గజల్స్ రాణి బేగం అఖ్తర్

2
2

[box type=’note’ fontsize=’16’] అక్టోబర్ 30వ తేదీ గజల్స్ రాణిగా పేరు పొందిన శ్రీమతి బేగం అఖ్తర్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]హిం[/dropcap]దూస్థానీ సంగీతంలోని గజల్స్‌కు పేరు పొందిన గాయని, అకళంక దేశభక్తురాలు, దాతృత్వ సంగీత కచ్చేరిలోనే ప్రాణాలు వదిలిన సంగీత కళానిధి బేగం అఖ్తర్. నటగాయనిగా హిందీ చిత్ర సీమని అలరించారు.

ఈమె ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించారు. 1914వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ముస్త్రాయి సాహెబా, అస్ఘార్ హుస్సేన్ దంపతులకు జన్మించిన కవలలలో ఒకరు ఈమె. ఈమె కవల సోదరి జోహ్రా. బాల్యంలో ఈ కవలల మీద విషప్రయోగం జరిగింది. జోహ్రో మరణించగా/అఖ్తరీ బాయి ఫైజాబాది బతికి బట్టకట్టారు. 

ఫైజాబాద్ పాఠశాలలో ఐదవ ఏట ఈమె పాటను విన్న గౌహర్‌జాన్ భవిష్యత్తులో మంచి గాయని అవుతుందని అభిప్రాయపడ్డారు.

దేశంలోని వివిధ ప్రదేశాలకు చెందిన గొప్ప సంగీత కళాకారులు, గురువులు ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, ఉస్తాద్ అతా మహమ్మద్ ఖాన్, ఉస్తాద్ ఝండేఖాన్‌ల వద్ద సంగీతాన్ని అభ్యసించారు.

15వ ఏటనే గజల్స్, దాద్రాలు, ఠుమ్రీలు వంటి హిందూస్థానీ సంగీత రూపాలలో రికార్డులను విడుదల చేసి రికార్డు సృష్టించారు.

1930వ సంవత్సరంలో హిందీ సినిమాలలో నటగాయనిగా ప్రస్థానమారంభించారు. ‘కింగ్ ఫర్ ఎ డే’, ‘నలదమయంతి, ‘రోటి’, ‘రూప్ కుమారి’, ‘నసీబ్ కా చక్కర్’. ‘జల్సా ఘర్’ లలో ఈమె నటన నిరుపమానం. ‘రోటి’లో అఖ్తరీబాయి పైజాబాదిగా, ‘జల్సాఘర్‌’లో బేగం అఖ్తర్ గా ఈమె పేరు సినిమా శీర్షికలలో కనపడడం ఒక విశేషం. ‘జల్సాఘర్‌’తో సినీరంగం నుండి నిష్క్రమించారు.

1934వ సంవత్సరంలో నేపాల్‌లో, బీహార్‌లో వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్కర పరిస్థితులలో భూకంప బాధితుల సహాయార్థం సంగీత కచ్చేరిలలో గానం చేశారు. ఈ ధనాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. సరోజినీనాయుడి ప్రశంసలను అందుకున్నారు.

ఇలా జరుగుతూ ఉండగా 1945 సంవత్సరంలో బారిస్టర్ ఇషియాఖ్ అహ్మద్ అబ్బాసీతో ఈమె వివాహం జరిగింది. వివాహం తరువాత అఖ్తరీబాయి పైజాబాది పేరు ‘బేగం అఖ్తర్’గా మారింది.

ఆ తరువాత భర్త అభ్యంతరం వ్యక్తం చేయడంతో కళారంగానికి, సంగీతాభ్యసనం, కచ్చేరీలకు దూరమయారు. సమాజానికి దూరమై పంజరంలో బందీ అయారు.

ఆమె అభిమానులు ఈ నిష్క్రమణ పర్వాన్ని సహించలేకపోయారు. 5 సంవత్సరాల తరువాత ‘లక్నో ఆకాశవాణి కేంద్రం’లో ప్రోగ్రాం ప్రోడ్యూసర్‌గా పని చేస్తున్న సునీల్ బోస్ బేగం అఖ్తర్ పునరాగమనానికి పునాదులు వేశారు.

చాల కష్టపడి అఖ్తర్ భర్త అమ్మద్ అబ్బాసీతో మాట్లాడారు. “వేదిక మీద కాదు గదా! ఆకాశవాణిలోనే కదా!” అని అబ్బాసీని ఒప్పించారు. ఆకాశవాణి గాయనిగా ఆమె ప్రస్థానమారంభించారు.

