‘గీతా రహస్యా’ల అంతర్లయ విశ్వర్షి ‘దృక్’పథాలు

0
1

[డా. వాసిలి వసంత కుమార్ గారి ‘క్రొత్త కోణంలో గీతారహస్యాలు’ పుస్తకంపై ఓ వెబ్నార్ లో శ్రీ పాలకుర్తి రామమూర్తి చేసిన ప్రసంగ పాఠం.]

మానవులు Human Beings కాదు.. Human Becomings అంటారు, ఓషో. Beings అనేది Static కాగా Becoming అనేది Dynamic అంటారాయాన. నిరంతరం, నిరంతరాయంగా సాగే జీవన ప్రయాణంలో జరగాల్సింది జాత్యంతరీకరణ. జాతి అంటే స్థాయి. ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి చేరడమే జాత్యంతరీకరణ. దానికి మార్గం చూపుతూ ఆ దారిలో నడిచేందుకు ప్రేరణనిచ్చేదే భగవద్గీత. కృష్ణుని ద్వారా అర్జునునికి చెప్పబడింది, భగవద్గీత. ఇది జ్ఞానాన్ని ఒక ఉనికి (Presence) నుండి మరొక ఉనికికి (Presence) చేర్చేందుకు ఉపకరించిన ఉపకరణమే కాని పదాలకు సంబంధించినది కాదు. పదాల ఆంతర్యాన్ని మాత్రమే తీసుకోవాలి. It is not the letter of the LAW but the spirit of the LAW.

అపరిమితత్వం నుండి అపరిమితత్వానికి సాగే జీవుని గమనంలో కర్మానుభవాన్ని పొందడం కోసం అవ్యక్తమైన అపరిమితత్వం నుండి పరిమితులతో కూడిన వ్యక్తంగా అవతరించడం ‘పుట్టుక’.. కాగా భౌతిక జీవన పరిమితులను అధిగమించి అవ్యక్తంలో లయం కావడం మరణం. గమ్యం గమనం నిర్ణయమయ్యాక జరిగేది పుట్టుక కాగా గమ్యం చేరాక కలిగేది మరణం. మరణానికి పుట్టుకకు మధ్య వ్యాప్తి చెందిన జీవచైతన్యం తన లక్ష్య నిర్దేశం కోసం పరితపిస్తుంది. భారతీయ జీవన విధానం వ్యక్తులను ఉద్ధరించేందుకు ఉద్దేశించినది. ఆ విధానంలో ఒక ఉదాత్తమైన ఉపకరణం భగవద్గీత.

మహాభారతంలో వామగీత, ఋషభగీత, బ్రహ్మగీత.. ఇలా దాదాపు 16 గీతలు ఉన్నాయి. అందులో భగవద్గీత ఒకటి. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలను మూడింటిని కలిపి ప్రస్థానత్రయంగా చెపుతారు. ప్రస్థానం అంటే ప్రయాణం.. ఈ మూడు ప్రయాణాలు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి, అంటారు. భగవద్గీతను ఇప్పటికి కొన్ని వేల మంది తమ తమ భాషలలో తమకు అవగాహన కుదిరిన విధంగా వ్యాఖ్యానించుకున్నారు. వారి విధానంలోనే ‘కొత్తకోణంలో గీతారహస్యాలు’ అంటూ గీతాధ్యాయనంలో తమ అవగాహనను, ధ్యానాదులలో తమ అనుభవాలను ‘జీవన గీత’గా వెలువరించారు డా. వాసిలి వసంత కుమార్ గారు. భగవద్గీతకు భాష్యం చెపుతూ డా. వాసిలి వసంత కుమార్ గారు.. కాలానికి లోబడిన జీవులను కాలావధిలేని పరమాత్మను అనుసంధానపరిచే ప్రజ్ఞా ప్రభాకరమే భగవద్గీత అంటారు. కాలాలు మారినా యుగాలు మారినా సమకాలీన సమస్యలకు నిత్య నూతనమైన సమాధానాలను అందించే మహత్తర గ్రంథం భగవద్గీత అంటారాయన. అస్తిత్వం, సృష్టి, జీవితం, కర్మ.. ఈ నాలుగింటి మధ్యన నున్న రహస్య ఒప్పందాన్ని బట్టబయలు చేసేదే భగవద్గీత, అంటారు, వాసిలిగారు. సత్యాన్వేషణాశీలియైన నిత్య విద్యార్థిగా అర్జునుని, ఆ జిజ్ఞాసువు స్థాయికి దిగివచ్చి అతనిని ఉన్నతీకరించే గురువుగా కృష్ణుని దర్శించడం వాసిలివారి రచనలో కనిపిస్తుంది. నిజానికి ఈనాడు గురుశిష్య సంబంధాలు ఎలా ఉండాలో భగవద్గీత ద్వారా మనకు మార్గదర్శన చేసారాయన.

