[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అమ్మమ్మని నర్మద అడిగిన ప్రశ్నకు – తల్లి అన్నపూర్ణలో అలజడి రేపుతుంది. దుఃఖం ముంచుకొస్తుంది. పశువుల కొట్టంలో కూర్చుని గతం గుర్తు చేసుకుంటుంది. అది మండు వేసవి మధాహ్నం. పెరట్లో కూర్చున్న అన్నపూర్ణ చలపతి, ఏదో సీరియస్‍గా మాట్లాడుకుంటుంటారు. తానో ముఖ్యమైన విషయం అన్నపూర్ణ నాన్నగారికి చెప్పాలని వచ్చానని అంటాడు చలపతి. నాన్న పడుకున్నారనీ, విషయమేమిటో తనకి చెప్పమని అంటుంది. కాసేపు ఇద్దరూ వామనగుంటలాట ఆడతారు. ఆటలో లీనమైపోయి, సమయం పట్టించుకోరు. సాయంత్రమైపోతుంది. అన్నపూర్ణ తండ్రి దశరథరామయ్య నిద్ర లేచి ముఖం కడుక్కుని వాలుకుర్చీలో కూర్చుని టీ తాగుతూ – కూతుర్ని, చలపతిని పరిశీలనగా చూస్తుంటారు. నీతో మాట్లాడదామని వచ్చాడట, నువ్వు పడుకున్నావని మేమిద్దరం కాసేపు ఆడుకున్నాం అని తండ్రితో చెప్పి అన్నపూర్ణ లోపలికి వెళ్ళిపోతుంది. కూతురు పెద్దదైపోయిందని ఆయన గ్రహిస్తారు. గత యాభై ఏళ్ళుగా దశరాథరామయ్య కొండలలో తిరుగుతూ, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తూ. వారి ఆచార వ్యవహారాలను, ఆధ్యాత్మిక భావనలను వ్యాస రూపంలో బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి వయసు మీద పడుతోంది. తన వారసులను తయారు చేయాలనుకుంటున్నారు. యువకులలో చురుకుగా ఉండే చలపతిని ఎంచుకున్నారు. చలపతిని తీసుకుని గిరిజనుల ప్రాంతానికి వెడతారాయన. వీళ్ళని చూడగానే అక్కడున్న వారంతా లేచి నిలబడతారు. దశరాథరామయ్య కూర్చోగానే అందరూ చుట్టూ చేరుతారు. అక్కడ సమావేశమైన వారి కోరిక ప్రకారం వాళ్ళకి కావల్సినట్టుగా అర్జీలు తయారు చేయించి ఇస్తారాయన. చీకటి పడ్డాక బయట్ తిరగద్దు, కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి వెళ్ళిపోతారు వాళ్ళు. తనకి ఎవరి వల్ల ప్రమాదం ఉంటుందబ్బా అని ఆయన అనుకుంటారు. గిరిజనులలో మార్పు కోసం చేయాల్సిన పనులను చలపతికి వివరిస్తూ, ముందుగా ఆ ప్రాంతపు భౌగోళిక చారిత్రక విషయాలు చెప్తారు. తర్వాత బ్రిటీషు వారి దురాగతాల గూర్చి చెప్తాడు. మీ మనసులోని మాట చెబితే నేనూ, అన్నపూర్ణ తప్పకుండా సాయం చేస్తామని అంటాడు చలపతి. అతని నోట కూతురు పేరు వినేసరికి ఉలిక్కిపడతారాయన. ఆయన ఆలోచనల్లో ఉండగానే, మనం లిఖిత పత్రిక తీసుకొద్దామని అంటాడు చలపతి. మీరు చెబుతూ ఉంటే, నేనూ, అన్నపూర్ణ గారు రాస్తాము అంటాడు. సరేనంటారాయన. నడుస్తూ గిరిజనుల గురించి, కొండ జమీందారుల గురించి చెప్పుకొస్తారు. తండ్రి ఇంటికొచ్చాకా, ఆయన ఆలోచనలకు కారణమడుగుతుంది అన్నపూర్ణ. లిఖిత పత్రిక ఆలోచనను వివరిస్తారాయన. తప్పకుండా చేద్దామంటూ తండ్రి పాదాలకు నమస్కరిస్తుంది అన్నపూర్ణ. ఇక చదవండి.]
