[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[బొబ్బిలిలో హైస్కూలు. ప్రాథమిక బడిలో ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి దాకా చదువుకున్న బాల బాలికలంతా ఆరవ తరగతికి రాగానే అబ్బాయిలంతా మగపిల్లల స్కూలుకీ, అమ్మాయిలంతా ఆడపిల్లల స్కూలుకీ చేరిపోతారు. నర్మద రెండు పుస్తకాలలో బడిలోకి ప్రవేశిస్తుంది. గంట మోగుతుంది. అక్కడున్న పిల్లలంతా వరుసలలో నిలబడతారు. ప్రార్థన జరుగుతుంది. బాగా చదువుకుని హైస్కూలు చదువు పూర్తిచేయాలని నిర్ణయించుకుంటుంది నర్మద. క్లాసు రూమ్ లోకి వెళ్తారు పిల్లలంతా. నర్మద క్లాసులోకి వచ్చిన టీచర్ ముందుగా అటెండెన్స్ తీసుకుంటారు. నర్మద పేరు పిలిచినప్పుడు, ఆ పేరుకి అర్థం తెలుసా అని అడుగుతారామె. అది ఒక నది పేరని చెప్తుంది నర్మద. ఆ టీచరుగారి పేరు అరుణ అనీ, తెలుగు పాఠాలు చెప్తారనీ తెలుసుకుంటుంది నర్మద. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన నర్మదని – బడి గురించి, స్నేహితుల గురించి అడుగుతుంది అమ్మమ్మ. అన్నం తిని చెప్తానంటుంది. సాయంత్రం ఇంటికొచ్చాకా, ఆ రోజు జరిగిన సంగతులన్నీ అమ్మకీ, అమ్మమ్మకీ చెప్తుంది. అమ్మమ్మ తన గతం గురించి చెప్తూ సవరల కోసం గిడుగు రామమూర్తి పంతులు గారు చేసిన కృషిని నర్మదకి అర్థమయ్యేలా చెప్తుంది. నేస్తమంటే ఎవరో చెప్పి, మంచి స్నేహితులు ఉండడం అవసరమని చెప్తుంది. ఇక చదవండి.]
అధ్యాయం-2: అపురూపం
[dropcap]న[/dropcap]ర్మదకు చిన్నప్పటి నుండి లెక్కలంటే ఇష్టం. స్కూల్‌లో వెయ్యకముందే ఎక్కాలు ఇరవై ఇరవైలు కంఠతా వచ్చేట్లుగా అమ్మమ్మ నేర్పింది. అంతేకాదు మధ్యమధ్యలో అడిగినా, క్రింద నుండి మీదకు చెప్పమన్నా తడుముకోకుండా చెప్పేసేది. పజిల్స్ లెక్కలు చేయడమంటే భలే ఇష్టం.
ఆ రోజు లంచ్ బ్రేక్‌లో బయట అందరూ తిరుగుతూ ఉంటే నర్మద ఒక లెక్కతో కుస్తీ పడుతూ వెనుక బెంచిలో కూర్చుంది. చాలాసేపుగా నర్మదనే గమనిస్తున్న ఒక పాప తన ముందుకు వచ్చి నిల్చుంది. లెక్క సీరియస్‌గా చేయడంలో మునిగిపోయిన నర్మద చూడలేదు.
ఇంతలో ఆ పాపే ముందుగా పలకరిస్తూ “హలో! నా పేరు ఇంద్రాణి. కొత్తగా చేరాను” అంది. తీయని ఆ స్వరానికి నర్మద తలెత్తి చూసింది. ఉంగరాల జుత్తు నుదుటిపై కిరీటంలా ఉంది. కాటుక దిద్దిన మెరిసేకళ్ళూ, పచ్చనికాంతితో మెరిసిపోయే ఇంద్రాణిని చూడగానే, “రా! కూర్చో! నా పేరు నర్మద” అంటూ కూర్చోమని పక్కనే జాగా చూపింది.
అంతే! ఇద్దరి మధ్యా మాటలు ప్రవాహం. కిలకిల నవ్వులు. మాటల మధ్యలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఎన్నో జన్మల సంబంధం లాగా ఆత్మీయంగా కలిసిపోయారు. బెల్ కొట్టి లెక్కల టీచర్ రుక్మిణిగారు క్లాస్ లోకి వస్తున్నారనే సంకేతం డోర్ దగ్గర నుంచి వచ్చేవరకూ చేతులు విడువలేదు.
