[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]
[dropcap]ఆ[/dropcap] రాత్రి బేబీ మంజు చికాకు చేస్తుంటే పిల్లను వెంటేసుకుని సినిమాకి వెళ్లాను. విరామమప్పుడు ఏదయినా కొనిద్దామని బయటకు వచ్చాను. కొనుక్కుని లోనికి వెళ్లి నా సీట్‌న కూర్చుంటూ… యథాలాపంగా రిజర్వుడ్ సీట్ వైపు చూశాను. జయమాల కనిపించింది. హఠాత్తుగా నిలబడి అవునా కాదా? అని కళ్ళు చికిలించి చూసాను. అవును జయమాలే. ఆవిడ పక్క సీట్లో ఎవరో వృద్ధుడు కూర్చుని కనిపించాడు. ఆవిడతో వచ్చినతనో కాదో తెలియదు. తెచ్చిన తినుబండారాలు మంజు కిచ్చి వెనక్కు కదిలాను. పిలవాలనిపించింది. చేరువకు పరిగెత్తి పలకరించాలనిపించింది. ఇంతలో లైట్లు మలిగినవి. ఇక ఏమి చేయలేకపోయాను. వచ్చి మంజు పక్కన చతికల పడ్డాను.
జయమాలను ఎలాగయినా కలవాలి అన్న భావన నన్ను సరిగా సినిమా చూడనివ్వలేదు. సినిమా ఇక పూర్తవుతుందనగా గేట్ దగ్గరకు వెళ్లి కాపేసాను. నన్ను గమనించ లేదట్టుంది, నా ఎదురుగా వస్తూ కనిపించింది. నేను కనిపించగానే రెప్పవాల్చక నన్ను ఒక క్షణం చూసింది. అక్కడే ఆగింది. వెనక ఉన్న వాళ్ళు అసహనంగా రాసుకుని వెళ్తున్నా కదలలేదు. నేను దగ్గరకు నడిచి ‘శివుడిని జయమాలా’ అన్నాను. ఎందుకన్నానో తెలియదు. నవ్వి రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. ఆవిడతో ఎవ్వరూ కనిపించలేదు. ఒంటరిగానే సినిమాకి వచ్చినట్టుంది. నేను కిందికి నడిచాను. నా చిటికెన వేలు పట్టుకుని మంజు నా వెంట వస్తున్నది. ఆ వెనుక జయమాల, ముగ్గురం నడుస్తూనే నా బస దాకా వెళ్ళాము. నేనిక్కడే ఉంటున్నానని చెప్పాను. మంజుని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను.
“నీ కోసం బాగా ఎదురు చూసాను. చాతనయినంత వెతికాను. నా గుర్తునుంచి కదలడం లేదు” అన్నాను నవ్వుతూ.
ఆశ్చర్యంగా చూసింది.
“ఇక వెళతాను” అంది.
“ఎప్పుడు కలుద్దాం” అడిగాను.
’నేనిక్కడికి దగ్గరలోనే ఉంటున్నాను. మీరు నేనుండే చోటికి ఎప్పుడయినా రావచ్చు. ఓపిక ఉంటే ఇప్పుడు నాతో రండి. బస చూసి వద్దురు కానీ” అంది. నిజమేనా అన్నట్టు చూసాను. తెలుసుకోవడం మంచిదే అని బయలుదేరాను.
ఓ దేవత వెంట నడిచి వెళుతున్నట్టు వెనకాలే వెళ్ళాను. దాదాపు కిలోమీటరు నడిచాక మెయిన్ రోడ్ నుంచి కిందకి దిగి మొదట మలుపు వరకూ మళ్ళింది. ఆ మలుపు చివరనున్న బంగాళా ముందు ఆపింది. దాని పక్కనే రెండు గదుల పోర్షన్. అక్కడ ఆగి తలుపు తాళం తీసింది. లోనకెళ్ళి ఉన్న నాలుగు కిటికీలను బార్లా తెరిచి రమ్మన్నది. నేను గదిలోకి అడుగు పెడుతుండగానే రెండు లైట్లు వెలిగినవి. గది పెద్దదే. ఆర్ట్ గాలరీలా అనిపించింది. ఎక్కడ ఏ వస్తువుంటే అందంగా ఉంటుందో అక్కడ అలా అమరి ఉన్నది. బుద్ధ భగవానుడు తపోనిద్రన కనిపించాడు. దానికెదురుగా వివేకానంద, ఆ ప్రేం పైన రామకృష్ణ పరమహంస, మధ్య నున్న టేబుల్ ఎదురుగా బాపూజీ పాలరాతి ప్రతిమ, ఇహ గోడలకు ప్రఖ్యాతమయిన చిత్రకారుల చిత్రాలు, చరిత్రకారుల సంస్కర్తల స్కెచ్‌లు, నిల్చున్న వాణ్ణి చుట్టూరా చూస్తూ పోయాను. కనురెప్పలు మాత్రం పూర్తయిన దాకా వేయలేదు. చివరన ఓషో.
