[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]
[dropcap]సం[/dropcap]వత్సరం గడిచింది. రాజేష్, రాణిల పెళ్ళి సజావుగా జరిగింది. పెళ్ళి తరువాత నాకు డా. పాండేతో సాన్నిహిత్యం బాగా పెరిగింది. నేను చేస్తున్నది బడిపంతులు నౌకరీ. డాక్టరుగారికున్న లీజర్ టైమ్‌ని బట్టి ఎక్కువగా ఆయనతో గడిపేవాడిని. వినత – పాండే చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇప్పుడు వినత వట్టి మనిషి కూడా కాదు. ఆవిడని కంటికి రెప్పలా చూసుకునేవాడు. వినతది చోటా నాగపూర్. తొలిచూలు కనుక వినతను పుట్టింటికి తీసుకెళ్ళారు. పాండేకి ఇది ఇష్టం లేదు. అన్ని జాగ్రత్తలు చెప్పి మందులిచ్చి నర్సును వెంట పంపాడు. వినత పుట్టింటికి వెళ్ళిన నాటి నుంచి మేమిద్దరమే మాట్లాడుకుంటూ గడిపేవాళ్ళం. ఈమధ్యనే నాకొక తెలుగు వ్యక్తి పరిచయమయ్యాడు. పేరు ఆంజనేయులు. స్నేహం కూడా కలిసింది. అతనిది పేరుకు తగ్గ విగ్రహం కాదు. వ్యాపారి. కాకుంటే తను చేసే వ్యాపారమేమిటని నేను అడగలేదు. ఆయన చెప్పనూ లేదు. అతను బ్రతికే విధానం గమనిస్తే మాత్రం స్థితిపరుడిలాగానే కనిపించాడు. కొంచెం చనువయ్యాక అనుకోకుండా ఒకనాడు అడిగాను “మీరు చేసే వ్యాపారం ఏమిటి?” అని.
కప్పదాటు వేయబోయాడు.
“నాకూ ఏదో ఒకటి చేద్దామని ఉంది. మీరు చేస్తున్నది నచ్చితే తెలుగువారు కదా నేనూ కలుస్తాను” అన్నాను.
అదోలా నవ్వాడు. కొద్దిసేపు ఆలోచనలోకి వెళ్ళాడు. ఆనక “శివా…. నేను చేసేది చెపితే నన్ను అపార్థం చేసుకుంటావేమో” అన్నాడు బాధగా.
లేదన్నాను.
“నేను చేసేది ఆడపిల్లల వ్యాపారం”
“అంటే?” అన్నాను.
దస్తీతో మొహం తుడుసుకుని కుర్చీలో కుదురుగా కూర్చుని వివరంగా చెప్పాడు.
“వయసులోనున్న అందమయిన ఆడపిల్లలను పెద్దాపురం రాజమండ్రి ప్రాంతాల నుంచీ, కొందరిని మద్రాస్ నుంచి నెలజీతాలపై ఇక్కడకు వెంటపెట్టుకుని వస్తాను. నా వ్యాపారంలో వాళ్ళ ఖర్చులు పోను మిగిలినవి నేను తీసుకుంటాను. ఈ సమాజంలో ఈ బలహీనలో ఉన్న పెద్దలు అనేకమంది ఉన్నారు. కనుక నేను విలువగా గుట్టుగా నెగ్గుకొస్తున్నాను. నేను వేస్తున్న వ్యాపారమిది” అన్నాడు.
“ఇది వ్యాపారమా?” అని ఆశ్చర్యపోయాను. మనిషి జన్మ పైన అసహ్యం కలిగింది.
“ఇలా చేసేందుకు నీకు సిగ్గుగా లేదా?” అని అడిగాను.
“సిగ్గెందుకు?” అని, “నేనాగితే ఇది ఆగదు కదా? పైగా దీన్లో డబ్బు బాగా మిగులుతుంది. ఎవరినీ యాచించే అవసరం నాకు రాదు. అయితే నేను ఇష్టంతో ఈ వ్యాపారం చేయడం లేదు. ఇందులో నా బ్రతుకు బాటతో పాటు ఆడవాళ్ళ ప్రోద్బలం – ప్రోత్సాహం ఉంది. వాళ్ళ బ్రతుకుతెరువూ ఉంది. నా విషయానికి వస్తే నేను డిగ్రీ చదివాను. నౌకరీ కోసం నాలుగు సంవత్సరాల కాలం కాలికి బలపం కట్టుకుని తిరిగాను. దొరకలేదు. ఉద్యోగం లేకుండా ఇంటి మొహం చూడటం చిన్నతనం అనిపించింది. ఒకానొక దశలో చనిపోదామని కూడా అనుకున్నాను. అలాంటి దశలో నా చిన్ననాటి స్నేహితురాలొకతి, బందువు కూడా, నాకీ మార్గం చూపింది. ప్రయత్నించమంది. ఆవిడ చెపుతున్నప్పుడు మనసంతా ఎలాగో అయ్యింది. వినడానికీ బాగాలేదు. భయం కూడా చేసింది. ఇది నా నుంచి అయ్యేది కాదని అనుకున్నాను. కానీ నా డిగ్రీ నిరుపయోగమని తెలిసాక, పస్తులుండటం మొదలయ్యాక చివరి స్థితిన ఈ పని ప్రారంభించాను. ఇప్పుడు మనసు పెట్టి చేస్తున్నాను. లోగడ నాకు పని ఇవ్వని వారి చేత కూడా ఇప్పుడు నేను పని చేయిచుకోగలను. ఈ విధంగా నా కసి తీరుతుంది. పైశాచిక ఆనందం మిగులుతున్నది. ఏదో సాధించానని కాదు. ఈ వెధవలతో కూడా ఏదయినా చేయించగలనన్న తృప్తి. ఈ పద్ధతిన నాకు నేను గెలిచినట్టే అనిపించేది. కానీ, శివా.. మానసికంగా నేను చనిపోయాను. అందుకే నా బాహ్యస్థితి మరిపించేంతగా తాగుతుంటాను. స్పృహ కోల్పోయేలా తాగితే మరీ హాయిగా అనిపిస్తుంది. ఒక్క నా వృత్తి సమయంలో మాత్రం జాగ్రత్తగా, ఖచ్చితంగా నడుచుకుంటాను. మిగతా సమయంలో మాత్రం మరో లోకపు అంచులను చూస్తాను. ఒక్క నిజం చెపుతాను. ఇప్పటికి నా బ్రతుకున మిత్రుడంటూ ఎవరూ లేరు. ఒక్క యాజులు తప్ప” అని ముగించాడు.
