Site icon Sanchika

గిరిపుత్రులు-6

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మన్యం ప్రాంతంలో దశరథరామయ్య చేస్తున్న పనులు ఒక వర్గానికి నచ్చవు. ఓ రోజు ఆయన తాను రాసిన కాగితాలను తీసుకుని వాటిని నకలు చేయించడానికి మైదాన ప్రాంతపు గ్రామనికి వెళ్ళి వస్తుండగా, తనని ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరైనా ఉంటారా అని ఆలోచిస్తూండగా, వెనుక నుంచి వచ్చి ఎవరో ఆయన ముఖానికి ఓ తువ్వాలుని ముసుగులా కప్పి, తమతో తీసుకుపోతారు. ఆయన ప్రతిఘటించకుండా వాళ్ళ వెంట వెళ్తారు. వాళ్ళు మైదాన ప్రాంతంలో ఉండే గిరిపుత్రులు కారని ఆయనకి అర్థమవుతుంది. ఆయన కనబడక, రెండు రోజులు గడిచిపోతాయి. సుభద్రమ్మ, అన్నపూర్ణ, చలం విచారంగా ఉంటారు. తదుపరి ఏం చేయాలో అర్థం కాదు. స్వతహాగా సుభద్రమ్మ చాలా ధైర్యవంతురాలు. ఆమె పనిలో లీనమవుతుంది. ఓ రోజు పెరడు శుభ్రం చేస్తున్న సుభద్రమ్మకి ఒక రాయి కింద పెట్టిన కాగితం కనిపిస్తుంది. అది ఆమెకి దశరథరామయ్య రాసిన ఉత్తరం. అందులో తాను క్షేమంగా ఉన్నాననీ, కంగారు పడవద్దనీ రాస్తారు. పూర్ణ, చలం ఒకరినొకరు ఇష్టపడుతున్నారనీ, కొండమీద అమ్మోరి గుడి దగ్గర చేతిలో చేయి వేసి ప్రమాణాలు చేసుకున్నరనీ తెలిసిందని రాస్తారు. భార్యని ధైర్యంగా ఉండమంటారు. భర్త క్షేమంగా ఉన్నాడన్న వార్త చదవగానే ఆమె మొహంలో వెలుగు వస్తుంది. గతంలో భర్త గిరిజనుల పక్షాన చేసిన ఓ పోరాటాన్ని, అందులో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటుంది సుభద్రమ్మ. కోరిన కోర్కెలు తీర్చే గంగ దేవత సన్నిధిలో నేస్తం కట్టిన చలం, అన్నపూర్ణ తమను ఒకటిగా చేయమని ఆమెకు దండం పెట్టుకొని తిరిగి వస్తూ ఆ ఊరిలోని సామాజిక సమస్యలను గురించి మాట్లాడుకుంటారు. తండ్రి ద్వారా తను తెలుసుకున్న అనేక విషయాలను చలానికి చెప్తూ ఆవేశపడుతుందామె. ఆమెను శాంతపరుస్తూ, ఆదివాసీల గురించి తనకి తెల్సిన విషయాలను ఆమెకు వివరిస్తాడు చలం. గిరిజనులలో చైతన్యం కలిగించాలని, వారి ఔషధ మొక్కల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, వాటి ప్రయోజనాలు అందరికీ వెల్లడించి, ఆయుర్వేదంలో వాటి ప్రయోజనాల రీత్యా, ఆయా మొక్కలను పెంచి గిరిజనులకు మేలు చేయాలని తీర్మానించుకుంటారు పూర్ణ, చలం. ఇక చదవండి.]

అధ్యాయం-8:

[dropcap]అ[/dropcap]ణిగిమణిగి బానిసలుగా ఉండిపోవడమే తప్ప ప్రతిఘటన అంటే ఏమిటో తెలియని ఆ గిరిపుత్రులను ఉద్ధరించడానికి ఏకమైన ఆ జంట ఎటువంటి ప్రతిఘటనలను భవిష్యత్తులో ఎదుర్కొంటుందో?

సుభద్రమ్మ తన దగ్గరకు వచ్చి ఆశీస్సులు కోరుతున్న చలంని, కూతురుని మార్చి మార్చి చూసింది. ఆమెకు ఏమనాలో అర్థం కాలేదు.