అంతటి ఆనంద ఝరి! ఇంతలో నా చేతిని మరో మృదువైన చేయి పట్టుకుంది. ఈ లోకంలోకొచ్చి అటుగా చూసాను.
జయమాల.
నిజంగా జయ అమృతమూర్తిలా అనిపించిందా క్షణాన.
నా చేతిని వదలక ఓ అడుగు ముందుకు కదిలి “నన్ను పూర్తిగా మన్నించావన్న మాట” అంది.
“నీ ఉత్తరం చదివాక నువ్వేమిటో అద్దంలా అర్థమయ్యింది” అన్నాను.
సంతోషంగా నవ్వింది.
“నేను ఆనందపడే అవకాశం కూడా ఇచ్చావు.”
నా చేయి వదిలి లోనికి వెళ్ళింది. తిరిగి నా దృష్టి గోడల పైకి వెళ్ళింది. ఐదు నిముషాల తరువాత బిస్కెట్, టీతో బయటకు వచ్చింది, దగ్గరగా జరిగి జయమాల చేతిలో అలా ఉంచే తినేసాను. తింటూ ఒకసారి దగ్గరగా చూసాను. నా వైపే ఆసక్తిగా చూస్తూ కనిపించింది. సాదా సీదాగా కనిపించినా కుంచెకు అందని అందం జయమాలది. మిగిలిలినవి తింటుంటే లోనికి వెళ్ళింది. తిరిగి వచ్చాక అడిగాను.
“నాలో నీకు కనిపించిన ప్రత్యేకత ఏమిటని?”
మాటాడలేదు, నన్ను చూస్తూ నిలుచుంది.
’నీ మనస్సుపై అంత ముద్ర వేయగలిగానా? అన్నది నమ్మలేకున్నాను.”
“సహజంగా ఒక్కొక్కరిని చూస్తే ప్రసన్నంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూస్తే కనీసం మాట్లాడాలని కూడా అనిపించదు. ఎందుకో అర్థమూ కాదు” అన్నాను.
బొమ్మలని చూస్తుంటే ప్రాణానికి హాయిగా అనిపించింది. లోనికి వెళ్లిన జయమాల డ్రెస్ మార్చుకుని వచ్చింది. నైట్ డ్రెస్‌లో ఉన్న ఆ పిల్లను అలాగే చూస్తుండి పోయాను. మనిషి అంత సాదాసీదాగా ఉండి దగ్గరకు వస్తుంటే జయ కళ్ళను అట్టాగే చూడాల్సిందే. ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. మాటాడక కూర్చున్న ఆమెను మౌనాన్ని భంగం చేస్తూ “జయమాలా” అని పిలిచాను.
‘ఆ…’ అంది.
“నువ్వు వంటరిగా ఉంటున్నావా?”
తల ఊపినది. నాలుగైదు నిముషాలు కూర్చుని ‘ఇహ నేను వెళతాన’ని లేచాను. నా చేతిని పట్టుకుని వదలలేదు.
“నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా” అంది. ఎందుకలా అందో తెలియలేదు.
“చూస్తాను.”
నేను మలుపు తిరిగేదాకా నన్నే చూడటం గమనించాను.
నా గదికి వచ్చే సరికి మూడు గంటలైంది. పడుకున్నాను. సూర్యోదయం తరువాత గాని మెలకువ రాలేదు. కిందికెళ్ళి కాఫీ తాగొచ్చి మళ్ళీ పడుకున్నాను. మధ్యాన్నం తరువాత మెలకువ వచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని కిందికి వచ్చి స్టూడియో దిశగా వెళ్లాను.
స్టూడియోలో పాచ్ వర్క్ త్వరగానే పూర్తయ్యింది. పొద్దుటే ఆర్య మిల్క్ కాలనీలో అవుట్ డోర్ ఉంది, రమ్మన్నాడు రాము. తల ఊపాను. వాళ్ళ టైం ప్రకారం స్టూడియోకి వెళ్లాను. అంతా కలిసి స్పాట్‌కి వెళ్ళాం.
