Site icon Sanchika

గిరి వందనం

[10 ఆగస్టు శ్రీ వి.వి. గిరి జయంతి సందర్భంగా మల్లాప్రగడ రామారావు గారు రచించిన ‘గిరి వందనం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]ర్మిక, రాజకీయ, న్యాయవాద రంగాల త్రివేణీ సంగమమే గిరి జీవితం. సంఘటనా సామర్థ్యం, నిస్వార్థం, త్యాగశీలం వారి కవచకుండలాలు.

వి.వి. గిరిగా ప్రసిద్ధులైన‌ వరాహగిరి వెంకటగిరి 10-8-1894న‌ ఇప్పుడు ఒడిశాలో ఉన్న, అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రo బర్హంపూర్‌లో పుట్టారు. తల్లి సుభద్రమ్మ, తండ్రి జోగయ్య పంతులు. వారు నాటి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి గ్రామం నుండి బర్హంపూర్‌కి వలస వెళ్లారు. ఇద్దరూ స్వాతంత్ర సమరంలో భాగమైన సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలలో చురుకైన పాత్ర వహించారు. మద్యనిషేధం కోరుతూ జరిగిన సమ్మెలో‌ కీలక పాత్ర వహించినందుకు సుభద్రమ్మ కారాగారవాస శిక్ష కూడా అనుభవించారు.

వ్యక్తిత్వ హననం – అసలు నిజం

1969 ఆగస్ట్ 24 న స్వతంత్ర భారతదేశ నాల్గవ రాష్ట్రపతిగా గిరి ప్రమాణ స్వీకారం చేసి, పూర్తిగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు.

రాష్ట్రపతిగా ఉన్న కాలంలో, కార్మిక, రాజకీయ రంగాలలో గిరి మహత్తర సేవలు తెలియని అజ్ఞానం వలన, సమకాలీన వార్తా పత్రికలలో వస్తున్న కొన్ని కథనాలు నమ్మి, నేనూ వారిని ‘రబ్బర్ స్టాంప్’ రాష్ట్రపతి గానే భావించాను.

కాలక్రమేణా, పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంఘాల చరిత్రకు సంబంధించిన కొన్ని గ్రంథాలు చదివినప్పుడు, గిరి మహోన్నత వ్యక్తిత్వం తెలిసి వచ్చింది.

ఇప్పటికీ, అప్పటి నాలా ఆలోచించే మా తరం వాళ్లకూ, గిరి పేరే తెలియని, లేదా పేరు మాత్రం తెలిసిన ఇప్పటి వారినీ దృష్టిలో పెట్టుకుని, నాణేనికి రెండో వైపు మీముందుంచుతాను.

విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు -విప్లవ భావాలు

గిరి ఉన్నత విద్య అభ్యసించిన ఖల్లికోట కళాశాల విద్యార్థి సంఘానికి వరుసగా మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశలోనే భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

అంతేకాదు. ఐర్లాండ్ లోని, యూనివర్సిటీ కాలేజ్, డబ్లిన్‌లో న్యాయ, సాంఘిక శాస్త్రాల విద్యార్థిగా ఉన్నప్పుడు (1913-16), తమ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమిస్తున్న ఐర్లాండ్ రాజకీయ పక్షం Sinn Fein కి చేరువయ్యారు. దాంతో కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల వారి నిబద్ధత మరింత ధృడపడింది. డబ్లిన్‌లో ఉన్న‌ సహ భారతీయ విద్యార్థులతో కలిసి దక్షిణాఫ్రికాలో భారతీయుల స్థితి గురించి ఒక కరపత్రం రూపొందించారు. అది భారతదేశ రాజకీయ నిఘా విభాగం చేతుల్లో చిక్కగా, వారందరిపై పోలీసు దృష్టిపడింది.

స్వతంత్ర ఐరిష్ రిపబ్లిక్‌ను స్థాపించే లక్ష్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐరిష్ రిపబ్లికన్‌లచే ప్రారంభించబడిన సాయుధ తిరుగుబాటు (1916 Rising) కి నాయకత్వం వహిస్తున్న ప్రముఖులతో గిరి సన్నిహితంగా ఉన్నట్టు ప్రభుత్వానికి సందేహం కలిగింది. ఫలితం 1-6-1916 కల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం.