డా. వాసిలిగారు ఎందుకని గీతను క్రొత్త కోణంలో దర్శించే ప్రయత్నం చేసారు? ఏ సాహిత్య ప్రయోజనమైనా.. దానిని అధ్యయనం చేయడం వల్ల తనకు ప్రయోజనముండాలి.. సమాజానికి ప్రయోజనం కలగాలి. అంతేకాదు, సాహిత్య అధ్యయనం వల్ల ప్రేయస్సు కలగాలి, శ్రేయస్సు కలగాలి. భౌతిక జీవనంలో వికాసం లేని సాహిత్య అధ్యయనం వల్ల ప్రగతి కుంటుపడుతుంది. ప్రగతి లేని చోట సుగతికి స్థానం ఉండదు. సాంకేతిక శాస్త్రం ఉత్పత్తి ఉత్పాదకతలను పెంచవచ్చు. కాని సాహిత్యం ఆ ఉత్పత్తిని ఎంత ప్రభావవంతంగా, సామాజిక శ్రేయస్సుకు వాడుకోవచ్చో తెలుపుతుంది. అందుకే భగవద్గీతను క్రొత్తకోణంలో దర్శించి సమాజానికి ఎలా అవసరమో అలా అందించే ప్రయత్నం చేసారు, వాసిలివారు. ఈ ప్రయత్నం ఇదివరకు ఎవరూ చేయలేదా? అంటే.. ఎందరో మహానుభావులు చేసారు. వాసిలివారూ చేసారు. అయితే వాసిలివారు తమ ఆధ్యాత్మిక, భౌతిక జీవనగతిలో పొందిన అనుభవాలను సహచరులతో.. సమాన హృదయులతో పంచుకునేందుకు చేసిన ప్రయత్నంగానే కాక మోహావేశంతో కర్తవ్యాన్ని విస్మరించి అస్త్రశస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుని లాంటి కర్మయోధులను కార్యక్షేత్రంలో ఉత్తేజితులను చేసేందుకు చేసిన ప్రయత్నంగా దీనిని చూడాలి. ఇందులో వారు తమ తపనలో, సాధనలో పొందిన అనుభూతులను పంచుకుంటూ సంసారయోగమే గీతాసారాంశం అంటూ ఆరంభించి జ్ఞానవివేచనయే గీతామృతం అంటూ ఆ జ్ఞానామృతాన్ని జిజ్ఞాసువులకు పంచారు వాసిలివారు.

గీత ఆంతర్యం బోధపడాలి అంటే గీతను త్రిప్పి చదవండి అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస. గీత.. త-గీ. ఇదే ‘త్యాగి’ అవుతుంది అంటారాయన. ఎవరు త్యాగి? ఎవరైతే తన సర్వస్వాన్ని సహృదయంతో సత్కార్య నిర్వహణకై సమర్పిస్తారో వారే త్యాగి. అలాంటి త్యాగి మాత్రమే భగవద్గీతను వ్యాసహృదయంతో అవగాహన చేసుకోగలుగుతాడు. దాని ఆంతర్యాన్ని తాను తెలుసుకొని తను అనుభూతిని పొందగలుగుతాడు. తన అనుయాయులకు ఆ మార్గాన్ని చూపగలుగుతాడు. డా. వాసిలి వారు అలాంటి గురుస్థానాన్ని అధిరోహించినవారు.

గీత అనగానే అది ఆధ్యాత్మిక మార్గదర్శి మాత్రమే అనే భావన చాలామందిలో ఉన్నది. కాని మానవ భౌతిక జీవనానికి ఉపకరించే మహత్తర మార్గదర్శక గ్రంథం. గీత మొదటి ఆధ్యాయంలో ఒక సమస్య సృజింపబడింది. దానికి మిగిలిన 17 ఆధ్యాయలలో వివిధ మార్గాలలో పరిష్కారం చూపబడింది. మానవునిగా ఆచరణ యోగ్యమైన ధర్మం ఏమిటి? ఆ ధర్మాచరణలో ఎదురయ్యే అవరోధాలు ఏమిటి? వాటిని అధిగమించడం ఎలా? వీటన్నింటినీ విఫులంగా చర్చించింది గీత. అంతేకాదు, ఆధునిక భావవ్యక్తీకరణ నైపుణ్యానికి సంబంధించిన అంశాలు, నాయకత్వ లక్షణాలకు సంబంధించిన అంశాలు ఎన్నో గీతలో మనకు కనిపిస్తాయి. ఉత్తమ గురువుగా కనిపించే కృష్ణుడు, పరివర్తనాశీలియైన జిజ్ఞాసువుగా, శిష్యునిగా కనిపించే అర్జునుడు ఇందులో దర్శనమిస్తారు. నిజానికి ప్రతివ్యక్తిలోని ద్వంద్వ ప్రవృత్తులే కృష్ణార్జునులు. సంశయమూ మనలోనే ఉన్నది దాని పరిష్కారమూ మనలోనే ఉన్నది. కాకపోతే దానిని గుర్తించే ప్రజ్ఞ మనలో సుషుప్తావస్థలో ఉన్నది దానిని జాగృతం చేసుకోవాలి.

గీతలో చెప్పబడిన అంశాలు రహస్యమైనవి అనే అపప్రద ఉన్నది. అయితే రహస్యం అంటే.. అర్హతను సాధించి ఆశించమని మాత్రమే. గీతను కృష్ణుడు అర్జునునికి చెప్పాడు.. అప్పుడు సంజయుడూ విన్నాడు. తదుపరి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.. కృష్ణుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు.. అర్జునుడు విన్నాడు, సంజయుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. వస్తువు ఒక్కటే.. చెప్పిన మాటలు లేదా పదాలు ఒక్కటే.. అయినా విన్న ముగ్గురూ మూడు విధాలుగా అవగాహన చేసుకున్నారు. వస్తువు జ్ఞానంగా ప్రవహించింది.. కాని దానిని ఆస్వాదించగలిగిన శక్తి లేదా స్థాయిని బట్టి అది వారికి అందింది. జ్ఞానానికి విజ్ఞానానికి భేదం అదే. జ్ఞానం అనేది చెప్పబడింది.. విజ్ఞానం విన్నది.. రెంటి మధ్య అంతరం చాలా ఉన్నది. అదే అంతర్యాన్ని గ్రహించడంలో తేడా. కృష్ణునిది అనుభవ జ్ఞానం.. తానేం చెపుతున్నాడో.. ఆ మాటల ఆంతర్యం ఏమిటో తనకు తెలుసు. సంజయుడు ఆ మాటలు మాత్రమే గుర్తుపెట్టుకోగలిగిన వాడు., విన్నదానిని ధృతరాష్ట్రునికి చెప్పగలిగినవాడేకాని.. ఆంతర్యాన్ని గ్రహించాలనే భావన లేనివాడు. అర్జునుడు జిజ్ఞాసువు.. కృష్ణుని ప్రతి మాట వెనుక ఉన్న ఆంతర్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ.. తన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నవాడు, అర్జునుడు. ధృతరాష్ట్రుడు వ్యగ్రతాచిత్తుడు.. అతనికి కావలసింది గీత కాదు.. తన కుమారుల విజయవార్త. కాబట్టి ఒక చెవితో విని మరొకచెవితో వదిలివేసే వైఖరి కలిగినవాడు. సత్యాన్వేషణలో పరిమితమైన లేదా వస్తురూపకమైన సత్యాన్ని మాత్రమే చూస్తామంటే అది అర్ధసత్యమే అవుతుంది కాని పూర్ణ సత్యం కాదు. ఇదే వారివారి అర్హతలను నిర్ణయిస్తుంది.

ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఇరుపక్షాలూ యుద్ధసన్నద్ధమై నిలిచాయి. రెంటి ఉద్దేశ్యాలు ఏమిటి? పదకొండు అక్షోహిణుల సైన్యంతో రణరంగంలో నిలిచిన వందమంది కౌరవుల లక్ష్యం ఒక్కటే.. సంపదను, అధికారాన్ని పొందడం.. అది ధర్మమా.. అధర్మమా అన్న విచికిత్సకు తావులేదు. మరొకప్రక్క పాండవులు ఐదుగురు ఏడు అక్షోహిణుల సైన్యంతో నిలిచారు. వారి లక్ష్యమూ సంపదను, అధికారాన్ని పొందడమే. అయినా వారు ధర్మమార్గంలో సాధించాలని నిలిచారు. ఆ యుద్ధరంగం మధ్యలో ఇరు పక్షాల సేనావాహినిని చూస్తున్న అర్జునునికి మోహం ఆవేశించింది. తాను యుద్ధం చేసేది తనవారితోనని.. ఏ పక్షంలోని వారు మరణించినా అది తనకే దుఃఖ హేతువవుతుందనే భావన కలిగింది. దానితో యుద్ధంలో విజయం కన్నా అడవిలో ఉండడం మేలనే భావన కలిగింది. అదే కృష్ణునితో చెప్పాడు. ఆ మోహావేశం నశిస్తే కాని అర్జునుడు కర్తవ్యాన్ని పాలించడు. అందుకే ఉభయ సేనామధ్యంలో గీతాబోధన చేసాడు, కృష్ణుడు. కృష్ణుడు ‘గురు’క్షేత్రంలో నిలిచి అర్జునునితో ‘స్వ’ ఆత్మదర్శనం చేయించాడు. దానిని ప్రతీకగా చూపుతూ మనలనూ ఆత్మ దర్శన చేసుకోమని ప్రబోధిస్తున్నాడు.

యుద్ధం ఎందుకు? ఇది అర్జునుని ప్రశ్న.. ధర్మాన్ని నిలిపేందుకు.. ఇది కృష్ణుని సమాధానం. అర్జునుని విషాదయోగంతో ఆరంభమయింది గీత. నిజానికి ఆ విషాదం ప్రతి వ్యక్తికీ పుట్టుకతో ఆరంభమయ్యేదే.. ఆత్మీయులకు మన జననం సంతోషాన్ని కలిగిస్తే.. మరణం దుఃఖాన్ని కలిగిస్తుంది. నిజానికి ఈ జననమరణాల మధ్య మన ప్రయాణమంతా భావోద్వేగాల భారమే అంటారు, డా. వాసిలిగారు. అంతేకాదు.. సత్యశోధనలో విషాదం ఆనందం రెండూ పలకరిస్తాయి. నిజానికి ఈ రెండూ సాపేక్షాలే. విషాదం నుండే ఆనందం వెలుగుచూస్తుంది. ఆ ఆనందమే ఆత్మోద్ధరణవైపు నడిపిస్తుంది. యుద్ధం అనేది భౌతిక మానసిక క్రీడ.. ఆ పరిమితులను దాటితే అది ఆత్మక్రీడగా మారుతుంది. అక్కడ ఒకరు చంపడం మరొకరు చంపబడడం ఉండదు. చంపడం, చంపబడడం రెండూ దేహానికి సంబంధించినవే అంటారాయన.

జీవిక ఒక గురుతర బాధ్యత అంటారు వాసిలిగారు. జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలి.. అలాగే ప్రతివ్యక్తికీ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అయితే ఆ ఇష్టాయిష్టాలు ప్రయోజనానికి లోబడి ఉంటే.. ఆ వ్యక్తి విజయసాధకుడౌతాడు. దేనికోసం దేనిని విడిచిపెట్టాలి అనేది వ్యక్తి విజ్ఞత.. అదే అతని ప్రస్థానాన్ని నిర్ణయిస్తుంది. ఏ క్షణమైనా వ్యక్తి భావోద్వేగాలకు బంధీ అయితే.. గమ్యం ప్రక్కకు తప్పుకుంటుంది. అలాగే కృష్ణుడు అర్జునుని అడ్డుపెట్టుకొని గీతను లోకానికి బోధించాడు. దాని ప్రయోజనం ఏమిటి? అది కూడా వాసిలిగారు చక్కగా వివరించారు. కృష్ణుడు కేవలం పాపప్రక్షాళనానికి మాత్రమే నడుంకట్టలేదు.. అలాగే ధర్మస్థాపనకై మాత్రమే రథాశ్వాలను అదిలించలేదు. మానవ జీవన వ్యవస్థలో సంయమనాన్ని సాధించడం ఎలాగో ఆచరణలో చూపేందుకే మానవరూపంలో రంగప్రవేశం చేసాడు. అందుకే ఆయనకు కురుక్షేత్రం రంగభూమి అయింది. మందహాసాన్ని సంయమనతకు ప్రతీకగా నిలుపుతూ.. భగవద్గీతను మానవ భాగస్వామ్య గీతగా చేసాడు. “దుర్బలత్వం నుండి ధీరత్వానికి” నడిపించే ఉపకరణంగా వాసిలిగారు భగవద్గీతను భావించారు. ధీరత్వం అంటే వగవనితనం.. వ్యాకులత లేని మానసికస్థితి.

