Site icon Sanchika

గట్టవుతల

[dropcap]క[/dropcap]రువు రాచ్చసి కోరల్లో సిక్కి
గింజే కాన్రాని న్యాల మింద సాము సెయ్యలేక
పొట్ట సేతబట్టుకోని పట్నానికి పయనమైపోతి…

పూటైనా మెలిపెట్న పేగులమంట సల్లారకనే
నాలుగు మెతుకులతో పిల్లాపీచు ముసిలీముతకల
మొగాల్లో ఎలుగులు సూడకనే
కాలానికి కన్నుగుట్టిందేమో..
యాడదాగున్నో … ఈ మాయదారి మగమ్మారి కరోనా ..

లాకు డౌను రూపంలో మాబతుకులు అతలాకుతలం సేసి ఏడుక జూత్తాంది!
పూట గడవడమే కస్టమై.. పైమింద బట్టే ల్యాకపోతే
మూతికి ముసుగు.. సేతికి తొడుగు నెనెట్లా ఏసుకునేది….

ఆకిలి క్యాకలను అదిమిపట్టి ఆవగింజెంత ధైర్నంతో
పురిటిగెడ్డకు పయినమైతే..
అడుగడుగునా అడ్డగింతలే!
నెర్లు సీలిన న్యాల మిందికి నెత్తర గారతాండే కాలు మోపేలోపలే..
కోరంటైన్ లక్స్మణ రేకై కుచ్చోనుండాది!

గట్టవుతల.. ఇంటికాడ ఎమకలతొడుగు పక్కన
పసిదాని కండ్లు.. నా రాక కోసరం.. కాసుకోనుండాయి!
“కలో.. గంజో కల్సుకొనే తాగుదాం.. నువ్వురా .. అయ్యా.. ” అని జెప్పిన
మాయమ్మ మాటలే గింగురుమంటా ఉండాయ్ సెవుల్లో…
ప్యానం గట్టవతలకు పోవల్లని లాగేసిన్యాది…

ఈ మాయదారి రోగాన్ని సంకన బెనెట్టుకోని…
నెనట్లబోవల్లబ్బా..!

దావలన్నీ తాచుపాములై కాటేస్తా ఉంటే…
నా వూరికి ఎట్టక్యాలకు ఎట్లా జేరుకునేది ?

యా.. ద్యావుడో.. దయ్యమో
మమ్మల్ని ఆదాటుగా ఎత్తకపోయి
మాకింత సాయం జేత్తే బాగుండు ..!!

Exit mobile version