స్నేహబంధానికి బలమైన వేళ్ళూనుకున్న మధుర క్షణాలవి. సాయంత్రం ఎప్పుడెప్పుడు ఇల్లు చేరి అమ్మ చెవిలో తన కొత్త స్నేహితురాలు గురించి చెబుదామా? అనే ఆత్రుత నర్మదలో.
“అమ్మా! మరేమో ఇంద్రాణి ఎంత బాగుందో? ఎంత చక్కగా మాట్లాడుతుందో తెలుసా? ఇవాళే స్కూల్లో చేరిందట. తనకి బోలెడన్ని పాటలు కూడా వచ్చునట.” ఆపకుండా గలగలా మాట్లాడుతున్న కూతురిని మురిపెంగా చూస్తూ, “అమ్మయ్య! ఇన్నాళ్ళకు మా బంగారు తల్లికి నచ్చినవాళ్ళు దొరికారంటే ఇంక నేస్తం కట్టేసినట్లేనా?”
“అమ్మా! గిడుగు రామమూర్తి పంతులుగారు సవర బాలునితో చేసిన స్నేహం లాంటిదా?” అడిగింది.
“కాదులేవే! నాకు వంటింట్లో పని ఉంది గానీ అమ్మమ్మని అడుగు.” అన్న తల్లి మాటలు విని అమ్మమ్మ దగ్గరకు పరుగుతీసింది.
“అమ్మమ్మా! మ్మమ్మా! మ్మా!” అరుచుకుంటూ వస్తున్న నర్మదను చూస్తూనే ఆవిడ భయపడినట్లుగా రెండు చేతులతో చెవులు మూసేసుకుంది. వెంటనే నర్మద అలిగినట్లుగా ఆమె ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని నోటిమీద వేలు వేసుకుంది.
“అయ్ బాబోయ్! మా బంగారు తల్లి అలిగితే ప్రపంచమే ఆగిపోతుంది.ఇంక మేమెంత?” అంటూ నర్మదను ఒడిలోకి తీసుకుంది.
“అమ్మమ్మా! నువ్వు స్కూల్ టీచరుగా పని చేశావు కదా! ఎక్కడ పని చేసావు? మీ స్కూల్ పిల్లలు ఎలా ఉండేవారు? కొంచెం మీ స్కూల్ విశేషాలు చెప్తావా?” అడిగింది.
“అబ్బో! చిట్టితల్లికి అప్పుడే ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనిపిస్తోంది. చెప్తాను. ఏ టీచర్ కైనా వాళ్ళ స్కూల్ గురించి, పిల్లల గురించి చెప్పాలంటే ఎంత ఆనందమో తెలుసా? కానీ చాలా పాత కాలం నాటి విషయాలు కదా! మా స్కూలు మీ స్కూలు లాగా కాదు. చెప్పాలంటే నవ్వకుండా వింటావా మరి.”
నర్మద వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చక్కగా తల ఊపింది.
“మీకు పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉంటుంది కదా! అందులో భూగోళశాస్త్రం కూడా ఉంటుంది. అంటే భూమికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనితో భూమిపై దేశాలూ, నదులూ, పర్వతాలూ, సముద్రాల గురించి తెలుసుకోగలం. మనం ఉండే ప్రదేశాన్ని మనం గుర్తించి ప్రపంచంలోని మిగతా వాటితో ఏ విధంగా ఉందో పోల్చి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇంతకు ముందు రోజులలో ఈ ప్రాంతము ఉత్తరాన మహానది నుండి దక్షిణాన గోదావరి వరకు వ్యాపించి ఉండేది. దీనిని కళింగ ప్రాంతం అనేవారు. ఇక్కడ ప్రజలు సంస్కృతం, తెలుగు, తమిళం, ఒరియా, బెంగాలీ మాట్లాడుతూ ఉండేవారు. వాటికి సంబంధించిన గ్రంథాలు తాళపత్రాల పైన రాసుకునేవారు. అలాగే అనేకమైన ఆలయాలు కట్టుకొని ఆ ఆలయాలలో వాటికి సంబంధించిన విశేషాలు అన్నీ శాసనాల కింద రాసేవారు.”
“శాసనాలు అంటే ఏంటి అమ్మమ్మా?”