వ్యక్తిలో విజయ సాధనాతృష్ణ బలంగా ఉండవచ్చు.. కాని ఆ విజయం లభించాలి అంటే అది సరిపోదు. సాధించేంత వరకు సహనం అవసరం. సమాదరణ అవసరం.. సమకాలీనంగా స్పందించడం అవసరం.. అస్పష్టంగా అదృశ్యంగా కనిపించే భవిష్యత్తును స్పష్టంగా దర్శించగలిగే ఆత్మవిశ్వాసమూ అవసరం. వీటన్నింటికీ ఎంతో సంయమనత అవసరం అని గుర్తించడమే విజయ రహస్యం అంటారు, డా. వాసిలి గారు తమ జీవనగీత మొదటిభాగంలోని .. “జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన విజయగీత” అనే శీర్శికలో.

మనందరిలోనూ ఒక కృష్ణుడు ఉన్నాడు, ఒక అర్జునుడు ఉన్నాడు, ఒక దుర్యోధనుడు ఉన్నాడు అంటారాయన. కృష్ణునిది పారలౌకిక, పారదర్శిక వ్యక్తిత్వం.. కాగా అర్జునునిది సానుకూల వ్యక్తిత్వం.. ఇక దుర్యోధనునిది.. ప్రతికూల వ్యక్తిత్వం.. అంటారాయన. ఇందులో ఎవరిదారిని ఎన్నుకుంటామో ఆ ఫలితాన్ని పొందుతాము.

జీవితం రైలు పట్టాలలాంటిది. ఒకటి కష్టాలకు ప్రతీక కాగా రెండవది సుఖాలకు ప్రతీక. “కష్ట సుఖాల సాంద్రత తెలిస్తేనే జీవితం అనబడే రైలు ప్రయాణం కష్టసుఖాల పట్టాలపై సాఫీగా సాగిపోతుంది” అంటారు వాసిలిగారు. గీత జీవించడానికి మెలుకువలు నేర్పిస్తుంది. వ్యాకుల చిత్తుడైన అర్జునునిలో సమతుల్యత జారిపోయింది. భావోద్వేగానికి లోనయ్యాడు. దానితో ఒత్తిడికి లోనయ్యాడు. అసంబద్ధమైన ఆలోచనా సరళితో యుద్ధరంగానికి వచ్చాడు. అతని పరాక్రమాన్ని నమ్మి, అధర్మంచేత మోసగించబడిన ధర్మాన్ని పునఃప్రతిష్టించేందుకు, ఏడు అక్షోహిణుల సైన్యం ప్రాణాలర్పించేందుకు సన్నద్ధమైంది. ఈ పరీక్షా సమయంలో అర్జునుడు క్లైబ్యత్వాన్ని ఆశ్రయించాడు. సమర్థత కలిగీ అధర్మాన్ని ఉపేక్షించడం క్లైబ్యత్వం. దానిని సరిచేయవలసిన బాధ్యత కృష్ణునిపై ఉన్నది. అందుకే.. ఆలోచనకు బుద్ధి కుశలతను, ఆచరణకు నిబద్ధతను, జీవితానికి ఆత్మతత్త్వాన్ని జోడించడమే గీత చేసే పని అంటూ.. బుద్ధియోగాన్ని, కర్మయోగాన్ని, భక్తియోగాన్ని సమన్వయం చేస్తూ కర్తవ్యబోధను చేసాడు, కృష్ణుడు. దానినే తన మాటలలో చెపుతూ వాసిలిగారు గీతను నవీనయోగంగాను, ఆధునిక వేదంగాను చూడగలిగితే భగవద్గీత వర్తమాన వ్యవహార సరళిని సరిచేసుకోదగ్గ విజ్ఞాన సర్వసం అవుతుంది అంటారు.

భక్తియోగం లేదా కర్మయోగం అంటే పూర్తిగా భగవంతునిపై భారం వేసి నిష్క్రియాపరులుగా మిగిలిపోవడమా అంటే కాదంటారు, వాసిలిగారు. భగవద్గీత కర్మయోగానికి, భక్తియోగానికి ప్రాధాన్యతనిస్తూనే.. జ్ఞానయోగానికి పెద్దపీటను వేసింది. జ్ఞానము అంటే విషయాన్ని తెలుసుకోవడమే కాక దానిని ఫలతృష్ణ లేకుండా, వివేచనతో నిత్య జీవనంలో ఆచరణలో పెట్టడంకూడా అంటారాయన. మన కర్మకు మరెవరో బాధ్యత వహించరు.. మనకు మనమే బాధ్యత వహించాలి.. ఎదుటివారెంతటి గొప్పవారయినా సలహాలు సూచనలు ఇచ్చేంతవరకే కాని దానిని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. అందుకే కృష్ణుడు చివరగా “యథేఛ్ఛసి తథాకురు” అన్నాడు. చెప్పాల్సింది చెప్పాను.. నిర్ణయం నీదే అన్నాడు కాని నేను చెప్పినట్లు “యుద్ధం చేయి” అనలేదు.

“మనం అంటే మన అనుభవాలు, మన వ్యక్తీకరణలు” అంటారు, వాసిలిగారు. “అవసరాలు అవకాశాలే మన అస్తిత్వక్షేత్రాలు” అంటారాయన. లౌకిక సాధనయైనా, పారలౌకిక సాధనలోనైనా నిలదొక్కుకోవడం అవసరం. ఆ ప్రయత్నంలో సమస్యలు ఎదురవడం సాధారణమే. అయితే ఆ సమస్యలను పరిష్కరించుకోవలసిన అవసరమూ ఉంటుంది. అయినా దానికన్నా ముందుగా ఆ ప్రయత్నంలో అవకాశాలను అన్వేషించడం ఉత్తమం. అవకాశాలకై ఎదురు చూడకుండా వాటిని అన్వేషించి అందిపుచ్చుకున్న వారే విజయసాధకులుగా నిలుస్తారు. ఆ ప్రయాణానికి ప్రేమ మరియు దయలాంటివి కూడా తోడైతే జీవితం సంతృప్తికరంగా సాగిపోతుందంటారాయన.

