గజల్ ఖాస్ – పంకజ్ ఉధాస్

0
2

[ఇటీవల స్వర్గస్థులయిన ప్రముఖ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్‍కు నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు రోచిష్మాన్.]

[dropcap]గ[/dropcap]జల్ గాన గగనంలో ఒక తార పంకజ్ ఉధాస్. “అబ్తో ఇన్సాన్ కో…”, “కేయ్‌సే కహదూన్ కే…”, “తుమ్ ఆయే జిందగీ మే తోన్ బర్సాత్…”, “సాన్‌స్ లేనా భీ సజా లగ్‌తా హైన్…” వంటి పలు గజళ్ల గానంతో పలువురిని తన అభిమానులుగా చేసుకున్నారు పంకజ్ ఉధాస్.

జనరంజకమైన జగ్‌జీత్ సింహ్, ప్రౌఢమైన హరిహరన్ ఆపై తలత్ అజీజ్, చందన్ దాస్, అనూప్ జలోటా వంటి గజల్ గాయకుల మధ్యలో పంకజ్ ఒక పేరున్న గజల్ గాయకుడుగా దేశంలో నిలబడగలగడమే పంకజ్ అంటే ఏమిటో మనకు గట్టిగా తెలియజేస్తుంది. గజల్ గాన పరివర్తన కర్త తలత్ మహ్మూద్ పంథాలో శ్రావ్యమైన గజల్ గానం పంకజ్‌లో పలికింది. మెహ్‌దీహసన్, గులామ్ అలీల గజల్ గానంలోని విద్వత్, ఔన్నత్యం, సాంద్రత, లోతు, ప్రత్యేకత, వైశిష్ట్యం వంటి అంశాలతో కాకుండా తలత్ ఫణితి (గాన విధానం)తో, ఇంపు సొంపులతో పంకజ్ గజల్ గానం చేసి అభిమానుల్ని ఆకట్టుకుని నిలబెట్టుకున్నారు. పాకిస్తాన్ సినిమా, గజల్ గాయకుడు సలీమ్ రజా గాత్రానికి, గానానికి పంకజ్ గాత్రం, గానం దగ్గరగా ఉంటాయి. పంకజ్ timbre, renditionలు సలీమ్ రజా timbre, renditionలకు సారూప్యం ఉంటుంది.

మన దేశంలో గజల్ గానం తొలిసారి 1907లో 78 r.p.m. రికార్డ్‌పై వచ్చింది. అది జేమ్స్-ఓపెరా ఫోన్-రికార్డ్ వాళ్లు విడుదల చేసిన మొహమ్మద్ హుస్సైన్ అన్న గాయకుడు పాడిన గజల్ రికార్డ్. అటు తరువాత గాయని గౌహర్ జాన్ 1910-20లలో గజల్ గానం చేసి రికార్డ్‌లపై విడుదల చేశారు. 1931 తరువాత గజళ్ల గానానికి మన దేశంలో గణనీయమైన కదలిక వచ్చింది. కజ్జన్, జద్దన్ బాఈ (నటి నర్గీస్ తల్లి), జోహరా బాఈ అంబాలే వాలీ, కె.ఎల్. సైగల్, అమీర్ బాఈ కర్నాటకీ, సురయ్యా, కమలా ఝరియా, హబీబ్ వాలీ మొహమ్మద్, జానకీ బాఈ, నిర్మలా దేవీ వంటి పలువురు గజల్ గానాన్ని చేపట్టారు. బేగం అఖ్తర్ (అఖ్తరీ బాఈ ఫైజాబాదీ) తొలి గజల్ తారగా విలసిల్లారు. 1944లో తలత్ పాడిన “తస్వీర్ తేరీ దిల్ మేరా బెహలాన సకే గీ” గజల్ పెను విజయవంతమై గజల్ గానానికి కొత్త గతిని ఇచ్చింది. అంతేకాకుండా అది దేశ ప్రజల్లో గజల్ గానాభిరుచిని అమాంతంగా పెంచింది. ఆ కోవలో, అటుపై వచ్చిన గజల్ గాన ప్రాభవంలో పంకజ్ ఉధాస్ కూడా భాగమై రాణించారు.