అధ్యాయం-4:
[dropcap]“మ[/dropcap]నం ఉండే ఈ ప్రాంతమంతా కళింగ రాజులు పాలనలో ఉండేది. అత్యంత ప్రాచీనమైన రాజ్యం కళింగ రాజ్యం. దీని గురించిన వర్ణన వేదాలలోను, రామాయణ మహాభారతాది ఇతిహాసాలలోనూ, ప్రముఖ రాజవంశాల రాజులు ఇచ్చిన దాన శాసనాలలోనూ ఉంది.
భారతీయులు సముద్రమార్గాల ద్వారా చైనా, జావా, సుమత్రా, సింహళ ద్వీపాలతో సముద్ర వ్యాపారం జరుగుతుండే రోజులలో విదేశీయులు భారతీయ నావికులను ‘క్లింగ్’ లని పిలిచేవారు. అందుకే సాగర తీరవాసులకు ‘కళింగులని’ పేరు వచ్చింది. నాడు కళింగ భూములు సారవంతమైన కొండలు, నదులతో విరాజిల్లుతుండేవి.
కళింగులు నాగరికులైనా కొంత మొరటుగా జీవించేవారు. వారు వేద వేదాంగాలు చదువుకున్నవారు. పాలించిన అనేక సంస్థానాధిపతులు సాహిత్యపోషణ చేశారు. బ్రాహ్మీలిపిలో వ్రాయబడిన సాహిత్యం దొరుకుతోంది. వారు నిర్మించిన ఆలయాలు, అప్పటి శిలాశాసనాలు, రాగి రేకులు, తాళపత్ర గ్రంథాలు వారి నాగరికత, సంస్కృతి సంప్రదాయాలు గురించి చెప్తాయి.
కళింగానికి ఉత్తరాన వైతరణీనది, దక్షిణాన గోదావరి, తూర్పున సముద్రం, పశ్చిమాన ఓఢ్ర దేశం సరిహద్దులుగా ఉండేవి. అనంతమైన కాలప్రవాహంలో పరిమితంగా ఉన్న భూమిపై అధికారాన్ని సంపాదించుకోవాలి అనుకునే పాలకులు దానికోసం జరిగే పోరాటాలే చరిత్ర సారాంశం. ఈ పాలకుల కాలంలో కొన్ని స్వర్ణయుగాలుగా చరిత్రకెక్కితే మరికొన్ని చీకటి యుగాలుగా పరిగణింపబడ్డాయి.
కళింగప్రాంతము ఉత్తరాన గల షోడశ మహాజనపదాల అటుపోటులను ఎదుర్కొన్నది. రామాయణ, మహాభారతాల కాలము నుండే కాక బౌద్ధమతము, జైనమతము కూడా ఈ ప్రాంతంలో అత్యంత వైభవాన్ని చవిచూశాయి. తరువాత శాతవాహనులు, విష్ణుకుండినులు కళలను ఆదరించారు. గుప్తుల కాలంలో విద్యాభివృద్ధి సకల శాస్త్రాలలోనూ జరిగింది. తరువాత తూర్పుగాంగులు ఇతర రాజవంశాల వారు హిందూమతాన్ని ప్రోత్సహించి, సంస్కృతాంధ్ర భాషలను పోషించి, అనేక ఆలయాలను నిర్మించారు.
ద్రావిడ సంస్కృతి దక్షిణాపథంలో ఉన్నతస్థాయిలో ఉన్నపుడు సంస్థానాల ఆవిర్భావం జరిగింది. పెద్దా, చిన్నా సంస్థానాలు కొన్ని, జమీందారీలు కొన్ని. పేరుకే సంస్థానాధీశులు. వీరు ప్రతిఏటా నిర్ణీతమైన కప్పం చెల్లించేవారు. జమీందారులు ప్రజలు నుండి పన్నులు వసూలు చేసి, ప్రభుత్వానికి పేష్కష్ చెల్లిస్తారు. వర్షాధార భూములు. కరువుకాటకాలు, వరదలు, తుఫానులు వచ్చినపుడు ప్రజలు పన్నులు చెల్లించలేక పొట్ట చేతపట్టుకొని వలసపోయేవారు. ఆ విధంగా గ్రామాలు మాత్రమే కాదు. సంస్థానాలే కనుమరుగయ్యాయి.