జీవన గమనంలో ఇరువురి మధ్య ఉండాల్సినది ‘సఖ్యత’ అంటారాయన. దానినే యోగపరిభాషలో చెపుతూ “సంయోగం” అన్నారు. అనుమాన రహితమైన తత్వం యోగానికి అవసరమైన అర్హత. అలాగని ఎదుటివారు చెప్పిన అన్నింటికీ గంగిరెద్దులా తలూపమని కాదు. అర్జునుడు అలా తలూపలేదు. అనుమానం వచ్చిన ప్రతిచోటా ప్రశ్నించాడు. ప్రశ్నవల్ల తనలో స్పష్టత వచ్చింది. స్పష్టత ఉన్నచోటనే సఖ్యత నిలుస్తుంది. భౌతిక అధిభౌతిక జీవితాలలో అవసరమైన నాలుగు లక్షణాలుగా.. అనుసంధానం, సంయోగం, స్నేహం, సానుకూల దృక్పథాలను చెప్పారు వాసిలివారు.

జీవితం సాధనాపర్వం. కురుక్షేత్రం కర్మక్షేత్రమే కాని వినోద క్రీడాక్షేత్రం కాదు. కురు అంటే చేయి అని అర్థం. ఏం చేయాలి అంటే కర్మలు చేయాలి. కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించాలి కదా. అవి బంధనాలుగా మారుతావి అంటే.. కర్మఫలాపేక్ష లేకుండా కర్మాచరణయే మానవుని కర్తవ్యం. అందుకే సేవాదృక్పథంతో స్పందించడమే జీవన శ్వాసగా చెపుతారాయన. జీవితం ద్వంద్వాలకు ఆలవాలం. పూజ్యావమానాలు, అవకాశాలు అవరోధాలు సహజం. ఆనందాశ్రువులను వెన్నంటి విషాదాశ్రువులూ నడుస్తాయి. కర్మక్షేత్రమైన ఈ జీవనంలో గమ్యాన్ని చేరేందుకు తుదిశ్వాస వరకూ శ్రమించాల్సిందే.. కనిపించీ కనిపించకుండా దోబూచులాడే ఈ క్షర-అక్షర వివేకచూడామణియే భగవద్గీత అంటూ చక్కని అవగాహనను పంచుకుంటున్నారు వాసిలిగారు.

అన్ని మార్గాలు నన్నే చేరుతాయి. నేనే ఈ సృష్టికి “ఆదిస్థితి, మధ్యస్థితి, అంత్యస్థితి”ని అంటూ కృష్ణుడు చెప్పడంలో ఆంతర్యాన్ని వివరిస్తూ వాసిలి గారు.. ప్రతిసృష్టికి మూలం మనమే.. ఫలమూ మనమే.. ఫలసమాప్తీ మనమే. మన జీవితంలోకి వచ్చే ప్రతి అంశానికి మొదలు, పొడిగింపు, ముగింపూ మనమే. జీవన క్రమంలోని కర్తృత్వాలకు, కర్మత్వాలకు, అస్తిత్వ భూమికలం మనమే. మనం చేసే అన్ని కర్మలకు మూలం మనమే.. మంచి అయినా చెడు అయినా దాని ఫలితానికి మనమే బాధ్యులము. కాబట్టి మన జీవితాన్ని కల్మష రహితం చేసుకోవాలనే కనువిప్పు కలగాలి, అంటారాయన.

స్వధర్మం నిధనం శ్రేయం.. అంటుంది గీత. అర్జునుడు యుద్ధం చేయననడం క్షత్రియ ధర్మం కాదు. వృత్తి ధర్మాన్ని కాదనడం, మానవ స్వభావాన్ని కాదనడం అంత సులభతరం కాదు. స్వధర్మం అంటే.. బాహిరమైన ప్రలోభాలకు లోనుగాకుండా, భయాలకు లోబడకుండా, పూర్వనిశ్చితాభిప్రాయాలకు దూరంగా ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకుంటూ, చేయదగిన, చేయగలిగిన, చేయవలసిన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించడమే స్వధర్మం. అర్జునుడు, క్షాత్రధర్మాన్ని అనుసరిస్తున్నవాడు. యుద్ధ సమయంలో వైరివీరుల మధ్య అస్త్రసన్యాసం చేయడం సమంజసము కాదు. భావోద్విగ్నతలు దరిచేరని సహనశీలతతో కడదాకా పోరాడడమే స్వధర్మం. “స్వధర్మం నిధనం శ్రేయం” అనడంలోని ఆంతర్యం అదే. వాసిలి వారంటారు.. “బాధ బుద్ధిని కౌగిలించుకున్నప్పుడు జీవితం కన్నీటిమయమై మసకేస్తుంది”. మనకు తెలియకుండానే మనలోని మూలుగును వినగలిగితే.. కష్టనష్టాల నుండి త్వరగా బయట పడగలుగుతాము. “విననట్టు నటిస్తే మాత్రం.. ఆ వేదన బహుకాలం విస్తరిస్తుంది. భరించరానిదవుతుంది, శోకంగా పరిఢవిల్లుతుంది.. ప్రజ్వరిల్లుతుంది”.. అంటారాయన.