యూనిట్ మొత్తం యాభై మంది దాకా ఉన్నారు. ముప్పై మంది దాకా ఆడామగా డాన్సర్‌లు మేకప్ తోనే వద్చారు. స్పాట్‌కి చేరుకున్నాక మ్యూజిక్ ట్రాక్ వేసి డాన్స్ డైరెక్టరు డాన్సర్లకు భంగిమలు చూపాడు. వన్, టూ.. త్రీ… ఫోర్ అంటూ పాటకనుగుణంగా అభినయించి చూపుతూ వాళ్ళతో రిహార్సల్స్ చేయించాడు. పైనల్ రిహార్సల్ పూర్తయ్యే వరకు ఒక గంట పట్టింది. ఇద్దరు పిల్లలు తప్ప అంతా బాగానే చేశారు. వారిని కేకలేసి బయట నిలబెట్టాడు.
ఓ పిల్ల గిరగిరా తిరిగేడప్పుడు కాలు మెలితిరిగి పడిపోయింది. ఆవిడను బయటే ఉంచి షూటింగ్ పూర్తి చేసాడు. ఇంతలో హీరోయిన్ వచ్చింది. ఆవిడ క్లోజప్‌లు వివిధ రకాలుగా తీసుకున్నారు. డాన్సర్లను కూడా లాంగ్ షాట్‌లో నాలుగైదు మూమెంట్లు తీసి అయ్యిందనిపించాడు.
పాకప్ అని డైరెక్షన్ వాళ్ళు కేకేశారు. మావాళ్ళంతా పాక్ అవుతుంటే కొందరు కొత్తగా డాన్సుల్లోకి వచ్చిన సింధీ పిల్లతో బాతాకానీలో పడ్డారు. కాలు మెలితిరిగి పడ్డ పిల్లను చూసిన వాళ్ళు లేరు. బెణికిన దగ్గర రుద్దుకుంటూ కూర్చుంది. అటు వెళ్లి ఆవిడ దగ్గర ఆగాను. “అరె కాలు వాచినట్టుంది” అని అక్కడే కూర్చుని కాలు సదిరాను. నన్ను పేడపురుగును చూసినట్టు చూసింది.
“షూటింగ్‌కి కొత్తా? ఎందుకంత వేగంగా తిరిగావు?” అని అడిగాను కాలు సర్దుతూ.
“వాళ్ళు చెప్పినట్టు చేసేందుకే కదా వచ్చింది” అంది.
“కిందపడేలా తిరగామన్నాడా..? కొజ్జా వెధవ” అన్నాను కసిగా, వాపు పై సర్దుతుంటే సమ్మగా ఉన్నట్టుండి వారించలేదు.
ఆనక ‘ఇక చాలు వెళదా’మంది తనే. నా పై చీమకాలంత సద్భావన కలిగినట్టుంది. నవ్వుకున్నాను, అది కలగడం ఇక్కడ చాలా కష్టం.
లేచి ఆ పిల్లకు సాయంగా ఉంటూ నడిచాను. యూనిట్ వాళ్ళంతా వాన్ దగ్గరకు వస్తూ కనిపించారు. నడుస్తుంటే బాగా నొప్పి కలిగినట్టుంది, నా భుజం ఆసరా తీసుకుని నెమ్మదిగా నడిచింది. నడుస్తూనే కళ్ళు తుడుచుకుంటూ “మా అమ్మ జబ్బు మనిషి. ఒక్క తమ్ముడుంటే ఏటో పారిపోయాడు. అమ్మకు డబల్ రొట్టె, మందులూ తీసుకెళ్ళాలి. ఇవాళ పేమెంట్ ఇవ్వరట! రేపింకా హీరోయిన్‌తో డాన్స్ మిగిలి ఉంది కదా…” అని చెపుతుంటే ‘ఊఁ’ కొడుతూ నడిచాను.
ఆగి “యాభై రూపాయిలున్నాయా? రేపిస్తాను” అంది.
నా జేబు వెతికాను. ముప్ఫై రెండు రూపాయలు ఉన్నాయి. రెండు రూపాయిలు జేబున ఉంచుకుని మిగతావి ఇచ్చేశాను.
పైసలు తీసుకుంటూ… కృతజ్ఞతగా చూసింది. ఆవిడ కళ్ళలో నీరు ఉబికి కనిపించింది.
‘దీనికేముంది’ అన్నాను. ఇంతలో రామూ కేక వినిపించింది. వస్తున్నా అని నాలుగడుగులు వేసాను.