వందేమాతరం – శ్రమయేవ‌ జయతే

1916లో స్వదేశం తిరిగి వచ్చిన తర్వాత మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. దిగ్విజయంగా సాగుతున్న న్యాయవాద వృత్తిని వదులుకొని, మహాత్ముడి పిలుపు మేరకు రాజకీయ రంగప్రవేశం చేసారు. తోడుగా కార్మిక ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

1923లో ఊపిరి పోసుకున్న ‘అఖిలభారత రైల్వే కార్మికుల సమాఖ్య’ వ్యవస్థాపక సభ్యులలో గిరి ఒకరు. ఆ సమాఖ్యకు దాదాపు ఒక దశాబ్దం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.

మనదేశంలో మొట్టమొదటి జాతీయస్థాయి కార్మిక సంఘం ‘అఖిల భారత కార్మిక సంఘ కాంగ్రెస్’ (ఏ.ఐ.టి.యు.సి) అధ్యక్షుడిగా గిరి 1926లో మొదటిసారి ఎన్నికయ్యారు.

1928లో ఏర్పడిన ‘బెంగాల్- నాగపూర్ రైల్వే అసోసియేషన్’ వ్యవస్థాపకులు కూడా వారే. వారి పట్ల గౌరవ సూచకంగా, ఖర్గపూర్ ప్రక్కనున్న రైల్వే స్టేషన్‌కు ‘గిరి మైదాన్’ అన్న పేరు పెట్టడమయింది.

నాటి బ్రిటిష్ పాలకులు, కార్మికుల, జీవన, ఉద్యోగ, సాంఘిక ఆర్థిక స్థితిగతుల పరిశీలనకు నియమించిన రాయల్ కమిషన్ ఆఫ్ లేబర్ (1929-31) తో సహకరించే విషయమై విభేదాలు కారణంగా 1929లో సోషలిస్ట్ నాయకుడు ఎన్.ఎం.జోషి ప్రభృతులతో కలిసి భారత కార్మిక సంఘ సమాఖ్య (ఐ.టి.యు.ఎఫ్.) స్థాపించారు. ఆ సమాఖ్య తొలి అధ్యక్షుడు గిరి గారే.

చెప్పుకోదగ్గ విషయమేమంటే, ఆ రాయల్ కమిషన్ కార్మికుల సాంఘిక, పారిశ్రామిక సమస్యలకు మూల కారణం దారిద్ర్యమే అని నిర్ధారించడం. కార్మికలోకానికి ఉపయుక్తమైన పలు సూచనలు చేయడం. అందులో గిరి పాత్ర ప్రముఖం.

భేదాలు సమసి పోగా, ఐ. టి. యు. ఎఫ్. 1939 లో ఏ.ఐ.టి.యూ.సి. లో విలీనమైంది. 1942లో రెండోసారి గిరి ఏ.ఐ.టి.యు.సి. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

పారిశ్రామిక తగాదాలను ఉమ్మడి బేరం మరియు పరస్పర సంప్రదింపుల ద్వారా యాజమాన్యం, కార్మిక సంఘాలు పరిష్కరించుకోవాలన్నది గిరి దృఢ నిర్ణయం, విశ్వాసం. ‘గిరీ అప్రోచ్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్’ పేరిట ఇది ప్రసిద్ధమైంది. మరో తెలుగుతేజం పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా కార్మిక రంగానికి గిరి చేసిన సేవకు గుర్తింపుగా ‘నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్’ పేరుని ‘వి.వి. గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్’ గా మార్చారు.

నిరుపమానమైన కార్మిక సంక్షేమ నిబద్ధత

కార్మిక సంఘ నాయకత్వ నిచ్చెనల మీదుగా అధికారపీఠం దక్కించుకోవడం మన దేశంలో సామాన్యం కాగా, కార్మిక వర్గ శ్రేయస్సు కాంక్షించి కేంద్ర మంత్రి పదవిని వదులుకొన్న మహనీయుడు గిరి.

గిరి 1952 లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్యాంకింగ్ రంగంలో పారిశ్రామిక తగాదా పరిష్కారానికై పారిశ్రామిక న్యాయస్థానం ఇచ్చిన అవార్డును, ఉద్యోగుల వేతనాలు తగ్గించడానికి వీలుగా, కేంద్రం సవరించడాన్ని వ్యతిరేకించిన గిరి, 1954లో తమ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

రాజకీయ కురుక్షేత్రంలో తొలి దిగ్గజ సంహారి- నిర్భీతికి బాసటగా నిలిచిన నిజాయితీ

మన దేశ ఎన్నికల చరిత్రలో మొదటి ‘దిగ్గజ సంహారి’ 1936 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో బొబ్బిలి రాజాని ఓడించిన గిరి గారే.

విస్తరణ భీతి వల్ల వారి రాజకీయ జీవితాన్ని రేఖామాత్రంగానైనా పొందుపరచులేకున్నాను. కానీ నమ్మశక్యంగాని‌ నిజమొకటి‌ చెప్పి తీరాలి.

ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోవడమే జీవితాశయంగా, స్వంత రాజకీయ పక్షాన్నే చీల్చే ప్రబుద్ధులున్న మన దేశంలో, ఆ అవకాశం అందిపుచ్చుకోని మహామనిషి గిరి.

1946లో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఏర్పడినప్పుడు, గిరి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదని కాంగ్రెస్ పెద్దలు, గాంధీ సహా, ఒత్తిడి తెచ్చినా, అంగీకరించక, కొన్ని కష్టాలు, ప్రమాదాలు ఎదురైనా, గురుతుల్యులు, అసమాన ధైర్యశాలి, ఉదాత్త చరితుడు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి శాయశక్తులా కృషి చేసి, గిరి సఫలమయ్యారు.

దాచిన నిజం వెల్లడయింది- మబ్బు వీడింది

జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో 8-5-1974 నుండి 27-5-1974 వరకు 20 రోజుల పాటు రైల్వే కార్మికుల సమ్మె జరిగింది. సమ్మె ఫలితంగా ఆహార ధాన్యాల రవాణాకు, బొగ్గు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇంకో రెండు రోజులు సమ్మె జరిగితే విద్యుదుత్పత్తి సంస్థలు, ఉక్కు కర్మాగారాలు మూతపడే పరిస్థితి. దాంతో ప్రభుత్వం సమ్మె అణచివేతకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న కార్మిక కుటుంబాలను కూడా ఖాళీ చేయించింది. రైల్వే కార్మిక ఉద్యమ పితామహుడు గిరి గారు ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం పలు విమర్శలకు దారితీసింది. కానీ, ఇంతకుముందే చెప్పినట్టు, తర్వాత జ్ఞానోదయమయింది. నిజానికి, రాష్ట్రపతి గిరి, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి, ఈ అణచివేత చర్యలకు తన ఆక్షేపణ తెలిపారని తెలిసి.

చట్టం ముందు అందరూ సమానులేన‌‌ని చేతలలో చూపిన అసామాన్యుడు

పదవీకాంక్ష లేశమాత్రమైనా లేకుండా, విలువలు పాటించి, ముఖ్యమంత్రి పదవి చేపట్టని గిరి గురించి, కార్మిక శ్రేయస్సు తన శ్వాసయని భావించి, కేంద్ర మంత్రి పదవి వదులుకున్న గిరి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు న్యాయవ్యవస్థ పట్ల వారికిగల అపార గౌరవాన్ని చాటి చెప్పే సంఘటన తెలుసుకుందాం.

జాకీర్ హుస్సేన్ మరణానంతరం అప్పటి ఉపరాష్ట్రపతి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికకి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతర్గత విభేదాలు కారణంగా, రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని, ఇందిరాగాంధీ గిరికి మద్దతు పలికారు. ‘అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయడ’మనే సిద్ధాంతం తెరపైకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థులు మరో తెలుగు బిడ్డ, రాజకీయ దురంధరుడు నీలం సంజీవరెడ్డి, తెలుగు మహిళా మాణిక్యం దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్‌లను ఓడించి, గిరి రాష్ట్రపతిగా స్వల్ప ఆధిక్యతతో ఎన్నికయ్యారు.

ఆ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టులో వాజ్యం దాఖలుయింది. రాష్ట్రపతి భవన్‌లో గిరి సాక్ష్యం నమోదు చేయడానికి న్యాయస్థానం ఒక అడ్వొకేట్ కమిషనర్‌ని ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక నిందితుడు తన సాక్ష్యం నమోదు చేయడానికి అలాంటి ఏర్పాటు చేయమని ఒక రా‌ష్ట్ర‌ ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

కానీ మనసా, వాచా, కర్మణా ‘న్యాయస్థానం ముందు అందరూ సమానమే’ననీ, ‘ఎవరెంత ఎత్తుకు ఎదిగినా, న్యాయం కంటే ఎక్కువ కార’ని నమ్మిన గిరి, సాక్ష్యం ఇవ్వడానికి న్యాయస్థానానికి స్వయంగా హాజరయ్యారు.

కొసమెరుపు

ప్రఖ్యాత పాత్రికేయుడు, జర్నలిజం విభాగంలో 2007వ సంవత్సరపు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ వి.వి. గిరి మనవడే.

సఫల జీవితం గడిపి, తన 86వ ఏట, మద్రాసులో ‘భారత రత్న’ గిరి స్వర్గస్థులయ్యారు.

శిరసా నమామి.

Images Credit: Internet

Exit mobile version