నాకు నిజంగా తల తిరిగినంత పని అయ్యింది. ప్రతి చెడిపోయిన వాడు దానికో పద్ధతయిన కారణాన్ని అందంగా చెపుతాడనిపించింది.
ఇదే ఆంజనేయులు నాకు కనిపించిన కొత్తలో అతను ఖర్చు పెడుతున్న తీరు పద్ధతి చూసాక చాలా పెద్దవాడు, బాగా ఉన్నవాడు అనుకున్నాను. ఇప్పుడు ఇతనా నా స్నేహితుడు అనిపించింది. కానీ స్నేహాన్ని వదిలేయాలనిపించలేదు. అర్థమయితే ఆంజనేయులు చాలా స్నేహశీలి. అయితే అతని వద్ద ఎలాంటి స్థితిన పైసలు మాత్రం తీసుకోకూడదనిపించింది. మనసంతా చికాకేసింది. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు.
మరునాడు పొద్దుట స్కూల్‌కి బయలుదేరి వెడుతూ డా.పాండే ఆసుపత్రి వైపు చూసాను. ఉన్నట్టుగా అనిపించక వాకబు చేసాను. అక్కడ ఉన్న నర్సమ్మ నన్ను చూసి బోలెడు సిగ్గు వలకబోసి ‘నాకు తెలియదు’ అని చెప్పింది. సాయంత్రం వచ్చేటప్పుడు ఆగుదామనుకుని బడికి వెళ్లాను. నా క్లాసులు రెండూ పూర్తి కాగానే సీదా లాడ్జ్‌కి వచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చున్నాక డాక్టర్ గారు గుర్తొచ్చారు. వెళితే బాగు అనుకున్నాను. ఓపిక చాలక వెళ్ళలేదు. తరువాత రెండు రోజులు గడిచి పోయినాయి. వెళుతూ ఆగాను. పాత సమాదానమే వచ్చింది. మరో వారం తరువాత అసలు ఆసుపత్రే మూసి కనిపించింది. చిత్రంగా అనిపించింది కానీ ఎవరినడగాలో అర్థం కాలేదు. ఎటూ ఎందుకు వెళ్ళింది చెప్పిన వారు లేరు. ఆయనతో తిరిగిన జ్ఞాపకాలు, మంచితనం, అటుగా వచ్చినప్పుడల్లా గుర్తుకు వస్తుండేవి. డాక్టర్ గారు వినత నిజంగా పార్వతీ పరమేశ్వరులుగా అనిపించేవారు. వినత ప్రసవించే ఉండవచ్చు. చోటా నాగపూర్ లోని వారి ఆడ్రస్ ప్రయత్నించినా దొరకలేదు. రోగులకు సేద తీర్చే ఆశ్రమంలా ఉండే ఆసుపత్రిని ఎందుకు మూసేయ్యాల్సి వచ్చిందో? అది కనిపించినప్పుడల్లా దిగులనిపించేది.
మూడు నెలలు గడిచిపోయినవి. ఒక రోజు నేను స్కూల్ నుంచి బసకు చేరేసరికి నా మంచం పైన ఒక ఉత్తరం కనిపించింది. నాకు ఉత్తరాలు రావు కనుక నాది కాదనుకున్నాను. నాకు ఉత్తరం రావడమంటే మావాళ్ళకు నా అడ్రెస్సు దొరకడమే కదా. అందుకే ఉత్తరం అంటే నాకు జంకు. పక్కమంచం అతనిదేమో అని చూసాను. కాదు. స్పష్టంగా నా పేరే ఉంది. అనేక రకాల అనుమానాలు చిందర వందరగా నా తల లోకి ప్రవేశించినాయి.
అయినా దైర్యంగా విప్పాను. మిత్రుడు శివకు… దేశ్ పాండే అని ఉంది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని చదివాను. మనసంతా సంతోషం నిండింది. మూడు మాసాల క్రితం అర్ధాంతరంగా కనిపించకుండా పోయిన మిత్రుడు ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడుతున్నట్టు అనిపించింది.
“శివా…. నేను డిల్లీకి బయలుదేరుతూ నీకీ ఉత్తరం రాస్తున్నాను. జరిగిన విషయమంతా చెప్పాలనిపించింది.
ఢిల్లీ కెందుకు అని నువ్వు అడుగుతావ్? చెపుతాను. అకారణంగా ఎటూ వెళ్ళము కదా. అక్కడ ఉన్న ఒక ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు కావాలనుకున్న విభాగంలో అవకాశం దొరికింది.
