Site icon Sanchika

గతించని గతం-2

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

నేను మా ఊరు చేరేసరికి అర్ధరాత్రి అయ్యింది. పనిమనిషి తలుపు తీసింది. ఇంట ఎవ్వరూ మేల్కొని లేరు.  వెళ్లి పడుకున్నాను. మనసంతా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. సత్య జ్ఞాపకాలు మాత్రం వదలలేదు. వాట్ని నెమరువేసుకుంటూ నిద్రలోనికి జారాను.

“ఇంకా ఏం నిద్రండీ, మధ్యాహ్నం కావస్తుంటే” అని రుక్మిణి కదిపితే కానీ మెలకువ రాలేదు. కళ్ళు తెరిచే సరికి ఎదురుగా రుక్మిణి సత్యలాగా అనిపించింది. ”సత్యా నువ్విక్కడ…” అన్నాను.

మాటా మంతి లేకుండా నన్ను చూసి కిందికి దిగింది రుక్మిణి, నేనేం పొరపాటు చేసానో అంతుపట్టింది. ఇప్పుడిక చేసేదేముంది. కాలాడక అలాగే కూర్చుండి పోయాను. బట్టలుతికే చాకలి నా గదికి వచ్చి విడిచిన బట్టలను తీసుకుపోయింది. నిరాసక్తంగా లేచి స్నానాల గదిలోకి వెళ్ళాను.

మనిషి మనస్సు మూగది కాదు. అవకాశం అవసరం లేనప్పుడు మాత్రమే మూగబోయి ఉంటుంది. ఎంతటి సంతోషాన్ని విషాదాన్ని అలవోకగా తట్టుకునే శక్తి మనసుకి ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే కాలమూ అంతే. ఎంతటి ఘటనైనా కాలగమనాన చిన్న గుర్తుగా మిగులుతుంది. నేను శ్రీ కృష్ణుని అంతటివాడిని కాకపోయినా రుక్మిణిని మలచుకోవడం ఎలా అనేది ఇన్ని సంవత్సరాల సంసార జీవితం నేర్పింది. ఇప్పటిదాకా నా మదిన మరో ఆడ బొమ్మ ఉందనీ అది నా చందమామ అనీ ఆవిడకి తెలియదు కదా. మానసికంగా ఆ పడే బాధ ఏదో నేనే పడ్డాను. శ్రీ రాముడు ఒక భార్య అని ఎందుకన్నా దాని మధురిమ ఏమిటో అది నిండు జీవితాన్ని ఎలా ఇవ్వగలదో కొందరికయినా అనుభవైక వైద్యమే. అందుకే ఆయన మనకు దేవుడిలా కనిపిస్తాడు.

రుక్మిణికి సత్యవతి విషయం చెప్పాలా? ఇన్ని సంవత్సరాల సంసారంలో ఇది విషపుచుక్క అవుతుందా? మనసున పదిలంగా ఉన్నదాన్ని ఇలాగే ఉంచడం మంచిదా?

‘సత్య’ అని పిలిచారేమిటి? ఆవిడెవరు అని రుక్మిణి అడిగితే?

“మీ నాన్నగారు ఈ వయసున కూడా ‘సత్య సత్య’ అని పలవరిస్తున్నారే చందనా” అని ఎదిగిన కూతురిని అడిగితే? ఇలా తల నిండా ఆలోచనలు. అమ్మో చందనకు తెలిస్తే మాత్రం ఊరుకోదు. “సత్య నాకేం అవుతుంది నాన్నగారు..” అంటే సమాదానం నా దగ్గర లేదుగా. ఇలా సాగున్న నా ఆలోచనలను నిజంగా చందనే బ్రేక్ చేసింది.

దగ్గరకు వచ్చి “ఏం చేస్తునట్టు, ఇంక కిందకు దిగలేదే?” అంటూ కాఫీ కప్ అందించింది.

కప్పు తీసుకుని దానివైపు చూసాను. చందన అందమయినది. ఆకర్షణ పాలు అంతగా ఉండదు. కానీ దాని రంగు మాత్రం అట్టాగే చూడాలనిపిస్తుంది. ఒక్కోసారి నాకు బాపు బొమ్మ అంత అందంగా అనిపించి నా దిష్టి తగులుతుందేమో అని భయపడ్డ రోజులూ ఉన్నాయి. దీనికి తోడు మాటతీరూ, ప్రవర్తనా అంచక్కా అమరినాయి. అది మనసులో మెదిలితేనే ‘నా కూతురే’ అని గర్వంగా అనిపిస్తుంది.

“అమ్మా… ఇవ్వాళ పేపరు నాదాకా రాలేదు” అనగానే “తెస్తాను” అంటూ వెనక్కు మళ్ళింది.

“చందనా”అని పిలిచాను.

“వస్తాను” అని రెండు నిముషాల్లో పేపర్‌తో వచ్చింది. పక్కనే కూర్చుంది.

“డిగ్రీ పూర్తవుతది కదా ఏం చేద్దామనుకుంటున్నావ్? ఒకవేళ ఇల్లాలుగా మారదలిస్తే కొంచెం ముందుగా చెప్పు, నా తంటాలు నేను పడాలికదా” అన్నా.

“రెండేండ్ల వరకు పెళ్లి మాట వద్దు. ఏదయినా ఉద్యోగం చేయాలని ఉంది.”