“శాసనాలు అంటే ప్రభుత్వము వారు తాము చెప్పదలచుకున్న దానిని, లేదా తమ ఆజ్ఞలను శాశ్వతంగా ఉండాలని శిలలపైనా, తాటి ఆకులపైనా, వస్త్రములపైనా వ్రాసి ఉంచేవారు. పూర్వం కాగితము లేని రోజులలో తాళపత్రాలు అంటే తాటిఆకులు మీద, రాతిబండల మీద అందరికీ అవసరమైన విషయాలను రాసుకొని ఉంచుకునేవారు. అందరికీ తెలియడం కోసం వాటిని దేవాలయాలలో గాని, ఊరి నడి మధ్యలో గానీ పెట్టేవారు.
అలాంటి శాసనం చదివితేనే మనకు తెలిసింది. కళింగ అనేది నాలుగు ప్రాంతాలుగా విభజించారు. అవి ఉత్కల, కోసల, కొంగాడ, కళింగ అని. అందులో కళింగ ప్రాంతమే మనది. ఇది ఉత్తరాన మహేంద్రగిరి పర్వతము నుండి దక్షిణాన గోదావరి వరకు ఉంది. దీన్ని తిరిగి ఉత్తర కళింగ, మధ్యమ కళింగ, దక్షిణ కళింగ అని విభజించారు.
“అమ్మమ్మా! అయితే ఇప్పుడు మనం కళింగలోని ఏ ప్రాంతములో ఉన్నాము?”
“ఇంతకు ముందు మనం దక్షిణ కళింగలో ఉండేవారము. ఇప్పుడు మనం బొబ్బిలి వచ్చాము కదా! ఇది విజయనగర ప్రాంతానికి చెందినది. ఈ ప్రాంతంలో చాలా ఆలయాలు ఉంటాయి. ఎందుకంటే కావేరినదీ ప్రాంతం నుండి వచ్చిన అనేక మంది రాజులు ఇక్కడ ఆలయాలను కట్టించి, వాటిని పరిరక్షించడానికి తాము జయించిన భాగంలో నుండి కొంత భూభాగం ఆలయం కోసం రాసి ఉంచేవారు. అలా రాసి ఉంచిన వాటినే ‘శిలాశాసనాలు’ అనేవారు.
1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు ఈ చుట్టుపక్కల గల బరంపురం, ఛత్రపూర్, పర్లాకిమిడి, గుణుపూర్, రాయగడ ఈ ప్రాంతాలన్నీ మద్రాసుతో కలిసి ఉండేవి. అప్పుడు రాయగడ జిల్లాగా ఉండేది. అందులో గల పంచాయితీ సమితికి చెందిన ఒక గిరిజన పాఠశాలలో నన్ను మా నాన్నగారు ఉపాధ్యాయురాలిగా అంటే టీచరుగా చేర్చారు.
మొట్టమొదటిలో నేను స్కూలుకు వెళ్లిన రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా?” ఆ సంఘటన అప్పుడే జరుగుతున్నట్లు సుభద్రమ్మగారు నవ్వు ఆపుకోలేక పకపక నవ్వేశారు.
అమ్మమ్మ నవ్వుతూ ఉంటే నర్మద కూడా నవ్వుతూ, “ఏం జరిగిందో చెప్పు?” అంది.
“మొదటిరోజు స్కూలుకు వెళ్లేసరికి పిల్లలంతా వారి వారి ఇళ్ళలోకి దూరిపోయి, దగ్గరలో గల చెట్లు ఎక్కిపోయి, గుడిసెల మీదకు చకచకా ఎక్కిపోయి స్కూలులో ఒక్కరు కూడా లేరు. ఏమి చేయాలో తోచక గూడెం పెద్దలని, పిల్లల తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పాను.
‘పిల్లలే లేకపోతే పాఠాలు చెప్పడం ఎలా?’ అని వాపోయాను. వారు నా ఉత్సాహాన్ని గమనించి – ‘పిల్లలు కొత్తవారిని చూస్తే భయపడతారని, దగ్గరకు రార’ని చెప్పారు.
మరి పిల్లల్ని చేరిక చేసుకోవడం ఎలా? అని ఆలోచించి, పిల్లల భయం తీరడానికి రోజుకి ఒక పిల్లాడి తాలూకా అమ్మని నాతో పాటు కూర్చోమని అడిగాను.