అక్కడ కెందుకెళ్ళాలీ… అదీ ఇంత మంచి ప్రాక్టీస్ వదిలి? ఇలా అనేక ప్రశ్నలు నీ తలన తిరుగుతుంటాయి. నా వినత ప్రసవించిందా? ఎలా ఉంది? ఏ బిడ్డ కలిగాడు?…… ఇలా…
నీకు ఆ వివరణ కోసమే ఉత్తరం రాస్తున్నాను. మొదట నీ మెదడున ఉన్న ప్రశ్నలను పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చో. కూర్చున్నావు కదా. ఇహ చదువు.
కాలం చిత్రమయినది, జీవితాన సంతోషాన్ని నింపగలదు, ఎడారిగా మార్చగలదు. మన అందమయిన కలలు, వాటి వెన్నంటిన సుడిగుండాలను పట్టుకోలేము. తపస్సు చేసి దైవాన్ని పట్టుకోవచ్చు.
శివా… ఇప్పుడు వినత లేదు.”
“ఏం” అన్నాను పెద్దగా ఉత్తరం చదువుతూనే. ఎవరయినా చూసారేమోనని అటూ ఇటూ చూసాను. అలా పైకి అన్నందుకు ఆశ్చర్యము కలిగింది.
“వినత ప్రసవించే తేదీలు నాకు తెలుసు కదా. వాటి ప్రకారం వినత దగ్గరకు వెళ్లాలనిపించిది. బయలుదేరాలనే భావనతోనే ఆ తేదిన ఆసుపత్రి నుంచి ఇంటికి చేరాను. అయితే ఒక ఆపరేషన్ అటెండ్ అయ్యి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. ఆ రోజు నువ్వోస్తావేమోనని చూసాను. రాలేదు. ఇంటికి చేరాను. అన్నం తినబుద్ది కాలేదు. రెండు పండ్లు తిని ఫ్రిజ్‌లో ఉన్న మజ్జిగ తాగాను. వినత మనసులో ఉండగా పక్క ఎక్కాను. పొద్దుటే నీ దగ్గరే ఉంటాలేవోయ్ అనుకుంటూ నిద్రపోయాను. అర్ధరాత్రి దాటాక బహుశా రెండు గంటలప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ఎవరికేం అవసరమొచ్చిందేమో అని తలుపు తీశాను.
వినత. నా భార్య. నిండు చూలాలు. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఆశ్చర్యం నుంచి తేరుకుని కళ్ళు నులుముకుని మరీ చూసి “ఏమిటోయ్ ఇది, ఇలా రావచ్చా? అసలు వాళ్ళెలా పంపారు? అంటూ వెంటపెట్టుకుని లోనికి తీసుకు వచ్చాను, పక్క మీద కూర్చున్నాక “జ్యూస్ తాగుతావా?” అని అడిగాను.
వద్దంది.
నీ కోసం కాదు అని తాగించాను కడుపులోని బిడ్డని చూపి. తాగింది. తరువాత నా పక్కగా వచ్చి కూర్చుంది.
ఆరోగ్యం ఎలా ఉంది? ఒంటరిగా ఎలా రాగలిగావ్? అని కుశలమడిగి “ఇది నువ్వు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవలసిన రోజు” అని మందలించాను.
“అమ్మ రేపు వస్తుంది. నేను ఇక్కడే ప్రసవిస్తాను. అక్కడ భయంగా ఉంది” అని నా భుజం పై వాలి బాగా దగ్గరకు వచ్చి అదే ఇదీ చెప్పసాగింది.
దగ్గరకు తీసుకున్నాను. ముద్దాడాను. నా ఒళ్ళోనే కూర్చుని ఏదేదో చెపుతుంది. ఊ..కొట్టాను.
“ఇహ నిద్రపో, ఇప్పటికే బాగా స్ట్రెస్ అయ్యావు” అని జోకొడుతూ నేను నిద్రలోకి జారాను.
బాగా తెల్లవారినాక గానీ నాకు మెలకువ రాలేదు. పక్కన తను కనిపించలేదు. మంచం దిగి బాత్రూంలోకి చూసాను. పిలుస్తూ ఇల్లంతా వెతికాను. అసలు వినత వచ్చిందా? నేనేమయినా భ్రమ పడ్డానా అనే అనుమానం వచ్చింది. కానీ వినత వచ్చినట్టు ఆనవాళ్ళు ఉన్నవి. జ్యూస్ తాగిన గ్లాసు, చంప పిన్ను, మంచం పై రాలిన పూలు…… మరి తను ఏమయినట్టు.
అసలు వాళ్ళు మనుషులేనా, ఇలా నిండు చూలాలును వంటరిగా పంపవచ్చా? అని కోపం వచ్చింది. బయటకి వచ్చి వాచ్‌మాన్‌ని వాకబు చేసాను. మేమ్ సాబ్ రాత్మే నహీ ఆయేనా, సర్ అన్నాడు వినయంగా.
నాకు కాలు చేయి ఆడలేదు. వెంటనే చోటా నాగపూర్‌కి ఫోన్ కలిపాను. అటు నుంచే ఫోన్ కలిసింది.
“వెంటనే రండి, వినతకు బాగాలేదు” అని ఫోన్ పెట్టేసారు.
నేను బయలుదేరుతుండగా టెలిగ్రాం. – వినత ప్రసవించలేకున్నది, రండి. అక్కడికక్కడే కూలబడి పోయాను. తల పని చేయడం మానివేసింది. మనస్సుందే అది మనను తట్టి లేపి మన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. మానుషతనూ ఎత్తిచూపుతుంది.