అదేవిధంగా దక్షిణాపథము నుండి చాళుక్యులు చేర, చోళ, పాండ్యరాజులు ఈ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సంపాదించి తమ యొక్క ఉనికిని తెలిపే అనేక కార్యక్రమాలు చేయడమే కాక శాసనాలు వ్రాయించారు. తరువాత కళింగ గజపతులు చక్కని సుపరిపాలనను ప్రజలకు అందించారు. హంపి విజయనగరాన్ని ఏలిన విజయనగర శ్రీకృష్ణదేవరాయల తరువాత బహమనీ సుల్తానులపాలన, మొగలుల పాలన ఈ ప్రాంతాన్ని ఇబ్బందులకు గురిచేసింది.
పాశ్చాత్య వర్తకసంఘాలవారు, వ్యాపారం కోసం వచ్చారు. డచ్చివారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు వారిలో వారు ఆథిపత్యం కోసం కొట్లాడుకునేవారు. హైదరాబాదును పరిపాలించే నిజాం నవాబు సమయంలో 21 సర్కారుల కింద ఉండేది.
ఉత్తర సర్కారులుగా పిలువబడే ఈ ప్రాంతమంతా జయపురం రాజధానిగా నందాపురం శిలా మహారాజుల పాలనలో ఉండేది. సంగీత సాహిత్యాలను పోషించిన బొబ్బిలి సంస్థానాధీశులు ‘బహద్దూర్’ బిరుదాంకితులు. వైణికులకు మాత్రమే కాక వీణలు తయారీలో కూడా విశ్వవ్యాప్తమైనది. పచ్చలపల్లకీలో తిరిగే ఆండ్ర జమీందారులు శాస్త్ర విద్యలను ప్రోత్సాహించడమే కాక వారు జరిపే ‘శ్రావణి’ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉద్దండ పండితులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి వచ్చేవారు. ఈ ప్రాంతం నివాసయోగ్యం కాదు. కొండలూ, దట్టమైన అడవులు, క్రూరజంతువులూ, అడుగడుగునా ఆపదలే!”
పాలకొండ, పాచిపెంట, మేరంగి, సాలూరు, కాశీపురం, చీకటి, చెముడు, చిన్నా, పెద్దా జమీందారులు, సంస్థానాలు గురించి వివరించి చెపుతూ ఉంటే ఎత్తిన చేయి దించకుండా రాస్తున్న కూతురిని చూస్తూంటే ఆమె సరస్వతీ ప్రతిరూపంలాగా మంచి భవిష్యత్తు ఉండాలని మనసులోనే దీవించారు.
ఒకపక్క సంస్థానాధీశులు, జమీందారులు పాలన – సాహిత్య పోషణ అన్నపూర్ణ రాస్తూ ఉంటే వేరొక పక్క చలపతి కూడా అంతే నిష్టతో వ్రతదీక్ష పట్టాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధిపత్యం, పాలనలో స్థానికపాలకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో దశరథరామయ్య వివరంగా చెపుతూ ఉంటే రాస్తున్న చలపతి చేయి ఆవేశంతో బిగుసుకునేది.
స్థానాధీశులకు, జమీందారులకు వారి భూములను క్రయవిక్రయాలు చేయడానికి దానాలు చేయటానికి హక్కులు ఉండేవి. కానీ కంపెనీ పరిపాలన వచ్చిన తర్వాత ఆ హక్కులు వదులుకుంటున్నట్లుగా లిఖితపూర్వకంగా తీసుకున్నారు.
