గీతలో చెప్పినది శాసనప్రాధాన్యము

    0
    2

    శాసనప్రాధాన్యము అనగా పై అదికారులు లేక గురువులు చెప్పిన దానిని తు.చ తప్పకుండ అమలు పెట్టుట. ధర్మమును నిలబెట్టుటకు ఇది మిక్కిలి ఆవశ్యకము. ధర్మ సంస్థాపనము కొఱకు అవతరించిన శ్రీకృష్ణపరమాత్మ, అర్జునుని చేత యుద్ధము చేయించుటకు కోల్పోయిన ఉత్సాహమును పురిగొల్పుటకు అనేక పద్ధతులను ఉపయోగించి యున్నాడు. దీనిని English‌లో Crisis Management అన్నారు. శ్రీధరస్వామి గీతావ్యాఖ్యానములో Management అనునర్థంలో, ధర్మశాస్త్రము (Administration) నకు వ్యతిరేకమయిన అర్థశాస్త్రము అను పదమును ప్రయోగించాడు. అర్థశాస్త్ర మనగా result oriented management అని మనము గ్రహించుకొనవలెను.

    పురుషోత్తముని బోధనలో నిష్కామకర్మ యోగము ప్రధాన ప్రాత్రను షోషించినది.

    సాంఖ్యాయోగము అను పేర జ్ఞాన యోగము చెప్పబడగా అత్మజ్ఞాన లాభము చేత ఆత్మ విశ్వాసలాభాము కానున్నది అని పరమాత్మకు తెలిసియున్నది. Self-awareness అటుపై Self-confidence, అటుపై self-management అను సోపానములను గీతోపదేశములో గమనింపగలము. 16వ అధ్యాయం అయిదవ శ్లోకములో “అర్జునా, దుఃఖింపకు, నీవు దైవీ సంపదగల వాడవు” అని చెప్పి భగవంతుడు అర్జునునకు ఆత్మ విశ్వాసమును రగుల్కోన జేయిచున్నాడు.

    కర్మాచరణ ప్రాధాన్యమును నొక్కి చెప్పుచు “పూర్వము జనక మహారాజు మున్నగువారు కర్మ మార్గమునే అవలంబించారు” అని భగవంతుడు ఉదాహరణమును ఇచ్చుచున్నాడు. 3వ అధ్యాయం 20వ శ్లోక పరామర్శ చేయగలము – ఇదియు ఆత్మవిశ్వాసం దృఢం చేయడానికే.

    18వ అధ్యాయం 47వ శ్లోకములో – అహింసా బుద్ధిని సరిగా తెలుసుకోవలె, సహజ కర్మలోని దోషము అయినను ఫరవాలేదు గాని కృత్రిమంగా తెచ్చుకోని వచ్చిన వృత్తిలోని హింసని భయంకరము – అని తెలియజేసి శ్రీకృష్ణుడు ముందుగానే ఊహించుకొని అర్జునుని సంశయ నివారణ చేస్తున్నాడు.

    ప్రభువులకు లోక సంగ్రహము అతిముఖ్యము. తన్ను జూచి ఇతరులు చెడిపోరాదు. తృతీయాధ్యాయ శ్లోకాలను చూడ వచ్చును. ఇది రాజ్యశాసన కర్తలకు అతి ముఖ్యమగు సందేశము.

    10వ అధ్యాయములో ‘నరాణాంచ నరేంద్రోఽహమ్’ అని రాజు అయినవాడు తన అంశతో ధర్మరక్షకు జన్మించును అనుచు ఆదిదేవుడు అర్జునుని ఆత్మ విశ్వాస జాగరణం చేస్తున్నాడు.

    దిత్వీయాధ్యాయంలో 26వ శ్లోకం నుండీ 38వ శ్లోకము వరకు శ్రీకృష్ణపరమాత్మ, అన్నివిధాల నచ్చజెప్పుచు అర్జునునకు do or die అను శాసనమును (ధర్మమును) ప్రధానముగా చెప్పుచున్నాడు.

    అసంగయోగము ప్రజాశాసనములో నున్న వ్యక్తులకు అత్యంత ప్రధానము. దాని చేతనే వాళ్లు ధర్మ కర్తలు (custodians) గా వ్యవహరించి, నిస్వార్ధ బుద్ధితో పాలనము చేయదురు. ఈ కారణంగా భగవద్గీత, ధర్మప్రధానమయిన శాసనప్రణాళిని నోక్కి చెప్పుచున్నది. గీతలో అనుషంగికము (subsidiary) గా వచ్చిన వేదాన్త బోధ ప్రధానమై కూర్చున్నది. క్షత్రియవంశ నాశము కాగా గీతను ప్రభువులకు ఉద్దేశించి బోధించుట వెనకబడిపోయినది.

    ప్రథమాధ్యాయములో 32వ శ్లోకము నుండి 46న శ్లోకము వరకు అర్జనుని పాపభీతిని మనము అర్థం చేసి కొనవలె. ఆ పాపభీతిని తొలగించుటకు సూటిగా 18వ అధ్యాయము 66వ శ్లోకములో భగవంతుడు అభయము ఇచ్చుచున్నాడు. అభయమును ఇవ్వగా అర్జునుడు నిర్భయుడై యుద్ధానికి సిధ్దమయినాడు. కాగా మొత్తము గీతాసారంశము ధర్మసంస్థాపన కోసరము భగవంతుడు చేసిన ఉపదేశము, లేక ఆదేశము.

