[box type=’note’ fontsize=’16’] 4 డిసెంబరు 2018న గాన గంధర్వుడు ఘంటసాల 96వ జయంతి సందర్భంగా అక్షర నివాళి అర్పిస్తున్నారు ఆర్. దమయంతి ఈ వ్యాసంలో. [/box]
ఘంటసాల గారి వయసులో సగం పైనే – అంటే అర్ధ శతాబ్ద కాలానికి మించి నేను ఆయన పాటల వింటూ పెరిగాను. భక్తి రంజనిలో ఘంటసాల భక్తి గీతాల నించి రాత్రి పడుకోబోయే ముందు వినే జనరంజని వరకూ వీరి పాటలే వింటుండేదాన్ని.
చైత్రంలో – శ్రీరామనవమికి వీధిలో వేసిన రాములవారి కళ్యాణం పందిట్లో నిత్యం ఘంటసాల పాటలే మొగుతుండేవి. ‘రామయ తండ్రి, వెలుగు చూపవయ్యా, జగదభి రామా రఘుకుల సోమ, సందేహించకు అమ్మా ..’ అంటూ గాయకులందరూ ఆయన పాటలే పాడేవారు.
గుడిలో భక్తి గీతాలు, భగవద్గీత శ్లోకాలు కొదవే లేదు.
ఇప్పుడు సినీ గీతాల విభావరీలు ఐతే ఘంటసాల పాట లేకుండా ఏ ఒక్క ప్రోగ్రామూ వుండనేవుండదు.
ఘంటసాల పాటలని ఆలపించడంలో తమ ప్రత్యేకతని ప్రదర్శిస్తూ వారి ప్రతిభకి తార్కాణంగా పద్యాలను రాగయుక్తంగా భావయుక్తంగా ఉప్పొంగిపోతూ గానించడం పెద్ద విశేషంగా చెప్పక తప్పదు. ఎందుకంటే తెలుగు పద్యం కరువైపోతున్న ఈ కాలంలో ఘంటసాల వారి పద్యాలను విని, నేర్చుకుని పాడటం సులభ మార్గం అయింది గాయనీ గాయకులకు.
సంగీత కళా సాంస్కృతిక సంస్థల వారు సినీ విభావరీలు నిర్వహించేటప్పుడు – ఘంటసాల మెలొడీస్, సోలోస్, యుగళ గీతాల ఖజానా లోంచి వెదకి వెదకి అరుదైన పాటల్ని వెలికి తీసి వాట్ని హిట్ సాంగ్స్‌గా వేదిక మీద ప్రదర్శించడం, ఔరా అనిపించుకోవడం సింగర్స్ అదొక చాలెంజ్‌గా తీసుకుంటున్నారు.
ఘంటసాల పాటని ఘంటసాలలా పాడాలని తపిస్తూ, ఆయన్ని అనుకరించే గాయకుల ప్రయత్నాన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే ఘంటసాల పాటని ఘంటసాల వారు మాత్రమే పాడగలరు కాబట్టి అని నిరూపించడానికే ఈ ప్రయత్నం చేస్తుంటారు అని నేను బలంగా నమ్ముతాను కాబట్టి.
జంటనగరాలలో ప్రత్యేకించి ఘంటసాల వారి పాటలను మాత్రమే నేర్పే సంగీత కళాశాలలున్నాయి. శిక్షణా కేంద్రాలున్నాయి. ఆ గంధర్వుని పాట తప్ప మరొకరి పాట పాడే ఊసే లేదని కంకణం కట్టుకున్న ఘంటసాల గొప్ప ఆరాధకులు వున్నారు.
ఏకంగా ఆయనకి గుడి కట్టించి ప్రతి రోజూ నైవేద్యాలిడే వంశీ రామరాజు వంటి మహా భక్తులూ వున్నారు అంటే అచ్చెరువౌతుంది.
జగదేక వీరుని కథలో ఘంటసాల ఆలపించిన అత్యంత అద్భుత గీతం – ‘శివ శంకరి..శివానందలహరి ‘ గీతాన్ని వేదికపై ఆలపించి అశేష ప్రేక్షకుల మన్ననలు పొంది, శివరంజని గీతాంజలిగా దేశ విదేశాలలో పేరు పొందారు గాయని గీతాంజలి.
‘ఆయన పాటలన్నీ అతి సులువుగా పాడేయగలం’ అని అనుకోవడం ఎంత పొరబాటో, ఘంటసాల వారి పాటల్లో కొన్ని క్లాసిక్స్ స్పృశించకుండా బయటపడటమూ అంతే ఉత్తమం.
ఘంటసాల పాటని అనుసరిస్తేనో, అనుకరిస్తేనో అలా అమాంతం వచ్చి అతికే స్వరం కాదు – ఆ స్వరం. వజ్రానికి ప్రతి సృష్టి లేదు. దానికదే పోటీ. ఘంటసాల వారికి ఘంటసాలే సాటి, ధీటి. మరొకరు లేరు. అని చెబుతుంటారు అనుభవజ్ఞులు, సంగీత పండితులు. నిజమని ఒప్పుకోవాలి.
నేటి ప్రముఖ గాయకులు బాలూ సైతం మాస్టారి ప్రతిభని మాత్రమే కాదు మంచితనాన్ని ప్రశంసిస్తున్నప్పుడు… మల్లె పూవుకి పరిమళం అద్దినట్టు ఘంటసాల గాన కళాకారుడు మాత్రమే కాదు విశాల హృదయమున్న మానవతా మూర్తి అని కూడా అర్థమౌతుంది మనకి.
కొత్త గాయనీ గాయకులకు ఆయన ఇచ్చిన చేయూత, సహకారం, ఆర్ధిక సాయమూ అన్నీ ఆయనలోని దయా స్వరూపానికి నిదర్శనాలు. కళాకారులకి పని కల్పించి, వారి కుటుంబాలను ఆకలి బాధ నించి తప్పించిన కరుణామూర్తి అని కొనియాడతారు, కృతజ్ఞత నిండిన హృదయంతో.