బొబ్బిలి రాజా వారు “మేము ఆ విధంగా హక్కులు వదులుకుంటే మాకు కలిగే లాభం ఏమిటో కూడా లిఖితపూర్వకంగా ఇవ్వండి” అని అడిగారు. కానీ అలాంటి అర్జీలను కంపెనీవారు ఏనాడు లక్ష్యపెట్టలేదు. విజయనగరం మన్నె సుల్తానుగా పేరు పొందిన చిన విజయరామరాజుగారి దివాను అయిన సీతారామరాజు 29 మంది కొండ జమీందారులను దేవుపల్లి కోటలో బంధించాడు.
బ్రిటిష్ వారికీ, విజయనగర రాజులకూ మధ్య జరిగిన పద్మనాభయుద్ధంలో చిన విజయరామరాజు మరణించగా బ్రిటిష్‌వారు ఆ సంస్థానాన్ని వశపరచుకొని దేవుపల్లి కోటలో బందీలైన జమీందారులను విడుదల చేశారు. పాలకొండ జమీందారు కుటుంబంలో 19 మందిని చెరపట్టి రాయవెల్లూరు దుర్గములోనూ, గుత్తి దుర్గంలోనూ ఖైదీలుగా బంధించారు. వారి జీవితము ఖైదీలుగానే ముగిసిపోయింది. సంగమవలస కొండదొర జాతులతో కూడిన జయపురం సంస్థానపు రాజులు శత్రువులను ఓడించడంలో కంపెనీ వారికి సహాయం చేసినందుకు ‘నిశ్శంక బహదూర్’ మొదలైన బిరుదులతో వారిని సత్కరించారు. మేరంగి జమీందారులు కంపెనీవారితో కోర్టు కేసులతోనే చాలావరకు అప్పుల పాలై శిస్తుకట్టలేక వివాదాలతోనే మరణించారు. కాశీపురం పద్మనాభ యుద్ధం తరువాత కంపెనీ వారి అధీనమైంది.
చలపతి ఏదో అడగాలని అనుకుని సంశయించడం చూసి “చెప్పు బాబు” అన్నారు.
“గురువు గారూ! ఇప్పుడు మీరు వీరి కోసం ఇంతగా పాటు పడుతున్నారు కదా! ఇంతకుముందు ఎవరూ వీరి గురించి ఆలోచించలేదా? తమకు జరుగుతున్న దోపిడీని గురించి ఎదుర్కొనలేదా? ఎవరు ఏ ఉద్యమాలు చేయలేదా?”
“ఉద్యమాలు చేయకేమి? అన్ని రంగాలలో దోపిడీకి గురి అవుతున్న అమాయక గిరిజన ప్రజలను చైతన్యపరచి వారి సహకారం ప్రోత్సాహంతో గిరిజన రైతాంగ పోరాటానికి 1958 లోనే బీజం పడింది. చైనా, రష్యా దేశాల కమ్యూనిస్టు భావాలతో ప్రభావితులైన అనేకమంది ముఖ్యంగా ఉపాధ్యాయులు పగలు ఉపాధ్యాయులుగా పని చేస్తూ, రాత్రిపూట గిరిజన తండాలలో తిరుగుతూ వారిని చైతన్య పరిచేవారు. వీరిలో ముఖ్యులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, పాణిగ్రాహి మొదలగు వారందరూ ఒకే భావజాలంతో పనిచేసేవారు.
సీతంపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ అనే గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పల్లె రాములు మాస్టారు గిరిజన గ్రామాల్లో ప్రజలపై భూస్వాములు చేస్తున్న దోపిడీని చూసి చలించిపోయి కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలైన హయగ్రీవరావు, పత్తిరాజుతో కలిసి గిరిజన సంఘాలను ఏర్పాటు చేశాడు. భూస్వాములను, వారి ఇళ్లను దోపిడీ చేసి, పేద గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం భూమిపై హక్కుల కోసం పోరాటాలు చేయడం ప్రారంభించారు.
మొండెంఖల్లు గ్రామంలో గిరిజన ప్రజలతో ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు జాతీయ ఉద్యమ నాయకులు అనేకమంది హాజరవుతున్నారని తెలిసి, ప్రజలు కూడా వేలాదిగా తరలివస్తున్నారు. ఆ సమయంలో గుమ్మలక్ష్మీపురమునకు చెందిన భూస్వాములు ఈ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారు.