    అభయప్రదానములో భాగముగా విశ్వరూపదర్శనము చేయించాడు. చేయించి తాను కాల స్వరూపుడునై సర్వ సంహారానికి పూనుకున్నాను అని విశదం చేశాడు. ధర్మరక్షణ అత్యావశ్యకము అనునది గీతాప్రధానోద్దేశ్యము కాగా దానిలోని, భాగముగా దుష్టసంహారము అనివార్యము. దానివల్ల లోకక్షయమైనను ఫరవాలేదు.

    దుష్టసంహారము శ్రీరామ ప్రభువు చేసినాడు. అంతకు ముందు పరశురాముడు దుష్ట క్షత్రియ సంహారమును 21 మారులు చేసియున్నాడు. దీనిని సరిగా అర్థం చేసికొనలేక తన గీతావ్యాఖ్యలో పరశురాముడు 21 మారులు క్షాత్ర వధ చేయడానికి బదులుగా ఆత్మహత్య చేసికొని ఉంటే బాగుండేది అని వినోబా జీ వ్రాశారు. ఇలాగా ప్రత్యుదాహరణము చెప్పడం చేత విషయం విస్పశష్టం కాగలదు అన్నదియే అస్మదాశయము. పరనింద కాదు. గుణదోష వివేచనం అవసరము కదా.

    ప్రస్థాన త్రయములో గీత మూడవది. మెదటిది ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మ సూత్రములు. శ్రుతి అనగా వేదము. వేదములోని భాగములే ఉపనిషత్తులు. వానిలోని వాక్యాలకు పరబ్రహ్మ మందు సమన్వయము చూపునది బ్రహ్మ సూత్రగ్రంథము. శ్రుతిప్రస్థాన మనగా ఉపనిషత్తులు, న్యాయప్రస్థానము లేక సూత్రప్రస్థాన మనగా బ్రహ్మసూత్ర గ్రంథము. వానిని స్మరించి శ్రీకృష్ణడు చెప్పినది గనుక భగవద్గీత స్మృతి ప్రస్థానమయినది. త్రయోదశాధ్యాయంలో 4వ శ్లోకమును పరామర్శ చేయచ్చును.

    ఇక బృహదారణ్యకములోని శ్రవణమనన నిదిధ్యాసనాలను మనసులో పెట్టుకొని అక్కడ మూడు ఇక్కడ మూడు అని ముడి పెట్టిన పండితులను కొందరను చూచియున్నాము. శ్రుతిప్రస్థానము శ్రవణం కోసము, న్యాయ(సూత్ర) ప్రస్థానము మననము కోసము, ఇక భగవద్గీత నిదిధ్యాసనం కోసమని చెప్పుచున్న వారిని ఏమనవలయును? గీతోపదేశం విన్న తరువాత అర్జునుడు లేచి యుద్ధము చేసెనుగాని ధ్యానములోనికి వెళ్లలేదుకదా!

    శ్లో: “సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందనః

    పార్ధో వత్సః సుధిర్భోక్తా దుగ్ధం గీతామృతంమహత్”

    అను శ్లోకం ప్రకారం గీత ఉపనిషదర్థమునే చెప్పినది. గీతలోని నిష్కామ కర్మయోగం కూడా ‘నకర్మలిప్యతే నరే’ అను ఈశావాస్యములోనిదే.

    ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రములు, గీతయు ఉపబృంహణము చేయునట్టివే కదా! వేరుప్రస్థానము లెట్లగును?

    వాస్తవమేమి అనగా ‘అన్నం చతుర్విధమ్’ అన్నట్లుగా ప్రస్థానము ఒక్కటే మూడు విధాలు

    1. ఉపనిషన్మంత్రాలు
    2. సూత్రములు
    3. శ్లోకాలు

     

    ప్రస్థానం త్రివిధముగాక ప్రస్థానత్రయము అనునది శిథిలపదబంధము (loose construction). దీని వలన వచ్చిన అనర్థమును మనము సవరించుకోవలెను.

    ఇక గీత యెక్క మహిమ ఎలాంటిది అనగా అనేక విధాలుగా వర్ణకాలను (interpretation) ఇచ్చుకొంటూ పోవచ్చును.

    జ్ఞాన యోగం ప్రధానమని భక్తియోగం ప్రధానమని కర్మయోగం ప్రధానమని ప్రపత్తి ప్రధానమని రాజయోగం ప్రధానమని ఎన్నో విధాలుగా చెప్పవచ్చును. కాని ధర్మ సంస్థాపనం కోసం దుష్ట సంహారం కోసం నిలబడి అర్జునుని యుద్ధానికి ప్రేరణ చేయడంలో అన్నింటిని మించి అన్నిటికి ముందుగా శాసనప్రాధాన్యము చెప్పబడినది అను ముఖ్య విషయమును మనము మరువరాదు.

    -డా. వి.ఎ. కుమారస్వామి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here