“మంచిది”, అని “ఇవ్వాళ సేపర్ చదివావు కదా వార్తలేమిటి?”

“నేను చదివింది చెపితే చాలుకదా?”

తలూపాను.

“నలబై శాతం కరంటు కోత, త్రిపుర మంత్రివర్గం రాజీనామా, కట్నం వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు అత్తమామల్ని చంపిన వైనం, రూపాయి బియ్యం పై కేంద్రం ఆంక్షలు….”

“ఇక చాలు” అనీ కాఫీ సేవనం పూర్తి చేసి కప్పు అందిస్తుండగా…

“పేపర్ అంతా చదివారా? ఇంకా సగం కూడా కాలేదు” అని నన్ను చూస్తూ… “సగం జ్ఞానం మంచిది కాదట” అన్నది.

“ఈ మాట నిజం కానీ పూర్తి జ్ఞానం అన్న దానికి నాదగ్గర అర్థం లేదు.”

“అంటే”

“నువ్వు చదివి చెప్పింది ఇప్పటికి అర్ధం కాలేదు. ఇంకా చెపితే అర్ధమవుతుందేమో అని భయం” అని.. “మన స్థితికి ఈ దేశానా జరుగుతున్న రాజకీయ నిర్వాకం తెలుసుకునేందుకు నెలకొకసారి పేపర్ చదివితే చాలు. అవగతమవుతుంది. పేపర్ కొనే అలవాటు పోక కొనడం, కొన్నాం గనక చదవడం, చదివినప్పుడు కలిగిన మనస్తాపాన్ని రోజంతా శ్రమపడి వదిలించుకోవటం” అంటుండగా….

“నాన్నగారు నేను వార్తలు చెప్పడం ఆపాను. మీరు దాని వివరణ ఆపి..” అని నవ్వింది.

“అలా కాదమ్మా.. ఈ పేపర్ వాళ్ళు వార్తాహరులు కాదు, వ్యాపారులు. మన చిల్లరకొట్టు రంగయ్య లేడూ అలా..” అన్నాను.

“ఇక వినాల్సిందే” అని కుదురుగా కూర్చుంది.

“నువ్వు కొట్టు దగ్గర ఒక గంట ఉండు, నీకే అర్థమవుతుంది. ఒక పిల్లవాడు టీ పొట్లం కోసం వస్తాడు, “నువ్వు రామయ్య బాన గారి అబ్బాయివి కదూ’ అంటాడు బేరం చూస్తూనే. తలూపుతాడు వచ్చినవాడు, “మీ అక్క ఊరినించి వచ్చిందా?” అంటూ టీ పొట్లం ఇచ్చి ఒక చిన్న బెల్లం ముక్క చేతిలో పెడ్తాడు. బియ్యానికి వచ్చిన పిల్లవానితో, అవి ఇచ్చి “జాగర్తగా పట్టుకెళ్ళు” అని ఇన్ని పుట్నాలు వాడి చేతిలో వేస్తాడు. నూనె కొచ్చిన పిల్లకు నూనె ఇచ్చి ‘అమ్మేదీ’ అని అడుగుతాడు. పులిహోర చేస్తున్నది అంటుంది. “ఐతే త్వరగా వెళ్ళు” అని ‘ఇంద’ అంటూ ఒక పందిరి గోలి చేతిలో వేస్తాడు. ఏడాది సామాను కోసం వచ్చిన గృహస్థు సరుకుల పట్టి ఇస్తాడు. దాన్ని తీసుకుని మొదట అగ్గిపెట్టి బీడీ అతనికిస్తాడు. లవంగం మొగ్గ చివర గిల్లి ఇస్తాడు. ఇంతలో మసాలా ‘గుండ’ కోసం వచ్చిన సోమప్పకి అది ఇస్తూ “బీడీ కాల్చుకుని వెళ్ళు” అని నవ్వుతారు. అది సరే, ఈ కొట్టు రంగయ్య అడిగినవే కాక మిగిలినవి ఎందుకిస్తున్నట్టు?… వ్యాపారం. కొనుగోలును ఇక్కడికొచ్చేలా చేసుకునేందుకు, పెద్దలకి పిల్లలకి వయసొచ్చిన వారికి ఏం కావాలో, వారితో ఎలా ప్రవర్తించాలో రంగయ్యకు తెలుసు. అందుకే అది మంచి పచారి దుకాణంలా ఇరవై ఏండ్లుగా నడుస్తుంది. పేపరూ అంతే.. మనకు కావలిసింది అందులో ఉండదు. కావల్సింది కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది. పుర్రెకొక బుద్ది అన్నారు కదా మనవాండ్లు. ఆ పుర్రెల్ని ఈ గిరిలో నింపి. నడపగలిగిందే ఈ పేపర్. ఉన్నవి, లేనివి, జరిగేవి, జరగనివి, జరగరానివి వాళ్ళ పద్ధతిన మన దృష్టిలో పడేలా… ఆకట్టుకునేలా..” అని “ఒక విషయం చెపుతాను. ఈ వరకట్నాలు, విడాకులు, చంపడాలు లోగడ లేవా? జనాభా పెరుగుతున్న కొద్దీ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోగడ వీటి నివారణకు ఎవరు ప్రయత్నంచలేదా? ఈశ్వరచండు విద్యాసాగర్, కందుకూరి, లోగడనే ఉన్నారు. చాలా నిజాయితీగా అనేక బాధలుపడి వాటిని ఎదుర్కున్నారు. మరిప్పుడు ఈ పేపర్‌లో జరుగుతున్నదేమిటి? మీడియా చేస్తున్నదేమిటి? మహిళాభ్యుదయం పేరిట జరుగుతున్నదేమిటి? ఆడపిల్లకి పెళ్ళంటే భయం కలిగేలా చేయడం. ఉన్న నమ్మకాన్ని దైర్యాన్ని చెరపడం తప్ప. కిరసనాయిలు పోసుకుని చనిపోయింది ఆడపిల్ల అయితే ఆవిడ కులమతాల ప్రసక్తి వీరికెందుకు? దళిత మహిళా – పెద్దింటి మహిళా అని హెడ్డింగ్ లెందుకు?”