“పూర్ణా! ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు కదా! అయినా మీరిద్దరూ నాన్నగారి అడుగుజాడలలో ముందుకు నడిచి ఆయన ఆశయాలను సఫలీకృతం చేస్తాము అనడం చాలా ఆనందదాయకం. కానీ మీరిద్దరూ వయసులో ఉన్నవారు. ఏ బంధమూ లేకుండా కలిసి తిరుగుతాము అంటే సమాజము ఊరుకోదు. మీకు కూడా మంచిది కాదు.” మాట్లాడుతున్న తల్లి మాటలకు అడ్డు వస్తూ ఏదో చెప్పబోయింది పూర్ణ.

ఆమె చేతితో వారిస్తూనే “నాకు, నాన్నగారికి కూడా ఆ విషయం తెలుసు. అయితే ఇది సమయం కాదు అని నాన్నగారు ఆగమన్నారు. మీరు ఎంత దృఢమనస్కులైనా ఇప్పుడు కలిసి ముందుకు వెళ్లబోతున్నారు కనుక తల్లిగా నా సలహా. మీరిద్దరూ వెళ్లి చలం అమ్మానాన్నల ఆశీస్సులు కూడా అందుకోండి. ఎందుకంటే మనం చేసే పని వలన ఎవరి మనసు క్షోభించకూడదు. అందువలన జయం కలగదు.”

చలం కల్పించుకుంటూ “తప్పకుండా అత్తయ్యా! మేమిద్దరము వెళతాము మీ ఆశీస్సులు అందుకొని.” అన్నాడు. అతని మాటలు వినగానే సుభద్ర మనసు తేలిక పడింది.. అతను వెళ్ళను అని పిరికిగా అని ఉంటే ఆమె ఏం చేయాలో ఆలోచించుకునే ఉంది.

వసుంధర, నారాయణమూర్తి చలపతి తల్లిదండ్రులు. మైదానాన్ని కొండప్రాంతాన్ని కలిపే సెంటర్లోవాళ్లు నివసించేవారు. మైదానప్రాంతంలో ఒక స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నచిన్న ఊర్లకు ట్రాన్స్ఫర్లు అవుతూనే మూడు పోర్షన్లుగా కట్టిన ఇంట్లో ఒక పోర్షను అద్దెకిచ్చి, మిగిలిన రెండింటిలో వారు ఉండేవారు. పేరుకి రెండవ పోర్షన్ వీరిదే కానీ ఉదయం సాయంత్రం రెండు పూటలా ప్రైవేటు పిల్లలతో నిండిపోయేది.

చలపతికి ఒక అన్న, ఒక చెల్లి. అన్న రాంబాబు ఇంజనీరింగ్ చదివి పెద్ద కంపెనీలో హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పుడో పండుగలు శుభకార్యాలకు వస్తారు. ఆ దంపతులు వారికి ఒక పాప, ఒక బాబు. తండ్రికి ఎప్పుడైనా అవసరం వచ్చినా కావలసినంత డబ్బు పంపిస్తాడు.

రెండవవాడు చలం. డిగ్రీ పూర్తి కాగానే బి.ఇడి. చేయించుదామంటే ఆ కొండోళ్ళ కోసం ఏదో చేస్తానంటూండేవాడు. కుటుంబం దృష్టిలో బ్రతకనేర్చినవాడు కాదు. ఆఖరిగా లత ఇంకా మొన్ననే ఇంటర్ పాస్ అయింది. కానీ తనకు పెళ్లి చేసేస్తే బాధ్యతలు తీరుతాయి అని భావిస్తున్నారు. కానీ లతకు టిటిసి అవ్వాలని ఉంది. అందుకోసం కష్టపడి ప్రిపేర్ అవుతోంది. ఇంకా రోజువారి ఖర్చులైనా వెళతాయి కదా అని తండ్రి ప్రైవేట్‌లు చెప్పడం మానలేదు. చూచాయిగా కొడుకు చలం గురించి ఆ చెవినా ఈ చెవినా పడుతున్న మాటలు వింటున్నా తెలియనట్లుగానే ఉంటున్నారు.