సభకు వెళుతున్న గిరిజనులను అడ్డుకున్నారు. వందలాదిగా వస్తున్న గిరిజనులను భూస్వాములు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణ కొట్లాటకు దారితీసింది. భూస్వాములు గిరిజనులపై కాల్పులు జరిపారు. కాల్పులలో కోరన్న, మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు.
ఈ సంఘటనతో గిరిజన ప్రజలు కసి పెంచుకోవడంతో ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళింది. నక్సలైట్ ఉద్యమాన్ని సాయుధ పోరాటంగా మలుపు తిప్పారు. వీరికి అనేకమంది జాతీయ నాయకులు చారు మజుందార్, కాలు సన్యాల్, నాగభూషణ్ మొదలగువారు సహాయం చేశారు. వారి సహాయంతో గిరిజనులకు అన్యాయం తలపెట్టిన అనేకమంది భూస్వాములను హత్యలు చేశారు. పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు.
ఈ ఉద్యమాన్ని అణచివేయటానికి ప్రభుత్వము పోలీసుల సహాయం తీసుకుంది. ఉద్యమ నాయకులను అరెస్టు చేసి, జైలుకు పంపే చర్యలు తీసుకుంది. అప్పుడు నాయకులందరూ అజ్ఞాతంలోనికి వెళ్లిపోయారు. అందువలన ప్రభుత్వము సి.ఆర్.పి.ఎఫ్. పంపి ఎన్‌కౌంటర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంది.
అనేకమంది ఉద్యమ నాయకులు కురుపాం అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్లలో నిశ్శబ్దంగా నేల కూలారు. సుమారు మూడు సంవత్సరాల పాటు గిరిజనుల తరఫున పోరాడిన నాయకులు మరణించారు. మిగిలిన నాయకులను అరెస్టు చేయడంతో ఉద్యమం బలహీన పడింది.
పోరాటంలో ఉద్యమ నాయకులు మరణించినప్పటికీ పోరాటయోధులుగా మారిన గిరిజనులు అటవీశాఖ అధికారుల నుండి, భూస్వాముల నుండి, వెట్టి చాకిరీ నుంచి విముక్తులై వేలాది ఎకరాల భూములను సాధించుకోగలిగారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ యుగంధర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పార్వతీపురం ఐ.టి.డి.ఏ. ఏర్పాటు జరిగింది. గిరిజనులకు విద్యా, వైద్య, వసతి, రోడ్లు మొదలైనవి సాధించుకోగలిగారు. గిరిజన కార్పొరేషన్ ఏర్పడింది. దాని ద్వారా గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకున్నారు. ఆనాటి అమరవీరుల త్యాగఫలితమే అంచెలంచెలుగా సాధించిన గిరిజన అభివృద్ధిగా చెప్పక తప్పదు.”
అధ్యాయం-5:
అన్నపూర్ణ ఎంత శ్రద్ధగా ముత్యాల్లాంటి అక్షరాలతో చరిత్రను అక్షరబద్ధం చేస్తుందో అంతే శ్రద్ధతో చలపతి తానుకూడా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్నాడు. దశరథరామయ్యగారి మనోభీష్టం నెరవేర్చడానికి కుడి ఎడమ చేతులుగా పనిచేస్తున్న అన్నపూర్ణ, చలపతి జీవితాలు ఏ మలుపు తిరగడానికి తాను సంధానకర్త అవుతున్నాడో దశరథరామయ్యకు తెలీదు. కానీ.. దీనంతటినీ గమనిస్తున్న ఒక వ్యక్తి మాత్రం ఆందోళన చెందకుండా ఉండలేకపోయారు. ఆ వ్యక్తి ఎవరోకాదు. అన్నపూర్ణ తల్లి సుభద్రమ్మే! తండ్రికి లీలగా అనుమానం వస్తే తల్లి ఇంకొంత పరిశీలనగా చూస్తుంది.