వారు అంగీకరించి ఆ విధంగా చేయడంతో రోజురోజుకీ చిన్న చిన్న పాటలు, మాటలు చెబుతూ వారికి పాఠాలు చెప్పడం మొదలు పెట్టాను. అంతా నోటితోనే. ఎందుకంటే వారికి రాయడం రాదు. వారి భాష సవర భాష. దానికి లిపి లేదు. అక్షరాలు లేని వీరికి ఏ విధంగా చదువు చెప్పాలా? అని అనేక ప్రయత్నాలు చేసాను. వారు మాట్లాడే భాష కొంచెం గందరగోళంగా ఉంటుంది.”
“అమ్మమ్మా! ఒకటడుగుతాను చెప్పు. వాళ్ళతో మరి ఎలా మాట్లాడేదానివి?”
“చెప్పానుగా! గిడుగు రామమూర్తి పంతులుగారు చేసిన సహాయము. సవరభాష నుండి తెలుగుకు రాసిన నిఘంటువుని దగ్గర పెట్టుకుని ఆ పదాలను పలుకుతూ ఆదిమానవుడి భాషపై ఆధార పడ్డాను.”
“అంటే?” ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
“ఏముంది? మూగభాష సౌంజ్ఞల ద్వారా అన్నమాట.”
ఇంతలోనే అన్నపూర్ణ వచ్చి, “చీకటి పడింది. అన్నం పెడతాను వస్తావా?” అడిగింది.
“ఉండమ్మా! అమ్మమ్మ మంచి విషయాలు చెపుతోంది.”
“అమ్మమ్మతో కబుర్లు రేపు కూడా చెప్పవచ్చు. అన్నం తిని మీ టీచరు చెప్పిన స్కూలు పని చేసుకుని పడుకో. అప్పుడు అమ్మమ్మ మళ్ళీ అన్ని కబుర్లూ చెపుతుంది.”
అన్నం తినేసి వచ్చి అమ్మమ్మ దగ్గర చేరింది. ఆమె చిన్నగా పాట పాడుతూ జోకెట్టింది.
మర్నాడు నర్మద స్కూలులో ఇంద్రాణితో నడుస్తూండగా ఆమె చిన్నగా కూనిరాగం తీస్తోంది, ఏదో పాటకు.
‘త్రిలింగ దేశం మనదేనోయ్!/తెలుంగులంటే మనమేనోయ్!/మధురం మధురం అతి మధురం!/ఆంధ్రమంటే అతి మధురం!’
“ఇందూ! గట్టిగా పాడు. నాకు కూడా నేర్పుతావా? స్కూలులో ఫంక్షనుకు మనమిద్దరం పాడుదాము.”
“అలాగే! తప్పకుండా. ఈ పాటకు డాన్స్ కూడా ఉంది. చాలా బాగుంటుంది” అని చెప్పి ఆ పాట నేర్పి, డాన్స్ కూడా ఎలా చేయాలో నేర్పింది.
నర్మదకు ఇంద్రాణి రోజు రోజుకీ నచ్చేస్తోంది. ఎంతో సున్నితంగా, ఏది అడిగినా అలాగే! అంటుంది తప్ప లేదు, వద్దు, రాదు ఇలాంటి మాటలు రావేమో? ఆ విషయాన్నే అమ్మమ్మ దగ్గర అడిగింది. “అమ్మమ్మా! కొందరు ఎంతో మంచిగా ఉంటారు. కొందరు కోపంగా ఉంటారు. ఎందుకనీ?”
“స్నేహం చేస్తే తన సొంతం అన్న భావన వచ్చేస్తుంది. మనవాళ్ళ మీద మనకు కోపం రాదుకదా! అదన్నమాట సంగతి. ఇంతకీ నువ్వు చెప్పేది ఇంద్రాణి గురించేనా?”
“అవుననుకో. అయినా ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? అమ్మకి ఎంతమంది? మన ఇంటికి ఎవరూ రారు ఎందుకని?” ఇంకా ఏదో అడగబోతున్న మనవరాలిని చూస్తూ,
“ఆ.. ఆ.. ఆ.. అన్ని ప్రశ్నలే! ముందు నా స్నేహితులు గురించి చెపుతాను. వింటావా? మా చిన్నప్పుడు అంటే నేను నాలుగో తరగతిలో ఉండగా రాజ్యలక్ష్మి అనే ఒక అమ్మాయితో నేస్తం కట్టాను. అంటే నేస్తం కట్టాలంటే ఒక మధ్యవర్తి ఉండాలి. అంటే ఇద్దరికీ ఫ్రెండ్ అన్నమాట. నేను నేరుగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చెప్పకూడదు. పైగా ఆ అమ్మాయికి నాతో నేస్తం కట్టాలని ఉందో, లేదో? తెలియకపోతే ఎలా? అందుకని.”