“నాన్నగారూ నాకెందుకు ఇదంతా చెపుతున్నారు? మీరడిగారు కనక నేను వార్తలు వినిపించాను. అందుకు ప్రశంస రావాలి తప్ప ఈ శిక్షేమిటి? మీ విశ్లేషణ వినేందుకు మరొకరిని చూసుకోండి” అని వేగంగా కిందికెళ్ళి పోయింది.

“నిజం ఇలాగే ఉంటుంది. ఎన్నడు కనిపించనంత బీభత్సం, ఆత్మహత్యలు, హత్యలు, కులమతాల ఘర్షణలు, మానభంగాలు ఇప్పుడే ఉన్నాయా? మరి సమాజానికి వీరెందుకు భయపడుతున్నట్టు? పైగా వీటి పరిష్కారం వదిలేస్తున్నారు. అలాటప్పుడు ప్రచారమెందుకు? అంటే ఉన్న కాస్త దైర్యం పోగొట్టడమే కదా. చివరకి కట్టుకున్న పెళ్ళాంతో, కూతురితో బజారుకి వెళ్ళడానికి టెదురేనాయే. పోలీసులనీ మంచివారినీ అసమర్థులుగా చూపడం, రౌడీయిజాన్ని హీరోయిజంగా చూపడం, ఎవరు ఎందుకు కొట్టుకున్న కులాలను మతాలను వెతకడం… అప్పటికి లేని అగాధాలను సృష్టించడం, అసలు ఘటనల రూపురేఖలను వక్రీకరించడం తద్వారా ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనీయకపోవడం… సమాజాన్ని అవగతం చేసుకుని దాని హితం కోసం వార్తలను పత్రికలు తెలపాలి. సమాజం కోసం శ్రమించాలి, సమాజ శ్రేయస్సు వాటి ద్యేయం కావాలి. ఇలా మనసున మొదులుండగా…..

“ఇదిగో ఇవ్వాళ కిందికి దిగరా? రంగరాజులు మీకోసం వచ్చి గంట అయ్యింది. పిల్లను అలా బెదరగొట్టారేమిటి? మిమ్మల్ని పిలవమంటే అది బయటకు పారిపోయింది. పనిపిల్ల ఇవ్వాళా రాలేదు. ప్రస్తుతం ఇంట మిగిలి ఉన్న నౌకరును నేనే”అంది రుక్మిణి నిష్ఠూరంగా.

నెమ్మదిగా లేచి కిందికి దిగుతూ జనాంతికంగా నవ్వాను. రుక్మిణి అది గమనించి “ఇదొకటి. ఈపాటి నవ్వు ఇంకెవరికీ రానట్టు” అని మూతి తిప్పుకుంటూ లోపలి వెళ్ళింది. నేను రంగరాజును పంపేసరికి అరగంట పట్టింది. మళ్లీ పైకి వెళ్ళాను. రుక్మిణి గదిలో ఉంది. నేను “ఏమిటి” అన్నాను. నా కండ్లల్లోకి చూసేందుకు ప్రయత్నించిది. మరో నిమిషం ఆగి, “సత్యవతి ఎవరు” అని అడగనే అడిగింది. ఆవిడ మొహాన ఏ భావాన్ని చదవలేక పోయాను. “అదా.. రాత్రి కలోచ్చిందోయ్. నేను కృష్ణుడి నయినట్టు, నువ్వు సత్యభామ అయినట్టు” అని నవ్వాను.

“మీతో మీ పంచన బతుకంతా ఉంటున్న దాన్ని. నాతో అబద్దం చెప్పే అవసరం రాకూడదు. ఒక వేళ మీకు ఊహా సుందరి ఎవరయినా ఉన్నా సంసార జీవితాన నేనేగా ఉండేది” అంది.