వ్యక్తి ఎదుగుదల ఒక భవంతి అనుకుంటే.. దానికి నాలుగు స్తంభాలు.. అవసరం, ఇఛ్ఛ, జ్ఞానం, క్రియలు. అవే మనిషి ఉత్థానపతనాలకు కారణాలవుతాయి అంటూ.. జ్ఞానాన్ని గూర్చి ఈ విధంగా చెపుతారాయన. “జ్ఞానం అనేది.. స్వభావసిద్ధమూ ప్రభావ సిద్ధమూ అని రెండు రకాలు. యోగసాధనతో సిద్ధత్వం పొందినవారి జ్ఞానం స్వతస్సిద్ధం లేదా స్వభావ సిద్ధం. అలాకాని జ్ఞానాన్ని ప్రభావ సిద్ధము అనవచ్చు. అవసరం ఉంటే కోరిక కలుగుతుంది. బలమైన కోరిక జ్ఞానార్జనకు దోహదపడుతుంది.. ఈ రెంటి కలయికచే పొందిన ప్రేరణ కార్యోన్ముఖమై, క్రియారూపంలో ఆవిష్కృతమైతే అది కార్యసిద్ధికి దారితీస్తుంది. కార్య సిద్ధియే విజయం అనే భవంతిగా అలరారుతుంది.”

 “ఆలోచన మసకేస్తే అంతటా విషాదమే” అంటారు వాసిలిగారు. నిజానికి మనందరికీ చదవడం వచ్చు, మార్కులు తెచ్చుకోవడం, గ్రేడులు సాధించడం తెలుసు.. కాని మనలో చాలా మందికి ఆలోచించడం ఎలాగో తెలియదు. సకారాత్మక, నకారాత్మక ఆలోచనలు మన జీవిత గమ్యాన్ని శాసిస్తాయి. అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నాడు. అతని తక్షణ కర్తవ్యం యుద్ధం చేయడమే. ధైర్యసాహసాలను ప్రదర్శించి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన సమయంలో బాంధవ్యాలను గురించి, మృత్యువు గూర్చి ఆలోచించే విధానం సరైనది కాదు. రణరంగంలో యుద్ధమే చేయాలి.. దాని గూర్చి మాత్రమే ఆలోచించాలి. అదే క్షాత్రధర్మం. తాను అభ్యసించిన వృత్తి ధర్మాన్ని ఆచరణలో పెట్టకుండా.. వెనుతిరిగితే.. జీవితమంతా అంధకారబంధురమే. జీవితప్రయోజనం నిష్ప్రయోజనమై వ్యర్థమౌతుంది.

పండితునిలా మాట్లాడుతున్నావే.. అంటూ కృష్ణుడు అర్జునునికి ఒక చురకవేస్తాడు. ఈ మాట కృష్ణుడి లోకజ్ఞతకు, తాత్వికప్రజ్ఞకు ప్రతీకగా చెపుతారు, వాసిలిగారు. పండితులు గతించినవారి గూర్చి కాని, గతించబోయేవారిని గూర్చి గాని శోకింపరు అంటాడు కృష్ణుడు. పండితుడు అంటే.. విషయాన్ని సరిగా అవగాహన చేసుకోవడమే కాక.. తనకు తెలిసినదానిని ఆచరణలో చూపేవాడని అర్థం.

‘కాలము’ అనేది మనుషుల అనుభవాలకు, జ్ఞాపకాలకు సంబంధించినది మాత్రమే. కాలము పరిణామక్రమం. అది శక్తి లేదా శక్తి ప్రేరిత పదార్ధ పరిణామము. పదార్థము ద్వారా శక్తి రూప పరిణామమూ కాలమే. కాలము వేరు సమయము వేరు. కాలవ్యవధిని సమయంగా భావిస్తాము. నిజానికి కాలము మారడం అనేది వ్యావహారికమే కాని పారమార్థికం కాదు. అందుకే వాసిలిగారు .. కాలంతో నడుస్తూ కాలాతీతంగా పరిణామం చెందాలి, అంటారు.

శ్రద్ధలేని మానవ జీవితం.. మృత్యువుతో సహవాసం చేస్తూ సంసారచక్ర బంధనంలో పరిభ్రమిస్తుంది. ఎక్కడైతే మృత్యువు ఉంటుందో అక్కడ జననం ఉంటుంది. ఆ జనన మరణ చక్రబంధనం లేని స్థితినే “ముక్తి” లేదా “మోక్షం” అన్నారు. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే కావలసింది “విశ్వాసం”. సాధించగలననే విశ్వాసమే రహస్యాన్ని ఛేదించేందుకు శక్తిసామర్ధ్యాలను ఇస్తుంది అంటారు, వాసిలిగారు.

మనసు గురించి చెపుతూ వాసిలిగారు.. చంచలత్వం మనోనైజం అంటారు. ఆ స్థాయి నుండి భౌతిక భావోద్వేగ స్థితులను దాటి హృదయక్షేత్రానికి చేరుకోవాలంటారు, వాసిలిగారు. హృదయక్షేత్రం ఆధ్యాత్మిక స్థితికి సంబంధించింది. దీనినే అమృతత్వాన్ని సాధించడం అంటారు. భౌతిక మానసిక భావోద్వేగ స్థాయిలలోని ఆకర్షణ వికర్షణల వలయాలను ఛేదించి ఆధ్యాత్మిక స్థాయిని చేరడమే మానవ జీవన ప్రయోజనం.

