[box type=’note’ fontsize=’16’] “ఎన్నో విషయాల్లో మనం సమాధానపడి బతకడం లేదా? ఈ విషయంలో కూడా అంతే అనుకుని సర్దుకుపోవడమే” అంటున్నారు సలీం ‘ఘుమఘుమలు’లో నెయ్యి గురించి. [/box]
మా యింట్లో నెయ్యి వాడటం మానేసి చాలా యేళ్ళయింది. ప్రింట్ మీడియాలో, టీవీల్లో రోగాల గురించి చెప్పి భయపెట్టే డాక్టర్ల పుణ్యమా అంటూ ఆరోగ్య స్పృహ పెరిగి యాభై యేళ్ళ వయసు దాటినప్పటినుండి నెయ్యి తినడం మానేశా. నాతో పాటు రాణి కూడా మానేయడం వల్ల నెయ్యి కొనడమే ఆగిపోయింది. ఎలాగూ నాకు వేపుళ్ళంటే ఉన్న ఇష్టాన్ని వదులుకోలేకపోయాను కాబట్టి శరీరానికి అవసరమైనంత కొవ్వు కంటే ఎక్కువే లాగించేస్తున్నానేమో అన్న చింత మాత్రం మిగిలిపోయింది.
చిన్నప్పుడు ముద్ద పప్పులో నెయ్యి వేసుకుని తినడమంటే ఎంతిష్టమో.. మా ముస్లిం ఇళ్ళల్లో ఆవకాయలూ మాగాయలు పెట్టడం బహు అరుదు. మా పల్లెటూరినుంచి ఒంగోలు వెళ్ళే దారిలో రెండు వైపులా చింత చెట్లు విరగకాసి కన్పించేవి. చింతకాయలు కోసుకొచ్చి రాళ్ళ ఉప్పూ ఎర్ర కారం వేసి దంచి పోపు పెడ్తే చాలు తొక్కుడు పచ్చడి తయారయ్యేది. దాన్ని నిల్వ పెట్టుకునేవాళ్ళు. ఎంత పాత బడితే అంత రుచి.. పుల్లపుల్లగా… కారం కారంగా.. వేడి వేడి అన్నంలో చింత తొక్కు పచ్చడి వేసుకుని కలిపి, మధ్యలో గుంట చేసి అందులో వేడి చేసిన నెయ్యి పోసుకుని తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుండేది. దాన్లోకి నంజుకోడానికి కాల్చిన ఎండు చేప ఉంటేనా, నా సామిరంగా.. స్వర్గమే కన్పించేది.
ముస్లిం పేటకి కొద్దిగా ఆవలగా కాపుల ఇళ్ళుండేవి. అందులో ఒకావిడ గేదెపాలు అమ్మేది. రోజూ ఉదయం చెంబో, తపేలానో పట్టుకుని వాళ్ళింటికి పాలు పోయించుకోడానికి వెళ్ళేవాణ్ణి. అప్పటికే పల్లె ప్రజల్లో కూడా డబ్బుమీది వ్యామోహం పెరిగిపోయిందనుకుంటా… చిక్కటి పాల బదులు నీళ్ళు కలిపిన పాలు పోసేది. ఐనప్పటికీ ఆ పాలని వేడి చేస్తే తెట్టులా పైన మీగడ తేలేది. పెరుగుని మజ్జిగ చేయడానికి కవ్వంతో చిలికితే కవ్వం చుట్టూతా వెన్న పేరుకునేది. వెన్నని ఓ గిన్నెలో తీసి దాచిపెట్టేది అమ్మ. పక్షం రోజుల తర్వాత అలా కూడబెట్టిన వెన్నని కాచేది. ఇల్లంతా నేతి ఘుమఘుమల్తో నిండిపోయేది. వెన్నని కరగబెడుతున్నప్పుడు సువాసన కోసం చివర్లో కరివేపాకు వేస్తే.. ఓహ్.. ఆ వాసనకే ఆకలి జూలు దులిపేది.
జొన్న సంగటి చేసిన రోజు చిన్నచేపల్తో ఇగురు పెట్టేది. సంగటి ముద్ద మధ్యలో నెయ్యి వేసుకుని, చేపల ఇగుర్తో తింటుంటే ఉండే మజా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో వేలకు వేలు ఖర్చుపెట్టి తిన్నా రాదంటే నమ్మండి. ముద్దపప్పులో నేయి వేసుకుని తిన్నతర్వాత కొన్ని గంటల వరకు ఆ నేతి వాసన చేతిని అంటిపెట్టుకుని ఉండేది. యింట్లో ఉన్న అన్నదమ్ములకో అక్క చెల్లెళ్ళకో ఆ చేతిని వాసన చూపించడం.. వాళ్ళు “అబ్బా.. నేతి వాసన ఎంత బావుందో” అంటే మురిసిపోవటం.. ఎంత మధురమైన జ్ఞాపకమో.
