[box type=’note’ fontsize=’16’] “పెద్దగా బుర్రకు పని చెప్పకుండా వున్నంత సేపు వీలైనంత నవ్విస్తూ, వొక్కో చోట గిల్లుతూ, సాగిపోతుంది చిత్రం” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “గీత గోవిందం” సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఈ[/dropcap] పాటికి విజయ్ దేవరకొండ దాదాపు స్టార్ అయినట్టే. ఇదివరకొచ్చిన ఇంటెన్స్ అర్జున్ రెడ్డి తర్వాత మరో సారి ‘పెళ్ళిచూపులు’ లాంటి రొమాంటిక్ కామెడి తో మన ముందుకు వచ్చాడు. పెద్దగా బుర్రకు పని చెప్పకుండా వున్నంత సేపు వీలైనంత నవ్విస్తూ, వొక్కో చోట గిల్లుతూ, సాగిపోతుంది చిత్రం.
ఈ సినెమా కాస్సేపు సరదాగా గడపడానికి కొంత అవకాశం ఇస్తుంది. కాని కొన్ని స్టీరియోటైపులు, పాతకాలం ఆలోచనా పధ్ధతులూ విసిగించక మానవు. ఆపదలో వున్న ఆడపిల్లకు హీరో ఫైట్లు చేసి రక్షించడం, తమ ప్రత్యేక అస్తిత్వం లేని స్నేహితుల గుంపు, స్పష్టమైన ఆలోచనలు లేని హీరో, మర్డర్లు చేయడం యేదో మొబైల్ గేం ఆడటం అంత సామాన్యమైన విషయంలా అన్న ఆవేశం, స్వతహాగా బోల్డ్ అయిన అమ్మయికి రక్షణ నివ్వలనుకునే అన్న, ఇలాంటి యెన్నో సినెమేటిక్ స్టీరియోటైపులున్నాయి. తల్లి లాంటి భార్య రావాలని కోరుకోవడం లాంటి సిల్లీ విషయాలు విసుగనిపిస్తాయి. పోనీ అదేమైనా ఈడిపస్ కాంప్లెక్స్ లాంటిదేమన్నా చెబుతున్నాడా అంటే అదేం లేదు. అతన్ని సున్నిత మనస్కుడుగా చూపించాలని. యే మాటకా మాట చెప్పుకోవాలి, ఇందులో హీరో నిజంగానే ఆడవాళ్ళతో (reletively) డెలికేట్‌గా వ్యవహరిచే వాడుగా చూపించారు. అంతవరకు మెచ్చుకోవాల్సిందే. ఆ సినేమేటిక్ ఫిల్లింగులు చూసీ చూడకుండా వుంటే ఆ కాస్సేపూ నవ్వుతూ గడిపేయవచ్చు.
విజయ్ దేవరకొండ, రశ్మికలు బాగా చేశారు. విజయ్ ఇంకా తన వాక్సరణిని, వాచకాన్ని మెరుగుపరచుకోవలసి వున్నది. అన్నపూర్ణ, గిరిబాబు, లాంటి సీనియర్లే కాదు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్ లాంటి ఇప్పటి నటులు కూడా చాలా అలవోకగా అందంగా చెప్పగలుగుతున్నారు తమ లైన్లను. రాహుల్, అభయ్ లను మన ఇండస్ట్రీ ఇంకా పూర్తిగా exploit చేయవలసే వున్నది. పరశురాం దర్శకత్వం, మణికంఠన్ చాయాచిత్రణా బాగున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోపీ సుందర్ సంగీతం. పాటలకీ, నేపథ్యానికీ మంచి సంగీతం ఇచ్చాడు. ముఖ్యంగా సిద్ శ్రీరాం పాడిన “ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే” పాట. ఈ మధ్య కొన్ని పాటలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా వస్తున్నాయి. శుభ పరిణామమే. అక్కడక్కడా కనిపించే నిత్యా మెనెన్ కూడా గుర్తుండిపోతుంది, పెద్ద పాత్రంటూ లేకపోయినా.