నేను పెదవి విప్పలేదు. అసలు నేను సత్య పేరు పైకి ఎందుకు అన్నాను? రుక్మిణి అలా అనిపించడమేమిటి? అనుకుని కళ్ళు మూసుకున్నాను. నిజంగానే సత్య అప్పుడు నా తలపుల్లోకి వచ్చింది. ‘చందమామ రావే, జాబిల్లి రావే’ అనీ పసివాళ్ళను నమ్మించడం తేలికే. మరి ఈవిడను నమ్మించడమెలా? సత్య మనసున నిండి ఏటో తీసుకెళుతున్నది. రుక్మిణి కిందికెళ్ళి పోయింది. సత్యవతి ఆవిడ పెళ్లి ఇంకా నాలుగురోజులు ఉందనగా ఒక ఉత్తరం రాసింది. దాన్ని భద్రంగా ఎక్కడ దాచాను? అనుకుని మంచం దిగాను. బీరువా దగ్గరకెళ్ళి తెరిచాను. నాలుగరలూ వెతికిన తరువాత బట్టల మడతలలో దొరికింది. గబగబా విప్పి చూసాను. సత్య రాసిన ఉత్తరమే. ఆ అక్షరాల పొందిక నాకు తెలుసు. లోగడ చదివినా మళ్ళీ చదవాలని అనిపించింది. మడత విప్పాను.

“శివుడూ…

నేను సత్యను… ఈ ఉత్తరంతో పాటూ నా పెళ్ళి పత్రికను కూడా పంపుతున్నాను. నేను నీ పక్కనే పెళ్ళికూతురులా కూర్చోవలసిన దానిని. నువ్వు లేకుండానే పెళ్ళికూతురునవుతున్నాను. బాధపడవద్దు. బాధ పడే వానికి మిగిలేది బాధే. ఎందుకిలా జరిగిందన్నది నీకూ కొంత తెలుసు. ఆవేశపడి ఉత్తరాన్ని చింపేసేవు. జరిగింది నీకు అర్థం కాకుండా మిగిలిపోతుంది, నానుంచి ఇక నీకు ఏదీ అందదు. మనం కలిసే అవకాశం ఇక ఉండకపోవచ్చు. నీకు ఈ ఉత్తరం అందేటప్పటికి ఇక్కడ నా పెళ్లి అయిపోతూ ఉంటుంది. నేను మరొకరి ఇల్లాలిగా ఏడడుగులు నడిచే ఉంటాను. పరాయిదాన్నయిన నాకోసం నువ్వేం చేయదలిచినా సమాజం హర్షించదు. కనీసం సానుభూతిని కూడా చూపరు. కనుక అలాంటి ఆలోచన కలిగినా ఆపుకో్. ఇహ పోతే న్యాయానికి మనం ప్రేమించుకున్నాం, ఒకటిగా జీవిద్దామనుకున్నాం. ఇప్పటికీ మన ప్రేమలో కామం జోరబడలేదు. నా పెళ్లి కుదిరాక నీ ప్రేమ ఎంత బలమయినదో, అది నాపై ఎంత గాఢముద్ర వేసిందో తెలిసింది. నీ ప్రేమ బలిమికి ఎదురుతిరిగి నీ వద్దకు వచ్చేదామని ఒకటి రెండుసార్లు అనిపించింది. కట్టు తెంచుకుని రాబోయాను కూడా. అసలీ ప్రేమకు పుట్టుకేమిటో నాకు తెలీదు. అయినా నిన్ను చూడకుండా ఉండలేనంత కలిగింది. ఎందుకు? సమాధానం దొరకదు. ప్రేమ తగ్గదు. పైగా అది ఇంకా పెరుగుతుంది. ఇది కన్న వారిని కాదని బ్రతుకుని నీతోనే నడవాలనేంత బలంగా. ఆరోజు నీకు గుర్తుండే ఉంటుంది, నువ్ మాత్రం నిన్ను మరిచింది ఎప్పుడు? నా పెళ్ళి ఖాయం అయ్యింది. అది రెండవ పెళ్ళి వాడితో. గతాన్ని వదిలేయ్. నా భర్త ఒక బడిపంతులు. నా ఇష్టాఇష్టాలను మావాళ్ళు అడగలేదు. ఒకనాటి రాత్రి వొచ్చి నీ పెళ్లి ఖాయపరుచుకుని వచ్చామన్నారు. నేను పడుకోబోయేముందు నాన్న వచ్చాడు. నా మంచంపై కూర్చుని నన్ను పక్కనే కూర్చోమన్నాడు. భుజంపై చేయి వేసి “అమ్మా నీ పెళ్లి చేస్తున్నాం” అన్నాడు. అయోమయంగా చూసాను. “వెంకటప్పయ్య అతని పేరు. బడిపంతులుగా ఉంటున్నాడు. ప్రభుత్వ నౌకరీయే. కట్నం మనం ఇవ్వలేనంత అడిగేవాడు కాదు. మన స్థితిగతులు నీకు తెలుసుకదా. ఇవ్వాళ పెళ్ళిళ్ళ మార్కెట్‌న ఎంత అరగుండి వెధవకయినా పాతికవేలు అంటున్నారు. ఇవికాక లాంఛనాలు. వాడికున్న మొలతాడు తెగినా సంపాదించి కొనుక్కోలేడు. ఇతను అట్లాంటి వాడు కాదు. ఎదుగుతున్న ఆడపిల్లల్ని ఎంతకాలం ఉంచుకుంటాం. మన ఇంటి విషయానికి వస్తే నీ తరువాత ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళనీ ఒక అయ్యో చేతిలో పెట్టాలి. ఇవన్నీ ఆలోచించే ఈ సంబంధం ఖాయం చేసాను. ఈ ఆదివారం ఉదయం తొమ్మిది ముప్పైనిముషాలకే పెళ్ళి, మన అమ్మవారి గుడిలోనే” అని లేచి నిలబడి – “మరో విషయం నీకు మొదట తెలిసి ఉండటం మంచిది. అతగాడికి నువ్వు మొదటి భార్యవు కాదు. ఆవిడ పోయింది. నిబ్బరంగా విను. ఆవిడతో అతను నాలుగేండ్లు కాపురం కూడా చేసాడు. ఆ ఫలితంగా ఒక ఆడపిల్ల కూడా అంది. అయితే ఆ పిల్లను వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళింది. ఇతగాడు ఆ పిల్లతో పాటు మొదటి భార్య తరుపున వచ్చిందంతా ఇచ్చి పంపాడు. ఆ పిల్ల ఇక రాదు. ఇలా అయ్యాక మళ్ళీ వివాహం చేసుకోవాలనిపించి మీ బాబాయితో అన్నాడట, అదీ నువ్వు దృష్టిలో ఉండి. పెళ్లిచూపుల తంతు కూడా అవసరం లేదన్నాడట. అంటే లోగడ నిన్ను ఎక్కడో చూసి ఉంటాడు. ఇహ నువ్వు నీ దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారంతో అతని భార్యగా వెళుతున్నావు” అని వెళ్ళబోయాడు. “నాన్నగారూ” అని పిలిచాను. కళ్ళు తుడుచుకుంటూ ఆగాడు. “అంతా అయ్యాక ఇది నాకు చెప్పకపోతేనేం? నా బ్రతుకంతా గడపాల్సిన వాణ్ణి కనీసం చూపకుండా నిర్ణయాలు చేసారు కదా. వినడానికి ఏం మిగిలిందని నాకు చెబుతున్నారు?” అని పెద్దగా ఏడ్చాను.