వినత వచ్చింది కదా. అవును వచ్చింది. అక్కడ ప్రసవ వేదనతో ఉంది ఇక్కడికెలా రాగలదు. వచ్చి నా ఒళ్ళో పడుకుని మాట్లాడింది కదా. ఇది సాధ్యమా? తలలోని నరాలు తెగిపోతయేమో అనిపించింది. ఈ ఆలోచన అనవసరమనుకుని కార్ ఎక్కాను.
నేను వెళ్లేసరికి వినత చనిపోయి ఉంది. నాకోసం చూస్తున్నారు. దగ్గరకు వెళ్లాను. తడిమిని చూసాను. అవును ఈ వినతే రాత్రి నా దగ్గరకు వచ్చింది.
ఎలా?
రావడం మాత్రం వాస్తవం. ఒక దేహం ఇక్కడ ఉండగా సశరీరంగా మరో చోటుకు వెళ్ళే శక్తి ప్రేతాత్మలకు ఉందా? నాకసలు ఇలాంటివంటే బొత్తిగా నమ్మకం లేదు. నేను చదివిన సైన్సు ఈ భావనలను ఒప్పుకోదు. పైగా దీనినొక జబ్బు కింద నిర్ధారిస్తుంది.
అయినా వినత నా దగ్గరకు రావడం నూరుపాళ్ళు నిజం.
శివా..! నీకేమయినా అర్థమవుతుందా? రాత్రి వినత నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి ఇక్కడే ప్రసవిస్తానని చెప్పి నా ఒళ్ళో పడుకుని నిద్రపోయిందయ్యా. ఈ మాటే మా మామతో అంటే పిచ్చివెధవను చూసినట్టు చూసాడు. వినత పై పడి ఏడ్చాను. ఇది తీరేది కాదు. దిగమింగుదామన్నా ఆగదు.
వారం దినాలు గడిచాక చాలామంది మేధావులతో, విజ్ఞానవేత్తలతో జరిగిన విషయంపై సంప్రదించాను. గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు తిరగేశాను.
కొందరు అలవి మాలిన ప్రేమ వలన, ధ్యాస వదలకుండా వుండటం వల్ల ఇలాంటి భ్రమలు కలగవచ్చునన్నారు. కొందరు ఆలోచనలో పడ్డారు.
ఒక్కడు మాత్రం చనిపోయిన ఫ్రాయిడ్‌ను కలువు అన్నాడు తిక్కగా.
ఎవరు నమ్మినా నమ్మకున్నా నా అనుభవం ఉందిగా అది చాలు నా అన్వేషణకు.
వ్యక్తిత్వం అంటే తన ప్రత్యేకతను తెలుసుకోనటం-నిలుపుకోవటం. లక్ష్మణున్ని అడవికి రమ్మని రాముడు కోరలేదు. పెద్దలు కనీసం సూచించలేదు. అయినా సర్వ సౌఖ్యాలను త్యజించి అన్న మీద గౌరవ మన్ననలతో వెంట వెళ్ళాడు. తనకు రాజ్యం దక్కినా పాలనను వదులుకున్నాడు భరతుడు. శిబి తన శరీరాన్ని కోసిచ్చాడు. ఇలా ఎందరికి సాధ్యం. జీవిత గమనాన ఈ క్షణాన దక్కిన సౌఖ్యం అది తీరుతుంటేనే గతంగా మిగులుతుంటది.
దీనికి నేను సమాధానం తెలుసుకుంటాను. నాకా నమ్మకం ఉంది. చిన్ననాటి ఘటన ఒకటి నాకు గుర్తు. మా ఊళ్ళో ఒక ఆయుర్వేద వైద్యుడుండే వాడు. దయ్యం భూతం శక్తి చాతబడి బాధితులంతా అక్కడికి వచ్చేవారు. ఏవేవో చేసేవాడు. తంత్రం, యంత్రం క్రతువు వగైరాలతో నయమయిందనిపించి బయటకు పంపేవాడు. ఆ రోజుల్లో అతగాడంటే చాలా భయము గౌరము రెండూ ఉండేవి. మరిప్పుడు…
ఈ విజ్ఞానంపై అవగాహన కలిగాక కూడా భూత ప్రేతాలను గౌరవించగలమంటావా? కానీ వినత లాంటి వారి వల్ల కలిగిన అనుభవాలని చూసిన తరువాత వాళ్లకు ఉన్న జ్ఞానం కూడా అర్థవంతమయినదేమో అనిపించకపోదు.
నిజానికి మా ఊళ్ళోని భూత వైద్యుడే నాకు చదువు చెప్పాడు. ఆ చనువుతో భయంగానే ఒక నాడు అడిగాను. దెయ్యాలంటున్నారు అవి అసలు ఉన్నాయా? ఉంటే వాటిని మనం గుర్తించగలమా? అవి మనుషులని ఆవహించి ఉన్నప్పుడు దాన్ని కనిపెట్టి మీరు పారద్రోలగలరని అంటుంటారు ఇది నిజమా? అని.
నా ప్రశ్నను ఆసక్తిగా విన్నాడు. ‘రా’ అని లోనికి తీసుకెళ్ళాడు. బాసంపట్లు వేసుకుని కూర్చుని నన్ను ఎదురుగా కూర్చోమన్నాడు. కూర్చున్నాను. ఒక్క క్షణం కళ్ళు గట్టిగా మూసుకుని మళ్ళా కళ్ళు తెరిచి – మరణం అనేది ఎవ్వరి చేతిలోనిది కాదు. సృష్టి నిర్ణయం మాత్రమే. ప్రకృతి సిద్ధమయిన క్రతువులో జనన మరణాలు ఓ భాగం. అయితే అకాల మరణాలు కొన్ని జరుగుతుంటాయి, అలాంటివి ప్రకృతి నిర్దేశికతకు బిన్నమయినవని కొందరి అభిప్రాయం.
