గెట్ వెల్ నౌ

1
3

[శ్రీ మల్లాది లక్ష్మణ శాస్త్రి రచించిన ‘గెట్ వెల్ నౌ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ద[/dropcap]క్షిణామూర్తి బాసింపట్టు వేసుకుని కూర్చుని కల్వంలో వేసిన దినుసులు పావుగంటగా నూరుతున్నాడు. బయట అరుగుమీద కూర్చున్న వెంకట్రావు మందుకోసం నిరీక్షిస్తున్నాడు. అజీర్తితో ఇబ్బంది పడుతున్న భార్యకి మందు చేరవేయాలి. భట్టిప్రోలులో బొడ్రాయి పక్కనే వెంకట్రావు ఇల్లు. రెండు కిలోమీటర్లు సైకిలు ఇంటిదాకా తొక్కి పొలంపని చూసుకోవటానికి మళ్ళీ ఇటువైపే రావాలి.

“అమ్మీ, రెండు ముక్కలు దాసినచక్క, చిటికెనవేలంత ఎష్టి మధురం పట్రా. వెంకట్రావుని ఎక్కువసేపే కూర్చోపెట్టాను”, వంటింట్లో ఉన్న శారదాంబతో అన్నాడు దక్షిణామూర్తి. సాధ్యమైనంత వరకూ తాజాగా తయారుచేసిన మందులే ఇస్తాడాయిన. తండ్రితాతల ఆయుర్వేద విద్యనే ఆయనా పరంపరాగతంగా కొనసాగిస్తున్నాడు. వాళ్ళు స్థానికంగా ఉన్న భట్టిప్రోలు చుట్టుపక్కల దొరికే మూలికలు, సాధారణంగా వంటల్లోవాడే సంగతులతోపాటు విజయవాడలో పేరున్న వైద్యశాలనుంచి తెప్పించిన మందులు అవసరాన్నిబట్టి కలుపుకుని వాడేవారు. దక్షిణామూర్తి వాళ్ళ హస్తవాసి పుణికిపుచ్చువటమేకాక ఇటీవల కాలంలో ఆయుర్వేదం తొక్కుతున్న కొత్తపుంతలు గమనిస్తూ స్థానికులకి మెరుగైన వైద్యం అందిస్తున్నాడు. కేరళ వైద్యులనించి కొన్నిమందులు తెప్పించుకుంటాడు.

దక్షిణామూర్తి వయస్సు యాభైసంవత్సరాలు. ఇంటినుంచి అరకిలోమీటరు దూరంలో రెండెకరాల మాగాణి, ఇంకో రెండు చేలవతల ఎకరం మెట్టపొలం పిత్రార్జితంగా సంక్రమించాయి. క్రమం తప్పకుండా పొలంపని చేసుకోవటం వలన కాయానికి ధృడత్వం, మనసుకు ప్రశాంతత చేకూరాయి. ఒకరకంగా అవీ పిత్రార్జితాలే. వెంకట్రావు వంటి సాటిరైతులు ఆయన్ని అభిమానిస్తారు. చేయించుకున్న వైద్యానికి చాతనయినయినన్ని కుంచాలు ధాన్యం, అపరాలు కొలుస్తారు. ఏరోజుకారోజు తోటలనించి అప్పుడేకోసిన కూరగాయలు ఆయన వంటింటికి చేరతాయి. దక్షిణామూర్తి కుటుంబంలో ఆరోగ్యానికి ఆనందానికి కొరతలేదు. కాని ఆయనకున్న అన్నిరకాల రొక్కపు నిల్వలు కలిపి చూసినా లక్షరూపాయలు దాటవు. ఎప్పుడైనా ఎవరైనా డబ్బు ప్రసక్తి ఆయన దగ్గరకి తెస్తే ‘నాకేం, నేను లక్షాధికారిని!’ అని సంతృప్తిగా నవ్వుతాడు. తన చుట్టూ ఉన్నవారికి స్వస్థత చేకూర్చడమే ఆయన జీవితానికి సార్ధకత.

దక్షిణామూర్తి తండ్రి దేవీ ఉపాసకుడు. పది సంవత్సరాల క్రితం ఆయన పొలంగట్టు మీద ధ్యానం చేసుకుంటూ హఠాత్తుగా చనిపోయాడు. కపాల మోక్షం అయిందని ఊరివాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంట్లో తల్లి అనసూయమ్మ గారు, భార్య శకుంతలమ్మ, ఈమధ్యే పద్దెనిమిది నిండిన కూతురు అపరాజిత.

అత్తాకోడళ్ళు వారిదైన ప్రపంచంలో ఒకరికోసం ఒకరు, తృప్తి జీవితానికి పర్యాయపదం అన్నరీతిలో కాలం గడుపుతున్నారు. ఇద్దరి దినచర్య, అభిరుచులు ఒకే రకంగా ఉంటాయి. ఇంటి పనులు వంట పనులు కలిసి చేసుకుంటారు. పోతన భాగవతం, తేలిక తెలుగులో రాసిన ధార్మిక పుస్తకాలు చదువుకుంటారు.

వెంకట్రావుకి మాత్రలు, కషాయం ఇచ్చి పంపించేసిన తర్వాత దక్షిణామూర్తి స్నానం చేసి పూజ గదిలో కొంతసేపు గడిపి పొలానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు.

“నాన్నగారూ మీతో మాట్లాడాలి. రెండు నిమిషాలు కూర్చోండి.” అపరాజిత గొంతులో అభ్యర్థన లేదు. తండ్రి పట్ల గౌరవం మాత్రం ఉంది.

తలపాగా చుట్టుకుంటూ ముందు గదిలో ఉన్న ముక్కాలు పీటమీద మౌనంగా కూర్చున్నాడు దక్షిణామూర్తి. శకుంతలమ్మ చేస్తున్న పని ఆపేసి తడిచేతులు కొంగుకు తుడుచుకుని తండ్రీ కూతుళ్ళ సంభాషణ వినటానికి వంటింటి గుమ్మం దగ్గర నిలబడింది.

“ఒక వారంరోజులు ఇంట్లో ఉండను నాన్నగారూ. నేనూ అరిహంత్ కలిసి కంబోడియా చూసివస్తాము. నాలుగురోజుల్లో బయల్దేరుతున్నాము.”

అర నిమిషం పాటు ఎవరు మాట్లాడలేదు. శకుంతలమ్మ గుండెవేగం కొద్దిగా తగ్గిన తర్వాత పరిస్థితిని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేసుకుంటోంది. బియ్యే అయిందని వారంరోజుల క్రితం అపరాజిత తండ్రితో చెప్పగా విని ఎంతో ఉప్పొంగిపోయింది. ఇక పెళ్ళి సంబంధాలు చూడాలేమో అని భర్తతో అనటానికి ధైర్యం చాలలేదు. కంబోడియా ఏదో దూరదేశం అని, వెళ్లి రావడానికి ఛార్జీలు చాలా అవుతాయని ఊహించింది. ఈడొచ్చిన పిల్ల పరాయి మగాడితో దేశాలు తిరగడమేమిటి? ఈ ఉత్పాతంలో తన పాత్ర ఏమిటో ఊహకందలేదు. కోడలు తనకెలాగూ నెమ్మదిగా వివరం చెపుతుందని తెలిసిన అనసూయమ్మగారు చెవులు రిక్కించలేదు. పెసలు చెరగటం ఆపలేదు.

దక్షిణామూర్తి ఆశ్చర్యపడలేదు. పడినా, అది ముఖంలో కనబడలేదు, గొంతులో వినబడలేదు. “మొక్కజొన్న అమ్మగా వచ్చిన అయిదువేలు ఇంకా తియ్యలేదు. గాయత్రి అమ్మవారి పటం వెనుక పెట్టాను. పనికొస్తాయేమో తీసుకో. నేను బయల్దేరుతాను.” లేచి చేతికర్ర అందుకుంటూ అన్నాడు.

“అవసరం లేదండీ. సాయంత్రం మీరు తీరిగ్గా ఉన్నప్పుడు యాత్ర వివరాలు చెపుతాను.”

***

అరిహంత్ వాళ్ళనాన్నకి భట్టిప్రోలు రథం సెంటరులో చిన్న పచారీ కొట్టు ఉంది. స్తూపానికి దగ్గరలో వాళ్ళ పెంకుటిల్లు. ఆయనకున్న మూడెకరాల మాగాణి కౌలుకిచ్చాడు. తినటానికి గింజలుంచుకుని, మిగతా ధాన్యం అమ్ముకుంటే సాలుకి ఇరవై వేలు వస్తాయి. పొదుపుగా ఇల్లు నడుపుతూ కొడుకునీ కూతుర్నీ చదివిస్తున్నాడు. కూతురు పదోక్లాసు కొచ్చింది. అరిహంత్ బి.ఏ. ఇంగ్లీష్ సెకండ్ క్లాస్‌లో పాసయ్యాడు. చదువులన్నీ భట్టిప్రోలులోనే.

