిన ప్రశ్నలా ఉంది” అని నవ్వి “నిన్ను బాధ్యతగా పెంచి తీర్చిదిద్దిన నీ తల్లి తండ్రులకు నిన్ను ఊరికే పెంచడం తప్ప వారికి నీపై ఎలాంటి హక్కు లేదంటావా? నువ్వు ఇలా ఉంటే బాగుంటుందని కలలు కనడం తప్పంటావా? అమ్మా ఇదంతా ఇప్పటి తరానికి తప్పులాగే అనిపించినా వారి ఆశీస్సులు లేకుండా వెళ్లిపోవటం మాత్రం సభ్యత అనిపించుకోదు. కృతజ్ఞత అంతకంటే కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం మనిషికున్న యశస్సు మొత్తం కృతజ్ఞతపై ఆధారపడి ఉంటుంది.

గోరు ముద్దలు తినిపించి, స్తన్యమిస్తూ తప్పటడుగులు నేర్పి, మాట నేర్పి, విద్యాబుద్ధులు చెప్పించి కవచంలా కాస్తూ పెంచడం, సమాజాన జరిగే మంచి చెడులను గమనిస్తూ పోవడం తల్లి తండ్రులు బాధ్యతగా భావించడం తప్పంటావా? ఏ ఋణం తీర్చుకునేందుకు తల్లితండ్రులు దీన్ని చేస్తున్నారని అనుకుంటున్నావు. అమ్మా…. నీ కంట్లో నలుసు పడినా కాలికి రాయి తగిలినా నీ కంటే ఎక్కువ నీ తల్లితండ్రులు విలవిలాడిపోతారని అనుకున్నావు. అది వట్టి బాధ్యతేనా? ప్రేమాభిమానాలు కావా? కనగానే పేగు తెంపి బయట పడేయవచ్చు కదా. అప్పుడు ఈ సంతానపు అస్తిత్వం ఏమిటి? ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు.

చందనా నీకిప్పుడే అర్థం కాదు. అర్థమయినట్టుగా అనిపించినా ఈ సమాజపు నడక పట్ల నీకంతగా అవగాహన లేదు కనుక సరయిన సమాదానం దొరకదు. అదీకాక ఈ వయస్సున మనసుకంటే… వయస్సు వేగమే వడిగా పనిచేస్తుంది” అని నవ్వి “ఈ డొంక తిరుగుడంతా ఎందుకు కానీ నీ మనస్సుకు నచ్చిన వాడెవడో చెప్పు” అన్నాను.

“అదేమిటి నాన్నా ఇంకా నేనెవ్వరినీ ప్రేమించలేదు” అని నవ్వి “నాన్నగారూ నా స్నేహితురాలు నాకు వేసిన ప్రశ్నలు మీకేసాను. సమాధానం దొరికింది” అని లేచి కూల్‌గా వెళ్ళిపోయింది.

పిల్లది ఇలా హడలు కొట్టిందేమిటి అనిపించింది.

ఇక ముగిద్దాం. ముగిద్దామని అనగానే ముగుస్తుందా కథ. బ్రతుకు కథ కదా…!

ఈ నా కథకు నిజంగా ఇది ముగింపు కాదు. ఒక చోటనుంచి బయలుదేరినవాడు తిరిగి తిరిగి బయలుదేరిన చోటుకే చేరడం. ఈ లోపున అతని బ్రతుకున ఎదురుపడిన కొన్ని అనుభావాల సమాహారంగా గతించిన గతపు గుర్తులు నెమరేసుకోవడం.

ఈ గుర్తులు మనిషిని వదలక నీడలా వెన్నంటే ఉంటాయి.

చందన చదువు ఈ ఏటితో పూర్తవుతుంది. ఇక చదువుతా అంటే చదివించగలను. లేదా మనసెరిగి పెళ్లి చేద్దాం. స్నేహితునిగా సలహా ఇసాను. దానికేదయినా నిర్ణయం ఉంటే విశ్లేషించి చూస్తాను. అందున్న మంచి చెడులను దాని ముందుంచుతాను. ఆ తరువాత కూడా దాని నిర్ణయం మారకపోతే తప్పదు కదా..! దాని ఇష్టం ప్రాతిపదికగా చేస్తాను. జరిగిన తప్పులను పునరావృత్తం కానివ్వను. ఆ తరువాతంటారా…. సత్యా, జయ వీరు మాత్రం నా మనస్సును వదలరు.

*** సమాప్తం ***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here