ఈమె ఆకాశవాణి లక్నో కేంద్రం నుండి గజల్ గానాన్ని వినిపించడం మొదలు పెట్టారు. సుమారు 400 గజల్స్ రికార్డులు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. ‘దీవానా బనానా హైతో దీవానా బనాదే….’ గజల్ ప్రేమికులను, శ్రోతలను ఈనాటికీ అలరిస్తూనే ఉంది.

‘ఆయ్ మొహబ్బత్ తేరే అంజామ్ షేరోనా ఆయా’ అనే గజల్, ‘కోయల్ యా! మత్ కర్ పుకార్… మోరే కరేజ్వామే లాగే కటార్ కోయల్ యా’ అనే దాద్రా ఈమె కచ్చేరీలో ఎక్కువగా పాడేవారు. గజల్స్‌తో పాటు దాద్రాలు, ఠూమ్రీలను కూడా ఈమె ఆలపించేవారు. వేదిక మీద కచ్చేరీలలో పాడడం మరల మొదలు పెట్టారు.

ఈమె వివిధ సందర్భాలలో సహయనిధుల కోసం కచ్చేరీలలో గజల్స్‌ను ఆలపించారు. 1968వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని, 1972వ సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1975వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలు ఈమెను వరించాయి.

1962వ సంవత్సరంలో ‘చైనా యుద్ధసమయం’లో సహాయ నిధి కోసం సంగీత కచ్చేరీ చేశారు. 1972వ సంవత్సరంలో ముంబై నగరంలో క్యాన్సర్ హాస్పటల్‌లో సహాయం కోసం బేగం అనుచరులు, శిష్యులు ఒక సంగీత కచ్చేరీ ఏర్పాటు చేశారు. వారు ఆమెకు పారితోషికం, ఇతర ఖర్చుల నిమిత్తం ఇచ్చిన చెక్కును తిరిగి హాస్పటల్ కోసం అందించి తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు.

ఆమె చివరి మజలీ కూడా సహాయనిధి కోసమే కావడం గొప్ప విశేషం. 1974 అక్టోబర్ నెల 24వ తేదీన అహమ్మదాబాద్‌లో కచ్చేరి కోసం వెళ్ళారు. ఆమె బాగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో కుటుంబం, సన్నిహితులు వెళ్ళవద్దని వారించారు. అయితే సహాయనిధి కోసం వెళతాను అని పట్టుబట్టి వెళ్ళారు.

ఆ కచ్చేరిలో గజల్స్, ఠుమ్రీలు, దాద్రాలను ఆలపించారు. కచ్చేరి ముగిసే సమయానికి ఆమె చివరి క్షణాలు సమీపించాయి. 1974 అక్టోబర్ 30వ తేదీన ఆమె అక్కడే మరణించేరు. కాని ఆమె పార్థివదేహాన్ని జన్మభూమికి తరలించడంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు. భర్త అబ్బాసీ అతి కష్టం మీద లక్నోకి తరలించారు. తల్లి సమాధి ప్రక్కనే ఆమె కూడా సమాధి చేయబడ్డారు.

చిన్నతనం నుండి కష్టపడి సంగీతాభ్యాసనం చేసి, గజల్ గానానికి, ప్రాధాన్యతనిచ్చి (గజల్స్ రాణి,  మల్లికా-ఎ -గజల్) గా కీర్తి గడిచారామె.

తొలి, తుది కచ్చేరీలు ‘సహాయనిధి’ సంగీత కచ్చేరీలే కావడం విశేషం.

ఈ కచ్చేరీలలో గజల్స్ గానం చేసే అవకాశం రావడం ఆమెకి మాత్రమే దక్కిన అపురూప అవకాశం. ఇలా జరగడం అపూర్వం, అజరామరం. ఈ కచ్చేరీలు ఆమెను ‘గజల్స్ రాణి’ గానే కాదు ‘దాతృత్వరాణి’గా కూడా అంబరాన నిలిపాయి.

1994 డిశంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం బేగం అఖ్తర్ జ్ఞాపకార్థం 2 రూపాయల విలువగల స్టాంపును విడుదల చేసింది. ఇక్కడ కూడా ఆమెది ప్రత్యేక స్థానమే! విడుదలైన స్టాంపు తయారీలోని సాంకేతికలోపాల కారణంగా ప్రభుత్వం స్టాంపును ఉపసంహరించుకుంది. ఈ విధంగా ‘గజల్స్ రాణి’ స్టాంపు కూడా చరిత్రను సృష్టించింది.

అక్టోబర్ 30వ తేదీ ఈమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here