“వెళుతున్నారా?” అంది
ఆగి “అందరం వెళ్ళాలి కదా” అన్నాను. దగ్గరకు గబగబా కుంటుతూనే జరిగి నా చేతిని ఒకసారి పట్టుకుని వదిలేసింది.
“ఇదిగో అనవసరంగా హైరానా పడకు. దిగాక నెమ్మదిగా ఇంటికి వెళ్ళు” అని నడిచాను.
స్టూడియోకి చేరి కెమెరా, లైట్లు, వగైరా…. సర్దుకుని బయటకు వచ్చేసరికి రాత్రయింది. “వెళుతున్నాను” అని రాముకి చెప్పి లాడ్జ్‌కి వచ్చి ఆరాముగా నిద్రపోయాను.
ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కిందికి వచ్చి మంజు ఉందేమో చూస్తూ టీ బంకు దగ్గరకి వెళ్ళాను. డబల్ రొట్టె తిని టీ తాగి పాన్ కోసం మళ్ళాను.
జయమాల గుర్తొచ్చింది అదాట్టుగా. పాన్ వేసుకుని అటుగా వెళ్లాను.
ఇంట్లోకి వెళ్ళాక గడపలో నించి వస్తూ కనిపించింది.
కూర్చున్నాను.
నా పక్కనే వచ్చి కూర్చుని “ఇలా వస్తావని ఊహించలేదు” అంది.
“నేననుకున్నాను గనకనా” అన్నాను.
“ఇలా అనుకోకుండా అయినా నువ్వు తరుచూ కనిపిస్తుంటే నాకు బతుకుపైన ఆశ పెరుగుతుంటుంది” అంది.
“ఆశావాది కాని వాడు చిరకాలం బ్రతికినా బ్రతుకున మజా దొరకదు” అన్నాను.
‘ఏమో’ అంది.
“కోర్కెలతో చేసే ప్రయాణంలో ఆశావాది జీవిస్తే…. బ్రతుకు భయంతో నిత్యం నిరాశావాది మరణిస్తాడు.”
విని పగలబడి నవ్వింది. మైమరిపించేలా ఉందా నవ్వు. అట్లాగే చూస్తుండి పోయా.
కాలం స్తంభించిపోయి ఆ నవ్వు అలాగే నిలిచిపోతే బాగు అనిపించింది.
“జయా…! నాకు నీ దగ్గరే నీ నవ్వును చూస్తూ ఉండిపోవాలనుంది” అన్నాను.
“ఇక్కడే ఉన్నావు కదా!”
“ఇలా కాదు నీతోనే ఉంటాను” అన్నాను. ఎందుకలా అన్నానో నాకిప్పటికీ అర్థం కాలేదు. ఆ నవ్వు చూసి మతిపోయి అనుంటాను.
నీ ఇష్టం అన్నట్టు చూసింది.
టైం చూసుకుని “నేను స్కూల్‌కి వెళ్ళాలి” అంది.
“ఏ స్కూలు? పిల్లలకు పాఠాలు చెపుతున్నావా? ఏమిటి?” అన్నాను ఆశ్చర్యపోతూ…
తల ఊపింది.
“ఎప్పటినుంచి?”
“చాలా రోజులయ్యింది.”
“ఇంతకు ముందు?”
“ఇక్కడికి వస్తానంటున్నావు కదా, వీలు కలిగినప్పుడల్లా చెపుతూ ఉంటానులే” అంది.
“అయితే ఇప్పుడే వచ్చేయ్యనా?”
“కాదనలేదుగా” అన్నట్టు చూసింది. లోనికెళ్ళి బట్టలు మార్చుకుని ఇంటి తాళం చెవులు నాకిచ్చి స్కూల్‌కి వెళ్ళిపోయింది.
నాకు నిజంగా జయమాల అర్థం కాలేదు. నేనేమిటి అనేది నాకంటే ఆవిడకే బాగా అర్థమయినట్టుంది. ఆలోచిస్తూ లాడ్జ్‌కి చేరుకున్నాను. లాడ్జ్ మేనేజర్‌ను కలిసి గది ఖాళీ చేస్తున్నానని చెప్పి అడ్వాన్స్ పోగా నాకు రావలసిన పైసలు తీసుకుని సామాను సర్దుకుని ఆటో ఎక్కాను.
జయమాల ఇంటికి వచ్చి పెట్టేబేడా లోన పడేసి…. లోపల గడియ పెట్టుకుని నిద్రపోయాను.
జయమాల స్కూల్ నుంచి వచ్చి తలుపు తట్టే దాకా మెలకువ రాలేదు. తలుపుతీసి బాత్రూంలోకి జోరబడ్డాను. స్నానం ముగించి బయటకు వచ్చేసరికి టిఫిన్ టేబుల్ మీద రెడీగా ఉంది.