వారిరువురికీ వివాహం చేస్తే కలిసి పనిచేసుకుంటారేమో? అని తల్లికి అనిపిస్తే చలపతిని తాను నడిపించాలనుకున్నది ముళ్ళబాట అని తెలిసీ తన కూతురిని ఎలా ఇవ్వాలా? అనే మీమాంస తండ్రిది.
‘సంబంధం సాప్తపదీనం’ అని పెద్దలు అంటారు. వారిరువురూ ఎన్నో అడుగులు కలిసే వేసారు. కొండదేవతల వద్ద చేతిలో చేయి వేసుకుని ఎన్నో ప్రమాణాలు చేసేసుకున్నారు. వివాహబంధంతో వారిని ఒకటి చేయాలని పెద్దలు సూచనగా కదిపేసరికి అర్థమైంది. చలపతి తరఫున తల్లిదండ్రులూ, కుటుంబమూ, వారి అంగీకారం కావాలని.
“మంచిరోజు చూసి మీ ఇంటికి వస్తామయ్యా చలం” అన్నారు దశరథరామయ్యగారు. చలపతికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. చదువు పూర్తి చేసి, ఉద్యోగం చేయకుండా ఈ కొండలు పట్టుకుని తిరిగే తనను గురించి ఇంట్లో ఎవరికీ పెద్ద ఆశలేమీ లేవు. అలాగని పెద్దమనిషి తరహాగా దశరథరామయ్యగారు వచ్చి పెళ్ళిమాటలాడితే ఏమంటారో తెలియదు.
ఆలోచనలో పడిన చలపతిని చూస్తే కొంత అవగాహన అయింది పెద్దాయనకు.
‘సరే! కొన్ని రోజులు చూద్దాంలే! తొందరేముంది?’ అనుకున్నారు. అంచెలంచెలుగా గిరిజనులు జీవన విధానం, వారిని పాలించే కొండదొరలు, కొండదొరల పితూరీలు దశరథరామయ్య చెబుతూ ఉంటే ఇద్దరూ రాసి అందించేసేవారు. అవి ఒక్కొక్కటి సుమారు 50 పేజీలు పైగా ఉండేది. దానిని ఒక్కొక్క పుస్తకంగా రాసి, కార్బన్ కాపీలు వేయించి, వారపత్రికగా అందరికీ పంచిపెట్టేవారు. ప్రజలకు తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం ఈ ఐదు బాధ్యతలు ప్రభుత్వం వహించిననాడు దొంగతనాలు, తిరుగుబాట్లు, శ్రమ దోపిడి ఉండవు.
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వలన స్థానిక ఆటవిక జాతుల జీవన విధానానికి భంగం ఏర్పడింది. ముఖ్యంగా సవరలు జమీందారుతో కలిసి ఆంగ్లేయులతో పోరాటాలలో ముఖ్యమైన తిరుగుబాట్లు విజయనగరం, పర్లాకిమిడి, ముంసూరు, పాలకొండలలో జరిగాయి. కంపెనీ ప్రభుత్వము ఈ తిరుగుబాటుని అణచివేసింది. కొండ జమీందారులను విడిపించి వారి వారసులకు రాజ్యాలను తిరిగి ఇప్పించింది.
అదే సమయంలో నాగరికులుగా జనజీవన స్రవంతిలో కలిపే మిషతో దోచుకోసాగారు. స్వేచ్ఛగా బ్రతకడానికి ఇష్టపడే వీరు తమ శ్రమ ఫలితాన్ని ఇతరులు దోచుకున్నప్పుడు కడుపు మండి ప్రాణాలకు తెగించి తిరుగుబాట్లు చేశారు. రంపచోడవరంలో అల్లూరి సీతారామరాజు, కొర్రవాని వలసలో నాగన్నదొర, చేసిన తిరుగుబాటులను బల ప్రయోగంతో అణిచివేశారు. అంతే కాకుండా భారత దేశంలో అనేక మతాలు విస్తరిస్తున్న నేపథ్యంలో గిరిజనులు ఏదో ఒక మతంలో చేరడం మొదలుపెట్టారు. వారికి సరి అయిన రోడ్డు, బస్సు సదుపాయాలు లేక, విద్యా, వైద్య వసతి లేక, గిరిజన వస్తువుల ఉత్పత్తికి సరైన మార్కెట్ లేక దళారీ వ్యవస్థ నుండి బయటపడలేక వెనుకబడే ఉంటున్నారు.
