Site icon Sanchika

శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యం పుస్తక ఆవిష్కరణ సభ

[dropcap]07 [/dropcap]ఏప్రిల్ 2019, ఉదయం 10:00 గం.లకు, విశాఖ సాహితి మరియు ఘండికోట సాహితీపీఠం సంయుక్త నిర్వహణలో, “శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావుగారి సమగ్ర కథా సాహిత్యం” పుస్తక ఆవిష్కరణ మరియు శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు స్మారక సాహితీ పురస్కారాల ప్రదానం, విశాఖపట్నం ద్వారకానగర్ లోని విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగినవి.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త, విదుషీమణి, విశాఖ సాహితి అధ్యక్షురాలు ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు సభా నిర్వహణ గావించారు. శ్రీ బ్రహ్మాజీరావుగారు విశాఖ సాహితి వ్యవస్థాపకులలో ముఖ్యులని పేర్కొంటూ, వారి రచనలను ఈ విధంగా వారి కుటుంబం ప్రచురించబూనడం హర్షదాయకమమని అన్నారు. ప్రచురణకర్త, కీ.శే. ఘండికోట బ్రహ్మాజీరావుగారి ధర్మపత్ని శ్రీమతి ఘండికోట సీతారామగారిని వారు ప్రత్యేకంగా అభినందించారు. బ్రహ్మాజీరావుగారి రచనలమీద ఒక సాహితీ సదస్సు భవిష్యత్తులో విశాఖ సాహితి ద్వారా నిర్వహించాలనే తమ సంకల్పాన్ని సభకు తెలియజేసారు.

ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ముఖ్య అతిథిగా విచ్చేసి, శ్రీ ఘండికోట బ్రహ్మాజీ రావు గారి వ్యక్తిత్వం గురించి, వారి కుటుంబంతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ, బ్రహ్మాజీరావు గారు తెలుగు కథానిక మీద చేసిన పరిశోధనలో ఇంతవరకు ప్రచురణ కాని అంశాలు గ్రంథస్తం చేస్తే బాగుండునన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఆత్మీయ అతిథిగా హైదరాబాదు నుండి విచ్చేసిన శ్రీ విహారి గారు, ఉత్తరాంధ్ర కథకులలో శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావుగారికి సముచిత స్థానం కలుగజేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. వివిధ నేపథ్యాలతో వ్రాసిన ఘండికోటవారి రచనలలో భారత దేశం నలుమూలలలోని సంస్కృతి, జీవన విధానం, మనుషుల ప్రత్యేకత ప్రతిబింబిస్తాయని అన్నారు. సుదీర్ఘంగా ఘండికోటవారి కథలను సమీక్షించిన శ్రీ విహారిగారు, “చిన్న కథలో పెద్ద జీవితాన్ని ఎవరైతే చూపించగలుగుతారో వారు ఉత్తమ రచయిత” అని అంటూ, ఘండికోట బ్రహ్మాజీరావు గారు ఆ కోవకు చెందిన ఉత్తమ రచయితగా అభివర్ణించారు. ఘండికోటవారి రచనలలో కథావస్తువులోని వైవిధ్యం కనబడుతుందని చెబుతూ, ‘జనమేజయుడు ‘ లాంటి కథ తెలుగులో రాలేదన్నారు. అటువంటి సబ్జెక్టు ఎవరూ డీల్ చేయలేదని అన్నారు. ఈ కథా సంకలనంలోని 90 కథలలోనూ, తమకు రెండు కథలు మాత్రమే సాధారణమైనవిగ అనిపించాయని, మిగిలిన అన్ని కథలూ ఉత్తమ శ్రేణికి చెందినవి అంటూ, ఇన్ని గొప్ప కథలు ఒక చోట కుప్పబోయటం అనేది చాలా విశేషమైన విషయమని చెప్పారు. ఘండికోట బ్రహ్మాజీరావు గారు తమ జీవితకాలంలో దేనినైతే పొందలేకపోయారో, posthumous గా ఆ ఉపాధులు పొందాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేసారు.

పురస్కార గ్రహీతలు శ్రీ మల్లాప్రగడ రామారావు గారిని, శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తిగారిని, శ్రీ బ్రహ్మాజీరావుగారి పుత్రిక శ్రీమతి భమిడిపాటి లక్ష్మి సభకు పరిచయం చేసారు.

నాలుగు దశాబ్దాలు పైగా రచనా వ్యాసంగంలో నిమగ్నమై, కేవలం పదిహేడు ఉత్తమమైన కథలతో “గోరంతదీపం” కథాసంకలనం ప్రచురించి, రాశి మీద కన్న వాసిమీద తమ మక్కువ తెలియజేసిన ప్రముఖ కథకులు శ్రీ మల్లాప్రగడ రామారావుగారికి, 2018కి గాను ఘండికోట బ్రహ్మాజీరావు స్మారక సాహితీ పురస్కారం ఇవ్వడం తమ సౌభాగ్యమని శ్రీమతి లక్ష్మి అన్నారు.

200 పైగా కథలు, 4 నవలలు, 25 రేడియో నాటికలు పలు సాహితీ వ్యాసాలు వ్రాసి, అనేక బహుమతులు గెలుచుకున్న శ్రీ సీతారామమూర్తిగారు, 2019కి గాను ఘండికోట బ్రహ్మాజీరావు స్మారక సాహితీ పురస్కారం ఇవ్వడం తమ సౌభాగ్యమని శ్రీమతి లక్ష్మి అన్నారు.

పురస్కార గ్రహీతలు తమ స్పందనలో, శ్రీ ఘండికోట వారి సాహితీ పురస్కారం లభించడం గర్వకారణమని చెబుతూ వ్యక్తిగతంగాను, విశాఖ సాహితిలోను బ్రహ్మాజీరావు గారితో తమకుగల అనుబంధాన్ని, వివరించారు.

సభకు ప్రముఖ రచయితలు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావుగారు, శ్రీ ఎల్.ఆర్.స్వామి గారు, శ్రీ అడపా రామక్రిష్ణ, ప్రముఖ చిత్రకారులు, కథా రచయిత శ్రీ భాలిగారు, ప్రముఖ సాహితీ విమర్శకులు డా. డి.వి.సూర్యారావు గారు, మేడా మస్తాన్ రెడ్డి గారు మొదలైనవారు, శ్రీ కందాళ శ్రీనివాస రావుగారు వంటి పురప్రముఖులు, విచ్చేసి సభను జయప్రదం చేసారు. విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సభారంభంలో స్వాగత వచనాలు పలికి సభాంతంలో వందన సమర్పణ గావించారు.

Exit mobile version