“మన పిల్లవు కదా, ఎప్పుడు చెబితే ఏముందిలే అనుకున్నాను.”

“మీ అల్లుడి వయసెంతో?”

“అడగలేదు, లేతగానే కనిపించాడు, బాగుంటాడు. నువ్వే అంటావ్ చూశాక” అని నవ్వుతూ వెళ్ళిపోబోయాడు. ఆయనకు నవ్వెందుకు వచ్చిందో నాకు బొత్తిగా అర్థం కాలేదు.

“నా వయసు పదిహేడని మీకు తెలుసు. ఆయనకు నలభై లోపు ఉండొచ్చు, అంతే కదా” అన్నాను.

“అలాంటివి ఆలోచించకు. ఎదురై వచ్చిన పిడికెడు అదృష్టం మట్టికొట్టుకుపోతుంది” అని వెళ్ళిపోయాడు.

ఆయన చాతకానితనం నుంచి వచ్చిన కోపమది, ఎంత చాతకాని వాడూ మొగపుటక గనక, తన చాతకానితనాన్ని ఒప్పుకోడు. ఆ రాతల్లా ఏడ్చాను. ఎప్పుడు కన్ను మలిగింది కానీ త్వరగానే మెలకువ వచ్చింది. నా పరిస్థితి నాకు అర్థం కాలేదు. నీ దగ్గరకు పిచ్చిదానిలా రావాలని అనిపించింది. అమ్మమ్మ దగ్గరకు వెళ్లి వస్తానని నీ దగ్గరకి వచ్చాను, నువ్ లేవు. ఎక్కడికెళ్ళావో తెలియలేదు. అయినా మొండిగా మాపటి వేళ వరకూ చూసాను. జాడ లేదు. ఇహ అక్కడ ఉండడం బాగుందని వెనక్కి వచ్చాను, ఇక్కడ పెళ్లి పనులు సజావుగా సాగుతున్నాయి, గోడలకు ఎర్రమట్టి చారలు పెట్టారు. మరో రోజు గడచింది. మా బాబాయిలు ఇద్దరూ వచ్చారు. ‘పిచ్చిదానికి పెళ్లి కళ వచ్చింది’ అనుకుంటూ వెళ్ళారు. అది వారికి ఎక్కడ కనిపించిందో నాకు మాత్రం తోచలేదు. ఒక్కరయినా నా దగ్గరకు వచ్చి “పెళ్లి కొడుకును చూసావా” అని కాని, “ఇష్టమేనా” అని కాని అడిగినవారు లేరు. చివరకు నన్ను ప్రాణంలా చూసే పెద్దమ్మ కూడా ఏమీ అడగలేదు. అసలీ మొత్తం సృష్టిలోనే ఆడది చాలా అవిటి అవయవం అనిపించింది. మగాడి నీడన, మగాడి తోడుగా మగాడితో, అతనిపై ఆధారపడి పరాన్నజీవిగా బ్రతికే ఒక చిత్రమయిన జీవి… నేను ఎందుకీ మాట అంటున్నానంటే నా బంధువుల్లోని ఏ ఆడమనిషి కూడా నా ఇష్టమేమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం, ఈ ఆడదానికి స్వేచ్ఛ అనేది ఓ మరీచిక. అందని దూరాన మెరిసే రంగుల కల. నీకో నిజం చెప్పనా… ఆడదానికి స్వేచ్ఛ అనేది ఇప్పటిదాకా భూమిపై లేని వస్తువు. పైగా తోటి ఆడవాళ్ళతోనే ఈ మగాడు ఆడదాన్ని హింసించడం, నరకాన్ని చూపడం, పిచ్చివాళ్ళని చేయడం తనకు తానే చనిపోయేలా చేయడం లాంటివి పక్కాగా చేయించి వినోదిస్తుంటారు. మన ప్రశాంతిని చూడు… కట్నం తేవడం ఆలస్యం అయ్యిందని ఆరడి పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసి, శవంపై దొంగతనం నేరం మోపి మిగతా నగానట్రా వీళ్ళే కాజేసి మూడో నెల తిరక్కముందే ఓ అమాయకురాలి మెడలో మూడుముళ్ళు వేయించి పట్టుకు వచ్చారు. ఇది తెలిసి వాళ్లు పిల్లనెలా ఇచ్చారో? మనం ప్రశ్నించ వీలులేదు. మా నాయనమ్మ ఈ మగవెధవల్ని కన్న తల్లి, వాళ్ళ కోసం కోర్టులకెక్కి మగరాయునిలా తిరిగి ఆస్తిని కాపాడి అప్పగిస్తే ఇప్పుడు కళ్ళుపోయిన ఆ తల్లికి ఆ ముగ్గురి ఇళ్ళకు నాలుగు నెలలకు ఒకని దగ్గరకు మారుతూ వాళ్ళు వేసే పిండాకూడు కోసం ఎదురు చూస్తుంది. కని పాలిచ్చి… సాకి, మాటలు నేర్పి లోకాన్ని చూపి, అన్ని అమర్చినాక పట్టెడన్నం పెడితే వాణ్ణీడనే చద్దామనుకున్న ఈ ఆడ మానసిక స్థితికి, అదీ దొరక్కుండా చేసే ప్రయత్నం వినడానికి చిత్రంగా లేదు. అయినా స్త్రీ స్వాతంత్ర్యం స్వేచ్ఛా, రుద్రమ్మా, మల్లమ్మా, ఝాన్సీ అని… భలే అందంగా మాయ చేస్తుంటారు ఈ వెధవలు. నేను ప్రేమించిన వాడిని చేరుకోలేక పోయాననే ఆవేదన, నన్నిలా చెప్పిస్తుందని అనుకోకు. కాస్త ఆలోచించు. నీకూ తెలుస్తుంది. దీని నుంచి ఆడది ఎలా బయటపడటం? కూట్లో రాయి తీయలేని నేను ఏట్లో రాయినేం తీయగలను?

