Site icon Sanchika

గిరిపుత్రులు-9

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[చలం, అన్నపూర్ణల నేతృత్వంలో గిరిజనులు తమ లక్ష్యం వైపు సాగుతుంటారు. నర్మదకి ఐదో సంవత్సరం వస్తుంది. సుభద్రమ్మ చేతుల మీదుగా ‘అక్షారాలయం’లో అక్షరాభ్యాసం చేయించాలనుకుంటారు. సవరజాతి ప్రముఖుడైన మావియా గొమాంగో తన జాతి వారికి జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి తమ భాషకు ఒక లిపి కావాలనుకుని సంవత్సరం పాటు తపస్సు చేసి సజీవ సమాధి అయిన చోట ఒక శిలాఫలకంపై అక్షరాలుగా వెలుస్తారు.  ఆయన శిష్యుడు మంగయ్య గోమాంగో తొలిసారిగా ఆ అక్షరాలను చూసి అక్షర బ్రహ్మ సంస్కృతిని వ్యాప్తిలోనికి తెచ్చారు. మంగయ్య కృషి వల్ల ‘అక్షరబ్రహ్మ’ సంప్రదాయం ఏర్పడుతుంది. గిరిజనులందరూ దాన్ని పాటిస్తారు. నర్మద అమ్మమ్మ ఒడిలో గిరి పుత్రుల చెలిమిలో అంచెలంచెలుగా ఎదుగుతూ చుట్టుపక్కల అందరికీ వెలుగులు విరజిమ్ముతూ ఒక్కొక్క తరగతి ఉత్తీర్ణురాలు అవుతోంది. మైనింగ్ మాఫియా మరో కుట్ర చేసి, రైతులను ఆ ప్రదేశం ఖాళీ చేయించడానికి నోటీసుకు జారీ చేయిస్తుంది. చలం నాయకత్వంలో గిరిజన రైతులు పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగం చేసి రైతులను చెదరగొట్టి, చలంను హైదరాబాద్ జైల్లో వేస్తారు. గిరిజనుల భూములను ఖాళీ చేయించి, వాటిని ప్రొహిబిటెడ్ ఏరియాగా ప్రకటించి, చుట్టూ కాపలా పెడతారు. ఈ అన్యాసం సహించలేని అన్నపూర్ణ, అన్నలలో చేరిపోవాలని భావిస్తుంది. తల్లితో తన కోరిక చెప్పగా, ఆమె వాస్తవాలను గుర్తు చేస్తుంది. విమలక్కని కలుసుకోవాలి ఓ రోజు ఒంటరిగా అడవిలోకి వెళ్ళిపోతుంది అన్నపూర్ణ. కొంతదూరం వెళ్ళాకా ఇద్దరు అన్నలు తారసపడి ఆమెను ఆపుతారు. విమలక్కని చూడాలని అంటుంది అన్నపూర్ణ. మొదట వారించినా, చివరకు ఆమెను విమలక్క వద్దకు తీసుకువెళ్తారు. అన్నపూర్ణను గుర్తుపట్టిన విమలక్క ఆప్యాయంగా పలకరించి – దళంలో చేరడంలోని సాదకబాధకాలు వివరిస్తుంది. ఆమె నిర్ణయం సరికాదని నచ్చజెప్తుంది. అమ్మ చాలా పెద్దది, పాప చాలా చిన్నది, ఇద్దరికీ మధ్య వారధి నువ్వు – ఇద్దరి బాధ్యతను విస్మరించకు అని హెచ్చరిస్తుంది. అన్నపూర్ణని తీసుకెళ్ళిన ఇద్దరు అన్నలు మళ్ళీ జాగ్రత్తగా ఆమెను కొండదిగువ ప్రాంతానికి చేరుస్తారు. ఇక చదవండి.]