“నన్ను మరీ ఋణగ్రస్తున్ని చేయకు” అన్నాను ఆమెనే చూస్తూ.
“బాకీ తీర్చడం ప్రారంబించాను.”
“ఇంకా నా పెట్టుబడి ప్రారంభం కాలేదు.”
“బాకీ చెల్లుబాటు కాగానే వెళ్ళగొడతావా? ఏం?” అని “అది సరే, నేను ఇక్కడ ఉండటం ఎవరికయినా అభ్యంతరమా?” అని అడిగాను.
“నువ్వు చూపులకు కనిపించినంత అమాయకుడివి అయితే కాదు. రూమ్ ఖాళీ చేసి ఇక్కడ తిష్ఠ వేసావు కదా… ఇప్పుడు ఆ ఆలోచనలెందుకు? ఇది లోగా నుంచి నేను ఉండే చోటు. ఇహ నుంచి మనం ఉంటున్నాం.” నవ్వుతూ తలూపాను. టిఫిన్ చేసి బట్టలు వేసుకుని స్టూడియోకి బయలుదేరాను.
ఇలా మరో ఆరు మాసాలు గడిచిపోయినవి. అప్పుడప్పుడు మాత్రం మంజు దగ్గరకు వెళ్లి కాసేపు ఆడుకుని వచ్చేవాడిని.
రాత్రి పడుతుండగానే స్టూడియో. ఈ మధ్య కాలంలో జయమాలతో బాగా చనువు పెరిగింది. ఆవిడ కొంచం కొంచం అర్థమవసాగింది. ఆవిడ రోజూ స్కూల్‌కి వెళ్ళడం, సాయంత్రం వచ్చేప్పుడు బిస్కెట్‌లో – పండ్లో లేవడం, కలిసి తినడం, కబుర్లాడటం, సజావుగానే గడిచిపోతుంది కాలం.
ఒకనాడు మాములుగానే స్టూడియోకి వెళ్లాను. పని అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఇంటికి తిరిగి వచ్చాను. తలుపు తోసుకుని నెమ్మదిగా లోనికి వెళ్లాను. జయ మంచి నిద్రలో ఉంది. నాకేమో కొంచం ఏదయినా తిని పడుకోవాలని అనిపించింది. కిచెన్ లోకి వెళ్లాను. అక్కడ నుంచి కనిపిస్తున్న జయను చూస్తూ ఆగాను. ఆకలి మరిచి ఆవిడను చూస్తూ నిలుచున్నాను. నిద్రలో పక్కకు మళ్ళింది. ఈ ఆరు మాసాల కాలంలో ఆవిడను ఇంత పరీక్షగా చూసి ఎరగను. ఆకలి ఎటుపోయిందో? ఇంకా దగ్గరగా చూడాలనిపించి పక్కకు వచ్చి నెమ్మదిగా పక్కపై కూర్చున్నాను. నా శరీరంలో మార్పు మొదలైంది. నిగ్రహం సడలింది. ముద్దెట్టుకోవాలన్న కోరిక కలిగింది. జయ పెదవుల వైపుగా ఒంగాను. కళ్ళు తెరిస్తే అన్న అనుమానం కలిగింది. అనుమానమే కాదు అనుకున్నంతా అయ్యింది.
జయ కళ్ళు తెరిచింది. నన్ను చూసింది.
“ఎప్పుడొచ్చావ్?” అంది లేస్తూ.
“ఇప్పుడే” అన్నాను.
“అన్నం తిన్నావా?” అడిగింది.
మాటాడలేదు. “రేపు స్కూల్‍కి సెలవు. ఉదయం ఏదయినా సినిమాకి వెళదాం. పడుకో” అంది.
“అలాగే” అని బుద్ధిమంతుడయిన కుర్రాడిలా మంచం ఎక్కాను. నేను దుప్పటి తన్ని నిద్రపోయిన దాకా జయ మసులుతూనే ఉంది. ఉదయం సినిమా కెళ్ళాం.” స్పార్టకస్” రోమన్ బానిసల తిరుగుబాటు. గొప్పగా ఉంది సినిమా. విశ్రాంతి అప్పుడు సుజాత కనిపించింది అకస్మాత్తుగా. నేను కూల్‌గా తాగుతున్న డ్రింక్ కూడా వేడిగా అనిపించింది. జయమాల మామూలుగా సినిమా గురించి మాట్లాడుతుంది. నాలో అలజడి మొదలయ్యింది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నేనుండగా, సుజాత నన్ను చూసింది. చావుకి తెగపడి పారిపోతున్న వానికి ఎదురుపడి ఆపి విషయం చెప్పినట్టుంది నా పరిస్థితి.