వింటున్నప్పుడు.. ఘంటసాల వారి మీద అభిమానం ఆరధనా భావం వెయ్యింతలౌతుంది.
వారి సతీమణి సావిత్రి గారు చెప్పే కబుర్లల్లో – మన ఘంటసాల సజీవమూర్తియై, చిరునవ్వుతో దర్శనమిస్తారా అని అభివర్ణించడంలో ఎలాటి అతిశయోక్తి లేదు.
అందుకే ఘంటసాల చిరస్మరణీయులుగా మిగిలిపోయారు -అయిన వారికి.
అందుకే ఘంటసాల సదా చిరంజీవులుగా వర్ధిల్లుతున్నారు – అభిమానులకి.
పాట వున్నంత కాలమూ ఘంటసాల మన మధ్య కదలాడుతూనే వుంటారు. ఈ గంధర్వుని కీర్తి – సూర్య తేజమై వెలుగొందుతూనే వుంటుంది.
ఆన్లైన్ మాగజైన్ – సంచికలో మనం ఈనాడు ఘంటసాల జయంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కవులు, రచయితలు, విశ్లేషకులు అయిన కొందరు ప్రముఖులు ఘంటసాల గురించీ, వారి గానామృతం గురించి తమ విలువైన స్పందనలను తెలియచేయడం కోసం ముందుకొచ్చారు.
***
~ మీ కంట మాధుర్యంబు శిలకైన తెచ్చు చైతన్యంబు – శారద పువ్వాడ
‘మీ గానాంబు జలధి ఓలలాడని శ్రోతలెవ్వరు గలరు
మీ కంట మాధుర్యంబు శిలకైన తెచ్చు చైతన్యంబు
తెలుగు వారి జీవితాన మీ గాత్రంబె సుప్రభాతంబు
పుష్పవిలాప గానంబొనర్చిన మీ సరళ హృదయంబు
అఖిల జగతి పెనవేసుకున్న ఆత్మీయ బంధమే మీ గాత్రంబు
మీ కీర్తి , మీ గాత్రంబు నెంచ నేనెంత దాన!
గంధర్వ గానుడవు ముకిళించుదు హస్తములు, భక్తి తోడ!
అంటూ – శారద పువ్వాడ తన నివాళిని తెలియచేస్తున్నారు.
శారద గారు! మీరు – పుష్ప విలాపం ప్రస్తావిస్తే, నాకు గుప్పున గుర్తొస్తోంది. పాట ముంగింపులో ‘ప్రభూ’ అంటూ ఆలపిస్తారు చూడండి.. అప్పుడా గాత్రంలో వొలికిన మార్దవం మదిని కరుణతో నింపేస్తుంది కదండీ? గుండె ద్రవించే గానం. మా అందరి కోసం మీరు కోరిన ఈ గీతాన్ని ఇక్కడ సంచికలో వినిపిస్తున్నానండి. 🙂
https://www.youtube.com/watch?v=E2qkEo8eiWs
***
ఘంటసాల గారి పాటలు వినడం వేరు, విని ఆస్వాదించి, ఆ అనుభూతిని గుండెల్లో నింపుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం వేరు. రసాస్వాదనలో అందమైన వర్ణనలతో వివరిస్తున్నారు – అమరగాయకుని అభిమాని విజయగోపాలరాజు రాయవరపు,బ్రాంప్టన్, ఓంటారియో, కెనడా నించి.
~ దేవుడు తెలుగుజాతిని మెచ్చిచ్చిన వరం ఘంటసాల
హృదయంలో వెన్నెల పూలు పూసినట్టు మీగడలో చెక్కర కలిపి తిన్నట్టు చిన్నారి పసిడిపాదాల చిరుమువ్వలు మోగినట్టు ఉంటుంది ఆ గళం వింటుంటే. సైకియాట్రిస్టులు అవసరమా, అసలా పాటలు వింటే చాలదా? అని అనిపించకమానదు అలసిన ప్రాణానికి.
తలనిండ పూదండ దాల్చినరాణి, సిగన పెట్టుకున్న ముద్దబంతి పూలలోనో, మూగకళ్ళలోనో కదలాడే ఊసులు వింటూ, భలేమంచి రోజు పసందైన రోజని అనుకుంటూ గోరంక గూటికే చేరావని సంకేతాలిస్తూ ‘నీవని నేనని తలచితిరా, నీవే నేనని తెలిసితినే’ అనుకునేంతలో ‘ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో’ పావులయ్యి ‘పయనించే ఓ చిలకా ఎగిరిపో పాడయిపోయెను గూడు’ అని చెప్పి, ఆ పైన ‘నీసుఖమే నే కోరుకన్నా..’ అంటూ వీడ్కోలు పలికే ప్రతి పదంలోనూ పలికే గాత్రంలోను ఎందులో లేదు చెప్పండి ఆ గాన మాధుర్యం?
ఘంటసాలతో వున్న అనుబంధం గురించి చెప్పాలీ అంటే – ‘తెలియని పాశమది… వదలలేని నిధి.’ అని నేను అనుకునే మాటలన్నీ నా భార్య ఎన్నెలమ్మ మాటల్లో చదవండి.
‘ఘుమఘుమ లాడే నవరసాలుడికే వంటశాల
గలగలలాడే నపరతనాలు దొరలే టంకశాల
జలజలలాడే నవధాన్యాలు పండే పంటశాల
దేవుడు తెలుగుజాతిని మెచ్చిచ్చిన వరం ఘంటసాల’
-ఎన్నెలమ్మ (లక్ష్మి రాయవరపు, ‘తెలుగుతల్లి’ కెనడా ఆన్లైన్ మాగజైన్ సంపాదకురాలు)
మా మీద అభిమానంతో ఘంటసాల గారి మీద ప్రేమతో మీరు మాకందించిన ఈ అందమైన స్పందనకి చాలా చాలా ధన్యవాదాలండి.