ఆయనకి దక్షిణామూర్తి గారి వైద్యం మీద, మాటమీద మంచి గౌరవం. అపరాజిత హుందాతనం, ఆత్మస్థైర్యం చూస్తుంటే ఆయనకి ముచ్చటేస్తుంది. అయిదారుసార్లకి మించి ఆమె ఆయనకి కనబడలేదు. కనిపించిన ప్రతిసారీ ఆ పిల్ల ముఖంలో బెజవాడ దుర్గమ్మ వర్చస్సు చూశాడు. ఆ అమ్మాయికి కొడుక్కీ ఒకటే బడిలో చదవటం వలన స్నేహం ఉందని ఆయనకి తెలుసు. కానీ వయసొచ్చాక వారు దూరంగా ఉంటేనే మంచిదేమోనని అనుకున్నాడు. ఇవాళో రేపో తన అభిప్రాయం అరిహంత్‌కి చెపుదామనుకుంటూనే ఉన్నాడు, పిల్లలిద్దరికీ పద్ధెనిమిది నిండాయి.

అకస్మాత్తుగా కొడుకు ఆ పిల్లతో కలిసి విదేశీ పర్యటన చేస్తానని చెపితే బిత్తరపోయాడు. వద్దంటే తన మర్యాద పోగొట్టుకోవటం తప్ప వాళ్ళు వెళ్ళక మానరు అని ఊహించగలిగినంత ఇంగితం ఉందాయనకి. వివరాలు అడిగాడు.

“ఖర్చు ఎంతవుతుంది?”

“ఒకరికి సుమారుగా నలభై వేలవుతుంది. నేను దాచుకున్నది పాతిక వేలు ఉన్నది. మీరో పదిహేను వేలు ఇవ్వండి. సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తాను.”

“మీ ఇద్దరితో పాటు ఇంకా ఎవరైనా వెళ్తున్నారా?”

“లేదు. మేమిద్దరమే.”

“విజయవాడ, గుంటూరు దాటి ఇప్పటివరకూ ఎక్కడికీ వెళ్ళలేదుకదా, అంత ప్రయాణం మీరిద్దరూ చెయ్యగలరా?”

“తప్పకుండా చెయ్యగలం. ఈ ట్రిప్ రెండు సంవత్సరాలనించి అపరాజితగారు నేను ప్లాన్ చేస్తున్నాం.”

పలకాబలపం వయస్సునుంచీ కలిసి చదువుకున్న పిల్లని ‘గారు’ అని ప్రస్తావించటం ఎంతో నచ్చింది ఆయనకి, సముఖంలో నువ్వు అని సంబోధించవచ్చుగాక.

“క్షేమంగా వెళ్ళి రండి. దూరదేశంలో డబ్బుకి ఇబ్బంది పడొద్దు. అయిదువేలు ఎక్కువ తీసుకెళ్ళు. మిగిలితే వెనక్కిచ్చేదువు గాని.”

***

అరిహంత్ ఇంటర్మీడియేట్ పాసయి సంవత్సరం అయింది. తను, అపరాజిత చదువుకున్న హైయర్ సెకండరీ స్కూల్లో అన్ని తరగతులు కలుపుకుని యాభైమంది విద్యార్థులు కూడా లేరు. చాలామంది భట్టిప్రోలు లాటి చిన్న ఊళ్ళో చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉండదని నిర్ధారించుకుని చదువులకోసం రాష్ట్రంలో పెద్దనగరాలకి, కొంతమంది దేశంలో మహానగరాలకి, మరి కొంతమంది సంపన్నుల పిల్లలు విదేశాలకి వెళ్లిపోయారు. టెన్త్ క్లాస్ గట్టెక్కి చదువు విరమించుకుని బ్రతుకు బాట వెతుక్కుంటున్న వారు కొందరయితే, టెన్త్ తప్పిన కొందరు పునఃప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్ ఉన్న ఊళ్ళోనే చదువుకుందామని సర్దుకున్నవారు అధికభాగం సైన్సు, తరువాత కామర్సు ఎంచుకున్నారు. వెరశి ఇంటర్మీడియేట్ ఆర్ట్సులో మిగిలింది పదిమంది.

స్కూలులో అపరాజిత కొద్దిమందితో కొద్దిగా మాట్లాడేది. ఆ కొద్దిమందిలో అరిహంత్ ఒకడు. వస్తుతః తనకంటూ నిర్ణీతమైన భావాలు లేకపోవడం మూలాన కావచ్చు నిండుకుండలా ప్రత్యేకంగా ఉండే అపరాజిత పట్ల గౌరవం పెంచుకున్నాడు. ఆమె ఆర్ట్స్ ఎంచుకుంది కాబట్టి తనూ ఆర్ట్స్ తీసుకున్నాడు. భవితకి బి.యే.ఇంగ్లీష్‌కి మించిన పునాది ఏ సబ్జెక్టు వేయలేదని అందరితో అనేవాడు.

ఇంటర్ రెండో సంవత్సరం చివరలో ఆమె ఆలోచనాసరళి తెలుసుకోవటానికి కొన్ని అవకాశాలు దొరికాయి. ఆ అవకాశాలే క్రమేపీ అతని ఆత్మస్థైర్యం పెరగటానికి దోహదపడ్డాయి. లైబ్రరీలో విద్యార్ధులు తక్కువగా ఉన్న సమయంలో చిన్నగొంతుతో ఒకరోజు అడిగాడు. “అపరాజితా, మీ నాన్నగారు తలుచుకుంటే తనకున్న శాస్త్రజ్ఞానం, అనుభవం, హస్తవాసితో ఏ చిన్న పట్టణంలో ఆస్పత్రి పెట్టినా లక్షలు గడించగలరు. చదువుపట్ల నీకున్న అవగాహన, నీకున్న తెలివితో నువ్వు తలుచుకుంటే ఏ సిటీలో ఏ సబ్జక్టు అయినా చదవగలిగే దానివి. చదివి రాణించగలిగేదానివి. ఎందుకని మీరు భట్టిప్రోలు వదలటం లేదు?”

ఇన్నాళ్ళయినా నీకింకా తెలియలేదా అన్న అర్థం వచ్చేలా నవ్వుతూ అన్నది అపరాజిత. “మేము తలుచుకోలేదు కాబట్టి.”

అపరాజిత చిన్నక్లాసులనించీ మితభాషి. అవసరమయితే తప్ప నోరు విప్పని స్వభావం. అపరాజిత అందరిలో ఇమడలేని, ఇమడగలిగినా ఇమడని ప్రత్యేక వ్యక్తి అని టీచర్లకే కాదు, తోటి విద్యార్థులకీ తెలుసు. పెద్దగా పట్టించుకునేవారు కారు. ఆమె మానాన ఆమెని వదిలేసేవారు. ఎప్పుడూ ఏ సబ్జక్టులోనూ ఆ అమ్మాయికి క్లాస్ ఫస్ట్ రాలేదు. అరిహంత్‌ని మాత్రం అనుక్షణం ప్రపంచాన్ని దీక్షగా చదువుతున్న అపరాజిత కళ్ళు మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అతనికి తెలియకుండానే ఆమెలోని ప్రత్యేకతని అర్థం చేసుకుని దానికి ఒక నిర్వచనం ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. ఏడోతరగతి నుంచీ ఆమె కళ్ళని చదవటానికి ప్రయత్నం చేసేవాడు, తను చదువుతున్నట్లు సాధ్యమైనంతవరకూ ఇంకెవరూ గమనించకుండా జాగ్రత్తపడుతూ.

ఇంటర్‌లోనే క్లాసు పిల్లలందర్నీ ఒకరోజున ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు భట్టిప్రోలు వచ్చిన సందర్భంలో జగత్ప్రసిద్ధి చెందిన భట్టిప్రోలు స్తూపం సందర్శించటానికి స్కూలువారు తీసుకెళ్ళారు. ఆయన స్తూపం గురించి వారికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వివరించాడు.

ప్రతీపాలపురం (ప్రస్తుత భట్టిప్రోలు) క్రీ.పూ.300 ప్రాంతంలో నిర్మించబడి సహస్రాబ్దం పైన విరాజిల్లిన స్తూపం దాని అనుబంధ రాజ వంశాలు, నాగరికత, బౌద్దమత ఔన్నత్యం, ఆ కాలపు భారత ప్రజల మానసిక పరిణతి, వారి ధనసంపద గురించి మనకి ఎన్నో వెలకట్టలేని పాఠాలు, చరిత్ర, సాక్ష్యాధారాలతో నేర్పుతుంది. అశోకుని కంటే పూర్వమే బౌద్ధులు ఈ ప్రాంతాన్ని బుద్ధభగవానుని ధర్మమార్గాన్ని అభ్యసించడానికి, ధ్యానానికి అనువైన ప్రదేశంగా గుర్తించి తథాగతుని ధాతువులు శిలామంజూషికలలో స్తూపగర్భంలో నిక్షిప్తం చేసి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చలవరాతిపలకలు, వెండిబంగారాలు, రత్నాలు ఉపయోగించి స్తూపాన్ని నిర్మాణం చేశారు. ఆంధ్రులకి ప్రత్యేకమైన వాస్తుతో అలరారుతున్న ఈ కట్టడ పుట్టుపోర్వోత్తరాలు వివరించే శాసనాలు తెలుగు లిపికి ఆద్యమైన భట్రిపోలులిపిలో లిఖించారు.