ఎందుకూ అని నన్ను ప్రశ్నించవద్దు. నా వద్ద ఇంతకూ మించి సమాధానం లేదు. తెలియదు కూడా.
మగవానిగా ప్రకృతి అందమయినదా? స్త్రీనా? అంటే వెంటనే చెప్పలేము. వివిధ రంగుల సమ్మేళనంతో గీసిన చిత్రం మనోజ్ఞంగా అనిపిస్తుంది. అలాగే ప్రకృతి. ఆ వర్ణాల విన్యాసపు ఆనంద పారవశ్యమే బ్రతుకు. అయితే అకాల మరణాన శరీరాన్ని విడిచిన జీవికి తిరిగి దేహప్రవేశం దొరకాలి గదా. (ప్రకృతంత అందమయిన శరీరమయినా) అలాంటిది దొరకదు. మరో దేహాన ప్రవేశించే అనుమతి దొరికే వరకు ఆగాలి. ఇక్కడనే సంచరిస్తూ ఉంటుంది. వీటికి వదిలిన దేహపు అనుభూతులు తప్ప వేరే ఏమీ ఉండదు. ఆ అనుభూతులతోనే పరిసరాలలోని వారిని ఆవహిస్తుంటూ ఉంటవి. అలాంటి సందర్భాన్ని మనం భూతం ఆవహించింది అంటాం. వీటికి తత్కాలికపు ‘రూపు’నేర్పాటు చేసుకునే సామర్థ్యం ఉండొచ్చు లేకపోవచ్చు. అయితే జీవి శరీర ప్రవేశం జరిగాక కోర్కెల పుట్టగా మిగులుతది. దాన్నందుకునేందుకు ప్రారంభించిన పరుగు మరణంతోనే ముగిసేది. కోర్కెలు తీరిన జీవులతో బాధలుండవు. తీరని వాటితోనే. అయితే ఇలాంటి మరణాలలోనూ చాలా చిత్రాలు జరుగుతవి. వాటితోనే చరిస్తుంటాడు మరో ప్రవేశం దొరికిందాకా. అలా తిరుగుతుండటమే వీటి పని. ఆ తిరుగులాటలో ఒక్కోసారి ఒక్కొక్కరిని ఆవహిస్తూ ఉంటవి. దయ్యం పట్టిందని అంటుండగా వింటాం, కానీ నమ్మము. కాకపొతే అవి అట్టేకాలం ఒక చోటే ఉండవు, వాటికి కావలసిన మార్గాల్లో వెళ్ళిపోతుంటయి అని ఆగాడు. ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏంటో కొంత నిజముందని అనిపించింది.
అదే సబ్జెక్ట్‌ను చదవాలని ఉంది. చదువుతాను. అప్పుడు మాత్రమే నాకు శాంతి.
శివా… నేను ఆ చివరి నాటి రాత్రి వినతతో గడిపిన క్షణాలను మరవలేకపోతున్నాను. నావెంట నడిచింది. వదిన ఒదిగి పడుకుంది. పలుకరించి ముద్దాడింది. నేను జ్యూసు చేస్తుంటే సాయం చేసింది. తాగింది. నా తల నిమురుతూ నాపై సాగిల పడింది. ఆవిడ పెదాలపై ముద్దిస్తే ఆనందంగా స్వీకరించింది. కబుర్లు కూడా చెప్పిందయ్యా. ఇది అబద్దం ఎలా అవుతుంది. ఆ ఉదయం నేను వినతను వెతుకులాడినపుడు పక్కపైన రాలిన మల్లెలున్నాయి. ఆవిడ నుదిటి బొట్టు నా పెదాలకంటి కనిపించింది. కానీ దీనినెవరూ నమ్మడం లేదు. కొన్ని నిజాలని చాలామంది నమ్మలేరు. ఏం చేయగలం.
శివా… ఇప్పుడు నా వినత లేదు. స్నేహితుడివి నువ్వేమో దూరంగా ఉన్నావు. నువ్వొచ్చేటప్పుడు కనిపించలేదు. నేనిప్పుడు నీలాగే ఒంటరిని. ఒంటరితనం అంత మంచిది కాదు. లోకావలోకనం తెలిసాక ఇది చాలా నష్టం, అప్పుడప్పుడూ అనేక రకాల ఊహాలు నన్ను గజిబిజి చేస్తున్నాయి. త్వరలో కలుస్తాను. దిగువన అడ్రెస్స్ ఇస్తున్నాను. ఉత్తరం రాయి. ఉంటాను. —- దేశ్ పాండే.
నాకసలు ఇలాంటి వ్యక్తులతో పరిచయం ఎందుకవుతుందో అర్థం కాలేదు. పాండే దంపతులను చూసి ఎంత ముచ్చట పడ్డానో. చూడ చక్కని జంట. కానీ, వినత చనిపోయింది. ఈ మాటను ఎంత ఇదిగా జీర్ణం చేసుకుందామన్నా కావడం లేదు. వినత చనిపోయిందన్నది నూరుపాళ్ళు నిజం. ‘భయ్యా’ అని నోరారా పిలిచే చెల్లి ఇప్పుడు లేదు. చివరి చూపు చూసే అదృష్టం కూడా నాకు కలగలేదు. కానీ నా కళ్ళల్లో ఎప్పుడు సజీవం గానే ఉంటుంది. డాక్టర్ లాంటి వ్యక్తి మళ్ళా దొరుకుతాడా? అతనూ దూరం వెళ్ళిపోయాడు. ఎప్పుడు కలుస్తాడో ఏమో? రాజేష్ తండ్రి ఒక మనసున్న వాని చేతిలో బలి అయ్యాడు. దగ్గరవబోయిన హైదరాబాద్ సుమతిని ఇక చూడలేనమా? ఆంజనేయులు… కాదు. ఆ పూట చెప్పలేంత దుఃఖం కలిగింది. దిండు గలీబుకు మొహం ఆనించి ఏడ్చాను. ఆ ఏడుపులోనే నిద్ర.