***
ఘంటసాల కేవలం గంధర్వ గాయకులు మాత్రమే కాదు, గొప్ప సంగీత దర్శకులు కూడా. వారి సంగీత ప్రతిభాపాటవాలకు నిలువెత్తు అద్దం – లవకుశ. ఇది సినిమా కాదు. కళ్ళ ముందు నిలిచిన పవిత్ర కావ్యం. సినిమా పరిశ్రమలోనే చెక్కుచెదరక నిలిచిన సజీవ రూప శిల్పం. ఈ సంక్షిప్త శబ్ద చిత్ర శిల్పానికి ప్రాణం పోసింది సంగీతం. ఆ సంగీత సృష్టికర్త మన ఘంటసాల మాస్టారే. వీరిని స్మరించుకుంటూ శ్రీమతి మన్నెం శారద గారు ఇలా అంటున్నారు.
~ కంపోజ్ చేసిన పాటలన్నీ ఆపాత మధురాలే!
“నాకు ఊహ వచ్చిన నాటినుండి ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగాను. ఆయన పాటలన్నీ మధురాతి మధురమే. అందుకు కొంతకారణం ఆనాటి సంగీత దర్శకులు కూడా కొంత కారణం. అందులో ఘంటసాల గారూ వున్నారు. నాకు మెలోడీలంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం అనడిగితే చెప్పడం చాలా కష్టం. సంగీత దర్శకుడిగా కూడా వారు అత్యంత ప్రతిభావంతులు. వారు కంపోస్ చేసిన పాటలన్నీ ఆపాత మధురాలే.
నాకు సంగీతం గురించి తెలియదు కానీ, శ్రావ్యంగా వుంటే ఇష్టపడతాను నాకు నచ్చిన పాటగా నేను ముందువరుసలో చెప్పే పాట ‘నీలి మేఘాలలో గాలికేరటాలలో నీవు పాడే పాటా….’ …నాకు చాలా ఇష్టమైనది – మరపు రాని గాయకుడు ఘంటసాల అని చెబుతాను. వారికివే నా నమస్సుమాంజలులు. అంటూ తన మనోభిప్రాయాన్ని తెలియచేసారు శ్రీమతి మన్నెం శారద .
అవును శారద గారూ, ఈ నింగీ నేలా వున్నంత కాలము తెలుగు వారి గుండెల్లో ఆ మధుర గాత్రం – గాలికెరటమై ఎగసెగసి మెరిసి మురిపిస్తూనే వుంటుంది. ప్రతి అభిమాని నోటా ఆ గానం వినిపిస్తూనే వుంటుంది.
మిత్రులారా, ఘంటసాల గురించిన మరో విశేషం ఏమిటంటే – యేటేటా ఘంటసాల జయంతోత్సవాలను – త్యాగయ్య ఆరాధనోత్సవాల్లా అత్యంత భక్తి శ్రధ్ధలతో ఈ వేడుకల్ని జరుపుకునే సాంప్రదాయం బహుశా మన తెలుగునాట ఘంటసాల పాటలతోనే ఆరంభమైందని చెప్పాలి.
మీకు తెలుసా. ఘంటసాల గారి పాటల మీద అవధానం జరుగుతుందని? నేను చాలాసార్లు వెళ్ళి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనుభవం వుంది.
ఒక గాయకుడు పాడిన పాటల మీద అవధాన ప్రక్రియ ఒక నూతమైన ఒరవడికి శ్రీకారం చుట్టుకుందని, అందుకు వారి గాన ప్రజ్ఞా పాటవాలే అని విన్నవించుకుంటున్నాను. మరి వివరించ తరమా ఆ గాన మహిమ?
***
ఇంత గొప్ప గాయకుణ్ని ఎలా మరువడం అంటూ తన వేదనని కవిత లో గుప్పించి అందచేస్తున్నారు నూతన కవయిత్రి లీల.
నేలపై నడిచిన జాబిలి
స్వరాలు నరాలుగా
గానమే రుధిరంగా
పాటే ప్రాణంగా
మానవరూపంలో వచ్చిన గంధర్వుడు
నేలపై నడిచిన జాబిలి
ఘంటసాల మాష్టారు!
‘జగమే మాయ ‘ అని సత్యమెరిగిన వారిలా..
మాయా జగత్తు నుండి
తొందరగా నిష్క్రమించిన
ఘంటసాల మాష్టారుకి
అక్షర నీరాజనం
– లీల
– ‘ఏడుకొండల సామీ! ఎక్కడున్నావయ్యా’ అంటూ ఘంటసాల మాష్టారు ఆర్తిగా ఆలపించిన భక్తి గీతం నాకు చాలా చాలా ఇష్టం.
నిజమే లీల గారు. మాస్టారు కేవలం సినీ పాటలు పాడి ఊరుకోలేదు. ఇటు లలిత గీతాలు, ప్రైవేట్ సాంగ్స్, భక్తి గీతాలు, జానపద గీతాలు ఇలా వైవిధ్య భరితమైన ప్రక్రియలు చేపట్టి తన గాన ప్రతిభని పండితులకీ పామరులకీ సంగంగా పంచారు. తెలుగు దేశాన నలు దెసలా తన పాటని చాటుకున్నారు. ఇదం తా కీర్తి ప్రతిష్ఠల కోసం కాదు. విభిన్న అభిరుచి గల సంగీత ప్రియులకు షడ్రుచుల సమేత విందుని పసందుగా అందించి మరీ వెళ్ళారు.
ఘంటసాల గారు 11 యేళ్ళ వయసప్పుడు తండ్రి మరణించడం జరిగింది. ఆయన వెళ్తూ వెళ్తూ కొడుకుతో పదే పదే చెప్పేవారట. ‘నువ్వు మంచి గాయకుడివి కావాలి అంటూ.’ సరే’ అనే వాగ్దానాన్ని తీసుకుని కన్నుమూసారట.
ఆ వాగ్దానమే అయన్ని మొక్కవోని అకుంఠిత దీక్షకి స్ఫూర్తిగా నిలిచిందేమో!
