Site icon Sanchika

గెలుపు కోసం

డియర్ సక్సెస్,

ఎంత కాలమని ఎదురుచూడను
నీ అడుగుల చప్పుడు
నా బతుకులో వినపడటానికి

నిరాశ నా జీవితాన్ని
బీడు భూమిలా చీల్చి వేసినప్పుడు
వేయి అడుగుల లోతులోని
ఆశల నీళ్ళు చేది తీసుకొచ్చి
భూమిని తడిపి
ఎదురుచూసా
నువ్వు వస్తావని

వచ్చి
పన్నీటి వర్షాన్ని నేలకి దించుతావని
నా కన్నీటి ఎరువులతో
పూలవన సేద్యం చేస్తావని
నత్త గుల్లల్లాంటి కళ్ళ లోపల ఒత్తులేసుకుని
చేతుల్లో పూమాల పట్టుకుని
గుమ్మం ముందర నిలబడ్డా

కానీ
ఓనాడు..
ఇంకేముంది గెలిచేసానని నేను అనుకున్నప్పుడు
నన్ను అభినందిద్దామని అందరూ పోగైనప్పుడు

నువ్వు ఎంతకీ రాకుండా
నన్ను అవమానం పాలుచేసి
మనసు లోతుల్లో చేసిన గాయాలు
నిత్య శీతాకాలం లాంటి నా జీవితంలో
ఇప్పటికీ మానిపోక
బాధని బయటకి చెప్పుకోలేక
చీకటి బురఖాలతో ముఖం కప్పుకుని
తిరుగుతున్నా

ఏదో ఒక రోజు
విజయ సమీరాలు నన్ను ఆవహించి
బతుకు చిగురించకపోదా అని..

 

Exit mobile version