ప్రతి అనర్థానికి మూలం ఆడవాళ్ళే అన్నారు. ఎందుకన్నారో మాత్రం నాకు తెలియదు? సుజాత నడక నా వైపు సాగింది. నన్ను సమీపించింది. నా నోట తడారిపోయింది. నా దగ్గరకు వచ్చి విష్ చేసింది నవ్వుతూ.
ఎంత గట్టిగా తుడిచినా చెమట ఆరడం లేదు.
“సినిమాకి వచ్చావా?” అంది.
జయమాల అప్పుడు సుజాతను చూసింది.
“నిన్నే” అంది మళ్ళీ.
“ఆ సుజాత? సినిమాకి వచ్చావా?” అన్నాను. నా గొంతు నాకే అంత బాగా అనిపించలేదు.
“జయమాలా ఈవిడ సుజాత” అని పరిచయం చేసాను.
“ఉద్యోగానికి రాజీనామా చేశావా?” అడిగింది. తలూపాను.
ఇంతలో ‘సుజా’ అన్న పిలుపు వినిపించింది. దగ్గరగా వచ్చాడతను. అతన్ని మాకు పరిచయం చేసింది. “ఈయన మా బావ రవి. ఈ పదహారో తేదిన మా వివాహం. నీ అడ్రెస్స్ దొరక్క కార్డు పంపలేదు” అంది.
“స్టూడియోకి పంపు, అయినా చెప్పావు కదా!” అన్నాను.
ఉన్న నాలుగు నిముషాలలో రవి చాలా కలుపుగోలు మనిషిలా అనిపించాడు. హుషారుగా ఏదో చెప్పుకు పోతున్నాడు. నా తలకెక్క లేదు. అదృష్టవశాత్తు బెల్ మోగింది.
“శివా…..! నిన్ను నాన్నగారు చాలాసార్లు గుర్తు చేసారు. ఒకసారి వచ్చి కలిసి పోరాదు” అంది.
బై చెప్పి సినిమా లోకి దూరింది.
సినిమా పూర్తయ్యింది. జయతో మెట్లు దిగాను. ఇంటికి చేరాక బాత్రూంలోకి జొరబడి పంపు కింద కూర్చున్నాను. చాల సేపటికి గాని బయటకు రాలేదు. నేను వచ్చే సరికి జయ లేదు. తల దిమ్ముగా అనిపించి పక్క ఎక్కాను.
రాత్రి కాగానే స్టూడియోకి వెళ్లాను. అక్కడ నా ప్లోర్‌లో పనీ లేదు, ఉన్నా చేయబుద్ది కాలేదు. కొంచం పెందలాడే ఇంటికి చేరాను. కుర్చీన కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్న జయ నన్ను గమనించి “స్టూడియోకి వెళ్లి వస్తున్నావా?” అంది.
తల ఊపాను కుర్చీలో కూర్చుంటూ. పక్కకు వచ్చి “నేనో మాట అడగనా?” అంది.
తల ఊపాను.
“సుజాతతో నీకు బాగా పరిచయం ఉంది కదు. మరి అలా ప్రవర్తించడానికి సిగ్గనిపించాలేదా?”
మాట్లాడలేదు.
కారణం చెప్పిన దాకా ఊరుకోలేదు.
“ఇది పొరపాటుగా అనిపించినా… ఓ బలహీన క్షణమది. దాన్ని నువ్వు తప్పుగా మనసున ఉంచుకున్నావంటే నీలో మంచితనం ఉన్నట్టే” అంది.
నాకు జయ ఏమన్నది అర్ధం కాలేదు.
ఆ సాయంత్రానికల్లా నెమ్మదిగా నేను నేనుగా అయ్యాను. భోజనం తరువాత “అలా బయట తిరిగొద్దాం ఏం?” అంది.
బయలుదేరాను. అనుకున్నత సేపు పట్టలేదు తిరిగి రావడానికి.
ఇంటికి చేరి ఆరాంగా కూర్చున్నప్పుడు “జయమాలా….” అని పిలిచాను.
“ఆఁ..”
“ఓ మాట అడగాలని ఉంది” అన్నాను నెమ్మదిగా.
“అడుగు” అనుమానం ఎందుకు అన్నట్టు చూసింది.
“నువ్విలా ఒంటరిగా…..” అని ఆగాను.