నిద్ర లేచేసరికి తల బారం చాలా వరకు తగ్గిందని అనిపించింది. చల్లని నీళ్ళతో మొహం కడుక్కుని కుదురుగా కూర్చుని డాక్టర్ గారికి సమాదానం రాసాను.
“డాక్టర్…! జరగరానిది జరిగింది. అకాల వర్షం, ఉరుములూ మెరుపులూ పైగా ఈదర గాలి, దాని చెడు అది చేయంది పోదు. చెరగని చెదరని జ్ఞాపకాలు నన్ను వదలవు. సజావుగా ఉండనివ్వవు. మనం ఏదో చేయాలనే సంకల్పంతో పరిగెత్తగలమే తప్ప ఫలితం మన చేతలేదు కదా. నిమిత్త మాత్రులం. కర్మవాదం తలన ఉంది కనుక క్రియావాదులుగా బ్రతుకుతున్నాం.
అసలీ సంఘటన ఏమిటి? దీని మూలమెక్కడ? ఎందుకు జరిగింది అని నువ్వుగా పూనుకుంటే సమాధానం దొరుకుతుందేమో? వినత లేదని తెలిసినాక ఏడవకుండా ఉండలేకపోయాను. నా గుండె నిలువునా చీలింది. నీ దగ్గరకు పరుగున వచ్చి నీ కష్టాలలో పాలుపంచుకోవాలని అనిపించింది. మనసంతా చిద్రమయ్యింది.
డాక్టర్ లోగడ చక్రవర్తి అనే డాక్టర్‌తో పరిచయం ఉంది. తరువాత స్నేహితులమయ్యాము. ఉన్న ప్రాక్టీస్‌ను వదలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాడు. నాలుగు సంవత్సరాల తరువాత వచ్చి మా దగ్గర ఆసుపత్రి పెట్టాడు. అనతి కాలంలోనే గొప్ప సర్జన్‌గా పేరు సంపాదించాడు. అలాంటి చక్రవర్తి భార్యకు కడుపునెప్పి వస్తే తనుగా ఏమి చేయలేక పోయాడు. ప్రమాద స్థితిన మరో డాక్టర్‌ను తీసుకుని రావలసి వచ్చింది. తన అనే భావన అతనినలా చేసింది.
డాక్టర్ ఈ సువిశాల ప్రపంచంలో ప్రతీ మనిషి ఏకాకే. ఇక్కడకు వచ్చి లోకాన్ని చూసి నేర్చుకునేప్పుడు అర్థమవుతున్నప్పుడు మనని ఆలించి పాలించే శక్తి మనకర్థం కాకుండా ఉందని మనకర్థం అవుతూ ఉంటుంది. ప్రకృతి పైన సైన్స్ ఎంత విజయాన్ని సాధించినా మనకున్న అంతరపు దూరం తగ్గడం లేదనిపిస్తుంది. కనుక తెలుసుకునే ప్రయత్నాన పయనించడమే మన పని.
వినత నిన్ను కలిసింది అన్న విషయం నేను నమ్మగలను. నాకు తెలిసిన మేర మిమ్మల్ని పెనవేసుకున్న అనుబంధానికి ఈ కలయిక అసాధ్యం కాదు. జరిగిందేదో జరిగింది. తిరిగి రానిదది. మనసుని నిబ్బరపరుచుకో…”
– శివుడు.
వెంటనే పోస్ట్ చేసాను.
***
స్కూల్‌కి వెళ్ళాను. లేట్ అయింది. కరెస్పాండెంట్ మందలించాడు కూడా. భరించాల్సి వచ్చింది. ఆ చికాకులో క్లాస్ సరిగ్గా తీసుకోలేకపోయాను. విరామ సమయంలో రాణి కనిపిస్తే పలకరించాను. ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పింది.
“రాజేష్ అలా చేయమన్నాడా?” అని అడిగాను.
‘అవును కాదు’ అనకుండా నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ ఆదివారం మాతుంగా వద్ద రాజేష్ కనిపించాడు. తన తండ్రి కాబోతున్నట్లు చెప్పాడు. రాణి తన తల్లి మెప్పు సంపాదించిందని సంతోషం వ్యక్తం చేసాడు. నాకు బాగా అనిపించింది. కాంటీన్‌కి వెళ్ళి కాఫీ తాగి సెలవు తీసుకున్నాను.
మా స్కూల్‌కు రాణి స్థానంలో సుజాత అనే అమ్మాయి వచ్చింది. అవి కట్టు బొట్టు పద్ధతి గమనిస్తే ఉద్యోగం కాలక్షేపానికి చేస్తున్నట్లు అనిపించింది.
ఆ మరునాడు శాలిని నాదకరిని అనే టీచరు సుజాతను నాకు పరిచయం చేసింది. వాళ్ళ నాన్నగారు బాటా కంపనీలో పెద్ద ఉద్యోగట. సుజాత జీతం తీసుకోకుండానే పని చేస్తుందట. మాట్లాడుతూ కాంపౌండ్ దాటాను. శాలిని ఎవ్వరినో విష్ చేస్తూ మమ్మల్ని వదిలి వెళ్ళింది.