భారతదేశంలో అనేక అమూల్యమైన కళాఖండాలు, నిర్మాణాలు నాశనం చెయ్యబడ్డట్లే భట్టిప్రోలు స్తూపం సైతం నేలకూల్చబడింది. దేశంలో వివిధ విగ్రహాలు, శిల్పాలు మహమ్మదీయుల దండయాత్రలలో ధ్వంసంచేయబడితే, భట్టిప్రోలు స్తూపాన్ని నేలకూల్చింది జైన ఛాందసవాదులు, ఆ తరువాత హిందూ ఛాందసవాదులు. క్రమేపీ భారతదేశంలో ఉద్భవించిన బౌద్ధం భారతదేశంలో మచ్చుకైనా కనిపించకుండా రూపుమాపబడింది.

1890 సంవత్సరం పూర్వం వరకూ స్తూపశేషం ఉన్న దిబ్బని ‘లంజదిబ్బ’ అని, అది అనర్ధాలకి కారణం అన్న అపప్రధ లోకుల్లో ప్రాచుర్యంలో ఉండేది. అలెక్జాండర్ రియా అనే ఆంగ్లేయుడు తవ్వకాలు జరిపించగా దొరికిన పాలరాతి స్తంభాలని, పలకలని స్థానిక అధికారులు భద్రపరచకపోగా విరగకొట్టించి వేరేచోట్లకి తరలించారు.

శాస్త్రజ్ఞుడు చెప్పిన అనేక విషయాలని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు. అరిహంత్ కూడా విన్నాడు. అందరిలాగా విని సరిపెట్టుకోలేకపోయాడు. అతనిలోని సంవేదనాశీలత అతన్ని కలచివేసింది. రెండురోజుల తర్వాత సమయం చూసుకుని అపరాజితతో “శాంతికాముకులైన హిందువులు, శాంతికి, సహనానికి ప్రతీకమైన బౌద్ధాన్ని భారతదేశంనించి తరిమివేశారన్న నిజం నన్ను నలిపివేస్తోంది.” అన్నాడు. అపరాజిత వెంటనే స్పందించలేదు. తను ఎప్పుడూ అంతే. నిశితమైన విశ్లేషణా సామర్థ్యం, లోతైన అవగాహన అనేక విషయాలమీద ఉన్నప్పటికీ త్వరగా అభిప్రాయాలు చెప్పదు. తన నోటినుండి ఒక అభిప్రాయం బయటపెట్టే ముందు ఆ విషయం మీద ఇంకొంచెం పరిశ్రమ అవసరం అనుకుంటుందో ఏమో.

ఒక నిమముషం గడిచాక తొట్రుపాటు లేని గొంతుతో ఇలా అంది. “నిజం ఎప్పుడూ నలిపివేయదు. విభిన్న దృక్పథాలు ప్రగతికి సంకేతం. ఆవేశకావేషాలకి లోనుకాకుండా అవతలివైపువారి దృక్పథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే విజ్ఞత. పరిణతి చెందుతున్న నాగరికతకి సూచి. కాలక్రమేణా సమాజపు ఆలోచనాసరళి మారుతుంది. కొత్త దృక్పథాలు చిగురుస్తూనే ఉంటాయి.”

“కళ్ళెదురుగా ఘోరాలు జరుగుతుంటే మూర్ఖులు ఆటవికంగా ప్రవర్తిస్తుంటే ప్రతిఘటించకుండా తటస్థంగా ఉండటం నాగరికత అనిపించుకుంటుందా? ప్రతిఘటించగల శక్తియుక్తులుండీ పట్టనట్లు ఊరుకోవడం పరిణతి అవుతుందా?”

“అవదు. సందర్భానుసారంగా సరిపడే చర్య జనించవలసిందే. కానీ ఆవేశంలోంచి కాదు. హద్దులు దాటిన ఆవేశం ద్వేషానికి దారితీస్తుంది. ద్వేషం ఘర్షణకి మారుపేరు. చరిత్ర చూసిన వేలాది యుద్ధాలు, కోట్లమంది అమాయకుల ఊచకోతలు, మానభంగాలు కట్టలు తెంచుకున్న ద్వేషంయొక్క పర్యవసానమే. అవసరం వచ్చినపుడు అవతారపురుషుడైన శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించాడు. కానీ ద్వేషంతోకాదు. భక్తితో, గౌరవంతో, ప్రేమతో.”

అరిహంత్‌కి అర్థం కాలేదు కానీ అపరాజిత మాటల్లో ఏదో నిగూఢత ఉందని తోచింది.

అపరాజితకి ఆకాశవాణి నీజీవితం ఇరవైఇరవైఅయిదు సంవత్సరాలకి మించి ఉండదు అని చెప్పిందేమో. లేకపోతే ప్రతిసెకనునుంచి జుర్రుకోవాలనే సంకల్పం దేనికి? ఫాషన్లో ఉన్న దుస్తులు వేసుకుందామనే కోరిక లేదు. పదిహేనేళ్ళ వయసు ఆడపిల్లలకుండే వస్తువ్యామోహం లేదు, స్నేహితులతో కలిసి కబుర్లాడుదామని, సినిమాలు చూద్దామని అసలే లేదు. ఎంతసేపటికీ ఏదో ఒకటి చదువుకోవటం; సముద్రాన్ని, పంటపొలాలని, పూలని, పక్షుల్నీ చూసుకుని పొంగిపోవటం. తను గమనించింత శ్రద్ధగా అపరాజితని ఎవరూ గమనించరు. పిల్లలూ పెద్దలు ఆమెని పట్టించుకోడం ఎప్పుడో మానేశారు. బాహ్యంగా ఏ ఆకర్షణా లేని మనిషి. చామనచాయ, కౌమార్యపు కళకళలు కనబడని రూపం. అన్ని లావణ్యాలు ప్రోది చేసుకుని కళ్ళలో దాచుకుంది. తన అదృష్టమో, ప్రపంచం దురదృష్టమో, ఆకళ్ళలోని కాంతిపుంజాలని తను ఒక్కడే చూడగలుగుతున్నాడు.

“అప్పుడప్పుడు ఏదో రాసుకుంటూ ఉంటావు అవి కవితలా? ఎవరికన్నా చూపించడమో, ప్రచురించడమో చేయవచ్చుగా!”

“ఏవో పిచ్చి రాతలు. ఇవేమైనా కీట్స్, వర్డ్స్‌వర్త్ కవిత్వాలా ప్రచురించడానికి? ఆలోచనలు క్రమబద్ధీకరించుకునే ప్రక్రియ. రాసుకుని చించివేసుకునే స్థాయి.”

ఆమెతో అప్పుడప్పుడు సంభాషిస్తూ ఉండటంవలన అయిఉండవచ్చు తన ఆలోచనలుకూడా గజిబిజిమార్గం వదిలి ఒక నిర్దిష్టమైన రూపం, దిశ సంతరించుకుంటున్నాయి. ఆసంగతి అతను గుర్తించగానే మనసు తేలికపడితే ఉదయించే ఆహ్లాదం కూడా అనుభూతమవుతోంది. ఆమెపట్ల చిగురుస్తున్న అనిర్వచనీయమైన ఆకర్షణ మాత్రం అతన్ని కొంత కలవరపరుస్తోంది.

ఈమధ్య తనతో మాట్లాడుతున్నపుడు అపరాజిత పెదవులమీద చిరునవ్వు లాటిదేదో మెరుస్తోంది. ఆమెని వివిధ విషయాలపై ప్రశ్నించగలిగే చొరవ వస్తోంది. చదరంగంలో అభిరుచి, ప్రావీణ్యం మెండుగా ఉన్న ఆటగాడు తనతో ఆడేవారెవరూ లేక దొరికినవాడిని కూర్చోపెట్టుకుని, పావులు ఎలా కదపాలో నేర్పి కొంత స్థాయి వచ్చేదాకా శిక్షణచేసి అప్పుడు శిష్యడుతో ఆటాడుకున్నట్లు ఇప్పుడు తనతో మాట్లాడుతోంది.

ఒక సందర్భంలో దక్షిణామూర్తి గారి ప్రస్తావన వచ్చింది. “నాన్నగారిని మించిన సంపూర్ణ వ్యక్తి నాకింతవరకూ ఎవరూ తటస్థ పడలేదు. ఇంగ్లీషులో చెప్పింది. “ఆయనకి చదువు, ఆస్తి లేవు. లోకజ్ఞానం కూడా లేనట్లే. పుస్తకాలు చదివే అలవాటు లేదు. కాలక్షేపాలు లేవు. అయినా ఆయన సంపూర్ణ వ్యక్తి. ఒకవేళ చదువు, సంపద, విజ్ఞానం, హాబీలు ఉండి ఉన్నా ఆయన సంపూర్ణతకి భంగం వాటిల్లేది కాదు. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు. ఫ్రిజ్ లేదు. టీవీ లేదు. ఎప్పుడూ వేసి ఉంచే మంచాలు లేవు. ఒక పెడెస్టల్ ఫాన్, సర్పంచ్ గారు రోగులు పిలవడానికి పనికొస్తుందని కొనిపెట్టిన ఫోను తప్ప ఇంట్లో ఏ చరాస్తీ లేదు. నాకింతవరకూ స్కూల్ ఫీజులు కట్టారు. డబ్బుకూడకట్టుకొని నెమ్మదిగా నాకోసం సెకండ్ హాండ్ స్కూటీ కొనమని ఎవరో ఆయనకి సలహా ఇచ్చారు. నాకు ఆయన కొనడంపట్ల ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు.