మర్చిపోయానండోయ్, వాగ్ధానంలో హరికథని వింటుంటే ..హరిదాసు వచ్చి నిలుచున్నట్టె వుండదూ? ఆయన హాస్య ప్రియులు. ఎన్నేసి హాస్య గీతాలు పాడి నవ్వించారని! మాయాబజార్‌లో సుందరి నీ వంటి పాట లో చివరి సుందరీ పిలుపు కోసం ఆగి, మరీ వింటుంటాను. వినంగానే గబుక్కున నవ్వొచ్చేస్తుంది . సినిమాలోని ఆ దృశ్యం గుర్తొచ్చి. 🙂 లక్ష్మణ కుమారుని రెండు చేతులూ అతుక్కుపోవడం కళ్ళ ముందు కనిపిస్తుంది. పాత్రలకనుగుణంగా భావాలను పలికించడంలో ఘంటసాల గట్టి దిట్ట అని చెప్పాలి. ఆయనకి మించిన వారు మళ్ళా రాలేదు.
***
ఆ మధుర మధుర ఆలాపనల టంకసాల, అపర గాంధర్వుడీ ఘంటసాల.. అంటూ తన ప్రేమనంతా రంగరించి అక్షరాలలో నింపుకొచ్చారు విసురజ గారు. (… జగన్నాధ్ వెళిదిమళ్ళ)
~ సుస్వరాల గానసామ్రాట్టు!
వినయమే ధరణిపై
ప్రాణం పోసుకుంటే
ఘంటసాలగా తెలియబడు
సంగీతమే అమరమై
అచిరకాలం నిలవాలంటే
ఘంటసాలచే స్వరార్చనకాబడు
సుస్వరమే అవనిపై
విలసిల్లాలంటే
ఘంటసాలయే తోడ్పాటివ్వగలడు
లలిత సంగీతమైనా శాస్త్రీయమైనా
సినీగానమైనా పద్యగద్యవిభావరైన
మధుర ఆలాపనల టంకసాల
అపర గాంధర్వుడీ ఘంటసాల
నిశితపరిశీలనతో నిబద్ధతతో మురిపించే
సుస్వరాల గానసామ్రాట్టే మన ఘంటసాల
స్వచ్ఛతకు సచ్ఛీలతకు తను మారుపేరు
బిడియపు నగువురేడని తన మరోపేరు
ఎందరో మహానుభావుల పుట్టిల్లీ తెలుగునేల
ఈ తెలుగునేలే స్వరస్వర్గధాముడి పంటసాల
రసధారల నాదఝరుల సంగీత సురసాల
శిష్యగణానికి అత్మీయజనానికి సంగీత పాకసాల
– విసురజ.
***
విసురజ గారు, కుడి యెడమైతే పాటని ఇష్టపడని వారుండరు కదండీ? నాకు కూడా చాలా ఇష్టం. ఘంటసాల పాడిన పాటలన్నీ ఒక ఎత్తు, దేవదాస్‌లోని పాటలు మరొ ఎత్తు. ప్రేమ విరిగిన హృదయ విషాదాన్ని తన మదికెత్తుకుని గానించారు. దేవదాస్, ప్రేమనగర్ చిత్రాలలోని పాటలు వింటుంటే కథానాయకులు కనిపిస్తారు. చిత్రాలు చూస్తుంటే, నాయక పాత్రలే పాడుతున్నయన్నట్టు వుంటాయి. భగ్న ప్రేమికులు మద్యానికి బానిసవడం, ఆ వ్యసనంలో మనిషి అనారోగ్యం పాలవడం.. గాత్రం దగ్గు దొర్లడం జరుగుతుంది. మాస్టారు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసారో ఏమో కానీ.. స్టేజ్ మీద గాయకులు కూడా ఘంటసాలలా దగ్గాలని చాలా రిహార్సల్స్ చేయడం కద్దు.
పాటలో ధ్వనికి ఎంత ప్రాముఖ్యత వుందో మాస్టార్ గారికి బాగా తెలుసు అనడానికి పాటల్లో దగ్గు కూడా ఒక రసప్రధానమైన ప్రక్రియగా రూపాంతరం చెందింది ఘంటసాల వారి పాటల నించే. దేవదాసు చిత్రం అందుకు నాందిగా చెప్పుకోవచ్చు.
అంత అద్భుత కళలెరిగిన గాయకులు మాయమైపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు అభిమానులు.
***
ప్రముఖ గాయని శ్రీమతి లక్ష్మీ పద్మజ గారు ఆయన్ని గుర్తు చేసుకుంటూ..
“ఈ భూలోకానికి వచ్చిన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు. నేను పాడే యుగళ గీతాలలో ఘంటసాల, సుశీల గీతాలనేకం వుంటాయి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, మేల్ వెర్షన్ విని అందుకోవాలి కాబట్టి నాకు ఆయన గాత్రంతో ఏర్పడిన అనుబంధం అంతా ఇంతా కాదు. ఇంత మధుర గళ గాయకుడు అప్పుడే అంత తొందరగా ఎందుకు వెళ్ళాలి? ఇంకా చాలా కాలం వుండాల్సింది కదా కదా!’ అని బాధ పడుతుంటాను..’ అంటూ మనసులోని అభిమానాన్ని పంచుకున్నారు సంచికతో.
మౌనంగా వుండిపోయాను వారి మాటలకి.
శ్రీమతి సావిత్రి గారు చెబుతారు, ఘంటసాల గారు భగవద్గీత శ్లోకాలను రికార్డ్ చేయడంలో ఆయన చేసిన కృషి, పట్టుదల, ఎలాటివో అని. ఆరోగ్యం సహకరించకున్నా… ఎలా అయినా పూర్తి చేసి విశ్రాంతి తీసుకోవాలని తపన పడ్డారు. శ్లోకాలకి తాత్పర్యాన్ని అందించడంలో రచనలోని క్లిష్టమైన పదాలను మార్చి, తేలికగా తిరిగి రాసి, సామాన్యునికి సైతం అర్ధమయ్యేలా సరిదిద్ది, పఠించడం జరిగిందట.
అదే ఈనాడు మనందరకీ అందుబాటులో వున్న మహా ప్రసాదంగా చేసి, మరి మరి వినిపించేలా చేసి, తరియింపచేస్తోంది అంటే ఆ మహానుభావుని బిక్షే కదా!