“శివుడూ… నేను పెద్దమనిషినై ఉన్నప్పుడు నన్ను చూడాలని ఇంటి చుట్టూ తిరిగావట కదా. మా అమ్మ నీ తిరుగుడిని అనుమానించింది. నిన్ను పిలిచి మా సత్యను పెళ్లాడతావటరా అని అడుగుదామనుకుందిట. నీ ఆస్తి అంతస్తూ గుర్తుకొచ్చి ఆగిపోయిందట. ఈ సంగతి తెలిసి నీ వెతుకులాట ఆగదనుకుని రాంబాయి గారి ఇంటికి వచ్చాను. కానీ స్కూల్‌కి వచ్చిందాకా నువ్వు కనిపించలేదు. అక్కడ నిన్ను చూసినప్పుడు మొదటిసారి సిగ్గయ్యింది. ‘మనకు పెళ్ళయిందనీ, ఇద్దర్నీ కన్నామని వారిని పెద్ద చేసామని ఎన్ని కలలు’. “అమ్మా శివుడు మనకు చుట్టమవుతాడా?” అని అడిగానొకమారు. అనుమానంగా చూసిందమ్మ. ఇంతలో నూ నాయనమ్మ వచ్చి “శివుడికి పిల్ల నిస్తామని బెజవాడ నుంచి వచ్చారట. రెండు లక్షలూ, ఇల్లూ ఇస్తారట” అని చోద్యంగా చెప్పింది.

“శివుడు నన్ను పెళ్ళాడతానన్నాడే….” అన్నాను. నా మాటకు అమ్మ నాయనమ్మ నోరెల్లబెట్టారు. తేరుకుని ‘వెధవ్వేషాలేయకు’ అని కసిరిందమ్మ. ఆ అమ్మే నా దగ్గరకు వచ్చి “సత్యా నీ మంచి కోసమే ఈ పెళ్లి చేస్తున్నది. నీకింకా ఇద్దరు చెల్లెళ్లున్నారు. నువ్వెలాంటి పొరపాటు చేసినా మొత్తం కుటుంబం వీధిన పడుతుంది” అని చెప్పి వెళ్ళింది. ఆమెను చూస్తూనే ఏడ్చాను. నేనేమిటో నాకు అర్థమయ్యింది. అయినా నా నిర్ణయాన మార్పు మాత్రం లేదు. అయినా ఆడదానికి మనసేమిటీ? అదో అందమయిన భ్రమ. ఈ లోకానికి ఆడదాని శరీరం అందంగా ఆరోగ్యంగా ఉంటే మాత్రం చాలు. ఇప్పుడు… ఈ గిరిలో నేనొక పావును. వాళ్ళ పరిధిననే ఈ పావు కదులుతుంది. నీకు దైర్యం ఉంటే రా, నీ వెంట వస్తాను. నా మెడలో మరొకడి చేత పసుపుతాడు పడిన దాకా ఎదురు చూస్తూనే వుంటాను. ఇది జరక్కపోతే బ్రతుకున ఎక్కడయినా ఎప్పుడయినా కలిస్తే స్నేహితులుగా పలకరించుకుందాం.