“అమ్మమ్మా! ఫ్రెండ్‌కి, నేస్తానికీ తేడా ఏమిటి?”
“ఫ్రెండ్స్ జీవితంలో చాలా మంది ఉంటారు. కానీ.. నేస్తం మాత్రం ఒక్కళ్ళే ఉంటారు. జీవితాంతం వాళ్ళతోనే. పైగా స్నేహితులను పేరుపెట్టి పిలుచుకుంటారు. కానీ.. నేస్తం కట్టినవారిని నేస్తమా! అని పిలవాలి తప్ప ఎన్నడూ పేరుతో పిలవకూడదు” అమ్మమ్మ చెపుతున్న విశేషాలను విభ్రమంతో వింటున్న నర్మదను చూస్తూ,
“మా ఇరువురమూ నేస్తులుగా ఉండడానికి అంగీకరించుకున్నాక ముందుగా ఎవరు అనుకున్నారో వారు ఒక ఆదివారం రోజు నలుగురైదుగురు స్నేహితులను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఒక పళ్ళెంలో పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, రిబ్బన్లు, పటికపంచదార లేదా ఖర్జూరం పట్టుకుని వెళ్ళాలి. ఆమెను పీటమీద కూర్చోబెట్టి “రాజ్యలక్ష్మి! నేను సుభద్రను నీ నేస్తం కోరి వచ్చినాను.” అంటూ తెచ్చిన వస్తువులు ఆమె ఒళ్ళో ఉంచాలి.
ఆమె, “సుభద్రా! నేను నీ నేస్తంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను.” అంటూ అంగీకారంగా అందులో నుండి పటిక పంచదార పలుకు తీసి ఈమె నోటిలో ఉంచుతుంది. ఇలాగే రాజ్యలక్ష్మి కూడా సుభద్రకు చేస్తుంది. ఆ విధంగా పేర్లు చెప్పుకోవడం అదే ఆఖరు. ఆ తరువాత ఎప్పుడైనా ‘నేస్తమా!’ అనే పిలవాలి. ఇతరులతో చెప్పినప్పుడు కూడా ‘మా నేస్తం’ అనే అనాలి తప్ప పేరు చెప్పకూడదు. ఇదంతా అయాక వచ్చిన స్నేహితులకు నోరు తీపి చేయడానికి ఖర్జూరం పంచిపెడతారు. తరువాత అందరూ పాటలు పాడుకుంటూ సంతోషంగా గడిపి, ఇళ్ళకు బయలుదేరుతారు.”
“అమ్మమ్మా! నీ నేస్తం, నువ్వు ఎన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు? మీ మధ్య ఎప్పుడూ పోట్లాటలు రాలేదా? అలా ఉండగలరా? ఎన్నాళ్ళు సాగింది?”
“అవునురా! నీకు నర్మద అని పేరుగాక ప్రశ్నావళి అనే పేరు పెట్టవలసింది.” నవ్వింది అమ్మమ్మ.
“అమ్మమ్మా! ఇన్ని ప్రశ్నల్లో ఒకదానికి జవాబు ఇవ్వకుండా నవ్వేసావు కదా! పోనీలే! చెప్పకు. దాచుకో.” అంది లేవడానికి సిద్ధపడుతూ.
“మామధ్య పోట్లాటలు రాకపోవడానికి మేము దేవతలం కాదుగా! కానీ.. నేస్తం నిలుపుకోవాలంటే చాలా సంయమనం కావాలి. మనమధ్య ఒకరిపై ఒకరికి గల నమ్మకం ఎప్పటికీ చెదిరిపోకూడదు. ఇతరులు కూడా మనలను విడగొట్టాలని ప్రయత్నిస్తారు. అయినా సరే! మామధ్య ప్రాణస్నేహం కొనసాగింది. ఎనిమిదో తరగతి పాసవగానే మా నేస్తానికి పెళ్ళి చేసేసారు. పెళ్ళి మా ఇద్దరినీ భౌతికంగా దూరం చేసింది. అడపాదడపా కార్డులు రాసుకునేవారము.