అధ్యాయం-10 రెండవ భాగం:

[dropcap]అ[/dropcap]న్యమనస్కంగా ఇల్లు చేరిన అన్నపూర్ణను చూడగానే సుభద్రమ్మ మనసు తేలికపడింది.

ఇంతలో

“అమ్మా! నాకు స్కూలులో పాటల పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది.” అంది నర్మద.

“అవునా ఏం పాట పాడావు తల్లీ! బంగారూ! మళ్లీ పాడతావా? సుభద్రమ్మ నర్మదను దగ్గరగా తీసుకుంది.

“ఓ! పాడతాను అమ్మ నేర్పిన పాటే కదా! గిరికన్యల పాట. అందరూ ఎంతో బాగా పాడావు అన్నారు అమ్మమ్మా!”

‘లా.. లలల్లా..
అడవితల్లి బిడ్డలం మేమూ
కొండల్లో కోనల్లో పుట్టాము
ఆదివాసీ జనులం మేమూ
కొండదొరలంటూ పిలిచేరూ.. మమ్ము

చెట్టులూ- పుట్టలు మా నేస్తులూ
పాములూ-చిలవలూ మా దోస్తులూ
పారే నీరంత స్వచ్ఛమంటా
మా అంతరంగమే మంచిదంట..

కాళ్ళకూ- చేతులకూ కడియాలూ
మెడలోన మెరిసేటి పూసలదండలూ
నుదుటన పచ్చబొట్టు చుక్కంటా
కల్మషమ్ములేని చూపులంటా.. మావి..

ఆ సెట్టూ సింతకాయ.. ఈ సెట్టు సీకాయ
ఆడేమొ కుంకుళ్ళు.. ఈడేమొ సీపుళ్ళూ
పూలతేనె.. పుట్టతేనె తీసుకొచ్చీ
వేరులూ, మూలికలూ తెచ్చి ఇస్తామంట..

రాతి బొమ్మ దేముడు- చెక్కబొమ్మ అమ్మోరు
జాతరలూ- తిరునాళ్ళూ- తొలేళ్ళ సంబరాలు
నిప్పుల గుండాలు తొక్కేమంటా – మేము
చేయి చేయి కలిపి థింసా నాట్యమే చేస్తమంట

సిరిమాను పై అమ్మోరు ఊరేగే వేళలో
ఈతకల్లు-తాటికల్లు కుండలతో నైవేద్యం
సల్లంగ సూడమని వేడేమూ
మళ్ళా రమ్మంటూ అంపకాలు చేసేమూ..’

~

“ఇంత కష్టమైన పాట ఎంత చక్కగా పాడావు తల్లీ!” అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుంది అన్నపూర్ణ.

“అమ్మా! ఈ సంవత్సరంతో ఈ స్కూల్లో చదువు అయిపోతుంది కదా! మరి ఆరో తరగతి ఎక్కడ చదువుతాను?”

అంతకుముందు తల్లి కూతుర్ల మధ్య జరిగిన సంభాషణకు జవాబుగా పాప ప్రశ్న ఎదురుగుండా నిలదీసినట్లు అయింది.

సుభద్రమ్మ జవాబు చెప్పమన్నట్లుగా చూసింది అన్నపూర్ణను.

ఏదో ఆలోచిస్తూ తల పంకించింది అన్నపూర్ణ.

చలం తల్లిదండ్రుల సహాయం తనకు ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు పాప భవిష్యత్తు వారికి అప్పగించడమా? తల్లి చూడలేను అంటోంది కదా! పరిపరి విధాల ఆలోచిస్తూ వారిని ఒకసారి కలవడం మంచిదని మనసుకు అనిపించింది ఆమెకు.

అన్నపూర్ణ చలం అమ్మా నాన్నలను కలవడానికి ఒకర్తే వెళ్ళింది.