 — సత్య.”

ఈ ఉత్తరం రుక్మిణికి చూపితే? అనిపించింది. అక్కర్లేదనుకుని దాచాను.

సత్యవతి భావన మాత్రం నన్ను వదలలేదు, సత్యవతి పెళ్లి అయ్యాక ఆవిడే మనసున ఉండటాన నాకూగా పెళ్ళి ఆలోచన రాలేదు. ఇంతలో సత్యవతికి టీచర్ ఉద్యోగం దొరికిందని తెలిసింది. డిగ్రీ పూర్తయిన నేను ఉద్యోగ ప్రయత్నంలో పడ్డాను. నారాయణ అనే మిత్రుడు ఒకనాడు బస్టాండ్‌లో కనపడి సందర్భవశాత్తు “మీ ఊరమ్మాయి మా దగ్గరే టీచర్‌గా పని చేస్తుంది. ఆవిడపేరు సత్యవతి” అని చెప్పాడు. “భార్యాభర్తలు అక్కడే ఉంటున్నారా” అని అడిగాను. “ఇల్లెందు నుంచి రోజు వచ్చి పోతున్నది” అని చెప్పాడు. ఆ తరువాత వెంకటప్పయ్యకు సన్నిహితుడొకడు మా ఊరుకి బదిలీ అయ్యి వచ్చాడు. అతని పేరు రాము. ఓ ఆదివారం పేకాట దగ్గర పరిచయమయ్యాడు. సందర్భవశాత్తు, ‘సత్యవతి ఆయన భార్య అని, ఆవిడకు పిల్లలు పుట్టే యోగం లేదని, వెంకటప్పయ్య మొదటి భార్య ఉండగానే వేసక్టమీ చేయించుకున్నాడ’ని చెప్పాడు. నిజంగా షాక్ అనిపించింది. నిస్సంతుగా బ్రతికేందుకు ఇష్టపడే పెళ్లి చేసుకుందా? లేక విషయం చెప్పకుండా చేసారా? వీటికి సమాధానం దొరకలేదు. ఒకసారి సత్యవతిని కలవాలని మాట్లాడాలని అనిపించింది. అలాంటి సమయాన అనుకోకుండా బస్టాం‌డులో సత్యవతి కనిపించింది. ఆవిడ పక్కన సంక సంచీ నాలుగేండ్ల పాప కనిపించారు. ఆ పిల్లకు బిస్కట్ తినిపిస్తుంది. నేను ఎదురుగా దగ్గరకు వెళ్లి నిల్చున్నాను. నా పై దృష్టి పడింది. నవ్వుతూ కొంచం దగ్గరగా జరిగి “బాగున్నావా? ఎటు?” అని అడిగాను. సర్దుకుని “శివుడే కదూ…” అని ఆశ్చర్యపోయింది. “ఇంకా బ్రతికే ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా?” అన్నాను. నా మాట పూర్తికాకముందే చేత్తో ఆపింది. దగ్గరకు జరిగింది. “చాలా రోజులయ్యింది కదూ కనిపించక. ఏం మారలేదు” అంది. “మార్పు సహజం. నువ్వు మాత్రం వొళ్ళు చేసావ్, మాట తీరు మారింది, అప్పుడు మొగ్గలా ఉండేదానివి. ఇప్పుడేమో ఆరిందాలా కనిపిస్తున్నావు” అని నవ్వాను. “కాఫీ తాగుదామా?” అడిగింది. వద్దని, “పిల్లా పీచూ ఏమయినా ఉన్నారా” అడిగాను. తల అడ్డంగా ఊపింది. “మా చెల్లెలి బిడ్డ. ఇంకో బిడ్డని మోస్తూ మా చెల్లెలు అవస్తలు పడుతూనే ఉంది” అంది. “అది సరే నన్ను ప్రశ్నించడమేనా నీ సంగతేమయినా చెబుతావా” అంది. “తిరగగా తిరగగా ఈ మధ్య ఒక గుమస్తా ఉద్యోగం దొరికింది. ఇక్కడే మకాం. మానసికంగా తప్ప బాగానే ఉన్నాను. కాకుంటే నీ పెళ్ళివల్ల రెండేండ్లు మరీ అయోమయంగా తిరిగాను. సత్యా… నిజం చెపుతున్నాను. నువ్వు పరాయి సొత్తు అయ్యాక మరిచిపోలేకపోతున్నాను. మరపు నిన్ను మననం చేసుకునేందుకే ఉపయోగపడిందని ఆలస్యంగా అర్థమయ్యింది. నీ రూపం నన్ను వేటాడుతున్నది. దేన్నీ ఎక్కువకాలం భరించలేనేమో? ఏదో ఒకనాడు సీదా నీ మొగుడి దగ్గరకు వచ్చి “ఇదిగో వెంకటప్పయ్యా… అసలిది నా పెండ్లాం. నేను తీసుకెళ్తున్నాను. నీ దిక్కున్న చోట చెప్పుకో” అని ఎత్తుకుని రావడం ఖాయం. అరే కలల్లో కొస్తే పరవాలేదు. రోడ్డున కనపడిన ప్రతి పోరి నీలాగే కనిపిస్తున్నది. ఇప్పటికి ఎన్నిసార్లు అలా పలకరించి అవమానాల పాలయ్యానో” అన్నాను.