మా మనవడికిప్పుడు ఏడాదిన్నర వయసు. వాడికి ముద్దపప్పన్నంలో ఘుమఘుమలాడే నెయ్యి కలిపి తినిపించాలని నా కోరిక. వాడిక్కూడా ఇటువంటి జ్ఞాపకాలు మిగల్చాలి కదా. ‘దానికేం భాగ్యం’ అంది రాణి. ఆ రోజే సుల్తాన్ బజార్ వెళ్ళి కేజీ నెయ్యి కొనుక్కొచ్చింది. వారం నుంచి వాడికి పప్పులో నేయి కలిపి తిని పిస్తున్నానని చెప్పింది. ‘అదేమిటి? నేయి వాసనే రాలేదు’ అన్నాను. రాణి నవ్వి వూరుకుంది. ఆ నవ్వు కర్థం ఏమిటో తెల్సుకుందామని రాత్రి భోజనానికి కూచున్నప్పుడు “నాకు టమేటా పప్పులోకి నెయ్యి వడ్డించు” అన్నాను.
రాణి గిన్నెపట్టుకుని వస్తుంటే “వేడి చేయకుండా పట్టుకొస్తున్నావేంటి?” అన్నాను. ‘గడ్డకడ్తేగా వేడి చేయడానికి’ అంది.
ఆశ్చర్యపోవడం నా వంతయింది. పోనీ ఎండాకాలం కూడా కాదాయె. చలికాలంలో కూడా నేయి గడ్డకట్టకపోవడం ఏమిటి? మా పెళ్ళయ్యాక రాణి ఇంట్లోనే అన్ని రకాల పచ్చళ్ళూ పెట్టేది. ఆవకాయ, మాగాయతో పాటు, టమేటా పచ్చడి, గోంగూర పచ్చడి, ఎర్ర మిరపకాయ పచ్చడి చేసి నిల్వ పెట్టేది. ఆ రోజుల్లో కూడా నిప్పుల మీద సెగ చూపించకుండా వడ్డిస్తే నెయ్యి తెల్లటి రాయిలా కంచంలో పడేది. వేడిగా పొగలు కక్కుతున్న అన్నం మీద వేసిన కొన్ని క్షణాలకు కానీ కరిగేది కాదు. అందులో ఎర్రగా ఆవకాయ కలుపుకుని తింటుంటే ప్రాణం గాల్లో తేలిపోయేది.
“సరే. అదే వడ్డించు” అన్నా. రెండు చెంచాల నెయ్యి కంచంలో ఓ పక్కగా వేసి “మీక్కావల్సినంత కలుపుకోండి” అంది. ఆశగా టమేటా పప్పు కలిపిన అన్నంలోకి పళ్ళెం చివర్లో ఉన్న నేతిని లాక్కుని కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్నా. ఏదీ ఆ రుచి? కందిపొడిలో ఆవనూనె కలుపుకుని తిన్నా నోటికి నూనె రుచి తెలుస్తుంది. ఇపుడేదీ నేయి రుచి? అరచేతిని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూశా. ఏవీ ఆ ఘుమఘుమలు? అసలు నేయి కలుపుకుని తింటున్నట్టు లేదు. నీళ్ళు కలిపినట్టుంది.
“ఇదేమిటి ఇలా ఉంది?” అన్నాను.
“ఇపుడొచ్చే నెయ్యి ఇలాగే ఉంటోందండి’ అంది రాణి.
“లేదు లేదు. బహుశా ఇది కల్తీ నెయ్యి అయి ఉంటుంది. మన మనవడికి ఇలాంటి నెయ్యి తినిపించడమేమిటి? రేపు నేను మంచి నెయ్యి కొని తెస్తానుండు. కాగపెడ్తుంటేనే ఇల్లంతా నేతి వాసనతో ఘుమ ఘుమలాడాలి” అన్నాను.
“ఎందుకండీ శ్రమ?” అంది మళ్ళా అదోలా నవ్వుతూ.
“మనవడికోసం ఆ మాత్రం శ్రమపడకపోతే ఎలా?” మిగిలిన నేతిని పక్కకు జరిపేసి ఉత్త టమేటా పప్పుతో అన్నం తింటూ అన్నాను.