అస్వస్థతగా ఉన్నవారు మందుకోసం ఆయన దగ్గరకి వారిని నాలుగు ప్రశ్నలడిగిన తర్వాత నాడి పరీక్షిస్తారని నీకు తెలుసుకదా. ఆ రెండు నిమిషాలు ఆయన కళ్ళు మూసుకునే ఉంటారు. రోగి మానసిక, శారీరక స్థితి ఏ ప్రయోగశాల కనిపెట్టలేనంత క్షుణ్ణంగా ఆయనకి అవగతమవుతా యనుకుంటాను. వస్తుధర్మాలు వస్తుగుణదీపిక చెప్పలేనంతగా ఆయనకి జన్మతః తెలుసేమో. ఆయన ఇచ్చిన మందులు తీసుకుంటూ ఆయన చెప్పిన ఆహారనియమాలు పేషెంట్లు శ్రద్ధగా పాటిస్తారు. రోగం తగ్గలేదని నాకుతెలిసి ఎవరూ తిరిగి రాలేదు. ఆయన హస్తవాసి ఎరిగిన అనేకులు దూరప్రాంతాలనించీ వస్తూనే ఉంటారు. వైద్యం చేసినందుకు ఎవరినీ డబ్బు అడగరు. ఆఖరికి మందులఖర్చు కూడా అడగరు. తోచినంత ఇచ్చేవాళ్ళు ఇస్తే వద్దనరు. మందులుకొనటానికి, ఇంటి ఖర్చులకీ ఆడబ్బు ఎక్కీతొక్కీ.

ఎప్పుడూ బయటికి చెప్పరు కానీ అవసరానికి మించి ధనం సంపాదించడం, డబ్బుని ఇనప్పెట్టెలో బంధించడం ఆయన దృష్టిలో దుష్కార్యాలు. సమాజానికి మనిషిచేసే అపకారం.”

“వ్యవసాయం సంగతేమిటి?”

“వ్యవసాయం వైద్యం ఆయనకి చెరోకన్ను. అస్వస్థునికి స్వస్థత చేకూర్చడానికి సహకరించినందుకు రోగికీ, తనకి అబ్బిన ఆయుర్వేదానికీ ఆయనకి కృతజ్ఞతాభావం ఉన్నట్లే తన కుటుంబం కోసం తన తోటివారి కోసం ఆహారం పండించడానికి సహకరిస్తున్న భూమిపట్ల కూడా ఆయనకి కృతజ్ఞతాభావం. మనిషిని ఒక మెషిన్‌గా నిర్వచించి వేలపార్శ్వాలుగా మనిషిని తునాతునకలు చేసి ఒక్కోతునకకీ ఒక్కోమందు అని మెషిన్ల ద్వారా నిర్ధారించి యాంత్రికంగా రసాయనిక మందులు విచ్చలవిడిగా ఉపయోగించే ఈ రోజుల్లో, ప్రతి మనిషి భగవంతుని సృష్టిలో ఒక సంపూర్ణ, విశిష్టప్రాణి అని మనిషిని మనిషి అని గుర్తించి అయిదు వేల సంవత్సరాల క్రితమే మనదేశపు మహర్షులు రూపొందించిన, కాలక్రమేణా సమగ్రత సంతరించుకున్న ఆయుర్వేదాన్ని వినియోగించగలుగుతున్నందుకు ఆయనకి తృప్తి. అలాగే ఈనాటికీ నాన్నగారు రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వాడకుండా సంప్రదాయిక గోఆధారిత ఎరువులు వాడుతూ పంటలు పండిస్తున్నారు. చుట్టుపక్కల వందల ఎకరాలలో రైతుల్ని ప్రభావితం చేస్తున్నారు. తెలియకుండానే పర్యావరణానికి ఎనలేని సేవ చేస్తున్నారు.

వైద్యం, వ్యవసాయం ఆయనకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, దేహదార్ఢ్యాన్ని, స్నేహితులని సంపాదించి పెట్టాయి. చేతినిండా పనికివచ్చే తనకి నచ్చే పని, కంటినిండా కలలులేని నిద్ర, తినటానికి కమ్మని భోజనం, పీల్చటానికి కాలుష్యం లేని పైరగాలి, స్నేహం చెయ్యటానికి పశుపక్షులు, సపరివారంగా సంతృప్తి – ఇంతకన్నా ఎక్కువ ప్రపంచంలో పొందడానికి ఎవరికి మాత్రం ఏముంటుంది?”

అపరాజితకి అంతశక్తి ఎక్కడనించి వస్తోందో ఇన్నాళ్ళకి అరిహంత్ ఊహించగలిగాడు.

***

భట్టిప్రోలులో కౌతావారిది సంపన్నకుటుంబం. నాలుగైదు తరాలుగా ఇక్కడే స్థిరపడ్డ కౌతావారు పక్కపక్కనే కట్టుకున్న నాలుగైదు ఇళ్ళలో అన్నదమ్ముల సంతతివారు ఒకేకుటుంబంగా జీవిస్తున్నారు. అరవై ఏళ్ళక్రిందట కౌతా అనంతరామయ్య అనే వ్యక్తి పెద్దగా చదువుకోపోయినా ఎలా చేరాడో గాని అమెరికా చేరుకుని త్వరలోనే అమెరికా పౌరసత్వం సంపాదించాడు. రెండు చేతులా డాలర్లూ సంపాదించాడు. అమెరికా అంటే మోజు పెంచుకుని రెండేళ్ళకోసారి భట్రిపోలు రావడం, కుటుంబీకుల్ని ఒకరి తరువాత ఒకరిని అమెరికా తరలించడం జీవితాశయంగా పెట్టుకున్నాడు. పౌరసత్వం సంపాదించి గుంజపాతిన వారు కూడా అనంతరామయ్య ఆశయాన్నే పాటిస్తూ అరవైఏళ్ళలో అయిదువందలమంది దాకా భట్టిప్రోలు కుదురువారిని అమెరికా దేశం నలుమూలలా స్థిరపరచండంలో కృతకృత్యులయారు.

పరంపర ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. అనంతరామయ్యగారు కాలంచేశారుగానీ ఆయన మనవడు ఆదినారాయణ అదే ప్రయత్నంలో భట్టిప్రోలు చేరాడు. ఇంగ్లీషుభాషలో మంచి పట్టు ఉన్నవారు అమెరికాలో ఎక్కువ రాణించగలరని ఆదినారాయణ అనుభవంమీద తెలుసుకుని, తన కుటుంబంలోని అమెరికా ఆశావహులకి ఇంట్లోనే ఇంగ్లీష్ పాఠాలు నేర్పించాలని తలపెట్టాడు. ఈ ప్రయత్నంలో భాగంగా దక్షిణామూర్తి గారి అమ్మాయికి మంచి వొకాబ్యులరీ ఉందనీ, వాక్యనిర్మాణం ఇంపుగా ఉంటుందనీ తెలిసి ఆ అమ్మాయిని కలిసాడు. అయిదు నిమిషాలు మాట్లాడి, విషయం చెప్పాడు. అపరాజిత జవాబిచ్చింది.

“సార్, ప్రయత్నం చేస్తాను. నేనూ తెలుగు మీడియంలో చదువుకుంటున్నదాన్నే. మీరిచ్చిన ఈ అవకాశం ద్వారా ఇంగ్లీష్ నేర్పించటం కంటే నేర్చుకోవటం ఎక్కువ జరుగుతుంది. అయితే మీరన్నట్లు క్లాసుకి వంద రూపాయలు తీసుకోలేను. యాభై చాలు. అదీ నేను ఈ పని సవ్యంగా చేస్తున్నానని నాకు నమ్మకం కుదిరిన రోజునించీ.”

అనతికాలంలోనే కౌతావారి హాలులో ఇరవైమంది కౌతా కుటుంబం వారేకాక పదిమంది బయటివారుకూడా అపరాజిత క్లాసులో చేరారు. టీచరో, విద్యార్ధో తెలియని స్థానంలో అరిహంత్ కూడా భాగమయ్యాడు. ఆదినారాయణ తను సంవత్సరం ఉపయోగిచి వదిలేసిన లాప్‌టాప్ ఒకటి వాడుకొమ్మని అపరాజితకివ్వబోయాడు. ధర కట్టుకొమ్మంది. విద్యార్థులకీ ఉపయోగపడే వస్తువుకి ధర కట్టరన్నాడు ఆదినారాయణ. వైఫై కూడా ఏర్పాటు చేశాడు. ఒకరోజు “ఏమ్మా, నీకు అమెరికాలో చదువుకోటానికి, స్థిరపడటానికి ఆసక్తి ఉందా? నేను ఏర్పాటు చెయ్యగలను. మీ నాన్నగారితో మాట్లాడనా?” అని అడిగాడు. ఎంతమాత్రం ఆసక్తి లేదని మర్యాదగా బదులిచ్చింది.