జాలిగా చూసింది. సముదాయించే ప్రయత్నం మాత్రం చేయలేదు. పైగా దాపుకొచ్చి “శివుడూ నన్ను చూడు. నేనన్నీ మరిచిపోయాను. నిన్ను కూడా” అంది, ఆ మాటే అబద్దమని ఆవిడ కళ్ళు చెపుతూనే ఉన్నాయి. మళ్ళా నావైపే చూస్తూ “మనం అనుకున్నవి అన్నీ ఎప్పుడూ జరగవు. సర్దుకుని పోవలసిందే. అంతకుమించి దారిలేదు” అని “మా ఆయన మనకు పిల్లలు కావాలా? అని ఇప్పటికీ అడగలేదు. ఎందుకో తెలుసా” అంది ఆమె. తెలుసునన్నట్టుగా తల ఊపాను. “మనకు ఒక పిల్ల ఉంటే బాగు అని అతను ఎప్పుడన్నా-పరుగున నీ దగ్గరకు వచ్చి నీ ఒడిన వాలిపోతాను, కానీ అనేలా లేడు. చూద్దాం” అంది. బిస్కెట్‌లు తీసి పిల్ల చేత పెట్టి, “శివుడూ… నీకు భార్య కావాలని చాలా ఆశపడ్డానయ్యా. ఎన్నో కలలు కన్నాను. కాశీమజిలీ కథలా అయ్యింది. నన్ను కన్న తండ్రి లగ్నపత్రిక రాసాకా నాకు చెప్పాడు. పైగా ఇంటి నుంచి వచ్చినా నువ్వు కలవలేదు. నా పొరపాటు మొత్తం కుటుంబం పైన పడుతుందని మంచి బానిసలా ఉంటే తప్ప మంచి పిల్ల అనలేని సమాజం మనది. అలాంటిది దీని అక్క ఎవడినో ప్రేమించి లేచిపోయిందని తెలిస్తే బజారున పోయే ఏ వెధవ అయినా విజిలేసి మరీ నా చెల్లెళ్ళని పిలుస్తారు కదా. అంతటి గొప్ప వ్యవస్థన మనం ఉంటున్నాం” అని నవ్వి, “శివుడూ… నువ్వు లేని నా బ్రతుకు నరకం అని తెలిసినా మనసంతా నీతోనే ఉన్నా నా ఒక్కదాని సుఖం కోసం కుటుంబాన్ని పణంగా పెట్టడం ధర్మం కాదని అనిపించింది. గుండె బండగా చేసుకుని పెళ్ళి కార్డు నీకు పంపాను” అని ఉబికిన కన్నీటిని తుడుచుకుని “నీ పెళ్ళి మాటేమిటి?” అని అడిగింది. ఇంతలో ఆమె వెళ్లాల్సిన బస్సు వచ్చి ఆగింది. సంచీనీ, పాపను తీసుకుని “ఇహ వెళ్లాలి” అంది. సత్యను బస్సు ఎక్కించాను. టికెట్ అని కండక్టర్ మాట వినిపించింది. “ఒకటిన్నర” అని పైసలిచ్చింది. బస్సు కదలబోతున్నది. సత్య చేతిని తాకాలనిపించింది. తాకాను. ఉలిక్కిపడుతూ చూసింది నన్ను. అలా చూస్తూనే, చేతిన చేయి కలిపింది. నిజంగా ఆ స్పర్శ పరవశాన్ని కలిగించింది. బస్సు కదిలింది. చేతులు విడివడినాయి.

***

రుక్మిణితో నా పెళ్ళి జరిగింది, నా సంసార జీవితం అంత సజావుగా సాగలేదు సత్యపై నాకున్న భావన వలన. మనసొక చోట, మనువొక చోట అంటారు మనవాళ్ళు. నా పట్ల అది నిజమైనది. యాంత్రికంగా మాత్రమే భార్యాభర్తలుగా మిగిలాము. నేనక్కడ తృప్తిని ఆశించలేదు, పొందలేదు. నేను గృహస్థుడిని. నాకో ఇల్లాలుంది. కనుక విధిగా భావించి కాపురం చేస్తున్నాను. రుక్మిణీ అని నోరారా నేనెన్నడూ పిలవలేదు. కాకుంటే కలిసి ఉన్నాం. రాను రాను నాకు ఈ దాగుడుమూతల వ్యవహారం రుచించలేదు. ఒకనాడు నేనుంటున్న పల్లెను, నాన్నను, తమ్ముడిని, ఇల్లాలిని వదిలి ఎవరికీ చెప్పకుంగా ఇంటి గడప దాటాను, ఎక్కడికి అన్న ప్రశ్న నాకు రాలేదు. ఇక్కడ ఉండలేను అనిపించింది, అలా బయటపడ్డ నేను దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచాక తిరిగి పాదుకు చేరుకున్నాను. ఆ గతం చెపుతాను.

(సశేషం)

Exit mobile version