ఘంటసాల – భగవద్గీత రికార్డింగ్‌ని పూర్తి చేయాలని మాత్రమే గీటురాయిగా కాలాన్ని నిర్దేశించుకున్నారేమో. భగవద్గీత రిలీజ్‌ని చూడలేకపోయారు. ఆయనకు కీర్తితో పనేముంది? ఆయనే కీర్తికి కిరీటమైతేను అని నాకనిపిస్తుంది.
***
~ ఘంటసాల గారి గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను.
ఘంటసాల తర్వాతి తరం.. ఆ తర్వాతి యువతరం.. వారు కూడా వారి పాటలు వినాలని, నేర్చుకోవాలని తహతహలాడటం ఎంతైనా గర్వించదగిన విషయంగా గుర్తించాలి మనం.
కానీ ఆయన్ని తను ఆలస్యంగా తెలుసుకున్నందుకు చింతిస్తున్నా అంటూ నిజాయితీగా చెప్పుకొస్తునారు సురేష్. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ నిపుణుడు, ప్రవృత్తి రీత్యా సంగీత సాహిత్యాభిలాషి. సద్విమర్శకులు. ఈ నాటి యువతరానికి ప్రతినిధులు – సురేష్ వెంకట్ ఇలా అంటున్నారు.
“నా చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా పర భాషా రాష్ట్రాలలో నివసించడం వల్ల కావొచ్చు, ఘంటసాల గారి గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. తెలుసుకున్నాక, ఆ గాత్ర మాధుర్యాన్ని చవి చూసాక ఇక వదల బుద్దేయలేదు అంటే నమ్మండి! అందులో కర్నాటక సంగీతంలో ప్రవేశమున్న వాణ్ణి కదా, ఆయన గానాలాపనలు, గమ్మత్తైన గమకాలు, మోహన రాగంలో చేసిన ప్రయోగాలు, చాలా కీన్‌గా అబ్జర్వ్ చేసాను. వింటూ ఆశ్చర్యానందాలను పొందాను. వారి పాటలు, ముఖ్యంగా 1950 నుంచి 1960 వరకు పాడినవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఇక పద్యాలు పాడుతున్నప్పుడు ఆ గమకాలూ, ఆ ఉచ్చారణలోని స్పష్టత ఎంతగానో నచ్చేసాయి. బహుశా, తెలుగులో అంత స్పష్టంగా, అంత అందంగా పాడే గాయకులు వేరొకరు లేరేమో అంటే అతిశయోక్తికాదు!
ఘంటసాల గారు ఎంత గొప్ప గాయకులో, అంతే గొప్ప సంగీతకారుడని ఈ మద్యే తెలుసుకున్నాను. కళ్యాణి రాగం పై ఆయనకెంత మక్కువో ఆయన స్వరకల్పన చేసిన పాటలని వింటుంటే అర్ధం అయ్యింది.
నాకు ఘంటసాల గారి గాత్రంలో నచ్చిన ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన గాత్రంలో అన్ని రసాలు అలవోకగా స్వర వాగులై ప్రవహిస్తాయి. ఎలా అంటే – అటు “అంతగా నను చూడకు”, “అడగక ఇచ్చిన మనసే ముద్దు” లాంటి రొమాంటిక్ పాటలకీ, “మనసున మనసై, నీ సుఖమే నే కోరుకొన్నా, జన్మమెత్తితిరా” లాంటి పాథోస్‌కి ఆ గాత్రం ఇట్టే అడ్జస్ట్ అయిపోవటం భలే ఆశ్చర్యం అనిపించింది. ఇకపోతే ఆయన డ్యూయెట్ సాంగ్స్ గురించి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఘంటసాల గారి డ్యూయెట్స్ పి. లీల గారితో, సుశీల గారితో, జానకి గారితో, చివరికి భానుమతి గారి విలక్షణ మైన స్వరంతోనూ, వారి వారి గాత్ర ధర్మాన్ని బట్టి పాడటం ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. డ్యూయెట్ పాడేప్పుడు, తోటి సింగర్‌ని డామినేట్ చేసే ఈ తరం సింగర్స్ ఘంటసాల గారి డ్యూయెట్స్ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నాకు బాగా ఇష్టమైన ఘంటసాల గారి పాటలు “గోరంత కెందుకో కొండంత అలక, మనసున మనసై, ఓ చెలి, ఓహో సఖి, అందమే ఆనందం, నీకోసమే నే జీవించునది, ఓహో మేఘ మాల, దేవి శ్రీదేవి” ఇలా చెప్తూ పోతే, పెద్ద లిస్టే ఉంటుంది.
– సురేష్ వెంకట్.
***
లేట్‌గా వస్తే ఏం సురేష్, లేటెస్ట్ గానే వున్నారు సమాచారాన్ని అందించడంలో. 🙂 మీరు ఒక గొప్ప నిజాన్ని చాలా బోల్డ్‌గా చెప్పారు. ఒక్కసారి గనక ఆ గాత్ర సౌందర్యాన్ని ఆస్వాదించడం అంటూ జరిగితే ఇక వదిలి వుండలేం. తేనె రుచి తెలిసిన వారికి నీరు తీయగా వుండునేం?
ఘంటసాల గారు పి.లీల గారితో కలిసి పాడిన పాటలకి ఒక విశిష్టమైన గుర్తింపు వుంది. ఇద్దరివి సరి జోడైన – రెండు గంభీర గళాలు. ఇద్దరూ సాంప్రదాయ సంగీతంలో అత్యున్నతులు. మళయాళం మాతృ భాష అయిన లీల గారి స్వరాన్ని విని, మన మాస్టారే ఆమెని ప్రోత్సహించారట తెలుగులో పాడేందుకు.
ఉచ్చారణ చూసారు కదా ఎంత స్పష్టంగా వుంటుందో? తెలుగులో తర్ఫీదు ఇప్పించి, తన స్వీయ సంగీతంలో ఆమె గాత్రానికి ప్రముఖమైన ప్రాధ్యాన్యతనిస్తూ ఎంతగానో సహకరించారుట. లీల గారికి మాత్రమే కాదు, కొత్త కొత్త గాయనీ గాయకులను వెండి తెరకు పరిచయం చేయడం, వారికి అవకాశాలు కల్పించడం, వారితో కలిసి పాడటం అంటె ఘంటసాల మాస్టారుకి చాలా ఇష్టం ట.
https://www.youtube.com/watch?v=0Wb4Z8rPxfM
***
గొప్ప వారి ఆలోచనలెప్పుడూ గొప్పగానే ఉంటాయనడానికి ఘంటసాల ఒక మరపురాని నిదర్శనం.
