గెలుపు కిరణాలు – పుస్తక పరిచయం

0
2

[dropcap]డా[/dropcap]క్టర్‌ మూలింటి సునీత ప్రముఖ క్యాన్సర్ నిపుణులు. గత ఇరవై సంవత్సరాలుగా కొన్ని వందలమంది పేషంట్లతో మమేకమై, అమితమైన అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు. ఆ అనుబంధాలన్నింటిని ఈ పుస్తక రూపంలో అందిస్తున్నారు. ‘గెలుపు కిరణాలు’ పుస్తకం ఆమె ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న యథార్థ గాథలు. ఈ 25 లఘు కథలలో ప్రతీ కథా ఎంతో ప్రత్యేకం, స్ఫూర్తిదాయకం.

***

“క్యాన్సర్ బారిన పడినవాళ్లకు ఈ పుస్తకం మనోధైర్యాన్ని ఇస్తుంది. ఒక పాజిటివ్ అప్రోచ్‌ని తీసుకొస్తుంది. క్యాన్సర్ అంటే డెత్ వారెంట్ అని అనుకోనక్కరలేదని స్ఫూర్తి నింపుతుంది ఈ పుస్తకం.

చికిత్స విజయవంతం కావాలంటే పేషంటు మానసిక స్థితి స్థిరంగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే డాక్టరు డ్యూటీ కాదు, వారితో మాట్లాడడం, నేనున్నాననే భరోసా ఇవ్వడం అవసరం. అందుకే కౌన్సిలింగ్‌ని తన ట్రీట్‌మెంట్‌లో భాగం చేసింది సునీత. పేషంట్ల పట్ల సానుభూతి కలిగి ఉండడమే కాదు, సహానుభూతి ఫీలయ్యేది. అందుకేనేమో ఎంతోమంది పేషంట్ల మనసులకి దగ్గరయింది. ఎంతోమంది క్యాన్సర్ పేషంట్లకి స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ పుస్తకాన్ని తేవడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు డా. నాగార్జున రెడ్డి తమ ముందుమాటలో.

***

“‘క్యాన్సర్ అంటే డెత్ సర్టిఫికెట్ చేతిలో పట్టుకుని కూర్చున్నట్టే… దాని మీద తేదీ వేసుకోవడం ఒకటే మిగిలింది… ఇక జీవితమంటూ ఏముంది…’ అంటూ డీలా పడిపోతారు చాలామంది. ఉన్న కొద్ది జీవితాన్నీ దుర్భరం చేసుకుంటారు. వారితో పాటు కుటుంబమంతా డిప్రెషన్‌లో పడిపోతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా చేయగల సామర్థ్యం డాక్టర్ వద్దే ఉంటుంది. ఆత్మీయత పంచితే, నాలుగు మంచి మాటలు చాలు.. గెలుపు వైపు పయనిస్తారు.

పేషెంట్ల జీవితాలను చదివితే ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంటుంది. అలా దగరికి వచ్చిన ప్రతి పేషెంటు ఎదుర్కొన్న పరిస్థితులనూ ఒక కథగా మలచవచ్చనిపించింది. ఈ ఆలోచనకి బీజం నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే పడింది.

ఏ వైద్య విభాగంలో స్పెషలైజేషన్ చేసినప్పటికీ పేషెంట్లకు సంబంధించిన కథలను పుస్తకంగా తేవాలన్న కోరిక పుట్టింది. అప్పుడు పుట్టిన ఆ కోరిక ఇప్పుడు ఇలా తీరింది.

నిజానికి నా పేషెంట్ల కథలే కొన్నిసార్లు నాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉపయోగపడ్డాయి. ఒక్కోసారి చిన్న సమస్యకే డిప్రెస్ అయ్యే నాకు వారి బాధలు నా మనోధైర్యాన్ని పెంచాయి. కొన్ని సందర్భాల్లో నా జీవితంలోని కొన్ని సందర్భాలకు వాళ్ళ బాధలను ఉదాహరణగా తీసుకుని దిగులు నుంచి బయటపడగలిగాను” అన్నారు డా సునీత ‘ఈ పుస్తకం నేపథ్యం..’లో.

***

గెలుపు కిరణాలు
డా. సునీత మూలింటి
పేజీలు: 128
ధర: ₹ 150
ప్రతులకు జ్యోతి వలబోజు, సెల్‌ 80963 10140

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here