చలం తండ్రి ఆమెతో ఇలా అన్నాడు

“జరిగినవన్నీ మరిచిపోమని మేము చెప్పలేము. కానీ పాప మీ ఇద్దరి కలల పంట. మీ జీవితానికి ఆమె లక్ష్యం. ఒక మంచి ఆశయంతో దాన్ని పెంచండి. భవిష్యత్తు ఎప్పుడూ మంచిని మనకోసం దాచి ఉంచుతుంది. సానుకూలంగా ఉండమ్మా! ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేము ఉన్నామని మరచిపోకు.” కొడుకు లేడు అన్న దుఃఖం గొంతులో సుళ్ళు తిరుగుతుంటే అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయారు.

తన తల్లి అంగీకరించలేదు. కానీ వారైనా అంగీకరిస్తారేమో అని తాను దళంలో చేరిపోవాలని ఉందని వారితో చెబుదామని గొంతులోకి వచ్చిన మాటలను వారి పరిస్థితి చూసి, వారి మంచితనం చూసి అనలేకపోయింది. పైగా వారి ఇరువురికి కూడా ధైర్యం ఇవ్వవలసిన బాధ్యత తనపై ఉంది అని గ్రహించుకుని,

“అత్తయ్యా! నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా మీ అబ్బాయిని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అంతవరకు మీ ఆశీస్సులు ఇవ్వండి చాలు. అమ్మను తీసుకుని ఈ ఊరి నుండి వెళ్ళిపోతాము. మైదానప్రాంతంలో పాప చదువు నిర్విఘ్నంగా సాగుతుంది. ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ చెప్పలేను.” అంటూ వారి ఇరువురి పాదాలకు నమస్కరించి వెనుతిరిగింది.

‘పాపని చూడాలని ఉంది’ అని వారి మనసులోని మాట పెదవి దాటి రానేలేదు.

వారి దగ్గరకు  వెళ్ళి వచ్చాక, వారితో మాట్లాడాక తన నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. అదే మాట తల్లితో అంది. “పాప పెద్దది అవుతూ ఉంటే ఇక్కడ విషయాలు అన్నీ దానికి తెలుస్తూ ఉంటాయి. చెప్పకూడదని కాదు కానీ ఇప్పుడు అవసరం అనిపించడం లేదు. సమయం వచ్చినప్పుడు తప్పక చెబుదాము. ఇప్పుడు మనము పాపను తీసుకుని ఊరి వదిలి వెళిపోదాము” అంటూ పాపని తీసుకుని తల్లితోపాటు తాను పుట్టిన దగ్గర నుండి 30 సంవత్సరాల పాటు గడిపిన ఆ పర్వతాల పేటను వదిలి బొబ్బిలి పట్టణం చేరారు.

ఈ విషయాలు పసిపిల్ల మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయని సుభద్రమ్మ, అన్నపూర్ణ ఆ కొండలకు వీడ్కోలు పలికి బొబ్బిలి చేరుకున్నారు. అక్కడ నర్మదను హైస్కూల్లో చేర్చి ఇరుగుపొరుగువారికి సాయం చేస్తూ సుభద్రమ్మగారి పెన్షన్‌తో కాలం గుట్టుగా గడుపుతున్నారు. అత్యంత చురుకుతనం, గణితం పట్ల ఆసక్తి, తల్లి అమ్మమ్మల పెంపకంతో నర్మద త్వర త్వరగా హైస్కూల్ చదువులు పూర్తి చేసింది.

పాఠశాలలో ఇంద్రాణితో స్నేహం, మరియు పాఠాలను బోధించే ఉపాధ్యాయుల పట్ల గౌరవం, విషయాల పట్ల అనురాగం పాఠశాలలో ఆమె అంటే ప్రత్యేక గుర్తింపుని తెచ్చాయి.