పాపం! ఆ రోజుల్లో ఆడవారు చాలా బాధలు పడేవారు. పెద్ద పెద్ద కుటుంబాలలోకి కోడలిగా వెళ్ళడం. ఇంట్లో అందరికీ చాకిరీలు చేసి, చేసి శక్తి లేక సొమ్మసిల్లడం, పనిజేయకపోతే అత్తగారూ, ఆడబిడ్డలూ కొట్టేవారు. ఒకోసారి భర్తకూడా కొట్టేవాడు. ఎంతో ఏడిచేది. కార్డులో చిన్న అక్షరాలలో వివరంగా రాసేది. దానికి ఏమి జవాబు రాయాలో కూడా నాకు తెలిసేది కాదు. ఆ కార్డు పట్టుకెళ్ళి నాన్నకి చూపించేదాన్ని.
తరువాత నన్ను మా నాన్నగారు పట్టుపట్టి టీచర్ ట్రైనింగ్‌లో చేర్చారు. అంతేకాదు. నా చదువు పూర్తి అయ్యాక, బేసిక్ శిక్షణ కూడా ఇప్పించి, మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేర్చేవరకూ చేసిన ప్రయత్నం ఆయనకు ఆడవాళ్లంటే ఎంత గౌరవం ఉండేదో ఆచరణాత్మకంగా చేసి చూపారు. ఆ రోజుల్లో మా అమ్మా, నాన్నాలాగా ఆధునిక భావాలు ఉన్నవారు చాలా తక్కువ. మా నాన్న అలా చేయడం నా జీవితానికి ఒక మంచి త్రోవ చూపినట్లు అయింది”
“అమ్మమ్మా! నాకు ఒక అనుమానం. ఆడవాళ్ళు, ఆడవాళ్ళూ; మగవాళ్ళు, మగవాళ్ళూ మాత్రమే నేస్తం కడతారా? ఆడా, మగా నేస్తం కట్టరా? అలాగ ఎవరైనా నేస్తం కట్టిన నేస్తులు ఉన్నారా? నాకు చెప్పవా?” నర్మద ప్రశ్నకు ఏదో చెప్పబోతున్న తల్లిని ఆపడానికి అన్నపూర్ణ దూరం నుంచే చేయి అడ్డంగా ఊపింది వద్దు, అన్నట్లుగా.
తల్లిని చెప్పవద్దని ఆపింది. కానీ అన్నపూర్ణకు తనలోని అలజడి, మనసులోంచి సునామీలా ఉధృతంగా ప్రవహించుతూ వస్తూంటే ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. వంటింట్లో క్షణం కూడా నిలబడలేక పోయింది.
వీధి గుమ్మంలో నిలుచుంది. ఎవరో వస్తారు అన్నట్లుగా కాసేపు ఎదురుచూసింది.
‘అరచి అరచి పిలువలేను/ తరచి తరచి వెదకలేను/పరచి ఎగురు కాంక్షలతో/ పడిచెదురును నా గుండెలు/’
అక్కడినుంచి పశువుల కొట్టంలోకి వెళ్ళింది.
‘గౌరీ! గౌరీ!’ అంటూ దాని గంగడోలు సున్నితంగా రాస్తూ, లోపలి నుంచి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం విఫలమై బొటబొటా కన్నీళ్ళు జారి, గౌరి వీపుపై పడ్డాయి. అర్థం చేసుకున్న గౌరి అన్నపూర్ణకు మరింత దగ్గరగా జరిగింది. ఆమెకు సాంత్వన ఇస్తున్నట్లు.
‘హోరుమనే వారి రాశి/ మారు మ్రోగే నా పాటలు/ విరిగిపడే తరగలలో/ నురుగులలో పరుగులలో/’
‘అమ్మా!’ అంటూ పరుగున రాబోయిన నర్మద ఆ దృశ్యం చూసి దూరానే ఆగిపోయింది.
పూర్ణ పశువుల కొట్టంలో క్రిందనే కూర్చుండి పోయింది. ఆవు దూడ గౌరి కూడా అన్నపూర్ణకు దగ్గరగా ఆమె ఒళ్ళో తలవాల్చి పడుకుంది.
‘అదుముకున్న నీ తలపుల/చిదికి రాలు హృదయసుమము/ ఏరలేను రేకలనూ/ ఏరలేను పుప్పొడినీ/’
చిన్నపుడు నేర్చుకున్న అడవి బాపిరాజుగారి పాట గొంతుదాటి పైకి రానంటుంది. ఏ గతాన్ని గుర్తు చేసుకోకూడదని మనసుకు లోహపు పలక బిగించి తాళం వేసేసిందో, అది మరిక మదిలో ఉండను వెలికి వచ్చేస్తాను అంటూ సాగరఘోష పెడుతోంది.
(సశేషం)