స్త్రీలంటే ఘంటసాల వారికి ప్రత్యేకమైన గౌరవం వుందనుకుంటా? అంటా కాదు.. వుంది అంటూ తన జవాబుని గట్టిగా వినిపిస్తున్నారు. ప్రేమ ప్రసాద్! వీరు వ్యాస రచయిత్రి. సాహితీ సమీక్షకురాలు. కొన్ని వందల పుస్తకాలని చదివిన అనుభవం వుంది. కొత్త పాత రచనలకీ, పాటలకి ప్రియమైన శ్రోత. వారేమంటున్నారంటే..
~ ‘అమ్మా సరోజినీ దేవీ ‘ అని స్త్రీ జాతి గొప్పదనాన్ని ఆలపించిన గాయకులు..
“అబ్బో గానగంధర్వుడు ఘంటసాలగారి గురించి, ఆయన పాటలలోని మాధుర్యము గురించి చెప్పగలిగేంతటివారమా! ఎంత చెప్పినా – తనివితీరదు. సముద్రమంత మాధుర్యంలో నీటి బొట్టంత అయినా కాదు. ‘అమ్మా సరోజినీ దేవీ’ అని స్త్రీ జాతి గొప్పదనాన్ని ఆలపించి, స్త్రీ జాతినిగౌరవాన్ని ఇనుమడింపజేసి ఉత్తేజాన్ని నింపడం ఎవరి వల్లా కాని పని.
‘నీ కొండకు నీవే రప్పించుకో’ అని ఆలపిస్తూ, ‘ప్రభూ! మేం నిమిత్తమాత్రులమే’నని భక్తి తత్వాన్ని బోధించారు.
‘బహుదూరపు బాటసారీ..’ అంటూ మనిషికి సత్య బోధన చేస్తూ, ఒక వేదాంతంలో ముంచితేల్చడం ఆ గాత్రానికే చెల్లు. అలా అని ఊరుకున్నారా?
‘చింతచిగురు చిన్నదానా’ అని కవ్వించడం ‘తలనిండ పూదండ దాల్చిన రాణి’ అని ప్రేయసితో ఊసులాడడం, ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మో ‘ పాటలో అత్తగడసరితనం చూపడం ఆ గాత్రం లోని వైవిధ్యానికి ప్రతీకలు గా చెప్పుకోవాలి.
మనసుని కరిగించి ఎంత హృద్యంగా ఆలపించారు, – కుంతీకుమారి పాటలో – బిడ్డని వదలలేక వదులుతున్న తల్లి దీనత్వాన్ని, ఆ జాలి పాత్ర పోషణని ఎలా మరువగలం. కన్నీటిని ఒలికించి ఏడ్పించడంలో ఘంటసాల కరుణ రసా పోషకులు.
పుష్పవిలాపం – కరుణ శ్రీ రాసారా? ఘంటసాల వారు రాసారా అన్నంతగా సాహిత్యాన్ని తనది చేసుకుని అందులోలీనమై ఆలపించారు.
ప్రేమ, శృంగారం, హాస్యం, విషాదం, కరుణ, రౌద్రం ఇలా ఏ భావాన్నైనా సరే పలికించడంలో తనకు తానే సాటి అని చెప్పాలి. అంతే కాదు గాయకుడు ఇన్వాల్వ్ అవుతూ శ్రోతలనూ తన గానంలో లీనం చేసి, పరవశంలో ముంచివేసే గానగంధర్వుడి గురించి ఏమని చెప్పేదీ? ఎలా చెప్పేది?
– ప్రేమ ప్రసాద్.
https://www.youtube.com/watch?v=8qVJ3d0WleE
నిజమే ప్రేమ ప్రసాద్! ఘంటసాల గారి గాత్ర కళా వైభవం గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగిలే వుంటుంది. అయినా ఎంతో కొంత మనందరమూ కలిసి కలబోసుకునే సంగతులన్నీ అక్షర పూమాలలుగా అల్లి ఆ గంధర్వ గాయకుణ్ని పూజించికుందాం. సుమాంజలులు అర్పిద్దాం.
***
ఘంటసాల పాటలో మృదుత్వం తనని పులకింపచేస్తుందంటారు ఉష. వీరు టోరీ రేడియోలో ‘వెన్నెల్లో గోదావరి’ అనే పాపులర్ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి, విజయవంతంగా నిర్వహిస్తూ పలువురి ప్రశంసలనందుకుంటున్న రేడియో జాకీ. ఘంటసాల గురించి చెబుతూ అంటారు,
~ ఘంటసాల మళ్లీ పుడితే, మా రేడియో స్టేషన్ నించి కదలనీయనేమో!
నేను ఆయన్ని చూడలేదండి. ఆ అవకాశం నాకు కలగనీకుండానే మాయమయ్యారు. అంటే అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. అయితే ఏం కానీ, నాకు ఆయన చిన్నప్పటినించీ తెలుసు అనే చెబుతుంటాను. ఎలా అంటే రేడియో లోంచి వింటుండేదాన్ని ఘంటసాల గారి పాటల్ని. నేనెక్కువ సార్లు పదే పదే విన్న పాటలు – హిమగిరి సొగసులు, ఈ మౌనం ఈ బిడియం.. ఈ రెండు పాటలంటే, ఎందుకో తెలీని మహా ఇష్టం కలిగింది. నా ఎవర్గ్ గ్రీన్ ఫేవరేట్ సాంగ్స్ ఇవే అని చెప్పాలి.