“ఏ అలగ్ బాత్ హైన్ సాకీ…”, “తోడ్ నా టూటే హువే…”, “సూరజ్ కీ హర్ కిరన్ తేరీ…” వంటి గజళ్లను గానం చేస్తూ గజల్ జనాల్ని తనవైపుకు తిప్పుకున్నారు పంకజ్. పంకజ్ 1980లో తన తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ విడుదల చేశారు. అటుపైన ముకర్రర్, తరన్నుమ్, మెహ్‌ఫిల్ వంటి 50కి పైగా ఆల్బమ్స్ విడుదలచేశారు. 1984లో లండన్ రోయల్ ఆల్‌బట్ హాల్ (Royal Albert Hall)లో గజల్ కచేరీ చేశారు.

1986లో వచ్చిన ‘నామ్’ హిందీ సినిమాలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతంలో “చిట్ఠీ ఆఈ హైన్…” (ఇది గజల్ కాదు) పాట పాడారు పంకజ్. ఆ పాటకు అభినయమూ చేశారు. ఆ పాట పెద్ద హిట్ అవడం కాదు దేశంలో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. బి.బి.సి. రేడియో సహస్రాబ్ది 100 పాటల్లో ఈ పాటను ఎన్నుకుంది.

నిజానికి పంకజ్ తన గాన జీవనాన్ని సినిమా నేపథ్య గాయకుడుగానే మొదలుపెట్టారు. ఆ తరువాతే గజల్ గాయకుడు అయ్యారు. 1970లో వచ్చిన ‘తుమ్ హసీన్ మైన్ జవాన్’ సినిమాలో శంకర్-జైకిషన్ సంగీతంలో కిషోర్ కుమార్‌తో కలిసి “మున్నే కీ ఆమ్మా…” అంటూ ఒక హాస్య గీతం పాడారు పంకజ్. 1972లో వచ్చిన ‘కామ్నా’ సినిమాలో ఉషా ఖన్నా సంగీతంలో “తుమ్ కభీ సామ్నే ఆ జావోన్…” పాట పాడారు. చిట్ఠీ ఆయే హైన్ పాట తరువాత మరికొన్ని సినిమా పాటలూ పాడారు. “చాన్దీ జైసాన్ రంగ్ హైన్ తేరా…”, “ఆహిస్తా…”, “ఏక్ తరఫ్ ఉస్ కా ఘర్…”, “ఆలమ్, ఆలమ్ ఇష్క్ కో…”, వంటి రమ్యమైన గీత్‌లు లేదా నగ్మాలు పాడారు. ఆ గీత్‌లలో కొన్ని సినిమా పాటలూ ఆయ్యాయి. పంకజ్ పాడిన కొన్ని గీత్‌లు లేదా నగ్మాలు పొరపాటుగా గజళ్లుగా పరిగణించబడుతున్నాయి.

17/5/1951న గుజరాత్‌లోని జేత్‌పూర్‌లో సంగీతంతో సత్సంబంధం ఉన్న ఒక కుటుంబంలో పంకజ్ పుట్టారు. ఒక దశలో డాక్టర్ అవాలనుకున్నా కూడా ఆ ఆలోచనకు అతీతంగా గానాన్ని ఔపోశన పట్టారు పంకజ్. తొలి అడుగు సినిమా గానంతో వేసినా తన ప్రపంచం గజల్ అని గ్రహించి అందుకు తగిన సాధన చేశారు. గజల్ గానం కోసం ఉర్దూ నేర్చుకున్నారు. గ్వాలియర్ ఘరానాకు చెందిన గురువు గులామ్ ఖాదిర్ ఖాన్ దగ్గర హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం అభ్యసించినా కూడా పంకజ్ తన సరళ సున్నిత గానంతో, శ్రవ్య శుభగత్వంతో శ్రోతల్ని సమ్మోహనపరిచారు.

ఒక గాయకుడుగా పంకజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ, విదేశాల్లో పలు పురస్కారాల్ని అందుకున్నారు. 2006లో ప్రతిష్ఠాకరమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 26/2/2024న తుది శ్వాసవిడిచినా ఎప్పటికీ గజల్ తెమ్మరై మనలో సాగుతూంటారు పంకజ్.

గజల్ అభిమానుల లోకం పంకజ్ ఉధాస్‌ను ఎప్పుడూ “తూ పాస్ హైన్ తో దిల్ కా అజబ్ హాల్ సా లగే” అని అంటూనే ఉంటుంది. అందుకే గజల్ ఖాస్-పంకజ్ ఉధాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here