జయమాల మాట్లాడలేదు,
“ఏదైనా ఉంటే చెపితేనో… మనసు విప్పి మాట్లాడుకుంటేనో పోతుందని అంటారు కదా!”
అసహనంగా కదిలింది,
“అక్కర్లేదు లే, ఆలోచనల్లోకి పోబాకు” అన్నాను.
నాకు దగ్గరగా జరిగి “నా బ్రతుకు తెరిచిన పుస్తకం. బాధ పడడానికి ఏమున్నా లేకున్నా చెపుతాను” అంది.
తలూపాను. కుదురుగా కూర్చుని ప్రారంబించింది.
“మాది జలంధర్ దగ్గర ఓ పల్లెటూరు. నా పసితనాన్నే అమ్మ పోయింది. నాన్న వయస్సులో ఉన్నా…. నాకు అన్యాయం జరుగుతుందనుకుని మరో పెళ్లి చేసుకోలేదు. మా అమ్మను ప్రాణప్రదంగా చూసుకునే నాన్నకు నేను ఆవిడకు గుర్తుగా మిగిలాను. వంటకు మాత్రం ఒక దూరపు బంధువయిన అవ్వను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. నా ఆలనా పాలనా కూడా బాగా చూసేదావిడ. నా బాల్యం హాయిగా స్వేచ్ఛగా గడిచింది. నాన్న నాకు ప్రతీ రోజు పడుకునే దాకా పురాణ కథలు వినిపించేవాడు. వాటిల్లోని నీతిని, ఆ నీతి వలన మనిషికి కలిగే శాంతిని సంతృప్తిని గురించి చెప్పేవాడు. నేను బడిలోకి వెళ్ళే రోజుల్లో సుమన అనే అమ్మాయితో స్నేహం అయ్యింది. కలిసినప్పటి నుంచి ఒక జట్టుగా ఉండేవాళ్ళం.
నేను తొమ్మిదవ తరగతికి వచ్చాను. ఒకనాడు సుమన మొఖం మాడ్చుకుని నా దగ్గరకు వచ్చింది.
“ఎందుకే అలా ఉన్నావు” అడిగాను భుజం మీద చేయివేసి.
“నాకు మా నాన్న పెళ్లి చేస్తాడటనే” అంది.
“పెళ్ళంటే ఎగిరి గంతేయాలి గానీ ఏడుపెందుకే” అన్నాను నవ్వుతూ.
మౌనంగా నా సరసన కూర్చుంది. ఎంత అడిగినా ఏం చెప్పలేదు. చెప్పాలని అనిపించలేదో ఏమో.
ఆ తరువాత తెలిసింది. పెళ్లి కొడుకు రెండవ పెళ్లి వాడని, వయసెక్కువయిన స్థితిపరుడని. సుమన కుటుంబానికి బాగా ఆసరాగా ఉంటాడని అంటున్నారు.
అయినా ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో పనేముంది. ఆ వేసవిలోనే సుమనకు పెళ్ళయ్యింది. న్యాయానికి సుమని నా ఈడుదే అయినా నాకంటే కొంచం పొడగరి. ఓ ఏడాది ముందే పెద్దదయ్యింది. చూసేందుకు పెద్దదానిలా కనిపిస్తుంది కూడా, దాని వంటి తీరది.
నను పెళ్ళికి వెళ్లాను. దాని మొహంలో జీవకళ కనిపించలేదు. నాకూ దానితో మాట్లాడే అవకాశం కొద్దిగా దొరికింది. వెళ్ళి ధైర్యంగా ఉండమని చెప్పాను. పెళ్లింది కనుక భర్తతో సఖ్యంగా ఉండక తప్పదని, ఈ బంధం అలాంటిదని మా నాన్న చెప్పిన పురాణ కథలు నా తలన చాలా ఉన్నాయి కనుక తెలిసిన మేరకు ఎలా నడుచుకోవాలో చెప్పాను. చివరగా “మనం సంతోషంగా ఉన్నా….. సంతోషాన్ని వదులుకున్నా…. జీవితాంతం నీ బ్రతుకు అతనితోనే అనేది గుర్తుంచుకొని తెలివిగా బ్రతుకు బాగుచేసుకో” అని చెప్పి వచ్చాను ఆరిందాలా. ఏదో చెప్పాను కానీ వెనుతిరిగి వస్తుంటే బాధ అనిపించింది. కళ్ళు తడయ్యాయి కూడా.