అటువంటిది సుభద్రమ్మ ఒకరోజు సాయంత్రం “ఈరోజు మంచిరోజు మీ ఇంటికి వెళ్లి మీ అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకోండి.” అనడంతో చలం, పూర్ణ ఆ ఇంటికి వచ్చారు. చలం మనసులో గుబులుగానే ఉంది. చెప్పాచేయకుండా తాను ఒక అమ్మాయిని తీసుకొచ్చి ‘ఇదిగో! మీ కోడలు’ అంటే ఎలా స్పందిస్తారో? తనకు కూడా తెలియదు కానీ ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే?? కుదరదు అని భీష్మించుకుంటే తానేమి చేయగలడు??

రకరకాల ఆలోచనలు బుర్రలో తిరుగుతున్నా బయటపడకుండా పూర్ణ చేయి పట్టుకుని ఇంట్లో అడుగు పెట్టాడు. తండ్రి వరండాలో కూర్చుని ప్రైవేట్‌లు చెబుతున్నాడు. తల్లి వంటింట్లో ఉంది. ముందుగా ఎవరిని పిలవాలో అర్థం కాలేదు.

వరండాలో పిల్లల మధ్య కూర్చున్న తండ్రిని చూసి పలకరింపుగా ఒక నవ్వు నవ్వి “నాన్నా! ఒక మాట. ఇంట్లోకి రండి.” అన్నాడు.

సాలోచనగా వారిరువురిని చూసి తల పంకించిన నారాయణమూర్తి “వస్తున్నా పద!” అన్నాడు. అంటే పెద్దరికం తల్లికి ఇచ్చాడన్నమాట అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు.

“అమ్మా! అమ్మా!” అని పిలుస్తుంటే “ఏరా! చలం ఇల్లు గుర్తొచ్చిందా! ఆకలేస్తోందా? సాయంత్రం ఉప్మా చేశాను. తింటావా?” అంటూ వంటింట్లోంచి బయటకు వచ్చిన వసుంధర నివ్వెరపోయింది. ఇంతలో నారాయణమూర్తి కూడా లోపలకు వచ్చాడు.

ఇద్దరినీ పక్కపక్కన నిల్చోమని ఇద్దరూ కాళ్ళకు వంగి నమస్కరించారు.

“ఏంటి? ఇంటికే తీసుకొచ్చేసావు? అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అడగడం, ముహూర్తాలు ఏమీ లేవా?” తండ్రి మాటలకు అడ్డువస్తూ,

“లేదు నాన్నా! మేమిద్దరం గంగదేవత సాక్షిగా ప్రమాణాలు చేసుకున్నాము. జన్ని మా మెడలో అమ్మవారి దండలు కూడా వేశాడు. మళ్ళీ వేరే పెళ్లి తతంగము అవసరమా నాన్నా!” నారాయణమూర్తి వసుంధర వైపు చూశాడు, నువ్వు అడగమన్నట్లుగా.

వసుంధర కూడా షాక్‌కు గురైనట్లు మాట్లాడలేక, “అది కాదురా! మన ఇంట్లో పద్ధతులు నీకు తెలుసు కదా! ఇలా అవసరమా? మాకు తెలియకుండా అన్నా, వదినకూ చెప్పకుండా.” మెల్లగా అంది.

వెంటనే పూర్ణ కల్పించుకుని ఆమె పాదాలపై చేతి నుంచి “క్షమించండి అమ్మా! మీరు అభ్యంతర పెడతారని కాదు. ఆ రోజు ఆ ముహూర్తంలో అలా జరిగిపోయింది. మా అమ్మానాన్నలకు కూడా చెప్పలేదు. వారిని కూడా మన్నించాలి.” పూర్ణ సంస్కారానికి మాటల్లోని మృదుత్వానికి ముగ్ధురాలయింది వసుంధర.

నారాయణమూర్తి వైపు చూస్తూ, “పిల్లలు కదండీ! వయసులో ఉన్నారు. వాళ్ళు ఏదో నిర్ణయాలు తీసుకోకుండా మీ ముందుకు వచ్చి ఆశీస్సులు కోరుతున్నారు. కళకళలాడుతూ కొడుకూ-కోడలూ ఇంట్లో తిరుగుతుంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది?? సరే! ముందు ఇద్దరు దేవుడి గదిలోకి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి.” అంటూ వారి భుజాలపై చేతుల నుంచి నారాయణమూర్తి, పూర్ణ చేయి పట్టుకుని వసుంధర నడిచారు.