మానవ జీవన ప్రస్థానం “తెలియనితనం నుండి తెలియనితనం వరకు” సాగాలి. కాని అర్జునుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటూ కురుక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. కార్యక్షేత్రంలో తెలిసిన ప్రపంచమే తనను ప్రశ్నించింది. ఆత్మ విమర్శకు మార్గం చూపింది. జీవన సత్యం, జీవిత వాస్తవం కనులముందు సాక్షాత్కరించింది. వర్తమానం ప్రశ్నార్థకం కావడంతో కృష్ణుడిని ఆశ్రయించక తప్పలేదు.. అంటారు, వాసిలివారు. నిజానికి వస్తురూపమయింది ‘వాస్తవం’.. అందరూ ఒప్పుకున్నది ‘నిజం’.. శాశ్వతమయింది ‘సత్యం’. సాధనలో “తెలియనితనం నుండి తెలియనితనం” చేరే క్రమంలో మధ్యన ‘తెలుసు’ అనే అహంభావం పలకరిస్తుంది. దానిని తొలగించుకునే క్రమంలో సమర్థుడైన ఒక గురువును ఆశ్రయించడం అవసరం. అర్జునునికి లభించిన గురువే.. కృష్ణస్వామి. అర్జునుని కారణంగా చూపి భగవద్గీతను బోధించి జగత్తుకు గురువయ్యాడు, కృష్ణుడు.

ఈనాటి యువతలో ఊహాలోకంలో జీవించడం ఎక్కువ అవుతుంది. దానిని గుర్తించిన వాసిలిగారు.. గీతలోని “ఉద్ధరేదాత్మనాత్మానాం” అన్న శ్లోకాన్ని తీసుకొని సమున్నతమైన ప్రబోధాన్ని చేసారు. మానవ జీవనంలో మాత్రమే దివ్యజీవనానికి, పరిపూర్ణతను సాధించడానికి అవకాశం ఉన్నది. భౌతిక జీవనమైనా ఆధ్యాత్మిక జీవనమైనా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. వందమంది క్షయరోగులు సదస్సు నిర్వహించినా.. అందులో ఎవరి దగ్గును వారే దగ్గాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని విలువైన కాలాన్ని వృథా చేసుకోవడం వల్ల జీవన ప్రయోజనం దెబ్బతింటుంది. గురువైనా లేదా మెంటార్ అయినా మార్గం మాత్రమే చూపిస్తాడు. ఆ మార్గంలో నడిస్తేనే గమ్యం చేరుకోగలం. ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునేందు చేయవలసిన ప్రయత్నం అంతా మనమే చేయాలి.

మానవతత్వం పరిపూర్ణ ఆత్మతత్వంగా పరిణామం చెందడమే పురుషోత్తమ తత్వం. మానవతత్వం పురుషోత్తమ తత్వంగా పరిణామం చెందాక కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఇంద్రియతత్వానికి, మానసిక తత్వానికి, జ్ఞానతత్వానికి అతీతమైన తత్వం పురుషోత్తమ తత్వం, అంటారు వాసిలివారు. మారడం వేరు పరిణామం చెందడం వేరు. నీటిని వేడిచేస్తే చల్లని నీరు వేడినీరుగా మార్పుచెందుతుంది.. కాని కొద్ది సమయం తదుపరి అది తన పుర్వస్థితికి చేరుతుంది. కాని వెన్నను వేడిచేస్తే అది నేయిగా పరిణామం చెందుతుంది. తిరిగి వెన్నగా ఏనాటికీ మారదు. నశించే స్థితి నుండి నశించని స్థితిగా పరిణామం చెంది అనంతంగా స్థితం కావడమే పురుషోత్తమ తత్వం.

ప్రపంచంలో ప్రతివ్యక్తీ తన అర్హతను పట్టించుకోకుండా నాయకునిగా నిలవాలని కోరుకుంటాడు. అర్జునుడు నాయకుడే.. దుర్యోధనుడు నాయకుడే.. అయితే మనం ఎలాంటి నాయకులం కావాలని కోరుకుంటున్నాము. అర్జునుని లాంటి నాయకునిగా నిలవాలి అనుకుంటే ఎలాంటి లక్షణాలను సంతరించుకోవాలో.. గీతను ఉదహరిస్తూ చక్కగా చెప్పారు, వాసిలిగారు. నాయకుడు కర్మిష్ఠి కావాలి అంటారు. అయితే ప్రతివ్యక్తికీ వ్యక్తిగత జీవనం ఉంటుంది. దానికీ న్యాయం చేయాలి. దానికి Work-Life Balancing నేర్చుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగే నేర్పును సంతరించుకోవాలి. వృత్తి ప్రవృత్తి కలిస్తేనే సంపూర్ణ జీవనం. కురుక్షేత్రంలోనైనా, కార్యక్షేత్రంలోనైనా, జీవనక్షేత్రంలోనైనా భావోద్విగ్నతలకు సంబంధించిన సంఘర్షణలు సహజమే. వాటిని సమన్వయం చేసుకోవడంలోనే నాయకత్వ ప్రతిభ రూపుదిద్దుకుంటుంది. భావోద్వేగాల నియంత్రణ, వ్యక్తిత్వం, శీలము, సమన్వయత.. సందర్భానికి తగిన విధంగా స్పందించడం.. లాంటివి నాయకత్వ లక్షణాలలో ముఖ్య భూమికను పోషిస్తాయి.. క్షుద్రమైనది హృదయదౌర్బల్యం. అదే నాయకుడి ప్రతిభను నిర్వీర్యం చేస్తుంది, మానసిక స్థిరత్వాన్ని కోల్పోయిన నాయకుడు సమయానికి తగిన రీతిలో స్పందించడంలో వెనుకడుగువేస్తాడు, అంటారు, వాసిలివారు. నిజానికి ఎదురైన సంఘటనకు కొంతమంది అనుక్రియతో (Responding) స్పందించగా కొందరు ప్రతిక్రియతో (Reacting) స్పందిస్తారు. ఇందులో అనుక్రియ అనేది ఉత్తమమైనది.