సుజాతతో, ‘మీరెటు వెళతారని’ అడిగాను నడుస్తూ.
‘దాదర్ ఏరియాలో మాకు సొంత ఇల్లు ఉంది’ అంది.
‘స్టార్ ఆఫ్ కొచ్చిన్ లాడ్జ్ మీకు తెలుసనుకుంటాను’ అనగానే
‘మా ఇంటికి చాలా దగ్గర’ అంది.
‘నేనక్కడే ఉంటున్నాను, బస్ ఎక్కుదామా? ట్రామా’ అని అడిగాను.
‘వేరే పని లేకుంటే నడుద్దాం’ అంది నవ్వుతూ.
ఈసారి ఆశ్చర్యంగా ఆవిడను చూడాల్సి వచ్చింది. తల ఊపి నడిచాను. కొంత దూరం నడిచాక ఆగి ఒక కాఫీ తాగి బయలుదేరాము.
‘నీకి ఉద్యోగం ఏమిటి? పెళ్ళాడి ఏదయినా దూరదేశాలు వెళ్లక?’
‘ఇప్పుడేం పెళ్లి’ అంది ప్రశాంతంగా.
‘కారణం తెలుసుకోవచ్చునా?’
మాట్లాడక నవ్వింది. ఆ నవ్వులో సమాధానం లేదు.
‘ఇంకా చదువుకోవాలనుందా?’
‘నో. ఏం చదువులివి? ఇప్పటికీ చదివిందే ఎక్కువ.’
‘మరి?’
నవ్వింది. అమ్మో అంత త్వరగా అంతు చిక్కే మనిషి కాదనిపించింది.
ఆగి… ‘ఇదే మా ఇల్లు’ అని చూపి లోనకు నడిచింది. నేను అనుసరించాను.
ఇల్లు మంచి లొకాలిటీ లోనే ఉంది. ఇల్లు చాలా పెద్దది. ముందు గార్డెనూ ఉంది. హాలు… ఐదారు ఎటాచ్డ్ గదులూ ఉన్నాయి. అవుట్ హవుసూ ఉంది. ఇల్లు చూస్తూ ఉంటే కాఫీ ఇచ్చింది. తాగి బయటపడ్డాను.
లాడ్జ్‌కి చేరేసరికి రాజేంద్ర కనిపించాడు. సిగరెట్ వెలిగించి రింగులు వదులుతూ వాటితో ఆడుకుంటున్నాడు.
మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించింది.
‘ఏమయినా విశేషమా?’ అడిగాను.
‘సశేషంగా ఉండాలది. దేని చివరా మనకి వెంటనే తెలియకూడదు.’
‘మంచిది.’
‘శివా… నా విషయం చెప్పేది కాదు. చూసేది’ అన్నాడు.
ఏమిటో అన్నటు చూసాను.
‘స్నానం పూర్తిచేసి రా’ – తరువాత చెపుతాను అన్నాడు.
పది నిముషాల్లో తయారయి వచ్చాను.
‘ఇక పద’ అని బస్ స్టాప్‌కి లాక్కేళ్ళాడు. బస్ ఎక్కాము. సీట్లు దొరక్క ఓ అమ్మాయి పక్కన కూర్చోవలసి వచ్చింది. జాగ్రత్తగా కూర్చున్నాను. అరగంట ప్రయాణించిన తరువాత గ్రాంట్ రోడ్ వచ్చింది. దిగమన్నాడు. దిగాను. చీకటి పడింది. లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నేను చూసిన ప్రదేశం కాదు కనుక అంతా కొత్తగా ఉంది, నిజంగా నేను బొంబాయిన చూడని ప్రాంతమే ఎక్కువ.
‘రా’ అని నన్ను గుంజుకుంటూ నడిచాడు. మెయిన్ బజార్ వెనక రెండవ సందుకు తీసుకెళ్ళాడు. షాపింగ్ చేసేందుకు అక్కడ దుకాణాలేవి కనిపించలేదు. వీధికిరువైపులా చిన్న చిన్న గదులు కనిపించినాయి. ఒక్కో చోట పైకి వెళ్లేందుకు మెట్లు, ఆ గదుల ముందు అలకరించుకున్న ఆడవాళ్ళు, రకరకాలుగా మాట్లాడుకుంటూ వీధిలో తిరిగే వారిని చూస్తూ పిలుస్తూ సైగలు చేస్తూ కనిపించారు. కొందరు మాత్రం ఏదో చదువుతున్నట్టు వారపత్రికలు తిరగేస్తున్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ వారిలో కొందరి దగ్గరకు నడిచి వారి దగ్గరున్న నోటు పుస్తకాన్ని అడిగి చూసి మళ్ళీ వాళ్లకిచ్చి వెళుతూ కనిపించాడు.
‘పోలీస్ ఇక్కడ ఏం చేస్తున్నాడు’ అడిగాను రాజేంద్రను వెంట నడుస్తూ.
‘చెప్తాను. ఇప్పుడు మనమున్నది స్వర్గానికి ముందు ద్వారం వద్ద. ఇక్కడ ఉన్న అప్సరసలకు మనలాంటి వాళ్ళను అలరించడమే పని. అలా అలరించేందుకు ఇక్కడి ప్రభుత్వం వారు ఇచ్చిన అనుమతి పత్రం అనుకుంటాను’. నాకు సరిగ్గా అర్థం కాలేదు. రాజేంద్ర వేగం చూస్తే నాకు తెలిసేలా చెప్పే పరిస్థితి కనిపించలేదు. కనుక ఆ ప్రశ్న నాలోనే ఆపుకున్నాను. అక్కడ నుంచి ఒక టర్న్ తీసుకుని కొంచెం పెద్ద వీధికెళ్ళాము. అక్కడా ఇదే వాతావరణం. కాకపోతే ఇక గదుల ముందు అభిసారికలు లేరు. అక్కడక్కడా మూడో జండర్ మొగవారు మాత్రం కనిపించారు. ఒక్కో చోట మాత్రం సూటువాలాలు నీటుగా వినయంగా కనిపించారు. మేము అలా నడుస్తుండగానే ఒక సూటువాలా వినయంగా మా ముందుకు వచ్చి మీరు ఇక్కడ కూడా ఒకసారి చూసి వెళ్ళండి అన్నాడు. మంచి ఇంగ్లీష్.