రెండునెలలు లాప్‌టాప్ మీద అపరాజిత విశేష కృషిచేసింది. ప్రపంచంలో నేర్చుకోవలసిన సంగతులు ఎన్నెన్ని ఉన్నాయో, పద్ధతిగా వాటిని ఎంత తక్కువ సమయంలో నేర్చుకోవచ్చో, సాంకేతికత ఈతరం వారికి ఎంతగొప్ప వరమో తెలుసుకుంది. లైబ్రరీలో దొరకని అనేక గొప్ప పుస్తకాలు చేతికందివచ్చాయి. వికీపీడియా జీవితంలో అతిముఖ్యమైన భాగం అయిపోయింది. బ్రిటిష్ ఇంగ్లీషు, అమెరికన్ ఇంగ్లీష్ ఉచ్చారణల తారతమ్యాలు అధ్యయనం చేసుకుంది. ఆమె అభ్యాసంలో అరిహంత్ అడపాతడపా కలిసేవాడు. సహాధ్యాయులుగా, సహాధ్యాపకులుగా వారు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపసాగారు.

అపరాజితకి అరిహంత్ ఒక మంచి స్నేహితుడు. అరిహంత్‌కి అపరాజిత అంతకంటే ఎంతో ఎక్కువ. పదహారేళ్ళ వయసులో మగవాడికి ఆడపిల్ల పట్ల ఉండే సహజమైన ఆకర్షణకంటే ఎంతో గాఢమైనదేదో తనకి అపరాజితలో కనిపిస్తోందని అతనికి అనుభవమవుతోంది. ఆ సంగతి ఆమెకి తెలిసి తనని అసహ్యించుకుంటే? భరించగలడా? సర్వశక్తులు ఒడ్డి అయినా సరే అపరాజిత స్నేహం కాపాడుకోవాలి. ఆమె ఎదురుగా ఉన్న ప్రతిక్షణం జాగరూకతతో మెలగాలి.

***

ఇంటర్ ఫైనల్ పరీక్షలకి కొన్ని రోజులు ముందు డిగ్రీ చదువు సంగతి స్పష్టమైన ప్రణాళికతో అపరాజిత సిద్ధం చేసుకుంది. దక్షిణామూర్తి గారు ఆయనదైన హుందా జీవితం గడుపుతున్నారు. అది తనకొక గర్వకారణం. డబ్బు గురించిన ఆలోచనలు ఆయనకి రావు. భవిష్యత్తు, బాధ్యతలు, ఆర్థిక కష్టాలు అన్న వెంపర్లాటలు మనసుని కలుషితం చేయలేని మునిజీవితం ఆయనది. కూతురు మీద ప్రేమతో పాటు అపారమైన నమ్మకం. ఏతండ్రీ ఇవ్వనంత ఆస్తి తండ్రి తనకు ఇచ్చేశారని అపరాజితకి తెలుసు. ట్యూషన్లు బాగా నడుస్తున్నాయి. ఇరవైమంది దాకా పిల్లలు చేరారు. టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంగ్లీషుతోపాటు ఇతర సబ్జెక్టులు కూడా నేర్పిస్తోంది, తను నేర్చుకొంటోంది. అవసరం లేదనుకున్నా నెలకి అయిదువేల రూపాయలపైనే ఆదాయం వస్తోంది. కుశలతతో పొదుపు చేసుకుంటోంది, మదుపరితనంలో మెళకువలు నేర్చుకుంటూ. అమ్మకీ, నాన్నకీ, మామ్మకీ తన సంపాదనతో వాళ్ళకి ఉపయోగపడే వస్తువులేమైనా కొనగలిగే అవకాశం కోసం ఎదురు చూస్తోంది.

“నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బి.ఏ.కి రిజిస్టర్ చేసుకుంటున్నాను.” ట్యూషన్లు ముగించి జమ్మిచెట్టు కింద అల్లంటీ తాగుతూ అరిహంత్‌తో చెప్పింది.

మహా అయితే ఇంకో నాలుగు నిముషాలు అవకాశం ఉంది తనకి మనసులో మాట చెప్పేందుకు. అప్పుడే లాప్‌టాప్ బాగ్ బుజాన వేసుకొంటోంది ఇంటికి నడవడానికి తయారవుతూ. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించుకుంటూ ఒంటరిగా నడుస్తుంది. భానుడు కనుమరుగవడం అపరాజిత ఇల్లు చేరడం దాదాపు రోజూ ఒకేసమయానికి జరుగుతాయి.

తండ్రిని రూపాయ అడగకుండా మూడు సంవత్సరాలు ఫీజులకి, పుస్తకాలకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మార్గంలో బి.యే. చేయటానికి తగిన ఆర్థిక స్తోమత సంపాదించుకుంది. భట్టిప్రోలు వదలనక్కరలేదు. పునాదులు పటిష్టంగా ఉన్న అపరాజిత వంటి వ్యక్తులు ఏ డిగ్రీ ఏ సబ్జక్టు ఏఊళ్ళో చదివినా పరవాలేదు. డిగ్రీ ఒక ఆలంబన మాత్రమే. ఏ విభిన్న విషయమైనా మెరుపువేగంతో నేర్చుకోగలదు. ధారణ చెయ్యగలదు. ఎన్ని చదువులు చదివితేనేమి చదువులో మర్మం తెలియని వారికి? ఈ రోజుల్లో ప్రతివారికీ అరచేతిలో ఫోన్ ఉంది. ప్రపంచ విజ్ఞాన సర్వస్వం బొటనవేలుతో నొక్కితే కళ్ళముందుంది. పదివేల రూపాయల పెట్టుబడి ఉంటే సరిపోతుంది. విజ్ఞుడైన మనిషికి కావలిసింది వ్యక్తత. భావప్రకటనా సామర్థ్యం. వాక్యనిర్మాణ కుశలత. నిర్దుష్టంగా రమణీయంగా సమాజంతో మమేకమవగలిగే వాక్కు. మనుగడని రసమయం చేసుకోగలిగే చాతుర్యం. ఆచాతుర్యాన్ని పదిమందికి పంచగలిగే హృదయ సౌందర్యం.

డిగ్రీ తరువాత తను ఏ బాట పట్టినా, తనని ఏబాట పట్టినా మెరుపుతీగవుతుంది. టీచింగ్, జర్నలిజమ్, కంటెంట్ రైటింగ్, సివిల్స్, స్టార్టప్స్..

నాన్ననడిగితే మారుమాట మాట్లాడకుండా ఇంజనీయరింగ్ చదివించడానికి ఆస్తులమ్మో అప్పుచేసో డబ్బు కడతాడు, కూతురు సంగతి తరవాత. ఇంజనీరింగ్ డిగ్రీ తిరుగులేని వ్యాపారం. ఎంతమందిని చూస్తున్నాడాయన? సైన్సుకి మారితే తనకింకో ఏడాది పోతే పోతుంది. ఏడేళ్ళలో ఇండియాలో బి.టెక్., అంతకు తగ్గ బొంతో అమెరికన్ యూనివర్సిటీలో ఎమ్.ఎస్. అయిపోతాయి. ఏదో ఉద్యోగం ఎలాగూ వస్తుంది. పెళ్ళీ అవుతుంది, అమెరికాలో ఇళ్ళు కొంటాము, అమెరికా స్టాంపేసుకుని పిల్లలూ పుడతారు. “హౌ కెన్ యూ ఎవర్ థింక్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా డాడీ” అంటూ.

“నేనూ డిస్టెన్స్ బి.ఏ. చేస్తాను అపరాజితా. నా అనగలిగే డబ్బు నా దగ్గరా కొంత ఉంది.”

“శుభం. నేను తెలుగు తీసుకుంటాను. ఇష్టమయితే నువ్వు ఇంగ్లీషు తీసుకో. ఇద్దరికీ ఉపయోగం. సంవత్సరానికి పదిహేను వేలు ఫీజు. వచ్చేనెలలో కట్టాలి. డబ్బు సిద్ధం చేసుకో.” వెనక్కి తిరిగి చూడకుండా ఇంటిదారి పట్టింది అపరాజిత.

***

సిలబస్‌లో సూచించిన వచన గ్రంధాలు, పద్య గ్రంధాలు, నాటకాలు, నవలలే కాక ఎన్నో అనుబంధ సారస్వత తెలుగు, ఇంగ్లీషు రచనల గురించి తెలుసుకున్నారు స్నేహితులిద్దరూ. ఆసక్తిగా ఒక్కొక్కటే చదివి కవిహృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సంస్కృత భాషతో పరిచయం పెంచుకున్నారు. ఇంత గొప్ప సాహిత్య సంపద తెలుగులో ఉంది అని తెలుసుకుని, చదువుకుని గర్వపడ్డారు. చర్చించుకున్నారు, విమర్శనాత్మకంగా రచనలని ఒకటికి రెండుసార్లు చదివారు. పాఠ్యపుస్తకాలు చదవటం ఒక అవసరంగా కాక అవకాశంగా భావించారు. కలంపేర్లతో వారు రాసిన సమీక్షలు, వ్యాసాలు పత్రికలలో అచ్చయాయి.

