గాజా తల్లుల కోసం ఒక కవిత – నాక్కొంచెం సమయం ఇవ్వండి!

0
3

[ఇక్బాల్ తమీమి రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Iqbal Tamimi’s poem ‘A Poem for Mothers of Gaza – Give Me Some Time’ by Mrs. Geetanjali.]

~

[dropcap]గా[/dropcap]జా ప్రసవించింది.
ఆమె దారులన్నీ గులాబీలతో వికసించాయి.
ఆమె పిల్లలు ఉదయంపు మంచు బిందువులకి గొర్రెల కాపరులై పోయారు.
గొప్ప ఆశతో గర్భవతి అయిన
ఆమె గర్భం పైన ఒక దుర్మార్గమైన కుట్ర జరిగింది.
గాజా తల్లులు భయభ్రాంతులకు లోనైనారు.
రక్తం నిండిన చేతులని చాచి వాళ్ళ పిల్లలని
వాళ్ళ హృదయపు నిట్టూర్పుల లోకి గాడంగా హత్తుకుంటున్నారు.
వాళ్ళు రాకెట్ల.. బాంబుల పంటలలో
క్రూరమైన మనుషుల సకిలింపులని వింటున్నారు.
ఆ తల్లుల దుఃఖం శత్రువుల చెవుల్లోని కపటత్వాన్ని చిల్లులు పొడిచాయి.
ఆ తల్లి ప్రశ్నిస్తున్నది.
అసూయ.,వైషమ్యం నిండిన ఆ మనుషుల
చొక్కా వెనక నుండి చింపివేయబడింది.
అది ఎందుకో నాకు తెలియాలి.
నీ ద్వేషం నా కళ్ళల్లోని మబ్బుల్ని
కన్నీటి వర్షాన్ని కురవమని శాసిస్తున్నది
ఎందుకో చెప్పండని?
ఎందుకు.. ఎందుకు మృత్యు హస్తం
నా ప్రతీ పిల్లాడిని దొంగలించుకు పోతున్నది?
జవాబు కావాలి మాకు.
ఆ తల్లులు ప్రశ్నిస్తున్నారు!

***

ఎప్పటికైనా ఈ అంధకారంలో నాకు వెలుతురు విత్తనాలు కనిపిస్తాయా?
కానీ వాళ్ళు.. మెరిసిపోతున్న మేజోళ్ళు వేసుకున్న మగవాళ్ళు..
నిదానంగా టీ చప్పరిస్తూ..కేకులు తింటూ..
ఉల్లాసపు సెలవుల గురుంచి మాట్లాడుతూ..
మధ్య మధ్యలో టీవీ వైపో చూపు విసిరేస్తూ..
మరిన్ని సైనిక దళాలను.. మరిన్ని రక్తపు నదులను పారించడానికి
గ్రామాల మీదికి పంపాలని మాట్లాడుకుంటూ ఉంటారు..
మరోపక్క నా కుటుంబమంతా సిలువ వేయబడి ఉంటుంది..

***

రక్తపు మరకలు ఎందుకు ఇంకా పచ్చి గానే ఉన్నాయి.. ఎండిపోలేదు ఎందుకు?
నా ఆత్మవిశ్వాసాన్ని ముక్కలు చేయడానికి.,
మీ అహంకారపు సముద్రంలో ఇంకా ఎన్ని అలలు మిగిలి ఉన్నాయి?
నా లోపల ఇంకా కొత్త విషాదం ఏముందని?
అది నా లోపల ఇంకా పూర్తిగా తన గూడు కట్టుకోలేదు..
కానీ అలిసిపోయిన నా హృదయం ధ్వంసం అయింది .
నా పడవకున్న తెడ్లు వేదనలని, విషాదాలని తోస్తూ
పడవని ముందుకు నడిపిస్తున్నాయి.
కరుణతో నిండిన మానవ హృదయ తీరపు అన్వేషణలో.,ఇక
ప్రవాహాన్ని ఎదురీదలేక సొమ్మసిల్లాను.
నా తల్లుల కన్నీళ్ల ఉప్పు..
మానని నా గాయాల మీద చింది భగ్గున మండిస్తున్నది.
తుపాకుల నుంచి చిమ్మే గన్ పౌడర్ వాసన,
మాంసాన్ని కాలుస్తున్న తెల్ల భాస్వరపు పొగలు
నా ఊపిరితిత్తులలో నిండిపోతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