స్వధర్మాన్ని కాపాడుకోవడం అవసరం. అయితే దాని కోసం కర్తవ్యపరాయణతకు దూరం కావద్దు. స్వధర్మానికి మించి వ్యవస్థాధర్మాన్ని కాపాడవలసింది నాయకులే అంటారు, వాసిలివారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలను, భావోద్వేగాల సమన్వయతను గూర్చి పలు సందర్భాలలో చక్కగా వివరించారు, వాసిలిగారు. ఆత్మీయతను పంచడం, నిస్వార్ధత, సేవా తత్పరత.. ఈ లక్షణాలు తప్పనిసరిగా నాయకుడు సంతరించుకోవాలి. నాయకుడు ఆత్మవర్తనుడు కావాలే కాని దేహ వర్తనుడు కాకూడదు అంటారాయన. ప్రతిభావంతమైన సృజనాత్మక జీవనం నాయకుల లక్షణం కావాలంటారాయన.

సమర్ధతను నిర్వచిస్తూ.. కార్యరంగంలో సరైన రీతిలో సంసిద్ధుడు కావడమే సమర్ధత అంటారాయన. Efficiency is doing things right (సరైన విధానంలో పనిచేయడం, competency in performance) కాగా Effectiveness is Doing right things (సరైన పనులు చేయడం) ఈ రెండూ నాయకునికి అవసరం. ఈ రెంటి సాధనలో నాయకుడు తన బలాలు బలహీనతలు అవరోధాలు అవకాశాలను (SWAT analysis) గూర్చిన విశ్లేషణ చేసుకోవలసిన అవసరాన్ని చెపుతూ మరొక మాటన్నారు. నాయకత్వం ఒక నిష్కామ కర్మ అంటారు వాసిలివారు.

యోగము అంటే పొందదగినది. దేనిని పొందాలి అంటే తనను తాను తెలుసుకోవడమే పొందదగినది.. దానినే పొందాలి. ప్రకృతి వికృతులను సమాదరించ గలిగినది ఒక్క యోగ సాధన మాత్రమే. యోగ సాధనలో ‘నేను’ను లయం చేసుకొని, అనుభవ పూర్వకంగా.. విశ్వరూపాన్ని సందర్శించిన భావనను తమ ధ్యానంలో సాధించిన వాసిలిగారు.. పదునెనిమిది ఆధ్యాయాలలో కృష్ణుడు అర్జునునికి బోధించిన జ్ఞానాన్ని తాను అవగాహన చేసుకొని సహచరులకు, పాఠకులకు వారి వారి అవసరాలకు, అవగాహనకు సరిపోయే విధంగా అందించారు.

నిజానికి అర్జునుడు జ్ఞానియే.. కాని ఆతని జ్ఞానమనే భాస్కరుని అజ్ఞానమనే రాహువు గ్రసించాడు. దానితో మహత్తు (మాయ) అహంకారం అతనిని ఆవరించగా కర్తవ్యాన్ని విస్మరించి నిరాశ, నిస్పృహ, మోహావేశము, విభ్రమలలో మునిగిపోయాడు. మాయ అనేది మన అపరిమితత్వాన్ని గుర్తించనీయదు. కృష్ణుని బోధలతో అర్జునుని మనస్సు ఆ మబ్బుపొరలను వీడి కర్తవ్య నిర్వహణకై ఉత్సాహపడింది.

మనమైనా ఇలాంటి ఎన్నో అవరోధాలను దాటితేనే విజయాన్ని ఆస్వాదించగలము. మనందరిలో అనంతమైన శక్తిసామర్ధ్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనం గుర్తించి వినియోగించుకునే శక్తిసామర్ధ్యాల కన్నా ఎన్నో రెట్ల శక్తిసామర్ధ్యాలు మనలో అంతర్గతంగా నిద్రావస్థలో ప్రచ్ఛన్నంగా ఉన్నాయి. వాటిని గుర్తించము. మనకు మనమే ఒక చట్రంలో బందీ చేసుకొని పరులతో పోల్చుకుంటూ అహంకారాన్ని లేదా ఆత్మ న్యూనతను ఆదరిస్తుంటాము. అహంకారం నేను,నాది అనే భావనలకు దారి చూపగా.. వానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా సహనాన్ని కోల్పోతాము. నీతి నిజాయితీలను, అన్ని చట్టాలను ప్రక్కనపెట్టి హింసామార్గంలో నైనా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాము. మన చర్యలను ఉపేక్షించే వారి ప్రేరణ దానికి ఊతమిస్తుంది.

అత్యంత రహస్యమైన ఈ విజ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను. ఆలోచించు.. నీకు ఎలా ఇష్టమయితే అలా ప్రవర్తించు అంటాడు.. చివరగా కృష్ణుడు. మరొక మాటనూ అంటాడు.. నాకీ త్రిలోకాలలోనూ చేయదగిన కార్యము కాని కర్తవ్యం కాని ఏమీలేదు. అలాగని పొందదగిన ఫలితమూ లేదు.. అయినా నేను నిరంతరం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. ఎందుకు? అంటే.. నేను కర్మను సన్యసిస్తే నన్ను సాకుగా చూపి మానవులు కర్తవ్య విముఖులుగా మిగిలిపోతారు. వారిని ఉత్తేజితులను చేయడమే నా కర్తవ్యం.

బోధను విన్న సంజయుడు ఆశించింది.. శ్రీ, విజయం, ఆధిపత్యం, సుస్థిరత, నీతినియమాలు.. అర్జునుడు ఆశించింది.. మోక్షము. ఎవరాశించినది వారికి లభ్యమైనది అనేది నా భావన.

డా. వాసిలి వారు నాలుగు విభాగాలుగా వెలువరించిన ‘కొత్తకోణంలో గీతా రహస్యాలు’ సమీక్షించడం నాలాంటి అల్పమతికి కష్టసాధ్యమైన పనే. కాని వారి వాత్సల్యత నాకా పనిని అప్పగించింది. నా అవగాహన మేరకు సమర్పించిన ఈ నాలుగు వాక్యాలు ఎవరికైనా ఏ మాత్రం ఉపయుక్తమైనా నా ప్రయత్నం సఫలమే. డా. వాసిలి వారి అభిమానానికి అంజలిస్తూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here