ఘంటసాల మళ్లీ పుడితే, మా రేడియో స్టేషన్ నించి కదలనీయనేమో! (నవ్వులు)
మాది రాజమండ్రి. ఆయన పాట వింటూ వెన్నెల్లో గోదావరిని అలా చూస్తూ వుంటే.. అమ్మ వొడిలో ఉన్నట్టు.. ఒక అపురూపమైన, అనిర్వచనీయమైన భావన కలుగుతుంది.
ఘంటసాల గాత్రం ఎప్పుడు నా చెవిన పడ్డా, ‘అమ్మ వొడి వెచ్చదనం నాన్న ప్రేమ కమ్మదనం’ గుర్తుకొస్తాయి.
‘ఘంటసాల పాటని నిర్వచించాలంటే మెలొడీకి మారు పేరే ఆయన అని చెప్పాలి. ఘంటసాల అవనికి అందివచ్చిన అమృతం’ అంటూ ఆనందంగా చెబుతూ తన నమస్సుమాంజలులు తెలియచేసారు – టోరీ రేడియో జాకీ – ఉష దరిసిపూడి.
https://www.youtube.com/watch?v=yUE5kvYio5U
***
వేదికల మీద ఎందరెందరి పాటలు పాడినా, ఘంటసాల గారి పాట పాడితేనే కానీ గాయకులకు సంతృప్తిగా వుండదేమో? సరిగ్గా ఇదే భావాన్ని వ్యక్తపరుస్తున్నారు ప్రముఖ సినీ సంగీత విభావరీ గాయకులు శ్రీ త్రినాథ రావ్ గారు.
~ గాయకునిగా నాకీ తృప్తి చాలు
సంగీత ప్రపంచానికి భగవంతుండిచ్చిన గొప్ప వరం మన ఘంటసాల. మూడు దశాబ్ద కాలంలో ఆయన – కొన్ని వేల పాటలు పాడారు. అంతే కాకుండా, 100 కు పైగా, చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘనులు. మహా గొప్ప సంగీతజ్ఞుడు. ఆయన పాడిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. సంగీత దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఒక కళా ఖండం. ఆయన యే కళాకారుడికి పాడితే ఆ కళాకారుడే స్వయంగా పాడుతున్నట్టు వుంటుంది. ఆ గాయకుని ప్రతిభకి అదొక విశేషమైన గుణంగా కొనియాడాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లో కచేరీ చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన పేరిట పోస్టల్ స్టాంప్ రిలీజ్ కావడం సంగీతరంగానికి గొప్ప గర్వకారణంగా నిలిచింది. ఎనలేని కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టింది.
ఆయన గానం చేసిన ప్రతి పాటా, పద్యమూ ఆచంద్రతారార్కం ప్రజల హృదయాలలో మారుమోగుతుంటాయనడంలో ఎలాటి సందేహం లేదు.
గాయకునిగా ఘంటసాల గారి పాటలు పాడటం, వేదిక మీద ప్రదర్శనలివ్వడం ఆ దైవ కృపగా భావిస్తాను. ఆ గాయకుని ఆశీస్సులను అందుకుంటుంటాను. ఎన్ని పాటలు పాడినా, ఘంటసాల గారి పాట పాడుతున్నప్పుడు కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేను. ఆ మహా గాన గంధర్వునికివే నా నమస్సుమాంజలులు.
– ‘స్వర కిన్నెర’, ‘గాన కళా ప్రపూర్ణ’ – త్రినాథ రావ్, అసిస్టెంట్ జనరల్ మానేజర్, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా (రిటైర్డ్)
***
~ సంగీతానికి జీవం పోసిన గళం..
ప్రముఖ సాహితీ విశ్లేషకురాలు శ్రీమతి మీనాక్షి వేదుల – ఘంటసాల గళ విశిష్టత గురించి మాట్లాడుతూ.. అంటారు – “ఎంతో మంచి గాయకుడు. ముఖ్యంగా సంగీతానికి జీవం పొసే గళం ఆ గంభీరతకి వేరే మైక్ కూడా అక్కర్లేదేమో! అనిపించేంత స్వచ్చమైన మధుర గళం. అందుకు ఉదాహరణగా శేష శైలా వాసా, శివ శంకరి, మది శారదా దేవి మందిరమే, రసికరాజ తగు వారము కామా, మాణిక్య వీణా అంటూ ఖంగున మోగే పద్యమూ, ఇవన్నీ ఆ వినూత్న విభిన్న గళ సోయగనికి నిదర్శనం.
ఘానా ఘన సుందర. పుష్ప విలాపం. తలనిండా పూదండ దాల్చిన రాణి, నిన్నలేని అందమేదో, రారా కృష్ణయ్య ఇంకా ఎన్నో ..ఆయనపాడిన మధుర గీతాలంటే నాకిష్టం.
తెలుగు వారిలో తెలుగుతనం బతికిఉన్నతకాలం ఘంటసాల అందరి మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోతారు.
అవును మీనాక్షి గారు. ఆయన చిరంజీవులు, చిరస్మరణీయులు. జీవామృతాన్ని కురిపించిన దేవ గాన గంధర్వులు.
***
ఆయన ఈ భూమ్మీదకొచ్చి, పుణ్యం చేసుకుని వెళ్ళారు. భక్తి గీతాలాపనలలో, పారవశ్యంలో ముక్తిని పొందారు. మరుజన్మ లేదు ఆయనకి అంటూ తమ స్పందన తెలియచేస్తున్నారు ఈ దంపతులు. వీరివురూ పేరొందిన రైటర్స్ కూడా. ఏమంటున్నారో చూద్దాం.
~ మరొక జన్మంటూ లేకుండా చేసుకున్న ఋషి పుంగవుడాయన!
– పెయ్యేటి శ్రీదేవి, రంగారావు.
తెలుగు చలనచిత్ర సంగీతంలో ఘంటసాల వారిది స్వర్ణయుగం. బలమైన శాస్త్రీయ సంగీతం యొక్క పునాది, మధురగంభీరమైన గాత్రం, గొంతులో అలవోకగా పలికే నవరసాలు, తన వృత్తి ఎడల వ్యాపార దృక్పథం లేని అంకితభావం, సత్త్వగుణ సంపన్నత, దేశభక్తి, భగవద్భక్తి, వీటన్నిటి వలన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అద్వితీయులు, అప్రమేయులు, అజరామరులు అయినారు.
