“జీనియస్” అని చెప్పుకుంటున్న చిత్రం

0
2

[box type=’note’ fontsize=’16’] “జీనియస్ అని చెప్పుకుంటున్నది మెదడును తాకదు. అన్నీ అలా అలా గాల్లోకి….” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “జీనియస్” సినిమాని సమీక్షిస్తూ. [/box]

1981లో “శ్రధ్ధాంజలి”తో హిందీ సినెమాలో దర్శకుడుగా అడుగుపెట్టిన అనిల్ శర్మ 2001లో తీసిన “గదర్” పెద్ద హిట్టు. “గదర్” స్వభావంలో సామ్యం వున్న మరో చిత్రమే ఇప్పుడు విడుదలైన “జీనియస్”. ఇందులో తన కొడుకు ఉత్కర్ష్ శర్మనే హీరోగా రంగప్రవేశం చేశాడు.
కథంటూ యేమీ లేదు. అన్నీ కాస్త కాస్త కలిపి వండారు. కొంచెం ప్రేమ, యెక్కువ దేశభక్తి, ఐఐటి “తెలివితేటలు”, భారత దేశమూ, పక్క పక్క దేశాల మధ్య సైనిక, రాజకీయ వైషమ్యాలు, ISI, RAW, NSA SECURITY HACKING ఇలాంటి మాటలు వూరూరికే వినబడుతుంటాయి చాలా గంభీరంగా. సారాంశంలోకి వెళితే అంతా డొల్ల.
గుజరాత్ లోని పోర్బందర్‌లో వొక టాస్క్‌లో RAW అధికారి వాసుదేవ్ శాస్త్రి లేదా వాసు (ఉత్కర్ష్ శర్మ) తీవ్రంగా గాయపడతాడు. అతనితో పాటు వెళ్ళిన ఇతర సభ్యులు చనిపోతారు. చెవి దగ్గరినుంచీ దూసుకెళ్ళిన బుల్లెట్ కారణంగా అతనికి టినిటస్ అనే వ్యాధి వస్తుంది. చెవిలో నిరంతరం గింగురు శబ్దం వస్తూ మనుషులను పిచ్చెక్కించి కొండొకచో ఆత్మహత్యదాకా తీసుకెళ్ళగల వ్యాధి. అతని ఆరోగ్య కారణాలు నెపంగా అతన్ని ఉద్యోగంలోంచి తొలగిస్తారు. మథురా అల్లర్లలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పసి బిడ్డడు వాసును అక్కడి పూజారి దగ్గరకు తీసుకుని పెంచి పెద్ద చేస్తాడు. పెద్దయ్యాక ఆ మారణకాండ వెనుక ISI వున్నదని తెలిసి అతను RAWలో జేరడానికి ఒప్పుకుంటాడు. (నేను వాడిన పదం ఒప్పుకుంటాడు అని. ఇలాంటి విచిత్రాలన్నీ సినెమాల్లోనేగా చూస్తాం). అతన్ని జేర్చుకోవడానికి అతని దగ్గర వున్న యోగ్యత అతని అపారమైన “జీనియస్” తెలివితేటలు. NSA (మిథున్ చక్రవర్తి) వాసుని తొలగించినా అతని టీం అధికారి దాస్ (ఎం కే రైనా) అతన్ని చూసుకోవడానికి అమెరికా నుంచి వచ్చిన అతని ప్రియురాలు నందిని (ఇషితా చౌహన్) ను దగ్గరకు పిలిచి వాసుకి పొంచి వున్న ప్రమాదాలు చెప్పి జాగ్రత్తగా చూసుకొమ్మని చెబుతాడు. ఆ తర్వాత చనిపోయారని అనుకుంటున్న అతని టీం సభ్యులు వొక్కొక్కరే ప్రత్యక్షమవడం, అందరూ కలిసి వొక ప్రత్యేక మిషన్ మీద సగంలో ఆగిన ప్రాజెక్టును కొనసాగించడం మిగతా కథ. సినెమా అన్నాక కాస్తైనా రొమాన్సుండాలి కదా. ప్రథమార్థంలో కాలేజీలో కలిసి చదువుకుంటున్న ఇద్దరి మధ్యా చాలా పాటలు వుంటాయి, సహజంగానే.
స్క్రీన్‌ప్లే నాసిరకం, కనీసం continuity కూడా సరిగ్గ చూసుకోలేదు. దర్శకత్వం గురించి యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కథాంశం యెలా వున్నా “శ్రధ్ధాంజలి”, “గదర్”లలో కాస్త ఆసక్తికర కథనం వుంది. ఇది సినెమా చివరిదాకా చూడడం ప్రేక్షకుని సహనానికి పెట్టిన పరీక్షే. అసలు ఇంటర్వల్‌కు ముందు “విశ్రాంతి” అని వేయక “జీనియస్ బెగిన్స్” అని వేశాడంటేనే అర్థం చేసుకోండి మొదటి సగం మొత్తం ఉపోద్ఘాతానికీ సొల్లుకీ వాడేశాడని. అయితే ఇంటర్వల్‌కు ముందు అప్పుడే ప్రవేశిస్తాడు నవాజుద్దీన్ సిద్దిఖి. అవును కదా, మనం ఇతని పేరు చూసే కదా వచ్చాం అనుకుంటాడు ప్రేక్షకుడు. కాని అతనికి కూడా పెద్ద పాత్ర లేదు. విందు భోజనంలో నాలుగు సలాడ్ ముక్కలిచ్చారు బకాసురుడికి. అయినా అందులో వో పెద్ద ముక్క: ఆసుపత్రిలో వాసును చూడడానికి వెళ్ళినప్పుడు పెద్ద సన్నివేశంలో తన సత్తా చూపిస్తాడు తన వాచకం ద్వారా, హావభావాల ద్వారా. కాని అతని పాత్రను బాగా మలచి వుండి వుంటే గొప్ప నటనకు ఆస్కారముండేది. ఇంకా యెవరి నటనా చెప్పుకోతగ్గదిగా లేదు. సంగీతమూ ఆకట్టుకోదు.
ఇక్కడ కొన్ని మాట్లాడుకోవాలి. దేశభక్తి అని చెప్పుకుంటున్నప్పుడు చాలా సటల్‌గా కొన్ని సంకేతాలను వాడుతున్నాడు దర్శకుడు. వాసుదేవ శాస్త్రి, అన్నీ వేదాల్లోనే వున్నాయిష, మథురా, రాధే రాధే పలకరింపు, కృష్ణుడు-గీత, కాషాయం, పిలక శాస్త్రి వేషం (IITRలో), గుళ్ళలో బాంబులు వగైరా. ఆ స్కిజోఫ్రీనియా, ECT జోకులను భరిస్తాం కాని, ఇది కొంచెం ప్రమాదకారి బుర్ర తోముడు కదా.
రొమాన్స్ చూపించాడు విస్తారంగా కాని అది హృదయాన్ని తాకదు. జీనియస్ అని చెప్పుకుంటున్నది మెదడును తాకదు. అన్నీ అలా అలా గాల్లోకి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here