“ప్రబంధ కవులు శృంగారరసానికి పెద్దపీట వేసి నాయికల శరీరవర్ణనకి, వారి విరహతాపాలు విశ్లేషించడానికి ఎంతో పాండిత్యకృషి చేశారుకదా. ఆ ఒరవడి మీద నీ అభిప్రాయం ఏమిటి?” అపరాజిత ప్రశ్నకి సరయిన సమాధానం చెప్పటానికి కొంత ప్రయత్నం చేయాల్సివచ్చింది అరిహంత్‌కి. తెరలు లేకుండా నిజాయతీగా స్నేహితురాలితో సంభాషించడానికి ఇదొక అవకాశంగా భావించాడు. చర్చలు ఫలవంతంగా ఉండటానికి సంభాషించేవారి మనసుతో గుండె సహకరించాలని విశ్వసించాడు.

“ప్రతి కవికీ పూర్వకవుల ప్రభావం, సమకాలీన కవుల ప్రభావం తప్పక ఉంటుంది. ఆ కాలంలో కళలని పోషించే రాజుల అభిరుచుల ప్రభావం అవశ్యం ఉండేది. పాఠకులని రంజింపచేయాలనే ఉద్దేశం ఎలాగూ ఉంటుంది. శృంగారం ఎక్కువమందిని ఆకర్షించడం సహజం. అయితే ఆ ధోరణిలో కవులు ప్రణాళికగా చేసిన స్త్రీ అంగాంగ వర్ణనలు ఈనాటి రచయితలు ప్రయత్నిస్తే సమకాలీన పాఠకులు మెచ్చకపోవచ్చు, అర్ధనగ్నంగా, పూర్ణనగ్నంగా స్త్రీపురుషులని దృశ్యమాధ్యమాలలో చూడడం నిత్యకృత్యమైన ఈనాటి సమాజానికి.”

“చక్కగా చెప్పావు అరిహంత్. ఆనాటి రచయితలకి, ఈనాటి రచయితలకి కూడా మనిషిలోని సెక్సు కోరికని ప్రకోపింపచేసే రచనలు చేస్తే పాఠకులని ఆకట్టుకోవచ్చని తెలియదంటావా?”

“నిర్మొహమాటంగా తెలుసు. విమర్శకులేమన్నా అననీ. పాఠకులు మెచ్చాలంటే వారి బలహీనతలని పాత్రలలో చూసుకోగలగాలి. కావ్యమైనా, సినిమా అయినా అప్పుడే పండుతుంది. జేన్ ఆస్టెన్ రచనలన్నీ వివాహం కోసం పడే తపనలు కధాంశంగా అల్లినవే. ప్రచ్ఛన్నంగా సెక్సు సంబంధితమే కదా! సృష్టికి మూలకారణం స్తీపురుష సంయోగం. సంభోగవాంఛ ప్రకృతిసహజం.”

“కాకపోవచ్చు. సెక్సు అనుభవం అయినాక మళ్ళీ కావాలి, ఇంకా ఎక్కువగా కావాలి అనే తపన సంభోగ వాంఛ. అది అసహజం. నిత్యజీవిత వ్యాపారాలని కలుషితం చేసే సెక్సు ఆలోచనలు అవాంఛనీయం. సంభోగం సహజం; సంభోగం కోసం పరితపించడం అనవసరం. అదొక ప్రదూషణం.”

నీ కోసమే నేనున్నాని ఆమె శరీరానికి తెలిసేలా కౌగలించుకుని ఆమె పెదవులని అంటీఅంటనట్లుగా నా పెదవులతో స్పృశించాలని కోరుకోవడం సెక్సువాంఛ అనిపింకటుందా?

***

డిగ్రీ రెండవ సంవత్సరం. నాలుగు రోజులలో సంక్రాంతి. పల్లెలన్నీ పండగ సన్నాహాలతో కళకళలాడుతున్నాయి. లైబ్రరీలో టేబుల్ మీద ఎప్పటిలానే అపరాజిత సిస్టమ్ తెరిచి ఉంది. రెండు జర్నల్లు, ఒక రిఫరెన్స్ పుస్తకం, మూడు టెక్స్ట్ పుస్తకాలు ఉన్నాయి. తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఇంకా తెరిచినట్లు లేదు. అరిహంత్ వాళ్ళ నాన్నగారి షాపులో కాసేపు కూర్చుని, ఇంట్లో భోజనం చేసి ఇప్పుడే లైబ్రరీకి వచ్చాడు. విషాదం అలముకొన్న అపరాజితని చూసి నిర్ఘాంతపోయాడు. తనకి తెలిసి ఆమె జీవితంలో మొదటిసారి రోదిస్తోంది. ఎడమకంటినించి జారుతున్న బాష్పాలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని హరించి వేస్తున్న దురాక్రమణ దారులలాగా గోచరిస్తున్నాయి. నిదానంగా ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. పలకరించలేదు. ఏమయిందని అడగలేదు.

రెండు నిముషాల తర్వాత విషయం అవగతమయింది. దక్షిణామూర్తి గారికి విద్యార్హతలు, లైసెన్స్‌లు ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ధారించిన ప్రమాణాల్లో లేవట. వెంటనే ఆయుర్వేదవైద్యం మానేయవలసిందిగా తాఖీదులు వచ్చాయి. గుంటూరు నించి ఎవరో డిపార్ట్మెంట్‌కి అర్జీ కొట్టారు.

“నాన్నగారికి కాలుచేయి తీసేసినా ఇంత నొచ్చుకునేవారు కాదు. తనను నమ్ముకున్న వందలాది పేద కుటుంబాలు నిరాశ్రయులయినట్లు క్షోభపడుతున్నారు. పైపెచ్చు ఇకనుంచి రైతులు ఆయన్ని కాదని వ్యవసాయంలో విశృంఖలంగా రసాయనిక ఎరువులు, పురుగులమందులు వాడతారని ఆయన మనసు కీడు శంకిస్తోంది. మాఇంట్లో సంక్రాంతి లేనట్లే. ఉన్న మందులన్నీ విజయవాడ ధర్మాసుపత్రిలో ఇచ్చేస్తారట.”

“అలా జరగనివ్వను. మా నాన్నతో మాట్లాడుతాను. పదిమందిని పోగు చేద్దాం. చుట్టుపక్కల ఊళ్ళలో రైతులకి విషయం పాకేలా చేద్దాం. ధర్నాలు చేయిద్దాం. విలేఖరులతో చెప్పి పత్రికలలో వార్తలు వేయిద్దాం.”

“వద్దు. ఎవరినన్నా అడిగి సాయంత్రం దాకా వాడుకునేందుకు ఒక మోటార్‌సైకిల్ పట్టుకురా. నేను భోజనం చేసే పావుగంటలో నువ్వు రాలేకపోతే నేను వేరే ఆలోచన చేస్తాను.“

రెండు నిమిషాలక్రితం తను చూసిన విషాద అపరాజిత మాయమయి ఆ స్థానంలో ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన అపరాజిత దర్శనమిచ్చింది.

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుంటూరు కలెక్టర్ ఆఫీసుకి వారిద్దరూ మోటార్‌సైకిల్ మీద చేరుకున్నారు. కలెక్టరుగారు ఆఫీసులో ఆ సమయంలో ఉండడం, అపరాజితని కలవడానికి సమయం ఇవ్వడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి.

కలెక్టరు గారిది ఝార్ఖండ్ కాడర్. నిరుపేద ఆదివాసి కుటుంబానికి చెందిన ఆవిడకి ఈ జిల్లాలో పోస్టింగ్ వచ్చి ఆరు నెలలే అయింది. ఇరవై అయిదు మించని వయస్సుగల ఆమె సమర్థురాలిగా ఇప్పటికే పేరుతెచ్చుకుంది. నాణ్యమైన చామనచాయతో, తెలుగుతనం ఉట్టిపడేలా హుందాగా చీరకట్టుకున్న ఆమె ముఖంలో వర్చస్సు, మంచితనం సమపాళ్లలో ఉట్టి పడుతున్నాయి. తెల్లవారుజామునించీ అవిరామంగా జిల్లాలో తిరుగుతూ పనిచేస్తున్నా ఆమెలో అలసట, విసుగు కనబడటం లేదు.

అపరాజిత నాన్నగారి గురించి ఇంగ్లీషులో చెప్పబోయింది. రెండు వాక్యాల విని, “ఎంత చక్కటి ఇంగ్లీషు మాట్లాడుతున్నావమ్మా. తెలుగులోనే నిదానంగా చెప్పు. నాకు తెలుగు ఎంతో ఇష్టం” అన్నారు కలెక్టర్. ఆవిడకి తెలుగునాట జాయిన్ అయేనాటికి రండి, చెప్పండి, కూర్చోండి అన్న మూడు మాటలు మాత్రమే వచ్చు.