సంగీత ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించినా, వారాలు చేసుకుంటూ సంగీతాన్నభ్యసించినప్పటి రోజులను మర్చిపోని మహానుభావుడాయన. స్వాతంత్ర్యోద్యమంలో జైలుకు వెళ్ళారు. దేశభక్తి గేయాలు, పద్యాలు పాడి ప్రజలను జాగృతం చేసారు. ‘స్వాతంత్ర్యమె మా జన్మహక్కని చాటండీ..’ ‘అమ్మా, సరోజనీదేవీ..’ ‘ఎగురుతున్నది జాతీయజెండా..’ వంటి పాటలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమ్రోగుతూనే వుంటాయి. పుష్పవిలాపం, కుంతీకుమారి వంటి పద్యాలతో ప్రైవేటు ఆల్బమ్‌లు విడుదల చేసి తెలుగుపద్యానికి ప్రాణం పోసారాయన. తారకమంత్రం, వేంకటేశ్వరస్వామి మీద భక్తి గీతాలు, భగవద్గీత, ఇంకా ఎన్నో భక్తి గీతాలు త్రికరణశుధ్ధిగా పాడి తనకు మరొక జన్మంటూ లేకుండా చేసుకున్న ఋషి పుంగవుడాయన. ఇక చలనచిత్రగీతాల గురించి చెప్పేదేముంది? నవరసాలను అలవోకగా పలికిస్తూ ఆయన పాడిన అన్ని పాటలూ ఆణిముత్యాలే. ఆయన అద్భుతమైన స్వరకర్త కూడా. లవకుశ లోని పాటలు, పద్యాలు, రహస్యంలో గిరిజా కళ్యాణం, ప్రైవేటు ఆల్బమ్‌లు అన్నీ చిరస్థాయిని సంతరించుకున్నవే.
మనసు నిండా దిగులు ఆవరించిన తరుణాన ఆయన పాటను వినడమే సరి అయిన మందు. నిద్ర పట్టకపోతే ఆయన పాటలు నిద్రమాత్రలలా పని చేస్తాయి. ఆలోచనలు రాని ధ్యానస్థితిలోకి వెళ్ళాలంటే ఆయన భక్తి పాటలు వినాలి. అన్ని భాషలలోను ఆయన పాడారు. ఆయన ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ, ఐక్యరాజ్యసమితి కి కూడా వెళ్ళి, అక్కడి ప్రజలను తన గానమాధుర్యంతో సమ్మోహితులను చేసారు. అమెరికాలో ఆయన పాడుతూంటే రెజొనెన్స్ వల్ల గోడలు ప్రకంపిస్తే శ్రోతలు అబ్బుర పడ్డారట! అటువంటి మహనీయుడు 51 సంవత్సరాలకే పరమపదించడం దురదృష్టకరం.
(జననం: 04-12-1922. నిర్యాణం: 11-02-1974).
ఘంటసాల గురించిన కొన్ని విశేషాలు:
* ఆయన గుడివాడ తాలూకా చౌటపల్లిలో జన్మించారు.
* 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బళ్ళారిలోని అల్లిపురా కారాగారంలో18 నెలలు శిక్ష ననుభవించారు.
* ఆకాశవాణిలో గాయకుడుగా ఉండేవారు.
* మొదటిసారిగా సీతారామజననం అన్న చిత్రంలో కోరస్ గాయకుడుగా పాడి, ఒక చిన్న వేషం కూడా చేసారు.
*నిర్మాత అయిన కృష్ణవేణి గారు ఆయనకు తొలిసారిగా “మనదేశం” అన్న తమ చిత్రానికి సంగీతదర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
* భారతప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 సంవత్సరాల పాటు ఉత్తమగాయకునిగా ఎంపిక అయి, తిరుగులేని చరిత్ర సృష్టించారు.
* తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత ‘ఆస్థాన విద్వాంసునిగా’ నియమింప బడ్డారు.
* తిరుమల ప్రధాన ఆలయంలో మూలవిరాట్టు ఎదురుగా కూర్చొని భక్తిపాటలను గానం చేసిన ఏకైక గాయకుడాయన. ఆయన ఎప్పటికీ తెలుగు సంగీత ప్రపంచాన వెలిగే సూరీడే!
***
https://www.youtube.com/watch?v=HANPKOsTpho
శుభప్రదమైన, మంగళకరమైన ఈ పాటతో ఘంటసాల గారి జయంతోత్సవానికి విరామం ఇద్దాం.
రీడర్స్, చూసారుగా! మన ఘంటసాల గానామృతం గురించి పలువురి ప్రముఖుల అభిమాన నీరాజనాలు, పుష్పాంజలులు, హృదయ నివాళులు, పులకరిస్తూ కన్నీరు పర్యంతమౌతూ… ఘంటసాల పట్ల తమ ప్రేమాభిమానాలను ఎలా చాటుకుంటున్నారో!
మహా కళాకారులు మళ్ళీ మళ్ళీ భూమ్మీదకు రారు. వచ్చి వెళ్ళినా, ఇక్కడే మన అందరి గుండెల్లో గుడి కట్టుకునుంటారు.
ఘంటసాల వెంకటేశ్వర రావు గారు కూడా అంతే. పాట పాడటం కోసం పంపబడ్డాడు ఆ పై వానిచేత. పాడి, దేవుడై కొలువున్నాడు గాన కళ చేత.
ఆయన పాట ఎప్పుడు పెదవిపై కదిలినా ఆ క్షణమే ఆయన పుట్టిన రోజు. రోజూ… జన్మదిన శుభాకాంక్షలే ఈ గాన ఘన కీర్తునికి.. చిరంజీవి కదూ?
జై, తెలుగు పాటకీ జై!!
– ఆర్.దమయంతి.
* డియర్ రీడర్స్!
ఘంటసాల గురించి మీ విలువైన స్పందనలను ఇక్కడ తెలియచేస్తూ, పుష్పాంజలులను సమర్పించవచ్చు! మీదే ఆలస్యం.