చలంకి ఇదంతా కలలాగా ఉంది నిజమా! తన తల్లిదండ్రులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో? అని భయం వేసింది. కానీ వారి ఔదార్యం ముందు తాను చాలా చిన్నగా అనిపించాడు. పూర్ణతో కలిసి ఏడు అడుగులు నడిచి వచ్చిన తాను ఏర్పర్చుకున్న కొత్త సంసారం నిర్విఘ్నంగా సాగాలని అమ్మవారికి ప్రణామాలు చేశాడు.

ఆ రాత్రి నుంచే వారి అనుబంధం మరింత బలమైంది.

వారం రోజులు రెప్పపాటులో గడిచిపోయాయి. వసుంధర అన్నపూర్ణని కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. తన కొడుకు జీవితాన్ని ఒక మంచిమలుపు తిప్పే స్నేహితురాలు భార్యగా దొరికింది అని భావించారు చలం తల్లిదండ్రులు.

వచ్చేస్తుండగా నారాయణమూర్తి వసుంధర వారిరువురిని దగ్గరగా పిలిచి “చలం, మనకు ఒక ఎకరం బీడు భూమి ఆ కొండల దగ్గర ఉన్నది. ఈ వయసులో మేము ఏమీ చేయలేము కదా! అన్నయ్య కూడా ఇప్పుడు రాడు. అందుకని మీరు దానిని అమ్ముకున్నా, పండించుకున్నా మీ జీవితంలో మార్పుకి అది ఒక ఆసరాగా ఉంటుంది.” అని ఆ పొలం తాలూకా కాగితాలు వారి ఇరువురి చేతులలో పెడుతుంటే ఇద్దరికీ పట్టరాని దుఃఖం వచ్చింది.

చలం తండ్రి గుండెలపై తలవాల్చి, “నాన్నా! నేను మీ మనసు కష్టపెట్టే పని చేయలేదుకదా!” గొంతు రుద్దమవుతుండగా గొణిగాడు. “లేదురా! ఎక్కడున్నా నువ్వు ఆనందంగా ఉండడమే కావలసింది. మా ఆశీస్సులు ఎప్పుడూ నీ వెంట ఉంటాయి.”

‘చలం అమ్మా నాన్న ఇంత మంచివాళ్ళు కదా! మరి అతను ఎందుకంత వెనకడుగు వేసేవాడు??’ అనుకుంటూ పూర్ణ కూడా అత్తగారిని వదలలేక వదలలేక ఇద్దరు కలిపి కళ్ళనీళ్ళతో బయలుదేరారు.

చేయవలసిన ఒక మహా కార్యానికి బీజం పడాలంటే కావలసినది మనోధైర్యం. అది మెండుగా తల్లిదండ్రుల నుంచి స్వీకరించిన ఆ జంట తాము అనుకున్న కార్యం చేయడానికి ధైర్యంగా ముందడుగు వేశారు.

చలపతి పూర్ణ ఇరువైపులా పెద్దల ఆశీస్సులతో ఆ తండా దృష్టిలో నవ దంపతులైనారు. ఆదిమ జాతుల వారైన వారు తమ ఆనందాన్ని వ్యక్తీకరించడానికి చేసే నృత్యం థింసా. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం సన్నాయి, తుడుము, కిరిడి, డప్పు, బాకా, జోడి కొమ్ములు అనే పక్క వాయిద్యాలను మగవారు వాయిస్తూ ఉండగా 30 మంది గిరిజన మహిళలు దశరథరామయ్యగారి ఇంటికి నృత్యం చేయడానికి వచ్చారు.

ఆ గ్రామంలోని గిరిజన స్త్రీలు చుట్టుపక్కల గ్రామాలలోని స్త్రీలు కలిపి రెండు ఉజ్జీలుగా ఏర్పడి పెళ్లికూతురుకి రెండు వైపులా జట్టు కట్టి పాటలు పాడుకుంటూ తీసుకు వస్తారు.

థింసా నృత్యం అరకులోయకు సమీపానగల చొంపి గ్రామంలో పుట్టింది. గిరిజన సంగీతానికి అనుగుణంగా పాదాలు కదుపుతూ 30 మంది మహిళలు ఒకరిని ఒకరు చుట్టుకుని వలయంగా ఏర్పడి చేసే నృత్యం.