మైదానప్రాంత గిరిజనగ్రామాలకు కొంత మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ కొండపైన గల తండాల జీవన విధానం దయనీయం. ఆటవికులకు అడవికి అన్యోన్య సంబంధం. అడవి వారికి తల్లి వంటిది. అడవి నుండి మనిషి ప్రకృతి తనకు ప్రసాదించిన ఆహార పదార్థాలను ఏరుకుని తెచ్చుకునేవాడు. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో దొరికే ఔషధవస్తువులు తెచ్చి, రాజోద్యోగులకు ఇచ్చి కొంత సొమ్ము తీసుకునేవారు. దీనికి నాయకులు కావలసివచ్చి ఈ ప్రదేశం అంతా మన్యప్రాంతంగా వారిని పాలించే ప్రభువు ‘మన్యసుల్తాన్’ గా పేరుపొందారు.
జమీందారులు అనేక రకాల పన్నులు విధించేవారు. వాటిలో నీటి పన్ను, సంత పన్ను, కలప పన్ను, మున్సిపల్ పన్ను, స్టాంపు పన్ను, ఉప్పు పన్ను మొదలైనవి.
ప్రభుత్వంవారు ‘ఎస్టేట్ ల్యాండ్ ఆక్ట్’ చేశారు. జమీందారులు జాయింట్ పట్టాలను విడదీయకుండా ఒక రైతుకు నోటీస్ ఇచ్చి, మరొక రైతు మీద దావా వేసి, వేరొక రైతు పొలాన్ని గుట్టు చప్పుడు కాకుండా వేలం వేసేవారు. ఆ పొలాన్ని తమ వారితోనే వేలంపాడించి, తన పొలంలోనే కలుపుకునేవారు. ఈ సమయంలో కొంచెం చదువుకున్నవారు రైతులను జాగృతులను చేశారు.
జాగృతులైన రైతులు పోరాటాలు సాగించే సమయంలో భూస్వామ్యవర్గానికి చెందిన జమీందారులు రైతులు, గిరిజనులు సంఘటితం కావడాన్ని సహించలేకపోయారు. అదే సమయంలో అనేకమైన కరువులు ఏర్పడి, ఆ సమయంలో ప్రజలు వలసలు పోయేవారు. పంటలు నష్టపోయి కరువుతో అల్లాడిపోతున్న గిరిజన రైతులను కప్పం చెల్లించాలంటూ వేధింపులకు గురిచేసిన ఆనాటి తెల్లదొరలపై ఎదురొడ్డి పోరాడారు.
బ్రిటిష్ సైన్యం మరఫిరంగులు, మారణాయుధాలు తెస్తే మన్యంవీరులు నాటుతుపాకులు, విల్లంబులతో తలపడ్డారు. తుపాకుల్లాగా చెక్కిన కర్రలని ఆయుధాలుగా కొండజాతి ప్రజలను సాయుధులను చేశాడు మల్లన్న.
ఉద్యమవీరులు ధైర్యంగా తాము ఏ ప్రదేశంపై దాడి చేస్తున్నామో, ఏ రోజు చేస్తామో ముందుగానే అధికారులకు కబురు పంపేవారు. పరిస్థితి చూడడానికి వచ్చిన పోలీసులను, అదనపు రిజర్వు బలగాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.
స్వాతంత్ర పోరాటంలో ‘మేము సైతం’ అంటూ ఈ కొర్రవానివలస గిరిజనులు చేసిన పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఎందరో గిరిజన వీరులు అసువులు బాసి అమరులయ్యారు. ఆ గిరిజన వీరులను ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు తలుచుకొని స్ఫూర్తిని పొందుతూ ఉంటారు.
(సశేషం)