రాజేంద్ర ఆగి ఒక్క క్షణం ఆలోచించి ‘పద’ అన్నాడు. అతని వెంట నడుస్తూ నన్ను రమ్మన్నాడు. నాకు పరిస్థితి కొంత అర్ధమయ్యింది. ఇక్కడికని తెలిస్తే నేను వచ్చేవాడిని కాదు. అసలితను ఇలా తీసుకువస్తాడని ఊహించలేదు.
మేడ మెట్లెక్కాము. విశాలమయిన ఒక గదిలోనికి తీసుకెళ్ళాడు. సోఫా సెట్లతో నీట్‌గా ఉంది. దాని ముందున్న మూడు రంగుల గులాబీలు పెట్టిన గ్లాసులున్నవి. అగరబత్తీల వాసన మత్తెక్కిస్తుంది. ఎదుట గోడకు నగ్న సుందరీమణుల ఫోటోలు నాలుగైదు వేళ్ళాడుతూ కనిపించినవి. మమ్మలి అక్కడ కూర్చోబెట్టి సూట్‌వాలా లోనకెళ్ళాడు.
అసలు రాజేంద్ర ట్రాము దిగినప్పటినుంచి మాటాడింది నాకు అర్థం కాలేదు.
‘బావుంది కదూ’ అన్నాడు రాజేంద్ర అకస్మాత్తుగా.
‘బాగున్నదేమిటి?’ అన్నాను అతన్నే చిత్రంగా చూస్తూ.
‘చూద్దువు కానీ’ అన్నాడు అలవోకగా నవ్వుతూ.
‘చూసేదాకా ఎందుకు అర్దంవుతూనే ఉంది’ అన్నాను కోపంగా.
‘మరీ మంచిది’ అని నవ్వాడు. ఆ నవ్వు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది.
అసహనం అనిపించి లేచాను హటాత్తుగా.
ఇంతలో సూట్‌వాలా కూల్‌డ్రింక్స్ తీసుకుని వచ్చాడు. కూర్చున్నాను. డ్రింక్స్ తీసుకుని తాగుతుండగా నలుగురు అమ్మాయిలు మా ముందుకు వచ్చారు. నలుగురిలో ఒకావిడ ఆంగ్లో ఇండియన్. నలుగురిని కళ్ళతోనే కొరుక్కుని తినేసేలా చూస్తున్నాడు రాజేంద్ర. న్యాయానికి నలుగురూ చిన్న వయసు వారే. నీటుగా ఉన్నారు. సాద్యమయినంతగా తమ అందాల్ని నడుస్తూనే ఆరేసారు.
రాజేంద్ర చేతనున్న డ్రింక్ టేబుల్ పై పెట్టి వారివైపు నడిచాడు. నాకు లేవాలని కూడా అనిపించలేదు. ఇతను మాత్రం ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఆగి ఆమె భుజం పై చేయివేసి ఎదురుకు తిప్పుకుని ఇవతలకు జరిపి రెండో అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. ఇలా నలుగురిని టచ్ చేసి ఒకరిద్దరిని ముద్దెట్టుకునేలా ప్రవర్తించి ‘ఫిర్ మిలేంగే’ అని గబగబా కిందికి దిగాడు. వెంట భయం భయంగా నేను దిగాను.
ఇలా రెండు చోట్లకు వెళ్ళాక “నేనిక రాను, ఇహ ఎప్పుడూ పొరపాటున కూడా ఇలాటి చోటుకు నన్ను రమ్మనకు” అని గబగబా నడిచాను.
వెంటపడి పిలిచాడు.
నేనాగలేదు.
నేను లాడ్జ్‌కి వచ్చాక నిద్ర సరిగా పట్టలేదు. ఇంటిపైకి ద్యాస మళ్ళింది. నాన్న తమ్ముడూ గుర్తులోకొచ్చారు. మనసెలాగో అయ్యింది.
అసలు ఎందుకిలా నేను బయలుదేరినట్టు అనిపించింది.
కానీ అది చాలాసేపు నిలవలేదు. రాజేంద్ర పై అసహనం వదలలేదు. అది తలలో మెదిలి సిగ్గనిపించింది.
సంస్కారమూ పెరగక మంచీ పెరగక అన్ని భావాలు లోపించి అసలు పెరుగుతున్న దేమిటీ నాగరికతన?
మంచికి మచ్చలా అనిపించింది.
హ్యూమన్ ఫ్లెష్ ఫర్ సెల్ అన్న ఒక్క బోర్డు మినహా. దీనికి లైసెన్సులిచ్చి ప్రభుత్వాలు చేయూతనివ్వడం, వీరివలన ప్రజల ఆరోగ్యానికి హాని జరగదు అన్న సర్టిఫికేట్. ఎంత అపహాస్యపు స్థితి.
సిగ్గుపడని స్థితి నుంచి సిగ్గును విడిచేసిన స్థితికి మనం దిగజారాం.
(సశేషం)