మరునాడు రమణకి ఫోన్ చేశాను. రమణదీ నా వయసే. ఓసారెప్పుడో ఏవి తింటే ఆరోగ్యం అనే విషయం మీద చర్చ వచ్చినపుడు ‘నాకైతే ఓ చుక్కయినా నెయ్యి వడ్డించుకోకపోతే ముద్ద దిగదు’ అనటం గుర్తొచ్చింది. రెండేళ్ళ క్రితం గుండె నొప్పి వస్తే రెండు స్టంట్లు అమర్చారు. ‘మరి కొలెస్ట్రాల్ సంగతేమిటి?” అని అడిగితే “మందులు మింగుతున్నాగా. వాటికి సరిపడా తినకపోతే ఎలా” అన్నాడు నవ్వుతూ.
“ఏ నెయ్యి వాడుతున్నావు? ఎక్కడ కొంటున్నావు?” అని అడిగాను. ఓ బ్రాండ్ నెయ్యి పేరు చెప్పాడు. “పూసలుగా పేరుకుంటోందా? మన చిన్నప్పటి నెయ్యిలా ఘుమఘుమలాడుతోందా?”
“అబ్బే. అలాంటి నెయ్యి ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది? నేను కూడా నాలుగైదు రకాల బ్రాండ్లు వాడాక దీనికి సెటిలయ్యాను. నువ్వు కూడా ప్రయత్నించి చూడు” అన్నాడు.
ఆ బ్రాండ్ నెయ్యి దొరికే షాపుకెళ్ళి, ఎందుకైనా మంచిదని అరలీటరు ప్యాకెట్ ఉంటే కొన్నాను.
ఇంటికి రాగానే రాణి ఆ ప్యాకెట్ చూసి “అయ్యో రామ. నన్నడిగి ఉంటే చెప్పేదాన్ని కదా. మనింట్లో మనవడి కోసం మొదట వాడింది ఈ బ్రాండ్ నెయ్యే. శుద్ధ దండగ” అంది.
ఇలా లాభం లేదని మా ఆయుర్వేద డాక్టర్ రంగాచారి గారికి ఫోన్ చేశాను. ‘ప్రతిదీ కల్తీ అయిపోయిందండీ. మన చిన్నప్పటి రోజులే వేరు. ఇప్పుడు దొరికేది కల్తీ పాలేగా. పెరుగు తింటుంటే ఒకప్పటి పెరుగులా కమ్మగా అన్పిస్తే ఒట్టు. రోజూ గ్లాసెడు మజ్జిగ తాగేవాణ్ణి. మజ్జిగ రుచే మారిపోయింది. ఏదో వెగటు వాసన… నెయ్యి కూడా ఇందులోంచేగా తీస్తున్నారు’ అంటూ అరగంట సేపు బాధపడి ‘బడీచౌడీలో ఫలానా చోట కొనండి. శ్రేష్ఠం అన్న మాట వాడను కానీ ఉన్నవాటిల్లో అదే మెరుగనిపించింది’ అన్నారు.
బడీ చౌడీలో రెండు మూడు సన్నటి గల్లీలు తిరిగి వెతుక్కుంటే గాని ఆ దుకాణం దొరకలేదు. కేజీ ఏడొందలు అన్నాడు. మనవడికంటే ఎక్కువా అనుకుని కొనేశాను. రాత్రి భోజనాల దగ్గర కూచున్నప్పుడు ‘కొద్దిగా టమేటా పచ్చడి తగిలించు. అదే చేత్తో ఆ నెయ్యి కాస్త వడ్డించు’ అన్నాను. వేడివేడి అన్నంలో టమేటా పచ్చడి కలుపుకుని నెయ్యి వేయించుకున్నాను. ముద్ద నోట్లో పెట్టుకోవండం ఆలస్యం రాణీ వైపు “ఇదేమిటి??” అన్నట్టు చూశాను. నెయ్యి రుచి నాలిక్కి తగల్లేదు. ఘుమఘుమలాడే వాసన నాసికారంధ్రాలను తాకలేదు.
‘రోజులు మారిపోయాయి కదండీ. ఎప్పుడో యాభై యేళ్ళ క్రితం మీ పల్లెటూర్లో తిన్న పెరుగు రుచీ, నేతి వాసనా రమ్మంటే ఎక్కడనుంచి వస్తాయి? ఇప్పుడు నెయ్యి ఎక్కడ కొన్నా ఇలానే ఉంటుంది. వాసన రాదు. పూసలు కట్టదు. ఎన్నో విషయాల్లో మనం సమాధానపడి బతకడం లేదా? ఈ విషయంలో కూడా అంతే అనుకుని సర్దుకుపోవడమే” అంది నవ్వుతూ.
అదే నవ్వు… అప్పుడు ఎందుకలా నవ్విందో ఇపుడు బాగా అర్థమైంది.