అరిహంత్ తనగురించి “ఇతనెవరు?” అనే ప్రశ్న వస్తుందని ఎదురు చూశాడు. రాలేదు. అపరాజితే చెప్పింది.

విషయం సూటిగా, సమూలాగ్రంగా వివరిచడానికి అపరాజితకి మూడునిముషాలు మించి అవసరం లేకపోయింది.

“నా జూరిస్డిక్షన్‌లో మీ ఇబ్బందికి నా దగ్గర సమాధానం లేకపోవచ్చు. నాన్నగారితో, ఒక ఏడాది సమయం పడితే పట్టవచ్చు గాక, ఫీజులు కట్టి ఆ పరీక్షలు పాసవమని చెపితే ఎలా ఉంటుంది?”

ధాంక్స్ చెప్పి స్నేహితులు వెనుతిరిగారు.

దక్షిణామూర్తి వైద్యం మానేశారుగాని, వ్యవసాయానికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ఇతరుల పొలాల్లో తిరిగి వారితో సాధకబాధకాలు పంచుకుంటున్నారు. దొడ్లో ఉన్న ఆవు, దూడతో ఆయనన ఎక్కువ సమయం గడపగలుగుతున్నాడు.

అపరాజిత దినచర్యలో మార్పులేదు, నాన్నతో ఎక్కువ సేపు గడపడం మినహా. అరిహంత్‌కి మాత్రం అలజడి తగ్గలేదు. ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలో తెలియదు. ఏంచేయాలన్నా ముందు అపరాజిత ఒప్పుకోవాలిగా. కలెక్టరుగారి పి.యే.కి ఫోన్ చేసి ఏమిటి సంగతి అని అడిగాడు. నాకు తెలిసి ఏమీ లేదన్నాడతను. అపరాజితని కదిలిస్తే, “అంతా మన మంచికే. నా కుటుంబానికి కనీసావరాలకి కావలిసిన డబ్బు నేను సంపాదించగలనని నీకు తెలుసు. సమస్య లేదు. నాన్నగారు కడిగిన ముత్యంలా ఉన్నారు. సంక్రాంతికి కొత్తబియ్యంతో చేసే చలిమిడి ఈసారి ఎంత మధురంగా ఉంటుందో నువ్వే చూద్దువు గాని.” అన్నది. ఇంతకంటే ఈవిషయం నీతో చర్చించడం అనవసరం అనే గొంతుతో, అనుష్టుప్ ఛందస్సులో మొదటిసారి సంస్కృతంలో తనకోసమే ఏదో రాసుకుంటూ.

***

రేపు భోగి పండగ. వెంకట్రావుకి ఉన్నది రెండెకరాలే అయినా నాగలితో వ్యవసాయం చేస్తాడు. జోడు ముసలెద్ధుల యజమాని. చిన్నరైతుల పొలాల్లో ఎద్దులనాగలి తోలి, వచ్చిన డబ్బులతో ఎద్దుల్ని పోషించుకుంటాడు. ఎద్దుల్ని చూసుకున్నప్పుడల్లా అతను అప్రయత్నంగా మీసాలు మెలేస్తాడు. కనుమకి ఎద్దులకి మంచి అలంకారం చెయ్యాలి. వచ్చే సంవత్సరం కనుమకి ఎద్దులుంటాయో ఉండవో. అసలు తనుంటాడో ఉండడో.

దక్షిణామూర్తి పంతులుగారిని నవ్వుమొఖంతో చూడాలి. అందుకోసం ఏమైనా చెయ్యగలడతను, డబ్బు సర్దటం తప్ప. వరి తరువాత మినుములు వెయ్యాలి. దున్నటానికి నాగలి పంతులుగారికిచ్చాడు. ఆయన అల్పసంతోషి.

మూడు చేలవతల ఉన్న మట్టి రోడ్డు మీద ఒక కారు ఆగింది. ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి కారుదిగి తమవైపే నడిచి వస్తున్నారు. దగ్గరకు వచ్చిన మగమనిషి వెంకట్రావుని నాగలిపట్టింది దక్షిణామూర్తి గారేనా అని అడిగాడు. అవునన్నాడు వెంకట్రావు. వెనకనున్న ఆవిడ కలెక్టరు గారు. మూర్తి గారికి నమస్కారంచేసి, “అయ్యా, సమాజం హితవుకోసం కృషి చేయవలసిన ప్రభుత్వం హితవు చేస్తున్న మీలాటి వారి చేతులు కట్టేసినందుకు రాష్ట్రప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నా క్షమాపణలు. ఇదుగో ఆరోగ్యశాఖవారు మీ పేర వ్రాసిన అర్హతాపత్రం. తీసుకోండి. యథాప్రకారం తమరు వైద్యం చేసుకోవచ్చు. సర్జరీ మీరెలాగూ చెయ్యటంలేదు. మీరు ఔషధాలు తయారుచేసి బయటకు అమ్మటంలేదు. ఆ పనులకి లైసెన్స్ కావాలి. మీకు తెలుసు. మీకు నానుంచి ఏ సహాయం కావలిసినా మీ అమ్మాయికి ఒక్క మాట చెప్పండి.” ఇంకోసారి నమస్కారం చేసి కారువైపు వెళ్ళిపోయారు కలెక్టరుగారు.

***

గుంటూరు-లింగంపల్లి పలనాడు ఎక్స్‌ప్రెస్‌లో కిటికీ సీటులో కూర్చున్న అరిహంత్ మరోసారి ప్రయాణ వివరాలు, ఖర్చులు రాసుకున్న కాగితాలు సమీక్షించుకుంటున్నాడు. ఎదుటి సీటులో కూర్చున్న అపరాజిత బయటకు చూస్తోంది. ఊళ్ళో ఆదినారాయణగారు క్రెడిట్ కార్డు ఇవ్వబోతే తీసుకోలేదు. హైదరాబాద్ నించి బాంగ్‌కాంగ్ మీదుగా సియామ్ ట్రిప్, రిటర్న్ హైదరాబాద్ ఫ్లైట్టికెట్లు చేతిలో ఉన్నాయి. గుంటూరుకి ట్రైన్ టికెట్ ఉంది. ఆంకోర్‌వాట్‌లో మూడురోజులు. ఎక్కడ ఉండాలో తెలియదు. ఎంతవుతుందో తెలియదు. తనచేతిలో ఉన్న ఇరవై వేలరూపాయలతో ట్రిప్ పూర్తి అవాలి. మనిషికి పదివేలతో హోటలు, భోజనం, ఎంట్రీ టికెట్లు, లోకల్ ట్రావెల్ చెయ్యగలమా? అన్ని బ్లాంకులు నింపి ఉంచటం అపరాజిత ఇష్టపడదు. డబ్బు సరిపోకపోతే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అంటుంది.

చూసుకోవాల్సి వచ్చింది. కంబోడియాలో మొదటిరోజు గడిచాక చేతిలో నాలుగు వేలు మిగిలాయి. ఖర్చులు పెట్టడం, లెక్కలు రాయడం బాధ్యత తనకిచ్చి, ఆంకోర్‌వాట్‌ని ఆమె ఔపోసన పడుతోంది. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ధార్మిక కట్టడం, అత్యద్భుతమైన వాస్తు, భారత రామాయణాలు కళ్ళెదుట మనకోసం పునరావృత్తమవుతున్నాయనిపించే శిల్పకళ, జీవితాంతం హృదయంలో చెరగని ముద్రవేసే జగత్పసిద్ధ క్షీరసాగరమథన శిల్పం–చూడడానికి రెండు కళ్ళు, మూడు రోజులు సరిపోతాయా!

రెండోరోజు ఉదయం “నమస్తే. కెన్ ఐ గైడ్ యూ?” అంటూ నవ్వుతూ ఒక కంబోడియన్ కుర్రాడు పలకరించాడు. అతనిలో అపరాజిత ఏం చూసిందోగాని అరిహంత్ వారిస్తున్నా వినిపించుకోకుండా సరేనంది. ఒకటా రెండా? గైడ్ ఫీజు పది యూ.ఎస్. డాలర్లు. ఆ రోజల్లా వెంటే ఉండి 12వ శతాబ్దంలో ఆంకోర్‌వాట్‌ నిర్మించిన విష్ణుభక్తుడు సూర్యవర్మ గురించి, ఆలయాల నిర్మాణరహస్యాలు, వాస్తువైవిధ్యాల గురించి, ఎంతో ఉత్సాహంతో వివరించాడు. హిందూ ఇతిహాసాలపై కంబోడియన్ కున్న అభిరుచి, పరిజ్ఞానం గమనించి అరిహంత్ అవాక్కయాడు. సాయంత్రం ఫీజివ్వబోతే, “మీ ఇద్దరూ ఎన్ని అవరోధాలు అధిగమించి ఈ యాత్ర తలపెట్టారో మీరు మీ భాషలో మాట్లాడుకుంటున్నపుడు నాకు తెలిసింది. డబ్బు ఇప్పుడు తీసుకోలేను. ఇండియా చేరుకుని, మీకు వీలున్నపుడు నిదానంగా పంపండి.” అపరాజిత ఆ యువకుణ్ణి ఆత్మీయంగా కౌగలించుకుని, అభినందనాపూర్వకంగా వీపుమీద తట్టింది. అరిహంత్ దృష్టిలో ఆ కౌగలింత వెలకట్టలేనంత విలువైనది.