తెలియని వాళ్లకు థింసానృత్యం ఒకేలాగా కనిపిస్తుంది. కానీ వేరువేరు సందర్భాలకు వేరువేరు పేర్లతో పిలుస్తారు.

బోడి థింసా నృత్యం అన్ని నృత్యాలకు ముందు చేస్తారు. తమకు సహాయం చేయమని శక్తులను కోరుతారు ఒక చిన్న గుట్ట మీద గుడ్డును పెట్టి బాణంతో కొడతారు. పక్కన కొన్ని మట్టి బంతులను కూడా ఉంచుతారు. ముందుగా తండా నాయక్ గ్రుడ్డుని గురిపెట్టి అవకాశం తీసుకుంటాడు.

ఉస్కుథింసా గ్రామ ప్రజలు చాలా కాలంగా కోరిన కోరికలు తీరినప్పుడు అత్యంత ఆనందంతో ఈ నృత్యం చేస్తారు.

కుంద థింసా వ్యవసాయం చేసే కాలంలో పనిచేయడానికి ప్రజలను ఉత్తేజితులను చేస్తూ ఈ నృత్యం చేస్తారు.

పత్థర్ తోలా అడవులలో అడ్డాకులను సేకరణ చేసే ముందు ఈ నృత్యం చేస్తారు. గిరిజనుల ఆర్థిక విధానానికి ఈ అడ్డాకులు సేకరణ ముఖ్యమైనది.

భాగ్ థింసా అడవులలో పులులు విస్తృతంగా తిరుగుతున్నప్పుడు పులి చూపు నుంచి, పులి పంజా నుంచి తప్పించుకుందికి ప్రతి ఒక్కరూ తెలివితేటలతో బలిష్టంగా వేగవంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. అందుకని భాగ్ థింసా నృత్యం ఈ లక్షణాలు పెంపొందించుతాయి.

సాంబార్ లాంఘన్: చైత్రమాసంలో అడవులలో వేటకు వెళ్లి పెద్ద జంతువు గురి చూసి చంపినప్పుడు దానిని ఊళ్ళోకి తీసుకువచ్చే సమయంలో స్త్రీలు పురుషులు ఉత్సాహంగా ఈ సాంబార్ లాంఘన్ చేసి ఆ జంతువు యొక్క మాంసాన్ని అన్ని కుటుంబాల వారికి పంచి పెడతారు.

బాహి థింసా: కొండజాతి ప్రజలు నాటు కల్లు తాగుతారు. పూర్తిగా తాగిన వ్యక్తి కొంచెం తెలివిలో ఉన్న వ్యక్తి అడిగే ప్రశ్నలకు ఎలా స్మృతిని కోల్పోతున్నాడు నృత్య పరంగా జవాబులిస్తూ చేస్తాడు.

గొడిబేటా థింసా: సాధారణంగా పెళ్లికూతురు తన భర్త ఇంటికి మొదటిసారి వెళుతున్నప్పుడు లేదా పెళ్లి కుమారుడు తన అత్తవారింటికి మొదటిసారిగా వస్తున్నప్పుడు చేస్తారు. దీనిని ‘గొడిబేటా థింసా’ అంటారు.

ఈ నృత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. లయబద్ధంగా అడుగులు కదుపుతూ ఒక ముసలివాడు అతని భార్య యొక్క కథను చెప్పడం ఆ కథ చాలా కాలం క్రిందట ఒక జంట కూర్చుని రాళ్ళను ఏరుకుని సుఖవంతమైన ఆసనం తయారు చేసుకోవాలని అనుకున్నారు. ఆ ముసలివాడు భార్యను రాళ్లు ఏరుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆమె చాలా బలహీనంగా ఉన్నప్పటికీ రాళ్ల సేకరణకు వెళుతుంది. భర్త లయబద్ధమైన శారీరక, పాదాల విన్యాసాలు చేస్తూ ఉంటే భార్య రాళ్లు సేకరిస్తుంది. ఈ నృత్యం తరతరాలుగా ఇలాగే జరుగుతూ సాంప్రదాయం రక్షించబడుతోంది.

(సశేషం)

Exit mobile version