***

మేం., తల్లులం!
మా పిల్లల నీడలను కౌగలించుకొంటున్న వాళ్ళం.
వాళ్ళిక ఏ మాత్రమూ గాలిపటాలు ఎగుర వేయరు.
ఎందుకంటే వాళ్ళిక ఈ భూమి మీద లేరు !
అయినా కానీ ఆశ చావక.. వాళ్ళ కోసం దుమ్ము కుప్పల వెనుక..
ఖాళీ ఆటస్థలాల్లో వెతుకుతున్న అభాగ్య తల్లులం!
మా పిల్లలు నిద్రపోయి లేచిన ఖాళీ పడకలను
ఆర్తిగా ముద్దు పెట్టుకుంటున్నవాళ్ళం!
రోజూ మా పిల్లలు వెళ్లిన బడి గేట్ల
ముందు నిలబడి ఒంటరిగా నిరీక్షిస్తున్న వెర్రి తల్లులం!
ఒరేయ్.. యుద్ధోన్మాదీ.. నాకు కొంచెం సమయం ఇవ్వు!
నువ్వు చేసిన విధ్వంసాన్ని సరి చేస్కోడానికి.
తెగిపోయిన నా పిల్లల కాళ్ళు, చేతులూ ఇక్కడి చెత్తలో కలిసిపోయాయి..
వాటిని వెతికి తీసుకోనీ!
మళ్ళీ ప్రార్థించడానికి కొంత సమయాన్ని ఇవ్వు!
నీ క్రౌర్యాన్ని ఖండిస్తూ ఇంకో లేఖ రాయడానికి కొద్ది సమయాన్ని ఇవ్వు!
నేను కోల్పోయిన దాన్ని మరిచిపోవడానికైనా కొద్ది సమయాన్ని ఇవ్వు!
బిడ్డల శవాలు నిండిన గదుల్ని ఖాళీ చేయడానికైనా కొద్ది సమయాన్ని ఇవ్వు!
మరొక పసివాడ్ని ఖననం చేయడానికైనా కొద్ది సమయాన్ని ఇవ్వు!
మురికిగా ఉన్న నా జైలు గదిని శుభ్రంగా అమర్చుకోడానికి కొద్ది సమయం ఇవ్వు!
ఒరేయ్.. నువ్వు సృష్టించిన నరకలోకాన్ని బద్దలు కొట్టడానికైనా కొద్ది సమయాన్ని ఇవ్వరా!
నేను తల్లినిరా.. అమరులైన నా బిడ్డలను తలుచుకుంటూ
దుఃఖించుకోవడానికైనా కొద్ది సమయాన్ని ఇవ్వు!

~

మూలం: ఇక్బాల్ తమీమి

అనుసృజన: గీతాంజలి


ఇక్బాల్ తమీమి బ్రిస్టల్‌లో నివసిస్తున్న పాలస్తీనా కవయిత్రి, జర్నలిస్ట్. ఆమె టీవీ ఇంటర్వ్యూ ప్రొడ్యూసర్‌గా, అనేక ప్రెస్/కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్‌లు, టాక్ షోలకు; ఇంకా రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. జర్నలిస్ట్‌గా, వార్తాపత్రికల సంపాదకురాలిగా, రాజకీయాలపై కళ మరియు సాహిత్యం, నాటకాల ప్రభావం గురించి పరిశోధకురాలిగా ప్రశంసలు అందుకున్నారు. మానవ హక్కులు, మహిళల సాధికారతపై ఎక్కువగా దృష్టి సారించారు. పాలస్తీనియన్ మహిళల కష్టాలు, విజయాల కోసం పాలస్తీనియన్ మదర్స్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. ఆమె అరబిక్‌లో రెండు పుస్తకాలను రచించారు. 2002 నుండి జోర్డాన్‌లోని అరబ్ ఉమెన్ మీడియా సెంటర్‌లో క్రియాశీల సభ్యురాలిగా; 2006 నుండి UKలోని ఎక్సైల్డ్ జర్నలిస్ట్ నెట్‌వర్క్‌లో సభ్యురాలిగా పత్రికా స్వేచ్ఛను అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి భాగస్వామ్యాలను నిర్మించడంలో కృషిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here