మూడురోజుల్లో డ్రాయింగ్ షీట్లమీద పెన్సిల్‌తో అనేక స్కెచ్‌లు వేసుకుంది. స్కెచ్‌లు వేయడానికి ఆమె ఎంచుకున్న దృక్కోణాలు గీతలకి ప్రాణంపోశాయి.

ట్రిప్ సగంలోనే జేబులు ఖాళీ అవకుండా ఆపాలంటే కొన్ని కష్టాలు తప్పలేదు. కాళ్ళకి పనిచెప్పి రోజుకి ఇరవై కిలోమీటర్లు పైన నడవాల్సి వచ్చింది. ఓ మాదిరి హాస్టల్ నుంచి తక్కువ రకం హాస్టల్‌కి మారారు. 4’x6’ పరుపు నేలమీద వేసుకుని ఇద్దరూ ఇరికి పడుకున్నారు. బ్రెడ్, శనగలు తిని ఒక రోజు గడిపారు. చివరి రూపాయ ఆవిరయిపోయాక హైదరాబాద్‌లో రైలెక్కగలిగారు. జైత్రయాత్ర ముగిసింది.

అరిహంత్‌కి కంబోడియాలో చివరిరోజునించీ అపరాజిత ముభావంగా ఉన్నట్లు అనిపించింది. ఎక్కడయినా పొరపాటు చేశాడా? ఏమరుపాటులో బయటపడ్డాడా? వాళ్ళ స్నేహానికి ఇదే చరమాంకమా? హతవిధీ!

అపరాజిత అమ్మకీ, మామ్మకి కంబోడియా వర్ణించి చెపుతుంటే వాళ్ళు స్వయంగా అక్కడ ఉన్నట్లు, తిరిగినట్లు అనుభూతి చెందారు. అనసూయమ్మగారు పది తీర్థయాత్రలు చేసినంత పొంగిపోయారు. తనకోసం మనుమరాలు కొనితెచ్చిన బుద్ధజపమాలని కళ్ళకద్దుకుని పూజామందిరంలో భద్రపరుచుకున్నారు. ఇంత నూనె రాసి తల్లి కూతురుకి తలంటిపోసింది.

ఊరుచేరిన సాయంత్రం అరిహంత్ నడుస్తున్న వీధి దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఏడుగంటల సమయం. మసకచీకటి. నలుగురు రౌడీలు ‘వీడే, వీడే’ అంటూ అరుస్తూ అరిహంత్ మీద దాడి చేశారు. ఒకడు తోసి కిందపడేశాడు. ఒకడు బూటుకాలుతో డొక్కమీద తన్నుతూ ఉంటే ఇంకొకడు పిడికిలితో చెంపమీద బలంగా గుద్దులు గుద్దాడు. ముక్కులోంచి ధారగా కారుతున్న రక్తం చూశాక దెబ్బలధాటి కొంచెం తగ్గించారు. జరుగున్న ఘోరం చూసిన ఒకరిద్దరు దారేపోయేవాళ్ళు దూరంగా పోయారు. కసి తగ్గిన తర్వాత వాళ్ళలో సీనియర్ రౌడీ అరిహంత్ కాలర్ పట్టుకుని “ఆడపిల్లని లేపుకుపోయి దేశాలు తిప్పుతావురా భోషడీకే. వేలెడంత లేవు, ధర్మం నాశనం చేస్తావురా? ఇంకోసారి నువ్వు ఇటువంటి దరిద్రప్పనులు చేశావని తెలిస్తే కాలు విరగకొట్టి అవతల పారేస్తాను. కబడ్దార్! నువ్వేకాదు, ఎవడు నీతి తప్పినా అదేగతి పడుతుంది”. మోటర్ సైకిళ్ళెక్కి బాపట్ల దారిపట్టారు.

క్షణంలో నలుగురూ పోగయారు. అరిహంత్ దెబ్బల్ని చూసి వారికి రౌడీలమీద పట్టలేని కోపం వచ్చింది. అరిహంత్ ఊళ్ళో అందరికీ తెలిసినవాడే. దక్షిణామూర్తిగారి అమ్మాయితో స్నేహం, వాళ్ళిద్దరికీ చదువుమీదున్న శ్రద్ధ, పదిమందికి పాఠాలు చెప్పి పిల్లలకి చదువుమీద ఆసక్తి కలగచేశారని తెలిసిన విషయమే. స్కూలు ప్రిన్సిపల్ రంగనాయకమ్మగారు వాళ్ళలాగా చదువుకుని వృద్ధిలోకి రండిరా అని విద్యార్థులతో అంటుంటుంది. కౌతావారికీ, కలెక్టరమ్మకీ ఈజంట ఒక ఉన్నతమైన ప్రమాణం. తృటిలో అరిహంత్‌ని ఆస్పత్రికి తరలించారు. వార్తవిని ఆదుర్దాతో వచ్చిన వారితో ఆస్పత్రి వెయిటింగ్ హాలు నిండిపోయింది. అరిహంత్ నాన్న, ఏడుస్తూ చెల్లి, ‘మంచివాళ్ళకే భగవంతుడు కష్టాలు పెడతాడురా బాబూ’ అని అరుస్తూ అమ్మ, కొడుకుని దూరంనుంచి చూశారు.

భట్టిప్రోలు వాసులు ఈ అఘాయిత్యం కుర్రవాడిమీదకాదు, ఊరిమీద జరిగిందంటూ మసిలిపోయారు. ఊరిపెద్దలు రిపోర్టివ్వడం కోసం హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. అప్పటికే ప్రిన్సిపల్ రంగనాయకమ్మ గారు రిపోర్టివ్వడం. ఎఫ్.ఐ.ఆర్. రాయడం అయిపోయింది. ఘటనకి యాభై అడుగులదూరంలో ఉన్న రంగనాయకమ్మగారు సమయస్ఫూర్తితో ఫోన్‌లో జూమ్ పెట్టి తీసిన వీడియోలో స్పష్టంగా రౌడీలు, పెద్దరౌడీ బెదిరింపులు రికార్డయ్యాయి.

మరునాటికల్లా ‘ధర్మసంస్థాపన సంవేదనా సంఘం’ కార్యకర్తలనబడే రౌడీలని అరెస్ట్ చెయ్యటం, సంఘం పీఠాధిపతి భట్టిప్రోలుకి, గుంటూరు జిల్లాకీ క్షమాపణలు చెప్పడం జరిగిపోయాయి.

ఇవేవీ అరిహంత్‌కి పట్టటం లేదు. ప్రపంచంలో మూర్ఖులుండడం సమస్య కాదు. వారి అనాలోచిత చర్యవలన తను వికలాంగుడయినా అదో సమస్య కాదు. సృష్టిలో ఎవరూ శతృవులు కారు, లేరు అన్న ధర్మసూక్ష్మం అపరాజిత పుణ్యమా అని తనకి అబ్బింది. తెలిసో తెలియకో నాన్న ‘అరిహంత్’ అని పేరు పెట్టాడు.

దెబ్బలు తగిలి ఇవాళ్టికి నాలుగోరోజు. కట్లింకా విప్పలేదు. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారేమో.

కాళ్ళూ చేతులూ పోతే ఏమయింది ఆత్మపంచుకున్న అపరాజిత అసహ్యించుకున్నాక. జీవితమంతా ప్రతిరోజూ పదిగంటలు కలిసినడిచిన సగభాగం దూరమైపోయింది. మిగతా ప్రపంచం వెంట ఉన్నా లేకపోయినా ఒకటే. వారంలో శరీరం కుదుటబడి పరుగులెత్తవచ్చేమో, కాని అది ఆత్మలేని పరుగు అవుతుంది. నేను అరిహంత్‌ని కాదు, జయించవలసిన చివరి మనోవికారమొకటి మిగిలిఉంది.

సాయంత్రం అయిదయింది. హాస్పిటల్ గదిలో అమ్మా, నాన్నా, చెల్లీ ఉన్నారు. ఆకాశం నుంచీ ఊడిపడ్డట్లుగా దక్షిణామూర్తి గారు వచ్చారు. గిరిరాజు వెనక పార్వతిలాగా అపరాజిత వచ్చింది.

“ఇలా జరిగినట్లు ఇప్పుడే తెలిసిందయ్యా” నొచ్చుకుంటున్నట్లుగా అన్నారు దక్షిణామూర్తి. “ఇంద, ఈ కషాయం తాగు. తాండవం చేయాలనిపించేంత శక్తి నీకొస్తుంది.”

అందరి సమక్షంలో అపరాజిత అరిహంత్‌ని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.

“గెట్ వెల్ నౌ”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here