అది భర్త ఇంటికి వెళ్ళేనాడు నా దగ్గరకు వచ్చింది. దానితో ఇక జట్టుగా తిరగలేనని అర్థమయ్యాక మనసంతా ఎలాగో అయ్యింది.
భుజం మీద తల ఆన్చి ఏడ్చాను కూడా.
అప్పుడది సముదాయించింది నన్ను. “వస్తుంటాను కదే. కలసి తిరుగుదాం లే….!” అంది.
నన్ను విడివడలేక బాధగా వెళ్ళింది. ఆ వెళ్ళడం వెళ్ళడం ఇప్పటిదాకా నాకు కనిపించలేదు. ఎలా ఉందో? ఏమో. నేనుగా చాలాసార్లు సుమనను కలిసే ప్రయత్నం చేసాను కుదరలేదు. ఐదారుసార్లు దాని తల్లితండ్రులను కలిసాను. చిట్టచివరకు ఒక వార్త తెలిసింది.
సుమన భర్త వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడని, అక్కడ ఉండే పరిస్థితి లేక చాలా దూర ప్రాంతం వెళ్ళాడని చెప్పారు, కానీ ఆ దూరప్రాంతం పేరేదో చెప్పలేదు. నేను నొక్కి అడగలేక పోయాను. దాని తల్లి తండ్రులు దాని పట్ల ఎంతో ఉదాసీనంగా ఉన్నా నేను దానిని మరిచిపోలేకపోయాను. ఊరికే కూర్చునప్పుడల్లా తలలో మెదులుతూ ఉండేది. చిన్ననాటి నుండి ఆడి పాడి పోట్లాడి, కేరింతలు కొడుతూ, దాగుడు మూతలు ఆడుకున్న సంగతులన్నీ నన్ను వదలడం లేదు. వదలవు.”
జయ తన స్నేహితురాలి సంగతులు చెపుతుంటే నా చిన్ననాటి మిత్రుడు పశుపతి జ్ఞాపకం లోకోచ్చాడు. సంఘ దౌష్ట్యానికి బలయిపోయిన వాని స్నేహితుని కోసం విప్లవవాదిగా మారి అదృశ్యం అయిపోయాడు. తిరిగి కనిపించలేదు. బ్రతికినంత కాలం మరిచిపోలేని ఆత్మీయ మిత్రుడతను.
నేనీ ఆలోచనలో ఉండగా పరధ్యానంగా ఉన్నానని గ్రహించి “తరువాత చెపుతాను. ఇక ఆపుతానేం” అంది నవ్వి,
“అలా కాదోయ్! నీ స్నేహితురాలిని వింటుంటే కర్మయోగి లాంటి నా మిత్రుడు మనసులోకోచ్చాడు. అంతే ఇక చెప్పు” అన్నాను బుద్దిగా ఆమె వైపు మళ్ళి.
“నేను యుక్త వయస్కురాలినయ్యాను. పది పాసయ్యాను. డిగ్రీ పూర్తీ చేయాలని నా ఆశ. అందుకు నాన్న సహకరించాడు. డిగ్రీ పరీక్షలు దగ్గర పడుతున్నవి. నాకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు నాన్న.
నేను చదువుపై ధ్యాస ఉంచి కష్టపడి చదివాను. కాలేజి చివరి రోజుల్లో వేణుగోపాల్ అనే లెక్చరర్ కొత్తగా జాయిన్ అయ్యాడు. యువకుడు, పెళ్లి కాలేదు. అందరితో బాగా ఉండేవాడు. అతనిపై నాకు ఆకర్షణ కలిగింది. పెరిగింది. అతని క్లాస్‍లో ఎక్కువగా ఉండాలని, ఆయనతో మాట్లాడాలని అనిపించేది. తీరా అతను పలకరిస్తే మౌనంగా ఉండిపోయే దానిని.
జీవితంలో తొలి ప్రణయానికి ఉన్న అనుభూతి బ్రతుకంతా చెదరదు. కాలేజీ లోనే మాటలు కలిసినవి. నేను చురుకయిన విద్యార్థినిని కనుక వాత్సల్యంతో చూస్తున్నాడని అనిపించేది.
ఒకనాడు నేను ఇంటికి వస్తుంటే వెంట నడిచి నన్నే అడిగాడు ధైర్యంగా. అతని ధైర్యానికి నిజంగా నాకు వణుకొచ్చింది. చాలా కటువుగా మాట్లాడానా రోజు. అయినా వేణుగోపాల్ నన్ను వదులుకోలేదు. వారం తిరగకుండానే సీదా మా ఇంటికే వచ్చాడు. నాన్న వరండాలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు.”
(సశేషం)