పదవ తరగతి పరీక్షలు చక్కగా రాసారు అనుకుంటూ ఉండగానే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఇంద్రాణి నాన్న చక్రవర్తి గారికి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ కావడం ఆమెతో గత ఐదు సంవత్సరాలుగా చేసిన స్నేహానికి వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. కానీ భగవంతుని లీలలు విచిత్రం ఏ బంధాలను ఎప్పుడు కలుపుతాడో, ఎంత కాలం ఉంచుతాడో, ఎప్పుడు విడదీస్తాడో ఎవరికీ తెలియదు.

ఇంద్రాణి బయలుదేరడానికి ఒక గంట ముందు నర్మద కొరకు వచ్చింది. ఇద్దరూ పెరట్లో కూర్చుని ఈ ఐదు సంవత్సరాలు తాము పంచుకున్న మధుర భావాలను కలబోసుకున్నారు.

సడన్‌గా నర్మద అడిగింది “ఇంద్రాణీ! మనం నిజంగా మంచి స్నేహితులమేనా?”

“అదేంటి అలా అడిగావు?” అని ఇంద్రాణి అంది.

“అలా కాదు. మనం మంచి స్నేహితులు అయితే మనమిద్దరం నేస్తం కడదామా?” ఆశగా అడిగింది.

“అంటే ఏమిటి?” అని అడిగిన ఇంద్రాణికి తాను అమ్మమ్మ దగ్గర నేర్చినదంతా చెప్పింది. ఇంద్రాణి కూడా ఎప్పుడూ వినకపోవడం వలన కొంత వింతగా ఉండి అంగీకరించాలనుకుంది.

“అయినా ఒక సందేహం. నేను ఈరోజు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదుకదా! నువ్వు అనుకున్నట్లు ఎలా జరుగుతుంది?” అడిగింది.

“అందుకే ఆ స్నేహబంధం మనిద్దరిని జీవితాంతం ఎక్కడ ఉన్నా కలిపే ఉంచుతుంది.” అని నర్మద చెప్పేసరికి ఇంద్రాణి సరే! అంది.

ఇద్దరూ కలిసి చేయి చేయి పట్టుకుని సుభద్రమ్మ దగ్గరకు వెళ్లి తాము ఇద్దరూ నేస్తులు కాబోతున్నట్లుగా తెలిపారు. ఆమె మనస్సులో విస్మయం.

“అమ్మా!” అంటూ అన్నపూర్ణ దగ్గరకు వెళ్లి చెప్పారు.

“ఐదు సంవత్సరములు ఒక దగ్గరే ఉండి ఇప్పుడు విడిపోతున్న సమయంలో నేస్తం కట్టడమా? మరి మీరు ఎప్పుడు కలుస్తారు? మీకే తెలియదు కదా!” అని అడిగింది అన్నపూర్ణ.

“అందుకేనమ్మ మా మధ్య ఏర్పడ్డ బంధం ఎప్పటికైనా మమ్మల్ని తిరిగి కలుపుతుందమ్మా!” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

“అమ్మా! నేస్తం కట్టడం కంటే ముందు నేను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చునా?” ఇంద్రాణి మాటలకు ఉలిక్కిపడ్డది అన్నపూర్ణ. అయినా కప్పిపుచ్చుకుంటూ “చెప్పు తల్లీ!” అంది.

“నేను మీ ఇంట్లో మీ అందరితో ఎంత చనువుగా తిరుగుతానో మా ఇంట్లో నర్మదా కూడా అంతే! మేమిద్దరం మా తల్లిదండ్రులకు ఒక్క సంతానంగా కాక కవల పిల్లలుగా వారు భావిస్తారు. మీరు కూడా అంతే! నేను వేరే ప్రశ్నలు అడగను. కానీ నేను ఏ చదువు చదివితే మేమిద్దరం ఒకే చదువు చదవాలని నిర్ణయించుకున్నాము. అందువలన నర్మద నా సోదరి, నేస్తం, సమస్తమూ. నా వైపు నుంచి నేను చేసే సహాయాన్ని మీరు కాదనకూడదు” అంటూ ముందరి కాళ్లకు బంధం వేసింది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version